cover

పదనిష్పాదన కళ (1)

Download PDF  ePub MOBI

(తెలుగులో పద సృష్టి గురించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన గ్రంథం “పదనిష్పాదన కళ” ఈరోజు నుంచి వారం వారం సీరియలైజ్ కాబోతోంది.)

|| ఓం శ్రీ సాయినాథాయ నమః ||

|| ఓం శ్రీ దుర్గాయై నమః ||

మున్నుడి

ప్రియమైన పాఠకదేవుళ్ళకి అభివాదాలు.

మిత్రులారా! చాలా సంవత్సరాల క్రితం – అంటే 2007 ప్రాంతంలో వీవెన్ గారూ, తదితర మిత్రులూ కలిసి ‘తెలుగుపదం’ అనే గూగుల్ గుంపు నెలకొల్పగా నేను కూడా అందులో ఒక ఆహూత సభ్యుడుగా చేఱాను. అప్పటివఱకూ తెలుగులో సమానార్థకాలు లేని ఆంగ్లపదాలకు వాటిని కల్పించడం ఆ గుంపు ఉద్దేశ్యం. ఈశ్వరానుగ్రహంచేత ఆ గుంపు ఇప్పటికీ దిగ్విజయంగా నడుస్తూనే ఉంది. నేను మాత్రం సుమారు ఐదున్నఱేళ్ళ పాటు అందులో అత్యంత క్రియాశీలంగా ఉండి తదుపరి అనివార్య కారణాల దృష్ట్యా విరమించుకున్నాను.

నేనా గుంపులో చేఱిన కొత్తల్లో నూతనాంధ్ర పదావిష్కారాల నిమిత్తం దృష్టిలో ఉంచుకోదగ్గ అంశాల గుఱించి కొన్ని వ్యాసాలు వ్రాసి ఆపేశాను. వాటిని చదివిన మఱో మిత్రులూ, తొలి తెలుగు బ్లాగరూ అయిన శ్రీమాన్ చావా కిరణ్ కుమార్ గారు, “అసలు కొత్త తెలుగుపదాల్ని రూపొందించే పద్ధతులూ, విధివిధానాల గుఱించి ప్రత్యేకంగా ఓ విపులగ్రంథాన్నే వెలువఱిస్తే బావుంటుం”దన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. వారిచ్చిన ప్రోత్సాహంతో 2010-11 ప్రాంతంలో ననుకుంటా, ఈ పుస్తకం వ్రాయడం మొదలుపెట్టాను. తీఱిక దొఱికినప్పుడల్లా వ్రాస్తూ, ఏం వ్రాయాలో తోచక అప్పుడప్పుడు మధ్యలో ఆపేస్తూ, అలా ఆపేసినందుకు వారినుండి సుతారమైన, సుతిమెత్తనైన హెచ్చఱికలందుకుంటూ, ఆ విధంగా పడుతూ లేస్తూ, ఎలానో మొత్తమ్మీద 2012 అక్టోబర్ నాటికి పూర్తయిందనిపించాను.

నిజానికి పూర్తి కాలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రస్తావన (topic). నేను స్పృశించకుండా విడిచిపుచ్చిన అంశాలు ఇంకా చాలానే ఉండి ఉంటాయి. మనకంటే పూర్వమే పలువుఱు నూతన పదనిష్పాదకులున్నారు. చేయితిరిగిన అనువాదకులూ ఉన్నారు. దిగ్దంతుల్లాంటి వైయాకరణ శిరోమణులూ, ఉద్దండులైన భాషాశాస్త్రవేత్తలూ కూడా ఉన్నారు. అలాగే వారు సంత రించిన హస్తభూషణాలూ ఉన్నాయి. సమస్యల్లా ఏంటంటే– ఎన్నున్నా, భాషని ఈ దృష్టితో- అంటే కొత్తపదాల నిష్పాదన దృష్టితో వీక్షిస్తూ, దాన్ని భాషాసాహిత్యవిద్యలో ఓ ప్రధానమైన ప్రత్యేకశాఖగా మన్నిస్తూ వ్రాసిన పుస్తకం ఒక్కటి కూడా నా కంట పడకపోవడం. ఆ రకంగా ఏ విధమైన ప్రాఙ్మార్గ దర్శనాలూ, దృష్టాంతాలూ (precedants) లేని దుర్గమమైన బాట లోకి నేనడుగుపెట్టాల్సి రావడం – కాదు కాదు, ఆ బాటని నేనే పునాదుల నుంచి పఱవాల్సి రావడం. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. దీనికసలు ‘తెలుగుపదం’ అన్న పేరే పెట్టాలని శ్రీ చావాగారి అభిలాష. కానీ ఉదాహరణకి 1983 నుంచి తెలుగుదేశం అన్న పదం ఈ నేలమీద వాడుకలోంచి ఎలా తొలగిపోయిందో గమనించాలి. ఆ విధంగా భాషలో ప్రతి పదమూ దేనికో ఒకదానికి శాశ్వత శీర్షికో, బ్రాండునేమో, ట్రేడుమార్కో అయిపోవడం ఇష్టం లేక నేనే దీనికి “పదనిష్పాదన కళ” అని పేరుపెట్టాను. ఈ పేరు ఎక్కువమందికి అర్థం కాదని ఆయన అన్నారు. నిజమే కావచ్చు.

ఈ పని నేను కాకుండా ఎవఱైనా మహాపండితులు చేపడితే, బహుశా దీనికి తగున్యాయం జఱిగుండేది. నా కించిద్ జ్ఞత మూలాన ఇందులో పెక్కు తభావతులు దొర్లి ఉండొచ్చు. విశేషజ్ఞులూ, సహృదయులూ అయిన పాఠకవరేణ్యుల సూచనల మేరకు వాటిని తదుపరి సంస్కరణల్లో అవశ్యం సరిదిద్దుకుంటానని హామీ ఇస్తున్నాను. దయతో ఈ కృతిని పరిశీలించి ఆశీ ర్వదించాలని వారిని ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదివినవారు ఇందులోని మార్గదర్శకాల ననుసరించి కనీసం ఒక వెయ్యి ఆంగ్లపదాలకైనా సునిశితమైన సమానార్థకాల్ని కల్పించి వాటిని జనసామాన్యపు వాడుకలోకి తీసుకొస్తే నా కృషి సార్థకమని భావిస్తాను. భవిష్యత్తులో ఈ అంశం మీద ఇంత కంటే మెఱుగైన పుస్తకాలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను.

హైదరాబాదు

శ్రీవిజయ-మార్గశిరం

మకర సంక్రమణం, 2014.

 ఇట్లు

భవదీయుడు, బుధజన విధేయుడు

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

పదనిష్పాదన కళ

గ్రంథ విషయ పట్టిక

మొదటి అధ్యాయం

మనం కూడా మన మాతృభాషలో కొత్తపదాల్ని నిష్పాదించవచ్చు!

ఈనాడు వివిధ భాషలలో ఉన్న పదాలు ఎక్కణ్ణుంచి వచ్చాయో ఎవఱికీ తెలీదు. వేదసంస్కృతంలో వాడబడిన పదజాలంలో కనీసం ఒక వెయ్యింటి అర్థం నేటికీ గమ్యమానం కావడం లేదంటున్నారు పరిశోధకులు. కొన్ని భాషలు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ వాటిల్లోని పదాలన్నీ ఒకేలా (cognates) లేవు. ఉదా హరణకు తెలుగులో నీరు అనీ, తమిళంలో తన్నీర్ అనీ చెప్పబడేదాన్ని మలయాళంలో వెళ్ళమ్ అంటారు. తఱచి చూస్తే ఇది వెల్లువ అనే తెలుగు పదానికి దగ్గఱగా ఉందనిపిస్తుంది. అయితే మిహతా దక్షిణాది భాషలవారంతా నీరు యొక్క రూపాంతరాల్ని వాడుతున్నప్పుడు ఒక్క మలయాళీలకే వెళ్ళమ్ అనాలని ఎందుకు బుద్ధి పుట్టిందనే ప్రశ్నకు మనం సంతృప్తికరమైన సమాధానాన్ని పట్టుకోలేం.

శబ్దార్థాలు (ఒక పదమూ, దాని అర్థమూ) పరస్పరం అవిభాజ్యం (inseparable) అనీ, అనాది అనీ భారతీయ శాబ్దికుల విశ్వాసం. మానవజాతుల్లాగే ఎన్నో భాషలు వాటితో పాటు పుట్టడమూ, కాలక్రమంలో గిట్టడమూ కూడా జఱిగిందని చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. అటువంటప్పుడు శబ్దమైనా, దాని అర్థమైనా అనాది ఎలా అవుతాయి ? అని ఒక సందేహం. అలాగే, ఒకే పదానికి విభిన్నభాషలలో విభిన్న అర్థాలుంటాయి. తెలుగులో అత్యంత సాధారణంగా ధ్వనించే ఒక పదం ఇతరులకు అశ్లీలం కావచ్చు. తెలుగు తెలియనప్పుడు ఎంత అప్యాయంగా ఆహ్వానించినా “రండి” అంటే ‘వేశ్య’ అని ధ్వనించి ఉత్తరాదివారు ముఖాలు మాడ్చుకుంటారు. అలాగే మనకు బూతైనది ఇతరుల చెవులకు అత్యంత సాధారణంగా ధ్వనించవచ్చు. తెలుగులో పాలు అంటే స్తన్యం. Finnish లో అదే మాటకి గడ (చెక్క/లోహపు స్తంభం) అని అర్థమట. అందాకా అవసరం లేదు. మన భాషలోనే కొన్ని పదాలకి నానార్థాలుండడాన్ని గమనిస్తున్నాం. అలాగే ఒకే భాషాపదం ఒక ప్రాంతపు మాండలికంలో సభ్యమై, ఇంకో మాండలికంలో అసభ్యార్థాన్ని కలిగి ఉండడం కూడా కద్దు. ఉదాహరణకి – రాయలసీమలో ‘బుడ్డలు’ అంటే వేఱుసెనగపప్పులు. మిగతా ప్రాంతాలలో అది ఒక చికిత్సాపేక్షమైన రుగ్మతగా అర్థం చేసుకోబడుతున్నది. అటువంటప్పుడు శబ్దార్థాలు ఏ విధంగా అవిభాజ్యమవుతాయనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. అయితే భారతీయ శాబ్దికులు పూర్తిగా పొఱపడలేదేమో ననిపిస్తుంది, ఇటీవలి అభిప్రాయాల దృష్ట్యా! మానవజాతి అనేకభాషల్ని మాట్లాడుతున్నప్పటికీ, ఆయా భాషాపదాలలోనూ, నిర్మాణంలోనూ అంతస్సూత్రంగా ఒక ఉమ్మడి అంతర్జాతీయసరళి (common pattern) ఉందంటున్నారు పరిశోధకులు. ఆ ధ్వనుల సరళే మన అందఱికీ ఆయా భావాల్ని స్ఫురింపజేస్తోందట. ఉదాహరణకు – కొన్నికొన్ని రకాల భావాల్ని వ్యక్తీకరించే పదాలన్నీ – అవి ఏ భాషకు చెందినవైనప్పటికీ – ఒకే విధ మైన అక్షరాలతో నిర్మాణమవుతాయంటున్నారు. పదాలకు భావస్ఫోరకత (భావాల్ని స్పురింపజేసే లక్షణం) ఉండడానికి కారణం మనం వాటికి చిరకాలంగా అలవాటు పడడమేనని మనం అనుకుంటున్నది పూర్తిగా నిజం కాకపోవచ్చు.

అంటే దీనర్థం – మనం పదాల్ని ఏ విధమైన శబ్దవ్యాకరణ శిక్షణా, నేపథ్యమూ లేకుండా, ఆ పదాలకి సైతం ఏ విధమైన పూర్వరంగమూ లేకుండా ఊరికే అప్పటికప్పుడు ఆశువుగా గాలిలోంచి సృష్టించినా వాటి నిర్మాణంలోనూ, అర్థస్ఫోర కతలోనూ మనకి తెలియని అదృశ్య సూత్రమేదో పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవఱికి వారు కొత్త పదాల్ని కనిపెట్టడంలో ప్రాథమికంగా తప్పులేదు. ఎందుకంటే, బట్టలు కట్టుకోవడం కూడా తెలియని ఆదిమకాలం నుంచి మానవుడికి భాష తెలుసు, అఱుపుల రూపంలోనో, కేకల రూపంలోనో! ఆనాటికే అతడు దాన్ని కల్పించుకున్నాడు. ఆనాటివారు గుంపులుగా జీవించే వారు కనుక గుంపులుగానే భాషనీ సృష్టించి ఉంటారు. బహుశా ఒకఱన్నదాన్ని ఇంకొకఱు అందిపుచ్చుకుని పలికేవారు. అలా మనిషిని మనిషి అనుకరించేవాడు. పదాన్ని పదం అనుకరించేది. (ఒక పదనిర్మాణాన్ని ఆసరాగా చేసుకొని దాన్ని పోల్తూ ఇంకో పదం పుట్టుకొచ్చేది) భాషాభ్యససన సామర్థ్యం పెద్దల్లో కంటే పిన్నల్లో మెండు. అలాగే నాగరికదశలో కంటే అనాగరికదశలోనే నూతనపద నిష్పాదన కూడా సులభం కావచ్చు,

కొత్త పదాల్ని ఎందుకు నిష్పాదించాలి ?

కాబట్టి పదనిష్పాదన సామర్థ్యం అనాదిగా యావన్మానవజాతి ప్రతిభాపాటవాలలోనూ అంతర్నిహితం (in-built), ప్రజనన పాటవం (reproductive capability) లానే! సాధారణమైన స్వాభావిక పరిస్థితుల్లో దాన్ని ఎవఱూ ఇంకొకఱికి పని గట్టుకొని నేర్పే పనిలేదు. అలాగే ఒక జాతి నుంచి ఇంకో జాతి పదాల్ని అరువు దెచ్చుకునే అవసరం కూడా ఏమీ లేదు. అలా అరువు దెచ్చుకున్నందువల్ల ఒనగూడే పక్కా ప్రయోజనం కూడా ఏమీ లేదు. ఎందుకంటే పదాలు వాటికవి ఐకాంతిక సృష్టి (stand-alone creation) కావు. అవి మన స్ఫురణల (ideas) కూ, అభిదర్శనానికీ (perception) ప్రతిబింబాలు. స్ఫురణలు (ideas) కలగడానికి కారణం – చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఉన్న ఆసక్తి, సృజనశక్తి (creativity), స్పందన శీలత (responsiveness), పరిశీలన. ఒక భాషలో పదాలు తగినన్ని లేవంటే దానర్థం, దాన్ని మాట్లాడే జాతిలో ఈ నాలుగు లక్షణాలూ తగినంతగా లేవని! మనలో ఈ లక్షణాలు లోపించినప్పుడు మనం ఎన్ని పదాల్ని అడపాదడపా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నా అవి మన చిరకాల శబ్దదారిద్ర్యచరిత్రనే ప్రతిఫలిస్తాయి తప్ప మన భాషను సుసంపన్నం చేయ జాలవు. పైపెచ్చు అవి మన భాష యొక్క సజాతీయతనీ, సహజత్వాన్నీ సంస్కరణదుర్లభంగా కలుషితం కావిస్తాయి. కాబట్టి మనం నిజంగా అలవఱచుకోవలసినవి ఈ లక్షణాలనే గానీ విదేశీ పదాల్ని కాదు.

“ఆంగ్లంలోకి అనేక విదేశీ పదాలు వచ్చిచేఱినప్పుడు తెలుగులో ఎందుకు ఉండకూడదు ?” అనే ప్రశ్న వేస్తారు కొంతమంది. ఆంగ్లానికీ, ఆంధ్రానికీ చాలా తేడా ఉంది. ఆంగ్లం పరిపాలకుల భాష. ఆంధ్రం పరిపాలితుల భాష. ఆంగ్లంలోని విదేశీపదాలు వారు పరిపాలించిన దేశాల నుంచి సంగ్రహించినవి. అవి వారి బహుదేశ పర్యాటకత్వానికి సూచకం. ఆ పదాలతో వారు తమ దేశిపదాల్ని నాశనం చేయలేదు. వారికి నిజంగా అవసరమై తమ భాషలో లేని పరిభావనల (concepts) నీ, వస్తు వర్ణనల్నీ పాలితుల నుంచి సేకరించారు. అది చాలా సహజమైన పరిణామం.

తెలుగుగడ్డ మీద విదేశీ పదాల వెల్లువ సహజ పరిణామమేనా ?

మన విదేశీ పదసంపాదనేమో చాలా కృత్రిమం. ఇది వ్యామోహపూరితమైనటువంటిది. రాజకీయాధికార ప్రాబల్యంతో దేశం మీద విధించినటువంటిది. ఈ సంగతి గ్రహించలేక దీని వెనుక చాలా అపార్థాలూ, భయాలూ, మూఢవిశ్వాసాలూ, లోకజ్ఞాన లేమీ చెలామణిలోకి వచ్చాయి. ఇది మన గతకాల బానిసత్వానికి, దాన్నుంచి మార్పునొల్లని వర్తమాన జడత్వానికీ సూచకం. మనం మన ఆంగ్లపద పరిజ్ఞానంతో దేశి పదజాలాన్ని నిష్కారణంగా ధ్వంసించుకుంటున్నాం. “మీకు ఇంగ్లీషు వచ్చా ?” అని ఎవఱూ మన చొక్కా పట్టుకుని నిలదీయకపోయినా, నిలదీసినట్లే భావించి అవతలివాళ్ళ ముందు అసందర్భంగా ఆంగ్ల వావ దూకతా ప్రదర్శన కావించడం మనకొక తరతరాల దురభ్యాసంగా పరిణమించింది. మన భాషలో నిక్షేపంగా మంచినీళ్ళు అనే వాడుక పదం ఉండగా వాటర్ అనేవాళ్ళు పెద్దసంఖ్యలో తయారయ్యారు. ఫలానా ఆమె “నా భార్య/ మా ఆవిడ” అని చెప్పుకోవడానికి సిగ్గుపడి “మా మిసెస్” అని చెప్పుకునేవారే అంతా! ఈ రకంగా మనం తెలుగులో మిశ్రం చేసి వాడే ఆంగ్ల పదజాలంలో ముప్పాతిక మువ్వీసం అనవసరమైనది. అది వృథా విదేశీ పాండిత్యప్రదర్శనే తప్ప దానివల్ల ఈ జాతికీ, భాషకీ నిజంగా ఉపయోగం లేదు. తమ భాషలో ఎన్ని విదేశీ శబ్దాలున్నప్పటికీ ఈ నిరుపయోగమైన పనిని ఇంగ్లీషు వారెన్నడూ చేయలేదు. విదేశీ పదాల మూలాన మౌలిక ఆంగ్లభాషాస్వరూపం ప్రమాదంలో పడలేదు. కానీ తెలుగు పరిస్థితి అలా లేదు. అందుచేత ఇతర విధాలైన పోలికలు లేనప్పుడు ఆంగ్లాన్ని చూసి మనం ధీమాగా వాతలు పెట్టుకోలేం.

విదేశీ పదాలు మన భాషానిర్మాణశైలిలో ఇమడవు. తెలుగు పదాల మధ్య అవి సజాతీయంగా ధ్వనించవు. కోకిలల మధ్య కాకుల్లాగానే ఉంటాయి. వాటిని అనువదించగలమే తప్ప స్వదేశభాషా పరిజ్ఞానంతో విడమర్చి వివరించడం అసాధ్యం. అవి ప్రపంచం పట్ల విదేశీయులకున్న తరతరాల దృక్కోణానికి ప్రతిబింబాలు. అవి వారి సృజనాత్మక శక్తికి సాక్ష్యాలు. అవి ఖచ్చి తంగా మన దృక్కోణం కావు. వారి దృక్కోణం వెనుక ఉన్నవి వారి చరిత్రా, వారి సంస్కృతీ! మన దృక్కోణం వెనుక మన చరిత్రా, మన సంస్కృతీ ఉండాలి. అలా ఉండాలంటే మన పదాలు తప్పని సరిగా మనవే అయ్యుండాలి. మనం మాట్లాడే భాష మన జాతి యొక్క సమష్టి సృజనాత్మక శక్తికి దర్పణం కావాలి.

ఆంగ్ల పదజాలపు వెల్లువ చేసిన/ చేస్తూ ఉన్న నష్టం

పదాల్ని ఏ పదానికి ఆ పదం వేఱువేఱుగా దిగుమతి చేసుకోదగ్గ ఐకాంతిక స్వమూర్తులు (stand-alone entities) గా చూడడం పొఱపాటు. నిజంగా అవి ఐకాంతిక స్వమూర్తులే అయితే నిరభ్యంతరంగా కావాల్సినన్ని విదేశీ పదాల్ని దిగుమతి చేసుకోవచ్చు, బస్సు, రైలు, సైకిలు మాదిరి! కానీ ఎక్కువ సందర్భాల్లో ప్రతి పదానికీ ఒక ధాతువు (మూలపదం), ఒక ఉపసర్గ, ప్రత్యయం, దాన్నుంచి నిష్పన్నమైన పదాలూ మొదలైన విస్తార “పద కుటుంబం” ఒకటుంటుంది. దాన్ని తరతరాల వ్యాకరణ సంప్రదాయాల ఆధారంగా నిర్మిస్తారు. విదేశీపదనిర్మాణాలు వారి వ్యాకరణ సంప్రదాయాల ననుసరించి ఉంటాయి. వారికి అవి తెలుసు కనుక అంతకు ముందునుంచి తమ భాషలో ఉన్న పదాల నుంచి సరికొత్త పదాలూ (derivatives), ఆ కొత్తపదాల నుంచి ఇంకా కొత్తపదాలూ- అలా అనంతంగా పదకల్పన చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అంటే వాళ్ళు తమ భాషలో తదుపరి నిష్పాదన (Further coinage) కూడా చెయ్యగలరు, అది వాళ్ళ భాష కనుక! ఇంగ్లీషులో ఉన్న పదాలు అచ్చమైన ఇంగ్లీషు పదాలే అయితే మనం ఇంగ్లీషు ఒక్కటి నేర్చుకుంటే సరిపోతుంది. కానీ దురదృష్టవశాత్తు అలా లేదు. అ భాషలో 70 శాతం లాటిన్, గ్రీకు పదాలు. ముఖ్యంగా శాస్త్ర-సాంకేతిక పరిభావనల (scientific and technological concepts) కి సంబంధించి 90 శాతం అవే.

మనం ఇంగ్లీషులోని సాంకేతిక పదాల్ని దిగుమతి చేసుకోగలమే తప్ప ఆ పదాల్ని వారిలా వికరించి (modify చేసి) తదుపరి నిష్పాదన (Further coinage) చెయ్యగలమా ? అని ఆలోచించాలి. మనం చెయ్యలేమనేది సుస్పష్టం. మనలో అత్యంత మేధావులూ, విద్యావంతులూ అయినవారు కూడా చెయ్యజాలరు. మనకి ఆంగ్లవ్యాకరణం ఒక్కటే వచ్చు. గ్రీక్, లాటిన్ వ్యాక రణాలు రావు. అవి ఇంగ్లీషు మేదావులకే వచ్చు. శాస్త్ర, సాంకేతిక, వైద్యశాస్త్ర పరిభాషలన్నీ గ్రీక్, లాటిన్‌లతో నిండిపోయి ఉన్నాయి. ఆ శాస్త్రాల్లో మనం పరిశోధనకి దిగితే అక్కడ మనం కనుగొనబోయే కొత్త విషయాలకి పేరుపెట్టడం కోసం, తదుపరి నిష్పాదన కోసం తెల్లవారి మొహాల వైపు చకోరపక్షుల్లా చూడడం తప్ప మనమేమీ చెయ్యలేం. కనుక ఆ భాషాపదాల మీద అంతగా ఆధారపడినప్పుడు అది మనకి ఒక అంగ వైకల్యంగా, పరాశ్రయతగా పరిణమిస్తుంది. ఆ విదేశీ పదాల్ని దాటి మన పరిభావనలు (concepts) ఎదిగినప్పుడు ఆ విదేశీభాషలో ఆ భావనలకి వ్యక్తీకరణలు (Expressions) లభించకా, ఆ వ్యక్తీకరణలు చెయ్యడానికి మనకి స్వేచ్ఛ లేకా, గ్రీక్, లాటిన్ వ్యాకరణసంప్రదాయాల పరిజ్ఞానలోపం వల్ల అది సాధ్యపడకా మన మెదళ్ళు స్తంభిస్తాయి. ఇక్కడ సృజనాత్మకత ఇంగ్లీషువారి చేతిలో బందీగా మారిపోతుందనీ, అది వారి పదాలతో పాటు మనదాకా ప్రవహించదనీ గ్రహించాలి.

దీనికి పరిష్కారం ఏంటి ? మన ఆంగ్లమాధ్యమ పాఠశాలల్లో ఇహముందు ప్రతివారికీ ఇంగ్లీషుతో పాటు గ్రీకూ, ల్యాటిన్ కూడా నేర్పించడం మొదలుపెడదామా ? అది హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఎవఱో కొందఱు మేధావులు తప్ప అచ్చ మైన ఇంగ్లీషువారే వాటినిప్పుడు నేర్చుకోవడంలేదు. పాపం, ఎన్నని నేర్చుకుంటారు పిల్లలు బళ్ళల్లో ? భాష నుంచి భౌతిక శాస్త్రం దాకా, లైంగిక విద్య నుంచి యోగా దాకా వారి మెదళ్ళని చితక్కొడుతున్నా రిప్పటికే!

దీనికి అసలైన పరిష్కారం ఉన్నది – మనం ఇంకా ఇంకా విదేశీ పదాల ఱొంపిలోనో, ఱొచ్చులోనో పీకల దాకా దిగబడ్డంలో కాదు. మన వ్యాకరణ సంప్రదాయాల్ని మనం కూలంకషంగా నేర్చుకోవడంలో! మఱుగున పడ్డ దేశీపదాల్ని నూతన జవ సత్త్వాలతో పునరుద్ధరించడంలో! మన దేశీ పదనిర్మాణాల్ని సక్రమంగా అవగాహన చేసుకొని కొత్తపదాల కల్పనకి ఆ సూత్రా ల్ని వినియోగించుకోవడంలో! అప్పుడు, ఆంగ్లేయులకు తమ భాషలో తదుపరి నిష్పాదన (Further coinage) ఎలా సాధ్యమవుతున్నదో మనవారికీ మన భాషలో అది అలా సాధ్యమవుతుంది.

కానీ మనమేం చేస్తున్నాం ? మనం ఇదేదీ చెయ్యకుండా భాషాపరంగా ఒక సోమరిమార్గాన్ని ఎంచుకున్నాం. అదేంటంటే పదాల్ని ఇంగ్లీషు నుంచి అనంతంగా, యథాతథంగా దించుకోవడం, దించుకోవడం, దించుకోవడం… ఈ దించుకోవడానికి అంతులేదు. ఎందుకంటే మన భావదారిద్ర్యానికి అంతులేదు. దీనివల్ల మన మేధారోగ్యానికి జఱిగిన నష్టం గుఱించి ఎక్కువ మందికి అవగాహన లేదు. మనకి పదాలతో పాటు భావాలు కూడా పుట్టడం మానే శాయి. దానిక్కూడా ఆంగ్లేయుల మొహాల కేసి చూస్తున్నాం. ఏ పరిశోధనైనా వారే చెయ్యాలి. వారే అన్నింటికీ పేర్లు పెట్టాలి. ఆ పేర్లనుంచి ఉద్భవించే కొత్త భావాల క్కూడా వారే పేర్లు పెట్టాలి. మనం పేర్లు పెడితే అది సరైన ఇంగ్లీషు కాదు. మన ఆంగ్ల పదకల్పనలు హాస్యాస్పదం. యు.ఎస్. లోనూ, ఇంగ్లండులోనూ, ఆస్ట్రేలియాలోనూ దేనికి ఏమంటారో, ఎలా పలుకుతారో తెలుసుకుని మనమూ అదే చేయాలి. ఇదీ మన పరిస్థితి.

అంతిమ పిండితార్థం- మన భాషలతో పదాల్లో గానీ, వ్యాకరణంలో గానీ వాక్య నిర్మాణాల్లో గానీ, వాడుకలో గానీ, ఏ విధ మైన పోలికా లేని భాషల నుంచి పదాల్ని అదే పనిగా అప్పుతెచ్చుకోవడం వల్ల మనలో భాషాపరంగానే కాక భావపరంగా కూడా స్వకీయతా, సృజనాత్మక శక్తీ నశించిపోతాయి. అంతిమంగా మన భాషే నశిస్తుంది. ఎందుకంటే ఆ భాషవారు మనకి నేర్పినదాన్ని మించి ఆ భాషలో మనం ముందుకు వెళ్లలేం. మన అభిదర్శనం (perception) ఆ భాషాపదాల చేత అలా పరిమితం కావించబడుతుంది. ఏ భాషనైతే ఎంతకాలం పాటు అభ్యసించినా దాని ప్రయోగం మీదా, Further coinage మీదా మనకి అధికారం ఇవ్వబడదో అటువంటి భాషని పదాల కోసం దేవురించడం కేవలం వృథాప్రయాస.

తెలుగు పదజాలానికి మాధ్యమాలు చేస్తున్నది ఉపకారమా ? అపకారమా ?

తెలుగు మాధ్యమాలు మన వాడుకలకున్న అందాన్నీ, అర్థాన్నీ కూడా ఎలా పనిగట్టుకొని చెడగొడుతున్నాయో స్పష్టంగా తెలియజేసే ఉదాహరణ- ఈమధ్య మనం తఱచుగా చూస్తున్న “న భూతో నభవిష్యత్” . దీని అసలు రూపం- అనగా ఇటీవలి దాకా తమ రచనల్లో రచయితలంతా వాడిన రూపం “న భూతో న భవిష్యతి” అంటే – “జఱగలేదు, జఱగబోదు” అని అర్థం. ఇప్పుడు మాధ్యమాలు వాడుతున్నది “…న భవిష్యత్” – అంటే భవిష్యత్తే లేదు. (No future at all) అని! ఎందుకిలా చేస్తున్నారు ? అంటే కాలమ్ కక్కుర్తి. (కానీ చూడబోతే ఈ వాడుక విషయంలో పొదుపయ్యేదేమీ లేదు) అలాగే స్తనశల్యపరీక్షని వట్టి శల్యపరీక్షగా క్లుప్తీకరించారు. అదే విధంగా సభంగశ్లేషల్ని (puns) లక్షించి ‘తిరుగుబాటు, లొంగు బాటు’ మొదలైన పదాల్ని తిరుగుబాట, లొంగుబాట అని మార్చేస్తున్నారు. మాటిమాటికీ అలాగే వాడడం మూలాన, అవ్యుత్ప న్నులైన సాధారణపాఠకులు అవే ప్రామాణిక వ్యాకరణరూపాలేమోనని భ్రమించే పరిస్థితి ఉప్పతిల్లింది. ‘సమాధానపత్రాలు’ అనే పదంలో ఒక అక్షరం తగ్గితే పంక్తిబారు జాగా (column space) కలిసొస్తుందని ‘జవాబుపత్రా’ లనే ఉర్దూ-సంస్కృత మిశ్రమంలోకి దిగారు.

అంతేకాక ముచ్చటైన తెలుగు పదాన్నింటినీ పక్కన బెట్టి, పెద్దపెద్ద అక్షరాల్లో “టూర్ లో సీయం, గ్రాంటు కి కేబినెట్ నో, రైల్వే సమస్యలకు ఎస్సెమ్మెస్‌తో చెక్” అంటూ తెలుగులిపిలో సర్వం ఆంగ్లమయం చేస్తున్నారు. అదేమని అడిగితే “మార్పు సహజం” అని బుకాయిస్తున్నారు, ఆ వాడుకలు తమ ప్రమేయమేమీ లేకుండానే వాటంతటవే అచ్చుసిరా పూసుకుని పత్రిక ల్లోకి వచ్చి కూర్చున్నట్లు! తెలుగుదినపత్రికలలో ఒక్కొక్కదానికీ ఒక్కో విధమైన రాజకీయపట్టింపులూ, కార్యావళీ ఉన్నాయి. ఒకఱంటే ఒకఱికి ససేమిరా సరిపడనంత ఆగర్భ శత్రుత్వాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఒక పత్రిక ఒక ముచ్చటైన తెలుగు వాడుక చేస్తే వారిమీది ద్వేషం కొద్దీ రెండోవారు ఉద్దేశపూర్వకంగా దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ పదానికి గల ఆంగ్లసమార్థకాన్నే తమ పత్రికలో కొనసాగిస్తున్నారు. ఈ విధంగా రచనారంగంలో ఉన్నవారికి సైతం భాషాభివృద్ధి కంటే భాషేతర రాజకీయాలే ప్రధానమై కూర్చోవడం శోచనీయం. మఱి వారినుంచి మనం భాషాపరంగా ఎలాంటి మార్గదర్శకత్వమైనా ఆశించగలమా ? ఒకప్పుడు ఆశించగలిగేవారమేమో, తెలుగుమాధ్యమంలో చదివి కాకలుతీఱి వచ్చిన మహామహులు ఆ రంగంలో పరిఢవిల్లిన రోజుల్లో! ఇప్పుడో ? సాధ్యం కాదు.

ఏదేమైనా తెలుగును అభివృద్ధి చేయాలంటే తెలుగుమాధ్యమాల భాషని గ్రుడ్డిగా అనుసరించడమూ, దాన్ని ప్రామాణికంగా తీసుకోవడమూ అపేక్షణీయం కాదేమో! వాటి భాషలో జాతీయతా, సృజనాత్మకతా లోపిస్తున్నాయని గుర్తెఱగాలి. ఆంగ్ల పత్రికలలో దర్శనమిచ్చే భాష స్థాయితో దాన్ని ఎంతమాత్రమూ పోల్చడానికి లేదు. కారణం– మనవారు పాత్రికేయత (journalism) లోనే తప్ప తెలుగుభాషలో సుశిక్షితులు కారు. వారసలు తెలుగు పుస్తకాలు చదువుతున్నారా ? అనేదే అను మానాస్పదం. అదే, ఆంగ్లమాధ్యమాల్లో పనిచేసేవారు ఆ భాషలో సుశిక్షితులనీ, మంచి ప్రామాణిక పరిజ్ఞానం గలవారనీ గమ నించాలి.

కొత్త తెలుగు పదాల్ని ఎవఱు నిష్పాదించాలి ?

అనువాదాలకి అవసరమైన సరికొత్త తెలుగు పదజాలాన్ని నిష్పాదించే పని తెలుగు, ఇంగ్లీషు భాషల్ని శ్రద్ధగా అభ్యసించిన సుశిక్షితమైన విద్యావంతవర్గానిదే. ఇతరులు ఈ పనికి సాధారణంగా పూనుకోకూడదు. వారా అభిజ్ఞుల్ని ఆమోదించి, అను సరిస్తే సరిపోతుంది. ఎందుకంటే, ఒక విద్య నభ్యసించినవారికే దాని మీద అభిమానం ఉంటుంది. వారే దానికి అంకితం కాగలరు. వారే ఆ విద్యకి న్యాయం చేయగలరు. ఆ భాషకి మేలు చేయగలరు. వారికే దాని తలా తోకా తెలుస్తుంది. భాషా సంబంధ వృత్తుల్లో ఉన్నప్పటికీ భాషల్ని ప్రత్యేకంగా అభ్యసించడం కోసం తమ జీవితంలో కొంతకాలమైనా ఖర్చుచేయని వారికి వాటిమీద విశేషమైన అభిమానం కలగడం కష్టం. పదాల్ని నిష్పాదించాలంటే హృదయంలో అగాధమైన, అమాయక మైన, నిస్వార్థమైన పదప్రేమ కావాలి. పదోత్సాహం కావాలి. కాస్తో కూస్తో లోతైన పరిజ్ఞానం కావాలి. అన్నింటినీ మించి సృజ నాత్మకత కావాలి. ఒక కొత్తపదాన్ని నేర్చుకున్నప్పుడూ, కల్పించినప్పుడూ, దాన్ని ప్రయోగించినప్పుడూ ఒక వందరూపాయలు సంపాదించుకున్నంతగా మనస్సు బ్రహ్మానంద తరంగితం కావాలి. తనువు పులకాంకితం కావాలి. భాష పట్ల ఆ విధంగా దృఢమైన అంకితభావం గలవారు కావాలి. గ్రుడ్డినియమాలూ, వెఱ్ఱిమొఱ్ఱి పక్షపాతాలూ, శాస్త్రాంతర/ విషయాంతర ఆభి ముఖ్యమూ పనికిరావు.

జనాద్యతావాదం

ఈ సందర్భంగా కొందఱు ఒక తరహా ‘జన-ఆద్యతావాదాన్ని’ లేవదీయడం గోచరిస్తుంది. భాష ప్రజలకు చెందినదనీ, ప్రజలే దానికి ఆద్యులనీ, సృష్టికర్తలనీ, కాబట్టి వారే అంతిమ నిర్ణేతలనీ, వారు ఏది వాడితే అదే ప్రమాణమనీ, “వాడుకలో ఉన్న పదాల్ని ఏ పండితులు సృష్టించారు ?” అని ప్రశ్నిస్తూ వాదించేవారున్నారు. ‘ప్రజలు’ అనేదొక సామూహిక నామవాచకం (collective noun). అదొక ఏకాండీ స్వరూపం (monolithic entity) కాదు. అదొక నామరూపరహిత స్వమూర్తి (faceless entity). అందులో అందఱం ఉన్నాం. రకరకాలవాళ్ళున్నారు. అనేక తరాలవాళ్ళున్నారు. వాళ్ళల్లో పండితులు కూడా ఉన్నారు. కనుక పండితుడు కూడా ప్రజే. ఆ ప్రజల్లో తెలియని ప్రజ కంటే తెలిసిన ప్రజ ఎక్కువ వరణీయం. రోగం వచ్చినప్పుడు అందఱూ స్పెషలిస్టుల దగ్గఱికే పరిగెడుతున్నారు తప్ప, “అన్ని వైద్యాలకూ పసరువైద్యమే మూలం” అని కోయ వాళ్ళ దగ్గఱికి పోవడం లేదేం? రోగం ఏంటో వైద్యుణ్ణే అడిగి తెలుసుకుంటున్నారు తప్ప దానిగుఱించి పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఊరివాళ్ళకి వోటింగ్ పెట్టడం లేదేం? భాష విషయానికొస్తేనే జనాద్యతావాదమా? సరే, ఆ వాదాన్ని కాసేపు మాటవరసకి అంగీకరిద్దాం. మఱి ఆనాడు తెలుగు తప్ప వేఱే భాష లేదీ గడ్డమీద. వ్రాతకోతలు తెలియవు. అన్నీ మనసులోనే ధారణ చేసుకొని తరువాతి తరానికి అందించేవారు. మఱి అలా మారుద్దామా ఇప్పటి విద్యావ్యవస్థని కూడా?

కాబట్టి వైద్యానికే కాదు, ఈరోజుల్లో భాషక్కూడా సుశిక్షితులైన విశేషజ్ఞులు (specialists) కావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో భాష కూడా ఒక పురోగతశాస్త్రమే (advanced science). ఆ శాస్త్రం తెలిసినవారే దాని మీద సాధికారంగా మాట్లాడడానికీ, దానిలో కాలోచితమైన మార్పులు చేయడానికీ, దాని మీద ఇతరులకు సలహాలివ్వడానికీ అర్హులు. మిగతా వారు కారు. అందఱూ భాషే మాట్లాడుతున్నంత మాత్రాన అది అందఱి స్వామ్యమూ అయిపోదు, పులిని చూసినవాడల్లా వేటగాడు కానట్లే! అందఱికీ రక్షణ అవసరమే గానీ అందుకోసం అందఱి చేతుల్లోనూ తుపాకులు పెట్టలేం. దానికి భటశాఖ (police department) ఉంది. సాఫ్టువేర్లు వాడుకునేవారంతా ఆ శాస్త్రం చదివినవారు కారు. వాహనచోదకులంతా ఆటోమొబైల్ ఎంజినీరింగ్‌లో పట్టభద్రులూ కారు. వారు తమకేం కావాలో తెలిసినవారు మాత్రమే. దాని కోసం ఏం చేయాలో తెలిసినవారు కారు. అలాగే, భాష అంటే అభిమానం ఉండడమూ, దానికి ఏదైనా చేయగలగడమూ ఒకటి కావు. మొదటి దానికి మనసు చాలు. రెండోదానికి శిక్షణ కావాలి.

ఇది కూడా ఆదిమకాలమైతే బావుండేది, అన్నీ ప్రజల చేతుల్లో పెట్టి మనం ఇంట్లో పడుకొని సుఖంగా నిద్రపోయేవారం! మానవజాతి శైశవదశలో ప్రాకృతికంగా ఎదిగినప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు యథాతథంగా అనుకరించలేం, అనుసృజించలేం. ఆనాటి భాషావసరాలూ, ఈనాటి భాషావసరాలూ అచ్చుమచ్చుగా ఒకటి కావు. ఆనాటి అవసరాలు తీర్చడానికి మామూలు ప్రజలు సరిపోయారు. ఇప్పుడు నిపుణులు కావాల్సిందే. ఎంత ప్రజాస్వామ్యమైతే మాత్రం ప్రజలు ఎన్నింటి గుఱించి ఆలో చించగలరు ? రోజువారీ బతుకుబండి గుఱించా ? పర్యావరణం గుఱించా ? అవినీతి గుఱించా ? ఎవఱి గొడవలు వాళ్ళవి.

ఎవఱి తిప్పలు వాళ్ళవి. మఱోపక్క నాగరికత చాలా ముందుకొచ్చేసింది. సమాజం చాలా వివిధీభవించింది. విశేషజ్ఞతలు (specializations) ముదిరాయి. ఒకఱి జీవనరంగం ఇంకొకఱికి అర్థం కాదు. అందఱినీ భాష గుఱించి ఆలోచించమని కోరలేం. ఎవఱు ఏది ఆలోచించాలో వాళ్ళే అది తప్పనిసరిగా ఆలోచించాలి.

 (తరువాయి భాగం వచ్చేవారం)

Download PDF  ePub MOBI

 

Posted in 2014, ఏప్రిల్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , .

3 Comments

 1. సురేష్ కొలిచాల గారికి… ఆర్యా ! నా ఎడల మీకున్న సద్భావానికి హృదయపూర్వక కృతజ్ఞతలండీ. ఈ పుస్తకానికి ప్రేరణ ఏంటంటే – ప్రతి సగటు విద్యావంత ఆంగ్లేయుడూ ఇదివఱకటి పదనిర్మాణాలలోని analogy ని బట్టి కొత్త పరిభావనల్నీ, వాటిని వర్ణించే పదాల్నీ కల్పించగలడు. కానీ మన తెలుగువారు ఎంత విద్యావంతులైనా, సాక్షాత్తూ తెలుగుమాధ్యమంలోనే చదివినా కొత్త తెలుగుపదాల్ని కల్పించలేరు. ఈ ప్రావీణ్య లోపానికి ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేదు. దీనిక్కారణం – భాషకు కట్టుబడి ఇటుకల (building blocks) లాంటి ఎలిమెంట్లూ, ప్రత్యయాలూ, ఉపసర్గలూ తెలియకపోవడమే. ఆ పరిజ్ఞానం ఈ పుస్తకం ద్వారా సమకూడుతుంది. ఆంధ్రగీర్వాణాల్ని శాస్త్రీయంగా అభ్యసించకపోయినా, ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివినవారు తమంత తాము కొత్తపదాల్ని అలవోకగా కల్పించగలుగుతారు.

 2. తాడేపల్లివారు తెలుగులో పదనిష్పాదన కళ అనే సంపుటిని ప్రారంభించడం వలన భాషాభిమానులకు, పరిశోధక విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తాడేపల్లివారి తెలుగు పదప్రయోగం,పదనిష్పాదన చాలా బాగుంటుంది. ఈ పదనిష్పాదన ముఖ్యంగా స్థానీకరణ(Localization), పరిభాషిక పదకోశాల తయారీ (creation of glossaries) మొదలగు రంగాలలో పనిచేసేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

  ఈ పదనిష్పాదన కళ నిర్విఘ్నంగా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

  నమస్కారం,
  రవికుమార్ రాగం

 3. తెలుగు భాష మీద విశేషమైన అభిమానం, సంస్కృతాంధ్ర వ్యాకరణ సంప్రదాయాల గురించి చక్కటి అవగాహన, తమిళ కన్నడ వంటి సోదర భాషలతో పరిచయం, తగినంత భాషాశాస్త్రజ్ఞానం, అన్నింటికీ మించి కొత్త పదాల నిష్పాదనలో ఎనలేని అంకితభావం చూపించే తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు తన ఆలోచనలను పుస్తకంగా ప్రచురించడం ముదావహం. ఈ పుస్తకంలోని అంశాలపై మంచి చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను.

  శుభం భూయాత్,
  సురేశ్.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.