cover

నిన్నలలో నిలిచిన యవ్వనం

Download PDF  ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) రాసిన “Growing Old” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

నిన్నలలో నిలిచిన యవ్వనం

గై డి మొపాసా

ఆ కెఫెలో డిన్నర్ ముగించి తీరుబడిగా కిటికీలోంచి బైటకు చూస్తున్నారా ఇద్దరు మిత్రులు. వెడల్పాటి వీధి, వీధి పొడవునా నీడలు పరుస్తున్న చెట్లు, జనంతో కిటకిటలాడుతున్న ఆ రాత్రి పరిసరాలు. ఆహ్లాదకరమైన వేసవి రాత్రులలో మెల్లమెల్లగా వీస్తూ, ఆకుల నీడల మాటున, వెన్నెలతో వెలిగే నదులు మిణుగురులు పాలపిట్టలు కనే కలల అంచున, మనుషుల్ని దిశ గమ్యంలేని రికామీ షికార్లకి పురికొల్పే పడమటిగాలి ఆ మిత్రుల్ని పరవశింపజేస్తోంది.

ఇద్దరిలో ఒకడైన హెన్రి సైమన్ గాఢంగా నిట్టూర్చి అన్నాడిలా: “ప్చ్! నేను ముసలాడ్నై పోతున్నాను. చాలా బాధగా ఉంది. గతంలో అయితే ఇటువంటి రజో రాత్రిలో ఒళ్ళు కామినీ భూతాల నెలవయ్యేది. ఇప్పుడైతే ఏవో కుంటిసాకుల కోసం వెదుక్కుంటుంది. కాలం ఎంత వడిగా దూకుతోంది?”

అతను అప్పటికే కాస్త లావయ్యాడు, బట్టతల పూర్తిగా వచ్చేసింది. బహుశా నలభై ఐదేళ్ళు ఉండొచ్చు. అతనికి ఎదురుగాఉన్నతను పీటర్ కార్నియర్. హెన్రి కంటే పెద్దవాడే గానీ, రివటలా, ఎంతో హుషారుగా ఉన్నాడు. హెన్రి మాటలకు ఇలాబదులిచ్చాడు:

“నా విషయానికొస్తే మిత్రమా! అంతకు ముందు ఈ లోకంలో నేను పట్టించుకోనిదేదైనా ఉందంటే అది నా వయస్సే. కానీ, నాకుతెలియకుండానే హఠాత్తుగా వయసు మీద పడింది. గతంలో నేనెప్పుడూ సంతోషంగా ఉండేవాడ్ని. చీకూచింతా లేకుండా సరదాగా బతికేసేవాడ్ని. ఎవరైనా తనని తాను రోజూ అద్దంలో చూస్కుంటూ ఉంటే తన మీద వయసు ప్రభావాలు గమనించలేరు. ఎందుకంటే ఆ మార్పు చాలా నెమ్మదిగా జరుగుతుంటుంది. ముఖంలో మార్పులు కూడా క్రమేణా వస్తాయి కాబట్టి, వాటిని పట్టుకోవడం కష్టం. అలా రెండు మూడేళ్లు కొనసాగే విధ్వంస ప్రక్రియ తర్వాత వయసు చేస్తున్న దీర్ఘకాలిక కుట్రకి దిగులు పడిచస్తాం. అంతేగానీ, మార్పుని మనం ఎంత మాత్రం ఆమోదించలేము. ఆ మార్పుని పట్టి పరీక్షించాలంటేమాత్రం మన వంక మనం చూసుకోకుండా కనీసం ఆర్నెల్లు ఉండాలి. తర్వాత చూడు, అబ్బా! నిజంగా ముఖాన చళ్లున చరిచినట్టే.

“మిత్రమా! ఇక ఆడవాళ్ళ గురించి చెప్పాలంటే, ఈ విషయంలో నాకు వాళ్ళమీద చెప్పలేని జాలి. వాళ్ళ మెరుపు, తుళ్ళింత, ఇంకా వాళ్ళ జీవితంలోని ఉత్సవసౌరభమంతటికీ మూలం, ఆధారం… వాళ్ళ అందమే. కానీ ఆ అందం నిండా పదేళ్ళు మించి నిలవదు.

“నేను పసిగట్టకుండానే నా మీదకి వార్ధక్యం వచ్చి పడిందని చెప్పానా! నాకిప్పుడు సుమారు యాభై ఏళ్ళు. అయినా అప్పటికినాకు నేను కుర్రాణ్ణనే అనుకునే వాడ్ని. పటుత్వానికి సంబంధించి ఎటువంటి అనుమానాలు లేకుండా ఆనందంగా, ప్రశాంతంగా గడిపేసేవాడ్ని. అయితే, వయసు తెగబడి చేసిన ధ్వంసరచన గురించిన ఎరుక నాకు చాలా అలవోకగా, కానీ ఎంతో బీభత్సంగానూ కలిగింది. దాని దెబ్బతో ఆర్నెల్లు మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ అనుభవంతో నాకు జ్ఞానోదయమయింది.

image“చాలా మంది మగాళ్ళలానే నేను కూడా తరచూ ప్రేమలో పడుతుండేవాడ్ని. ఎట్రిటాట్ బీచ్లో పన్నెండేళ్ళ క్రితం ఆమెని మొదటిసారి చూశాను. యుద్ధం ముగిసి అప్పటికి ఎంతో కాలం కాలేదు. తలారా తడిసిపోవాలని తపన కలిగే ఆ పల్చటి ప్రభాతసమయంలో ఆ సముద్ర తీరాన్ని మించి మనోహరమైంది మరొకటి ఏముంటుంది. ఎతైన తెల్లని కొండల మధ్య గుర్రపు డెక్కలాతోచేది ఆ చిన్న సముద్రతీరం. సముద్రంలోకి చొచ్చుకుపోయిన తీర్థపురాళ్ళ తీరం గిట్టల మధ్య జాగాలా అన్పిస్తూ, పై నుంచిచూస్తుంటే ఆ ఒడ్డు ఒక పాదముద్రలా ఉంటుంది. రెండు పెద్ద కొండరాళ్ళ మధ్య ఖాళీలో కేరింతలు కొడుతుందొక ఆడవాళ్ళగుంపు. కళ్ళు చెదిరే దుస్తులతో, మనసు చెదిరే నవ్వులతో అక్కడొక అందమైన తోటని పూయిస్తుందా సమూహం. ఆ ఒడ్డు పొడవునా అన్ని ఛత్రచ్ఛాయల మీద, ఆ హరిత నీలపు సముద్రం పైనా ప్రసరిస్తోంది నీరెండ. ఒలికిపోయే చిర్నవ్వులు, తొణికిసలాడే కవ్వింతలు… పరిసరాలన్నీ ఆనందార్ణవాల వర్ణం. అలలతో సయ్యాటలాడే వారినలా చూస్తూ ఒడ్డున హఠం వేసుకుపోతాండెంత ప్రవరాఖ్యుడైనా. జలకాలాటల కోసం మెత్తని జలతారు దుస్తుల్లోకి నాజూకుగా మారి, చిరు అలల అంచున తుళ్ళింతలా విరిగే నురగలోకి లయబద్ధంగా జారిపోతున్నారు వారు. సముద్రంలోకి కాస్త వడివడిగా అడుగులేస్తూ, అంచెలంచెలుగా తాకే కెరటాలు పుట్టించే చక్కిలిగింతల చలికి కొద్దిగా వణుకుతూనో, కాస్తంత వుక్కిరిబిక్కిరి అవుతూనో ఆగిపోతున్నారు. ఆ అలల గారడికి లొంగని మరి కొన్ని పోత పోసిన బొమ్మల్ని ఆపాదమస్తకం తేరిపార చూసే సదవకాశం కలుగుతోంది. అయితే నిగారించిన ఆ దేహ రహస్యాల్ని బట్టబయలు చేయడంలో ఉప్పని కెరటం ఎంతో ఉపకరిస్తుందన్నది నిజమైనా, తీరం మీదకు విరిగిన అల తన అశక్తతని చాటుకుంటూ సోలిపోతోంది.

“ఆ గుంపులో ఆమెను చూసిన తొలిచూపులోనే పరవశించిపోయాను. ఆమె రూపురేఖల లావణ్యం, తీర్చిదిద్దిన మేని సౌష్టవం నన్ను తన్మయుడ్ని చేశాయి. కొందరిని చూడగానే ఆ ముఖ సోయగం మనలో చొరబడి, సర్వం కొల్లగొట్టినట్టు అయిపోతుంది. అటువంటి స్థితి నాకు ఎదురై, హఠాత్తుగా అన్పించింది – ఆమెను ప్రేమించడానికే పుట్టిన నేను, ఆ అన్వేషణలో తనని ఇప్పుడిలాకనుగొన్నానేమో. ఈ భావం తళుక్కుమనగానే సంభ్రమంతో ఒళ్ళు వణికింది. నన్ను నేనే వ్యక్తం చేసుకొని, అంతలోనే పట్టుబడిపోయి, అంతకుముందు అనుభవంలో లేని ఒక చిత్రమైన స్థితిలోకి జారిపోయాను. ఆమె నా హృదయాన్ని యావత్తూ కొల్లగొట్టింది. అలా ఒకానొక స్త్రీ గడుసుగా నా మీద పెత్తనం చేయటం నాకు బితుకు బితుకుమనిపించింది; అంతలోనే అదో మధుర యాతనలా తోచింది. అది మహా శిక్షలా ఎంత అన్పిస్తుందో, నమ్మశక్యం కాని మహదానందంగా కూడా అంతలానే అన్పిస్తుంది. ఆమె క్రీగంటి చూపు, కొంటె నవ్వు, పిల్లతెమ్మెరకు కంఠం ఒంపు మీద తారాడే కురుల మారాం, తన ముఖం మీద సనసన్నని రేఖలు, చిరు కదలికలకి గోముగా కంపించే ఆమె అణువణువూ నన్ను వివశుడ్ని చేసి, ఆమె అంటే వల్లమాలిన వలపు కలిగించాయి. ఆమె కవళికలు, చేష్టలు, చివరికి ఆమెను అంటిపెట్టుకున్న ప్రతి వస్తువూ కూడా నా అస్తిత్వం మొత్తాన్ని వశం చేసేసుకున్నాయి. ఇక ఆ తరువాత ఆమే ధ్యాస, ధ్యానం. ఆమె వల్లెవాటు ఏ చిలక్కొయ్యకి విసిరేయబడుతుందో, తనమేజోళ్లు ఏ వంకీ కుర్చీ మీద వాలిపోతాయో కూడా వేచి చూస్తుండేవాడ్ని. ఆమెను పొదువుకున్న దుస్తులైతే ఇక నాకు అనుపమానాలుగా అన్పించేవి.

“ఆమె ఒక వివాహిత. ఉద్యోగరీత్యా వేరే చోట ఉండే ఆమె భర్త ప్రతి శనివారం వచ్చి సోమవారం వరకూ ఉండి వెళ్ళిపోయేవాడు. అతను చాలా నిర్లక్షమైన మనిషిలా కన్పించేవాడు నా కంటికి. ఎందుకో తెలియదు కాని నాకు అతనంటే అసూయ లేదు; నాజీవితంలో అతనంత అప్రధానమైనవాడు మరొకడు లేడు, లేదా నా దృష్టిని అంత తక్కువగా ఆకర్షించిన మనిషి అతను తప్ప ఇంకొకడు లేడు. సరే అదలా ఉంచు. ఎంతగా ఆరాధించానామెను. ఏమి కళ, ఎంతటి యవ్వన కాంతి! మాటలకందని మెరుపు, ఊహలకు సైతం చిక్కని మిసిమి. కళ్లు పట్టనంతటి సౌందర్యం… అంతకుముందెన్నడూ నేను చూడని నేవళం. ఎంత మందిలోఉన్నా కొట్టొచ్చినట్టు కనబడే రమణీయత, తమ సొగసు బరువుకే సోలిపోయే పూరేకుల అబలత్వం, ఆమె చెక్కిళ్ల అంచున ఒంపుల గోరోజనం, అధరాల మీద విరిసీ విరియని ఆరాటం, అందమైన చిన్న చెవి గవ్వలో అర్థం లేని దొంతర్ల మాయ, ముక్కు అని మనం పిలిచే ఓ నాజూకు సంపెంగ బడాయి… ఎంతకీ అంతుచిక్కని కులుకుల దాష్టికం.

“అలా మోహ మంత్రజాలంలో చిక్కుకొని విడుదల లేని సత్య సుందర క్లేశానందాన్ని మూడు నెలల పాటు అనుభవించాను. ఆతర్వాత అమెరికా వెళ్ళాల్సివచ్చింది. అంతులేని నిస్పృహలో నా వియోగ హృదయం తల్లడిల్లి పోయింది. అయితే, ఆమెకి సంబంధించిన తలపు – విరహ వియోగాలంటని స్ఫూర్తిలా నాలో నిండిపోయింది, నా అంతఃకరణని ఉద్దీపిస్తూనే ఉండేది. చేరువ, ఎడబాటులతో నిమిత్తంలేని ఒక తామస పాశంతో నన్ను తనకి కట్టేసుకుంది. కొన్నేళ్లు గడిచాయి. కాని నేనామెనుమర్చిపోలేదు. ఆమె సమ్మోహన రూపం సతతహరితంగా కళ్ల ముందు కదలాడేది. గుండె చెరుగుల్లో తచ్చాడేది సజీవంగా ఎద వాకిట ఎదురైన ఆ అపూర్వ సౌందర్య తేజోమూర్తి ఒకానొక ప్రేమాతిశయ స్మృతిగా నిలిచిపోయింది. సడలని ధ్యానంలో ఆమెభక్తుడ్నై మిగిలిపోయాను ఎన్నేళ్లయినా –

“మగాడి జీవితంలో పన్నెండేళ్లంటే పెద్ద విషయమేమీ కాదు. కొందరు పన్నెండేళ్లా అని గుండెలు బాదుకుంటారు. సంవత్సరాలు ఒకదాని తరువాత మరొకటి హుందాగా, తొందరగా దొర్లిపోతాయి. నెమ్మదిగానో, లేదా వడివడిగానో మొత్తంమీద గడిచిపోతాయి. వాటి గుర్తుల్ని ఏమంత వదలవు కూడా. ఒకవేళ కాలపు చిహ్నాలు ఏవైనా ఉంటే గింటే అతి త్వరత్వరగా సమసిపోతాయి, చెరిగిపోతాయి. కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గ్రహించగలిగేది ఏమీ ఉండదు. అంతేకాదు, తమకి వయసు మీరేలా చేసిన అంశమేమిటో ఎంతకీ అంతుచిక్కదు. అయితే నా మటుకు నాకు ఆనాడు సముద్రపుటొడ్డున ఎదురైన వలపు వసంతం ఇటీవల కొద్ది మాసాల నాటిదే అన్పించింది.

“నేను తిరిగి ఇక్కడికి వచ్చాక గత చైత్రంలో మాన్సన్ -లాఫిట్లోని ఒక మిత్రుడి ఇంట్లో విందుకువెళ్లాను. వెళ్లేటప్పుడు రైలు బయలుదేరుతుందనగా ఒక లావుపాటి స్త్రీ నలుగురు పిల్లలతో హడావిడిగా నేనున్న బోగీలోకి ఎక్కింది. రంగురంగుల రిబ్బన్లతో అలంకరించిన టోపీ కింద నిండు చంద్రుడి బూరెబుగ్గల ముఖంతో, గుండ్రని భారీకాయంతో అపసోపాలు పడుతున్న ఆ పిల్లలకోడి వంక బెరుకుగా పరికించి తల తిప్పేసుకున్నాను. ఆదరాబాదరా నడిచొచ్చిన కారణంగా ఆమె బరువుగా శ్వాసిస్తోంది. పిల్లల గోల మొదలైంది. నేను పేపరుతెరిచి చదవడంలో నిమగ్నమయ్యాను. మేము అస్నెరెస్ దాటామో లేదో, ఆ బోండాం హఠాత్తుగా అడిగింది:

“ ‘క్షమించండి. మీరు కార్నియర్ గారు కాదుగదా’

“ ‘అవునండీ’

“అంతే! ఆమె నవ్వసాగింది. కానీ ఆ నవ్వులో ఏదో విరుపు. అంతకుముందు లేని విచారపు జీర. ‘మీరు నన్ను గుర్తు పట్టలేదా?’ అని అడిగింది. నేను తటపటాయించాను. ఆమె ముఖాన్ని ఎక్కడో చూసినట్టే ఉంది. కాని ఎక్కడ? ఎప్పుడు? ఈ సంకోచంతోనేబదులిచ్చాను: ‘గుర్తుపట్టాను, పట్టలేదు కూడా. గుర్తుపట్టినట్టే అన్పిస్తుంది గానీ, మీ పేరు జ్ఞాపకం రావడంలేదు.’

“ఆమె ముఖం కందగడ్డయింది. మెల్లగా చెప్పింది: ‘జూలి లెఫ్రీ.’

“జీవితంలో మున్నెన్నడూ ఎరగనంత షాక్కి గురయ్యాను. ఒక్క క్షణం నాకు సర్వం శూన్య మనిపించింది. నా కంటికి కమ్మినపొరలు నిర్దాక్షిణ్యంగా చీరుకుపోయి, నా ముందు సలపరింతల భీతావహ దృశ్యమొకటి నిటారున నిలిచినట్టు తోచింది. ఈమె ఆమేనా? ఆ ఎల్లలులేని రసచైతన్యం, చిదిమి దీపం పెట్టుకునే చక్కదనం, దృశ్యంలో ఇమడలేక పిగిలిపోయే ముగ్ధసింగారం… ఈమేనా? నేను తనని చూసిన తర్వాత ఈ నలుగురు ఆడపిల్లల తల్లి అయిందా? ఆ తల్లి ఎంతలా ఆశ్చర్యానికి లోనుచేసిందో, అంతకుమించి దిగ్ర్భాంతికి గురిచేసారా పిల్లలు. వారంతా ఆమెలోంచి ఊడిపడ్డారు, ఇంతెత్తున ఎదిగారు, ఆమె జీవితంలో ఎంతోజాగాని సాధికారంగా కబ్జా చేశారు కూడా. ఆమెలో నాటి కొంటెతనం, వర్చస్సు… ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు. ఆమెని నిన్ననే చూసినట్లుంది, ఈ రోజు ఇలా ఎదురైంది. పిడికిలంత గుండెని పట్టి పిసికిన తీవ్ర వేదనకు గురయ్యాను. ప్రకృతి మీదచెప్పలేనంత ఉక్రోషం, ఒక తిరుగుబాటులా – ఇంతటి సౌందర్య విఘాతానికి, విధ్వంసానికి మనసెలా ఒప్పింది దేనికైనా. ముంచెత్తేదుఃఖంలో ఆమె వంక చూశాను. చప్పున ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను. కళ్లు దిగులు కుండలై ఒలికి పోతున్నాయి. కూలిపోయిన ఆమె యవ్వనాల స్మృతిలో ఆరిపోయిన కాంతిపుంజాలని తలుచుకొని తనివితీరా రోదించాను. ఈ భారీ అనాకారదేహం అపరిచితంగానే మిగిలిపోయింది.

“ఆమె కూడా ఎంతో కదిలిపోయింది, మాటలు తొట్రుబడ్డాయి: ‘నేను చాలా మారిపోయాను కదూ! ఇన్నేళ్లకి ఇంకా మనం ఆశించేదేముంటుంది? చూశావా నేనొక తల్లినై పోయాను, మంచి తల్లిని. నిన్నలోని ఎన్నింటికో చెప్పేశాం వీడ్కోలు. కాలం గతించిపోయింది. మనం కలిసినప్పుడు నువ్వు నన్ను గుర్తుకూడా పట్టలేవని మాత్రం నేను ఏనాడూ ఊహించలేదు. నువ్వు కూడా మారావు. నేను కూడా నిన్ను గుర్తుపట్టడంలో పెనుగులాడాను చాలాసేపు. వెంట్రుకలు నెరసిపోయాయి. పన్నెండేళ్లు… ఆలోచనే ఎలా ఉందో! నా పెద్ద కూతురికి అప్పుడే పదేళ్లు.’

“నేనా పాప వంక చూశాను. ఆ చిన్నారిలో ఆమె తల్లి ఛాయలు అప్పుడప్పుడే తొంగి చూస్తున్నాయి. అయితే అవి ఇంకా రూపుదిద్దుకోలేదు పూర్తిగా. అప్పుడప్పుడే మొగ్గలు తొడుగుతున్నాయి పోలికలు. రైలులానే జీవితం కూడా వేగంగాదాటిపోతుందనిపించింది.

“మాన్సన్ లాఫిట్ చేరుకున్నాం. నా పాత నేస్తం చేతిని మృదువుగా ముద్దాడాను. ఆమెతో ఏమీ మాట్లాడలేక మాటలురాని మూగవాడ్నైపోయాను. గుండె గొంతుకలో కొట్లాడుతున్నా, నోరు పెకలని యాతన.

“ఆరోజు సాయంత్రం నా ఒంటరి గదిలో చాలాసేపు అద్దంలో నన్ను చూసుకుంటూ ఉండిపోయాను. నేను వెనకటిలానేయవ్వనంలో ఉన్నానన్న తలంపు మొదలంతా తుడిచేశాను, లేదా అదే తుడిచిపెట్టుకుపోయింది. నా ఒతైన మీసం, నల్లనిజుట్టు, పసిడి యవ్వనం తొణికిసలాడే ముఖ సాముద్రికాన్ని తరచితరచి చూసుకునే నిన్నటి అలవాటుని రద్దు చేసేశాను వీడ్కోలుగా. నేనిప్పుడు ముసలివాడ్ని.”

*

Download PDF  ePub MOBI

 

Posted in 2014, అనువాదం, ఏప్రిల్ and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.