AUTEURS CLASSIQUE

రచన కళ – వ్లదీమర్ నబొకొవ్

Download PDF ePub MOBI

వ్లదీమిర్ నబొకొవ్ (Vladimir Nabokov) 1899లో రష్యాలో పుట్టాడు. రష్యన్ విప్లవం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసి ఆయన జీవితాన్ని రష్యా నుండి ఇంగ్లాండుకి, ఇంగ్లాండు నుండి జర్మనీకి, జర్మనీ నుండి ఫ్రాన్సుకీ, చివరగా ఫ్రాన్సు నుండి అమెరికాకీ బంతాట ఆడుకున్నాయి; కుటుంబాన్ని చిద్రం చేశాయి; జీవితాంతం స్థిరమైన పాఠకవర్గం లేకుండా చేసాయి; ఏ రచయితకైనా పీడకల లాంటి మాతృభాషా వియోగాన్ని కలిగించాయి. అయినా ఆయన వీటన్నింటినీ తట్టుకుని పరభాష అయిన ఇంగ్లీషులో ఇరవయ్యో శతాబ్దపు మేటి రచయితల్లో ఒకడిగా నిలిచాడు. “లొలిటా” ఆయన ప్రసిద్ధ నవల.
మీరు మాటలు బాగా తడుముకుంటున్నారు. అది ముసలితనం మీద పడుతోందనటానికి సూచనా?

కాదు. నేను ఎప్పుడూ పేలవమైన మాటకారినే. నా పదసంచయం మనసు లోతుల్లో నిక్షిప్తమై ఉంటుంది, అది భౌతిక రూపం అందుకోవాలంటే కాగితం సాయం తప్పనిసరి. అనాయాసమైన వాక్చాతుర్యం నాకు అద్భుతం అనిపిస్తుంది. అచ్చులోకొచ్చిన నా ప్రతీ పదమూ అనేకమార్లు తిరగరాయబడిందే. నా ఎరేజర్లతో పోలిస్తే నా పెన్సిళ్ల జీవితకాలమే ఎక్కువ.

రష్యన్ మీ మాతృభాష. ఇంగ్లీషు మీరు ఇప్పుడు రాస్తున్న భాష. వీటిలో మీరు ఆలోచించే భాష ఏది?

నేను ఏ భాషలోనూ ఆలోచించను. నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను. అసలు ఎవరికైనా ఆలోచించేటప్పుడు భాషతో పని ఉంటుందనుకోను. ఎవరూ పెదాలు కదుపుతూ ఆలోచించరు. ఎవరో నిరక్షరాస్యుడైన వ్యక్తి మాత్రమే చదివేటప్పుడూ ఆలోచించేటప్పుడూ పెదాలు కదుపుతాడు. నేను కాదు, నేను దృశ్యాల్లో ఆలోచిస్తాను, అడపాదడపా ఆలోచనల అల నురగ మీంచి ఒక రష్యన్ పదబంధమో, ఇంగ్లీషు పదబంధమో పైకి తేలుతుంది, అదంత ముఖ్యం కాదు.

మీరు రాసే పద్ధతి ఎలా ఉంటుంది?

ఇరవై ముప్ఫయ్యేళ్ల వయసులో నేను మంచం మీద పడుకుని పక్కన ఉన్న ఇంకుబాటిల్లో పెన్ను ముంచుకుంటూ రాసేవాణ్ణి, లేదా రోజులో ఏ సమయంలోనైనా మనసులో కంపోజ్ చేసుకునేవాణ్ణి. పిచ్చుకలు లేచే సమయానికి నిద్రపోయేవాణ్ణి. ఇప్పుడైతే నా రచన మధ్యాహ్నాలు సాగుతుంది, ఇప్పుడు ఇండెక్సు కార్డుల మీద వెనక రబ్బరు అతికించిన పెన్సిల్‌తో రాస్తాను. కానీ ఇప్పటికీ రచనకు సంబంధించిన ఎక్కువ పని నేను శివార్లలో నడకకు వెళ్లినపుడు నా మనసులోనే జరుగుతుంది. రాసేటప్పుడు నేను వరసగా అధ్యాయాల వారీగా రాసుకుంటూ వెళ్లను. నా మనసులో ముందే స్పష్టంగా పూర్తయి ఉన్న చిత్రంలో, ఆ జిగ్షా పజిల్లో, అక్కడో ముక్కా ఇక్కడో ముక్కా జరుపుతూ ఖాళీలు నింపుతూ పోతుంటాను.

మీరు ఎవరి కోసం రాస్తారు, ఏ పాఠకుల కోసం?

రచయిత ఎప్పుడైనా పాఠకుల్ని పట్టించుకోవాలని నేను అనుకోను. అతను ప్రతీ ఉదయం షేవింగ్ మిర్రర్లో చూసుకునే వ్యక్తే అతని ఆదర్శ పాఠకుడు. ఆర్టిస్టు అసలంటూ తన ఆడియెన్స్‌ని ఊహించుకుంటే ఒక గదినిండా తన ముసుగులే తొడుక్కుని కూర్చున్న జన సందోహాన్ని ఊహించుకుంటాడు.

రచనలో ఉండే ఆనందం గురించి చెప్పండి?

పఠనంలో ఆనందంలాంటిదే అదీను. అచ్చంగా కుదిరిన పదబంధం కలిగించే సంతోషాన్ని అటు రచయిత ఇటు పాఠకుడూ పంచుకుంటారు: సంతృప్తితో రచయిత, కృతజ్ఞతతో పాఠకుడూను. లేదా తన మనసులో ఇలాంటి దృశ్యాల మేళవింపును స్ఫురింపజేసిన అతీత శక్తి పట్ల కృతజ్ఞతతో రచయిత, ఈ మేళవింపు పట్ల సంతృప్తితో పాఠకుడును.

ప్రతీ మంచి పాఠకుడు తన జీవితంలో ఏవో కొన్ని మంచి పుస్తకాల్ని ఆస్వాదించే ఉంటాడు. కాబట్టి ఇరు పక్షాలకీ పరిచితమైన ఆనందాన్ని ఎందుకు విశ్లేషించటం? కానీ నేను బోధించే సాహిత్య తరగతుల్లోని విద్యార్థులు కొందరికి ఎప్పటికీ ఒక విషయం అర్థమయ్యేలా చెప్పలేను. నువ్వు ఒక రచయిత పుస్తకం చదవాల్సింది హృదయంతో కాదు (హృదయం ఒక పనికిమాలిన పాఠకురాలు), అలాగని కేవలం మెదడుతోనూ కాదు; మెదడూ వెన్నుపూసలతో కలిపి చదవాలి. వెన్నెపూసలో పుట్టే జలదరింపు నీకు నిజంగా చెప్తుంది రచయిత ఏ అనుభూతి పొందాడో, ఏ అనుభూతిని నీకు ఉద్దేశించాడో.

వాస్తవికత (రియాలిటీ) అనేది ఆత్మాశ్రయమైనది అని మీరంటారు, కానీ మీ పుస్తకాల్ని గమనిస్తే మీరు పాఠకుల్ని బురిడీ కొట్టించటంలో దాదాపు క్రూరమైన సంతోషం పొందుతున్నట్టు అనిపిస్తారు?

కవిత్వం ఎలా మొదలైందో మీకు తెలుసా. నాకేమనిపిస్తుందంటే, మనిషి ఇంకా గుహల్లో బతికే కాలంలో ఒక పిల్లాడు పొడుగ్గా ఎదిగిన గడ్డిలోంచి తిరిగి గుహకి పరిగెత్తుకొస్తూ “తోడేలు తోడేలు” అని అరుస్తున్నప్పుడు కానీ అక్కడ నిజంగా ఏ తోడేలూ లేనప్పుడు, కవిత్వం పుట్టిందనిపిస్తుంది. బబూన్లను పోలిన అతని తల్లిదండ్రులు, నిజానికి పరమ బద్ధులు (కన్ఫర్మిస్టులు), బహుశా ఆ పనికి అతణ్ణి మొట్టి ఉంటారు, ఏదైతేనేం, కవిత్వం మాత్రం పుట్టింది. కళ అంటే బురిడీనే, నిజానికి ప్రకృతి అంటేనే బురిడీ. ఆకును అనుకరించే పురుగు దగ్గర్నుంచి ప్రత్యుత్పత్తి కోసం పన్నాగాల దాకా.

ఈ మధ్య ఒక విమర్శకుడు మీ రచనల పట్ల ద్వైదీ భావాన్ని వ్యక్తపరిచాడు. ఆయన తన సమీక్షలో… మీకు అపూర్వమైన తెలివి ఉంది గానీ, “సార్వజనీనం చేయగల మేధస్సు” లేదనీ, మీరు “భావాలంటే (ఐడియాస్‌ అంటే) అపనమ్మకం ప్రదర్శించే అదో రకం కళాకారుడనీ” తీర్మానించాడు.

ఓ మోస్తరు మేధావీ, లేదా ఉచ్ఛస్థాయి రసలుబ్ధుడూ మాత్రమే ఒక పుస్తకం గొప్పది అవ్వాలంటే అది గొప్ప భావాల్ని ప్రతిపాదించాలన్న అభిప్రాయానికి బంధీయై ఉంటాడు. నాకు ఆ సజ్జు గురించి బాగా తెలుసు. అలాంటి పాఠకుడు సామాజిక వ్యాఖ్యానం దట్టించిన ఇతివృత్తాలు కోరుకుంటాడు; తన ఆలోచనల్నీ ఆవేశాల్నీ రచయితలో వెతుక్కోవటాన్ని ఇష్టపడతాడు; రచనలో ఏదో ఒక్క పాత్రయినా రచయితకు చెంచాలా వుండాలని కోరుకుంటాడు. వాడు అమెరికన్ అయితే, వాడి రక్తంలో కాస్త మార్క్సిస్టు దృక్పథం పరిగెడుతూంటుంది; వాడు బ్రిటిష్ అయితే పరిహాసాస్పదమైన వర్గ స్పృహతో ఉంటాడు; ఫలానా రచయితలో సార్వజనీనమైన భావాలు కనిపించటం లేదంటే కారణం ఆ రచయితలోని ఫలానా భావాలు ఇంకా సార్వజనీనం కాకపోవటమేనేమో అని వాడు ఆలోచించడు.

మీరు కల్పన (ఇమేజినేషన్) ప్రాముఖ్యతను బాగా నమ్మే రచయిత ఐనా, మీ నవలల్లో కొన్ని చిరు వివరాలు మీ జీవితంలోంచి ఉద్దేశపూర్వకంగా ఎత్తుకొచ్చినవే అయి ఉంటాయి. ఆత్మకథాత్మకం కాని ఆ రచనల్లో ఆత్మకథకు చెందిన ఈ సూచనల గురించి మాట్లాడతారా?

కల్పన కూడా ఒకలాంటి జ్ఞాపకమే అంటాను. ఒక దృశ్యం (ఇమేజ్) వేర్వేరు అంశాల కూర్పుపై ఆధారపడి ఉంటుంది, ఆ కూర్పును సరఫరా చేసేదీ స్ఫురింపజేసేదీ జ్ఞాపకమే (మెమొరీ). ఒక విషయాన్ని స్పష్టంగా పునఃస్మరించుకోలగటాన్ని గురించి మాట్లాడుతున్నామంటే అక్కడ మనం మెచ్చుకుంటున్నది మన ధారణ సామర్థ్యాన్ని కాదు, సృజనకు ఎప్పుడోకప్పుడు అవసరమయ్యే ఫలానా అంశాన్ని అలా ఒక చోట నిలిపివుంచిన జ్ఞాపకపు అద్భుతమైన ముందుచూపుని. ఈ రకంగా చూస్తే జ్ఞాపకమూ కల్పనా రెండూ కాలగమనానికి ఎదురెళ్ళేవే.

నవలలు రాయటం ఆనందదాయకమా, వట్టి కఠిన శ్రమా?

పుస్తకాన్ని నా మనసులో కంపోజ్ చేస్తున్నప్పుడు ఆనందమూ, వేదనా రెండూ ఉంటాయి. రాయటానికి కూర్చున్నప్పుడు మాత్రం విపరీతమైన చిరాకు – అరిగిపోయిన పెన్సిల్‌ని తిరిగి చెక్కటం, కొట్టివేతల వల్ల రాసింది మళ్లీ తిరగరాయటం, తీర్చుకోక తప్పని లఘుశంక, నేను ప్రతీసారి తప్పు రాసే పదాన్ని తప్పక వెతికి సరి చూసుకోవాల్సి రావటం… ఇలాంటివి.

మీరు “సీరియస్” రచయితల్ని ఇష్టపడను అని ఎందుకంటారు? మీ ఉద్దేశం “చెత్త” రచయితల్ని అని కదా?

నా తత్వమే అనుకోండి, నేను గంభీరమైన భావాల మీదా, సీరియస్ అభిప్రాయాల మీదా నా కళని వృథా చేసుకోను; వేరేవాళ్ల రచనల్లో వాటి విస్తారమైన ఉనికిని ఇష్టపడను. నా నవలల్లో ఏ భావాలున్నా అవి నా పాత్రలకి చెందినవి, కాబట్టి అవి ఉద్దేశపూర్వకంగానే దోషభూయిష్టం కావొచ్చు.

*

(Image Courtesy: http://www.flickr.com/photos/dpcom/12084032926/)

Download PDF ePub MOBIePub

Posted in 2014, మార్చి, రచన కళ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.