softwarescaledtitled

సాఫ్ట్‌వేర్ ‘ఇతి’హాస్యం [11]

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

కారు మబ్బులు తేలిపోయాక సూర్యుడు ప్రకాశించినట్టు ,ఆత్మ హత్య ఆలోచన విరమించుకున్న అజయ్ లో ఏదో కొత్త ఆశ, ధైర్యం వచ్చాయి. ఏదో ఒకటి చేయగలడు, ఆ మాటకొస్తే ఏదైనా చేయగలడన్న నమ్మకం వచ్చేసింది. కానీ ఏమి చేయాలనే ఆలోచనే తట్టటం లేదు. మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ అదే పరిస్థితి. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. కానీ అజయ్ ఏ మాత్రం నిరుత్సాహాన్ని పొందలేదు.

ఒకరోజు వేణు ఫోను చేసి అమీర్ పేట రమ్మని చెప్పటంతో, అజయ్ అక్కడికి వెళ్ళాడు. “అమీర్ పేట్” ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్, చదివిన, చదువుతున్న వాళ్ళకి గుండె లాంటిదీ అమీర్ పేట. కృష్ణదేవరాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని అంటారు. అలానే అమీర్ పేటలో కోర్సులు రాసులుగా పోసి అమ్ముతుంటారు. మనకి కావాల్సిన కంప్యూటర్ కోర్సులను మనకు కావలసినన్ని రోజుల్లో, కావాల్సిన రేటుకు రాసులుగా పోసి అమ్ముతుంటారు. నేర్చుకునే వాడంటూ ఉండాలేకాని ఏదైనా నేర్పుతారు. ఎప్పుడు వెళ్ళినా అందమైన అమ్మాయిలతో, వాళ్ళని కాపలా కాసే అబ్బాయిలతో నిండిపోయి ఉంటుంది. దాదాపుగా అంతా జంటలు జంటలుగా తిరుగుతుంటారు, సినిమాలకైనా ,కోర్సులకైనా.

అమీర్ పేటలోని మైత్రివనము దగ్గరకు వెళ్లి అజయ్ వేణుకి ఫోను చేశాడు. పది నిముషాల్లో వేణు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆ మైత్రివనము వెనుక గల బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్ళారు. కుర్చీలు ,బల్లలు నిండి ఉన్న ఒక మూడు గదుల ప్రదేశాన్ని అజయ్ కి చూపించాడు వేణు. “ఇది నా స్నేహితుడొకడికి తెలిసినవాళ్ళది. ఇంతకుముందు ఇక్కడొక కంప్యూటర్ కోర్సులు చెప్పే సంస్థ ఉండేది. ఆర్ధిక మాంద్యం కారణంగా అద్దెలు చెల్లించలేక మూసి వేయాల్సి వచ్చింది. వీళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇంకా ఓ సంవత్సరం వీళ్ళే అద్దె చెల్లించాలి. కొత్తగా ఎవ్వరూ ముందుకు రావటం లేదు. మనకు తక్కువగా వచ్చేట్టు ఉంది. నువ్వు “ఊ” అంటే మనం తీసుకుందాం” అన్నాడు వేణు.

“మనం తీసుకొని ఏం చేద్దాం, కూర్చొని పదమూడు ముక్కలు ఆడుకుందామా?” అని అడిగాడు అజయ్. “అక్కడికే వస్తున్నా! ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితులు బాగుపడుతున్నాయి. మాంద్యం క్రమంగా మరుగున పడుతున్నది. నువ్వు ఎలాగూ మూడు ,నాలుగేళ్ళు ఈ సాఫ్ట్ వేర్ జాబ్ వెలగ బెట్టావు కదా ! నీకున్న ఆ నాలుగేళ్ల అనుభవంతో మనమే ఒక కొత్త బడి తెరుద్దాం. ఎలాగూ స్థలం తక్కువకు వస్తున్నది, కాబట్టి పిల్లలు రాకపోయినా మనకు నష్టం రాదు. ఆ గ్యారంటీ నాదీ !” అని వేణు భరోసా ఇచ్చాడు. ఇంతకు మునుపు పాఠాలు చెప్పిన అనుభవం ఉండటం చేతనూ, తనకు ఇంకో మార్గం లేకపోవటం చేతనూ తప్పక ఒప్పుకున్నాడు.

“కానీ ,మనం చెప్తామంటే వస్తారంటావా ?”అని అనుమానం వ్యక్తం చేశాడు అజయ్. “మనం ఏమి చెప్తున్నాము అన్నదానికన్నా ఎలా చెప్తున్నాము అనేది ముఖ్యం.నువ్వు సులభం గా చెప్పగలను అంటే చెప్పు ,మిగతా విషయాలన్నీ నేనే చూసుకుంటా” అని చెప్పాడు. అజయ్ సరే అన్నాడు. వేణు వెంటనే దానికి ఒక సంవత్సరానికి అద్దెకు తీసుకొనేట్టు ఒప్పందం రాయించుకొన్నాడు. పంతులుగారికి ఫోను చేసి మంచి పేరు, మంచి రోజు తెలుసుకొన్నాడు. వేణు తన పరిచయాలను ,తెలివితేటలను ఉపయోగించి పిల్లల్ని తీసుకురాగలిగాడు. తనకు తెలిసి స్నేహితులలో ఖాళీగా ఉన్న ఒక అమ్మాయిని “రిసెప్షనిస్ట్” గా నియమించాడు. అమీర్ పేటలో దాదాపు ఏ కంప్యూటర్ కోర్స్ కోసం వెళ్ళినా ముందు అమ్మాయిలు పలకరించి కూర్చోబెడతారు. కొంచెం పెద్ద సంస్థలైతే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలను కూర్చోబెట్టి మరీ స్వాగతం పలుకుతారు.

మొదటి విడత శిక్షణ మొదలు పెట్టాటానికి నెల రోజులు పట్టింది. యాభై మందికి పైగా పిల్లలు రావటంతో, తాము సగం విజయం సాధించామని ఇద్దరూ భావించారు. ఇక మిగిలింది, వీళ్ళకు శిక్షణ బాగా ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంటే చాలనుకున్నారు. లాభాలు రాకపోయినప్పటికీ నష్టం రాకుండా మొదటి మూడు నెలలు గడచాయి. పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మాంద్యం చాయలు పోయి పరిస్థితి అనుకూలంగా తయారు. తర్వాత ఆరు నెలలు లాభాలు సంపాదించారు. అజయ్ మళ్ళీ తన ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు.

లావణ్య కూడా అజయ్ దగ్గర శిక్షణ తీసుకోవాలని అనుకున్నది.అదే విషయాన్ని అజయ్ కి చెప్పింది. లావణ్యకు ప్రేత్యేక శ్రద్ధ తీసుకొని మరీ పాఠం చెప్పటం మొదలు పెట్టాడు. అదృష్టవశాత్తు అజయ్ కి మళ్ళీ ఒక అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం వచ్చింది. తమ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం అజయ్ ని ఆ కంపెనీ వాళ్ళు నియమించుకున్నారు. దానితో అజయ్ దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. రెండు చేతులా సంపాదించటం మొదలు పెట్టాడు. పొద్దునా ,సాయంత్రం వేణుతో కలిసి అమీర్ పేట లో, మిగతా సమయం ఆఫీసులో పనితో, క్షణం తీరిక లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.

Posted in 2014, మార్చి, సాఫ్ట్‌వేర్ ఇతిహాస్యం, సీరియల్ and tagged , , , , , , , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.