cover

నామిని ‘మూలింటామె’ నవలపై బాపు స్పందన

Download PDF ePub MOBI

(నామిని సుబ్రమణ్యం నాయుడు కొత్త నవల ‘మూలింటామె’ చదివాకా చిత్రకారుడు బాపు పంపిన ఉత్తరం ఇది)

naminibapu

.
* శ్రీరామ *
అయ్యా నామిని గారూ –

namini letter pg1నిన్నెవరనీ పిలిచేదిరా అని స్వామివారన్నట్లు – మిమ్మల్ని ఎలా సంబోధించాలో తెలియటంలేదు.

ముందు ఆలస్యానికి క్షమాపణలు. 18న – మీ పుస్తకం అందిన రోజే వూరెళ్లాను. అక్కడుండగా దేహయంత్రానికి బాగా రిపేరీ వచ్చింది. నేను అసలు, ప్రయాణంలో గానీ ఇంకో పని మీద వూరెళ్లినపుడు గానీ నామిని గారి వుత్తరం కూడా చదువుకోలేను. అందువల్ల ఇంటో వదిలి వెళ్లాను. రాగానే కొంచెం కోలుకున్నాక తీశాను. అయ్యా ఏకాండీగా చదివా. ఇపుడే పూర్తి చేశాను. నేను అసలే చాలా emotional వాణ్ణి. రాముణ్ణి తలచుకున్నా మీ రచనలు చదువుతున్నా ఎమోషన్ తట్టుకోలేను. కేవలం పట్టలేని ఆనందంతో. మీ రచన కలచి వేసింది –

కథనం అనండి, పాత్రల చిత్రీకరణ – వారి మనస్తత్వాలు – వర్ణనలు – ఈ మాటు మిమ్మల్ని మీరే మించిపోయారు. మీ భాష చదువుతుంటే కళ్లమ్మట నీళ్లు తిరిగేవి – చాలా చోట్ల. నా వృత్తి కథలు చదివి బొమ్మలెయ్యడం కదా – tragedy వైపు వెడుతూంటే – ముఖ్యంగా నాకు చాలా emotion కలిగిస్తూ సాగిపోయే పాత్రలున్న కథనంలో skip చేసేస్తాను. తట్టుకోలేక. కానీ ఈ కథనం skip చేయడం వీలు లేకపోయింది.

రచయితగా మీరు సామాన్య మానవులు కారు. వృత్తి వల్ల గాని, ఇష్టం వల్ల గానీ రచనలు చదవడం నాకు మామూలు మామూలు emotion ఇచ్చేది కాదు. పైగా రమణగారి సత్సాంగత్యం – వారి ద్వారా మీ బోటి వారి స్నేహం అలవాటయి ఈ అదృష్టం కలిగింది. గత రెండేళ్లల్లో రాముడు కొట్టిన దెబ్బలకి దుఃఖమైనా ఆనందమైనా తేలిగ్గా తట్టుకోలేకపోతున్నా. మీ నవల మరీ మరీను. రమణ గారు దగ్గరుంటే – కొన్ని రోజుల తరబడి మీ వాక్యాలే – మీ పాత్రలే మాట్లాడుకునేవాళ్లం. మీ యీ రచన విషయంలో రాముడు రమణ గారితో నా మహద్భాగ్యాన్ని పంచుకోలేకుండా శిక్షించాడు.

namini letter pg2నేను మనిషిగా పుట్టినందుకు సార్థకత రమణ గారి యొక్క మీ యొక్క పరిచయ భాగ్యం – మీరు రాసినదంతా చదివే అవకాశం – నామిని గారూ ఏమి రచన చేశారండీ! నిజమైన మనుష్యులు! కేవలం నలుపు కాదు తెలుపూ కాదు. అనేక రకమైన shades! (నాకు ఒక ఆశ్చర్యం – ఇంతగా మనిషిని చదివిన వారు – ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో గుమ్మడికి అంత help చేసిన రావి కొండలరావు దివ్యవాణి మీద, ఆడాళ్ల మీద ముచ్చటపడడం సరిగ్గా లేదన్నారు. దానికి సమాధానం మీ రచనే! మనిషంత unpredictable పదార్థం మరోటి లేదు!)

కానీ మీ నవల చదివిన తరువాత ఎంతో రాద్దామని! చేత కాదు కుదరటం లేదు. మిమ్మల్ని ఈ మారు కలుసుకున్నప్పుడు మాట్లాడగలనేమో! రమణ గారి జీవితంలో నాకు తెలిసినంతవరకూ ఒకటే అతి పెద్ద లోటు – ఈ రచన చదివే భాగ్యం నోచుకోలేకపోవడం!

ఇంకొక ప్రార్థన – నా బుర్రకి పరిమితి వున్నంతవరకు నవల భావం అర్థం చేసుకున్నాను గానీ – దయచేసి నాకు personal గా అనుకున్న సంగతి – ఈ కథ గురించి – ఏదేనా వాక్యంలో చెప్పగలిగితే రాయగలరా! నాకు ఆ మనుషుల గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాలని వుంది. నా ఆరోగ్యం అవకాశం కల్పించగానే కేవలం ‘మూలింటామె’ గురించి మీ నోటంబట అనేక విషయాలు తెలుసుకోవాలని వుంది. అంతగా కలచి వేసింది. ప్రతీ దృశ్యం కళ్లను కట్టినట్టుంది! మీరు భగవంతుని అపూర్వసృష్టి. అంతకన్న వేరేమీ తట్టడం లేదు సార్. నవల చివరి వాక్యానికి సాటి లేదు. ఎవరికి వారికి ఎంత self pity వుంటుందో! ఎవరికి వారు తనొక్కరే మిగతావాళ్లకి victim అనుకుంటారో! అంతటి ఎరుక కలిగితే ఎంత ప్రశాంతమైన బతుకు గడపచ్చో! మీరు రాసినవి సామాన్యమయిన మాటలు కావండీ!

రాముడూ సీతమ్మతల్లి మీకు అంతులేని ఆరోగ్యం ఆనందం ప్రశాంతత ఎల్లవేళలా ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ

మీ బాపు.
22-11-13

Download PDF ePub MOBI

(మూలింటామె నవల కినిగెలో లభ్యం)

Posted in 2014, ఏప్రిల్ and tagged , , , , , , , , , , .

10 Comments

 1. Pingback: మూలింటామె | నా ప్రస్థానం

 2. Awesome!

  అక్షరాల వెంట కళ్ళు పరిగెడుతుంటే మనసు మడతల్లో పూలు విరబూస్తున్న అనుభూతి. ఎంత సింప్లిసిటీ, ఎంత ప్రేమ, దూరమై మరింత దగ్గరైన దైవం విడదీయలేని స్నేహం… ఎంత ఆర్ద్రత! వామనుడు పురాణాల్లో త్రివికరముడైతే, త్రివిక్రముడు మన కళ్ళముందే వామనుడై బ్రతకటం నేర్పిస్తున్నాడు!

  బాపు గారి దస్తూరి-కస్తూరి పరిమళాలద్దిన… మనసు అద్దం లాటి ఉత్తరం, తను మాత్రమే దాచుకోక మాతో పంచుకున్న పెద్దమనసు నామిని గార్కి, దాని భద్రంగా మాకందించిన కినిగె పెద్దలకు, నమోవాకాలు.

  However, చిన్న కంప్లైయింటు వంటి విన్నపం. ఛొటీ మూహ్ బడీ బాత్ అనిపిస్తే, ముందస్తు క్షమాపణలు.

  మనసులో అనిపించింది, మొహమాటం లేకుండా చెబుతున్నా!

  చిత్రకారుడు బాపు అన్నారు; సబబుగా అనిపించలేదు.

  చిత్రకారుడు అంటే ఆయన లోని దర్శకుడు, దర్శకుడు అంటే ఆయనలోని రచయత, రచయత అంటే ఆయనలోని గొప్ప మనిషి.. ని … కనిపించనివ్వకపోవడమే.

  అయినా జగమెరిగిన ఆచార్యులకు పరిచయం ఏల? శ్రీ బాపు గారు అంటే సరిపోదూ?

  ఉత్తరం ప్రకటించినందుకు మరోసారి … కృతజ్ఞతలు!

  —a nobody

 3. నామిని గారి ‘మూలింటామె’ నవల పుణ్యమా అని బాపూ గారి దస్తూరిని మరోసారి చదువుకునే భాగ్యం కలిగింది..

  రాముడూ సీతమ్మతల్లి బాపూ గారికి అంతులేని ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత ఎల్లవేళలా ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తూ