ms naidu

అస్పర్శ

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

6

ఒక కాఫ్కా రాత్రి రహస్యం లోని ‘అది’ స్థానంలో రాత్రిలాగ చీకటిగా, అదృశ్యంగా, భయానకంగా, అగోచరంగానూ ఉండే ఏ మూర్తినైనా, అది బొమ్మకట్టే ఏ అనుభవాలనైనా ప్రతీకలుగా ఊహించుకొని కవితని పునర్నిర్మించుకోవచ్చును. కాని ఆ పఠనానుభవం kafkaeqsque కూడా అయ్యుంటేనే పూర్తి స్థాయిలోన రక్తి కడుతుంది. ఈ కాఫ్కాతనం ఏమిటి? స్థూలంగా చెప్పాలంటే సంధి లాగ, పీడకల లాగా సంక్లిష్టంగా, అనూహ్యంగా, భయానకంగా ఉండే అనుభవం. అలవాటుగా కట్టుకున్న ప్రణాళికల్నీ, నమ్ముకున్న వ్యవస్థల్నీ అదాట్న, అనూహ్యంగా ముక్కలు చేసే ఒక అతీతశక్తి ఎదురుగా విహ్వలుడై నిలబడిన మనిషి అనుభవం అది. అది ఓ రాత్రి వేళ వాలి “తన పని తాను పూర్తి చేసుకో”డానికి తెగబడుతుంటే మనిషి నిస్సహాయంగా చేష్టలుడిగి ఊరకుండిపోడు. తన శక్తంతా కూడదీసుకుని ప్రతిఘటిస్తాడు. కాని చివరికి అతను ఆ శక్తి ముందు పరాజితుడు. ఈ విషయాన్ని గురించి కాఫ్కా జీవిత చరిత్రకారుడు (Franz Kafka: Representative Man) Frederick R. Karl మరింత వివరిస్తున్నారు. (http://www.nytimes.com/1991/12/29/nyregion/the-essence-of-kafkaesque.html). స్వయంగా కాఫ్కా కూడా At Night అని ఇలాంటి రాత్రి రహస్యపు దృశ్యాన్నే ఒక కవితాత్మకమైన ఖండికలో వర్ణిస్తారు. నిద్రాణమైన రాత్రి ఖాళీతనాన్ని, స్తబ్ధతను వర్ణించే ఈ ఖండిక చివర్లోన ఎవరో రహస్యంగా రాత్రినీ, నిద్రించే మనుషుల్నీ గుచ్చి గుచ్చి చూస్తున్నారన్న సూచనతో ముగుస్తుంది. త్రిపుర కాఫ్కా కవితలకు మూలం కాఫ్కా నోట్‌బుక్స్ అని నాతో అన్నారు. ఈ కవితకు ప్రేరణ బహుశ ఈ At Night అయి ఉంటుంది. ఇలాగ Kafkaesque అనదగిన అనుభవ సంచయానికీ, రాత్రివంటి చీకటి అనుభవానికీ, అనూహ్యమైన మార్మికతకూ బద్ధమయ్యే ఉండే అనుభవాలూ, వాటీ స్వరూపాలూ ఏమేమా అని తల్చుకుంటే పది రకాలవి వేర్వేరు అనుభవాలు తోస్తాయి.

శిల్పం, చిత్రలేఖనం, డిజైన్ వంటి సృజనాత్మక కళల్లో పట్టాల కోసం ప్రవేశ పరీక్షలుంటాయి. వాటిలోన అభ్యర్ధి సృజనాత్మకతను పరీక్షించడానికి ఒక ప్రశ్న ఇస్తారు. అదేంటంటే వాళ్ళు ఇచ్చిన రూపాన్ని ఒకదాన్ని తీసుకొని దాన్ని ఆలంబనగా ఎన్ని ఎక్కువ వస్తువుల్ని ఊహించి, పేర్కొనగలరు? అని. అంటే – ప్రశ్నగా వర్తులాకారం (Circle) అని ఇస్తే గుండ్రంగా ఉండే వస్తువులన్నింటినీ గబ గబా పేర్కోవాలి – గుండీ, పళ్ళెం, టైరు, దోశ, చంద్రుడు … ఇలాగ. ఈ జవాబు లోని వైవిధ్యాన్ని, విస్తృతినీ బట్టి ఆ అభ్యర్ధి సృజనాత్మకతను గురించి ఒక అంచనాకి వస్తారు. ఇచ్చిన ప్రశ్న ఒకే ఒక్క రూపం అయితే దానికి జవాబులు అనేకం, నిర్ధిష్టమైన ఆకారాలు.

సృజనాత్మకమైన ఊహ పూర్వజ్ఞానానికీ, పూర్వానుభవానికీ బద్ధమై ఉంటుంది. వర్తులాకారానికి ఉదాహరణలు చెప్పు? అని ఎవర్ని వాళ్ళం ప్రశ్నించుకుని, జవాబులు రాసి చూస్తే ఆ పట్టిక నుండి వ్యక్తిగతమైన అనుభవాలు, వాళ్ళ కులం, వృత్తీ, అభిరుచులూ ఇలాంటివి పోల్చుకుని చెప్పడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక సైకిల్ షాపులో పని చేసే అబ్బాయిని వర్తులాకారానికి ఉదాహరణలు చెప్పమని ప్రశ్న అడిగితే అతనికి బహుశ టైరు, బేసిన్, మిర్రర్ ఇలాగ వెంటనే తడతాయి. అదే హొటల్లో పనిచేసేవాడైతే పళ్ళెం, చెంబు, గోలెం, పెనం, పూరీ ఇలాగ. అలాగే పాఠకుల ప్రాపంచిక అనుభవాలు, కులం, వృత్తి, ప్రవృత్తి, వయసు, లింగం, మతం వంటి పార్శ్వాలూ వాళ్ళ పఠనానుభవాన్నీ విశేషంగా ప్రభావితం చేస్తాయి. ఇలాగే, కవి ప్రకటించిన కవితని ఒక ప్రశ్న లేదూ ప్రహేళిక అనుకుంటే ఒక్కొక్క పాఠకుడూ రక రకాలుగా దాన్ని పునర్నిర్మించుకునే తీరులన్నీ దానికి విభిన్నమైన ‘సమాధానాలు’ లేదూ realizations. ఈ అనువాదాత్మకమైన అనుభవంలోని వైవిధ్యాన్ని ప్రభావితం చేసేవి కవి తరపున మూల కవిత పాఠం, పాఠకుడి తరపున ఊహా శక్తి, సృజనాత్మకత, పూర్వ జ్ఞానం, జ్ఞాపకాలు, ఆకాంక్షలు ఇటువంటి ఆంతరంగిక సామగ్రి.

మార్మిక కవిత, అధివాస్తవిక కవితా వాటి పునర్నిర్మాణంలో పాఠకుడి అనుభవంలో, ఊహలో ఇలాంటి వైవిధ్యానికీ, విస్తృతికీ ఎక్కువ ఆస్కారం ఇస్తాయి. వాస్తవికమైన కవితల్లోన ఈ వెసులుబాటు ఇంత ఎక్కువగా లేదు. ఉదాహరణకు వేయి పిర్రల సముద్రం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి కవితలను ఎందరు పాఠకులు చదివినా ఒకటి రెండు రకాలుగా మాత్రం పునర్నిర్మించుకోగలరు. ఎంచేతంటే కవి వాటి నేపథ్యం, వస్తువు, సన్నివేశాల ‘వాస్తవాన్ని’ స్థల కాలాదులూ, నామ రూపాలని ప్రత్యక్షంగా వాచ్యంగానో, లేదు ప్రతీకాత్మకంగా అలంకారాలుగానో రక రకాలుగా వాడుకుని కవిత రంగానికి ఒక్కటే నిర్ధిష్టమైన దృశ్య పటాన్ని స్థిరం చేస్తున్నారు. మార్మిక కవి, అధివాస్తవిక కవీ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కవిత్వ పరికరాల్ని ఇంత విరివిగా వాడుకోకుండా విడిచిపెడుతున్నారు.

ఒక కాఫ్కా రాత్రి రహస్యం కవితను చదువుకునేటప్పుడు అనేకమైన అనుభవాలు గోచరించడానికి ఆస్కారం ఉంది. వాటిలో మచ్చుకి ఒక పది: మొదటిగా అది నిజంగానే ఒక లోహ విహంగం; ఇంకా కాలం, విధి, యుద్ధం, మృత్యువు, కరువు, లోకం, కామం, దు:ఖం, అహం వీటిలో ఒక్కోదానికీ ‘అది’ ప్రతీక. ఈ పదీ కాక చాల నౌతాలుగా ఉండే అనుభవం ఒకటి ఉంది, అది తరవాత చివర్లో చెప్తాను.

వీటిలో మొదటిది – ‘అది’ నిజంగానే ఒక విచిత్రమైన లోహ జీవి. ఓరాత్రి వేళ ఎక్కడిదో అపరిచిత విచిత్ర సీమ (fantasy land) నుండి వాలి “తన పని” పూర్తిచేసుకుంటుంది. కవిత వాచ్యంగా ఏ స్వరూపాన్నైతే చిత్రిస్తున్నాదో అదే అది! బూడిదరంగు రెక్కలతో మాటు వేసి గబ్బిలంలాగ ఎగిరొచ్చి వాలి, తను వేటాడబోయే నగరపు వీధులకీ కట్టడాలకీ ఆఖరి సమయం వచ్చిందో లేదో పరీక్షించి మరీ తన విధ్వంస కాండని చప్పుడు కాకుండా పూర్తి చేసుకునే భయానకమైన జంతు విహంగం – ఒక డ్రాగన్. The poem literally means what it says. ఈ మనోదృశ్యాన్ని అంగీకరించి, అనుసరించ గలిగితే మొత్తం కవితను పాఠకుడు ఇలా పునర్నిర్మిచుకోవచ్చును. ఈ దృశ్యాభాసలో కవిత స్థలం ఒక ఆధునిక నగరం, కాలమేమో ఓరాత్రి వేళ. దాని ఇంజిన్ల పిష్టన్లూ వంతెనల గర్డర్లూ ఆధునిక నాగరికతకే ఆయువుపట్టులు. “నగరాల దీపాల” మీదికి ఆ డ్రాగన్ అరాచకానికి వత్తాసుగా ఆఖర్న రాత్రి నక్షత్రాలు చిమ్మట పురుగుల్లా వచ్చి వాలుతున్నాయి. పగలల్లా తన యాంత్రిక బలంతో రక రకాల పనుల్లోన విజృంభించి అలసిపోయిన నగరం రాత్రి పూట వంతెనల గర్డర్లని చాపుకుని, ఇంజిన్ల పిష్టన్లు మగత నిద్రలో ఆవలిస్తుంటే కునికిపాట్లు పడుతున్నాది. నిజానికి ఈ చేష్టలు నిర్జీవులైన ఇంజిన్లకీ, పిష్టన్లకీ, గర్డర్లకీ సాధ్యమయ్యేవి కావు. అవి నగరమూ, నాగరికులైన మనుష్యులూ, పగలల్లా విజృంభించి రాత్రికి మగతగా తలొగ్గే వాళ్ళ నాగరికతా – వీటి ప్రవర్తనకు, అంతిమంగా నిస్సహాయతకు ప్రతీకలు. ప్రస్తుతం ఇలా స్థల కాలాల్ని పునర్మించుకుంటున్న కవి త్రిపుర కాదు, నేను.

ఈ పునర్నిర్మాణంలో నేను దర్శించే నగరం ప్రధానంగా విశాఖపట్నం! అక్కడి పాత నగరం, ఇనప ఖనిజాల కన్వేయర్ వంతెనలూ, మగతగా పడుకున్నట్టుండే పాత పురాణీ పడవల గుడ్డి దీపాల హార్బరు, పాత రైలు బ్రిడ్జిలూ, వంతెనల కింద పడుక్కుని కునికిపాట్లు పడే మనుషులూ, ఈ మొత్తం దృశ్యం చుట్టూ జేగురు రంగు ధూళి, బుగ్గీ, గంధకం, బొగ్గుల ఆవరణల్లోని రాత్రీ ఇదీ నేను నిర్మించుకొనే కవితా స్థలం, సందర్భం. దీని మీద చిలవలూ పలవల్లాగ ఇంకేవేవో నగరాల్లో ఎప్పుడో నేను చూసిన ఇంజిన్లూ పిష్టన్లూ పెద్ద పెద్ద వంతెనల గర్డర్లూ ఇలాంటివి ఈ దృశ్యాన్ని ఉద్దీపనం చేస్తాయేమో గాని, ప్రధమంగా నేను చూసేది మాత్రం ఈ పాత వైజాగు. ఎందుకు? అంటే సృజన పునర్నిర్మాణానికి మనం వాడుకునే సరంజామా (Cognitive Apparatus) ఒక్కో పాఠకుడికీ అతని అనుభవాలకూ, జ్ఞాపకాలకే ప్రత్యేకమైనది. అంతే కాక అది మౌలికంగా చిన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు – అంటే బాల్య స్మృతుల వలన విశేషంగా ప్రభావితం అయ్యేది. బాల్య స్మృతులు రాయడం, చదవడం వంటి సృజన వ్యాపారాలని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఎందరో సృజనకారులు చెప్పుకున్నారు, కొంతవరకు శాస్త్ర చర్చ కూడా ఉంది. బాల్య స్మృతి నుండి ఆ సామగ్రి దొరక్కపోతే అప్పుడు తదుపరి జీవితానుభవం నుండి వాటిని వెదుక్కుంటాము. ఉదాహరణకు ఈ కవితలోని జంతు విహంగాన్ని నేను డ్రాగన్, రాక్షసి బల్లి వంటివి సినిమాలూ బొమ్మల్లో చూసిన స్వరూపాలనుండి స్వీకరించి బొమ్మ కట్టుకుంటున్నాను; ఇవి బాల్య స్మృతుల్లోనివి కావు. సరే కారణాలు ఏమైతేనేమీ ఇవి కవిత స్థల కాలాదులు.

నాగరికత ఇనప రేకులతో కట్టుకున్నది. స్పష్టత, ప్రణాళిక, అలుపెరుగని పనీ, కోరుకున్నవి సాధించుకోడానికి ఇంజిన్లూ, అడ్డంకుల్ని అధిగమించడానికి వంతెనల గర్డర్లూ ఇవన్నీ తనకి ఉన్నాయన్న స్పృహా ఇవి నగరపు పగటి లక్షణాలు. దాని మీద వాలిన జీవి ఇదివరకు చెప్పిన కాఫ్కాతనం మూర్తీభవించిన అతీత శక్తి. అది రక్త సిక్త హస్తాలతో తన పని పూర్తి చేసుంటుందీ అని చదివితే రాత్రుళ్ళు మహా నగరాల్లో జరిగే రక రకాల నేరాలూ, ప్రమాదాలూ, చావులూ, చీకటి తప్పులూ జ్ఞప్తికొస్తాయి, నిస్సహాయమైన ఎరల్ని చంపి తినే క్రూర జంతువుల నెత్తుటి చేతులూ నోళ్ళూ గోచరిస్తాయి. ఆ డ్రాగన్ దాని కసిదీరా నగరాన్నీ దాని భౌతిక, బౌద్ధిక నిర్మాణాలనీ వేటాడి, ఆఖరు హెచ్చరిక లాగ తనతో ఆకాశంలో సాహచర్యం చేసే నక్షత్రాల చిమ్మట పురుగుల చేత నగరపు చెవుల్లోకి తన విధ్వంసపు రహస్యాన్ని ఊదించి దాని కళ్ళు చల్లబడ్డాక నిష్క్రమిస్తుంది.

స్వయంగా త్రిపురైతే ఈ కవిత ఇతివృత్తం ఏమని చెప్తారు? పైన చెప్తున్న వివిధమైన భాష్యాలకి ఎలా స్పందిస్తారు? ఆయన బహుశ మొదటి వ్యాఖ్యనే ఎక్కువగా ఒప్పుకుంటారని అనుకున్నాను. అంటే The poem literally means what it says! – అంతేనని. అంతకు మించి ఊహించే వ్యాఖ్యానాలు ఆయనకి బహుశ రుచించవు. ఇది నాకెలా తెలుసూ అంటే దానికో కథున్నాది. చాన్నాళ్ళ కిందట త్రిపుర అప్పుడే కాఫ్కా ముసలి పడవల చిన్న సభ అని ఒక కవిత పూర్తయితే దాన్ని నాకు పంపించేరు:

.

కాఫ్కాముసలిపడవలచిన్నసభ

.

ఓ నాలుగు ముసలి పడవలు

సముద్రపుటొడ్డున కూచున్నాయ్

ముసలి మూతులు దగ్గరగా లాక్కుని

చప్పుడు చెయ్యకుండా

ఒక చిన్న సభ పెట్టుకుందామన్నట్లు

.

వాటికి చాలా విషయాలు తెలుసు

ముసలి పడవల కన్నీ తెలుసు

కొనదేరిన పొడుగు దేహాలతో

యిసుక మీద

తీరుబడిగా కూచున్నాయ్

.

వాడి ప్రక్కటెముకలు

నల్లగా మెల్లగా కుళ్ళుతూ వున్నాయ్

కాని చక్కగా కుదురుగా కనిపిస్తున్నాయ్

వాట్ని నీట్లో కదలడానికి కట్టేరు

నీట్లో హింసించడానికి కట్టేరు

నీటి సంగతి వాటికి తెలిసినంత

ఎవరికీ తెలియదు

.

ఆ చిన్న సభలో తీరుబడిగా

ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాయ్

ముసలి మూతులు కదిలించకుండానే

రోజంతా అక్కడే అలాగే కూచున్నా

ఏ నిర్ణయానికీ రాలేదు

.

నేలంటే వాటికి ప్రేమ

ముప్పాతిక భాగం నీట్లోనూ

ఒక పాతిక భాగం యిసుక మీద

ముసలిపడవలు

ముచ్చటగా మూతుల్తో

నేలని ప్రేమిస్తూ

నీట్లోకి తప్పనిసరిగా లాగబడుతూ

.

ఏ కష్టం చెప్పుకోలేకుండా

.

ఇలా ఉంటుంది ఆ కవిత. అది నాకు, మా ఆవిడకీ చాల నచ్చింది. మా ఆవిడ ఆ కవితకి ఒక బొమ్మ వేసింది, ఒక పత్రికలో ప్రచురణ కోసం. ఓ నాలుగు పడవలు సముద్రపొడ్డున పక్క పక్కనే పడున్నట్టు బొమ్మ. నేను కవితని చదివి అది నిజానికి రిటైరయిపోయి పార్కుల్లో బీచొడ్డున బెంచీల మీదా సాయంకాలాలు ఏమీ ఎక్కువ మాటాడకుండా ఊరికే కూర్చునుంటారు పెద్దవాళ్ళు – అలాంటి వాళ్ళని గురించని అనిపించింది. అలాగని త్రిపురతో అంటే ఆయన తన ఉద్దేశం అలాగేం కాదనీ, అది నిజంగానే కేవలం ‘ముసలి’ అయిపోయిన పడవలు పెట్టుకున్న చిన్న మీటింగు గురించి మాత్రమేననీ అన్నారు! అందుకని మా ఆవిడ వేసిన బొమ్మ ఆయనకి చాల నచ్చింది. అంచేత త్రిపురని గనక ఈ కాఫ్కా రాత్రి రహస్యం గురించి అడిగితే దాన్ని కూడా ‘అది వాచ్యంగా ఏం చెప్తోందో అదే దాని ఉద్దేశం!’ అని చెప్పి ఊరుకునేవారేమోను. అయితే ఇతరుల పఠనానుభవాల్నీ, జీవితానుభవాల్నీ, అవగాహనల్నీ వాటిలో ఉండే అతివేలమైన వైవిధ్యాన్నీ ఆయన బేషరతుగా ఒప్పుకునేవారు, గౌరవించేవారు. అది సహజం కాబట్టి. ఎలా ఉన్నవాళ్ళు అలాగ ఉన్నారు, అలాగే ఆలోచిస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఈ వైవిధ్యాన్ని ఒప్పుకుని, వ్యక్తం చేసుకోవాలని ఆయన ప్రోత్సహించేవారు కూడాను. మల్లినాధ సూరి వ్యాఖ్యానానికీ, అన్వయానికీ ఒక నియమం లాగ చెప్పేరుట. అదేమిటంటే కావ్యం మూల పాఠంలో చెప్తున్న విషయానికీ, వర్ణనకీ విధేయంగా మాత్రమే వ్యాఖ్య చెప్తాను తప్ప, అంతకు మించి ఊహించే చొరవ తీసుకోనూ అని. ఇది వాస్తవికమైన కవిత్వానికీ, వర్ణనలకూ అయితే సరిపోయింది కాని, మార్మిక కవితకూ, అధివాస్తవిక కవితకూ ఎలా నప్పుతుంది?

మాకు తెలిసిన పెద్దాయన ఒకరు చిన్నతనంలో కరువుని అనుభవించేరు. ఆయన చిన్నప్పుడు చుట్టూ కరువు గురించి భయపడ్డం, ఉన్న కొంచెం తిండి వస్తువుల్నే జాగర్తగా వాడుకోవడం, కరువొచ్చి మనుషులు చచ్చిపోవడం ఇలాంటివన్నీ చూసేరు, విన్నారు. ఆయన దగ్గర భోజనం తిండీ ధరలూ వీటి ప్రస్తావన వచ్చినప్పుడల్లా పాపం కరువునే గుర్తు తెచ్చుకునే వారు. “అమ్మో! కరువొచ్చెస్తుంది!!” అని చాలా పొదుపుగా ఉండాలనీ ఇలాగ. ఇంకా కాలేజీ రోజుల్లోన మా స్నేహితుల్లోన కొందరు కులం స్పృహతో రగిలిపోతుండేవాళ్ళు తారసిల్లేవారు. వాళ్ళ మాటల్ని బట్టి వాళ్ళు కుల వివక్షకి, అవమానాలకీ గురయ్యేరని తెలుస్తుంది. వాళ్ళ జీవితానుభవం, సృజనానుభవమూ కుల వివక్షను గురించి స్పృహ చేత ప్రభావితం అయ్యుంటాయి. వాళ్ళు కనక కాఫ్కా రాత్రి రహస్యం చదువుకుంటే ఆ భయానకమైన మూర్తిని కులం రక్కసి అని తలచుకోవచ్చు.

సృజనానుభవానికి మౌలికమైన ఈ వైవిధ్యం నేపథ్యం లోన ఇదివరకు చెప్పుకున్న పది రకాలవీ ప్రతీకాత్మకమైన అనుభవాల్ని పరామర్శిస్తే – కాలం, విధి, యుద్ధం, మృత్యువు, కరువు, లోకం, కామం, దు:ఖం, అహం – ఇలాంటివాటిలోంచి పాఠకుడి మనసుకు, అనుభవానికీ, అభిరుచికీ దగ్గరగా పట్టేది ఏదో ఒక అనుభవాన్ని ప్రతీకగా, ఆలంబనగా ఆ కాఫ్కా రాకాసిని పునర్నిర్మించుకుంటూ కవితను దృశ్యాభాస చేసుకోవచ్చును. ఇవన్నింటినీ వివరంగా చర్చించాలంటే చాల పొడుగవుతుంది. అందుకని, ఈ పదింటిలో నా మనసుకు దగ్గర, నా అభిరుచికి మౌలికమైన వస్తువును ఒక్కదాన్ని మాత్రం ఎంచుకొని ముగిస్తాను. అది అహం. ధూర్జటి వర్ణించిన మనో మృగమ్ము. ఒక కాఫ్కా రాత్రి రహస్యం కవితలో వర్ణిస్తున్న రాత్రి ఈ దృశ్యాభాసలోన పగలు! ఎందుకంటే మనోమృగం రాత్రుళ్ళు పడుక్కుంటుంది, పగలు – అంటే నగరాలు, మనుషులూ – మానవ ప్రపంచం అంతా పొద్దున్నే మేలుకోగానే ప్రతి ఒక్కరి అంతరంగ భూమి మీదా ఈ మృగం వాలి, అహాన్ని మేల్కొలుపుతుంది. ఈ అంతరంగ భూమి “అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరీ” అని సౌందర్యలహరిలో వర్ణించిన వంటి తిమిర భూమి. అంచేత దాని రాత్రి మనం పగలు అని వ్యవహరించేది. మన రాత్రి వేళ అది, అంటే అహం పడుక్కుంటుంది, అచేతనంగా ఉంటుంది. పొద్దున్నే అహంకారం మేల్కొనేది చీకట్లోనికి – అంటే ధూర్జటి వర్ణించిన అజ్ఞాన తిమిరం లోనికి. ప్రతి మనిషి అంతరంగాన్నీ అది తడిమి తడిమి పరీక్ష చేసుకుంటుంది, వాటిలో ఎవరికి “ఆఖరి సమయం” వచ్చిందోనని. అహంకారాన్ని అడ్డుకొని ఏ కొంతైనా ఆసుకోగలిగే ఇంజిన్ వివేకం. అది ధ్యాస జాగృతమై ఉన్నప్పుడు మాత్రం పని చేస్తుంది, లేనప్పుడల్లా మగతలో పడి ఉంటుంది. పూర్తిగా తమస్సులో చిక్కుకున్న అంతరంగాలని మనో మృగం ఇలాంటి ఓరాత్రి వేళ వేటకి ఎంచుకొని మగత నిద్రలో ఉన్న వివేకం పనిబట్టి రక్త సిక్త హస్తాలతో “తన పని పూర్తి చేసుకుంటుంది”. రక రకాల మనోవ్యాపారాలు మనోమృగం అనుచర గణం. అవి తళుకులీనే బహిర్వృత్తులు గాను, అందం, తెలివి, చదువు, పాండిత్యం, పదవి, కీర్తి, సంపద వంటి ప్రకాశమానమైన లక్షణాలుగానూ పగటి ప్రపంచం – అంటే కాఫ్కా రాత్రిలో ప్రకాశిస్తున్నవి. అవి మనోమృగం చేస్తున్న దాడిలో చిమ్మట పురుగుల్లాగ అంతరంగం మీద వాలుతూ అహంవృత్తి విధ్వంసపు రహస్యాన్ని భూమి – అంటే మనో భూమిక చెవుల్లోకి ఊదుకుంటూ నిష్క్రమిస్తాయి. రాత్రి మనకు కలిగే నిద్ర అహానికి తాత్కాలికంగా విశ్రాంతి.

ఇలాగ ఎక్కడెక్కడివో allusions నుండి ఎత్తి తెచ్చుకుంటూ నిర్మించుకునే దృశ్యం నాకు బావుంటుంది. నేను చూసేలా చూడగలిగే వాళ్ళకు బహుశ ఈ నిర్మాణం, దృష్టీ ఒప్పుతాయి. అలాంటి ఆసక్తి లేనివాళ్ళకి ఇది బహుశ బేసబబుగా, విడ్డూరం లాగా ఉంటుంది. ఆ మిగతా తొమ్మిది ప్రతీకలనూ పురస్కరించుకొని ఇలాంటి దృశ్యాభాసల్ని గురించి ఆలోచించి చూసుకోవచ్చును. ముఖ్యంగా కాలం, విధి, మృత్యువు, దు:ఖం వంటివి సార్వజనీనము, సర్వ కాలీనమైన Kafkaesque అనుభవాలు. వాటిని ప్రతీకలుగా చేసుకొని, పైన వివరించినట్లు ఈ కవితను దర్శించడం అంత కష్టమేమీ కాదు.

చివరిగా ఒక నౌతాలు సంగతి. మా అక్క, ఇంకా స్నేహితులూ వాళ్ళకి కాలేజీల్లో హాష్టళ్ళుండేవి. హాష్టళ్ళకి వార్డెనమ్మలు ఉంటారు. వాళ్ళలో కొందరు చాల కర్కోటకంగా, కఠినాత్మురాళ్ళుగా తయారయ్యి, చీటికీ మాటికీ అన్యాయంగా హాష్టల్ పిల్లలని కోటరిక్కం పెడతారు. వాళ్ళంటే హాష్టల్లో పిల్లలకి హడల్. బ్రహ్మ రాక్షసి అని పిల్చుకుంటారు. ఈ కవితలోని ‘అది’ అలాంటి ఆడపిల్లలల హాష్టల్ వార్డెనమ్మ అనుకుని నవ్వుకున్నాను. ఆవిడ ఎత్తుగా లావుగా స్టీలు చెంకీల చీర కట్టుకుని, బెత్తం పుచ్చుకుని రాత్రయ్యే సరికీ హాష్టల్ వరండాల మీద వాలుతుంది, తన పరిచారికలతో సహా. ప్రతీ ఒక్క గదీ, ప్రతీ ఇనప మచం, ప్రతీ పిల్లా పడుకుని ఉన్నాయో లేదో పరీక్ష చేసుకుంటుంది. జడిసిపోతూ, నవ్వాపుకోలేక టక్కు పెట్టి పడుకున్న అమ్మాయిల్ని ప్రత్యేకంగా చెవులు మెలేసి మరీ లేపించి వాళ్ళు దాచుకున్న నవలలూ, తిండి సామాన్లూ, మేకప్ వస్తువులూ ఇలాంటివన్నీ జప్తు చేసి, వాళ్ళ మీద రాక్షసంగా కేకలేసి “తన పని” పూర్తిచేసుకుంటుంది. ఈ విధ్వంస కాండ పూర్తయ్యేక పోతూ పోతూ ఆవిడ పరిచారికలు పెద్ద గొంతుకలతో అన్ని గదుల్లోకీ వినిపించేలాగ వార్డెనమ్మ గారి రూల్సన్నీ హాష్టల్ పిల్లల చెవుల్లోకి ఊదుకుంటూ వెళిపోతారు. దీన్లో కాఫ్కాతనం ఏమీ లేదు, కొంటెతనమే ఉన్నాది.

(ఇంకా ఉంది)

Download PDF ePub MOBI

Posted in 2014, మార్చి, వ్యాసం and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.