cover

కర్నాటకలో నా తిరుగాట (1)

Download PDF  ePub MOBI

(తన ఇటీవలి కర్నాటక పర్యటన గురించి రచయిత, అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ రాసిన యాత్రా వ్యాసం)

కన్నడం నుంచి తెలుగులోకి సాహిత్యానువాద అనుభవం నాకు ఉన్నందున ఎంతో మంది విశిష్ఠ కన్నడ సాహితీవేత్తల పరిచయభాగ్యం ఫోన్ మూలంగా దండిగా ఉంది. మొదలు మొదలు ఒకప్పుడు తెలంగాణాలో (నిజాం కాలం) అంతర్భాగమైన రాయచూర్ జిల్లాలో వారసత్వ వ్యవసాయ అనుబంధం అంతో ఇంతో ఉండటం…. ఆ సీమలో తెలుగు మిశ్రిత కన్నడం వ్యాపకంగా (విస్తారంగా) ఉన్నందున, అంతగానేమి ఆ సరిహద్దు జిల్లా దాటితే కర్నాటక రాష్ట్రంతో నికట పరిచయం ఏమి లేదనే చెప్పొచ్చు నేను. ఇప్పడిక (2013లో) ఒక సువర్ణావకాశం: ఘనసాహితైన శ్రీయుత తమ్మాజిరావ్ గారితో కలసి కర్నాటక తీర ప్రాంత సందర్శన భాగ్యం లభించింది!

తమ్మాజీరావ్ గారు కోలార్ జిల్లా వాసిగా మూల జీవితం ప్రారంభించి ఉద్యోగరీత్యా తుమకూరు జిల్లాలోని కల్పతరునాడైన టిపటూరు పట్టణంలో వాణిజ్య శాస్త్ర ఉపన్యాసకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తదుపరి ప్రొఫెసర్‌గా అక్కడే రిటైర్ అయ్యారు. రావుగారి స్వగ్రామం ‘నంగలి’, చిత్తూరు జిల్లాలోని మదనపల్లి తాలూకాకు ఆనుకొనే ఉన్న కర్నాటక సరిహద్దు గ్రామమైనందున, వారు తెలుగులోనూ బాగా సంభాషించగలరు. ప్రతి సంవత్సరం వివిధ ఆంశాలమీద సాహిత్య గోష్ఠుల్ని ఏర్పాటు చేయటం వారికి ఒక వ్యసనంగా పరిణమించింది! వారు రచించిన ఉత్కృష్ట కన్నడ కథలు ‘ఫలిత, వారసు, కాలిల్లద్ కవిత’లను నేను తెలుగులోకి అనువదించి పుస్తకంగా ముద్రించినందున శ్రీయుత రావు గారి పరిచయం ఎంతో ఆత్మీయంగా మారింది! సాహిత్యగోష్ఠులకు అతిధిగా పిలుస్తుంటారు నన్ను. అయితే ఈసారి ‘తిరుగాట’ మీద వారొక కార్యక్రమం రూపొందించి, దాన్లో పాల్గొనాలని నన్ను ఆజ్ఞాపించారు.

రావుగారికి ఇంగ్లీషులో రచనలు చేస్తున్న ఇప్పటి నవతరం రచయితల సాధన మీద అంతగా సదభిప్రాయం లేదు. ఆర్.కె.నారాయణ, కుష్యంత్ సింగ్, రాజారావ్… మొదలైన ఘనాపాఠీల మీద వారికి ఎనలేని ప్రీతి ఉంది. మూల దేశీయ (ప్రాంతీయ) భాషా సాహిత్య పరిజ్ఞానం లేని, రపరపగా ఇంగ్లీషును మాట్లాడే ఈ భారతీయ రచయితలు జైపూర్ లిటరరీ ఫెస్టివల్‌లో పొందిన మాన్యత మీద రేగిపడుతారు. ప్రాదేశిక భాషల రచయితలు అనర్గళంగా ఇంగ్లీషులో తమ రచనల విశిష్టతను చెప్పుకోలేనందునే ఆ ఫెస్టివల్‌లో చిన్నచూవు పొందారని నిశితంగా విమర్శిస్తారు రావుగారు. ‘ఇంగ్లీష్ భాషలోని పటాటోపం మనకు ఎటూలేదు, ఎందుకు అక్కడకు వెళ్ళేదుంది… మనకు మనమే ఏకోనారాయణలన్నట్లుగా ఘనమైన మననాడులోనే తిరుగాట చేసి సాంత్వనం చెందుదాం… రా…. రండి’ అని ఆహ్వనించారు రావుగారు.

కన్నడ సాహితీవేత్తలలో ఒక మహిమఉంది. వారు తమ మూల ప్రాంత పరిధి నుంచి బయటకొచ్చి మరో కాల్పనిక ప్రాంతాన్ని సృష్టించటం వారిలోని రచనా వైశిష్టాన్ని బయటపెడుతుంది. ఆర్.కె. నారాయణ ‘మాల్గుడి’, రాజారావ్ ‘కాంతాపుర’, దివాకర్ ‘భువనగిరి’, తమ్మాజిరావ్ ‘మాదాపుర’ పేర్లమీద సాహిత్యంలో గురిపెట్టి ఆయా ప్రాంత పేర్లను కాల్పనికంగా వాడుకుని తమతమ రచనలలో విరివిగా ఉపయోగించుకొన్నందున, ఆయా పేర్లు కన్నడ సాహిత్యవనంలో స్థిరపడిపోయినవి. నేనుంటున్న ఈ భాగ్యనగరంలో రెండు దశాబ్దాలు మాదాపురంతో నాకు నికట సంబంధం ఉన్నందున మాదాపురను ఉటంకిస్తూ కాల్పనిక రచనల్ని చేసిన రావుగారి రచనల మీద నాకు ఆసక్తి కల్గి, ఎంతో శ్రమించిన మీదట వారి సాహిత్య పరిచయం లభించి, ఆ మీదట ఇప్పడది ఎంతో ఆత్మీయంగా మారింది.

చిత్రమేమంటే తనచే కన్నడంలో సృష్టింపబడిన ‘మాదాపుర’ విశిష్టత రావుగారికి ఇప్పటికీ తెలియదు! నేనే ఖుద్దుగా వారికి మాదాపుర, అందులోని హైటెక్ సిటి, దాన్లో బతుకుబాట సాగిస్తున్న వేలాది సాఫ్ట్‌వేర్ జీవుల గురించి చెపుతుంటాను ఫోన్లో.

పుత్రుడు బెంగళూరులో, పుత్రిక మంగుళూరులో, వీరి నడుమ రావుగారు తిపటూరులో కుటుంబ సమేతంగా ఎవరికి వారు స్థిరపడినందున మంగుళూరులో(దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తర కన్నడ, చిక్కమగళూర్) తిరుగాట చేద్దాం, నవంబరు నుంచి వానలు తగ్గుముఖం పడుతవి, రెండు వారాలకు తక్కువ గాకుండా గడిపేందుకు రండని ప్రోగ్రాం ఇచ్చారు రావుగారు. జైపూరు ఫెస్టివల్ నవంబరులో జరుగుతుంటుందని, అలానే మన తిరుగాట అదే కాలంలో తన ప్రాంతంలోనే చేద్దాం రండని తెల్పారు. ఒక నెల ముందస్తుగానే తెల్పినందున నేనుండే లింగంపల్లి స్టేషను నుంచి పల్నాడు ఎక్సప్రెస్ ద్వారా 03-11-2013 ఉదయం 11.20కు బయల్దేరి, వికారాబాద్ జంక్షన్‌లో 12.20కు చేరుకొని మరలా నాందేడ్ నుంచి బెంగళూరుకు వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌లో మధ్యాహ్నం 2.30కు స్లీపర్ బోగిలో ప్రవేశించి మరునాడు 04-11-2013 న యశ్వంతపురలో ఉదయం 5.30కు దిగాను సుఖకరంగా. ముందస్తుగానే రిజర్వేషన్ చేసుకొన్నందున అనుకొన్న ప్రకారమే ప్రయాణం సాగింది.

104-11-2013: యశ్వంతపురలో ఉదయం 7.30కు కార్వార్‌కు వెళ్ళే ఎక్స్‌ప్రెస్ రైలు సోమ, బుధ, శుక్రవారాలలో మాత్రమే ఉంటుంది. సాయంత్రం5.30కు మంగళూరుకు చేరుకోవచ్చు. నేరుగా హైద్రాబాద్ నుంచి ఆయా రైళ్ళలో పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్ ఎక్స్‌ప్రెస్, కార్వార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళలో నేను బారుగా రిజర్వేషన్ సౌకర్యం చేయించుకొన్నాను. యశ్వంతపుర నుంచి పగటివేళలో మంగళూరు వరకూ వెళ్ళే ప్రయాణం ఎంతో మధురానుభూతిని కల్గిస్తుంది. యశ్వంతపుర నుంచి అరసికెరె – హాసన్ – సకలేశపుర వరకూ రైలు మైదానప్రాతంలోనే పయనిస్తుంది. సకలేశపుర (సకల జనుల ఈశునిపుర) నుంచి ఘాట్ సుబ్రమణ్యరోడ్ వరకూ ఉండే 115 కిమీ… ఘోరారణ్యంతో నిండియున్న ఎత్తయిన పశ్చిమ కనుమలలో ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ పగటి రైలు ప్రయాణంలో ఘోరారణ్యం, ఎత్తైన గిరిశిఖరాలు, లోయలు, వంతెనలు, సొరంగాల్ని చూసేందుకని బెంగళూరులోని యువజనం జట్లు జట్లుగా ఈ రైలులో యాత్రికులుగా పయనిస్తుంటారు. సముద్ర మట్టం నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో సాగే ఈ రైలుకు సకలేశపురలో వెనుక నుంచి నెట్టేందుకు రెండు ఇంజన్లను జతచేస్తారు. కుయ్యో, మొర్రో అంటూ ముందున్న ఇంజన్, వెనుకున్న ఇంజన్లు రైలును లాగూతూ నెడుతూ 20 కి.మీ. వేగంతో సుమారుగా వందగుహల గుండా సాగిపోతుంటే ఆయా ప్రకృతి దృశ్యాల్ని తిలకించేందుకు, పోటోల్ని తీసేందుకు 4647భోగీల ద్వారాల వద్ద, కిటికీల చెంత యువకులు పోటీ పడి జమౌతారు. గుహలలోకి రైలు చేరుతుంటే ఒకటే కేరింతల ఘోష. పూర్ణచంద్ర తేజస్వి రచించిన ‘జుగారి క్రాస్’ నవలలో ఈ రైలు మార్గం గురించే ఆరు అధ్యాయాలు కేటాయించబడ్డాయి. ఆయన రచన నిజమేనా అని తెల్సుకునేందుకే నేనీ రోజు ఈ పగటి ప్రయాణాన్ని ఎంచుకొన్నాను! ఘాట్‌లో రైలు స్టేషన్లు నాలుగు మించి లేవు. మధ్యాహ్నం ఏదైనా తినేదుంటే అది సకలేశపుర స్టేషన్‌లోనే తినాలి. సుబ్రమణ్య రోడ్ స్టేషను నుంచి మరిక మైదాన ప్రాంతం మొదలవుతుంది. మా డ్యూటీ ముగిసిందిలే అని వెనుకున్న రెండు ఇంజన్లు అక్కడ రైలు నుంచి వేరు పడిపోతాయి. అప్పుడిక రైలు జారుడు బండ నుంచి జారినట్లుగా యధాప్రకారం వేగంతో వెళ్తుంది. పుత్తూరు-బంట్వాళ దాటిన తర్వాత మంగళూరుకు చేరుకుంటుంది. మంగళూరు స్టేషనుకు రావుగారు అల్లుడితోపాటు వచ్చి సాయంత్రం 6.30కు తమ ఇంటికి తోడ్కొని వెళ్ళారు.

05-11-2013: రావుగారుతో కల్సి ఉదయం7.30కి మంగళూరు బస్‌స్టాండ్‌లో మినీ బస్ ఒక దాన్లో ప్రవేశించి తీర్థహళ్ళికి బయల్దేరాం. ఘాట్లో ప్రయాణం. బస్ ఆగుంబె వద్ద కొంచం సేపు ఆగుతుంది. చిరపుంజి తర్వాత అత్యధికంగా వర్షంపాతం నమోదైయేది ఆగుంబెలోనే. ఇక్కడ కురిసిన వర్షధారలే తుంగభద్రా నది, కృష్ణనదులలోని జలాశయాలు నింపి కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లలో జల సిరులను ప్రసాదిస్తాయి. భారత ప్రభుత్వానికి చెందిన వర్షపాతం నమోదు చేసే వాతావరణశాఖ కార్యాలయం ఇక్కడుంది. ఎత్తైన గిరి శిఖరం నుండే ఆగుంబెలో పర్యాటకుల వీక్షణకని వ్యూ పాయింట్ ఒకటుంది. అక్కడ్నుంచి లోయలో కనబడే క్రింది ప్రాంతాన్ని చూస్తుంటే అంతరిక్షం నుంచి కిందకు చూసినట్లుగా అనిపిస్తుంది. దూరానున్న అరేబియా సముద్రం రేఖామాత్రంగా కనిపిస్తుంది. నిదానంగా ఘాట్ నుంచి పయనించే ఈ మినీ బస్ తీర్థహళ్ళిలో మమ్మల్ని ఉదయం 11 గంటలకు దింపింది.

Agumbe_Panorama

ఆగుంబె వ్యూపాయింట్

అలకా తీర్థహళ్ళి, సఖ తీర్థహళ్ళి, అలకా.కె అనే రచయితలని తీర్థహళ్ళిలో కలవాల్సి ఉంది. వీరి కథల్ని నేను తెనిగించాను. అలకా తీర్థహళ్ళి గారు మాత్రమే తాలూకా కేంద్రమైన ఈ ఊర్లో ఈరోజు ఉన్నారు. మిగిలిన ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని తెల్సింది. రావుగారి బంధువర్గం తీర్థహళ్ళి చెంతనుండే భారతీపుర గ్రామంలో ఉన్నారు. వారు బస్‌స్టాండ్‌కి వచ్చి మమ్మల్ని వారి ఇంటికి కారులో తీసుకువెళ్ళారు. కారులో వెళ్తే ఐదు కిలోమీటర్లు. కాలినడకన కొండ ఎక్కి దిగితే ఒక కిలోమీటరు మాత్రమే! భారతీపుర తీర్థహళ్ళి చెంత నుంది కదా. భారతీపురలో ప్రభాకరనాయక్ గారు మాకు ఆతిథ్యం ఇచ్చారు. వారి నేతృత్వం నుంచే కారులో మల్లికార్జున దేవస్థానం, మృగావధహళ్ళిలోని దేవళం సందర్శించాం. స్థల పురాణం ఉన్న అడవిలోని ఈ దేవాలయాలలో భక్తులను సంతుష్టుల్ని చేసేందుకు దాతల నేతృత్వంలో ఉచిత భోజనశాలలు ఉన్నవి. ఒకచోట భుజించి మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కువెంపుగారి స్వస్థలమైన కుప్పళ్ళి గ్రామానికి వెళ్ళాం. కుప్పళ్ళి తీర్థహళ్ళి తాలుకాలో ఉంది. ప్రభాకరనాయక్ గారి కుమారుడు కారు నడుపుతుంటే గంట ప్రయాణం తర్వాత కుప్పళ్ళి చేరాం.

Kuvempu

కువెంపు

కువెంపుగారు జమీందారీ వంశంలో పుట్టి ఒకే చోట …. కుప్పళ్ళిలో 3,370 ఎకరాల వారసత్వ సంపదతో అలరారారు. తన వారసులైన పూర్ణచంద్ర తేజస్వి, కోకిలోదయ చైత్ర, తారిణి, ఇందుకల … సమ్మతితో సంపదనంతా ప్రభుత్వానికి భూదానం చేసారు కువెంపుగారు. వారి పూర్తి పేరు కుప్పళ్ళి వెంకటప్పగౌడ పుట్టప్ప! వారి దానశీలత మరియు శ్రేష్ఠ వ్యక్తిత్వానికి గుర్తుగా కర్నాటక ప్రభుత్వం తన రాజసంపదైన 7 వేల ఎకరాల్ని జోడించి మొత్తం పది వేల ఎకరాలు మించిన విస్తీర్ణంతో అలరారే ప్రాంతాన్నంతా ఒకే చోట ఒక ప్రతిష్ఠానంగా కువెంపు పేరు మీద ఏర్పాటు చేసి, ప్రకృతి, పర్యావరణ ప్రియులకు ఒక కేంద్రంగా దాన్ని నిర్వహిస్తుంది.

ప్రతిష్ఠానంలో కువెంపుగారి జీవిత విశేషాల్ని, వారు రచించిన సాహిత్య రచనల్ని, శ్రీమాయణదర్శనం నుంచి పొందిన జ్ఞానపీఠ పురస్కార (కన్నడంలో మొదటి కవి) పత్రాన్ని, పద్మవిభూషణ బిరుదు పత్రాన్ని, వారి పూర్వీకుల రాజ మందిరం లాంటి భవ్యగృహాన్ని, బాల్యంలో ఘోరారణ్యంలో కువెంపు గడిపిన వైనాన్ని, ఆయా పురాతన వస్తువుల్ని, రాష్ట్రకవిగా మన్నన పొందినందుకు గుర్తుగా ఒక మ్యూజియం ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేటు వ్యక్తుల నుంచి ట్రస్ట్ ద్వారా భవ్యంగా నడుపుతుంది. బెంగళూరు నుంచి నేరుగా కుప్పళ్ళికి బస్ సౌకర్యం ఉంది. బెంగళూరులో రాత్రి బయల్దేరి మరునాడంతా (పగలు) కుప్పళ్ళిలో గడిపి తిరిగి రాత్రి వేళలో బెంగళూరుకు బయల్దేరి వెళ్ళే వ్యవస్థ అక్కడున్నందున ఎంతో మంది ప్రకృతి, పర్యావరణ సాహితీ ప్రియులు సగటున రోజుకు రెండు వేల మంది కుప్పళ్ళిని సందర్శిస్తారట. మ్యూజియంలో ఉన్న రిజిస్టర్‌లో సంతకాలు చేసి ఐదు రూపాయాల రుసుంతో ఆ ప్రాంతమంతా తిరిగాం. మేమెళ్ళిన ఆ రోజుకు రెండు వారాల క్రితం తెలుగు చిత్రసీమలో కథానాయకుడిగా వెలుగుతున్న ఒక నటుడు హైద్రాబాదు నుంచి వచ్చి, తన తండ్రి తెలుగు చలన చిత్రరంగానికి చేసిన సేవలకు గుర్తుగా కుప్పళ్ళి లోని ఈ కువెంపు ప్రతిష్ఠానం లాగ ఒక మ్యూజియం ప్రైవేట్‌గా తెరిచే ఉద్దేశంతో చూసి వెళ్ళాడని, ఆయన తండ్రిని ఇందుకోసం పంపినట్లు మ్యూజియం నిర్వహకులు మాకు తెలియజేసారు.

photo1AtKuvempuHouse

కువెంపు ఇంటి దగ్గర – తమ్మాజీరావుతో రచయిత శాఖమూరు రామగోపాల్

కువెంపుగారి భావజాలాన్ని అర్థం చేసుకొని ఆయా ప్రాంతీయ భారతీయ భాషలలో తమ తమ రచనల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని కల్గిస్తారని, కన్నడంకు చేరని ఇతర ప్రాంతీయ భాషా సాహితీవేత్తలకు కర్నాటక ప్రభుత్వం నుంచి కువెంపు ప్రతిష్ఠాన ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరము ఒక సాహితీవేత్తకి 5 లక్షల రూపాయల బహుమతి కువెంపు పేరు మీద ఇస్తారు! 2013 గాను మళయాళ భాషకు చెందిన సచ్చిదానందకు పురస్కారం లభించింది. స్మారక ప్రతిష్ఠానంలోని సిబ్బంది అంకితభావం చూస్తుంటే, ఇదేదో యూరోపియన్ దేశాలలోని కవి గృహంలాగ మాకు అన్పించింది.

కువెంపుగారు తన సమకాలిక సాహితీవేత్తల్ని కుప్పళ్ళికి ఆహ్వానించి వారితో గడిపిన సాహిత్య మధుర క్షణాల్ని వివరంగా తెల్పుతుంది మ్యూజియం. ఆ ప్రతిష్ఠానంలో కువెంపు, పూర్ణచంద్ర తేజస్వి గార్ల (తండ్రీ కొడుకులు) సమాధుల్ని చూసాం. వినమ్రంగా అంజలి ఘటించాం. రమారమి మూడు గంటలు ప్రతిష్ఠానంలో గడిపి, ఆ పిమ్మట తీర్థహళ్ళి పట్టణానికి చేరాం. తీర్థహళ్ళిలో మాకోసం ఎదురు చూస్తున్న కడిదాళ్ ప్రకాష్ గారిని కల్సి ముచ్చటించాం. కువెంపుగారి శ్రేష్ఠ కథలు మూడిట్ని నేను తెనిగించానని రావుగారు చెప్పగా, ప్రకాష్ గారు సంబరపడినారు. ప్రతిష్ఠానం నుంచి కువెంపుగారి జీవిత సాధన మీద తెలుగులోకి అనువదించబడిన “కువెంపు వ్యక్తిగా…… వ్యక్తిత్వపరంగా” అనే పుస్తకాన్ని అనువదించింది కూడా నేనే అని తెల్సుకున్న ప్రకాష్ గారు ‘మరి కొన్ని రోజులు ప్రతిష్ఠానంలోనే గడపండి’ అని అభ్యర్ధించారు. ఇక చీకటి ముసురుతుందని ప్రకాష్ గారి నుంచి వీడ్కోలు పొంది, ఆతిథ్యమిచ్చే ప్రభాకర్ నాయక్ గారి గృహం చేరాం.

మలెనాడు లోని పల్లెలలో ఇళ్ళన్నీ ఒకే చోట ఉండవు. ఎవరి ఇళ్ళు, వారి వారి వ్యవసాయ క్షేత్రాలలో ఉంటవి. రాత్రిళ్ళు అడవి జంతువుల సంచారం(తిరుగాట) ఉన్నందున, రైతుల ఇళ్ళలో నాటు తుపాకులు ఉంటవి. ఉదారంగానే ప్రభుత్వం మారకాస్త్రాల లైసెన్స్‌లని జారీచేస్తుందట. నాయక్ గారి కుటుంబం అవిభక్త కుటుంబం. వారి ఇంట్లోని వంటావార్పు చిన్నపాటి మెస్ లాగ ఉంది. నాయక్ గారు మా రాకకి ఖుషీయై విందు భోజన ఏర్పాట్లు చేసారు. ఖరీదైన సురాపాన సేవనం అక్కడుంది. సురాపానంలో నేను ఒక్కడ్నే భాగస్తుడిగా కాలేదు. సురాపాన మహిమ వలన నాయక్ గారు ప్రస్తుత పరిపాలన, బ్రిటిపోళ్ళ పాలన, ఆర్.ఎస్.ఎస్ నుంచి సూడో సెక్యులిరిజమ్ వరకూ ఎన్నెన్నో విషయాల్ని ధారాళంగా చెప్పసాగారు. తిరుగాటలో అల్సినందున నాయక్ గారి ఒంటిగృహంలో మైమరచి నిద్రించాం.

Photo4 At Shrungeri Temple

శృంగేరీ ఆలయం వద్ద రచయిత

06-11-2013: నాయక్ గారి ఇంటికి, తోటకు ఆనుకొనే తుంగానది ప్రవహిస్తుంది. వేకువనే లేచి నురగలు కక్కే కమ్మటి కూర్గు కాఫీ తాగి వాయువిహరానికని నది చెంతకెళ్ళాం. స్పటిక జలం లాగ ఉన్న ఆ నది నీరు, పరిశుభ్రమైన గాలికి పులకితులమై అక్కడే కాలకృత్యాలు స్నానాలు ముగించాం. నది ప్రవాహాన్ని వదిలి బయటకొచ్చేందుకు మనసొప్పలేదు. గంగ స్నానం, తుంగపానం లోని మహిమను తెల్పుతున్నారు రావుగారు. కొబ్బరి చట్ని, ఆవునేయితో వేడివేడి ఇడ్లీలను వడ్డించగా భారీగానే లాగించాం. మరలా చిక్కటి కమ్మటి కూర్గు కాఫీ తాగి, ఆ అతిథి గృహం నుంచి బయటకొచ్చాం. ఆత్మీయుల్ని వదిలి వెళ్ళినట్లుగా ఉంది. ఇక నేరుగా తీర్థహళ్ళిలో బస్సు ఎక్కి రెండు గంటల ప్రయాణం తర్వాత చిక్ మగళూరు జిల్లాలో ఉండే శృంగేరి (పట్టణం) పీఠంకు చేరాం. మధ్యాహ్నం ఒంటి గంటైంది. అక్కడున్న భవ్యమైన విద్యాశంకర దేవళంకు వెళ్ళాం. ఈ దేవాలయం 14వ శతాబ్దంకు చెందినదట. దీనిని బుక్కదేవరాయలు రాజగురువులైన విద్యాతీర్థ స్వాముల స్మరణార్థం నిర్మించారు. ఇది అద్భుతమైన విజయనగర ళిల్పకళతో శోభిల్లుతుంది. శృంగేరి శంకరపీఠం ఆదిశంకరుడిచే 9వ శతాబ్దంలో స్థాపించబడిందట. అద్వైత తత్వంకు చెందినదట. పీఠం చెంతే తుంగభద్ర ప్రవహిస్తుంది. నదీతటానికి వెళ్ళి ప్రవాహం చూసాం. నీటిలో ఈదాడుతున్న మత్స్యసంపదను చూసి చకితులమయ్యాం. చేపల మీద చిరుతిండ్లను విసురుతున్నారు పర్యాటకులు.

 తమ్మాజీరావుగారు ద్వైత మతస్తులు. ఇప్పుడిక వీరు నాస్తికులుగా మారి మఠంలోని న్యూనతలను (లోపాలను) ఎత్తి చూపుతున్నారు. వారి మాటల ప్రకారం …. మఠాధిపతి మరియు ఇతర ముఖ్య అధికారులంతా తెలుగుసీమకు చెందినవారని, పీఠ సందర్శన కొచ్చే వారంతా అధికంగా తమిళ, తెలుగు జనాంగమేనని, ఆయా భాషల భక్తులకే విశేష ఆదరాభిమానాలు లభిస్తాయని చెప్తున్నారు! భక్తులకని ఉచిత భోజనవ్యవస్థ ఉంది. శృంగేరి పట్టణం చాలా చిన్నదిగా ఉన్నా, మఠం చెంతనున్న రాచవీధి (మెయిన్ రోడ్) చూసి ఆశ్చర్యపోయాం. పురాతన ఇళ్ళతో ఆ వీధి శోభిస్తుంది. పీఠంలో ఆదిశంకరుడి జీవిత విశేషాల్ని తెల్పే విధంకన్నా, ప్రస్తుత పీఠాధిపతి రాజసంగా వాడే పల్లకి, ఆసీనులయ్యే కనకపు సింహాసనం, లాంఛన ముద్రికలు, వారి సేవకని వినియోగించబడే గజరాజు …. మొదలైన వాట్ని చూసి వెనుదిరిగాం. భవ్యసంపదను పీఠంలో చూస్తున్నప్పుడు రావుగారు మార్క్స్ వాదంలోకి జారారు. లోతైన చింతనతో వారి నుంచి జాలు వారిన సత్యాసత్యాల్ని మరోమాట ఎత్తకనే విన్నాను నేను.

మఠ సందర్శన ముగిసిన మీదట, రావుగారి మూలస్థానమైన కోలారుకు చెందిన ఒక కుటుంబాన్ని కల్సి మరిక అక్కడ్నుంచి వెనుదిరిగి నేరుగా బస్ ద్వారా రాత్రి 10 గంటలకు మంగళూరు చేరాం.

07-11-2013: ప్రఖ్యత కన్నడ కథా రచయితైన ‘నాగవేణి మంచి’ గార్ని కల్సేదుంది ఈ రోజున. ఆమె వృత్తిరీత్యా కన్నడ భాషా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బంట్వాళలోని శ్రీవెంకటరమణ దేవస్థానంకు చెందిన డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నారు. బంట్వాళ- మంగళూరు నడుమ 30 k.m దూరం ఉంది. రావుగారి వద్ద నాగవేణిగారి ఫోన్ నెంబరు లేదు. నేరుగా ఆమె పని చేస్తుండే కళాశాల వద్దకెళ్ళాం. అయితే నాగవేణిగారు కళాశాలలో లేరు. విశ్వవిద్యాలయంలో ఏదో పని ఉన్నందున మంగళూరులోనే ఉన్నారట. రావుగారు వృత్తిరీత్యా ప్రొఫెసర్‌గా రిటైర్ అయినందున, నేరుగా ప్రిన్స్‌పాల్ వద్దకెళ్ళి, నాగవేణిగారి నంబరు పొంది మా రాక గురించి ఆమెకు తెలియజేసారు. నాగవేణి దంపతులు తామున్న స్థలం గురించి చెప్పి ‘శ్రీఘ్రమే రండి కల్సి భోజనం చేద్దాం’ అని జవాబిచ్చారు. బంట్వాళ నుంచి మంగళూరుకు [బంద దారిగ సుంక విల్ల …… వచ్చిన దారికి సుంకం (పన్ను) లేదన్నట్లుగా] తిరిగొచ్చి ఆ దంపతుల్ని కల్సాం.

‘నాగవేణి మంచి’ కన్నడంలో ప్రఖ్యాత రచయిత్రి అని ముందే పేర్కొన్నాను కదా! ఆమె మాతృభాష తుళు. వయస్సు మూడు పదులు దాటదు. రాసింది పదే కథలు. మహిళల సాధక బాధకాల మీద ఆమె రచనలు కేంద్రీకృతమై ఉన్నవి. వస్తునైపుణ్యంలో వైవిధ్యంలో సాటి లేని మేటి రచనలు అవి. ఆమె కలం నుంచి జాలు వారిన ఒక కథ దీపావళి కథల పోటీలో ప్రధమ బహుమతి పొందింది. దాన్ని ‘పాపం కల్యాణి’ అనే పేరుతో తెనిగించాను. మా రాకకి సంబరపడిన నాగవేణి కన్నడ కథా రచయిత్రిల సాధన మీద సాధికారంగా తెల్పారు. రావుగారి అల్లుడు కూడా మాతో జమైయ్యారు. అందరం కల్సి ఉడ్ ల్యాండ్ హోటెల్‌లో శాకాహార విందు భోజనం చేసి, ఆ మీదట ఆమె నుంచి వీడ్కోలు పొందాం. ఇక మిగిలిన ఈ రోజంతా రావుగారి పుత్రిక చెంత నున్న మంగళూరులోని పలు దేవాలయాల్ని సందర్శించాం.

రావుగారి విశాల దృక్పథాన్ని నేనిక్కడ మీతో (పాఠకులతో) పంచుకోవాలి. ఉత్తర కన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలలో కొంకిణి, తుళు భాషలు కన్నడం కన్నా ఎక్కువ వ్యాప్తిలో వాడుక భాషలుగా జనంలో ఉన్నాయి. కన్నడ భాషను మాట్లాడితే ఠపీమని వేరే ప్రాంతపోళ్ళుగా గుర్తిస్తారు. వ్యాపారంలో మునిగిన అల్లుడుకు, పుత్రికకు భవిష్యత్ బంగారుమయంగా ఉండాలంటే స్థానీయ భాషల్ని నేర్వాల్సిందే, మాట్లాడాల్సిందేనని రావుగారు ఉద్బోధన చేసారు (చేస్తుంటారు). మంగళూరు నుంచి వెలువడుతుండే కన్నడ దినపత్రికలలో స్థానికుల సౌకర్యార్థం కొన్ని పుటలలో తుళు, కొంకణి వార్తలు కన్నడ లిపిలోనే ముద్రించబడటం నేను గమనించాను. తుళు, కొంకిణి భాషలకు లిపి లేదు.

(ఇంకా ఉంది)

Download PDF  ePub MOBI

(Image Courtesy: Wikipedia ; https://www.flickr.com/photos/darshansphotos/8465816774)

Posted in 2014, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.