cover

మూగి దొడ్డ

Download PDF ePub MOBI

అపరిచితులు ఎవరెవరో అటూ ఇటూ పరిగెడ్తున్న

పెళ్ళి పందిట్లోంచి చాటుగా జారుకుని

ఒక చిన్ననాటి స్నేహితుడింటికి ఆటో వెతుక్కోడాన్ని

వర్ణించడానికి సరైన మాటలు లేవు

– ‘ఎవరితను? పిల్ల తండ్రివంక ఫ్రెండ్సుట!’ అని

ఆవిడ పెన్సిల్వేనియా మొహాన్ని అటు తిప్పుకుని

తలంబ్రాల వేదిక వైపు మరలిపోయినప్పుడు

 

గేటవతల ఒక్కడివీ నిలబడి

ఎన్నటికీ ఈ సంబరంలో నువ్వు పైవాడివేననీ

అటు పిల్లవంకా ఇటు పిల్లడి వంకా నిజానికి

ఎవరికీ ఎప్పటికీ ఏమీ కావనీ నువ్వు ఏ తోటలోనూ దిగలేవనీ

ఎవరితోనైనా షామియానాలో అందామనుకుని

నీదీ అనుకున్నది ఎంచేతో నీకూ తెలీకుండానే జారిపోడాన్ని

ఎటు చెప్పకోడానికీ ఇదమిద్ధం అని ఒక్క మాటా లేదు –

 

moogidoddaఎంచేతంటే

‘వీడ్కోలు మిత్రమా! శలవు తీసుకుంటానింక …’ అని

నలుగురూ జనాంతికంగా అనుకునేది ఏ ఒక్క మాట నీకు మిగిలినా

ఇరవై రెండేళ్ళనాటి పాత స్నేహితుడతను ట్రాఫిక్ రొదలో

స్కూటరు ఓ పక్కకి తీసి ఇబ్బందిగా ‘ఇంకేంటండీ?’ అన్నట్టు

నిలబడ్డాన్ని గురించి చెప్పుకోడానికి ఆ మాటనే వాడుండేవాడివి,

ప్రశ్నార్థకంగా నిల్చున్న ఆవిడ నీడన

ఇప్పటి మొహంలో నీ బాల్యపు చాయల్ని వెతుక్కుంటూ

ఇతనింక నీ స్నేహితుడు కాడని

ఏదో ఒక పాతప్పటి పరిచయస్థుడు మాత్రమేననీ

ఇంకా జైలు గోడంట పెరుగుతోందనుకున్న ఆ చింత మొక్కకి

నువ్వూ అతనూ ఏనాడాయీ ఏ ఉచ్చలూ పొయ్యలేదనీ

అది ఎప్పుడో చచ్చిపోయుంటుందనీ

ఇన్నేళ్ళ తరవాత ‘సరేనమ్మా! కలుద్దాం మరి….ఓ.కె.?’

అనుకుని

‘అమ్మయ్య! ఈ నటన ఇంక ఆపెస్తా’మని

ఒకే క్షణంలో ఇద్దరూ ఒడంబడిక చేసుకున్నట్టు

హడావిడిగా వీధి దీపాల మలుపులు తిరిగిపోడాల్ని

కలబోసుకోడానికి దేనికీ

మాటలు లేవు.

 

నువ్వు సప్త సముద్రాలవతల విడిచి వచ్చిన ఈ భాష

నిన్ను ఎత్తుకుని పెంచిన

చదువురాని విధవరాలు మూగి దొడ్డ.

 

బతుకంతా అందరికీ అడ్డ చాకిరీలు చేసి చేసి అలిసిపోయి

ఈ సుదూరపు వృద్ధాశ్రమంలోన ఇది

నీ ఒంటరి అవసరాలకి సరిపడినంత మాత్రం వడ్డించి

‘ఇంక వెళ్దునా? రామకోటి రాసుకోవాలి నేను…?’ అన్నట్టు

తలుపువార నిలబడుతుంది

మాటలులేని తనంతో

ముసిలి ప్రేమల్ని

ముంగి జ్ఞాపకాల దండేనికి తగిలించి

ఎటూ ఏమీ చెప్పుకోలేకుండా.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కవిత, మార్చి and tagged , , , , .

2 Comments

 1. మీదిలాటిది చదవటం ఇదే మొదటిసారి ప్రసాద్ గారూ. మీరిలాగ గూడా రాయగలరా అనిపించింది. పదాల్లో ఇమడక కొంకర్లు పోయే మాటల్లేని సందర్భాల్ని అనువదించే ప్రయత్నం నొప్పిగానే ఉంటుందిగదా. చెప్పలేక కాస్త తిమ్మిరిగా కూడా ఉంటుంది. నాకైతే మీ అక్షరాలేవీ కనపళ్ళేదు. చూపునో గుండెనో పట్టుకుని మీతో నడుస్తున్నట్టే ఉంది అక్కడ…

 2. “నువ్వు సప్త సముద్రాలవతల విడిచి వచ్చిన ఈ భాష

  నిన్ను ఎత్తుకుని పెంచిన

  చదువురాని విధవరాలు మూగి దొడ్డ.

  బతుకంతా అందరికీ అడ్డ చాకిరీలు చేసి చేసి అలిసిపోయి

  ఈ సుదూరపు వృద్ధాశ్రమంలోన ఇది

  నీ ఒంటరి అవసరాలకి సరిపడినంత మాత్రం వడ్డించి

  ‘ఇంక వెళ్దునా? రామకోటి రాసుకోవాలి నేను…?’ అన్నట్టు

  తలుపువార నిలబడుతుంది”

  I could feel your pain Prasad garu.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.