cover

బుక్ ఇంటర్వ్యూ: వై. బి. సత్యనారాయణ తో…

Download PDF ePub MOBI

వై.బి. సత్యనారాయణ రాసిన “మై ఫాదర్ బాలయ్య” అనే పుస్తకం అంతర్జాతీయ పబ్లిషర్స్ “హార్పర్ కొలిన్స్” వాళ్లు 2011లో ప్రచురించారు. దీన్ని పి. సత్యవతి తెలుగులో “మా నాయన బాలయ్య” పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తకంలో సత్యనారాయణ తన దళిత కుటుంబపు మూడుతరాల చరిత్రని వెనక్కి వెళ్లి చెప్పుకుంటూ వచ్చారు. ఈ పుస్తకం పెద్దగా చిత్రింపబడని దళిత జీవితాల చరిత్రని మన కళ్లముందు ఉంచుతుంది. అంటరానితనం నేపథ్యంలో ఆ కుటుంబం చదువునే ఆలంబనగా చేసుకుని ఎలా ఎదిగిందో చూపిస్తుంది. అంతర్జాతీయంగా ఈ పుస్తకానికి మంచి ప్రశంసలు వచ్చాయి. రచయిత వై.బి సత్యనారాయణ 1971లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ తీసుకున్నారు. ముప్ఫైమూడవ ఏటనే హైదరాబాద్‌లోని ధర్మవంత్ సైన్స్ అండ్ కామర్స్ కాలేజీకి ప్రిన్సిపల్ స్థానాన్ని పొందారు. 25 సంవత్సరాలు అదే పదవిలో అక్కడే కొనసాగారు. రిటైరయ్యాక ప్రస్తుతం హైదరాబాద్‌లో “సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌”కు అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఇంటర్వ్యూ “మా నాయన బాలయ్య” పుస్తకాన్ని నేపథ్యంగా తీసుకుని సాగింది. ఈ పుస్తకంపై మెహెర్ సమీక్ష ఇక్కడ:

ఈ పుస్తకం రాయాలనిపించటం వెనుక ఆలోచన చెప్పండి?

నాకు రాసే అలవాటు చిన్నప్పణ్ణించీ ఉండేది. నేను బియస్సి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు తెలుగులో ఒక నవల కూడా రాశాను. అప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు దాని మీద ఒక రొమాంటిక్ నవల రాశాను. హీరోయిన్ మిలట్రీ నర్సు, హీరో ఫైలట్ ఆఫీసరు. ఇంకా ఆ మాన్యుస్క్రిప్టు అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు నాకది రిలవెంట్ అనిపియ్యట్లేదు.

ఈ పుస్తకం ఉద్దేశం మాత్రం నా రెండో అన్నయ్య అబ్బసాయిలు బతికున్నప్పుడే వచ్చింది. ఆయన సోషియాలజీ ప్రొఫెసర్. ఒకసారి ఆయనతో అన్నాను:— చూడన్నా చరిత్రను చాలా వక్రీకరించారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ రాతల్తోనే చరిత్ర తయారయింది. అసలు అంబేద్కర్ ఏమన్నాడంటే “It’s a fight between Hinduism and Buddhism” అన్నాడు. కాబట్టి వాళ్లంతా చరిత్రను వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. ఇప్పుడు ‘రామరాజ్యం’ కావలంటరండి. ‘అశోకరాజ్యం’ కావలంటరా ఎవరైనా? అశోకుడి చరిత్ర తెలుసు మనకి. పైగా రాళ్ల మీద రాసుంది ఇప్పటికీ. అది ఒక ఆధారాలున్న చరిత్ర. అలాగే రాముడిది ఒక ఇతిహాసం. అది జరిగిందో జరగలేదో, నిజమో అబద్ధమో ఎవరికీ తెలియదు. కాబట్టే ఇతిహాసం అంటారు. మహాత్మాగాంధీతో సహా ప్రతీ హిందువూ మనకు రామరాజ్యం కావాలంటరు. “రాముడు యుగపురుషుడు” అన్నారు. ఆయన యుగపురుషుడెట్లయితడు? సీత శీలాన్నే శంకించినవాడు ఒక యుగపురుషుడెట్లయితడండి? సీత ఎందుకు అడగలేదు నీ శీలం ఎట్లున్నదని? స్త్రీకి స్వాతంత్రం లేదు కదా. స్వేచ్ఛ అనేది రామాయణంలోనే లేదు. ఇలాంటి చరిత్రలున్నాయన్నా… మన చరిత్రను మనం రాసుకోవాలె, అని అన్నాను మా అన్నయ్యతో. మా అన్నయ్య “కరెక్టెగాని నాకు అంత ఓపిక లేదురా తమ్మి, రాయాలంటే నువ్వు రాయరా” అన్నాడు.

అంతకుముందే చదివిన కొన్ని పుస్తకాలు కూడా నాపై బాగా ప్రభావం చూపించాయి. Dalit Panthers మూమెంట్ మొదలైనప్పటి నుంచి దళిత ఆత్మకథలు మహరాష్ట్రలో చాలా వచ్చాయి. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ సభ్యుడు నరేంద్ర జాదవ్ కూడా తన పుస్తకాన్ని మొదట మరాఠీలో రాశాకనే తర్వాత అది ఇంగ్లీషులో “Outcaste”గా అనువాదమయ్యింది. అది చదివాను. అలాగే అలెక్స్ హేలీ “రూట్స్” కూడా చదివాను. ఆ పుస్తకం నాపై చాలా ప్రభావం చూపింది. అది చదువుతూ కొన్ని సంఘటనల దగ్గర ఏడ్చాను కూడా. ఇవన్నీ చదివిన తర్వాత నా కుటుంబ చరిత్ర రాయాలన్న నిశ్చయంలో దృఢత్వం వచ్చింది.

సరే, 2004లో రిటైరయిన తర్వాత అమెరికాలో ఉన్న మా రెండో అమ్మాయి డెలివరీకి అమెరికా వెళ్లాను. ఆ పాపని చూసినాక అనిపించింది. ఈ పాప పెరిగి పెద్దదై అమెరికన్ సిటిజనే అవుతది. ఎందుకంటే వెళ్లాక అక్కణ్ణించి రారు, నాకు బా తెలుసు. కాబట్టి ఈ పాపకి మన చరిత్ర ఎట్ల తెలియాలి? మన పూర్వీకుల చరిత్ర, మన కులంలో ఉన్న అంటరానితనం ఇవన్నీ ఎలా తెలుస్తయి. ఈ పాప పెద్దదయి చదవాలన్న ఆసక్తి ఉంటే ఆమెకి అక్కడి నల్లజాతీయుల చరిత్ర తెలుస్తుంది. అమెరికన్ స్లేవరీ గురించి మాట్లాడుతుంది. కానీ మన పూర్వీకుల చరిత్ర ఎలా తెలుస్తుంది? అందుకే నేను తప్పకుండా ఇలాంటి పుస్తకం రాయాలన్న నిర్ణయానికొచ్చాను. ఆ పాప ఎంత తెల్లగా ముద్దుగా బాగున్నదంటే, మాదిగ కులంలో ఇంత చక్కటి పిల్లుందీ, దీనికి తెలియాలి హిస్టరీ అనిపించింది. ఆ నిర్ణయంతో అక్కడే ఒక అధ్యాయం పూర్తి చేశాను.

నా పూర్వీకుల కథ కోసం తడుముకోవాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే.. మా తాతయ్య నర్సయ్య నాతో చాలా క్లోజ్‌గా ఉండేవాడు. మా ఇంట్లో అప్పుడు మేకలుండేవి. వాటిని మేతకు తీసుకుపోతూ నన్నూ కూడా తీసుకువెళ్లి అన్ని విషయాలు చెప్తుండేవాడు. అవన్నీ నా మనసులో అట్ల నాటుకుపోయాయి. అలాగే మా మేనత్త కొన్ని విషయాలు చెప్పేది. మా నాన్న కూడా కొన్ని చెప్పేవాడు. ఆయనకి నేను సాయంత్రం మందు తీసుకొస్తూ ఉండేవాణ్ణి. ఆయన తాగుతూ ఆ ఎమోషన్లో చాలా విషయాలు చెప్పేవాడు. సో.. అవన్నీ నాకు గుర్తున్నయి కాబట్టి నేను వెంటనే రాయటం మొదలుపెట్టేశాను. అవన్నీ నెమరు వేసుకుంటూ అక్కడ కంప్యూటర్లో రాసిన తర్వాత ఆ ప్రారంభం నాకే ఆశ్చర్యమేసింది – ఇంత బాగా నేను రాయగలనా! అని.

ఇంగ్లీషులో ఎందుకు రాయాలనిపించింది?

ఒకటేమో ఇందాక చెప్పినట్టు నా మనుమరాలు చదవాలని. రెండోది: ప్రపంచానికి తెలియాలి. ప్రపంచం ముందు దీనికి ఫోకస్ రావాలని.

ఈ పుస్తకం అంతర్జాతీయ పబ్లిషర్ Harper Collins దాకా వెళ్లటం వెనుక కథ చెప్పండి? 

రాయటం పూర్తయిన తర్వాత ఒక సారి హైదరాబాద్ బుక్ ట్రస్టుకు చెందిన గీతారామస్వామి “మీరు అమెరికా వెళ్లొచ్చారు. కలవలనే లేదు” అని పలకరిస్తే, అప్పుడు చెప్పాను “నేను నా ఫ్యామిలీ బయోగ్రఫీ రాశాను, మీరొక్కసారి చూస్తే బాగుంటుందీ” అని. ఎందుకంటే నాకు ఎలాగూ ఒక మంచి పబ్లిషర్‌కి ఇవ్వాలనుంది. ఆవిడ ఆ లైన్లో ఉంది కాబట్టి చూస్తే బాగుండుననిపించింది. ఆవిడ రెండ్రోజుల్లో చదివేశారు. తర్వాత, “దీన్ని నాకొదిలేసేయండి. నేను ఒక మంచి పబ్లిషర్‌ని చూసి పంపిస్తాను” అన్నారు. ఒక నెల రోజుల తర్వాత ఫోన్ చేసి “హార్పర్ కొలిన్స్ వారు మీ పుస్తకాన్ని పబ్లిష్ చేయటానికి ఒప్పుకున్నారు” అని చెప్పారు. తర్వాత వాళ్లు ఫోన్ చేశారు. పుస్తకం చాలా బాగుందని, వాళ్లు ప్రచురించబోయే మొదటి దళిత పుస్తకం ఇదేనని అన్నారు. అలా వాళ్లతో అగ్రిమెంట్ పూర్తయింది.

తెలుగులోకి మీరే ఎందుకు అనువాదం చేయలేదు?

నేనే రాసిన పుస్తకాన్ని మరలా తెలుగులో అనువదించటం నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు. ఆ సమయం ఇంకో పుస్తకం రాయటానికి వాడుకోవచ్చు కదా అనిపించింది. గీతారామస్వామికి ఫోన్ చేస్తే, “ఇక్కడ పి. సత్యవతి అని ఉన్నారండి” అని చెప్పి ఆవిడకి ఇంగ్లీషు మాన్యుస్క్రిప్టు పంపించారు. ఆవిడ కూడా రెండ్రోజుల్లో చదివి గీతారామస్వామి గారికి ఫోన్ చేసి “నేను చేస్తాను. కానీ నాకు కొన్ని అనుమానాలున్నాయి” అన్నారట. ఆవిడ బ్రాహ్మిన్. “నేను రాసిన తర్వాత అందులో అనుకోకుండా ఏమన్నా చిన్న లోపం వచ్చినా గానీ, బ్రాహ్మణులు కాబట్టి దీన్ని ఇలా రాశారు అంటారేమో” అన్నారు. అప్పుడు గీతా రామస్వామి, “అట్ల కాదండి, ఆయనకి చిన్నప్పణ్ణించి బ్రాహ్మణ స్నేహితులుండేవారు. ఆయన కంప్లెయింటు బ్రాహ్మణిజం మీద గానీ బ్రాహ్మణుల మీద కాదు” అని చెప్పారు. మీరు మాట్లాడండి అంటే నేనోసారి మాట్లాడాను. “నేను చేస్తానండి, కానీ నాకు ఈ తెలంగాణ మాండలికం రాదు కదా” అన్నారు. “మీర్రాసేయండి. ఎక్కడెక్కడైతే సంభాషణలున్నయో, అవి బోల్డ్ చేసి పంపించండి, నేను వాటిని మాండలికంలోకి చేసేస్తాను” అన్నాను. రెండు నెలల్లో ఆవిడ అనువాదం పూర్తి చేసేసారు.

ఇది రాస్తున్నప్పుడు నిర్మాణపరంగా మీరు ఎలాంటి శ్రమ పడ్డారు? అంటే ఎలా చెప్పాలి, ఎక్కడ మొదలెట్టాలి… ఇవన్నీ?

అమ్మాయిని చూడటానికి అమెరికా వెళ్ళినపుడు ఎక్కువ సమయం నేను ఒక్కణ్ణే ఉండేవాణ్ణి. నాకు చాలా ఆలోచనలు వచ్చేవి. దీన్ని ఎలా చెప్పాలి, ఏ విధమైన స్ట్రక్చర్ ఇవ్వాలీ ఇవన్నీ. మొట్టమొదట నాకు తట్టింది మా తాతగారు నర్సయ్య తన భార్యని ఖననం చేయటం.. అన్న దృశ్యం. నేను అనుకున్నదేమంటే, పాఠకులు ఆ కథ వెంట వెళ్లాలి, పుస్తకాన్ని పక్కన పెట్టకూడదు. I wanted to create interest. ఆ ఇంట్రస్టు క్రియేట్ చేయడంలో మన ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. కాబట్టి నేను ఆ ఘటనని ముందుకు తీసుకున్నాను. అలా చినుకులు పడ్తా ఉంటే మా తాత తన భార్య శవాన్ని భుజం మీదేసుకుని కొడుకు చేయి పట్కుని అలా ఊరు విడిచి ఎక్కడికో తెలియక వెళ్తా ఉండటం.. ఇది చెప్పిన తర్వాత ఒక్కసారి మళ్లీ వెనక్కి వచ్చి కథ చెప్పటం.. ఇలా చేశాను. చాలామంది, ‘మీ పుస్తకం బిగినింగ్ చాలా ఆకట్టుకున్నదండి’ అని చెప్పారు.

ఇంకోటేందంటే, నాకు ఫస్ట్‌పెర్సన్‌లో చెప్పాలని చాలా ఇంట్రస్ట్ ఉండె. కానీ నేనక్కడ లేను కద, చరిత్ర కద. కాబట్టి, కథ నా టైంకి వచ్చి నేను స్కూలుకి వెళ్ళే వయసు కొచ్చే సరికి మళ్లీ వెనక్కి వచ్చి ఫస్ట్ పెర్సన్‌లో చెప్పటం స్టార్ట్ చేసినాను. ఇవి పాఠకుల్ని చాలా బాగా ఆకట్టుకున్నట్టు నాకు సమీక్షలు వచ్చిన తర్వాత తెలుస్తోంది. చాలా సమీక్షలు వచ్చాయి, హిందూలోనూ, డెక్కన్ హెరాల్డ్ లోనూ, బుక్ లవర్స్ వాళ్లూ… చాలా మంది పంపించారు.

పుస్తకం మొదటిభాగం అంతా మీ కుటుంబసభ్యులతో మీరు జరిపిన సంభాషణల ఆధారంగా రాసింది కదా. దాన్ని రాయటం ఎలా ఐంది?

ఆ సంభాషణలన్నీ నేను పుస్తకం కోసం చేసినవి కాదు. ఎప్పుడో వాళ్లు మాట్లాడుతున్నప్పుడు విన్నవి. They were all loaded in my brain. కాబట్టి సులువుగానే రాశాను.

హార్పర్‌కొలిన్స్ వాళ్ల ఎడిటింగ్ ప్రక్రియ ఎలా సాగింది?

చాలా tedious గా సాగింది. ఎడిటింగ్‍కు ఒక సంవత్సరం తీసుకున్నారు వాళ్లు. నాకు విసుగొచ్చి “మీరు వేస్తారా వేయరా నా స్క్రిప్టు వెనక్కి పంపించండి” అన్నా. “దీన్ని ఒక రీసెర్చ్ ప్రాజెక్టుగా తీసుకున్నం మేము. ఇంతవరకు హార్పర్‌కొలిన్స్ దళిత్ లిటరేచర్ వేయలేదు. కాబట్టి మేం అడిగిన ప్రశ్నలకు విసుక్కోవద్దు” అన్నారు.

ఎలా ఉండేవి వాళ్ల ప్రశ్నలు?

చెపుతాను. ఒక ప్రశ్న ఏ విధంగా ఉందంటే – ఆ ప్రశ్న నాకు నచ్చలేదు కాబట్టి చెప్తున్నా – మా తాత మా నాన్నను పట్కొని రఘునాధపల్లికి వచ్చేటప్పుడు అది అంత దూరం ఉంది, ఎట్ల రాగలిగాడు.. అని అడిగారు. “పూర్వం నడిచిపోవటమనేదే మామూలుగా ఉండే ప్రాక్టీస్, ఎట్ల రాగలిగాడు అనేది ఇప్పడు మీకు వచ్చిన ఆలోచన. పైగా ఆయన దళితుడు, ఒక గుర్రం లేదు ఒక గాడిద లేదు. అప్పుడు రాత్రుళ్లు రాత్రుళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చేవారు, అక్కడక్కడా మజిలీలు చేస్తూ,” అని చెప్పాను. తర్వాత ఆ ఊరు ఎక్కడ ఉంది అని డెమాగ్రఫీ అడిగారు. నేను మాప్ వేసి ఆ కమలాపురం అనే మండలంలో ఈ ప్రదేశంలో ఉంది అని చెప్పాను.

తర్వాత నేను ఒక ఫామిలీ ట్రీ (వంశవృక్షం) వేశాను. అందులో నా తర్వాతి వాడు అంజయ్య. అతనికి తల్లి వేరు. పుస్తకంలో చదివారుగా, లక్ష్మమ్మ కొడుకు. నేను ట్రీ వేస్తూ: “బాలయ్య – నర్సమ్మ” అని మా తల్లిదండ్రుల పేర్లు వేసి కింద మా అందరి పేర్లూ వేశాను. వాళ్లు అక్కడ పట్టుకున్నరు. అంజయ్య బాలయ్య, నర్సమ్మల కొడుకు ఎట్లయితడు, అని. మా అంజయ్య అన్న ఉన్నడు ఇప్పటికీ. నాకేమనిపించిందంటే, మొట్టమొదట పుస్తకం తెరుస్తనే మా అన్న దీన్నే చూస్తడు అని. But they are very realistic. This being a biography… it should not conceive or hide anything. కాబట్టి ఇక నేనేం చేసిన అంటే ఆ ట్రీలో అంజయ్య అనే దగ్గర ఆ పేరు పక్కన బ్రాకెట్ పెట్టి “సన్ ఆఫ్ లక్షమ్మ” అని పెట్టిన.

ఇంకా మా నాన్న పేరు రామస్వామి నుంచి బాలయ్యగా మారడం, బీబీనగర్ నుంచి సికింద్రాబాద్‌కి ఎంత దూరం.. ఇలా చాలా in-depth ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికీ నేను చాలా ఓపిగ్గా సమాధానాలిచ్చాను. చివర్లో కొంచెం విసుగొచ్చినా… I am very thankful to them. చాలా minutestగా చాలా scrupulousగా ప్రశ్నలడిగి జవాబులతో వాళ్లు సంతృప్తి చెందితేనే తర్వాతి దశకు వెళ్లారు.

ఏమన్నా తీసేయ్యాలనీ, చేర్చాలనీ చెప్పారా?

ఒకటుంది. అదింకా నాకు… but I had to compromise. నేను ఒక దగ్గర ఏం రాశానంటే: పారిశ్రామికీకరణ (industrial renaissance) జరిగేటప్పుడు భారతదేశం కంట్రిబ్యూషన్ ఏం లేదు దాంట్లో. బ్రాహ్మణులు కేవలం వేదాలు చదవటం, వల్లించటం తప్ప (సైన్స్‌లో సి.వి. రామన్‌ను మినహాయించి) బ్రేక్‌త్రూ కంట్రిబ్యూషన్స్ ఏం చేయలేదు. ప్రతీదీ మనం పాశ్చాత్య దేశాల్నించి తెచ్చుకున్నదే. కాబట్టి ద సోకాల్డ్ పండితులు, the so-called intellectuals of the Indian community, ద సోకాల్డ్ బ్రాహ్మణులు… they have not invented anything. ఇలా అని నేను ఒక రెండు మూడు పేరాగ్రాఫ్స్ రాశాను. రాస్తే… వాళ్లేమన్నారంటే, “దిస్ డీవియేట్స్ ఫ్రం ద స్టోరీ. మీరు ఇంత బాగా అన్నీ చెప్తా ఉన్నరు.. మీ పుస్తకంలో కంప్లెయింట్ అన్నది లేదు. ఇది ఉండటం వల్ల మీరు కూడా కాస్త biasedగా కనపడతారు. అందుకని మీ అనుమతి ఉంటే తీసేస్తాం” అన్నారు. నేను మా స్నేహితులతో చర్చించాను. వాళ్లూ అదే అన్నారు. సరే అని ఆ విషయం వాళ్లకొదిలేశాను. వాళ్లు తీసేశారు.

అలాగే మరికొన్ని ఉన్నాయి. ఈ కల్లు గీకే క్రమం ఉంటది కదా. ఈడిగలు అంటరు తెలంగానలో. ఆ ఈడిగోడు చెట్టు ఎలా ఎక్తడు, ఎలా గీస్తడు, తర్వాత దాన్ని ఎలా ఒంపుకోని దింపుకొస్తడు అన్నది నేను చాలా అందంగా వర్ణించాను. వాళ్లు అది అవసరం లేదన్నారు. అలాంటి వర్ణనలు కొన్ని ఉన్నాయి.

అలాగే నేను కొంత హిస్టరీ సంపాదించాను. ఖమ్మంలో బొగ్గు గనులు ఎట్ల మొదలయ్యాయి… అదీ కొంత హిస్టరీ రాశాను. “ఇలాంటిది ఎవరైనా ఏ చరిత్ర పుస్తకం నుంచైనా రాయొచ్చు సార్” అన్నారు. అట్లా కొన్ని తీసేసినవి ఉన్నాయి దాంట్లో.

మీ పుస్తకం చదివాకా బ్రిటిష్ వలసపాలన పాలన వల్ల దళితులకు మేలే జరిగిందనిపించింది. మీరేమంటారు?

9అవును. బ్రిటిష్ పాలన దళితులకు చెడు ఏం చేయలేదు. ఆర్థిక అభివృద్ధిలో గాని, సామాజిక నడవడిలో గానీ బ్రిటిష్ ప్రభుత్వం దళితులకు ద్వారాలు తెరిచింది. అంతకుముందున్న వ్యవస్థలో మాకు స్కూళ్లల్లో స్థానం లేదు. బ్రిటిష్ వాళ్లు దాన్ని కల్పించారు. ఉద్యోగాల్లో స్థానం లేదు. వాళ్ల వ్యాపారం పెంచుకోవటం కోసమే అయినా గానీ, దళితులని ప్రమాదకరమైన వృత్తులేమైతే ఉన్నాయో (రైలు నిర్మాణంలో గాంగ్‍మన్లు, పాయింట్స్‌‌మన్లు ఇలాంటి వృత్తులన్నీ) అందులోకి తీసుకున్నరు. ఎందుకంటే అప్పటికే కులవ్యవస్థలో కులవృత్తులు చేసుకుంటున్న వాళ్లు అందులోంచి బయటికి రాలేదు. వాళ్లకా అవసరం కనిపించలేదు. కుమ్మరి కుండలు చేసేవాడు, కమ్మరి వాడి నగలు చేసేవాడు, వడ్రంగి వాడి పని వాడు చేసేవాడు… వాళ్లకి అందులోంచి బయటకి రావాల్సిన అవసరం లేదు. దళితులకు మాత్రమే ఆ అవసరం ఎందుకనిపించిందంటే… వాళ్లు దుర్భరమైన జీవితం గడిపేవారు… అందరూ వాళ్లని జీతగాళ్లు అని పిలిచే వారు, జీతగాడికి స్వతంత్రం లేదు, జీతమడిగే హక్కు లేదు, వాళ్లకు బ్రిటిష్ వాళ్లు అవి కల్పించారు. అదే ఒక గ్రామంలోకి పోతే అక్కడ దొర “నీకింత జీతమ్ ఇస్తరా” అని అనడు. వాడి దయాదాక్షిణ్యాల మీద ఇస్తడు వాడు.

తర్వాత ఈ రైల్వే వ్యవస్థలో కాలనీలు ఏవైతే కట్టినరో వాటిలో ప్రతి ఒక్కరికీ ప్రవేశం ఉండేది. ఊరి చివర దళితవాడ అని, హరిజనవాడ అని అంటరాని వాడిగా ఉండేవాడికి శూద్రులతోనూ మిగతా అగ్రకులస్థులతోనూ కలిసి బతికే పరిస్థితి కలిగింది. ఈ క్రమంలో దళితులు చాలా నేర్చుకున్నారు. పై స్థాయి శూద్రుల నుంచి దళితులు ఏం నేర్చుకున్నరంటే తమ పిల్లల్ని కూడా స్కూలుకు పంపియ్యాలీ అని. మన పిల్లలగ్గుడ చదువు నేర్పించాలి. గ్రామాల్లో ఉన్నంత కాలం అది ఆలోచించలేదు దళితుడు.

ఇంకొకటేందనంటే నీకొక నిర్ధిష్టమైన జీతం వస్తుంది. ఆ జీతంతో నువ్వు ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. ఇంత డబ్బు నేను దీనికి ఖర్చు పెట్టొచ్చు, ఇందులో కొంత డబ్బు నేను నా పిలగాని చదువుకు బెట్కోవచ్చు అన్న ఒక ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని ఆ బ్రిటిష్ ప్రభుత్వమే మాకిచ్చింది. Really we owe a lot to the colonial period. చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ల కింద దేశానికి స్వతంత్రం లేదూ అదీ అని.. ఎందుకండీ స్వతంత్రం? మనిషికేమో స్వతంత్రం లేదు.. ఇప్పుడు చూడండి.. దళితుల్లో ఎంతమందికి భూమి ఉందండి? ఎవడికైతే భూమి ఉందో.. వాడు ఈ భూమి నాది, ఈ దేశం నాది అంటడు. నీకు భూమే లేకపాయె. ఇక నువ్వు దేశం గురించి ఏమాలోచిస్తవ్? సో, అలాంటి పరిస్థితుల్లోంచి మమ్మల్ని విముక్తి చేసింది ఆ బ్రిటిష్ ప్రభుత్వమే.

అఫ్కోర్స్ అవన్నీ ప్రమాదభరితమైన ఉద్యోగాలే ఉండేవి. కాని ఇప్పుడు కుడా మీరు చూడండి.. నా తరం వాళ్లు ఇప్పుడు ఎవరైతే ఫ్రొఫెసర్లయి, పిహెచ్డీలు చేసి మంచి ఉద్యోగాల్లో ఉన్నరో.. వాళ్లందర్నీ పరిశీలించినట్టయితే, వాళ్ళ తల్లిదండ్రులు ఒకప్పుడు గనుల్లోనో, లేకపోతే పోస్టల్ టెలిగ్రాఫ్‌లోనో, లేక ఆర్మీలో చివరి స్థాయిలో పనిజేయడం వల్లనే.. వాళ్ల కొడుకులు ఇప్పుడు విద్యావంతులు కాగలిగారు. అదే గ్రామంలో ఉన్నవాడైతే ఆ తరం నుంచి ఈ తరానికి కూడా అక్కడే ఉన్నాడు.

ఆ కాలంలో దళితులకు తమకంటూ ఒక సంస్కృతి ఉండేది. వారి దేవుళ్లు వారికి ఉండేవారు. వలసపాలన తర్వాత మొదలైన క్రిస్టియన్ మతమార్పిడులతో వారు ఆ సంస్కృతిని కోల్పోయారేమో కదా?

ఒకటండీ..! నువ్వు పురోగతిలో ఉన్నంతవరకూ సంస్కృతి కోల్పోవటం అనేదానికి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకు పురోగతి అనేది ఎట్ల జరిగింది? ఈ సంస్కృతి వల్ల జరగలేదు. మాకు విద్యరావటం వల్ల జరిగింది. మాలో విద్య అనేది ఎవరు ప్రోత్సహించారు? ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ ప్రోత్సహించింది. మమ్మల్ని అక్కున చేర్చుకుంది. మమ్మల్ని స్కూల్లో ఒక బెంచీ మీద కూర్చోబెట్టింది. నా కాలంలో నేను క్లాసులో ఎక్కడ కూచున్ననో మీకు తెలుసు కదా, పుస్తకంలో ఉంది. వెనకెక్కడో నా గోనెతట్ట తీసుకొచ్చి ఏస్కుని నేను కూచుంటే, పంతులు ఒక పిల్లవానితో పలక తెప్పిచ్చి, దాని మీద నీళ్లు పోసి రాసి, తోసి పడేసేవాడు. అది క్రిస్టియానిటీ చేయలేదే? క్రిస్టియన్స్ అక్కున జేర్చుకున్నరు. విద్యాబుద్ధులు నేర్పిచ్చిర్రు.

ఇక ఈ సంస్కృతి అనేది కాపాడ్డం.. ఇప్పటి తరం దళితుల గురించి నేను ఒకటి చెప్పాలె.. అది తప్పుబట్టడం అనండి ఏమన్న అనండి.. వాళ్ల ఐడెంటిటీ వాళ్లు నిలబెట్టుకోలేకపోయిర్రు. ఇదివరకూ వాళ్లు గుడి దిక్కు పోయేటప్పుడు – అది ఎల్లమ్మ గుడో, పోశమ్మ గుడో, మైసమ్మ గుడో ఏదైన కాని – అక్కడ ఎవరు వెళ్తే వాడే పూజారి. అదిప్పుడు నువ్వు కోల్పోయినవ్. Sanskritization వల్ల అగ్రకులాల్ని అనుకరిస్తూ దాన్ని కోల్పోయినవ్. ఆ విధంగానే పెట్టుకునున్నట్టయితే నీ ఐడెంటిటీ నీకుండేది ఇవాళ.

ఇంకొకటేందనంటే, ఎవరైతే క్షుద్రదేవతలు అని బ్రాహ్మణులన్నారో.. ఇప్పుడు టెంపుల్ మార్కెట్ పెరిగాక ఆ గుళ్ళకు బ్రాహ్మణులే పూజారులైనారు. ఒకప్పుడు హుసేన్ సాగర్ కట్టమైసమ్మ దగ్గర మా దళితులుండేవాళ్లు. ఇప్పుడు బ్రాహ్మణులతో ఆ స్థానం రిప్లేస్ అయింది. అదేవిధంగా పెద్దమ్మ గుడి, ఎల్లమ్మ గుడి ఇలా చాలా ఉన్నాయి. వీటన్నింటిలో దళితులే పూజారులై ఉండేవారు. ప్రతి దళితుడూ పూజారేనండీ! వాడు పోయి సాకబెడుతుండె అప్పుడు. అంటే వండి తీస్కోనిపోయేవాడు. అందులో గొప్పతనమ్ చూడండి… వాడు వండిందే వాడి దేవతకు పెట్టేవాడు.

తర్వాత.. మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది దళితుల్లో. దాన్ని క్రమంగా కోల్పోతున్నారు ఇప్పుడు. పితృస్వామ్యంలోకి పోతున్నరు. పితృస్వామ్యం అనేది చాలా భయంకరమైన సంస్కృతి. అది బ్రాహ్మణ సంస్కృతండీ! ఇప్పుడు దళితుల్లోనూ చదువుకున్నోళ్లు.. తూర్పు దిక్కున ఇది పెట్టాలె, పశ్చిమంలో అది పెట్టాలె, ఆగ్నేయంలో ఇదిండకూడదు, తులసిమొక్క పెట్టి పూజ చేయాలె, వాస్తు చూసి కట్టాలె.. ఇవన్నీ జేసి తమ సంస్కృతి కొంచెం కోల్పోయారు. చదువుకున్నవాళ్లు ఈ ఐడెంటిటీని నిలబెట్టుకుని ఉంటే ఇప్పటివరకు ఉండేది అది. ఇప్పుడు లేదు. దీనికి క్రిస్టియానిటీ కారణం కాదు, బ్రాహ్మినిజం ఈజ్ ద ఓన్లీ రీజన్ ఫరిట్.

సామాజికంగా ఎదగాలన్న ఆకాంక్ష ఉన్న దళితులకు అప్పటికన్నా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే అనుకుంటున్నారా?

అవకాశాలైతే ఉన్నాయి గానీ ఇప్పటి జెనరేషన్లో మాకున్నంత సీరియస్నెస్ కనపడటం లేదు. మనకు అన్ని విధాలా సదుపాయాలు ఉన్నాయీ అన్న లేజీనెస్ రావటం ఉంది. ఇప్పటి యువత ఏందనంటే, మనం ఎంత సంతోషంగా ఉండాలి, దానికేం జేయాలి అన్న దాని వైపే వెళుతుంది.

ఇప్పటి జనరేషన్‌కి చదువు ఒక ఆయుధం. అది వాడుకోవాలి. అందుకనే నేను చదువుకి ప్రాముఖ్యత ఇచ్చాను. ముఖ్యంగా ఇంగ్లీషు చదువు. Unless one is good in English… వాడికి మోక్షం లేదు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, గ్లోబలైజేషను, మార్కెట్ విధానం… వీటన్నిటినీ చూసినట్టయితే.. మేం చిన్నప్పుడు ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివేటప్పుడు మేమూ చదివేది అగ్రకులం పిల్లల దగ్గరే.. అఫ్కోర్స్ మేమేదో చివర్లోనో మూలనో కూర్చునేవాళ్లం. కానీ టీచర్ చెప్పే క్వాలిటీ ఒకటే. వాడికీ అదే అందేది, నాకూ అదే అందేది. కానీ ఇప్పుడు పరిస్థితులేమైనాయంటే, ఈ అగ్రకులస్థులు అంతా కూడా “ఛీ మనం ఈ మాలామాదిగల దగ్గర ఏంటి చదవటం, మనమో కార్పొరేట్ స్కూల్ పెడదాం, అందులో మన పిల్లల్ని చేరుద్దాం..” ఇట్లా అనడం వల్ల, మళ్లీ దళితుల పరిస్థితి మారుతోంది. ఇప్పుడు మీరు ఏదన్నా పల్లెలో గవర్నమెంటు పాఠశాల గమనించినట్టయితే, చెప్పేవాడు దళితుడే, చదివేవాడు దళితుడే. ఆ కాలంలో పటేల్ పట్వారీలు టీచర్లను నిలదీసేవారు “ఏం పంతులూ ఇయాల నువ్వు బడికి రాలేదు? నా పిలగానికి చదువు సరిగా జెప్తలేదు” అని ప్రశ్నించేటోళ్ళు. ఇప్పుడు ఈ దళితుల్లో ఎవరు ప్రశ్నిస్తారు ఈ టీచర్లని? అగ్రకులస్థుల పిల్లలు కూడా అప్పుడు ఆ స్కూళ్ళకే వెళ్ళేవారు కాబట్టి ఆ కులస్థులకు టీచర్లని నిలదీసే బలం ఉండేది. దాని వల్ల మాక్కూడా లబ్ధి చేకూరేది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలని వాడెందుకు అడ్గుతడు, వాడో కార్పొరేట్ స్కూల్ పెట్టుకుంటడు. మళ్లీ కాలచక్రం తిరుగుతోంది. చదువుకు సదుపాయాలున్నయి గాని వాటిల క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా పోయింది. కానీ వాళ్లతో కాంపిటీషన్‌కి వెళ్లాలంటే నీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. అది కరువవుతుందన్న భయం నాలో ఉంది.

దళితుల్ని ఇంకా వెనక్కి పట్టి ఉంచుతున్న అంశాలుగా మీరు వేటిని పరిగణిస్తారు?

మొదటిది మూఢనమ్మకాలు. దళిత కుటుంబాల్లో ఉన్నన్ని మూఢనమ్మకాలు ఎక్కడా లేవు. అవి మానుకోవాలి. తర్వాత విద్యా విధానంలో మార్పు రావాలి. మూడవది: ప్రతీ పేరెంట్ తమ పిల్లలను మంచి క్వాలిటీ స్కూల్లో వేయాలన్న భావన రావాలి. ఎందుకంటే పిల్లవాడి జీవితం మొదలయ్యేది స్కూల్లోనే. పరిసరప్రాంతాలు వాడికి అనుకూలంగా ఉండి, వాటి నుండి వాడు నేర్చుకునే పరిస్థితి ఉన్నట్టయితే వాడి మైండ్ పరిపక్వం చెందుతుంది. లేకపోతే వాడికి అవకాశాలు రావు. కాబట్టి విద్య చాలా ముఖ్యం. అలాగే శుభ్రత, ఆరోగ్యం చాలా ముఖ్యం. శుభ్రత ఎప్పుడొస్తుంది? నువ్వు చదువుకుని అరే దీని వల్ల నాకు అంటురోగం వస్తుంది అన్న జ్ఞానం ఉన్నప్పుడే శుభ్రత వస్తుంది. ఇవన్నీ మెరుగైతే ఈ జాతి బాగుపడుతుంది. లేకపోతే ఈ జాతికి విమోచన లేదు.

వివక్ష ఇంకా అట్లానే ఉంది, అణిచివేత అట్లానే ఉంది, అగ్రకులస్థుల ఆధిపత్యం అదే విధంగా ఉంది. అంతా అంటారు అంటరానితనం పోయిందని. కానీ అది ఎన్నో విధాల ఇంకా ఉంది. ఇప్పుడు నేను ప్రిన్సిపల్‌గా, ప్రొఫెసర్‌గా రిటైరయ్యాను. నా ముందు బానే మాట్లాడతరు. నే పక్కకు పోయాకనేమో “నీయమ్మ మాలోడు మాదిగోడు వానితో మంచిగ మాట్లాడాల్సొచ్చిందే” అంటరు. అది కూడా అంటరానితనమే కదా. Your brain is still practicing untouchability. Mental untouchability. హిందూమతంలో ఉన్న దుర్మార్గం అండీ ఇది. అందుకే నేనా మతాన్ని వదిలేసిన.

పుస్తకంలో ఒక చోట బాల్యం గురించి రాస్తున్నప్పుడు – మీ తెలుగు టీచర్ శాస్త్రి గారి ప్రభావంతో శాకాహారిగా మారానని, వినాయకుడి గుడికి వెళ్లి హరికథలు వినేవాడిని అని, మిమ్మల్ని ఇంట్లో వాళ్లు “పంతులు” అని వెక్కిరించేవారని రాసుకున్నారు. ఆ వయసులో పైస్థాయి సమాజంతో మసలుకోవాలంటే వాళ్లని అనుకరించాలన్న ఒత్తిడే మిమ్మల్ని హిందూమతం వైపు మొగ్గేలా చేసిందనిపించింది. 2006లో మీరు బౌద్ధాన్ని స్వీకరించారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే అప్పటి మీ ప్రవర్తన మీకేమనిపిస్తుంది?

చిన్నప్పుడే కాదు, మా పిల్లలు ఇంక చిన్నగ ఉన్నప్పుడు కూడా నేను షిర్డీకీ తిరుపతికీ వెళ్ళేవాణ్ణి. తర్వాత మా పిల్లలు అడిగితే అన్నాను, “అప్పుడు నేను అజ్ఞానంలో ఉంటి అమ్మా” అని. ఎందుకంటే 2004లో నేను రిటైరయ్యే ముందు నా జీవితం పైన అంబేద్కర్ చాలా ప్రభావం కల్గించాడు. బుద్ధా అండ్ దమ్మా… ఇవన్నీ కూడా నేను రిటైరయ్యే ముందు చదివాక నాలో చాలా మార్పు వచ్చింది. బౌద్ధంలో బుద్ధుడు ఏమంటాడంటే, ప్రశ్నించే తత్త్వం ఉండాలె. అది ప్రజాస్వామ్యానికి గుర్తు. నీ గురువుని కూడా ప్రశ్నించు నువ్వు అన్నాడాయన. బౌద్ధంలో మిరకిల్స్‌కు కూడా తావు లేదు. సమాజం అంతా ఒకటే అన్నడు. ఇవన్నీ చాలా ప్రభావితం చేశాయి. మీరన్నట్టు చిన్నప్పుడు నాకు చాలామంది బ్రాహ్మణ స్నేహితులుండె, చదివే అలవాటు చాలా ఉండె, memorizing was my strength, ఆ విధంగా మా తెలుగు మాస్టారు రెండ్రోజుల్లో చెప్పమనేది నేను ఒక రోజులో చెప్పేవాణ్ణి, అలా దాని ప్రభావం వల్ల పద్యాలు ప్రార్థనలూ నేర్చుకోవటమూ… అలాగే నా బ్రాహ్మణ స్నేహితుల ప్రభావంతో వెజిటేరియన్‌గా ఉండటమూ… జరిగింది. కాని ఆ పరిస్థితిలో, ఆ వాతావరణంలో నాకు వేరే గత్యంతరం లేదు, దారి కనపళ్ళేదు. మీకు ఆల్టర్నేటివ్ రూట్ దొరికే వరకూ పోతున్న రూటే కరెక్టనుకుంటారు.

ఈ పుస్తకంలో మీ నాన్న బాలయ్య జీవితం గురించి ఎక్కువే చెప్పారు గానీ, ఆయనతో మీ అనుబంధం గురించి తక్కువే చెప్పారనిపించింది. ఇప్పుడు తల్చుకుంటే గుర్తొచ్చేది ఏదైనా చెప్పండి.

7కుటుంబంలో ఒకరూ ఇద్దరు ఉంటే అనుబంధం సంగతి బాగ తెలుస్తది. మేము గంపెడుమంది పిల్లలం. నేను ఆరోవాణ్ణి. కానీ నన్ను చాలా బాగా చూస్కునేవాడు. ‘బక్కోడా, బక్కోడా’ అనేవాడు. నేను చాలా సన్నగా వుంటి. ‘బక్కోడు బాగా తెలివైనవాడు’ అంటుండె మా నాన్న నన్ను. తర్వాత అప్పుడప్పుడూ అడిగేవాడు “ఏం రా ఇట్ల జేస్తె ఎట్లుంటది అట్ల జేస్తె ఎట్లుంటది ఇలా..”. మా నాన్న ఆప్యాయత అందరి మీదా ఉండేదండి. అది పర్టిక్యులర్‌గా ఒకరికి అని ఎప్పుడు చెప్తమంటే సంఖ్య తక్కువుండి ఒకరిద్దరుంటే చెప్పటం కొంచెం సులభం అవుతుంది. ఎంత ప్రేమ లేకుంటే అంత కష్టపడి మా అందర్నీ చదివిస్తాడండి. మేం ఇంగ్లీషులో మాట్లాడితే ఎంత సంతోషపడేవాడంటే అంత సంతోషపడేవాడు. మా అన్న మొదటిసారి ఆస్ట్రేలియా పోయేటప్పుడు బేగంపేట ఏర్పోర్టులో ఆ ప్లేన్ ఎగిరేదాకా చూస్తూ.. అలా కళ్లల్లో నీళ్లు తిరుగుతా ఉన్నెయ్ ఆయనకి. చాలా గొప్ప కారెక్టరండీ మా నాన్న. నేను ఎంత గర్వంగ ఉన్నానంటే, లేకపోయినగాని మా నాన్న ఇప్పుడు పశ్చిమ దేశాల్లో తిరుగుతుండు.

కానీ నిజానికి మా నాన్న మీద కంటే నాకు మా తాత మీద ఎక్కువ ఆప్యాయత ఉంది. ఇద్దరం మేకల్ని తీస్కొని పోయేవాళ్లం. ఈ ఆర్.ఆర్.సి గ్రౌండ్ ఉంది కదా.. ఇప్పుడివన్నీ పెద్ద ఆఫీసులొచ్చినయ్.. అక్కడ మేపేవాడు. ఒక దగ్గర కూచునేవాళ్లం, ఆయన చుట్ట వెలిగించేవాడు, నేను ఆయన్ను అడుగుతుంటి, ఆయన చెప్తా ఉండె. ఆయన నన్నెందుకు చాలా ఇష్టపడేవాడంటే.. నా నోరు చిగుళ్లూ అంతా అచ్చం ఆయనదే ఉండె నాకు.. ఆయన పోలికలు నాలో చూసుకుని మురిసిపోయేవాడు. “నువ్వు నా తీరుంటవురా సత్తీ” అనేవాడు. అసలాయన వల్లేనేమో నేను రాయగలిగానీ పుస్తకాన్ని. ఆయన దగ్గర్నుంచే చాలా విషయాలు తెలుసుకుని నా బుర్రలో ఎక్కించుకున్నా.

మీ తాతయ్య ఊరు వదిలి వెళ్లి కొత్త జీవితం వెతుక్కోవాలన్న నిర్ణయం మీ కుటుంబంలో తర్వాతి తరాల భావినే మార్చేసింది. ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే – అని ఆలోచిస్తే ఏమనిపిస్తుంది?

అవునండి, ఆయన ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మా చరిత్ర ఇక్కడిదాక వచ్చేది కాదు. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయమే అతని చరిత్రను మార్చేస్తుంది. మా తాత అదే ఊళ్ళో ఉండి ఆ దొరలు పెట్టే కష్టాలకు ఓర్చుకుని తన జీవితంలో రాజీ పడి ఉంటే, ఈ జీవితాలు వచ్చేవి కాదు మాకు. ఆయన ఆ విధంగా రావటానికి పొలం వల్ల వచ్చిన ఇబ్బందులొక్కటే కారణం కాదు. మా నాయనమ్మ అబ్బమ్మ చాలా అందంగా ఉండేది. ఆమె అడిగేదట, “వద్దయ్యా మనమీడికెళ్లి ఎలిపోదాం ఆ దొర నన్నెట్లనో జూస్తున్నడు” అని. అది కూడా ఒక కారణం. అసలు ఆమెను తీసుకునే బయటకు వద్దాం అనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆమె చనిపోయిన తర్వాత ఆమెను అక్కడే ఖననం చేసి తన జీవితయాత్ర ప్రారంభించాడు. అందుకే నా పుస్తకంలో నేను ఈ వలసకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాను. వలస వల్ల ఎట్ల లిబరేట్ అవుతాయి బతుకులు అని. Migration is a sign of prosperity. కూలికి వలస వెళ్లటం వేరు, జీవితాన్ని బాగుపరుచుకోవటం కోసం వలస వెళ్లటం వేరు. కూలి నిస్పృహతో బయటకి వస్తడు. ఇప్పుడు మీరు పొలమూరు శ్రామికుల్ని తీసుకోండి.. అది వేరే స్టోరీ. వాడు ఇక్కడా లేబరుగానే ఉంటడు, బాంబే పోయి లేబరుగానే ఉండొస్తడు. కొంత ఆర్థికంగా బాగుపడతాడేమో. కానీ ఆ జీవనశైలి అలాగే ఉంటుంది. కానీ మా తాతయ్య పరిస్థితి వేరు. అక్కడ దొరతో విసిగిపోయి ‘ఛ ఈ బతుకేం బతుకుర’ అనుకోని కాపుకొచ్చిన పంటని వదిలేసి బయటకొచ్చినాడంటే.. ఆయన జీవితం మీద ఎంతో ఆశతో బయటకొచ్చినాడు.

ఈ పుస్తకం చదివాకా మీ కుటుంబ సభ్యుల స్పందన ఏమిటి?

మా అన్న అబ్బసాయిలు భార్య, మా రెండో వదినె, పుస్తకం చదివాక ఫోన్ చేసింది. అదంతా రాయటం అవసరమా నిన్ను కోర్టులో వేస్త అనింది. నేను “వేస్తే వెయ్యి వదినా” అన్నాను, “వాస్తవాలు రాయటం అంటేనే బయోగ్రఫీ అంటె. సృష్టించి కథల్రాయటం బయోగ్రఫీ కాదు. నీ పేరు యాదమ్మ ఉండె కద. నీకు దయ్యం పట్టడం వాస్తవమే కద.” అంటే, “అవన్నీ చెప్పాలా” అంది. చెప్పటమే బయోగ్రఫీ అంట నేను. ఆత్మకథలో ఎప్పుడూ వంచన ఉండకూడదు. “నీకేమైనా బాధ కలిగితే నేనేం చేయలేను” అని చెప్పినా. “We should feel proud of it. మనం ఆ దశలోంచి ఈ దశలోకి వచ్చినామంటే, నువ్వు ఇప్పుడు నీ పిల్లల దగ్గరకి విమానాల్లోకి ప్రయాణం చేస్తున్నవంటే, కారణం విద్య. మా అన్న ప్రొఫెసర్ కావటం” అని చెప్పినా. మా అన్న నర్సింగరావు భార్య, మూడో వదినె, ఆమె బ్రాహ్మిన్. ఆమె అన్నని ప్రేమించటం, ఒక రోజు తన ఇల్లు వదిలేసి మా ఇంటికి రావటం.. ఇవన్నీ పుస్తకంలో రాసిన. ఆమె కూడా, “నా వ్యక్తిగత జీవితం గురించి నువ్వెందుకు అట్ల రాసినావు” అని అడిగింది. “బయోగ్రఫీ అంటేనే వ్యక్తిగత జీవితాలు. నువ్వు బ్రాహ్మణ యువతివన్నది వాస్తవమే కద. నువ్వు మూట పట్టుకు మా ఇంటికి రావటం నిజమే కద. మా నాన్న నిన్ను ఇంట్లోకి పిల్చుకోవటం వాస్తవమే కద. పెద్దన్న వద్దనడం వాస్తవమే కద. ఇవన్నీ వాస్తవాలె గనుక రాసిన” అన్న. మా పెద్దన్న బాలరాజు కొడుక్కి కూడా తన ఫామిలీ గురించి నేను రాసింది నచ్చలేదు. వాడు చాలా ఆప్యాయంగా నా చేతుల్లనే పెరిగిండు. పుస్తకం విడుదలకు రమ్మన్నా రాలేదు. “ఏంరా” అని అడిగితే “నువ్వు ఏం రాసినవని రావాలె” అన్నడు. “ఏం రాయలేదురా?” అంటే “మా నాయన గురించి ఏమీ రాయలేదు” అన్నడు. “పుస్తకంలో నేను రాశాను. ఎంత రాయాలో అంతే రాసిన. అంతకన్నా కావాలంటే నువ్వు రాసుకోరా మీ నాయన గురించి అన్న. అసలు మా నాయన చుట్టూ తిరిగిన స్టోరీ ఇది. మీ నాయన చుట్టూ తిప్పలేను కదా” అన్నాను. వాడు ఇప్పటికీ నాతో సరిగా మాట్లాడటం లేదు. ఇదిగో ఈ విధంగా బయోగ్రఫీస్ రాయటం వల్ల ఫామిలీస్ లో కొన్ని వస్తాయి. దానికి నేనేం చేయలేను. ప్రతీ వాణ్ణీ సంతృప్తి పరుస్తూ దాన్నో ఫిక్షన్ గా చేయలేను. I cannot romanticize everybody, in the book. సో, ఇట్ల నా కుటుంబంలో కొన్ని వచ్చాయి. They are not happy with me. But I don’t mind. నాకు రిగ్రెట్స్ ఏం లేవు. ఒక క్షణం కొంచెం బాధ అనిపిస్తదేమో గానీ, కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే, నేను చేయగలిగింది ఏమీ లేదు. నీకు ఇప్పుడు సంపద వచ్చిందని నువ్వు ఎక్కణ్ణించి వచ్చినవో మర్చిపోతే ఎట్ల. గతంలో ఇట్లుండేవానివి ఇప్పుడు ఇట్ల ఉన్నవు అన్నది గర్వంగ చెప్పుకోవాలె. దాంట్లోనే నీ హుందాతనం ఉంది.

ఇలా మూలాల పట్ల సిగ్గుపడే తత్త్వం…

ఉందండి. ఖచ్చితంగా. అంతెందుకు ఐయ్యేయస్ ఆఫీసర్స్ కొందరు కులం చెప్పుకోరు. వాళ్ల దగ్గరికి పోతే, “అరె ఇక్కడెందుకు వచ్చినవు. ఇంటి దగ్గర కలువు. ఇక్కడొస్తే అందరు అనుకుంటరు, వీడు దళితుడు కాబట్టి చుట్టూ దళితుల్నే పేర్చుకుంటుండు అని. ఇలాంటి భావన ఉన్న వాళ్లు చాలామంది ఉన్నరు. అది మంచి పద్ధతి కాదుగా. కుంచిత స్వభావం అంటరు దాన్ని.

పుస్తకం పబ్లిష్ అయ్యాకా అందులో చెప్పకుండా వదిలేసిన అంశాలేమైనా ఉన్నాయనిపించిందా?

పుస్తకంలో మా చిన్నమ్మ లక్ష్మమ్మ (అన్న అంజయ్య తల్లి) వెళిపోయాకా మళ్లీ ఏమైందో చెప్పలేదు. కానీ ఆమె మళ్లీ మా ఇంటికి వచ్చింది. తన ఇంకో కొడుకుని తీసుకుని వచ్చింది. వాడు అచ్చం మా అన్న అంజయ్య లాగనే ఉన్నడు. వాడు కూడ మా నాన్నకే పుట్టిండట. అప్పుడు మేం బియస్సి చదువుతున్నం. అంజయ్య మా అమ్మ దగ్గరకొచ్చి ‘అమ్మా ఎవరో వచ్చిర్రు, నన్ను తన కొడుకుంటున్నరు” అని చెప్పటం.. తర్వాత మా రెండో అన్న అబ్బసాయిలు ఆమె కొడుకుని కూచోబెట్టి మాట్లాడి భోజనం పెట్టడం… ఆమె మాత్రం ఇంట్లోకి రాలేదు. ఒకసారి అలా చూసుకుని వెళిపోయింది. అది నేను పుస్తకంలో ప్రస్తావించటం మర్చిపోయినాను. అది ఒక చిన్న లోటే అనిపిస్తుంది.

మరి మీ తమ్ముడు యాదగిరి సంగతి? అతను హఠాత్తుగా మాయమైపోయిం తర్వాత ఏమయ్యాడు?

వాడు మాత్రం అంతేనండి. మా నాన్న చాలా ప్రయత్నం చేశాడు గానీ, తెలియలేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొన్న నాకు తనికెళ్ల భరణి గారు ఫోన్ చేశారు. పుస్తకం చాలా నచ్చిందన్నారు. వాళ్ల నాన్న కూడా రైల్వేలో ఉండేవాడట. మా అందర్నీ ఆయన ఎరుగుదునని చెప్పారు. యాదగిరి తనకు బాగా తెలుసని చెప్పారు. సెకండియర్లో వాడు పారిపోవటం అదీ గుర్తు చేసుకున్నారు.

తెలుగు సాహిత్యం చదువుతారా?

చిన్నప్పుడు చదివేవాణ్ణి. యద్ధనపూడి సులోచనారాణి ఆ నవలలు చదివేవాణ్ణి. బియస్సి తర్వాత ఇక చదువులో పడి ఆ విధంగా అసలు సాహిత్యమే చదవటం తగ్గిపోయింది. జీవితమంతా కెమిస్ట్రీ చెప్పుకుంటూ బతికేశాను.

ఇదేంటంటే ఒక ఇన్నర్ ఫీలింగ్స్ రావటం వల్ల, దానికో స్ట్రక్చర్ ఇవ్వటం వల్ల, ఈ పుస్తకం వచ్చింది. ఇప్పుడు మాత్రం ఇంకా రాయాలని ఉంది. ఒక నవల రాస్తున్నాను. అలాగే కొన్ని షార్ట్ స్టోరీస్ కూడా రాయాలని ఉంది. కానీ ఏది రాసినా నేను ఇంగ్లీష్ లోనే రాయాలని నిర్ణయించుకున్నాను.

తెలుగులో దళిత సాహిత్యం గురించి తెలిసినంతలో గమనించింది ఏమిటి?

నేను చెప్పదల్చుకున్నదేమిటంటే, ఆకలి తెలిసినవాడే ఆకలి గురించి బాగా రాయగలడు. అగ్రకుల రచయితలు కొందరున్నరు, దళితులపై రచనలు చేస్తుంటరు. దాంట్లో నాకంత రిలవెన్స్ కనపడదు.

దళిత జీవితంపై మీకు నచ్చిన రచనలేమన్నా ఉన్నాయా?

నాపై బాగా ప్రభావం చూపిన రచనలు అంబేద్కర్‍వే. తర్వాత ఇందాక చెప్పిన “Outcaste” అనే పుస్తకం ఒకటి, అలెక్స్ హేలీ “రూట్స్” ఒకటీ నాకు బాగా నచ్చిన పుస్తకాలు. అలాగే బుద్ధిజం మీద కూడా చాలా స్టడీ చేశాన్నేను.

ఈ పుస్తకం ఇంగ్లీషు వెర్షన్‌కు స్పందన ఎలా వుంది?

బాగున్నదండి. ఈఇప్పుడు హిందీలోనూ కన్నడలోనూ కూడా అనువాదం కాబోతోంది. అమెరికాలో ఉన్న చాలా యూనివర్శిటీలు, ఇంకా సౌతీస్ట్ ఏషియన్ స్టడీ సెంటర్లు వాళ్లందరూ ఈ పుస్తకం పై ఆసక్తి చూపించారు. దీనంతటికీ ముఖ్య కారణం ప్రచురించింది ఒక అంతర్జాతీయ పబ్లిషర్ కావటం వలన.

అమెరికన్స్ ఈ సబ్జెక్ట్‌ని ఎలా అప్రోచ్ అవుతారు?

అంటే అక్కడ ఆఫ్రో అమెరికన్స్ బానిసత్వంలో ఉండేవారు కదా. ఎంత గాఢమైన బానిసత్వం అంటే వాళ్లని వల వేసి జంతువులను పట్టుకున్నట్టు పట్టుకుని లాక్కొచ్చి, ఆ “ఏడుతరాలు” నవలలో ఉంది కదా. అలా. అంబేద్కర్ ఏమంటాడంటే, అక్కడి బానిసత్వాన్నీ ఇక్కడ కులవ్యవస్థలో ఉన్న అంటరానితనాన్నీ పోల్చి చూసినపుడు, బానిసలు కొంతవరకూ మేలంటాడు. ఎందుకంటే బానిస ఒక యజమాని దగ్గర పని చేస్తున్నాడు. ఆ యజమాని బానిసను కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న డబ్బులన్నీ వెనక్కి ఇచ్చినట్టయితే, యజమాని తల్చుకుంటే, బానిసను విముక్తి చేస్తాడు. ఇక్కడ అది లేదుగా. పైగా అక్కడ పని చేసి పెట్టాలి గనుక యజమానులు బానిసల్ని బాగా చూసుకునేవారు. బానిసల ఆరోగ్య విషయాలపైనా, వాళ్లకి పెట్టే తిండి పైనా శ్రద్ధ వహించేవారు. ఒక ఆవునో ఎద్దునో మేపుతామే అట్ల. బానిసల్లో చదువును కూడా ఎంకరేజ్ చేసేవారు. ఎలాగంటే ఆ శ్వేతజాతి కులీన స్త్రీలు ఉంటరు కదా. వాళ్లు ఈ నల్లజాతి స్త్రీల చేత బైబిల్ చదివించుకునేవారు. అలా వాళ్ల అవసరాలు తీర్చుకుంటూ బానిసల అవసరాలు కూడా తీర్చేవారు. బానిసలకి వాళ్ల యజమానులకూ లింక్ ఏమిటంటే.. మతం. వాళ్లూ వీళ్లూ ఇద్దరూ క్రిస్టియన్సే. అఫ్కోర్స్… అది కూడా నీచమైన బతుకే. కానీ నేను కంపేరటివ్‌గా మాట్లాడుతున్నాను. దానితో పోల్చి చూసినట్టయితే… అంటరానితనం ఇంకా హీనం.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, మార్చి and tagged , , , , .

One Comment

  1. ఒక పుస్తకం రావడం వెనుక రచయిత పడే తపనను ఈ ఇంటర్వ్యూ అద్భుతంగా ఆవిష్కరించింది. పుస్తకం చదవడం ఒక ఎత్తైతే, దీన్ని చదివిన తర్వాత మళ్ళీ ఆ పుస్తకాన్ని చదివితే మరో థ్రిల్లు కలుగుతుంది. అంతే కాకుండా, ఆ పుస్తకంలో తొలగించిన అంశాలను చాలా వరకు దీనిలో ప్రస్తావించడం బాగుంది.
    మంచి ఇంటర్వ్యూని ప్రచురించిన మీకు నా శుభాకాంక్షలు
    దార్ల

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.