cover

ముసుగు వేయద్దు మనసు మీద

Download PDF ePub MOBI

విసుగ్గా టైం చూసుకున్నాను. సాయంత్రం నాలుగున్నర అవుతోంది. బయల్దేరుతున్నారా అని బాస్ ఇప్పటికే రెండు సార్లు అడిగారు. పది నిముషాలలో బయల్దేరుతున్నానని ఆయనకి చెప్పాను.

లకడీ-కా-పూల్‌లో ఉన్న మా ఆఫీసు నుంచి తార్నాకా క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఓ హోటల్‍కి వెళ్ళాలి. నా డొక్కు మోపెడ్ మీద ఈ సమయంలో అక్కడికి వెళ్ళాలంటే కనీసం గంట పడుతుంది.

ఫంక్షన్ ఆరు గంటల నుంచీ. కానీ నేను అక్కడికి ముందే వెళ్ళి ఏర్పాట్లని పర్యవేక్షించాలి. ఏ మాత్రం తేడాలు రాకూడదని బాస్ ముందే హెచ్చరించారు.

ఇంతకీ అది మా ఇంటి ఫంక్షన్ కాదూ, కనీసం మా బాస్ సొంత శుభకార్యమూ కాదు. బాస్ బావమరిది వాళ్ళ తోడల్లుడి కొడుకు రెండో పుట్టిన రోజు.

బాస్ లోపలికి పిలిచారు.

“చూడండి. అలా సర్వం కోల్పోయినవాడిలా మాడిపోయిన ముఖం పెట్టుకుని వెళ్ళకండి. అక్కడ కాస్త నవ్వుతూ ఉండండి. అక్కడి ప్లెజంట్ అట్మాస్ఫియర్‌ని మీ దిగాలు ముఖంతో చెడగొట్టకండి. నేను వీలైనంత త్వరగా వచ్చి జాయినవుతాను”

బండి తీసి బయల్దేరాను. మోపెడ్‌తో బాటు నా ఆలోచనలూ పరిగెడుతున్నాయి.

*  *  *

ఆఫీసులో నాకు పనేం ఉండడం లేదని మా బాస్ అభిప్రాయం. పాత బాస్ ఉన్నప్పుడు నేను ఆయన పర్సనల్ సెక్రటరీగా ఉండేవాడిని. ఆయన మీటింగ్స్, అపాయింట్‌మెంట్స్ చూడ్డం, ఆయన రిపోర్టులు టైప్ చేయడం, ట్రావెల్ ఏర్పాట్లు వగైరాలు నా పని. ఆయన తప్పుకుని కొడుక్కి బాధ్యతలు అప్పగించారు. కొత్త బాసుది నవతరం. అధునాతనమైన జీవన శైలి. బ్లాక్ బెర్రీ ఫోన్, లాప్‌టాప్….! ఆయన మీటింగ్స్ ఆయనే ఏర్పాటు చేసుకుంటారు, ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-మెయిల్స్ ద్వారానే. ట్రావెల్ కార్డ్ తీసుకుని, ఆయన టికెట్లు ఆయనే ఇంటర్‌నెట్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ఆయన పదవిలోకి రాగానే మొదట చేసిన పని…. అనవసరమైన (?) వ్యయాన్ని తగ్గించుకోడం. ఈ నిర్ణయంలో భాగంగా కొంతమంది సిబ్బందిని తొలగించారు. కార్యరంగంలో వస్తున్న మార్పులని గ్రహించక, నేటి అవసరాలకు తగ్గట్టుగా మారలేకుండా ఉన్నవాళ్ళు ఇంటి ముఖం పట్టక తప్పలేదు. నన్ను కూడా తీసేద్దామనుకున్నారట. కానీ వాళ్ళ నాన్నగారికి నేను చేసిన సేవలకు గాను నన్ను ఇంకొంత కాలం ఉంచుతారట. ఈలోపల నేను ఆయా కొత్త కొత్త పరికరాలను వాడటం నేర్చుకుంటే… ఉద్యోగం ఉంటుంది లేదంటే… లేదు.

నలభై సంవత్సరాల వయసులో ఇప్పటిదాక తెలియని కొత్త విషయాలు నేర్చుకోడం కష్టమే… ఎలాగు తీసేస్తారు కదాని… ఇంకో చోట ఉద్యోగం వెతుక్కుంటే పోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడొస్తున్న కొత్త కంపెనీలలో మాలాంటి వాళ్ళం “అన్ స్కిల్డ్ లేబరర్స్” కింద లెక్క. మాకు నప్పే ఉద్యోగాలు లేవు. పైగా మీద పడుతున్న వయసొకటి… ఒకే సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం తలకు మించిన భారం అవుతోంది. పెరిగిపోతున్న ధరలూ, ఇంటి ఖర్చులూ, పిల్లల చదువులు, అమ్మ వైద్యం… ఇలా ప్రతీదీ ఓ సమస్యగానే కనపడుతోంది. భయపెడుతోంది.

జాలితో నన్ను ఉద్యోగంలో కొనసాగిస్తున్నందుకేమో, నాకు రకరకాల పనులు చెబుతున్నారీ మధ్య. మండుటెండలో బయటకి పంపడం. ఎక్కడో దూరాన ఉన్న ప్రాంతాలకి పంపి కాయితాలు కలెక్ట్ చేసుకురమ్మనడం జరుగుతోంది. పొమ్మనలేక పొగపెడుతున్నట్లుగా…… నా ఉద్యోగం మీద నాకే విరక్తి కలిగిస్తున్నారని, అటువంటి పనులలో భాగంగానే ఇప్పుడీ ఫంక్షన్ ఏర్పాట్లు పురమాయించడమని నా అభిప్రాయం.

ఆలోచనల్లో పడి సమయం గమనించనే లేదు. దాదాపుగా నలభై ఐదు నిమిషాలలోనే హోటల్‌కి చేరుకున్నాను.

*  *  *

ఈవెంట్ మానేజర్‌ని కలుసుకుని, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అడిగాను. ఆయన నాతో పాటు ఫంక్షన్ జరగబోయే హాల్లోకి వచ్చాడు. కుర్చీలు నీట్‌గా సర్ది ఉన్నాయి. హాల్లో ఓ చివరగా కొంతమంది రాత్రి భోజనానికి కావల్సిన పదార్ధాలుంచేందుకు పాత్రలని సిద్ధం చేసుకుంటున్నారు. మంచి నీళ్ళ గ్లాసులు పెట్టి ఉన్నాయి. వాటి మీద సన్నని కాగితం మూతలు ఉంచారు. ఆర్డర్ చేసిన మెనూ ప్రకారం అన్ని వంటలూ సిద్ధం అయ్యాయేమో కనుక్కున్నాను. హాల్లో పేపర్ రిబ్బన్స్, బెలూన్లు వంటి అలంకరణలు, వేదిక వెనుక పెద్ద అక్షరాలతో పిల్లవాడి పేరు, ఫోటో, హ్యాపీ బర్త్ డే అని రాసున్న ఫ్లెక్సీ అన్నీ సరి చూసాను. అన్నీ సక్రమంగానే ఉన్నాయి. కిందకి వెళ్ళి ఓ కప్పు టీ తాగొచ్చాను. లిఫ్ట్ దగ్గర, మెట్ల దగ్గర ఆహ్వానితులకు స్వాగతం అని రాసున్న బానర్లు ఇంకా కట్టలేదు. మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ‘అయిదు నిముషాల్లో కట్టించేస్తాను….’ అన్నాడాయన. మళ్ళీ హాల్లోకి వచ్చాను. ఏదో మిస్సింగ్ అని అనిపిస్తోంది….. నా నోట్ బుక్ తీసి చూసుకున్నాను. అన్నీ ఏర్పాట్లు బానే ఉన్నాయి… కానీ ఏదో వెలితిగా అనిపిస్తోంది. అప్పుడు గుర్తొచ్చింది. వచ్చే పిల్లల వినోదం కోసం మిక్కీ మౌజ్ కాస్ట్యూమ్ వేసుకుని గెంతులు వేసే వ్యక్తి రాలేదు. పావుతక్కువ ఆరవుతోంది. గెస్టులు వచ్చే టైం అవుతోంది. గబగబా మేనేజర్ దగ్గరికి పరిగెత్తాను. సమస్య విన్నవించుకున్నాను.

“వీరేశం బస్‍లో వస్తాడు సార్. ట్రాఫిక్‍లో ఇరుక్కుపోయాడట. ఇప్పుడే ఫోన్ చేసాడు. ఇంకో పదినిముషాలలో ఇక్కడుంటాడు. మీరేం వర్రీ కాకండి” అంటూ భరోసా ఇచ్చాడు.

ఇంతలో పుట్టినరోజు బాబు తల్లిదండ్రులతో సహా అక్కడికి వచ్చాడు. వస్తూనే మేనేజర్‌ని నా గురించి అడిగాడు వాళ్ళ నాన్న. “ఇదిగో ఈయనే…” అంటూ నన్ను చూపించాడు.

నేను నమస్కారం చేసాను.

ఆయన ప్రతినమస్కారం చేయకుండానే తలపంకిస్తూ, “అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఎక్కడా ఏ లోపమూ రాకూడదు…..” అన్నాడు.

“అన్నీ సక్రమంగానే ఉన్నాయి. మీరు లోపలికి పదండి… “ అంటూ వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళాను. ఇంతలో వాళ్ళ బంధువులు కొంతమంది రావడంతో వాళ్ళ దృష్ణి నా మీద నుంచి మళ్ళింది. మెల్లిమెల్లిగా జనాలు రావడం మొదలైంది. హాల్లో పెద్దగా నవ్వులు, పిల్లల కేరింతలు వినపడుతున్నాయి. కొందరు పిల్లలు బెలూన్లని పగలగొడుతున్నారు.

నేను వీరేశం కోసం బయటకి వచ్చి చూస్తున్నాను. మా బాస్‌కి తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళని విష్ చేస్తూ లోపలికి పంపుతున్నాను. లోపలనుంచి మ్యూజిక్ వినబడడం మొదలైంది. సందడి పెరిగింది. అంతా హాడావుడిగా ఉంది. అప్పటికే చాలా మంది చేరుకున్నారు. ఎప్పుడొచ్చాడో నేను గమనించనే లేదు గానీ వీరేశం వచ్చి పిల్లలతో కలిసి ఆడుతున్నాడు, టేప్‌లో వస్తున్న పాటలకు తగ్గట్టుగా గంతులు వేస్తున్నాడు. హోటల్ సిబ్బంది సూప్, స్నాక్స్ సర్వ్ చేస్తున్నారు. తినే వాళ్ళు తింటున్నారు, రుచి చూసి పక్కన పెట్టేవాళ్ళు గ్లాసుని కుర్చీల కింద ఉంచుతున్నారు. నేను ఓ సూప్ గ్లాసు తీసుకుని సిబ్బంది నిలుచున్న చోట ఓ కుర్చీ వేసుకుని కూర్చున్నాను.

రాత్రి ఎనిమిదిన్నర దాక ఆట పాటలు, కేరింతలతో సమయం గడిపారు. రావల్సిన ముఖ్యులంతా వచ్చారని నిర్ణయించుకున్నాక, పిల్లాడి చేత కేక్ కోయించారు. తరువాత కానుకల చదివింపులు, బహుమతి స్వీకారం అయ్యాయి. సుమారుగా తొమ్మిందింటికి డిన్నర్ మొదలైంది. చాలామంది గబగబా తినేసి, బయల్దేరుతున్నారు. మొదట్లో ఉన్న ఉత్సాహం ఉల్లాసం ఎవరిలోనూ లేవిప్పుడు. ఎంత త్వరగా ఇంటికి వెడతామా అన్నట్లుంది వారి వాలకం. చివరగా పుట్టినరోజు బాబు వాళ్ళ తల్లిదండ్రులు భోంచేసి మేనేజర్‍కి థ్యాంక్స్ చెప్పి అక్కడ్నించి కదిలారు.

మేనేజర్ భోజనానికని ఓ ప్లేట్ అందుకుంటూ, “సార్, మీరూ తినేయండి. మా వాళ్ళు సామాన్లు సర్దుకుంటారు” అన్నాడు. టైం చూసుకున్నాను పావుతక్కువ పది అవుతోంది. ఈ పదార్ధాలేవీ నాకు నచ్చవు. శుభ్రంగా కాస్త పెరుగన్నం తిని భోజనం పూర్తయిందనిపించాను. మేనేజర్‌తో పూర్తి చేయాల్సిన వ్యవహారాలు పూర్తి చేసి పార్కింగ్ లాట్‌లో ఉన్న నా బండి వద్దకు వచ్చాను. స్టాండ్ తీస్తుంటే…. ఓ వ్యక్తి నా దగ్గర కొచ్చాడు. వయసు నలభై-నలభై ఐదు మద్య ఉండొచ్చు.

నేను ఇదివరకే పరిచయమున్నట్లుగా… “నమస్కారం సార్. తఁవరు ఎక్కడిదాక వెడతారు?” అని అడిగాడు.

“నమస్తే. మీరు……” అంటూ ఆపాను.

“నేనేనండీ… ఇందాక మిక్కీ మౌజ్ డ్రస్సేసుకుని ఆడాను… ఈరేశాన్ని సార్…..” అన్నాడు. అతడి చేతిలో మిక్కీ మౌజ్ కాస్ట్యూమ్ మడతపెట్టి ఉంది.

వీరేశం అంటే నేను ఎవరో కుర్రాడనుకున్నాను. ఈ వయసు వ్యక్తి అంతలా తుళ్ళుతూ గంతులు వేయగలడని నేను ఊహించలేదు.

“చెప్పండి…” అన్నాను

“నేను బోరబండ దాక వెళ్ళాలండీ. ఈ టైంలో నాకు బస్‌లు దొరకడం కాస్త కష్టం. తవఁరేవయినా అటువైపు వెడుతుంటే కాస్త దారిలో దింపుతారేమోనని ఆయ్…..” అంటూ నసిగాడు.

“నేను మూసాపేట్ వెడుతున్నాను. ఎర్రగడ్డ ఫ్లై ఓవర్ దాక రావచ్చు…” అన్నాను.

“తాంక్సండీ…” అంటూ ఎక్కి వెనుక కూర్చున్నాడు.

*  *  *

005బండి మెల్లిగా నడుపుతున్నాను. చలిగాలి వీస్తోంది. ఉండుండి ఒక్కో వాహనం మమ్మల్ని దాటుకుని వెడుతోంది.

“ఈ వయసులో అలా గంతులు వేయడం ఇబ్బందిగా లేదా?” అడిగాను.

“మనకి వయసుతో పనేముందండి. మనసు కదా ముఖ్యం….” అన్నాడు. అబ్బో.. అనుకున్నాను.

“ఒకప్పుడు మాది బాగా బతికిన కుటుంబమండయ్యా. ఏదో చిన్న గొడవై, చిన్నప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసానండీ. మనకి పెద్దగా చదువబ్బలేదు. ఎనిమిది పాసయ్యా అంతేనండీ. ఇంట్లోంచి పారిపోయాం కదండీ, మరి బతకడానికి రకరకాల పనులు చేయాల్సొచ్చింది. మొదట్లో ఓ ఇరానీ టీ హోటల్లో…. తర్వాత ఓ బళ్లో బంట్రోతుగా …ఆ తర్వాత కొన్నాళ్ళు సిమెంట్ పని చేసానండీ….. నిలకడ లేని బతుకయిపోయిందండీ మనది. ఇక్కడే స్నేహితుడైన మా ఊరతని చెల్లెల్ని పెళ్ళి చేసుకున్నా. ఇద్దరు ఆడ పిల్లలండీ. పెద్ద అమ్మాయి ఐదు, చిన్నపిల్ల ఒకటో క్లాసు చదూతున్నారండీ. మా యావిడ ఓ కాల్ సెంటర్ కాంట్రాక్టర్ దగ్గర స్వీపరండీ….” అంటూ తన వివరాలు చెప్పుకొచ్చాడు.

“ఇలా ఆడితే మీకు ఎంతొస్తుంది?” అని అడిగాను.

“గంటకి వంద రూపాయలండీ. ఆరు నుంచి ఎనిమిది గంటల దాక, రెండు వందలొస్తాయి సార్….”

“అంతేనా…..” అన్నాను ఆశ్చర్యంగా.

పార్టీ కాంట్రాక్ట్ ఖర్చు చాలా పెద్ద మొత్తం అని నాకు తెలుసు. హాల్లో పువ్వులు, బెలూన్ల డెకరేషన్‌కే సుమారు నాలుగు వేలు ఇచ్చాం.

“ఆయ్, కాంట్రాక్టర్ మీ వోళ్ళ దగ్గర ఎక్కువనే తీసుకుంటాడండీ… కాని మా చేతికొచ్చేది తక్కువే…..” అన్నాడు వీరేశం. మళ్ళీ తనే మాట్లాడుతూ…

“మేము కూస్త ఎక్కువ అడిగాఁవనుకోండీ… ఇంకొకళ్ళని పిలిపిస్తాడండీ…. అసలు లేని దాని కన్నా, తక్కువ డబ్బే నయం కదండీ…” అన్నాడు.

“అయినా ముఖానికి ముసుగేసుకుని గంటలపాటు అలా గెంతుంతూండడం, పిల్లలు అల్లరి చేష్టలు చేస్తుంటే భరించడం కష్టం కదూ….” అన్నాను నేను.

“అదేం లేదండి. మునుపు నేను ఓ పెద్ద బట్లల కొట్టు ముందు సింహం డ్రైస్ వేసుకుని వచ్చీ పోయే జనాలకి వినోదం కలిగిస్తూ, వాళ్ళని మా కొట్లోకి పిలుస్తుండేవోడినండీ. తర్వాతేమో మా షాపు చుట్టుపక్కలా ఇంకో మూడు బట్టల కొట్లు వచ్చేసాయి కదండీ. ఆళ్ళు కూడా మాలాగానే మనుషులకి ముసుగులు వేసి కొట్టు ముందు నిలబెట్టేశారండీ. పోటీ యెక్కువైపోయి, మాకు రేటు తగ్గించేసారండీ. పైగా పగటి పూట రోజంతా ఎండలో ఉంటూ ఆ ముసుగు బట్టలని భరించడం కష్టం కదండీ… సాయంత్రం ఇంటికెళ్ళాక వళ్ళంతా ఒకటే దురదలు… దద్దుర్లు….! దానితో పోలిస్తే ఇది నయఁవేనండీ. రెండు మూడు గంటలు… అది కూడా సాయంత్రాలు… యేసీ గదుల్లో…. పర్వాలేదండీ… ఆయ్” అన్నాడు.

“వేరే ఉద్యోగాలు ఏవీ ప్రయత్నించలేదా?” అడిగాను.

“మా కాలనీలోనే ఓ అపార్ట్‌మెంట్‌కి వాచ్‌మాన్‌గా ఓ వారం రోజులు పనిచేసానండీ. నానా రకాల పనులు చెప్పేవాళ్ళండీ. నెలకి పదిహేను వందలిస్తానన్నారు కదా అని ఒప్పుకున్నాను సార్. ఓసారి ఏమైందంటేనండీ.. ఓ రాత్రి ఒక ఫ్లాట్‌లో దొంగతనానికి ప్రయత్నం చేసారండి ఇద్దరు యదవలు. నేను గట్టిగా ఈలేసి గొడవ చేస్తే, చిన్న కత్తితో నా చేతి మీద గాటు పెట్టి పారిపోయారండీ దొంగ నాకొడుకులు. బిల్డింగోళ్ళేమో అజాగ్రత్తగా ఉన్నాననీ, తప్పు నాదేనని అన్నారండీ. నేను వాచ్‌మాన్‌నే గానీ సెక్యూరిటీ గార్డుని కాదన్నానండీ, కరస్టే కదండీ… మరేమో నా దగ్గర చిన్న కర్ర ముక్క తప్ప తుపాకీ గానీ కత్తి గానీ లేదు కదండీ…”

“మీ వాదనలో తప్పు లేదు…”

“అంతే కాదండీ, మా యావిడిని కూడా ఉద్యోగం మానేసి, ఆ అపార్ట్‌మెంట్‌లోనే అందరి ఇళ్ళలో పనిచేయాలని, ఇస్త్రీ పెట్టె ఒకటి కొనుక్కుని వాళ్ళ బట్టలు ఇస్త్రీలు చేయాలని కండీసను పెట్టారండీ. తను ఉద్యోగం మానడం కుదరదన్నాను. దాంతో ఆళ్ళకి కోపం వచ్చి నన్ను తీసేసారు…….. ఆ తర్వాత ఇంక అలాంటి ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదండీ….”

“కానీ ఇలా ముసుగేసుకుని ఆడితే…. మీ పిల్లలు ఏమనుకుంటారు? అసలు మీ పిల్లలకి ఈ విషయం తెలుసా?”

“ఆయ్. తెలుసండీ. చేసే పనిలో తప్పు లేనప్పుడు యవరో యేదో అనుకుంటారని భయపడడం ఎందుకండీ? అయినా ఇది నా పార్ట్ టయం ఉద్యోగమేనండి. పొద్దున్న పూట మా ఇంటి దగ్గరున్న టిఫినీ సెంటర్‍లో పనిచేస్తా. పిల్లలు బడి నుంచి వచ్చే టయానికి ఇంట్లో ఉంటా. పలారాలు తిన్నాక, ఆళ్ళేం చదువుకుంటున్నారో చూస్తానండీ. మా యావిడకి ఈ మధ్య సిఫ్ట్ సిస్టమ్ అయిపోయిందండీ. డ్యూటీ ఒక వారం ఒక టయం, ఇంకో వారం ఇంకో టయం ఉంటోందండీ. ఇంట్లో మా మామని, పిల్లల్ని చూసుకునేందుకు యవరో ఒకరు ఉండాలి కదండీ. వారంలో నాలుగు రోజులు యేదో ఒక ఫంక్షన్‌ జరుగుతునే ఉంటుంది. నాకు ఒక్కో రోజు రెండొందలొస్తే, ఒక్కో రోజు మూడు నాలుగొందలొస్తాయి. మా యింటిదాని జీతం, నా డబ్బులు కలిపితే…. యేదో లాగేస్తున్నాం…..”

“ఇలా బతకడం మీకు బెంగగా ఉండదా?”

“మంచోరే. బెంగెందుకండీ. లైపన్నాక పైట్ చెయ్యాలి కదండీ. బతకడమే కష్టమైపోతున్న ఈ రోజుల్లో బయాలు బెంగలు పెట్టుకుని దిగాలు పడిపోకూడదు కద సార్. చేసే పనిని నవ్వుతా చేస్తే…. ఎలాంటి పని అయినా సులువుగా అయిపోతుంది. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని కోరిక ఉండేదండీ. స్టేజీ ఎక్కి ప్రోగ్రామ్ చెయ్యాలని ఆశ. ఇప్పటికి నా కోరిక తీరిందండీ. నన్ను చూసి నవ్వుకుంటారని గానీ, నన్నెగతాళి చేస్తారని గానీ నాకు బయం లేదండీ. అయినా నా మొకం ఎవరికీ కనపడదు గదండీ. హాయిగా మాస్కేసుకుని డాన్సాడేస్తాను. నవ్వుతాను, అంజాయ్ చేస్తాను సార్….. అయినా యిష్టం ఉన్నచోట కష్టం ఏముంటుందండీ? అసలు యిసయం యేటంటేనండీ.. నేను ముసుగు వేసుకునేది మొకానికే గాని, మనసుకి కాదు. అదండీ సంగతి…” అన్నాడు.

కాసేపు ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. ఆహా.. అనుకున్నాను.

అతను దిగాల్సిన చోటు వచ్చింది. నాకు ధన్యవాదాలు చెప్పి బండి దిగాడు. అతని చేతిలోని మిక్కీ మౌజ్ తల నవ్వుతోంది. వీరేశం ముఖంలో కూడా చిరునవ్వు కదలాడుతోంది. అప్రయత్నంగా నాకూ చిన్నగా నవ్వొచ్చింది. బండి స్టార్ట్ చేసి, అతని మాటల్ని మననం చేసుకుంటూ ఇల్లు చేరాను.

మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి నాలో దిగులు బెంగా లేవు. అలజడి దూరమై జీవిత సత్యమేదో అవగతమైనట్లుగా నాలో ప్రశాంతత.

– కొల్లూరి సోమశంకర్

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, మార్చి and tagged , , , , .

4 Comments

  1. ప్రయోజనకరమైన కథాంశంతో, వస్తువు-శిల్పం-కథనాల మధ్య మంచి సమతుల్యతతో నడిచిన కథ- “ముసుగు వేయద్దు మనసు మీద”
    ~నడుస్తున్న కథ / సారంగ వెబ్ పత్రిక,
    http://magazine.saarangabooks.com/2014/04/23/%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%AA%E0%B0%82-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%AE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B5-%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF/

  2. Pingback: ముసుగు వేయద్దు మనసు మీద

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.