FC

మధ్యతరగతి జీవితాలలోని నేటి సంక్షోభాలకు అద్దం పట్టిన నవల “వికసిత”

Download PDF ePub MOBI

ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ, “అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరు అంటుంటారు రామ రామా… అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా… చెల్లెమ్మా… అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా…” అనే ఓ పాత సినిమా పాట మనసులో మెదులుతూనే ఉంటుంది. లోకానికి రెండో వైపు గురించి ఆ పాట ప్రస్తావిస్తే, సాంకేతిక రంగం, ప్రగతి అనే రంగాలలోని మరో కోణాలను ఈ పుస్తకం దర్శింపజేస్తుంది.

ఎలాగైనా అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడి ఓ మంచి ఐటి కంపెనీకి సి.ఇ.వో స్థాయికి ఎదగాలనుకునే అక్షయ్ అనే ఓ యువకుడి కథ ఇది. అతని జీవితగమనంలో తారసపడిన వ్యక్తులూ, అతన్ని ప్రభావితం చేసిన పాత్రల గురించి చదువుతూంటే మన నిజజీవితంలోనూ ఇలాంటి వ్యక్తులున్నారనే వాస్తవం మనకు స్ఫురించక మానదు. అక్షయ్ ఇంజనీరింగ్ కాలేజిలో చేరడం… అక్కడ వివిధ వ్యక్తులతో పరిచయాలు పెరగడం… తన వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే లక్ష్యం కన్నా, సామాజికంగా పదిమందికీ మేలు చేసే లక్ష్యమే మంచిదని అక్షయ్ గ్రహించడం… ఆ గమ్యం దిశగా సాగడం ఈ నవల సారాంశం.  కాలేజిలో జరిగే రాగింగ్‌ని, ఆదర్శవంతులైన విద్యార్ధులు దాన్ని సమర్ధంగా ఎదుర్కునే పద్ధతిని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో  కాలేజీలూ మూతపడడం గురించి, మళ్ళీ విద్యార్ధులు చదువులు కొనసాగించడం గురించి ఈ నవల చక్కగా వివరిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం మిషతో పబ్బం గడుపుకుంటున్న రాజకీయవేత్తలపై చురకలు వేస్తుందీ నవల.

కథాగమనంలో ఎదురయ్యే నిత్య, రాజమౌళి, ప్రవీణ… మొదలైన పాత్రలు వైయక్తిక, సామాజిక పురోగమనానికి ప్రతీకలైతే… ప్రశాంత్, ప్రియ, స్వప్న, ప్రదీప్… లాంటి పాత్రలు అధికార గర్వం, ధనమదంతో కళ్ళుమూసుకుపోయి ప్రవర్తించే సంపన్న కుటుంబాల వారసులకు చిహ్నాలు. మారుతున్న కాలంతో పాటు మారలేక, ఏ వైపు మొగ్గాలో నిర్ణయించుకోలేని వ్యక్తులను నిత్య తల్లిదండ్రులు ప్రతిబింబిస్తారు. వ్యాపార సంస్కృతి మోసుకొచ్చే ఒంటరితనానికీ, విచ్చలవిడితనానికి ప్రతీకలు నందిని లాంటి పాత్రలు.  ఈజీ మనీతో సంక్రమించే దురలవాట్లూ, పట్టుదల ఉంటే వాటి నుంచి ఎలా బయటపడవచ్చో నిరూపించిన శ్రీకాంత్ పాత్ర చదువరులను ఆకట్టుకుంటుంది. చెగువేరా ఎవరో కూడా తెలియకుండా, తమ ఆరాధ్యనటుడు ఆ టీ-షర్ట్ వేసుకుంటాడు కాబట్టి తానూ చెగువేరా బొమ్మ ఉన్న చొక్కా వేసుకుని చెగువేరాని హాలీవుడ్ హీరో అని భ్రమపడే కుర్రాడు కాలక్రమంలో తన జీవితాన్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుకున్న విధానం ఆసక్తి కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య సదవగాహన ఉంటే ఒకరి కెరీర్లు మరొకరికి ప్రతిబంధకం కావని; ప్రేమంటే… బాధ్యతలని విస్మరించి సినిమాలలో చూపినట్లు పార్కుల చుట్టూ తిరగడం కాదని, తమ తమ లక్ష్యాలను సాధించుకునే క్రమంలో తాము ఎదుగుతూ తమ ప్రియతముల ఎదుగుదలకూ సహకరించడమే నిజమైన ప్రేమ అని ఈ నవల చెబుతుంది. ప్రధాన పాత్రధారులలో కనబడే నిబద్ధత, స్పష్టత పాఠకులను ఆకట్టుకుంటుంది, ఆలోజింపజేస్తుంది.

వ్యక్తిగతంగా సామాన్యులు సంఘటితమైతే వారి శక్తి ఎలా అసామాన్యం అవుతుందో ఈ నవల చెబుతుంది.  ప్రస్తుతం భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి జాడ్యాన్ని ప్రస్తావించి, సమకాలీనా వార్తాకథనాలన్నింటినీ కథానుగుణంగా ఉపయోగించుకున్నతీరు రచయిత నైపుణ్యాన్ని చాటుతుంది.  ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌కీ, ప్రొప్రైటరీ సాఫ్ట్‌వేర్‌కీ మధ్య ఉండే తేడాని; లినక్స్‌కీ, విండోస్‌కీ మధ్య ఉన్న స్పర్ధనీ కథలో చక్కగా ఇమిడ్చి పాఠకుల అవగాహనని మరింత పెంచారు రచయిత. బిపివోలు, అవుట్ సోర్సింగ్ వెనుక  అగ్రరాజ్యానికి ఉన్న స్వీయ ప్రయోజనాలను స్పష్టం చేసారు.

ఐటి రంగంలో ఉద్యోగాలంటే అందమైన లోకంగా ఊహించుకుని, వేలంవెర్రిగా ఆ ఉద్యోగాల కోసం ఎగబడ్డ, ఎగబడుతున్న ఉద్యోగార్ధుల వ్యథ ఈ నవల. ఐటి రంగంలో పనిచేసేవారి జీవితాలు అత్యద్భుతంగా ఉంటాయనే అపోహకి భిన్నంగా, ఐటి ఉద్యోగుల జీవితాల్లోని అభద్రతని, ఆర్ధిక అస్థిరతని ఎత్తి చూపుతుంది ఈ నవల.

ఐటి ఉద్యోగాల కోసం రకరకాల కోర్సులు, కోర్సుల నిర్వహణలోని లోపాలు, ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి మోసం చేసే కన్సల్టింగ్ సంస్థలు… ఇవన్నీ కథలో అంతర్లీనంగా సాగుతాయి. ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచక, రిక్రూట్ చేసుకున్న కొత్తవాళ్ళని పనిలోకి తీసుకోకుండా, ఎక్కువ మందిని బెంచ్ మీద కూర్చోబెట్టే ఐటి సంస్థల తీరుతెన్నులను ఈ నవల ఎండగడుతుంది.

ఐటి నేపధ్యంలో సాగినా, ప్రస్తుత ప్రపంచపు గమనాన్ని శాసిస్తున్న అనేక అంశాలని స్పృశిస్తూ సాగుతుందీ నవల. తాను స్వయంగా సంక్షోభంలో కూరుకుపోతూ, ఇతరదేశాలను కూడా అదే బాట పట్టిస్తున్న అగ్రరాజ్యం దుర్నీతిని బహిర్గతపరుస్తుంది ఈ నవల.  అమెరికా పెట్టుబడిదారి విధానాన్ని ఎదిరించి, తమ సొంత విధానాలతో ముందుకు సాగుతున్న లాటిన్ అమెరికన్ దేశాల గురించి వివరించారు రచయిత.

అనేక సమస్యలను ప్రస్తావించడమే కాకుండా, వాటి పరిష్కారాలకు సూచనలు కూడా చేస్తుందీ నవల. ఐటి రంగంలోకి ప్రవేశించాలనుకునే వారూ, ఆ రంగంలో పనిచేస్తూ అభద్రతకూ, అనిశ్చితికి గురవుతున్న వారూ తప్పక చదవాల్సిన పుస్తకం “వికసిత”.

– కొల్లూరి సోమ శంకర్

ప్రాప్తి:—

సాహితీ స్రవంతి, FC
1-ఎమ్.హెచ్. భవన్, ప్లాట్ నెం. 21/1,
అజామాబాద్, ఆర్టీసి కళ్యాణమండపం
హైదరాబాద్ – 20, ఫోన్ 040 27660013
& ప్రజాశక్తి, విశాలాంధ్రా, నవోదయ బుక్ హౌసుల్లో

ఈబుక్ కినిగెలో లభ్యం

Posted in 2014, ఏప్రిల్, పుస్తక సమీక్ష and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.