cover2

ఎబినేజర్ అనబడే ఒక మాదిగ నింబోడి కథ

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

(కాశీభట్ల వేణుగోపాల్ పెద్ద కథ చివరి భాగం ఇది)

నా మొబైల్ మెట్ల మీంచి కింద పడి… భాగాలు భాగాలుగా విడిపోయింది. మళ్లీ రిఅసెంబుల్ చేసినా డిస్ప్లే మధ్యలో పగిలినట్టు రెండు గీతలు పడిపోయాయి… ఎట్లాగూ కొత్త ఫోను కొనాలనుకుంటున్నా… సరేలే అనుకున్నా… కొత్తది కొంచెం పెద్ద ఫోను కొన్నా…

యిబ్బిగాడు కొత్త ఫోన్చూసి… ఏ ఉపోద్ఘాతం లేకుండా…

“పాతదేం జేచ్చివీ?” అనడిగాడు…

“ఉంది… యిస్తా… కార్డేయించుకుంటావా? మధ్యలో గీతలొస్తాయి అంతే మిగిలిందంతా బాంది” అన్నాన్.

“నాక్తెలదు నువ్వే నంబరేయిచ్చీ…” నేనేదో వాడికి బాకీ వున్నట్టు…

“ఫోనూ… కార్డూ అన్నీ నాకే బొక్కరా… నెల నెలా డబ్బులు కూడా వేయించమంటావ్ నువ్వు దొంగ గాడిదా” నవ్వుతూ అంటే…

“ల్యాలే… నేనేపిచ్చుకుంటాగానీ నంబర్తోనీ ఫోను” దయతల్చినట్టన్నాడు యిబ్బిగాడు…

నాకు ఈ చార్జి చేసే అక్రంకు ఫోన్చేసి కొత్త సింకార్డు వేయించి నా డిస్ప్లే విరిగిన కొత్త ఫోను యిబ్బిగాడికిచ్చా…

అబ్బురంగా దాన్ని పట్టుకోని… ఉత్తి ఫోను చెవి దగ్గర పెట్టుకోని… నా వేపు పూకంటితో చూసి ఓ తొస్సినవ్వు నవ్వాడు యిబ్బి. మళ్లీ దాన్ని నా వేపు జాచి… “నీ నంబరెక్కీ దీంట్ల… అవ్ గీదీన్నంబరేందీ?” అడిగాడు.

“ఎవరెవర్కి ఇస్తావ్‌రా యిబ్బీ నీ నంబరూ” అంటే,

“బో… మచ్చుగుండార్లే… ఎవులెవులికి నాతోని పనుంటె ముగాండ్లకెల్లిచ్చా… ఈ కాన్నించీ… నువ్వు గూడ మద్దెరాత్రి మందుగావల్చొచ్చి పోన్గొట్టి ‘వర్యా యిబ్బీ యీకెల్లి రార మందుగావాలె’ అన్నవన్కొ… పెద్దమ్మకు కూరల్గావాల్చొచ్చె… ఏందిలే బో పన్లన్ని పుసిక్కిన జెయ్యబడ్తయ్ గానీ… టేంకూ… టేంకూ”

“సరేలేగానీ యిబ్బీ ఆ పిల్లెవర్రా” చాల్రోజుల్గా అడగాలనుకున్న ప్రశ్న అడిగేశా…

“అద్యా నా పెండ్లం గాదు… లేపుకొచ్చిన… యిడ్డూరంగాకపోతేందిల్యా? అవ్ లేపుకొచ్చిన…

“ఒన్నూరక్క అది… అబ్బామ్మలకి అయిదుగురు… అన్నీ ఆడివే… యిది నడిపిది. పెండ్లి జేచ్చమన్జూచ్చె దీనిజ్కి ఉలుమన్జెప్పిరి పైయల్లా మచ్చలు మచ్చలే… యానాకొడుకూ పెల్లికి ముగబల్యా… దాందీ నాదీ ఒగే బెడగలు జచ్చె… అందుకోసరానికి వాల్లమ్మబ్బల్నడగల్యా… తీర జూచ్చె దానికి పట్టింది ఉలుంగాదు సిబ్బెమన్దెల్చె…

“గపుడడిగిన దాన్ని నాతోని వచ్చవేమె? అని. ‘అవ్ అనె. లేసొస్తిమి రాత్రి రాత్రి… తొస్సోన్నైన, పూకంటోన్నైన, పొట్టోనైన… దొడ్డి కాల్లోనైన… ఏమైన… గానీ మొగోన్నైతే మొగోన్ని గదా… హిహ్హిహి”

పూకంటి పొట్టి తొస్సి దొడ్డి కాళ్ల ‘మొగోడు’

‘ఎబినేజర్’

* * *

ఆ రోజు మంగళవారం…

మార్నింగ్ వాక్ నించీ తిరిగొస్తున్నా…

ఎర్రటి సూర్యుడు చల్లగా వున్నాడు…

చెక్‌పోస్టు చౌరస్తా చేరుకున్నా…

పాలప్యాకెట్లు పేపరూ తీసుకుంటున్నా… సోమిశెట్టి నగర్ రోడ్డు నించీ తప్పెట మోతతో ఓ రెండు కార్లూ పళ్లేలు పట్టుకుని నడుస్తూ ఆడవాళ్లూ పిల్లలూ… చాలామంది…

“ఇది మూడోది ఈ రోజుకి” పక్కనే ఎవరో అన్నారు.

గుంపు మధ్యలో ఓ పొట్టేలు…

మెళ్లో వేపమండలూ…

పురితిరిగిన కొమ్ముల మధ్య పసుపుకుంకుమలూ…

ఊరేగింపు దగ్గరగా వచ్చింది…

ముందు తప్పెట్లు కొడుతున్న ఇద్దర్లో… గుర్తించడం కొద్దిగా కష్టమనిపించినా… గుర్తు పట్టగల్గిన యిబ్బిగాడు… ఎబినేజర్…

నాకు పరిచయమైన వేషానికి పూర్తి భిన్నమైన వేషంతో… మోకాళ్ల పైకి చిన్న పంచె గోచీ పోసి కట్టుకున్నాడు… ఎండిపోయి.. ఎముకలు తేలిన గుండెలు…

గళ్ల చొక్కా గానీ…

కాలరు లేని నీలం రంగు వెలిసిన టీషర్టుగానీ లేకుండా నగ్నంగా…

1తప్పెటపురి… మెళ్లో జంధ్యంలా…

స్పృహలో లేడు…

తాగడం వల్ల కాదు…

తప్పెట లయలో లయమై ఉన్నాడు వాడు…

అప్రయత్నంగా నా కుడి పాదం ఆ లయకనుగుణంగా ఆడుతోంది.

“నమస్తేన్నా”

నా ముందాగిన సఫారీ లోంచి దిగిన LIC శ్రీనివాసరెడ్డి..

“ఆఁ శీనూ గుడ్‌మానింగ్” అన్నా…

“మార్నింగ్ అన్నా… ఎల్లమ్మను జేస్తున్నాం. పాప కాన్పు తర్వాత యిదే… యింక మనమడు కూడా పుట్టె కదా.. పాప ఎల్లిపోతాది. అల్లుడు కూడా వచ్చినాడు.. రాన్నా… ఎల్లమ్మ కాడికి… సిగ్నీచరు ఆరు ఫుల్లు తీయించినా… పన్నెండు కట్ల రాన్నా… స్కూటర్లో ఎంత పది నిమిషాలంతే కదా… బచ్చాలూ.. పాళం గూడ చేసినారులే… హహ్హహా” గట్టిగా నవ్వుతూ శ్రీనివాసరెడ్డి..

“సరే శీనూ, ఆ తప్పెట కొడుతున్నాడే పొట్టోడు వాడూ? నీకూ? ఎట్లా పరిచయం?” అడిగా…

“వాడా పూకంటోడా… మనూరు ముష్టపల్లోడే గదనా… తప్పెటంటే ఆ తొస్సినాకొడుకే కొట్టాల్నా… ఏమంటే బాగ మందేయించాల్నా. యిప్పుడు కర్నూల్లోనే సెప్టిక్ ట్యాంకు వాళ్ల దగ్గర్చేస్తున్నాడు. నింబోడు వాని పేరు. తప్పెట పట్కుంటే పై తెలీదు వానికి. పల్లెప్పుడో యిడిచి పెట్నాడన్నా… అనా, రానా నీవు ఎల్లమ్మకు.. అక్కడ మాట్లాడ్దాం” అని హడావుడిగా సఫారీ ఎక్కాడు శ్రీను.

ఒక మోకాలు నేలకానించి.. మడిచిన యింకో కాలు తొడకు తప్పెటానించుకుని…

లేని పళ్లతో కింది పెదవి లోనికి లాక్కొని కరిచిపెట్టి

చుట్టు ప్రక్కల ప్రపంచ స్పృహ లేకుండా…

తప్పెట తీవ్రస్థాయిలో వాయిస్తూ… నింబోడు..

పూకంటి, తొస్సినోటి, పొట్టి, దొడ్డికాళ్ల, తల మీద టోపీ లేని..

ఎ.. బి.. నే.. జ.. ర్..

కళాకారుడు

* * *

మాదిగల గురించి వికీపీడియాలో దొరికిన విషయం చాలా తక్కువగా వుంది.

వాళ్లు నాగవంశులనీ, మాతంగులనీ, మహా ఆది అనీ… Mathangas are the original name of Indian tribe that has been relegated to a low caste (మనం హీన అన్చెప్పుకోవల్సొస్తుంది కదా మనం వందల ఏళ్లగా treat చేస్తూన్న పద్ధతుల్ని బట్టి). దక్షిణాన మాదిగ (మాతంగ –> మాదగ –> మాదిగ) గా రూపాంతరం చెందిందని వికీపీడియా…

ఇంకో కథనం…

జైన మతాదిగా వున్నారనీ… జైన తీర్థంకరుల్లో వున్నారనీ చెప్పబడుతూనే ఎవరు ఈ యుద్ధవీరజాతిని అత్యంత లోతులకు పాతారు?

సరైన సమాధానం దొరకదు…

చెప్పులు కుట్టేవారిగా చెప్పబడే మాదిగలు నిజానికావృత్తిలో వున్నది 1% మాత్రమే. మిగిల్న 99% వ్యవసాయికులే అనుంది.

ఇప్పుడు బాపలూ, రెడ్లూ, కమ్మలూ అన్ని కులాలవాళ్లూ నగరాల్లో పట్టణాల్లో ‘షూమార్టులు’ తెరుస్తున్నారు..

నాకు తెలిసీ ఒక ట్రాలర్ పెట్టుకుని అరేబియా సముద్రంలో దక్షిణ కన్నడ రాజ్యంలో చేపలు పట్టే బాపడు ఒకాయనున్నాడు.. ఇన్ని వైరుధ్యాల మధ్య వీళ్లని వెలేయడమేమిటి?

సంగీతంలో, నృత్యంలో వాళ్లు పోషించిందే?!

తప్పెట్లు.. యబ్బిగాడు ఎల్లమ్మకు వెళ్తూ వాడు వాయించింది శివమణి జాజ్ కేమీ తీసిపోదే!

చిందూ? వీరుల యుద్ధ నృత్యం కాదా!

నిన్న మొన్నటి వరకూ ‘మాదిగ’ అన్నమాట తిట్టుగానే వుంది. SC ST Act వచ్చే వరకూ (ఇప్పటికీ లోలోపల వుందనేది అక్షర సత్యం కాదూ… నాకు తెల్సిన ఓ బ్రాహ్మణాయన భార్యనీ కూతుర్నీ ‘మాదిగముండా’ అనే తిడ్తాడు…)

ఎందుకు ఆ మాట హీనంగా నీచంగా దైన్యంగా తిట్టుగా మారింది?

ఏ phylologist సమాధానం చెప్పాలి.

బ్రాహ్మడికి పర్యాయపదంగా ‘బాపడు’ అని నిఘంటువుల్లో వుంది. బేపనోడా అంటే మిర్రి చూసే బ్రాహ్మడింకా సజీవంగా వున్నాడు…

ఏమో మిత్రుడు అవిజ వెంకటేశ్వర్రెడ్డి వాళ్ల చరిత్ర తెచ్చిస్తానన్నాడు చూడాలి..

ఈ మధ్యన యిబ్బిగాడి రాక తగ్గుతూ వస్తూంది…

ఫోన్చేస్తే… “ఇప్పున్నె గాడుంట… ఏంగాల మందుగావాల్నా” అంటాడు రాడు.. మా పూకంటోడు…

* * *

ఒక రోజు రాత్రి ఫోన్చేశాడు…

“మల్లొచ్చె మంగలారం వచ్చా మా ముష్టపల్లికి వోదం ఉరగమ్మన్జేచ్చారు… యిప్పసారా గూడ మచ్చుగుంటదిలే నూ బాపనోనివనెవ్వల్కిజెప్పన్లే” అన్నాడు…

“దొంగ గాడిదా.. మీ ముష్టపల్లి తోటెంకట్రాంరెడ్డికి నేనెవరో బాగా తెలుసురా…”

“అవే నారెడ్డి కొడుగ్గదా… అవ్‌లే మొన్న శీనాసుల్రెడ్డికి ఎల్లమ్మకు దరువేచ్చి గదా… మతికిరాల్యాసూడు, అయినగానీ నూ రావాలె” అని పెట్టేశాడు ఫోను…

నేనసలు బ్రాహ్మణ్ణే కానని నాకు తెలుసు నన్ను వెలివేసామనుకున్న, అనుకుంటున్న బ్రాహ్మణమ్మన్యులకూ తెలుసు, పిచ్చిపూకంటోడు.

* * *

ఇప్పుడిప్పుడే నల్లమల అడవి ఊళ్లల్లోకి పాకుతోంది…

ఆత్మకూరు నించీ ముష్టపల్లెలో దిగాం… నేనూ పూకంటి తొస్సినోటి, పొట్టి, దొడ్డికాళ్ల, తిప్పిపెట్టుకున్న టోపీవాడు, కళాకారుడు, మగోడు, ఎబినేజర్ అనబడే మాదిగ నింబోడు…

వెంకట్రామిరెడ్డి సాదరంగా ఆహ్వానించాడు..

వేడి వేడన్నం పచ్చి మిరిప పప్పు, చింతతొక్కు, పేరిన్నెయ్యీ, గడ్డపెరుగుతో అన్నం పెట్టాడు..

రెడ్డికి చెప్పా దేవతను చూడ్డానికనిచ్చానని..

అంతదూరం మీరెక్కడ నడుస్తార్సార్.. గండం వాగు, మూలబండల వాగంటార్లే, ముసళ్ల వాగూ దాటి రుద్రకోడుకు పోవాల. ఇప్పుడక్కడ చెంచులు కూడా లేరు. రీహాబిలిటేట్ చేసినారు. వీళ్లు అమ్మను చేస్తే గీస్తే మల్లయ్య తిప్ప దగ్గర చేస్తారేమో. బండి కట్టిస్తాలెండి.. క్యారేజీ కూడా కట్టిపిస్తా మంచి నీళ్లు కూడా పది లీటర్ల క్యాన్తో పంపుతా అని భరోసా యిచ్చాడు…

బండ్లో ఆ పూకంటోన్ని నీతో ఎక్కిచ్చుకోవద్దు సార్.. పల్లెయిది.. మీకు చెప్పేదేముంది చెప్పండి.. చివరగా ఒక బాణం వదిలాడు తోట నాగిరెడ్డి కొడుకు తోట శ్రీనివాసరెడ్డి అన్న తోట వెంకట్రామిరెడ్డి…

* * *

మధ్యాహ్నం మూడుకే వచ్చాడు యిబ్బి…

“ఏంర నింబోడా పెదిన్ని దినాలగ్గానొచ్చివీ?” రెడ్డి తనదైన యాసలోకి వెళ్లాడు…

“యీడేముంది రొడ్డీ… కర్నూల్ల దుడ్లు బానే వచ్చుండాయిలే. ఒన్నూరక్క గూడ్క ఆక్కూరలు కనకాంబరాలెయ్యినీకి తీస్కునె. నడుచ్చాందిలే రొడ్డీ బండి.. నాయిన కాలమాయె గద… శీనాసుల్రెడ్డన్న అంతో యింతో సెయ్యిచ్చాండూ, ఇంగ ఇజ్రాయిలన్న వుండాడు.. దో గీన.. ఏంగావాల్చెప్పు రొడ్డీ”

ఫిలాసఫర్ ఎబినేజర్

* * *

ఇప్పసారా…

మదూలక కాదంబరి…

ఒకటికి గొంతుమంట…

పెద్ద జువ్వి చెట్టు కింద నులకమంచం…

నల్లటి అడవి…

అరణ్య పరిమళం…

డప్పుల మోత…

“గిప్పుడె పూరా తాగగాకు” యిబ్బిగాడు

“ఏతీ… సార్‌కు మల్లెప్పుడు దొరకాల” ఎవరిదో గొంతు…

జరుగుతూన్న తతంగం చూస్తున్నా… అంతా శకలాలు శకలాలుగానే…

“నాగలూటిగాడు బానమేచ్చె సెంబీరిగాని యీపులకెల్లొచ్చె బతికె సూడునాకొడ్కూ” యిబ్బిగాడి గొంతేనా?

“నేనేచ్చా… గుండెయ్య గూడొచ్చు నాకు… అన్నల కాడ నేర్చిన… ఉమ్మేస్రంల వున్నెప్పుడు పెదిన్ని దినాలు అన్నలకన్నమొండిన గుడారమెత్తినప్పుడు… ‘వర్యా యింగ నీ పని మాకుల్యా ఎలబారు ఆత్నకూరు’ కనె… వచ్చేచ్చి యెయ్యి రూపాలు గూడిచ్చిరి…”

పెద్ద నెగడు…

కొమ్ము పందుల్తిరు…

“ఒకదినం ఉచ్చుల ఇర్రిపిల్లవడె దాన్నిడిపిచ్చాంటె పారెస్టు దుబ్బ సుబ్బోడొచ్చె.. సూసె.. ‘వర్యా పూకంటోడా ఏందిరిదీ’ అనె”

“సెయ్ కొడ్క తెల్చులే గిప్పటికి పెదిన్నిసార్లు జెప్నవ్… వాడు నీకు మున్నూరిచ్చ్యా… ఇర్ర వానికాడికి వాయ… కర్నూలుకెల్లి దుడ్డుకార్లొచ్చా సెంచుదిబ్బకాడ టెంటు వడ్యా.. నసుక్కె మల్లి కర్నూలుకెల్లి ఎలబారిపాయ.. ఈ పూకంటోని కతలినీ యినీ యీసిరకొచ్చాంది… గమ్మునుండా”

మగత… డప్పులినబడుతానేవున్నాయి.

* * *

dappuఎవరో తడుతూ లేపితే మెలకువ…

కళ్లు బంకలు కట్టాయి…

నాలుక నోటి నిండుగా…

నోట్లో ఉప్పటి నీళ్లు…

ఉధృతంగా వమనం…

బొళ్లున

నులక మంచం తాళ్లు గుర్తులు గుర్తులుగా పక్కనా వీపుకు…

మళ్లీ వమనం…

“ఏసుకోగాకు ఏసుకోగాకనంటె ఇనకపోతియి… యింక్గా కక్కూ” యిబ్బిగాడే

వాడి ముఖం డిస్టార్డెడ్గా కనబడ్తో…

రాత్రి ముక్కల చిత్రం

ఓకలాజ్…

ఏదో ఎర్రటి రాతిబండ…

ఎరుపూ పసుపూ…

జొన్నలూ బంతిపూలూ…

గుడిసె…

రంగు రంగు చెక్కబొమ్మ… గూట్లో…

మూకుట్లో అన్నం… దారం… కల్లూ… బెత్తం…

లావుపాటి నల్లటి స్త్రీ…

నుదుటున సూర్యోదయం… కుంకుమ

మర్రిపాల అట్టకట్టిన శిగ…

కపర్దం..

దైవ నివేదన…

దేహం దేవుడిది…

ఊరంతా దేవుళ్లే…

దయ్యపు కామం…

జీవితాంతపు స్వేచ్ఛ?

బగినోళ్లు మొగుళ్లు…

మళ్లీ ఉధృతంగా తన్నుకొచ్చిన వాంతి…

“ఇంద యిత్తాగు దిగుతది” యిబ్బి

బొమ్మలు బొమ్మలు… రంగులు రంగులు… డప్పుల చప్పుడు మంటల్లో కాలి నీలుగుతున్న చర్మం… తప్పెట్లు… కుండ మీద చేట, మీద మూకుడు, మూకుట్లో దీపం… కొలువులమ్మ… కొలువులమ్మ… కొలవులమ్మ…

దీపధ్యానం…

పూజారి ఆరుబయట దేవతావాహన…

కొలువులమ్మనలుముకున్న ఆవేశం…

దేవత… దేవత… దేవత…

సకల దేవతా ప్రసన్నం

ఊగుతూ… తూగుతూ… తూలుతూ… దేవత…

ఆకాశం కింద పగిలిన టెంకాయ…

తెగిన కోడితల…

కల్లు సంప్రోక్షణ

కల్లుతో ముఖం కడుగుతున్న కొలువులమ్మ విగత సృహ…

దేవతానామప్రకటన…

యిబ్బిగాడిచ్చిన ప్లాస్టిక్ గ్లాసుడు పానీయం…

తలలో ముళ్లు విరుగుతున్న భావన…

కట్ట మీద ఉరగమ్మ…

గొఱ్ఱె కడుపున కసుక్కున దిగిన కత్తి…

కొలువులమ్మ నోట ఊపిరిబుడ్డలు… కార్జం… మెళ్లో పేగులు… కొత్త చీరా… మెత్తటి రవిక…

నెత్తుటి కొత్త చీర చుట్టి కొలువులమ్మ…

ఒంటి నిండా కాటుక బొట్లు…

మళ్లీవమనం…

“నువు సవ్వగా గుడిపే యిస్కీ అనుకొంటివ్వా… ఏందది?” యిబ్బి మందలింపు

ఉరడమ్మ గుడిసెంచీ ఊగేగింపు

తప్పెట్లూ… చిందులూ…

స్త్రీత్వం లేని స్త్రీ… పూజారిణి

నెత్తిన ఓటికుండ

చేతుల్లో చేటా పొరకా…

“ఇంగ సన్నంగ లేసి బండెక్కు ఏం గాదు పా”

పూకంటి తొస్సినోటి దొడ్డికాళ్లు, కళాకారుడు, భక్తుడు…

ఎ… బి… నే… జ… ర్

* * *

ఎబినేజర్ మళ్లీ పోలీస్‌కు దొరికాడు…

ఈ మాటు పెద్ద నేరమే… గంజాయితో దొరికాడు…

వెళ్లాలనిపించలేదు స్టేషన్‌కు…

వీడి అసలు రూపమేమిటి?

వీడి దగ్గర గంజాయేమిటి… ఎంత మొత్తంలో దొరికింది?

‘గుండెయ్యగూడొచ్చు… నాకు’ లీలగా నా తాగిన మత్తులో విన్న యిబ్బిగాడి నక్సల్ సంబంధాలు…

‘అన్నలకన్నమొండిన’

‘ఎయ్యి రూపాల్గూడిచ్చిరి’

ఇవన్నీ నిజాలేనా…

భౌతికపరమైన తన అనాకారితనాన్ని తరిమేసుకోడానికి వాడు ఆడే అబద్ధాలా?

వెళ్లా స్టేషన్కి…

“దిస్ జోకర్ ఫకర్ హ్యాజ్ బికమె హెడేక్ ఫర్మీ” శ్రీరాం…

ఆరు పొట్లాలు… చిన్నవే న్యూస్పేపర్ పొట్లాలు…

“నందికేట్కూరు వొయ్యింటి, ఆత్మకూరు బస్సుల కర్నూలుకెలబార్తి, కింద కాల్లకాడ పెద్ద పిలాస్టిక్ సంచి దొరికె… దుడ్లున్నయనుకుంటి.. జూచ్చె ఆకు… నాకు దెల్చు అది ఆకని… గౌండ జమీల్గానికి అమ్మ బెడ్తి నూర్రూపాల్కి… వాల్లన్న పెద్ద జమీలు పోలీస్గద… సావదెంగి లోనేసె గంతె”

పూకంటి యిబ్బిగాడి ముఖంలో ఏ భావమూ ద్యోతకం కాలేదు…

ఈ మాటు వాడి భార్య ఒన్నూరక్క జాడలేదు…

నేను లేచి ‘బుకిమ్’ అన్నా శ్రీరాంతో…

“నే… నేయ్… వాడు చెప్పేది నిజమని తెలుస్తోంది… వీడు కాల్చేవాడూ కాదు, అమ్మేవాడూ కాదు… విల్ సీ.. ఈ సారికి పోరా జోకర్నాకొడకా” అన్నాడుశ్రీరాం…

కృతజ్ఞత అన్న పదానికి అర్థం తెలీనివాడిలా… నన్నెవరి కోసం వదుల్తారన్న దీమాతో బయటికి దొడ్డికాళ్లతో నడిచిన పూకంటి తొస్సినోటి పొట్టి ఎబినేజర్…

* * *

ఒక రోజు వాడిని కూచోబెట్టుకోని

“ఒరే యిబ్బీ, ఎబినేజరంటే తెలుసురా?” అని అడిగా

“నాకెట్ట తెలుచ్చాదనుకుంటివి నువ్వు… సదువా మన్నా?” అన్నాడు

“మరి బైబిలు పట్టుకోని వారం వారం చర్చి కెళ్తావే?”

‘క్కెక్కెక్కె’మని వాడి ట్రేడ్ మార్కు నవ్వు నవ్వి “సెర్చిల యిస్కూలుందిగద పిలగాండ్ల కోసరానికి ఆడిరవై ఈడిరవై దొడ్లుండయి… దొడ్డికి పది లెక్కన దుడ్లిచ్చారు… వాల్లోనే నేన్గూడన్కోని.. బేబిలు సంకనబెట్కునెడిది పొయ్యేడిది… లెక్కేస్కో”

అమ్మ అపర చాణక్యుడివిరా నువ్వు అనుకున్న..

ఇక వాడికి Old Testament, Book of Samuel, ఇజ్రాయెల్ పలెస్తీన్ యుద్ధాలు… శామ్యూల్ గెలిచి పాతిన Eben-ezer రాయీ.. మన్నూ మట్టిగడ్డే వాడికి బోధపడదు.. వదిలేశా…

బుద్ధిమాంద్యం ఎ… బి… నే… జ… ర్

* * *

ఆ రోజు

ఉదయం ఆరున్నర…

వాకింగ్ నించీ వచ్చేసరికి ఇంటి ముందు వేప చెట్టుకింద కూచుని కనిపించాడు…

అమ్మ మెట్ల మీద రేలింగ్ కానుకుని కూచుని కాఫీ తాగుతోంది.

మా తోటే లోపలికొచ్చాడు ఎబినేజర్…

“ఏంరా పొద్దున్నే తాగేదానికి డబ్బుల కోసం వచ్చావా?” కసిరింది అమ్మ

తలొంచుకున్నాడు.. మౌనమే వాడి సమాధానం…

“సర్లే రాత్రి సాంబారు అన్నం మిగిలున్నాయి తింటావా?” అడిగింది మళ్లీ అమ్మ…

టోపీ వెనక్కు తిప్పుకుని బయటకు నడిచి పక్కింటి వాళ్ల బాదం చెట్టు ఆకు మూడు కోసుకొచ్చి.. మోటార్ మూలకున్న మొండిపరక పుల్ల నించి మూడాకులు కలిపి కుట్టుకుని నిలుచున్నాడు…

నేను పైకి వెళ్లేసరికి కిటికీ లోంచి దీర్ఘంగా చూస్తూ నించుని వున్నాడు…

నా శబ్దానికి తిరిగి చూసి ఊయల కింద కూచున్నాడు కుక్కరి గాళ్ల మీద…

“ఏరా డబ్బులా?” మామూలే అన్నట్టడిగా…

టోపీ చెవి మీదకి తిప్పుకున్నాడు గానీ మాట్లాళ్లే…

ఉన్నట్టుండి “నువ్వు నన్ను నమ్మినవా?” అనడిగాడు…

గట్టిగా నవ్వి “పోరా తిక్క నాయాలా” అన్నా

“నేన్నమ్మిన… నిన్ను నమ్మిన, మంచుల్నెల్ల నమ్మిన, ఒన్నూరక్కన్గూడ నమ్మిన” వాడి గొంతులో నేనెరుగని జీర…

“ఏమైంద్రా నీకూ పూకంటోడా?”

“ఆ లంజ ఒన్నూరక్క దెంకవాయ”

తన విరిగిపోయినగోళ్ల కాళ్లను చూసుకుంటూ కాస్సేపటికి తలెత్తి “నీకు నేను మంచోన్నేనా?”

నా గొంతులో పొడిబట్ట యిరుక్కున్న ఫీలింగ్

నెమ్మదిగా లేచి.. ఎప్పుడూ లేంది నమస్తే పెట్టి బయటికి అడుగేశాడు…

పూకంటి, తొడుగు నిక్కరు, గళ్లచొక్కా, మాసిన నీలంటోపీ దొడ్డికాళ్ల పొట్టి యిబ్బిగాడనే, పాకీ దొడ్లు కడిగే, కళాకారుడైన మొగోన్నిగదా అని చెప్పుకున్న…

ఎబినేజర్ అనబడే మాదిగ నింబోడు

*

(అంకితం: ఎబినేజర్‌కూ, ప్రపంచంలోని ఎబినేజర్లందరికీ)

కాశీభట్ల వేణుగోపాల్ పుస్తకాలు కినిగెలో

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, కథ and tagged , , , , , .

4 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.