maxresdefault

“కవిత్వం వేరు మనిషి వేరు ఉండకూడదు” : దీవి సుబ్బారావుతో ముఖాముఖి

Download PDF ePub MOBI

దీవి సుబ్బారావు గారి దగ్గరకి అన్నీ తప్పు ప్రశ్నలే తీసుకువెళ్లాను. అవేవీ ఆయన్ని పెద్దగా మాట్లాడించేవి కావని ఆయనతో కలిసి కూర్చున్న కాసేపటికే అర్థం అయింది. ఆయన దృష్టి అంతా వేరే వైపు. “ఆ పేరు పెట్టొచ్చో లేదో తెలీదు గానీ, కొంచెం ఆధ్యాత్మిక విషయాలంటే నా మనసు అటుపోతుంది” అని ఈ సంభాషణలోనే ఒక చోట చెప్పారాయన. ఆ ఆవరణే ఆయనకు ముఖ్యం. కవిత్వం అక్కడి స్పందనల వ్యక్తీకరణకు ఒక సాధనం. మేము మాట్లాడుకున్న అనేక గంటల్లో ఈ ఇంటర్వ్యూ జరిగింది ఓ ఇరవై నిముషాలు మాత్రమే. అప్పటికే ఇద్దరిలోనూ “మాయదారిది దీన్ని అవగొట్టేస్తే మిగతా సంగతులు మాట్లాడుకోవచ్చు కదా” అన్నట్టు ఉండింది. విలువైన ఆ మిగతా సంభాషణ ఏదీ ఈ ఇంటర్వ్యూలో నమోదు కాలేదు. సర్లే మళ్లీ ఎప్పుడో ఆయన్ని వేరే ప్రశ్నలతో కలిసినపుడు చూద్దాంలే అని వచ్చేశాను. – మెహెర్
కవిత్వం వైపు తొలిగా మీ మనసెలా మళ్లింది?

నేను స్కూల్లో చదువుకునేటప్పుడు మా ఊరి లైబ్రరీలో భారతభాగవతాలు ఉండేవి. అవి చదివి చాలా ఇన్స్పెయిర్ అయినాను. ఎక్కువ చదివేవాళ్లకి ఎప్పుడోకప్పుడు రాయాలీ అనిపించటం సహజమే కదా. అదొకటీ… మా ఊరి పక్కన కూచిపూడిలో ఇద్దరు తెలుగు టీచర్లు ఉండేవారు. వెంకట్రామయ్య గారు, శ్రీరాములు గారు. వారి పద్యం చెప్పే పద్ధతీ, భాష మీద ఉన్న పట్టూ ఇవి నన్ను ప్రభావితం చేశాయి. తెలుగన్నా, ముఖ్యంగా తెలుగు పద్యమన్నా బాగా ఇష్టం ఏర్పడింది. ఇవే నన్ను కవిత్వం వైపు మళ్లించాయనుకుంటాను.

తొలి కవిత రాసిన సందర్భమేమిటో గుర్తుందా?

మొదట్లో మన ఛందస్సులకు అనుగుణంగా ఏదో రాద్దామనుకోవటం, ఊరిలో చూసిన విశేషాల్ని గురించి స్కూలు ఎక్సర్సయిజు పుస్తకాల్లో ఏదో ఒకటి నింపటం… ఇలా మొదలైంది. ఇది కవిత్వం కాకపోవచ్చు కూడా. కవిత్వం అంటూ ఏది మొదట రాశానో ఏం గుర్తుంటుంది? ప్రారంభాల్ని కనిపెట్టడం కష్టం.

ఏ కవుల్ని బాగా ఇష్టపడేవారు?

మొదట్నుంచీ నాకు తిక్కన, నన్నయ, శ్రీశ్రీ… వీళ్లంటే ఇష్టం. వేరే భాషలంటే షేక్‌స్పియర్.

1950ల నుంచీ రాస్తున్నా, మొదటి కవితా సంపుటి “వైశాఖ సముద్రం” పుస్తకంగా తీసుకురావటానికి 1985 దాకా ఆగారెందుకు?

రాసి దగ్గర పెట్టుకునేవాణ్ణి. 1960లో మొదటి కవిత “ఆంధ్రపత్రిక”లో అచ్చయింది. తర్వాత రాసినవి కూడా నా దగ్గర అలానే ఉండేవి. ఆదిలాబాద్ వెళ్లిన తర్వాత, అక్కడ సామల సదాశివ ఉండేవారు, ఆయన నా కవితలు చూసి అందరికీ పట్టికెళ్లి చూపించేవారు. కొన్ని కవితలు కాపీ చేసుకుని వాటిని సంజీవదేవ్ లాంటి వాళ్లకి పంపి వాళ్ల దగ్గర్నుంచి వచ్చిన జవాబులు నాకు చూపించేవారు. ఎంతో ప్రోత్సాహంగా మాట్లాడేవారు. అయినా సరేలే అనుకునేవాణ్ణి. అప్పుడు కూడా ప్రింటు చేయాలన్న ఆలోచన రాలేదు. తర్వాత హైదరాబాదు వచ్చాకానే “వైశాఖ సముద్రం” ప్రింటు చేయించినాను.

ఒక కవితపై ఎలా పని చేస్తారు? కవితని గుర్తించానని ఎప్పుడు అనిపిస్తుంది?

నా వరకూ నాకు ఎక్కువ కవిత్వం ప్లాష్ లాగానే వస్తుంది. మొదటి రెండు లైన్లూ స్ఫురించటం, తర్వాత దానిపై అలానే ఆలోచిస్తూ ఉంటే అది డెవలప్ అవటం. ఎప్పుడు స్ఫురిస్తాయన్నది చెప్పలేం. బస్సులోపోతుంటేనో, వేరే ఏదో పనిలో ఉండంగానో, ఊరకనే కూర్చున్నప్పుడో ఆ రెండు మూడు లైన్లు స్ఫురిస్తవి. తర్వాత వాటినే అలా మననం చేసుకుంటుంటే మిగతావి వచ్చేస్తాయి.

రెండో కవితా సంపుటి “హంసలదీవి“కి వచ్చేసరికి మీ కవిత్వంలో చాలా మార్పు వచ్చింది. వీటిలో కొన్ని కవితలు అనుభవాల్నీ అనుభూతుల్నీ గాక, అనెక్‌డోట్స్‌ని (Anecdotes) చెప్తాయి (‘పండితాలోకం’, ‘నిధి చాల సుఖమా’, ‘దుష్టసమాసం’ లాంటివి) . ఇలా వేరే చోట నుంచి విన్న వృత్తాంతాల్ని మరలా కవితలుగా ఎందుకు చెప్పాలనిపించింది?

చెప్పదగ్గ విషయమేదో ఉంది కదా అందులో, పది మంది తెలుసుకోవాల్సిన విషయం… కాబట్టి చెప్పాలనిపించింది. కవిత్వ అంటే ఏంటీ అనే దానికి ఒక గిరి గీసుకుని ఒక చట్రంలాగా పెట్టుకుని అందులోనే ఆలోచించటం సరి కాదు. ఇది చెపితే బాగుంటుంది అనిపించి చెపటం అయింది. అది పారబుల్ కావచ్చు, అనెక్‌డోట్ కావచ్చు, లేదా ఒక భావం కావచ్చు. చెప్పదగ్గ విషయం కాబట్టి చెప్పినాను. ఆ చెపటం అనేటువంటిది కవిత్వ రూపంలో వచ్చింది. నాకు తెలిసిన కవిత్వ రూపంలో.

పారబుల్స్ (నీతి కథలు) లాంటివి కవిత్వంలో ఇమిడేవేనా?

తప్పనిసరిగా ఇముడుతవి. అది కవి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది.

అంటే అనుభూతులూ, అనుభవాలూ మాత్రమే ఎక్కువగా కవి వస్తువులు అవుతుంటాయి కదా?

అది కొంతమంది పరిమితి కావచ్చు. కానీ అదే కవిత్వపు పరిమితి కాదు కదా. కవిత్వంలో ఏదైనా చెప్పవచ్చు. ఇది చెప్పదగ్గ వస్తువు అనుకున్నప్పుడు ఏదైనా చెపుతాడు కవి. అనుభవాలూ అనుభూతులూ అంటే… నేను ఒక అనెక్‌డోట్ రాస్తున్నా అంటే అందులోని వస్తువు వ్యక్తిగతంగా నన్ను ఏదో అనుభూతికి గురిచేసిందనే కదా.

వైశాఖ సముద్రం” నుంచీ, ఇటీవలి “సూరీడు” దాకా గమనిస్తే మీరు కవిత్వాన్ని సమీపించే/ వాడుకునే తీరులో మీకు తోచిన మార్పు ఏదైనా ఉందా?

అనుభవాలు పెరిగిన కొద్దీ కవిత్వంలో మార్పు వస్తుంది. నాకు ప్రపంచం గురించిన అవగాహన ఎట్ల ఎట్లా మారుతూ వచ్చిందో, ఎట్ల ఎట్లా అభివృద్ధి చెందుతూ వచ్చిందో… అట్ల అట్లా నా ఎక్స్‌ప్రెషన్ మారుతుంది. ఆ ఎక్స్‌ప్రెషనే కవిత్వంగా వస్తుంది. శైలి, శిల్పం, భాష ఇవన్నీ నేను ఎప్పుడూ ఆలోచించలేదు. చెప్పాలనుకున్నది ఎంత బాగా చెప్పగలం, ఎంత విశదంగా చెప్పగలం… అదే దృష్టి.

మీ కవితలు భావంలో గానీ, వ్యక్తీకరణలో గానీ సంక్లిష్టంగా లేకుండా ఉంటాయి. కవిత్వపు గ్రామర్ పట్ల అంత అవగాహన లేని పాఠకునికి కూడా వెంటనే అర్థం అవుతాయి. ప్రయత్నపూర్వకమైన శ్రద్ధ ఏమైనా ఉందా, లేక అది అంతే అంటారా?

కవిత్వం అనేది భావ వ్యక్తీకరణే కదా. చెప్పదల్చుకున్నది ఒకడు కథ ద్వారా చెపుతాడు, ఒకడు నవల ద్వారా చెపుతాడు, ఒకడు కవిత ద్వారా చెపుతాడు. తాను చెప్పదల్చుకున్నదేదో వీటిలో ఏదో ఒక రూపం తీసుకుని చెపుతాడు. ఎవరి కోసం చెపుతున్నాడు? వినేటువంటివాళ్లకో, చూసేటువంటివాళ్లకో, చదివేటువంటివాళ్లకో…. వాళ్లకు అర్థం అవకుండా చెపితే అది ఓటమే కదా. అది నా దృష్టి. అట్లాగే రాస్తున్నాను నేను. ప్రయత్నపూర్వకమైన శ్రద్ధ ఏం లేదు. బహుశా అది నా పద్ధతి.

గాథాసప్తశతినీ, ఇంకా కొంత ప్రాచీన సాహిత్యాన్నీ మీరు ఛందస్సులో అనువదించ లేదు. ఈ ఛాయిస్‌కి మీ తరపు నుంచి కారణమేంటో చెప్తారా?

కన్నడ వచనకారులు అక్క మహాదేవి వాళ్లెవరూ వాటిని ఉత్పలమాల, చంపకమాలల్లో చెప్పలేదు. వాళ్లు చెప్పనప్పుడు మనం వాటిని ఛందస్సులో చెప్తే ఎట్ల. వాళ్లు ఎట్ల చెప్పినారో అట్ల చెప్పదల్చుకున్నాను నేను. అక్క మహాదేవి ఎప్పుడో వెయ్యేళ్ల క్రితం ఆవిడ కదా. ఆమె ఇవాళ తెలుగుదేశంలో పుట్టి వచనాలు చెప్తే ఎలా ఉంటుంది… అట్లా నేను రాయాలనుకున్నాను.

గాథాసప్తశతి విషయానికొస్తే, అవి ప్రాకృత ఛందస్సులో చెప్పబడినవి. అది చాలా వెసులుబాటు ఉన్న ఛందస్సు. మన ఛందస్సుల్లా అందులో కట్టడి ఉండదు. పైగా అవి కవిపండితులు చెప్పిన గాథలు కాదు, జనసామాన్యంలోని కవులు చెప్పినవి. వాటి అనువాదానికి మన ఛందస్సులు వాడటం సరి అని నేను అనుకోలేదు.

మీ అనువాదాల ప్రభావం మీ కవిత్వంపై ఎలా ఉంది?

అంతా ఒకటే కదా. అనువాదాలు వేరు, నేను సొంతంగా రాసింది వేరు అని అనుకోవటం లేదు. ఆ పేరు పెట్టొచ్చో లేదో తెలీదు గానీ, కొంచెం ఆధ్యాత్మిక విషయాలంటే నాకు మనసు అటుపోతుంది. నేను అనువాదం చేసినవి కూడా అట్లాంటివే. కన్నడ వచనకారులు కానీ, సూఫీ కవిత్వం కానీ, బైబిలు పరమగీతం గానీ… అన్నీ అట్లాంటివే. నేను సొంతంగా రాసిన కవితలు కూడా అట్లాంటివే ఉంటాయి.

మీ “కృపావర్షం“, “అడవిపాడింది” కథా సంపుటాల గురించి చెప్పండి. పర్టిక్యులర్‌గా ఆ వస్తువుల్ని వచన రూపంలో ఎందుకు చెప్పాలనిపించింది?

కవి ఎక్స్‌ప్రెషన్ ఒక్కోసారి కవితగా రావొచ్చు, కథగా రావొచ్చు, నాటికగా రావొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. ఇట్లా చెపితే బాగుంటుంది అనుకుంటే అట్లా చెప్పినాను. ఆ వస్తువులకి అది appropiate form.

కవిత్వం, వచనం తేడాల పట్ల మీ అభిప్రాయం ఏమిటి?

నేనెప్పుడూ అట్లా ఆలోచించలేదు. అన్నీ ఒకటిగానే ఉంటాయి. కథగా చెప్పాల్సింది అలా చెప్తేనే బాగుంటుంది. కవితగా చెప్పాల్సింది అట్లా చెప్తేనే బాగుంటుంది.

అంటే ఆ భేదం ఉందంటారు?

భేదం అంటే ఆ form లో భేదం ఉంది. అట్లా అని ఇదెక్కువా అది తక్కువా అంటానికి లేదు.

పై రెండు సంపుటాల్లో కథలు ఎలా ఉంటాయంటే, అక్కడో కథ ఉందని మీ కథ పాయింట్ చేసేంత వరకూ దానికి ఉనికి లేదనిపిస్తుంది. నిడివి కూడా చాలా తక్కువ. ఇలాంటి కథా నిర్మాణం పట్ల మీలో ఉన్న ఆలోచనలేమిటి?

మన దగ్గర ఒక్కోటీ ముప్ఫై నలభై పేజీలుండే కథలు కూడా ఉన్నాయి. వాటిలో నేను గమనించింది వర్ణనలు. కథ మొదలుపెట్టడమే ప్రకృతి వర్ణనతో మొదలుపెట్టటం, ఒక పాత్ర కథలో ప్రవేశించగానే దాని రూపురేఖల్ని వర్ణించటం ఇట్లా దాంతోనే సగం పేజీలు సరిపోతాయి. సంఘటన చాలా తక్కువ కనిపిస్తుంది. ఈ యాభై పేజీల కథలో వర్ణనలూ అవీ తీసేస్తే సంఘటన మాత్రమే చెప్పే భాగం ఏ పది పేజీలో ఐదు పేజీలో సరిపోతుంది. ఒక సంఘటన చెప్పేటపుడు చుట్టూతా ఈ పేర్చుకోవటం అవసరం లేదని నాకు అనిపించింది. సంఘటన ఏంటన్నది చెపితే దాని ఆధారంగా పాఠకుడు ఆ చుట్టూ ఉన్నదంతా ఊహించుకోగలడు. ఊహించుకునేటట్టు మనం రాయగలం. ఇరవై పేజీలు చెప్పి ఒక పాఠకుడిలో మీరు ఎలాంటి భావాన్ని కల్పించగలరో, ఒక పేజీలో చెప్పి కూడా అలాంటి భావాన్ని కల్పించగలిగితే? నేను అట్లా రాయటానికి ప్రయత్నం చేసినాను. నా “అడవి పాడింది”లో అన్ని కథలూ అట్లాగే ఉంటాయి. పేజీ రెండు పేజీలకు మించి ఏ కథా ఉండదు.

ఈ కథల్లో కొన్ని అంతకుముందే ఎక్కడో విన్నవి. మళ్లీ వాటిని మీ నేరేషన్‌తో ఎందుకు చెప్పాలనిపించింది?

చాలామంది విన్లేదు కదా ఆ కథ. కనీసం నేను చెపటం మూలంగా అన్నా కొంతమంది వింటున్నారుగా. అదే ఉద్దేశం.

“కవులు భాష పుట్టిస్తారు, పండిస్తారు” అని రాశారు. కవిత్వం విషయంలోగానీ, ఇతర ప్రక్రియల విషయంలో గానీ భాష వాడకం పట్ల మీకున్న నమ్మకాలూ అభిప్రాయాలు చెప్పండి?

జీవవంతమైన భాష అంటే పడికట్టు పదంలా వినిపిస్తుంది. కానీ అదే కావాలి. Contemporary language (సమకాలీన భాష) కావాలి. మనం మాట్లాడుకునేట్టుగా ఉండాలి. కవిత్వంలో కూడా అట్లానే ఉండాలి. కృతక భాష ఉండకూడదు.

మెహెర్ బాబా మీద రెండు పుస్తకాలు రాశారు కదా (“మెహెర్‌బాబా అవతారతత్వం“, “ధూళిగా మార్చే ప్రేమపథం“). ఆయన మీద మీ ఆసక్తికి కారణం చెప్పండి?

ఆయన వల్ల చాలా తెలుసుకున్నాను. నేనెవర్ని, చుట్టుపక్కల ఉన్న ఈ ప్రపంచం గురించినటువంటి సత్యం ఏమిటి… ఇవన్నీ ఎవరికైనా ఉండేటువంటి ప్రశ్నలే కదా. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు నాకు ఆయన దగ్గర దొరికినవి. చాలా వరకూ. కాబట్టి నాకు ఆయనంటే ఇష్టం. ఆధ్యాత్మిక విషయాల్లో ఆయన ముడిచిన పిడికిలి కాదు, తెరిచిన పిడికిలి. ఏదీ రహస్యంగా పెట్టలేదాయన. He is more accessible.

కవులు తమలోని కవిత్వాన్ని కల్మషం కానీయకుండా నిలబెట్టుకోవాలంటే వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి?

కవిత్వంలో కల్మషం ఉండకూడదనుకుంటే వ్యక్తిగత జీవితంలో కూడా కల్మషం లేకుండా ఉంటానికి ప్రయత్నం చేయాలి. చాలామందితో అంటూంటా నేను: గొప్ప కవిత్వం రావాలంటే గొప్పగా జీవించాలి. కవిత్వం వేరు మనిషి వేరు ఉండకూడదు. పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఏదీ ఉండకూడదు కవిత్వంలో. అందరిముందూ మంచిగా కనిపించాలి, అందరూ నన్ను మంచోడు అని మెచ్చుకునేట్టుగా జీవించాలి అని ఉండకూడదు. నిజంగా జీవించాలి అలా. అట్లాంటివాడి నుంచే మంచి కవిత్వం వస్తుంది.

*

(కవర్ ఫొటో: “కవి సంగమం” సౌజన్యంతో..)

Download PDF ePub MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, మార్చి and tagged , , , , , , , , , , .

5 Comments

 1. Prachaaraaniki paakulaadani niraadambara nigarvi ayina manchi prathibhaasaali Deevi subaarao gaaru lanti maarumooola vyakthini interview cheyalanna aalochana raavdam chaalaa goppa vishayam. Ayana ye vishayam ayina gunde lothullo nunchi matladatharu, ade, raastaaru kooda.. interview baagane undi kanee, complete ness ledanipinchindi. Inkgaa baagaa cheyacchu.

  Bhaskar

 2. మాకు అంటే ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శిగా సంచాలకులుగా దీవి సుబ్బారావు పనిచేశారు అన్నది తెలుసు.అయితే ఆనాడు ఆయన్ని వొక ఆఫీసర్ గా చూశా.ఆయన రచనలు కొన్ని చదివాకా మాకు ఇంతటి ప్రతిభావంతుడు అధికారిగా వున్నందుకు కించిత్ గర్వం.సార్ చెప్పిన అంశాలు ముఖాముఖి బావుంది.

 3. కొన్ని జవాబులు బాగా నచ్చాయి. ముఖ్యంగా చివరి జవాబు!!!

  “తప్పనిసరిగా ఇముడుతవి. అది కవి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది.”

  “నేనెప్పుడూ అట్లా ఆలోచించలేదు. అన్నీ ఒకటిగానే ఉంటాయి. కథగా చెప్పాల్సింది అలా చెప్తేనే బాగుంటుంది. కవితగా చెప్పాల్సింది అట్లా చెప్తేనే బాగుంటుంది”

  దీవి సుబ్బారావు గారిని ఇంటెర్వ్యూ చేసిన కినిగె పత్రికకి ధన్యవాదాలు :-)

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.