cover

పౌరుషం

Download PDF ePub MOBI

“రేపే పయానం. లేటు అయ్యారంటే టేషన్‌లో కూకుని ఏడాలి. ఆంబోతులా తల అడ్డంగా ఊపితే సరిపోదు. రేపు టైంకు ఏడాలి.” – కఠినమైంది అనలేం కాని కొంచెం మొరటి గొంతే వెంకటేశులిది. పదిమందికి బ్రతుకు దెరువు చూపిస్తుంటే, ఆ మాత్రం దర్పం సహజమేమో మరి!

“ఊరుకో నారాయణమ్మ. ఆరు పెద్దోరూ. మనబోటోళ్ళకి పట్నంలో పని ఇప్పిత్తారు. ఏం, నీ కొడుకు ఓ మాటంటే పడవా? ఆరిని అట్టే అనుకో. రేపు పన్లో పెట్టుకున్న ఆసామి ఏమీ అనకుండానే పని చేపించుకుంటాడా? సుబ్బమ్మ ఏదో పట్నం మొత్తం ఎరిగినట్టు చెప్తుంది అనుకోపోతే ఓ మాట! మీ ముసలోడ్ని అక్కడ పౌరుషానికి అదీ పోవద్దని చెప్పు. ముక్కు మీద కోపం ఉంటే అక్కడ సెల్లదు.” – సుబ్బమ్మ ‘ముసలోడు’ అనేసరికి ఏదో జెర్రి కుట్టినట్టు అమాంతం అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది నారాయణమ్మ.

సూర్యుడు చక్కబడేలోపు వంట అయిపోవాలి. తినేది నాల్గు మెతుకులే అయినా వేడిగా ఉండాలి నాయుడుకి. పక్కింటి ఏడుకొండలు ఇంట్లో నుంచి ఆరుగంటల నాటిక చూసి జనమంతా వచ్చేస్తున్నా, ఇవాళ నాయుడు ఇంకా ఇల్లు చేరలేదు. ఒక్కడే రామాయలం దగ్గర కూర్చున్నాడు అని గేదెల శ్రీను చెప్పితే అటుగా వెళ్ళింది నారాయణమ్మ. ‘ఈ టయింలో గుడి కాడకి వచ్చావేంటే ముండా!’ అంటాడేమో అని భయపడుతూనే వెళ్ళింది.

భూమికి, ఆకాశానికి ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు పైకీ కిందకీ చూస్తూ ఉన్నాడు నాయుడు. దగ్గరకెళ్ళి చెప్పే ధైర్యం లేక, అక్కడే ఆడుకుంటున్న కొండయ్య కాపు మనవడిని పిల్చి, ‘నానమ్మ భోజనానికి రమ్మంటుంది తాతా’ అని చెప్పమంది.

ఎప్పుడో అరవయ్యేళ్ల క్రితం తగిలించుకున్న బంధం వీళ్లది. కూరలో ఉప్పు ఎక్కువైందని మెట్టినింటి కొచ్చిన మొదటి రోజే కసురుకున్నాడు. అప్పట్నుంచి నాయుడంటే భయం పోలేదు నారాయణమ్మకి.

పెళ్ళయిన కొత్తలో పెద్ద ఉమ్మడి కుటుంబం వీరిది. తాతలు సంపాదించింది ఓ 60, 70 ఎకరాలు దాక ఉండేది. త్రాగుడు, పేకాట, దానధర్మాలు, ఇలా ఉన్నదాన్ని 30 ఎకరాలకి కుదించి మాంగారు పోయారు. అన్నదమ్ముళ్ళు అందరూ పంచుకోగా నాయుడు గారికి పది ఎకరాలు దాకా వచ్చింది. కూతురి పెళ్ళి, నారాయణమ్మ వంట్లో అదీ బాలేకపోవటం.. ఇలా ఓ ఐదు ఎకరాల దాకా తీసేయవల్సి వచ్చింది.

అప్పట్లో నారాయణమ్మ మాంగారుతో తిరిగి బాగానే వెనకేశాడు సలాది సూర్యారావు. సూర్యారావు కొడుకే వెంకటేశులు. పట్నంలో పనులకి మనుష్యుల్ని సప్లయి చేస్తుంటాడు. ప్రతి నెల తన కమిషన్ కట్ చేస్కోని వాళ్ళ జీతాలు ఇస్తాడు. వెంకటేశులు కూడా గట్టిగానే సంపాదించాడు. రెండో కూతురికి నలభై లక్షల దాకా ముట్టజెప్పాడు.

నాయుడికి పౌరుషం కాస్త ఎక్కువే. ఉంటే తగలేస్తాడు అనేమో, చెరో రెండున్నర రాసేసి, ఆరు నెలలు పెద్దోడి దగ్గరా, ఆరు నెలలు చిన్నోడి దగ్గరా ఉండండి అని కొడుకులిద్దరూ అంటే, అంత ఎత్తున వచ్చింది కోపం నాయుడికి. ఇళ్లుమట్టుకు ఉంచుకుని మిగిలిన ఐదు ఎకరాల పొలం రాసిపారేశాడు. ఇళ్లు తాను కష్టపడి కట్టుకుంది మరి.

ఊహ వచ్చినప్పట్నుంచీ ఎరిగిందేమో.. ఇప్పటికీ అప్పుడప్పుడు కాసేపు కూర్చుని వస్తుంటాడు పొలం దగ్గర. వెన్నెలకు చంద్రుడు పరాయివాడు అయిపోవటం అంటే ఇదేనేమో!

మొన్నటి దాకా వెంకటేశులు పొలాన్నే కౌలుకి తీసుకుని చేసేవాడు. కొడుకుల్లా వర్షాలు కూడా పలకరించటం మానేస్తే పొడుగు మీసాల నాయుడు మాత్రం ఏం చెయ్యగలడు? ఇస్తానన్న మొత్తం ఇవ్వకపోతే బాగుండదని తెగేసి చెప్పాడు వెంకటేశులు. నష్టమొత్తే నాకెందుకు అన్నాడు వెళ్తూ వెళ్తూ. ఇల్లు తాకట్టు పెట్టి కొంచెమైతే తీర్చాడు. నాయుడు కూడా బాగా వంగిపోయాడు. మునుపటిలాగా పని చేయలేకపోతున్నాడు.

ఆ రోజు సాయంత్రం భోజనం చేసేసిన తర్వాత వాళ్ళ అరుగు మీద కూర్చున్నాడు. రెండు పూటలకి ఒకే కూర తినడం ఈమధ్యనే అలవాటు చేసుకున్నాడు. కూర నచ్చకపోయినా నారాయణమ్మను ఏమీ అనటం లేదు.

“ఇలారా!” అని పిలిచాడు. వంటింట్లోంచి ఒక్క ఉరుకున వచ్చింది నారాయణమ్మ. “కూర్చో” అన్నాడు. అరవయ్యేళ్ల నాటి నుంచి అలవాటైన ఆలోచనే ఇప్పుడు ఆమెది. సందేహిస్తోంది. “ఫర్లేదు కూర్చో” అని కసిరేసరికి కూర్చుంది.

ఒక్క నిముషం పాటు ఏం మాట్లాడలేదు. మెల్లగా అన్నాడు. “ఆ సూర్రావు కొడుకు వెంకటేశంని అడిగితే పట్నంలో ఎమైనా పని చూత్తాడంటావ? ఆయనకు ఇవ్వాల్సిన దాన్ని నెల నెల తీసేసుకుని మిగిలింది ఇమ్మని అడుగుదాం అనుకుంటున్నాను. ఏం అంటావ్?”

కంట్లో నీళ్లుండగా, నోట్లో మాట ఎలా వస్తుంది ఆమెకు మాత్రం? ఒకరి కింద పని చేసి ఎరుగడు తన భర్త.

“నెల నెల తనకు ఇవ్వాల్సింది, తన కమీషన్ అన్నీ తీసేసుకొని మిగిలింది ఇత్తాను. ఇట్టం ఉంటే, యెల్లుండే పయానం” అన్నాడు నారాయణమ్మతో వెంకటేశులు.

ఇవాళే ప్రయాణం. ముందురోజు అంతసేపు గుడి దగ్గర కూర్చున్నా ఇంకా మమకారం చావలేదేమో. పొద్దున్నే అందర్నీ పలకరించటానికంటూ వెళ్ళిపోయాడు. కొడుకుల పొలం దగ్గర కాసేపు కూర్చున్నాడు. తను ఎప్పుడో అమ్మేసిన తన రెండు ఆవులకి గడ్డి కోసి వేసి వచ్చాడు.

లేటు అయితే ఎక్కడ వెంకటేశులు తిడతాడో అని నారాయణమ్మ భయపడుతూనే ఉంది. ఎంత బతిమాలినా, ఇంత అన్నం కూడా ముట్టకుండానే సంచులు రెండు తీస్కోని బయలుదేరాడు నాయుడు. ఎప్పటిలాగానే ఆయన వెనుక నారాయణమ్మ కూడా బయలుదేరింది. మండలం కూడా దాటనవసరం రాని నాయుడు హైద్రాబాదు పయనమయ్యాడు.

pourusham పచ్చని పొలాలు దాటుకుని, ఉరుకులు పరుగులు మాత్రమే నేర్చిన పట్నం చేరుకున్నారు దంపతులు. ఎవరో పట్నం బాబు వచ్చాడు. ‘వెంకటేశం అన్నీ చెప్పాడు’ అన్నాడు. ఉండటానికి చిన్న రేకులషెడ్డు ఏదో ఇచ్చాడు. చుట్టూ మురికివాసన. నారాయణమ్మ తనతోపాటు తెచ్చుకున్న తులసి మొక్కని మాత్రం కొంచెం మట్టి కనపడితే నాటింది.

పంచె తప్ప వేరే ఏం ఎరగని నాయుడు ఫ్యాంటు వేసుకున్నాడు. లక్షల కొద్ది డబ్బుని కాపలా కాయడానికి మూడువేల రూపాయల జీతం మీద పనికి కుదిరాడు. ఏటీయమ్ సెక్యూరిటీ గార్డు. డెబ్భై ఐదేళ్ళ నాయుడి మొదటి ఉద్యోగం. వ్యాను ఒకటి వచ్చి ఆగింది. ఫ్యాంటుతో కాస్త ఇబ్బంది పడుతూనే, అది ఎక్కి వెళ్ళిపోయాడు డ్యూటీకి.

సాయంత్రం ఆరు అవుతుంది అనుకుంటా. పొద్దున్నుంచి నాయుడేం తినలేదు. ఎవరో కుర్రాడు వచ్చాడు. ‘తాత బండి ఎక్కు’ అని నాయుడిని ఎక్కించుకున్నాడు. సరాసరి హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. నారాయణమ్మ చచ్చిపోయింది. ఎక్కడ తెస్తాడు అనుకుందేమో మరి, గుండె రోగం ముదిరి పాకాన పడినా హాస్పిటల్‌కు తీసుకువెళ్లమనలేదు. పొద్దున్నుంచి నాయుడేం తినలేదు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, మార్చి and tagged , , .

2 Comments

  1. కథ మంచి చెడ్డల జోలికి పోవడం లేదు. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. ఆ ముసలామెది అనారోగ్యపు చావులాగా అనిపించలేదు. రచయిత హత్య చేసినట్టు అనిపించింది. కథను గుండెను పిండేశేలా చేయడం కోసం కావచ్చు!
    ”రెండు పూటలకు ఒకే కూర తినడం ఈ మధ్యనే అలవాటు చేసుకుంటున్నాడు” అని రాశారు. ఇది కూడా తూకంలో ఒకవైపు బరువు పెంచడం కోసం త్రాసులో రచయిత పెట్టిన వాక్యం అనిపించింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.