SaayamkaalamaindiCover

మరపురాని పాత్రలతో క్రిక్కిరిసిన “సాయంకాలమైంది”

Download PDF ePub MOBI

గొల్లపూడి మారుతీరావు నాకు సినిమాలపరంగా మంచి నటులుగా తెలుసునే కానీ, ఆయనలోని రచయితను తొలిసారి “సాయంకాలమైంది” నవలలోనే పరిచయం చేసుకున్నాను.

శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటించడంలో తరాలు మారుతున్న కొద్ది వస్తున్న మార్పుని ఈ నవల్లో చూపించారు రచయిత. ఈ కథ నాలుగు తరాలను మనకు పరిచయం చేస్తుంది. పద్మనాభం అనే ఊరిలో ఆలయపూజారులైన సుభద్రాచార్యులవారి అంత్యక్రియలతో కథ ప్రారంభం అవుతుంది. ఆయన కొడుకు తిరుమల అమెరికా నుంచి తండ్రి అంత్యక్రియలకై ఊరికి వస్తాడు.

కథ మొత్తం సుభద్రాచార్యులవారి చుట్టూ తిరుగుతుంది. కుంతీనాథాచార్యులు కొడుకు పెద్ద తిరుమలాచార్యులు, ఆయన కొడుకు సుభద్రాచార్యులది మూడవతరం. నాలుగవతరం వాడు చినతిరుమలాచార్యులు (తిరుమల). పూర్వీకులంతా వైష్ణవ సాంప్రదాయాన్నీ, ధర్మ జ్యోతిష తర్కశాస్త్రాలని అవపోసన పట్టిన నిష్ణాతులు. తాత, తండ్రి తరువాత వైష్ణవ సనాతన సాప్రదాయాన్ని కాపాడే భాద్యతను సుభద్రాచార్యులు తన భుజాన వేసుకుంటాడు. కుమారుడికి తన తండ్రి పెద తిరుమలాచార్యుల పేరు పెట్టుకుంటాడు. చిన తిరుమలతో చిన్నతనం నుండీ నిష్ఠగా మూడు పూటలా సంధ్యావందనం చేయిస్తారు. తిరుమల నాలుగో యేటికే భగవద్గీత శ్లోకాలు అసర్గళంగా చదువుతాడు. దాంతో కొడుకు తన తదనంతరం వైష్ణవ సాంప్రదాయాన్ని, అర్చక వృత్తినీ చేపడతాడని ఎంతో ఆశ పెట్టుకుంటాడు సుభద్రాచార్యులు. సుభద్రాచార్యులవారి భార్య వరదనమ్మ, ఆమెకు భర్త, కొడుకు తిరుమల, కూతురు ఆండాళ్ళు, మడి, ఆచారం, స్వామివారిని సేవించడం ఇవే ప్రపంచం. భర్తనూ, బిడ్డలనూ పిచ్చిగా ప్రేమించే ఓ తల్లి.

చినతిరుమలాచార్యునిలోని పఠనాశక్తిని గ్రహించిన వెంకటాచలం అతని ఉన్నతికి సాయపడతాడు. తిరుమల చదువులో రాణించడం వరదమ్మకు సంతోషాన్ని కలిగించింది. ఆంగ్లచదువులో పడి కొడుకు తమ సాంప్రదాయానికి నెమ్మదిగా దూరమౌతున్నాడని గ్రహించిన సుభద్రాచార్యులు ఉన్నత చదువులకు మొదట అంగీకరించడు. కానీ తిరుమల ఆసక్తిని చూసి అందరూ నచ్చచెప్పటంతో ఒప్పుకుంటాడు.

కొత్త చదువుతో తిరుమల వేషభాషలు మారతాయి. పంచెకట్టు, పిలకముడీ పోయి పట్నంపోకడలు వచ్చి చేరతాయి. కొడుకులో వచ్చిన మార్పు వరదమ్మకు కాస్త బాధ కలిగించినా, మనసుకు సర్ది చెప్పుకుంటుంది. తిరుమలలో సాంప్రదాయాలపైన చిన్ననాడు ఉన్న పట్టు పెద్దయ్యాకా చదువుతో వచ్చిన మార్పు వల్ల సన్నగిల్లుతుంది. కాలేజీలో గోల్డుమెడల్ సాధిస్తాడు. ఉన్నత ఉద్యోగం సంపాదించి అమరికా ప్రయాణం కడతాడు.

అమెరికా జీవనం తిరుమలలో చాలా మార్పును తెస్తుంది. చిన్ననాటి నుంచి తండ్రితో కంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం పెంచుకున్న తిరుమల ఆమె మరణించిన తర్వాత తండ్రి పట్ల తన బాధ్యతను క్రమంగా విస్మరిస్తాడు. తండ్రి మరణం కూడా తిరుమలను పెద్దగా బాధిచదు.

ఈ కథతో సమాంతరంగా మరో కథ సాగుతూ వస్తుంది. కుమ్మరి కులస్థుడు కూర్మయ్య చదువు పట్ల అమితమైన ఆసక్తిని చూపిస్తాడు. అది గమనించి తనకు వచ్చిన చదువు చెపుతాడు ఆ ఊరి హెడ్డు కానిస్టేబులు అవతారం. ఆరునెలల్లో పెదబాలశిక్ష, సుమతీ శతకం వచ్చేస్తాయి. ఆ ఊరిలో ప్రభుత్వోద్యోగం చేసుకునే కామేశ్వరరావు కూర్మయ్యను అప్పటికే చదువు కొంటున్న చిన తిరుమలతో పరిచయం చేస్తాడు. యాభై సంవత్సరాల క్రితం తన ముత్తాత కుంతీనాధాచార్యులు ఏ జాతివాడు ఎదురొచ్చాడని తన ఊరు వదిలి వచ్చేస్తాడో, అదే జాతి వాడు కూర్మయ్యకు ఇప్పుడు తిరుమల చదువు చెప్తాడు. అతని చెల్లి ఆండాళ్లు కూర్మయ్యతో ప్రేమలో పడుతుంది. తల్లితండ్రులను ఎదిరించి అతన్ని పెళ్ళి చేసుకు వెళిపోతుంది.

నవలలో ఇంకో ప్రధాన పాత్ర నవనీతం. చాలా ధైర్యస్తురాలు. తన మీద జరిగిన అఘాయిత్యానికి పొన్నయ్యను హత్య చేసి జైలుకు వెళ్ళింది. ఆమె తరపున వాదించి జైలు నుంచి తప్పించిన సంజీవికే భార్యగా నూతన జీవితం ప్రారంభిస్తుంది.

భార్య మరణంతో సుభద్రాచార్యులవారి జీవితంలో వెలుగు పోయి చీకటి ప్రవేశించింది. వరదమ్మ పోయాకా “మడిబట్ట ఆరవేయడం కొత్త, నళినాక్షమాల పెరిగిపోతే నల్లదారంతో అతుకులు వేసుకోవడం కొత్త. తీర్థవటిని చేబూని ‘వరదా’ అని ఈ ఏభై ఏళ్ళు అలవాటైన పిలుపు పిలిస్తే వరద రాకపోవడం కొత్త.”

ఈ నవలలో ‘నవనీతం’ తర్వాత నాకు అంత బాగా నచ్చిన మరో పాత్ర రేచకుడు. తనకు కాలు తీసేసారన్న సంగతి, తల్లి చనిపోయిందన్న సంగతి అమెరికాలో ఉన్న తన కొడుక్కి తెలిస్తే బాధపడతాడని చెప్పకుండా దాస్తాడు. కుర్చీలో దర్జాగా కూర్చుని చుట్ట తాగుతూ జనం ఎక్కడ తన అవిటితనం పట్ల జాలిపడతారో అని అందర్నీ దూరంగా ఉంచే పాత్ర. మూడేళ్ళ తర్వాత తొలిసారి దేశానికి తిరిగి వచ్చిన తిరుమల అమెరికా మిత్రుడు విష్ణుమూర్తి కోరగా అతని తండ్రి రేచకుణ్ణి చూడటానికి విశాఖపట్నం నుంచి గిరిగాం వెళ్తాడు. మొదట అతన్ని కలవడం ఇష్టపడడు రేచకుడు. నెమ్మదిగా కొడుకు ఎలా ఉన్నాడో అని ప్రశ్నలు వేసే రేచకుడి కళ్ళల్లో ఆనందాన్ని గమనిస్తాడు తిరుమల.

“మీకు కాలు లేదని మీ అబ్బాయి నాకు చెప్పలేదే?” అని అడుగుతాడు.

“నాక్కాలు లేకపొతే ఆడికేమయింది బాబూ! గిరిగాం రైతునాకొడుక్కి కాలుంటేనేం పోతేనేం? నా కొడుకు దొర. సీమలో పెద్ద ఉద్యోగం సేత్తున్నాడు. అది చాలు నాకు.” “మనకి ఒంటి నిండా సక్కెరే బాబూ! తీపి తినక్కరలేదు. సిన్నప్పట్నుంచీ నేను ఇమాం పసందు అంటే పీక్కోసుకుంటాను. ఆరువేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి, తొలకరిదాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీయవ్వ.. పోతే దొర బిడ్డలాగా పోవాలి కానీ, ఏడుత్తూ బతికితే ఏం లాభం?”

తనని ఎగతాళి చేసిన రైతుకు బుద్ధి చెప్పాలని పంతంగా కొడుకుని శ్రీకాకుళంలో ఇంగ్లీషు మీడియం చదివిస్తాడు. కొడుకుతో ఇంగ్లీషు పాఠం చదివించుకుని మురిసిపోయాడు. విష్ణుమూర్తి చదువయ్యాకా వ్యవసాయం చేస్తానంటే గొడవపెట్టి మరి తనే బలవంతంగా అమెరిగా పంపిస్తాడు. అమెరికా వెళ్ళిన ముప్ఫయ్యేళ్ళ కాలంలో కొడుకు ఆరుసార్లు మాత్రమే ఇండియా వచ్చాడు.

ముప్ఫయ్యేళ్ళుగా విష్ణుమూర్తి పంపిన వస్తువులన్నీ ఓ గది నిండా బొమ్మల కొలువులా తీర్చి దిద్దాడు రేచకుడు. ఓ శాలువా తీసి “ఈ సిల్కు గుడ్డ ఆల్లమ్మ కోసం పంపించాడు ఆరు నెలల కిందట!” అన్నాడు గర్వంగా. “మరి ఆవిడ వాడుకోలేదేం?”

“ఎలా వాడుతాదయ్యా! ఈ లోకంలో ఉంటేగా వాడుకోడానికి! …సచ్చిపోయి నాలుగేళ్లయింది. సచ్చిపోయిన తల్లిని నాలుగేళ్ళు ఆడి మనస్సులో బతికించాను. నేను గొప్పొన్నా, కాదా సెప్పు బాబూ! … అమెరికా నుంచి వస్తే కాలుపోయిన నాన్ననీ, సచ్చిపోయిన తల్లినీ తల్చుకు ఏడుత్తాడని పూర్ణయ్య పంతులు గారితో చెప్పి అవాకులూ చెవాకులూ రాయిత్తాను..”

ఇంతటి రేచకుడూ భార్య చివరి క్షణాల్లో ఆమెకిచ్చిన మాటకోసం తనకెంతో ఇష్టమైన ఇమాం పసందు తినడం మానేశాడు. “తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకి ఇచ్చిన మాటని తప్పలేరా?” అన్న తిరుమల ప్రశ్నకి గిలగిల్లాడిపోయాడు రేచకుడు. “కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని” ఈ మాటలంటున్నప్పుడు రేచకుడి కనుకొలకులలో మంచిముత్యం లాంటి నీటిచుక్క తళుక్కుమంటుంది. సంతానానికి దూరమయితే అనుభవించే వేదన భరించగలిగేది కాదు. ఆ వేదన దిగమింగి బిడ్డ క్షేమాన్నే కోరుకునే ఈ పాత్ర పుస్తకం మూసినా గుర్తుండిపోతుంది.

చివరగా… తిరుమల అమెరికాలో ఉండి మంచి ఉద్యోగం, డబ్బు, పేరూ అన్నీ సంపాదించుకున్నాడు గానీ కన్న తల్లిదండ్రుల ఆఖరి గడియల్లో వారి సేవ చేసుకోలేక పోయాడు. చివరి చూపు కూడా నోచుకోలేని అభాగ్యుడయ్యాడు. కాలంతో వచ్చే మార్పు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది వివరించే కథ ఇది. అన్ని పాత్రలకు ఒక కథ ఉంది. ఎన్నో పాత్రలు కథలో ఉన్నా, రేచకుడు, నవనీతం, సంజీవి పాత్రలు పాఠకుని గుండెల్లో సజీవంగా నిలిచిపోతాయి.

– శ్రీశాంతి దుగ్గిరాల

SaayamkaalamaindiCover Verticalప్రచురణ వివరాలు:—

(ఆంధ్రప్రభ వీక్లీలో 2001లో ధారావాహికంగా ప్రచురితం)

విశాలాంధ్రా పబ్లిషింగ్ హౌసు

బాంక్ స్ట్రీటు (అబిడ్స్)

హైదరాబాదు – 500 001.

కినిగెలో లభ్యం

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, మార్చి and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.