cover

ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ

Download PDF ePub MOBI

(కాశీభట్ల వేణుగోపాల్ రాసిన ఈ పెద్ద కథ రెండు భాగాలుగా వస్తుంది. ఇది మొదటి భాగం.) 

అనాదిలో ఎవరో మేధావులు ఈ సంఘం శరీరం మీద కనబడని ఆయుధంతో చేసిన మాను పట్టని గాయం ఎబినేజర్… ‘ఎబినేజర్’ ఒక్కడు కాదు వందలు, వేలు, లక్షలు…

ఆ గాయం యింకా రసి కారుతూనే ఉంది… అర్థం కాని సిద్ధాంత కారులు పైపై మల్హాములు రాసినా కనిపించకుండా ఉండేందుకు ఎన్ని సూత్రాల బట్టలు చుట్టినా. ఎన్నెన్ని నాగరికతలు! ఎన్నెన్ని ప్రభుత్వాలు! ఎబినేజర్లు మిగిలేవున్నారు…

పుండుబట్టి రసి కారుతూ…

* * *

ఎబినేజర్…

మాదిగ నింబోడు…

మతాల వాసన తెలీనివాడు…

నాగరక సూత్రాల పట్టింపు లేనివాడు…

వోటు మీద గాంధీ బొమ్మ చూసి ‘ఎవర్రా?’ అని అడిగితే…

‘క్కెక్కెక్కె’మని నవ్వి, ‘నాలెక్కే తొస్సినోటి మాసి’ అనే నిర్మలుడు

నవ్వే యిబ్బిగాడు… ఎబినేజర్…

పచ్చి పచ్చి మనిషి వాసన గొట్టే ఎబినేజర్

* * *

ఎబినేజర్ పరిచయం మామూలుగా చాలా సాదాగా జరిగింది.

సెప్టిక్ ట్యాంక్ నిండితే గోడల మీద రాసి వున్న ఓ నంబరుకు ఫోన్చేశా… ‘సెప్టిక్ ట్యాంక్ నిండిందా’ అన్న నంబరుకు…

ట్యాంకరొచ్చింది…

ఓ వ్యక్తి ఖాకీ నిక్కరు మోకాళ్ల కింద దాకా…

మాసి మాసి యిక మాయవీల్లేని ఓ చదరాల చొక్కా…

మాసి మైనమోడుతూన్న ఓ నీలం రంగు వెనక్కి తిప్పిపెట్టుకున్న క్యాప్‌తో…

ఓ లావుపాటి పైపు యీడ్చుకుంటూ ట్యాంక్ దగ్గరకొచ్చి సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచి… ఆ పైపును ట్యాంకులోకి జార్చి నా వేపు చూశాడు…

అర్థమైపోయింది నాకు…

ఇక జన్మలోవాణ్ణి మరువలేనని…

వాడు కుడికన్ను పూర్తిగా పూచి వుంది

పళ్ల పై వరసలో కింద వరసలో మూడు మూడు పళ్లు శూన్యం…

“వర్యా యిబ్బీ పైపేచ్చిన్యా?”

బైట ట్యాంకర్తో వచ్చిన యింకో కుర్రాడి గావుకేకతో వీడి పేరు ‘యిబ్బి’ అని అన్తెల్సింది.

“రై య్ య్ ట్” యిబ్బి బదులు లేక…

ebenezerసెప్టి ట్యాంక్ ఖాళీ అయ్యింతర్వాత మ్యాన్ హోల్ మూత వేసి తలకున్న నీలం రంగు క్యాప్‌ను చెవి పక్కకు తిప్పుకుని పైప్ చుట్టుకుంటూ బైటికెళ్లి ట్యాంకర్‌కు కట్టేసి…

వచ్చి నా ముందు చేతులు వెనక్కి కట్టుకుని నుంచున్నాడు…

అయిదడుగులెత్తు…

వాడి పూచిన కన్ను చూడగానే మా మేష్టారు భాగవతుల వారు మా చిన్నతనాన తన పండిత మిత్రుడి గురించి చెబుతూ (ఆ పండితుల వారికీ కన్ను పూతే)…

‘పూకంటి పండితుడువాడు’ అని నవ్విన నవ్వు గుర్తొచ్చింది.

యిబ్బి నడుమెనకాలికి చేతులు కట్టుకుని నన్ను ఓ కంటితో చూస్తున్నాడు… ‘పూకంటి యిబ్బి’.

సాంస్కృతిక దాష్టీకంతో వాడు డబ్బు కోసం చూస్తున్నాడని గ్రహించినా…

“ఏరా, మీ ఓనరు ఇజ్రాయిలుకు మొత్తం పేమెంటిచ్చాగా” అన్నా…

వాడు పూకంటి వాడు చేతుల్నులుపుకున్నాడే గానీ ఒక్క మాట మాట్లాళ్లే…

ఇంకో అయిదో పదో మామూలేననుకుని ఓ ఇరవై నోటిచ్చా.

“యాభై” వాడు అర్థించలే… దబాయిచ్చినట్టన్నాడు…

“ఎందుకురా ఏభై?” గద్దించా

“సీష యాపై గద” పూకంటి తొస్సి యబ్బివాడు కూడా దబాయించినట్టే అన్నాడు…

“అంటే నీ మందుకి నన్నివ్వమంటావా?”

వాడు… ఆ పూకంటి తొస్సి నోటి పొట్టి నా పాయఖానా రొచ్చు శుభ్రం చేసినవాడు ఒక్క మిల్లీ మీటరు కూడా కదల్లేదు…

తలవారగా తిప్పి పూకంటితో నన్నే చూస్తున్నాడు… ఒక్క మాట మాట్లాళ్లేదు…

తాగుడు ప్రభావమెలాంటిదో దాని కౌగిట్లో వున్న నాకు తెల్సు కాబట్టి చిన్నగా నవ్వుకుంటూ ఓ రెండు వంద కాయితాలు వాడి వేపు జాచి…

“దొంగెదవా… యింద యాభైతో నీది నువ్వు కొనుక్కోని మిగిలిందాంతో నాకో క్వార్టరు పట్రా… ఏరా ‘యిబ్బి’ అంటే?” అన్నా.

“యిబ్నెజర్” అని వెనక్కి తిరిగాడు.

వాడి కంట్లో భావాలు ఏ భాషావేత్తలూ ఏ శాస్త్రవేత్తలూ చదవలేరు…

అట్లాంటి పూకంటి చూపుతో గేటు దాటాడు… తొస్సి నోటి పొట్టి ఎబినేజర్ తొడు గొడుగు ఖాకీ నిక్కర్తో…

* * *

ఒక ఆదివారం… నేను స్కూటర్మీద KC కెనాల్ బ్రిడ్జి మీంచి వెళ్తూ ట్రాఫిక్ రద్దీకి నిలబడాల్సి వచ్చినపుడు రెండోసారి కనిపించాడు ఎబినేజర్…

ఈ మాటు పంచె కట్టుకున్నాడు…

ఏదో యూనివర్శిటీ బ్లేజర్ తొడుక్కున్నాడు. దాని భుజాలకు సున్నపు మరకలున్నై…

చేతితో కుక్క చెవుల మడతల నలిగిన లెదర్ బౌండ్ బైబిల్…

యిబ్బి పక్కన ఓ నల్లటి చాలా బక్కపల్చటి అమ్మాయి

ఆ అమ్మాయి వయసు చెప్పడమూ కష్టం… యిబ్బి వయసు లాగే…

యిబ్బి అనబడే ఎబినేజర్ వయసు నలభై నించీ అరవై వరకూ ఎంతైనా వుండొచ్చు…

ఆ అమ్మాయి కూడా పద్దెంది నించీ ముప్ఫై మధ్య ఎంతైనా వుండొచ్చు…

యిబ్బి ఆ అమ్మాయితో నవ్వుతూ ఏదో అన్నాడు. తొస్సి అంత రద్దీలో కూడా కనబడింది.

ఒక్కసారి నన్ను చూసి మళ్లీ ముందుకు చూసి మళ్లీ నన్ను చూసి ‘హాయ్’ అన్నట్టు చెయ్యెత్తాడు.

తల తిప్పుకుని జనాల్లో కలిసిపోయాడు

వేలమందిలో కూడా గుర్తుపట్టగలిగే ‘ఎబినేజర్’

* * *

కొద్ది రోజులు కన్పించలేదు ఎబినేజర్

వాడి వూహ మాత్రం నన్నొదల్లే…

వాడి రూపం అస్సలు వదల్లే…

వదల్దు కూడా…

ఇంటి కెవరో చాలామంది మిత్రులొచ్చారు… వాళ్లకు టిఫిన్ తేటానికి ప్లాస్టిక్ బుట్టలో క్యాసరోల్ వేసుకు ‘తృప్తి’ హోటల్కి వెళ్తున్నా…

ఉదయం తొమ్మిది అయ్యుంటుందంతే…

నందీ బ్రాందీ షాపు ముందు…

చిందులేస్తూ ఎబినేజర్…

కుతూహలం

అదే తొడుగు ఖాకీ నిక్కరు…

ఇక మాయలేక అలసిపోయిన గళ్ల చొక్కా…

మురికి మైనం పేరుకున్న నీలం రంగు వైసర్ క్యాప్… వైసర్ తల వెనక్కి తిప్పి వుంది…

“ఏయ్ నీయమ్మ… నీయక్క… యాయ్” అనరుస్తూ ఎగుర్తున్నాడు…

సర్కస్‌లో మరుగుజ్జు బఫూన్ గుర్తొచ్చాడు…

ఉదయాన్నే తాగుంటాడ్లే అనుకుని కదలబోయా…

ఇంతలో సగం తెరిచున్న షట్టర్కింద నుంచి ఓ నల్లటి అడ్డపంచె కట్బనీను ఆకారం వంగి బయటికొచ్చింది బ్రాందీ షాపులోంచి…

“నీయమ్మ మాదిగ నాకొడక దెంగి తాగి దుడ్లీరా అంటే కూతలు కూచ్చావ్‌రా లంజాకొడకా” అనరుస్తూ ఎబినేజర్ని… బక్క పొట్టి యిబ్బిని తాగేసున్న యిబ్బిగాడిని… పూకంటి తొస్సోడిని… అసలే అయిదడుగులవాడిని మూడడుగులు చేసి వీపు మీద ధబీమని గుద్దాడు…

దెబ్బకు ‘వాక్’ అని కక్కేడు యిబ్బి… ఎనిబేజర్…

ఆగలేకపోయా… గబగబా వెళ్లి…

“ఏయ్ ఆగు ఎందుక్కొడ్తున్నావ్ వాణ్ణి? ఎంతున్నాడు వాడు నీ ముందు దున్నలాగున్నావ్…” అని గట్టిగా అరిచా…

వాడు ఆగి రొప్పుతూ…“సూడ్సా… పొద్దుగాలాచ్చి అరపైరూపాల మందు తాగి దుడ్లీరా కొడ్కా? అంటే రాస్కో యిచ్చాలే నీ బంగారం దుడ్ల్యాడికెల్లివోతయ్” అంటున్నాడు… “మీదికెల్లి అమ్మక్కలాల తిట్లు తిట్టి ఎగుల్లాడ్తాండాడు” అన్నాడు…

కిందవడ్డ ఎబినేజర్ లేచి… ఏదో చెప్పాలని చూస్తున్నాడు. వాణ్ణి చేతి సైగలో ఆపి… జేబిలోంచి డబ్బు తీసి బ్రాందీ షాపు వాడికిచ్చి “యబ్బీ, వెళిపో యిక్కణ్ణించి” అనర్చా…

తలొంచుకు ఎనినేజర్

పూకంటివాడు

తొస్సినోటివాడు

అయిదడుగులవాడు

నీ పాయఖానా రొచ్చు శుభ్రం చేసినవాడు…

మాదిగనాకొడక, లంజకొడకా అని ఉదయాన్నే తిట్టించుకున్నవాడు… తొడుగు ఖాకీ నిక్కరులో బక్క నల్ల దొడ్డి కాళ్ల వాడు… కిందపడ్డ మురికి మైనం నీలం టోపీ తీసి తలకు తగిలించుకుని వూగుతూ తూగుతూ వెళిపోయాడు.

మనసు ఉదయాన్నే చేదుగా అయిపోయింది.

* * *

ఎక్కడి వాడీ ఎబినేజర్?

ఎంతమందీ ఎబినేజర్లు…

ఈ దేశజనాభాలో ఎన్ని లక్షల మంది వీళ్లు

ఈ సంఘ శరీరమ్మీద మానుపట్టని గాయాలు? ఎవరి చేసిన గాయమిది? ఎందుకని మాను పట్టడం లేదు…

రకరకాల రంగు రంగు సిద్ధాంతకారులు ఎరువు తెచ్చుకున్న పై మెరుగు సిద్ధాంతాల మల్హాములు రాసినా మానుపట్టక రసి కారుతూ…

What kind of sepsis is this?

Which kind of bacterial infection is this?

రోజు రోజుకీ putrify అవుతూ…

ఏ మతం మాన్పిందీ గాయాన్ని… పేర్ల మార్పిడి తప్ప

ఏ రాజ్యాంగం దీనికి మందు –

ఇప్పటికిప్పుడు నేనిచ్చొచ్చిన అరవై రూపాయలు ఏమిటి?

నా conduct certificate అనుకుంటున్నానా?

జాతః నాలో ఊరుతున్న అభిజాతభావనతో వాడిపై జాలిగా కనబడ్తోన్న అధికార భావనా… లేదూ ‘ఎబినేజర్’ కథ రాస్తూ నేనో Reformist ననుకుంటున్నానా? After all I too am a human being born in to a BRAHMIN family.

చూస్తా… సిస్టమోపెన్చేసి తెల్సుకుంటా. తె… లు… సు… కు… తీ… రా… లి. lelle Mahadiga చూడాలి.

* * *

తర్వాత చాల్రోజులు యిబ్బిగాడు కనబళ్లే…

నేనూ నా నైమిత్తికాల మధ్య…

నా చదువులూ… రాతలూ… అచ్చులూ… అచ్చుతప్పులూ… ఇంటర్వ్యూలూ… ఆహాఓహోలూ… ఛీత్కారాలు…

నా తాగుడూ… అమ్మతో రగడలూ…

హింసా… ఆనందం… ఈ కసవుకుండీ వెనక ఎక్కడో నక్కి నక్కి యిబ్బిగాడి… ఎబినేజర్ ముఖం…

పూకంటి తొస్సినోటి అయిదడుగుల…

ఇక మాయలేక అలిసిన గళ్ల చొక్కా… తొడుగు తొడుగు ఖాకీ నిక్కర్…

పొట్టి పంచె… సున్నం తగిలిన బ్లేజర్

కుక్క చెవుల మడతల నలిగిన లెదర్ బౌండ్ బైబిల్

అన్నిట్నీ మించి

వైజర్ వెనక్కి తిప్పిన మట్టి మైనం నీలం రంగు క్యాప్

ఎ… బి… నే… జ…ర్

* * *

తర్వాత్తర్వాత వాడు మంచి నేస్తమయ్యాడు… నేస్తమైంతర్వాత వాడు అద్భుతమైన గాయకుడన్తెల్సింది… వాడు రూపానికీ… గాత్రానికీ పూర్తి వికృతి…

పాత సినెమా పాటలు అద్భుతంగా గానం చేస్తాడు వాడు…

భానుమతి పాట ‘మనసున మల్లెల’ పాట యిబ్బి గొంతులో యింకా మహాద్భుతంగా వినిపించేది…

ఎప్పుడలవాటైందిరా నీకు మందు అనడిగితే… ఏ భావమూ ధ్వనించక…

“మాయమ్మ ఏడిసే నా నోట్ల సారాయి బోసి దొరకాడికి పండబోయేడ్ది… నాలు నాలుగేల్లొచ్చేతలికి మాయమ్మ గోసం గాక సారాయి కోసం యేడ్సెతోన్ని… ఏందోలెతీ”

“మీ నాయనా?” అడిగితే, వికవికా నవ్వి “లంజకొడ్కుకు నాయన్యాడికెల్లొచ్చాడు?” కనిపించని అగ్నిపర్వతం నించి విసవిసా పొంగుతున్న లావాలా ధ్వనించే మర్మర స్వరంతో…

నాలుకెండి నేను… అనామక జ్వరపీడితుడినై

ఎదురుగా పొట్టి

దొడ్డికాళ్ల

మాసిన గళ్ల చొక్కా

తొడుగు ఖాకీ నిక్కరు

పూకంటి

యబ్బి… మరుగుజ్జు అగ్నిపర్వతంలా…

ఎ… బి… నే… జ… ర్…

* * *

ఎబినేజర్ కథ ఓ మట్టి మనిషి కథ… ఈ సభ్య సంఘానికి పట్టని ఓ మామూలు మాదిగోడి కథ.

అదే కాలి కాలి కాలి యిక కాలను మిగలని ఓ కట్టే మనిషి వ్యథ అనిపిస్తుంది.

కానైతే వాడిలో ఏ భావమూ ద్యోతకం కాదు…

వాడి స్వరం దీర్ఘంగా అలల్లేకుండా వీచే ఎడారి గాలిలా వినిపిస్తుంది.

“అన్నం అదీ ఎట్లా గడిచేదిరా యిబ్బీ?” అంటే,

“పీదిని పిడకలేరి మాయమ్మ ఏం పెడ్తాంద్న్యో మతికిల్యా గానీ వూల్ల కెల్లి దున్నో, బర్రో, ఎద్దో, ఆవో జచ్చే పేగులొచ్చాండ్య…

“మాయమ్మ చెయ్యెత్తి పేగుపామ్లెక్క పట్కోని పియ్యి పితికేడ్ది మాత్తరం కండ్లాడ్తా మతికి…

“మాయమ్మ మూతి మతికిల్యా…

“దాన్నొసట్న అద్దరూపాయి మందం పచ్చ మతికి…

“దాని మెల్ల నల్ల దారం మతికి…

“ఆ దారానికేల్లాడ్తాండ్య ఒక రాగి పైస మతికి…

“మాయమ్మ జచ్చిందినం మతికి

“మల్ల దాన్ని గుంత జేయడం మతికిల్యా…

“గాదినం ఇజ్రాయిలన్న వోసిన సారాయి మతికి…”

వాడి పూచిన కన్ను

కణ కణ కణమని కాల్తున్నట్టు

వాడి శ్వాసలో జ్ఞాపకాల బూడిద తుఫానులు రేగుతున్నట్టు

ఎబినేజర్

* * *

“చెర్చిలో పాటలు పాడతావారా యిబ్బీ… నీకు దేముడి మీద బాగా నమ్మకమున్నట్టుంది… ప్రతి ఆదివారం బైబిలు పట్టుకోని… ఈ వేషమిప్పేసి మంచి బట్టలేసుకోని వెళ్తావు… అదీ అంత దూరం నించీ ఇక్కడ చర్చికొస్తావు” అంటే,

“హిహ్హిహీ” అని వాడి ట్రేడ్ మార్కు నవ్వు నవ్వి…

“ఊల్ల వాడల గుడిసె సెర్చి వెట్రి… గో ఇప్పుడు టాంకర్ నడ్పుతడే ఇజ్రాయిలన్న ఊల్లనె వుండె…

“గప్పుడింక పిలగాన్నె… ఒక దినం ఇంటికాడికొచ్చె… ‘వర్యా తొస్సినాకొడ్కా దినామూ నసుక్కె వొచ్చి సెర్సి ఊడ్సి ప్యాన్నీల్లు జల్లిపోరా నెలక్యాబై యిచ్చర’న్చెప్పె

“దుడ్లు సుకుమారం గదా సరెనని తలూప్తి… గాసంది రోజూ సెర్చి ఊడ్సను పోయెతోన్ని…

“ఒగాయన నల్లపొడూటాయన తెల్లపొడూబట్టలేస్కునేటాయన ‘వర్యా గీసంది నీ పేరు నింబోడు గాదు ఎబ్నెజర’నె… ఆకాన్నించీ మాదిగ నింబోడు ఎబ్నెజరాయె, గానాడ్కు యిబ్బిగాడాయె… పాకి దొడ్లు కడగనీకొచ్చి గో నీ న్యాసమాయ, గో ఇప్పుడు నీ సగాల కూసోని ముచ్చటసెప్పబట్టె”

అని మళ్లీ విక వికా నవ్విన

ఎబినెజర్

* * *

మా పక్కింటాయన తనింట్లో అద్దెకున్నవాళ్లు అద్దె యివ్వక ఖాలీ చేయక సతాయిస్తున్నారనీ… పోలీస్ స్టేషన్లో కంప్లెయిన్ చెయ్యాలనీ ‘మీకు సియ్యై గారు బాగా తెల్సు కదా… కొంచెం సాయం రండి’ అని రిక్వెస్టు చేస్తే… త్రీ టౌన్ పోలీస్టేషన్ కెళ్లా…

స్టేషన్ బయటా, ప్రాంగణంలో చాలామంది గుంపులు గుంపులుగా వున్నారు.

సియ్యై శ్రీరాం వున్నాడో లేదో కనుక్కునే వచ్చా…

తిన్నగా అతని గదికేసి వెళ్లబోతూండగా…

వున్నట్టుండి యిబ్బిగాడితో కనపడే బక్కపల్చటి నల్లటి అమ్మాయి అడ్డొచ్చింది… వచ్చి… “యా! సామీ! నాన్న వూకూకెనే లోపలేస్న్యారు… యా, సామీ, సారోల్లకు జెప్పు… ఎవ్వల్నీ ఏమనేటోడు గాదు, నీకు తెల్దా సామీ! పొద్దుగాలే నాకాడ్యాపై రూపాలుంటే, మల్లిచ్చత్యాయే లంజాంట ఎత్కపాయ, ఏం జేసిండో ఏందో కత, సారోల్లు దెచ్చి లోపటేసిన్న్యారు… యా, జెప్పు సామీ…” ఇంకా ఏమేమో చెప్పబోయింది.

ఉండు ఉండన్నట్టు ఆ పిల్లకు చెయ్యి చూపించి, కానిస్టేబుల్తో నా కార్డ్ పంపించి… సియ్యై శ్రీరాం గదిలోకెళ్లా…

మా పక్కింటి వ్యక్తి ప్రాబ్లమ్ చెప్పి ఓకే అన్పించిం తర్వాత పక్కింటతన్ని పంపేసా…

“ఏం దొరా, ‘సాక్షి’లో ‘ఈనాడు’లో చానా చానా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పుడు నీకు recognition కావాల్సొచ్చిందా. అయినా జందెం లేని బాపనోనివి గదా… హహ్హహా” అని నవ్విన శ్రీరాంతో…

“ఎబినేజరనీ… పొట్టిగా… తొస్సి నోరూ… పూవు పూచిన కన్నూ…” అని ఆగా…

ఔనన్నట్టు తలూపి… సెల్ తన అటెండెంట్ వేపు విసిరి… రివాల్వింగ్ చెయిర్ నా పక్కకు తిప్పుకుని…

ఆశ్చర్యం తానై…

“ఊ ఔను… సెప్టిక్ ట్యాంక్ క్లీనర్గాడు… హౌకం యూ ఆర్ ఇన్‌ట్రెస్టెడ్ ఇన్దట్ స్క్యావెంజర్?” అడిగాడు…

“ఏమిటి వాడి పైన కేస్?”

“పెటీ, వెరీ వెరీ పెటీ కేస్… ఊ చెప్పు కవీ, నీకానాకొడుకెట్లా పరిచయం… బఫూన్గాడు… బోకు ముండాకొడుకు… ఊ?” మళ్లీ అడిగాడు శ్రీరాం…

“హా… ఇట్స్ లాంగ్ స్టోరీ… విల్ యిట్ బీ పాసిబిల్ ఫర్యూటు…”

“హహ్హహా… వదిలేయ్ మంటావ్… నో కేస్ బుక్డ్… నాకు నువ్ మూడు పార్టీలు బాకీ వున్నావ్… ఈ బఫూన్గాడి కేసుతో నాలుగవుతయ్… ఒకే అంటే సరే…” అని “రంగారెడ్డీ, ఆ బఫూన్గాన్ని యీడ్చకరా” అని కానిస్టేబుల్‌తో అన్నాడు శ్రీరాం…

వచ్చి నిల్చున్నాడు ఎబినేజర్…

ఖాకీ నిక్కరు…

గళ్ల చొక్కా స్థానాన్ని పూర్తిగా రంగు వెలిసిన కాలర్ లేని ఓ బ్లూ టీషర్టు ఆక్రమించింది… అందులో ఎక్కడో వున్నాడు వాడు…

క్యాప్ పక్కకి తిప్పి ఉంది…

నన్ను చూసినవాడి ఒక కంటిలో ఆశ్చర్యం…

“ఏరా, ఏంపేర్రా నీ పేరూ?” శ్రీరాం…

“ఎబ్నెజర్”

వెరపూ, భక్తీ, మర్యాదా యీషణ్మాత్రం ధ్వనించలేదు వాడి స్వరంలో…

“ఊ, ఎబినేజర్, ఆత్మకూర్లో ఓటర్లిష్ట్‌లో మాదిగ నింబోడనుంది నీ పేరే కదరా?”

“ఔ నాదే”

“అక్కడో తెల్లకార్డూ, ఇక్కడో తెల్లకార్డూ వున్నయ్ గదరా నీకూ?”

“ఔ… దొరా, ఆత్మకూరు కార్డు నాకాడ లేద్దొరా… వాల్లే నా పేర్రాయిపించి నెలకి అయిన్నూరూపాలిచ్చిండ్రు దొరా గంతే దొరా”

“యా వియ్ నో హౌమెనీ ఆఫ్ దీస్ పీపుల్? థౌజండ్స్…?”

“ఒరే ఎబినేజరూ, నింబోడా, నిన్ను గెలికితే మొత్తానికి మొత్తం హంతే… మళ్లా ఆ బ్రాందీ షాపోని జోలికి పోయినావంటే…” తర్జని చూపించాడు శ్రీరాం… “దో… సార్ చెప్పినాడు కాబట్టి. చల్”

“లేద్దొరా, పొద్దుగాల్నే తాగిన… దానికి దుడ్లు గూడిచ్చిన, కానీ కొడ్కుకు నా పెండ్లం గావల్నంట దొర…

“తొస్సొన్నే దొరా, పొట్టి నా కొడ్కునె దొరా, పూకంటోన్నె దొరా, మాదిగ నా కొడ్కునె దొరా, లంజకొడ్కునె దొరా, పీనీల్లెత్తెటోన్నె దొరా,

“గానీ కొజ్జోన్నైతె గాదు గద దొరా?”

వికృతమైన నిశ్శబ్దం… eerie silence…

పొట్టిగా మరుగుజ్జులా కనబడుతోన్న అగ్నిపర్వతం…

ఎ… బి… నే… జ… ర్

* * *

తర్వాత దాదాపు ఓ నెల్రోజులు కనిపించలేదు ఎబినేజర్…

మళ్లీ ఈ మధ్యలో ఓ రోజు రైతు బజారుకెళ్లినప్పుడు కనిపించాడు. ఓ మూలకు గోనపట్టలేసుకుని, ఆకుకూరలు అల్లం కొతిమీర పెట్టుకుని…

“నేనెవచ్చామనుకుంట్యూంటి… ఇజ్రాయిలన్న ‘ఒగ నెల దినాలకి ఆదోనికి పోరా యిబ్బీ! ఆడ ఒగ మంచి తక్కువ వున్న్యాడ’నె. పొయ్యుంటి… ఇయన్నీ కొనుక్కున్నలే… నసుక్కె సెక్‌పోస్టు కాడ పెద్దాటోలల్ల వచ్చయి… ఆడికాడ అమ్కదెంగి ఎలబారిపోతరు… రూపాయి రెండెక్కువకీడమ్ముకుంటం… టోకన్దీసిన లే… ఏం గావాల… పుండ్యాకు బాంది సూడు ఎర్రది…”

పోలీస్ స్టేషన్ వ్యవహారం ఏమీ గుర్తు లేనట్టు అస్సలేం జరగనట్టు మాట్లాడ్తోన్నాడు ఎబిజేనర్…

అదే ఖాకీ నిక్కర్…

రంగు పూర్తిగా వెలిసిపోయిన కలర్లేని నీలం రంగు టీషర్ట్…

మాసి మైనం పట్టి పక్కకు తిప్పి పెట్టుకున్న నీలం క్యాప్‌తో…

పూకంటి… తొస్సి నోటి… పొట్టి…

ఆకు కూరలు అమ్మే యిబ్బిగాడు…

దొడ్డికాళ్లు మడుచుకోని…

ఎవడు వీడు?

పక్కనెవ్వరో పెద్దాయన పాలకూర ఒకటికీ అర్ధకూ బేరం చేస్తోన్నాడు…

“ల్యా… ల్యా… రాదు… నాకే వల్ల్యా… ల్యాలె సామీ నీతోనిగాదు వో…” అంటున్నాడు.

అయినా ఆ పెద్దాయన వదలడం లేదు. గీచి గీచి బేరమాడుతున్నాడు. ఆకు కూరలు చాలా తాజాగా నవనవలాడ్తోన్నాయి. యిబ్బిగాడు సడన్గా రెండో మూడో పాలకూరకట్టలు ఆ మనిషిపై విసిరికొట్టి… “పో… వో… వూకెనె కొండవో… అప్సట్సంది సెప్తాంటి… ఆఁ” అని గట్టిగా అరిచాడు.

ఒక్క క్షణం పాటు రైతుబజార్లో ఆ మూల నిశ్శబ్దమావరించింది…

ఆ పెద్ద మనిషి బిత్తరపోయి అక్కడ్నించీ గొణుక్కుంటూ కదిలిపోయాడు. ఎందుకు? ఎందుకు వీడికీ అసహనం? ఎవరి మీద?

ఆ పెద్దాయన మీద కాదు…

ఇంకెవరి మీదో… ఆ పూచిన కంటితో ఎక్కడో చూస్తో… దృష్టి దేని మీదో?

ఎవరికో ఎందరికో

వందలు

వేలు

లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ

అరుస్తూన్నట్టు అసహనంగా యిబ్బిగాడు…

ఎ… బి… నే… జ… ర్

* * *

(మిగిలిన కథ)

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, కథ and tagged , , , , , .

5 Comments

  1. కాసిభట్ల గారి ఈ కధ మన చుట్టురావున్న ,మనం చూస్తువున్న సమాజం లో మనం అసలు గుర్తించని మనుష్యల గురుంచి రాయడం అది కప్పిన ముసుగుని తీసేసి, ఎ ర్రటి ఎండలో నిలబెట్టడం లాంటింది.

  2. నేను ఇలాంటి సాహిత్యం ఎప్పుడు చదవలేదు. కశీభట్ల గారి interviews చదివి ఆయనమీద చాల అభిమానం పెరిగింది కానీ I was not prepared for this onslaught of pure, forceful literature. కథలోని ప్రతి అక్షరం నాగరికత మీద సవాల్ లాగ, ప్రతి పదం మన hypocrisy మీద తూటల లాగ అనిపించించాయి. Thank you Kinige.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.