cover

సైన్స్‌‍ ఫిక్షన్

Download PDF ePub MOBI

వైజ్ఞానిక కల్పనాసాహిత్యం అని నోరు తిరగకుండా అనే కంటే సైన్స్ ఫిక్షన్ అంటేనే హాయిగా ఉంటుందేమో. కల్పనా సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ కూడా ఒక భాగమే. సైన్స్ కూడా జీవితంలో భాగం అయినట్లు.

చాలామంది రచయితలు కథలు నవలలు ఎందుకు రాస్తారు? జీవితంలో బాధలు కష్టాలు కన్నీళ్ళు అన్యాయాలు, ఇంకా చెప్పాలంటే దోపిడీ దగా అమాయకత్వం అసందర్భం.. ఇవన్నీ రచయితలో స్పందనని కలగజేస్తాయి. ఇవి గాక తనలోని ఆశలూ నిరాశలూ స్పందనలు, వీటన్నిటితో కనిపించే సమస్యలకై పరిష్కారాలు వెదకాలనిపిస్తుంది. కాని సమాధానాలు దొరకవు. ఈ సంఘర్షణ ఫలితమే కవిత్వమూ కథా నవలా రూపంలో వస్తుంది. ఇదిగాక నిజానికి, కథల ఉద్దేశం వినోదం కాలక్షేపం అంతే కదా. ఓ కథకీ, నాటకానికీ, సినిమాకీ, చివరకి లక్ష్యం ఎంటర్టెయిన్మెంట్ అంతే కదా. నేనో కథని చెప్తున్నాను. అంతే. దీనికి ఇన్ని అర్థాలు, విశ్లేషణలూ చేయడం అవసరమా. అంటే అవసరమే అనిపిస్తుంది. కాదంటే అవసరం లేదనిపిస్తుంది.

కాని వాస్తవాన్నించి పారిపోయే కల్పనలో కూడా వాస్తవం లోంచే కథలు సాహిత్యం పుడతాయి. వాటిలోంచి ఫాంటసీ, అంటే అద్భుత ఊహాకల్పన వొస్తుంది. మనిషికీ యంత్రాలకీ ఉన్న తేడా ఈ ఊహాకల్పన, విశ్లేషణ చేసే ఆలోచనాశక్తే కదా?

అయితే ఈ ఊహాశక్తినీ, కల్పనాశక్తినీ, సమాజంలోని రుగ్మతలనీ సైన్స్ దృక్పథంతో చూడగలిగితే, దానికి కొన్ని పరిష్కారాలు దొరకవచ్చు.

సైన్సంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ రాకెట్ సైన్సే కాదు, వైద్యం, సోషియాలజీ, ఏంత్రోపాలజీ, పొలిటికల్ సైన్స్ లాంటి సామాజిక శాస్త్రాలు కూడా.

మనం మన సమాజంలోని అన్యాయాలని అందుకనే శాస్త్రీయంగా చూస్తే మార్క్సిజంలానో కేపిటలిజం లానో పరిష్కారం దొరకవచ్చు. అలాగే ఆర్థికశాస్త్రంలో, రాజకీయశాస్త్రంలో దొరకచ్చు.

అలాగే మనం అనుకునే శారీరక రుగ్మతలు మానసిక రుగ్మతలకీ, వైద్యశాస్త్రంలో దొరకవ్చు. అందుకనే, ఉత్తకథలు చెప్పే కంటే వాటిని సైన్స్ ఆధారంగానో (అది సాంఘిక, లేక విజ్ఞానశాస్త్రం ఏదైనా) చెప్పగలిగితే అది ఇంకా గొప్ప సాహిత్యం అవుతుంది అని నేననుకుంటాను.

pic1అయితే పూర్తిగా శాస్త్రాన్నే రాస్తే విసుగుపుడుతుంది. అది కేవలం సైన్స్ రచన అవుతుంది. సైన్స్ ఫిక్షన్ అంటే సైన్స్‌కి కల్పన జోడించి ఇలా కూడా జరగొచ్చు అనేట్టు రాయగలగడం. దీనితో పాఠకుడికి వినోదం విజ్ఞానం కలగజేయడం. అందుకే వాస్తవంలో, సైన్స్‌లో జరగని అసంభవమైన విషయాలు సైన్స్ ఫిక్షన్ పేరిట రాయలేం. రాసినా నప్పదు. కాని రాసే వాళ్ళుండచ్చు. అది మైథాలజీనో ఫలానానో అవుతుంది. కొన్ని లక్షల డిగ్రీల వేడిలో వెలిగిపోయే సూర్యుడి మీద మనిషి కాలనీ పెట్టుకున్నట్లు రాయలేం కదా. అది అసంభవం. కుజుడి మీదో, శనిగ్రహపు ఉపగ్రహం టైటాన్ లోనో మనిషి కాలనీ పెట్టినట్లు రాయడం సైన్స్‌కి భవిష్యత్తులో సాధ్యం కాబట్టి అలా రాయచ్చు. సూర్యుడి దగ్గరగా వుండి వేడి కొన్ని వందల డిగ్రీలు వుండే బుధుడి మీద మనిషి కాలు మోపినట్లు ఎలా రాస్తాం? సైన్స్ రీత్యా అసంభవం అయినవి రాయలేం.

అయితే సైన్స్ అభివృద్ధి చెందనప్పుడు మనిషి ఊహ పాంటసీలోకి పెరిగి పాఠకుడు నిజంగా నమ్మేట్టు రాసేవారు. ఇది పురాణేతిహాసాలు అనుకోండి. Mythology. బాల ఆంజనేయుడు ఎగిరి సూర్యుడి దగ్గరకు వెళితే మూతి కాలి ఎర్రగా అయిందని రాయడం, పదితలల రావణుడు, ఎప్పుడూ నిద్రపోయే కుంభకర్ణుడు, చంపేస్తే మళ్ళీ అతుక్కుపోయే జరాసంధుడు.. ఇంకా పుష్పకవిమానం, ఎగిరే జటాయువు వంటి రాక్షసి పక్షులు. యుద్ధాల్లో ఉపయోగించే మిసైల్స్ లాంటి అస్త్రాలు – ఇవన్నీ “fantasy” లేక “mythology”. అప్పటి కాలానికి ఆ రచయిత ఊహకి రెక్కలొచ్చి వర్ణించినవి.

కాబట్టి సైన్స్ ఫిక్షన్ అంటే ఏమిటి? ఇది ఫాంటసీ కాదు. విజ్ఞానశాస్త్రంలో నిరూపించబడిన లేక భవిష్యత్తులో సాధ్యమైన కచ్చితమైన సిద్ధాంతాల ఆధారంగా కల్పనా, సంఘటనలు ఉంటాయి. అయితే కొన్ని వర్ణనలు ఊహాకల్పితంగా ఉండొచ్చు. కాని మనకు తెలిసిన, సాధ్యమైన సైన్స్ సిద్ధాంతాల ఆధారంగా వుంటాయి. ఈ ఊహలు సాధారణంగా సైన్స్ ప్రకారం భవిష్యత్తులో సాధ్యమే అనిపించేట్లు వుంటాయి. “సైన్స్ ఫిక్షన్ భవిష్యత్తులో సాధ్యమైన విజ్ఞాన శాస్త్రపు పురోగతి మీద ఆధారపడే ఘటనలని కథలని వర్ణిస్తుంది.” అందుకని కొంతమంది దీన్ని “లిటరేచర్ ఆఫ్ ఐడియాస్” అన్నారు.

చారిత్రకంగా, తార్కికంగా, భవిష్యత్తులో కాని, భూతకాలం, వర్తమానకాలంలో కాని, ఇంకొక రకంగా జరిగే సంఘటనలని కూడా వర్ణించవచ్చు. “Alternative Possibilities”.

సైన్స్ ఫిక్షన్ వాతావరణం అంతా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ముందుగా కాని, వేరే విధంగా కానీ వుంటుంది.

1) ఉదాహరణకి భవిష్యత్తులో సంఘటనలు లేదా వేరే కాలంలో కానీ, చారిత్రక భూతకాలంలో కూడా కానీ కథ వుండొచ్చు. (10,000 BC, Immortal of Meluha, Shiva Trilogy). భూతకాలంలో రాసినప్పుడు కథ చారిత్రక పురావస్తు పరిశోధనలకి భిన్నంగా కానీ, అనుకూలంగా కానీ వుండొచ్చు.

2) అంతరిక్షం (space) లో గానీ, మిగిలిన గ్రహాలు, గెలాక్సీలలో గానీ, గ్రహాంతర వ్యక్తుల గురించి కానీ కథలు.

3) ప్రస్తుతం తెలిసిన శాస్త్రీయ సిద్ధాంతాలకంటే, ఇంకా పురోగతి సాధించిన సిద్ధాంతాల ప్రకార వున్న టెక్నాలజీ మీద ఆధారపడే కథలు. ఊదా: కాల ప్రయాణం, రోబోలు, క్లోనింగ్, నానో టెక్నాలజీ.

4) కొత్తగా కనిపెట్టిన శాస్త్రీయ సిద్ధాంతాలు, లేక కనిపెట్టబోయే సూత్రాలు. ఉదా: కాల ప్రయాణం, కాంతికంటే వేగంగా ప్రయాణించడం, నానో టెక్నాలజీ, కొత్త రాజకీయ వ్యవస్థలు, విధ్యంసమైన సమాజ వ్యవస్థ (Dystopia), ఊహాజనిత సమానత్వం, అద్భుతంగా వుండే సమాజం (Utopia).

అందుకనే సైన్స్ ఫిక్షన్ ఇదీ అని నిర్వచించడం కష్టం.

డేమన్ నైట్ అనే ఆయన అన్నట్లు, చదవగానే ఇది సైన్స్ ఫిక్షన్ అని అనిపిస్తే అదే సైన్స్ ఫిక్షన్! (అశ్లీల సాహిత్యం లాగానే. చదవగానే ఇది అశ్లీలం అనిపిస్తే అది అశ్లీలమే). రాబర్ట్ హెన్‌లీన్ అనే ఆయన నిర్వచించిన ప్రకారం “ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు విజ్ఞానశాస్త్రం ప్రకారం, విజ్ఞానశాస్త్ర పద్ధతుల ద్వారా భవిష్యత్తులో ఏం జరుగుతుందో రాయడం, ఇదే సైన్స్ ఫిక్షన్!”

సైన్స్ ఫిక్షన్ చరిత్ర:

బహుశా సైన్స్ ఫిక్షన్ పురాణేతిహాసాల నుంచి ఉందేమో. దీనికి “ఫాంటసీ” కూడా జోడించబడి ఉండేది. రామాయణంలో పది తలల రావణుడు (Monster), రాక్షసులు, పుష్పకవిమానం, సముద్రం మీద ఎగిరే ఆంజనేయుడు.. ఇవన్నీ చాలా చాలా ప్రస్తుత ఫాంటసీ సూపర్‌హీరో సాహిత్యం లాగానే వుంటాయి.

Frankenstein by Mary Shelleyల్యూసియన్ “True History” రెండో శతాబ్దంలోనిది, అరేబియన్ నైట్స్ కథలు, జొనాథన్ స్విఫ్ట్ గలివర్ ట్రావెల్స్ లాంటివి మనకి తెలుసు. ఇవి ఫాంటసీ కథలు. 18వ శతాబ్ధంలో “నవల” అనే సాహిత్య ప్రక్రియ ప్రారంభం అయింది. మేరీ షెల్లీ “ఫ్రాంకిన్‌స్టెయిన్”, “లాస్ట్ మ్యాన్” నవలలు మొదటి సైన్స్ ఫిక్షన్ నవలలుగా చెప్పవచ్చు.

war-of-the-worldsవిజ్ఞానశాస్త్రం అభివృద్ధి అయి విద్యుచ్ఛక్తీ టెలిగ్రాఫ్ రైలింజన్ లాంటివి కనిపెట్టిన రోజుల్లో జుల్స్ వెర్న్, హెచ్.జి.వెల్స్ జనప్రియమైన సైన్స్ సాహిత్యం సృష్టించారు. హెచ్.జి.వెల్స్ “వార్ ఆఫ్ ద వరల్డ్స్”లో కుజగ్రహవాసులు ఇంగ్లండ్ మీద దాడి చేసినట్లు రాశారు. “టైం మెషీన్” రాశారు.

20వ శతాబ్ధంలో సైన్స్ ఫిక్షన్ పత్రికలు “Amazing Stories“, “Astounding Science fiction” వచ్చి సైన్స్‌ఫిక్షన్‌ను “సై.ఫై” (Sci-Fi)గా పేరు పొందేట్లు చేశాయి.

ఆర్థర్ క్లార్క్, ఐజాక్ అసిమోవ్, జుడిత్ మెరిల్, కార్ల్ సాగాన్.. ఇలా ఎందరో సైన్స్ ఫిక్షన్ రాశారు. అసిమోవ్ రాసిన “Empire Foundation” నవలల ఆధారంగానే తర్వాత జార్జ్ లీకాస్ “Star Wars” సినిమాలు సృష్టించారు. ఇవి స్పేస్ ఒపెరాగా ప్రసిద్ధిగాంచాయి.

StarWarsMoviePoster1977సైన్స్‌ఫిక్షన్‌కి కొద్దిగా పాత్రపోషణ, రొమాన్స్ కలిపిన సినిమాలు, కథలు మొదలయ్యాయి. స్టార్‌వార్స్ ఆరు చిత్రాలు రొమాంటిక్‌గా అద్భుతంగా వుంటాయి. అవి చరిత్రలో క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.

గ్రహాంతరయానం, గ్రహాంతరవాసులు, కాంతివేగ ప్రయాణం ఇవన్నీ రాయడం మొదలైంది. టివి సీరియల్స్ “Star Trek”, “Dr. Who” లాంటివి విపరీతంగా ప్రాచుర్యం పొందాయి. రచయితల వూహ కల్పన అద్భుతంగా సాగి ప్రస్తుతం అసాధ్యమైనవన్నీ భవిష్యత్తులో సాధ్యం అయినట్లుగా చిత్రీకరించిన నవలలు, సినిమాలు అనేకం వచ్చాయి.

సైన్స్‌ఫిక్షన్‌లోని ఉపశాఖలు:

1. హార్డ్‌కోర్ సైన్స్ ఫిక్షన్: మరీ శాస్త్రీయంగా వివరాలతో వుంటుంది.

2. సాఫ్ట్ – సోషల్ ఫిక్షన్: సైకాలజీ, ఎకనామిక్స్, రాజకీయ శాస్త్రాల లాంటి శాస్త్రాల ఆధారంగా ఉంటుంది. జార్జ్ ఆర్వెల్ “1984”, ఆల్డస్ హక్స్‌లీ “Brave New World” మొదలయినవి.

BraveNewWorld_FirstEdition3. సైబర్ పంక్: ఇన్ఫర్మెషన్ టెక్నాలజీలోని ప్రగతి ఆధారంగా ఛిన్నాభిన్నమైన సమాజం ప్రపంచం యంత్రాలు మనిషిని అధిగమించడం. ఇలాంటివి “టెర్మినేటర్”, “మాట్రిక్స్ సిరీస్”, “ట్రాన్స్‌ఫార్మర్స్” ఇలాంటివి.

టైంట్రావెల్ (కాల ప్రయాణం), ఆల్టర్నేటివ్ హిస్టరీ, మిలిటరీ సైన్స్ ఫిక్షన్, మానవాతీత వ్యక్తులైన సూపర్ హ్యూమన్స్ గురించి రాసే కథలు “ఎపోకాలిప్టిక్” అంటే ప్రపంచం ఎలా నాశనం అయి ప్రళయం వస్తుందో వివరించే కథలు (2012), ఇవి కొన్ని ఉపభాగాలుగా చెప్పవచ్చు.

సైన్స్‌ఫాంటసీ, సైన్స్‌హారర్, సైన్స్‌మిస్టరీ ఫిక్షన్‌లు కొన్ని ఉపభాగాలు.

ఫాంటసీలో (అద్భుతమైన ఊహాకల్పన) జె.కె. రౌలింగ్ రాసిన హేరీ పాటర్ సిరీస్ ఒక ఉదాహరణ, సైన్స్ పరంగా సాధ్యం కాని వేరే మంత్రశక్తులు సంఘటనలు వ్యక్తులు ఈ సాహిత్యంలో ఉంటాయి. సైన్సూ ఫాంటసీ కలిసి కూడా ఉండవచ్చు.

సైన్స్ హారర్: హారర్ సాహిత్యం అందరికీ తెలుసు (రాంగోపాలవర్మ పుణ్యమా అని). “Exorcist” ఈ తరహా సాహిత్యంలో ట్రెండ్ సెట్టర్. దయ్యాలు, భూతాలు, క్షుద్రశక్తులు, వాటిని వదిలించుకోవటం, ఇలా ఎంతయినా రాసుకోవచ్చు.

ఇంకా మిస్టరీ, మెడికల్ హారర్ (కోమా, ఫీవర్ మొదలైనవి), సూపర్ హీరోలున్న సైన్స్ ఫిక్షన్ (స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ మొదలైనవి), మాన్‌స్టర్స్ ఉన్న సైన్స్ సాహిత్యం (అనకొండ లాంటివి) ఉపశాఖలుగా చెప్పవచ్చు. ఏది రాసినా మానవతా విలువలు, ఆదర్శాలు, కాస్తో కూస్తో సైన్స్ పరమైన “plausibility” అవసరం.

ICCUతెలుగులో నేను “ఐ.సి.సి.యు” రాసినప్పుడు ఇరవై ఏళ్ల క్రిందట ప్రచురణకి చాలానే కష్టపడాల్సి వచ్చింది. సైన్స్ ఫిక్షన్ తెలుగులో లేదని అనుకునేవాడిని. కాని డా. సుధాకర్ నాయుడు అనే పి.హె.డీ స్కాలర్ గారు చేసిన పరిశోధన వల్ల తెలుగులో సైన్స్ కథలు, నవలలు చాలానే ఉన్నాయని తెలుసుకున్నాను.

“తెలుగులో సైన్స్ ఫిక్షన్” అనే ఈ పరిశోధనా గ్రంథంలో సుధాకర్ నాయుడు గారు ఎంతో వివరంగా తెలుగు సైన్స్ ఫిక్షన్ గురించి పరిశోధన చేసి విషయాలు పొందుపరిచారు. దీని నుంచి నేను తీసుకున్న కొన్ని ఆసక్తికరమైన వివరాలు:

తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ కథ 1927 జనవరిలో “సుజాత” మాసపత్రికలో వచ్చిన “పరమాణువులో మేజువాని”. ఆ కథా రచయిత సిరిగూరి జయరావు. కె.ఆర్.కె మోహన్, కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాథ్, బొల్లిముంత శివనాగేశ్వరరావు, మైనంపాటి భాస్కర్, పురాణపండ రంగనాథ్ ఇంకా అనేకమంది రాసిన సైన్స్ కథల గురించి ఈ పుస్తకంలో చర్చించారు.

ByeByePoloniaతెలుగు సైన్స్ ఫిక్షన్ నవలలుగా మొత్తం 50 నవలల గురించి ఈ పరిశోధనలో వివరించారు. వాటిలో నేను రాసిన “బై బై పొలోనియా” నవల ఒకటి వుంది అని నాకు సంతోషంగా ఉంటుంది.

ఈ 50 నవలలు 1998 దాకా వచ్చినవి. టేకుమళ్ళ రాజగోపాలరావు రాసిన “విహంగయానం” తొలి సైన్స్ ఫిక్షన్ నవల (1934) అని పేర్కొన్నారు.

సైన్స్ నిజాన్ని కచ్చితంగా, నిర్ద్వంద్వంగా చెబుతుంది. కాని సైన్స్ అంచున మనకి తెలియని విషయాలెన్నో గ్రేజోన్‌లో ఉంటూనే ఉంటాయి. అందుకే సైన్స్‌కీ, వాస్తవానికీ, ఊహకీ అంచున మానవతా విలువలతో మంచి సైన్స్ ఫిక్షన్ సృష్టించవచ్చు. తెలుగులో అది అవసరం అని నేననుకుంటాను.

– చిత్తర్వు మధు

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/jdhancock/7801182534 ; https://www.flickr.com/photos/pasukaru76/4960069667 & Wikipedia)

Posted in 2014, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.