cover

చెప్పుకోండి చూద్దాం – ఏప్రిల్ 2014

ఈ శీర్షికన ఏదైనా ఒక తెలుగు రచనలోంచి కొంత భాగాన్ని ఉదహరిస్తాం. దాని ఆధారంగా అడిగే ప్రశ్నలకు జవాబివ్వాలి. మీ సమాధానాన్ని ఇక్కడ కామెంటుగా గానీ (దాన్ని పెండింగ్ లో ఉంచుతాం), లేదా editor@kinige.com కు మెయిలుగా గానీ పంపవచ్చు.

ఇక్కడ నలుగురు రచయితలు రచనా భాగాలున్నాయి. ఈ రచనా భాగం ఒక్కోటీ ఆయా రచయితలకే ప్రత్యేకమైన భావ తీవ్రతకి గానీ, రచనా శిల్పానికి గాని, శైలి తత్త్వానికి గానీ… ఇలా ఏదో ఒక ముఖ్య పార్శ్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వీటి ఆధారంగా ఆ రచయితలెవరో చెప్పండి. ప్రశ్న అంత వరకే గానీ, మీకు ఇంకా సాధ్యమైతే ఆ రచనలు ఏమిటో కూడా (అవసరమనిపించిన చోట ఐటాలిక్స్ లో క్లూలు ఉన్నాయి):—

1.

సాధారణ కవులు తాము కలలు కనే ఔన్నత్యాన్ని జీవితంలో కొంచెం కూడా సాధించుకోలేక, ఆ వీధుల కెగరగల బలం చాలక సినిక్సుఐ త్వరలోనే గుంపులో కలిసి సామాన్య జీవితంలో పడి, తాము ఎన్నడో రచించిన రెండు గీతాల కీర్తిని తిరగబెట్టుకుంటూ బతుకుతారు. తాను ఏ నిమిషానో అందుకుంటున్న వెలుగులో నీతిని నిత్యజీవితాన్ని వెలిగించుకునే ప్రయత్నం చెయ్యని ఆర్టిస్టు, కాయితం మీద ఎంత గొప్పవి కల్పించనీ గొప్పవాడు కాడు. తన వేళ్ళు కల్పించే అందం, తన హృదయంలోకి ఇంకి, తన ముఖానికీ మాటకీ తేజాన్నివ్వాలి. అది చాత గాక పోవడం వల్లనే చాలామంది గొప్ప ఆర్టిస్టులు వ్యర్థులు, డాంబికులు, దుర్మార్గులు. To live artistically is the highest art.

2.

కేవలం కుతంత్రాలతో మిమ్మల్ని నిలబెడుతున్నాను కాదూ? పాపం! మీ అమూల్యమైన కాలం వ్యర్థపుచ్చుతున్నాను. లేకుంటే యీ లోపున మీరు మరేదో చదువుకొని ఉందురు. పద్యం, విమర్శ, తమాషాలు, వార్తలు, ఏవో, ఏవో! ఇప్పటికీ మీకు కొంత విసుగుపుట్టి తటాలున తర్వాతి పుటలకు పోదామని ఉంటుంది. కానీ “సీతయ్యను గురించి పూర్తిగా తెలుసుకొని మరీ పోదాం ఎలాగూ రానే వచ్చాం” అనే అవస్థ పీకుతూ ఉంటుంది. కల్పిత వ్యక్తి అయితేనేం కథ బాగుంటే చాలునని నిలబడతారు.

(ప్రధానంగా కవి ఐన ఈయన కథలు చాలా వాటిలో, ఇక్కడ కనిపిస్తున్న లాంటి సెల్ఫ్ అవేర్నెస్ ఏదో ఉంటుంది. అంటే కథ తను ఒక కథ అనే స్పృహ కలిగి ఉండటం.) 

3.

శుక్లాష్టమి వెన్నెల శివజటాటవీ నట న్మందాకినీ నవస్మేర వీచీ రామణీయకము వోలె, అంబికా ప్రసన్నాపాంగరేఖా ప్రసారము వోలె, విఘ్ననాయకుని ఏకదంత సితచ్ఛటా స్వచ్ఛతంబోలె శైవమహాత్మ్యమై విరిసెను.

4.

ఆకాశంలో చుక్కలు, నిర్మల సముద్రం మీద నిలబడిపోయిన పూలపడవల్లా, మనోహరంగా కనిపిస్తున్నాయి. ఒక మేఘం శాస్త్రి గారి తెల్లగడ్డంలా స్వచ్ఛంగా వెండిదూదిలా ఉంది. ఊరి సందుల్లోంచి గాలి మత్తుగా సోలిపోయి నిద్రపోతోంది. “మంచి రాజుల” రాజ్యంలో మురికి మనుష్యులు కూడా ఆనందంగా ఉంటారన్నట్టు! మురుగు కాలువలు కూడా చందమామల వెన్నెల అలలకి మురిసిపోతున్నాయి. పాతపెంకుల ఇళ్ళు కూడా అంత అందమైన రాత్రిలో అంత బరువుగా బాధగా కనిపించడానికి ఎంతో సిగ్గుపడుతున్నాయి. నాచుపట్టిన పాత డాబాలు కూడా వెన్నలందానికి రెచ్చిపోయి సిగ్గు మర్చిపోయి సింగారాలకి సిద్ధపడుతున్నాయి. రొట్టెల షావుకారు గారి కొత్త మేడ ఆయన కొత్త కోడల్లాగే ఈ వెన్నెలంతా నాదే అన్నట్టుగా రాణీలా నిల్చుంది. పున్నమినాటి వెన్నెల్ని నీలపు తెరలోంచి చూస్తే ఉన్నట్టు సప్తమి నాటి వెన్నెల రమ్యాతి రమ్యంగా రాబోయే రేపటి పెండ్లికి మరికొంత కలువకన్నియ ఈనాడు కలలో కనిపించినట్లు కడు కమ్మగా ఉంది. రాత్రంతా ఎంతో చల్లగా నిన్న సాయంత్రం ఆరవేసిన అమ్మ చీర ఈవాళ తెలివేళ మెత్తగా చల్లగా ఉన్నట్టు ఎంతో మెత్తగా మధురంగా ఉంది.

(ఈయన రచన జీవితం మొదట్లో కొన్నాళ్లు మారు పేర్లతో రాశారు. ఆ పేర్లలో జాస్మిన్ అనేది ఒకటి)

 *

గత సంచికలో అడిగిన రెండు ప్రశ్నలకు సరైన జవాబులివి:—

sarat

1. మొదటి ప్రశ్నలో ఇచ్చిన రచనా భాగం శరత్ బాబు నవల “దేవదాసు” ముగింపు.

rajaram

2. రెండవ ప్రశ్నలో ఇచ్చిన రచనా భాగం మధురాంతకం రాజారం కథ “కమ్మ తెమ్మెర” ముగింపు.

ఈ రెండు జవాబుల్నీ సరిగా పంపిన వారు జ్యోతి. వారికి మా శుభాకాంక్షలు.

Posted in 2014, ఏప్రిల్, చెప్పుకోండి చూద్దాం and tagged , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.