cover

మూడు కుటుంబకథలు

Download PDF ePub MOBI
ఇది ఎస్. రామకృష్ణన్ రాసిన “మూండ్రు కుడుంబకదైగళ్” అనే కథకు అవినేని భాస్కర్ అనువాదం. ఈ కథ “నడందు సెల్లుం నీరూట్ఱు” (నడిచి వెళ్ళే నీటివూట/చెలమ) అనే కథా సంపుటంలోనిది. రచయిత పరిచయం ఇక్కడ.

మూడు కుటుంబకథలు

1. పింగాణి కొంగలు

ముప్ఫైయెనిమిదేళ్ళుగా అమ్మ తలవంచుకుని నేలని చూస్తూ బతుకుతుంది. తన పదిహేడో ఏట అమ్మ ఒకరోజు వంటచేస్తున్నప్పుడు నాన్న బర్మానుండి తెచ్చిన టీ కప్పు చేజారి పగిలిపోయింది. అప్పట్నుండి ఇలా వంచిన తల పైకెత్తకుండా నేలని చూస్తూ ఉండిపోయింది అట. అప్పటికి నేను పుట్టలేదు. ఆ టీ కప్పు చైనా బంకమట్టితో చేయబడినది. దాని మీద రెండు కొంగలు బంగారు రంగులో చిత్రించబడి ఉన్నట్టు నాన్న అప్పుడప్పుడూ చెప్పేవాడు. బహుశా పెళ్ళయిన కొత్తల్లో వాళ్ళ ప్రేమని వ్యక్తపరిచేరీతిలో నాన్న ఆ టీ కప్పుని కొనుక్కొచ్చి ఉండచ్చు. ఆ సంఘటన జరిగిన రోజు అమ్మ కప్పు నిండుగా వేడి టీని పోసినందువల్ల చేత్తో పట్టుకోలేక చేజారి కిందపడి పగిలిపోయుండచ్చు. నాన్న పగిలిన కప్పుని చూడగానే అమ్మని లాగి చెంపమీద కొట్టి, ‘పనికిమాలిన గాడిద… బర్మా కప్పది… ఒకే క్షణంలో పగలగొట్టావు కదే… ఒళ్ళు దగ్గరపెట్టుకోకుండా పనులు చేస్తే ఇలానే అవుతుంది’ అని నోటికొచ్చినట్టు తిట్టాడట. అమ్మ దిగ్భ్రాంతితో అలా నిలబడిపోయిందట. పెళ్ళయ్యేవరకు నాన్న బర్మాలో కలప వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే పెళ్ళయ్యాక ఆయన బర్మాకి తిరిగెళ్ళలేదు. మునేశ్వరడు వీధిలో చిన్న ఫోటో స్టూడియో నడుపుకుంటూ ఇక్కడే బతుకు తెరువు సాగించాడు. ఆ తర్వాత నాన్న తీసిన ఒకటి రెండు ఫోటోల్లో కూడా అమ్మ నేలకేసి చూస్తూ తలదించుకునే ఉంది. ఆమ్మ అలా ఉండటం పెద్ద విషయమని ఒకసారైనా నాన్నకి అనిపించినట్టులేదు. నాన్నకే కాదు ఇంట్లో ఉన్న చిన్నాన్నలో నాన్నమ్మో ఎవరూ ఆమె అలా ఉండటాన్ని గుర్తించినట్టేలేరు. ఎవరైనా బయటవాళ్ళు ఇంటికొచ్చినప్పుడు మాత్రమే ఆమె అలా తలదించుకునే ఉంటుందన్న విషయం గుర్తొస్తుంది కాబోలు. నాన్న అదొక వ్యాధి అని చెప్పేసేవాడు. అమ్మ నేలకేసి అలా ఏం చూస్తుందో ఎవరికీ తెలీదు. అయితే నేలమీద ఏదో ఒక ముఖ్యమైన పని జరుగుతువున్నట్టు దాన్ని తను దీక్షగా చూస్తున్నట్టు ఉండేది ఆమె చూపు. రాత్రుల్లో కూడా అమ్మ వంటగదిలో ఒట్టినేలపై భూమికేసి చూస్తున్నట్టు ముఖంపెట్టుకుని పడుకునేది. దీనివల్ల అమ్మ కాపురంలో పెద్ద మార్పేం రాలేదు. LOGOఆరుగురు పిల్లలు పుట్టారు. అందులో ఒక బిడ్డ పుట్టిన కొన్ని వారాలకే చనిపోయింది. అమ్మ పిల్లల్ని కూడా తల పైకెత్తి చూడనేలేదు. తలవంచుకునే ఉండటంవల్లేమో ఆమె తల విరిగి వేళాడే అరటి ఆకులా కిందకి వేళాడుతున్నట్టు ఉంటుంది. అమ్మ తన జీవితమంతా వంటగదిలోనే గడిపేది. ఎప్పుడైనా చేజారి గ్లాసో గరిటో పడినప్పుడు ఆమె ఆవేశంగా భూమిని తిట్టడాన్ని చూస్తే ఎవరో తెలిసిన వ్యక్తితో మాట్లాడుతున్నట్టు ఉండేది. ఇంట్లో ఉన్నంతసేపు పగలూ రేయి నాన్న గొంతు ఏదైనా తాగడానికో తినడానికో యాచిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒక ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో కూడా అమ్మ ఇంటి గడప దాటి వెళ్ళింది లేదు. ఆమెకి ప్రపంచం తల పైకెత్తి చూడతగనిదిగా మనసులో ముద్రపడిపోయింది. కొన్ని సార్లు అమ్మలాగా నేనూ తలదించుకుని చూసేవాణ్ణి. ఏదో అపరాధం చేసినభావం కలిగేది మనసులో. ఒక పింగాణి కప్పు పగలగొట్టినందుకు ఎందుకని ఇలాంటి శిక్షని ఇచ్చుకుంది అని ఆలోచించుకుంటూ ఉండేవాణ్ణి. అమ్మ స్వభావాన్ని అర్థంచేసుకోలేక పోయేవాణ్ణి. కాలం ఇంటి నుండి ఒక్కొక్కర్నీ వెలివేయడం మొదలుపెట్టింది. పెళ్ళిళ్ళూ ఉద్యోగమూ మా అక్కయ్యల్నీ నన్నూ వేరే వేరే ఊళ్ళలో పడేసింది. మరణం అతిథిలా ఇంట్లోకి చొరబడి తనకి నచ్చినవాళ్ళని వెంటబెట్టుకెళ్ళింది. నాన్నమ్మ చచ్చిపొయినప్పుడు, చిన్నాన్న చనిపోయినప్పుడు కూడా అమ్మలో ఏ మార్పూ చలనమూ లేదు. అప్పుడు కూడా అమ్మ తలదించుకునే ఉండేది. వార్ధక్యం వచ్చి అమ్మా నాన్నా మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు. అప్పుడు కూడా అమ్మ వంటపనులకి విరమణ రాలేదు. ఆమె బొద్దింకలతోనూ, చెమ్మెక్కిన అగ్గిపుల్లలతోనూ మాట్లాడుతుండటం నాన్న విన్నారు. ఆయనకి కొన్ని సార్లు అమ్మని చూడటానికి భయమేసుండచ్చు. తనకీ వార్ధక్యం వచ్చినట్టు ఆమెకి తెలిసిపోయుంటుందా? ఎందుకని ఇంత వైరాగ్యంగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమె వాలిపోయిన వరి ఎన్నులాగా తలదించుకుని ఉండేది. అమ్మ ఎవర్నీ తప్పుబట్టడమో తిట్టడమో జరగలేదెప్పుడూ. ఒక వేసవి కాలపు చివర్లో నడిరాత్రి నాన్న లైట్ వేసుకోకుండ బాత్రూం లోకెళ్ళి జారిపడటంతో ఆస్పత్రిలో పాలయ్యారు. ఆ రోజు కూడా అమ్మ వంట చెయ్యడం మానలేదు. నాన్న చనిపోయి శవాన్ని ఇంటికి తెచ్చినప్పుడు కూడా ఆమె వంటగదిలో నిల్చుని తలదించుకునే ఏడుస్తూ ఉంది. శవాన్ని తీసుకుని వెళ్ళే సమయాన ఆమె వడివడిగా గుమ్మందగ్గరకొచ్చి నాన్న శవం ముందు నిల్చుని తొలిసారిగా తలపైకెత్తి చూసి “నేను కావాలని పింగాణి కప్పుని పగలగొట్టలేదండి…: అని చెప్పి మళ్ళీ తలదించుకుంది. నాన్నదగ్గర్నుండి ఇప్పుడు ఎలాంటి ఆక్షేపణా రాలేదు. అమ్మ నిట్టూరుస్తూ తన ఏడుపుని చెంగుతో తుడుచుకుంటూ చావు కొచ్చిన వాళ్ళకి కాఫీ కలడానికి అన్నట్టు పొయ్యి వెలిగించడం మొదలుపెట్టింది. నాన్న శవం ఇల్లుదాటి వీధిలో వెళ్తూ ఉంది. ఆ రోజుకి తనకి పెళ్ళయ్యి నలభై ఏళ్ళు గడిచి నాలుగు నెలలు, ఏడు రోజులూ అయ్యాయి అని అమ్మకి బాగా గుర్తుంది.

2. పెద్దల్ని గౌరవించు

మధ్యాహ్నం భోజనమప్పుడే ఇవాళ రాత్రికి తాతని చంపెయ్యబోతున్నట్టు నాన్న అమ్మతో చెప్పాడు. నేనూ చిన్నక్క విన్నాము. అమ్మ ఆక్షేపణగానీ మద్దతుగానీ ఏదీ చెప్పలేదు. నాన్న నోట్లో అన్నం నములుతూ విసిగెత్తిన గొంతుతో “ఆ మనిషి అంగటికి వచ్చినంత కాలం నేను ఒక కాణీ కూడా వెనకేసుకోలేను. గల్లాపెట్టెలో ఉన్న చిల్లర్ని కూడా లెక్క చూసిపెట్టి వెళ్తాడు. ఇలా చూస్తూ ఉండటం నావల్ల కాదు సౌందర్యా. కన్నోడు… వాడి హింసని ఎన్ని రోజులు ఓర్చుకుంటూ ఉండాలి? ఇవాళ రాత్రికి వాణ్ణి గొంతు పిసికి చంపేస్తాను. బయట ఎవరికీ తెలీకుండా రేపట్నుండి నేను అంగటికెళ్ళిపోతాను” అని చెప్తూ ఉన్నాడు. నాన్న తిన్న కంచం కడిగేందుకు అమ్మ లోపలికి తీసుకెళ్తుండగా అంగట్నుండి తాత సైకిల్ మీద వచ్చి దిగి చెట్టు నీడలో నిలబెట్టి తాళం వేస్తూ ఉన్నాడు. నాన్న ఆయన్ని చూడనట్టుగా బయటకు జారుకుంటుంటే “ఎందుకురా ఎండలో బయల్దేరుతావు… అంగడి కట్టేసి వచ్చేశాను” అని తాత చెప్పడం పట్టించుకోలేదు. అమ్మ రోజూలాగానే సాయంత్రం మల్లెపూలు కొనుక్కుని మాలకట్టి తల్లో పెట్టుకుని పొరుగింటావిడతో కబుర్లు చెప్పి తిరిగొచ్చి నాన్న కొట్టు కట్టి వచ్చే పదిన్నర వరకూ ఎదురుచూస్తూ కూర్చుంది. నాన్న, తాత ఒకే సైకిల్ మీద ఇంటికొచ్చారు. నాన్న స్నానం చేసొచ్చేలోపు తాత భోంచేయడం ముగించి మోకాళ్ళ నొప్పికి మాత్రలు వేసుకుని పడుకున్నారు. అమ్మా నాన్నా నిద్ర పట్టక చాపమీద పడుకుని ఉన్నారు. బయట ఎవరింట్లోనో రేడియో పాడుతుండటం వినిపిస్తుంది. నాన్న రహస్యంగా “లేచి కిటికీలు వేసి రా..” అని అన్నాడు. అమ్మ నెమ్మదిగా వెళ్ళి ఒక్కొక్క కిటికీ మెల్లగా వేసొచ్చింది. గదిలో వెలుగుతున్న గుడ్డిదీపాన్ని నాన్న ఊది ఆపాడు. ఇల్లంతా చీకటి కమ్ముకుంది. అమ్మ దాన్ని చూడనట్టు ముడుచుకుని పడుకుంది. నాన్న చేతిలో ఊక తలగడ ఉంది. నాన్న లేచి వెళ్ళినప్పుడు తాతగారి తాంబూలం రోలు కాలికి తగిలినట్టుంది. అది పెద్ద శబ్దం చేస్తూ గిరగిర తిరిగింది. నాన్న తలగడ పట్టుకుని చీకట్లో నిలుచున్నాడు. తాత తన పక్కనున్న అగ్గిపెట్ట తీసి పుల్ల గీసి చూపాడు. ఆ వెలుగులో కఠినత్వమూ, రౌద్రమూ అలముకొన్న నాన్న ముఖం కనిపించింది. తాత గొంతు సవరించుకుంటూ “తాగడానికి నీళ్ళు పట్రారా” అని చెప్పాడు. నాన్న తలగడని కిందపడేసి చీకట్లో నడిచెళ్ళి నీళ్ళు తెచ్చాడు. ఈ లోపు తాత వేసున్న కిటికీలు తీసి ఆకాశంలో నక్షత్రాల్ని చూస్తూ ఉన్నాడు. నీళ్ళ చెంబు అందుకుని తాగేసి తలుపు తీసి ఒంటికి పోసుకునొచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు తాత కొట్టుకెళ్ళలేదు. కొన్ని రోజులకి రొక్కమంతా అమ్మకే ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇది జరిగిన ఆరునెలల తర్వాత కుటుంబంతో తిరుపతికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొచ్చాము. ఆ తర్వాత తాతకి డెబ్భయి రెండేళ్ళ వయసొచ్చేవరకు నాన్న ఆయనని ఆప్యాయంగా, బాధ్యతగా చూసుకున్నాడు. తాత కూడా తన కొడుకూ కోడల్లాంటి ఆప్యాతగలవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి మురిసిపోతుండేవాడు. వాళ్ళ అన్యోన్యత ఊరికే ఆదర్శంలా ఉండేది. ఆ పైన ఇంట్లో ఎవరికీ ఏ గొడవలూ మనస్పర్థలూ లేవు.

3. కమ్మని కాపురం

moodu kathaluఅలా చెయ్యడం నావల్ల కాదు అని మాధురి ఊటీకి వచ్చిన ఈ రెండు రోజుల్లో నాలుగైదుసార్లు చెప్పేసింది. అయినా అతను మొండిగా పదే పదే అడుగుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యి నాలుగురోజులే అయింది. అతను శోభనం రాత్రి “బట్టల్లేకుండ నగ్నంగా నిన్ను చూడాలనుంది” అని ఆమెను అడిగాడు. ఆమె కాదన్నట్టు తల ఊపి “అలా నావల్లకాదు సిగ్గుగా ఉంటుంది” అని చెప్పింది. అతనికి కోపమొచ్చింది. బలవంతంగా బట్టలు విప్పే ప్రయత్నం చేశాడు. ఆమె అతణ్ణి బలం కొద్దీ ఆపింది. నెట్టడంతో మంచం మీది నుండి అతను కిందపడ్డాడు. ఆమె పట్టించుకోకుండ నవ్వింది. అతను దెబ్బ తగిలిన చేతిని విదిలించుకుంటూ గట్టిగా “నేను నీ మొగుణ్ణే… నా దగ్గరెందుకే దాస్తావు?” అన్నాడు. ఆమె మాట్లాడలేదు. ముడుచుకుని పడుకుంది. అతను ఆకలితో పక్కనున్న ఆపిల్ తీసుకుని కసిగా కొరుక్కుతిన్నాడు. తర్వాత ఆమె ఇష్టాయిష్టాలతో పనిలేదన్నట్టు చేతులు పట్టి బలవంతంగా లొంగదీసుకుని ఆమె దేహంపై ఊగాడు. ఆమె నుండి నిరసన మెల్లగా తగ్గిపోయింది. మరుసటి రోజు రాత్రి రైల్లో హనీమూన్ కి బయల్దేరారు. అతను రైల్లో కావాలన్నట్టు “అందరూ నిద్రపోయాక నువ్వు బాత్రూం దగ్గరకి రా” అన్నాడు. ఆమె వెళ్ళలేదు. అతను ఆ రాత్రి పది సిగరెట్లకి పైనే కాల్చుంటాడు. చిరాగ్గా ఉన్నాడు. బెర్తు మీద ముడుచుకుని పడుకున్న ఆమె నడుం మీద గట్టిగా గిల్లాడు. ఆమె కిమ్మనలేదు. వాళ్ళు లోయలో ఉన్న స్టార్ హోటల్ లో రూమ్ తీసుకున్నారు. పెట్టెలు లోపల పెట్టి రూమ్‌ బాయ్ వెళ్ళిన మరుక్షణం ఆత్రంగా “రాత్రంతా ఎంత తపించిపోయానో తెలుసా?” అని మూర్ఖంగానూ, కామోద్రేకంతోనూ ఆమెను పడేసి సంగమించి అలాగే నిద్రపోయాడు. ఆమె లేచినప్పుడు పడకంతా కంపుకొట్టింది. కంపుకి గుండ్రించుతున్నట్టు అనిపించింది. బాత్రూం లోనికి వెళ్ళింది. అద్దంలో చూసుకుంటే మోచేయి గీసుకుపోయిన గాయం కనిపించింది. నొప్పికి ఏడుపొచ్చింది. కుళాయి తిప్పి నీళ్ళు వదిలి కొన్ని నిముషాలు ఏడ్చి వచ్చి సోఫాలో ముడుచుకుని పడుకుంది. అతను లేవగానే పళ్ళయినా తోముకోకుండా లాక్కుని బలవంతంగా ముద్దుపెట్టి నవ్వాడు. ఆమె నీరసంగా జీవం లేకుండా నవ్వింది. పలహారం తిని ఆమెను తీసుకుని బొటానికల్ గార్డెన్ కి వెళ్ళాడు. ఆమెను గడ్డినేలలో కూర్చోమనీ నిల్చోమనీ చాలా ఫోటోలు తీసుకున్నాడు. ఆమె దగ్గరకొచ్చి “ఈ లాన్ లో సెక్స్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా?” అని ఆమె చెవిలో మెల్లగా చెప్పి గట్టిగా నవ్వాడు. ఆమెకు ఒంట్లో వణుకు వచ్చినట్టు అనిపించింది. గడ్డి నేలని చూడాలనిపించలేదు. మద్యాహ్నం రూముకి వచ్చాక తన స్నేహితుడికి ఫోన్ చేసి, బీర్ తాగి సెక్స్ లో పాల్గొంటే బాగుంటుందా అనేవో సలహాలు అడుగుతున్నాడు. తిన్నాక గది తలుపులు బిగించి మళ్ళీ ఆమెతో కలిశాడు. సాయంత్రం వాళ్ళు ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు. అక్కడకూడా ఆమెతో “నిన్ను నగ్నంగా చూడాలన్నాను గుర్తుందా?” అనడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆ రాత్రి వీరుడిలా ఆమెను నగ్నంగా చేసి దేహానికేసి వెర్రిగా చూస్తున్నాడు. ఆమె గుండెనుండి పైకి ఉబికే ఏడుపుని మింగుతూ ఉంది. కొన్ని నిముషాలు ఆమె దేహాన్ని అలా వెర్రిగా చూసి ఆశాభంగం చెందినవాడిలా ఒక సిగరెట్ కాల్చి ఆమెని మంచం మీదకి తోశాడు. వాళ్ళు ఈ ఆరు రోజుల హనీమూన్ లో ఇరవై సార్లకు పైగా ఒకటయ్యారు. హిల్ స్టేషన్ నుండి కిందకి దిగేప్పటికి ఆమె బడలికగా నీరసం నిండిన ముఖంతో ఉంది. అతను బస్సులో ఆమె పక్కన కూర్చుని మరో సీట్లో ఉన్న కాలేజీ అమ్మాయికేసి చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజులకి అతని సెలవులు అయిపోతుండగా మాధురిని వెంటబెట్టుకుని కొత్తకాపురం పెట్టేందుకు చెన్నైకి బయల్దేరాడు. “మా అమ్మాయిని బాగ చూసుకోండి అల్లుడుగారూ” అని అతనికి అప్పగించి మాధురి కుటుంబ సభ్యులు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. మాధురి కూడా అందరమ్మాయిల్లాగే అమ్మగారింటి నుండి వెళ్ళలేక ఏడ్చింది. ఆ తర్వాత అందరమ్మాయిల్లాగానే ఆమెకూడా తన ఒళ్ళు ఇక తనది కాదు అని ఒప్పేసుకున్నట్టు అతని ఇష్టానుసారానికి అప్పగించేయడం మొదలుపెట్టింది. అవును… వాళ్ళ కమ్మని కాపురం కూడా ఇలానే మొదలైంది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, అరవ కథలు, ఏప్రిల్ and tagged , , , , , , , .

3 Comments

  1. Pingback: தெலுங்கு மொழியாக்கம்

  2. What powerful writing. కథలు చిన్నగా ఉన్న, చాలా hard-hitting గా ఉన్నాయి. మీ translation కూడ చాల evocative గా ఉంది. Waiting for the next one.

    >>కాలం ఇంటి నుండి ఒక్కొక్కర్నీ వెలివేయడం మొదలుపెట్టింది. – Lyrical

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.