cover

చిట్టచివ్వరి Text!

Download PDF ePub MOBI

.

సాయంత్రపు చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు రెపరెప ఆడిస్తూ తిరిగానేమో బహుశా!

ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చప్పుళ్ళలో ఏ ఇతర ఆకాశంలోకైనా కాస్త హాయిగా ఎగిరిపోగలనన్న నమ్మకం ఈ పక్షి గుండెకి లేదు కాక లేదులే!

ప్రతి దేహాన్నీ వొక ఇనప పంజరం చేసి, అందులో దాక్కున్న గుండెకి అన్ని అసహజత్వాలూ నేర్పుకున్న లౌక్యాల తేలిక సౌఖ్యాల కాలం కదా మనిద్దరిదీ!

 

లాంటి వొకానొక స్థితిలో నువ్వడుగుతున్నావ్: “రాసిందల్లా సగంలో అబద్ధమై తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్? రాయకుండా వున్న రోజో, సగం రాసిన కాగితాలు చింపేసిన రోజో కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు- రాసి, పూర్తయ్యాక పడే ఉరికోతని భరిస్తూ ఎందుకూ నిద్రపట్టని రాత్రిని కావిలించుకొని?”

 

నువ్వడిగావ్, నేను అడగలేకపోయాను కాని,

సగం మాత్రమే రాసిన కాగితాలు కూడా నాకు ఉరి కంబాల్లా కనిపిస్తున్నాయి రోజూ! ఆ స్తంభాల మధ్య దిసమొలతో చావు ఆట ఆడుకుంటూ రాత్రిలోకి జారుకుంటూ వెళ్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటా. కాని, ఎందుకో కర్తకర్మ క్రియలన్నీ ఎంచక్కా అమరుకుంటూ వచ్చిన వాక్యం మీద చచ్చేంత ప్రాణం! చావు రేఖ మీద విలవిల్లాడుతూ కూడా ఆ వాక్యం క్రియాంతం అయినప్పుడు వొక ప్రాణాంతక క్రీడానంతరం లోపలి తెల్లప్రవాహం అంతా వొక్కసారిగా పెల్లుబికి పారిన తృప్తి!

 

రాయలేని స్థితి / జీవించలేని స్థితి

రాసిన స్థితి / జీవించిన స్థితి

రాస్తూ రాస్తూ/ జీవిస్తూ జీవిస్తూ మధ్యలో వూపిరందక/ ఊపిరి తెంపుకొని కుప్పకూలిపోయిన స్థితి.

వీటి మధ్య చలనతీవ్రతల్ని కొలిచే కొలమానం లేదు నా దగ్గిరా నీ దగ్గిరా.

 

కాని

రాయాల్సింది రాయలేని క్షణం

జీవించాల్సింది జీవించలేని క్షణం ఆత్మహత్య.

కాదూ, కనీసం వో నలుగురు కుమ్మక్కై లోపల్నించి నీ హత్య!

చిట్టచివ్వరి text దొరకదు

దొరికినా ఆ నలుగురూ దొరకరు!

 

సంభాషణ ఆగిపోలేదు కాని

నీ దారిన నువ్వూ నా దారిన నేనూ వెళ్లిపోయాక

మనం

కేవలం శవాలుగా నిష్క్రమించామని మనిద్దరికీ తెలిసిపోయింది

ఇప్పటిదాకా వ్యక్తమైనదంతా వొక అవ్యక్త ఆత్మహత్య.

కాదంటావా?!

*

Download PDF  ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, కవిత and tagged , , , , , .

6 Comments

  1. ఏం రాయను ఈ కవిత గురించి? ప్రతి లైన్, ప్రతి పేరా భావల తేనె తుట్టెలో ముంచి అక్కడ రుచి చూడమని అమర్చినట్టు ఉంటే.

    ఆ సంభాషణ ఎరిగిన హృదయాలు చిట్ట చివరి టెక్స్ట్ అని ఎలా అనగలవు? అఫ్సర్ సర్ ఇంకా ఎక్కువ మాట్లాడలేను, రాయలేను ఆ భావాన్ని అనుభూతి చెందడం తప్పించి.

  2. ఇట్లాంటి వేదన ఉన్నంతకాలం, “చివరి టెక్స్ట్” అనేది రాదసలు. “రాసిందల్లా సగంలో అబద్ధమై తెగిపోతున్నప్పుడు”– అన్నారు చూడండీ, బాగా నచ్చింది. చేతులూరుకోవ్, అలా అని వేళ్ళు కదలవ్. బాధ. ఆలోచనల రథచక్రాల క్రింద పడి నలిగిపోవడమే మిగిలేది. ఆ బాధ ఈ కవితలో చక్కగా పలికింది. థాంక్యూ.

  3. //“రాసిందల్లా సగంలో అబద్ధమై తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్? //
    నేర్చుకున్నదంతా అబద్దమని తెలిశాక మళ్లీ మొదటనుండీ మొదలెట్టినట్లు.

  4. అఫ్సర్ గారు ! చివరి ప్రయాణం లో దొరకని చిట్టచివరి text ఒక అసంపూర్ణ చిత్రం లాగా, చెప్పాలనుకొన్నది చెప్పకుండా ఇంకా ఏదో మిగిలినట్లుగానే ఒక అసంపూర్ణ చిత్రం లాగా, ……..

    చదువుతూ వుంటే ఇనప పంజరం లోని గుండె తడిసి నీరై కారింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.