cover

పదనిష్పాదన కళ (2)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

వ్యావహారికవాదం వేస్తున్న వెఱ్ఱితలలతో తెలుగుభాషకీ, నూతన పదనిష్పాదనకీ వాటి ల్లుతున్న అపారనష్టం 

వ్యావహారికవాదాన్ని మొదట్లో ప్రారంభించిన కీ.శే. గిడుగు రామమూర్తిపంతులుగారు అనుకున్నది వేఱు. ఇప్పటి వ్యావ హారికవాదులు చేస్తున్నది వేఱు. మాట్లాడే భాషలోనే ‘అన్నీ’ వ్రాయాలని గిడుగు రామమూర్తిగారు అనలేదు. మాట్లాడే భాషకి ఉన్న పరిమితులు ఆయనకు తెలుసు. ఆయన కోరినది వ్యాకరణపరమైన వ్యావహారికం (colloquial grammar). పదాలవారీ వ్యావహారికం (colloquial wording) కాదు. పైగా ఆయన వాదంలో అనువాదాంశాలకు అంతగా చోటు లేదు. ప్రాథమికంగా ఆయన కోరినది విద్యావంతులు మాట్లాడే శిష్టవ్యావహారిక ప్రయోగం. అంటే “వచ్చుచున్నాను” అనే పుస్తకశైలికి బదులు “వస్తున్నాను” అని ఉండాలని ఆయన కోరారు. కానీ ఈ రోజున చాలామంది ఆయన పేరుతో తమ సొంత కార్యావళులు అమలుజఱుపుతున్నారు. పుస్తకాలలో ఉన్న అన్ని శాస్త్రసాంకేతిక పదాల్నీ వ్యావహారికం (ఇప్పుడీ పదాని కర్థం ఇంగ్లీషు) చేసిపారేయమని ఆయన ఎక్కడా చెప్ప లేదు. అదే విధంగా తెలుగు వర్ణమాల (Alphabet) ని కుదించమనీ ఆయనెక్కడా చెప్పలేదు. వ్యావహారికం పేరుతో కులమాండలికాలూ, ప్రాంతమాండలికాలూ వాడమని కూడా ఆయన చెప్ప లేదు. ఎలా మాట్లాడుతున్నామో ఆ ఉచ్చారణ విధానాన్నంతా యథాతథంగా లిపిబద్ధం చేసేయమనీ అయన అనలేదు. కానీ ఈ అన్నింటికీ పూనుకుంటున్నారు మన సమకాలీన వ్యావహారికవాదులు. ఒక ఆలోచన మేధావుల సొత్తుగా ఉండేనాటికీ, అది జనంలోకి వెళ్ళేనాటికీ నడుమ ఏ విధంగా రూపుచెడి, గుర్తుపట్టరానంతగా మారిపోతుందో, దానికి ప్రతివారూ ఏ విధం గా తమ తమ సొంతవ్యాఖ్యానాలివ్వడం మొదలుపెడతారో బహుశా ఇదొక నిదర్శనం.

వ్యావహారికవాదం కేవలం తెలుగుభాషకి పరిమితం కాదు. బయట గిడుగు రామమూర్తులు ప్రత్యేకంగా లేకపోయినా, తమిళం మినహా ఈనాడు దాదాపుగా అన్ని భారతీయ భాషల లిఖిత సాహిత్యాలలోనూ వ్యావహారికమే చాలావఱకూ వాడు తున్నారు, అవసరం కొద్దీ! అయితే ఆయా రాష్ట్రాలవారిని మించిన తప్పుడు అభిప్రాయాలు కొన్ని తెలుగుగడ్డ మీద పొలోమని ప్రచారంలోకి వచ్చేశాయి గడిచిన వందేళ్ళల్లో! వీటిని సరిదిద్దడానిక్కూడా ఏ ప్రయత్నమూ జఱక్కపోవడం విచారకరం.

౧. కొందఱు వ్యావహారికవాదం పేరుతో ఎదిరివాదంలోని అసమంజస అంశాల్ని ఖండించడానికి పరిమితం కాకుండా వారిని వ్యక్తులుగా ద్వేషించారు. అంటే ఒక సైద్ధాంతిక సమస్యని కాస్తా మానసిక సమస్యగా మార్చుకున్నారన్న మాట. తదుపరిదశలో వారిని ఒక వర్గంగా ద్వేషించడం జఱిగింది. అటుపిమ్మట వారందఱినీ ఒక సామాజిక వర్గం గా ద్వేషించడం జఱిగింది (సదరు ద్వేష్యవర్గంలో అందఱూ గ్రాంథిక రచయితలు కాకపోయినా). తదనంతరం గ్రాంథిక శైలినీ, సాహిత్యాన్నీ ఏకమొత్తంగా ద్వేషించడం మొదలుపెట్టారు, ఆ సాహిత్యం గిడుగు రామమూర్తిగారి కంటేనూ, ఆయన వ్యావహారికవాదం కంటేనూ కొన్నివందల సంవత్సరాల పూర్వం రచించబడినా కూడా!

కాలక్రమంలో ద్వేషం ఎగతాళిగా కూడా మారింది. ఉదాహరణకి – కొన్ని పాత చలనచిత్రాలలో ప్రతినాయక, విదూషక పాత్రల చేత అటూ-ఇటూ కాని అకటావికటపు గ్రాంథికంలో మాట్లాడించారు. అన్ని మాండలికాలకూ గ్రాంథికాన్ని పోలిన ఒక దేశవ్యాప్త ప్రాచీన వ్యావహారికమే మూలకందమనీ, ఒక కాలపు వ్యావహారికం ఇంకో కాలానికి గ్రాంథికంగా మారుతుం దనీ, అందులో ఎగతాళేమీ లేదనీ చెప్పేవారూ, చెబితే వినేవారూ ఈ గడ్డమీద కఱువయ్యారు. అలా అలా నెమ్మదిగా వాడుక భాషపేరు చెప్పి అందఱినీ తెలుగుభాషకూ దానియొక్క సహజమైన తరతరాల ప్రాచీనవారసత్వానికీ విముఖులుగా మార్చారు. గ్రాంథిక-వ్యావహారిక శైలీభేదాలు అన్నిభాషల్లోనూ మామూలేననీ, గ్రాంథికాలనేవి ఆయా జాతుల ప్రాచీన వారసత్వాలనీ, అవి కేవలం తెలుక్కి పరిమితం కావనే వాస్తవం పూర్తిగా మఱుగున పడిపోయింది. అయితే అన్ని ఇతర భాషలవారూ తమ గ్రాంథికాన్నీ, తమ వ్యావహారికాన్నీ కూడా తమ మాతృభాషగానే మనసారా ప్రేమిస్తున్నారు. సర్వసమగ్రంగా అభిమానిస్తు న్నారు. నెత్తిన బెట్టుకుంటున్నారు. బ్రహ్మరథం పట్టుతున్నారు. కేవల గ్రాంథికాభిమానులు గానీ, కేవల వ్యావహారికాభిమా నులు గానీ ఇతర జాతుల్లో కనిపించరు. దురదృష్టవశాత్తు అలాంటివారంతా ఇక్కడే దర్శనమిస్తున్నారు.

౨. వ్యావహారికానికి రకరకాలుగా- తమ అవగాహనకీ, పరిమితులకీ, అవసరాలకీ అనుగుణంగా- అపార్థాలూ, వక్రభాష్యా లూ చెప్పసాగారు. వాటిల్లో కొన్నిటిని పైన పేర్కొనడం జఱిగింది. అన్నింటికంటే ముఖ్యమైన, భాషకి అత్యంత వినాశకరమైన వక్రభాష్యాలు రెండు. మొదటిది- సాహిత్యమంతా, అది ఏ రంగానికి చెందిన సాహిత్యమైనా కానివ్వండి – సామాన్య మానవుడికి అందుబాటైన భాషలోనే ఉండాలనేది. రెండోది- వ్యావహారికమంటే సామాన్య మానవుడికి అందుబాటైన భాష కనుక అతనికి ఇప్పటికే ఏయే పదాలు తెలుసునో ఆ పదాల్లోనే యావత్తు సాహిత్యమూ రచించాలి. కొత్త పదాలు అతనికి అర్థం కావు గనుక రచయితలు ఆ జోలికే పోకూడదు. అంటే తెలుగులో కొత్త పదాలనేవే ఉండకూడదు. వాటిని రూపొం దించడానికి ఎవఱూ ప్రయత్నించకూడదు. అథవా ప్రయత్నించినా ఆ కొత్తపదాలన్నీ ఇప్పటికే బాగా తెలిసిన పాతపదాల కల యికతోనే ఏర్పడినవై ఉండాలి. ఈ రకంగా పాఠకుల పరిజ్ఞానానికీ, రచయితల సృజనాత్మక స్వేచ్ఛ (creative freedom) కీ తామే నిరంకుశంగా ఎల్లలు నిర్ణయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అమల్లోకొచ్చిన ఆంగ్లమాధ్యమ విద్యా విధానప్రభావం ఫలితంగా ఎక్కువమందికి తెలుగు సాహిత్యంతో సంబంధాలు తెగిపోతున్నాయి గనుక ఇప్పుడు వ్యావహారిక పదాలంటే అర్థం ఇంగ్లీషుపదాలే. అందుచేత ఆ పదాలకి తెలుగు సమార్థకాల్ని ఎవఱైనా సూచిస్తే, “అవి వ్యావహారికం కాదనీ, సామాన్య మానవుడికి అర్థం కా”వనీ వంక బెట్టి తిరస్కరించడం జఱుగుతోంది.

పై అభిప్రాయాలలో చాలా తొఱ్ఱలున్నాయి. ఈ వాదాలు భాషకి చేసిన, చేస్తూ ఉన్న నష్టం చాలా గొప్పదీ, అనివర్తనీయమూను (irreversible).

(అ) వీరు చెప్పే సామాన్యమానవుడు ఎవఱో సరైన నిర్వచనం లేదు. సాధారణంగా ఒక రంగంలో నిష్ణాతుడైనవాడు ఇంకో రంగంలో బభ్రాజమానం కావచ్చు. ఏ రంగానికీ చెందనివారు ఎవఱూ లేరు సమాజంలో! కాబట్టి అందఱూ తమ తమ రంగాలకు ప్రత్యేకమైన విశిష్ట పదజాలాన్ని వాడేవారే. ఆ రంగానికి చెందనివారిక్కూడా అర్థం కావాలని వ్రాసేవారెవఱూ ఉండరు. వైద్యుడు వైద్యపరిభాషలో పాఠ్యపుస్తకాలు వ్రాస్తాడు. ఎంజినీరు ఎంజినీరింగ్ పరిభాషలో పాఠ్యపుస్తకాలు వ్రాస్తాడు. ఆయా రంగాలలో కొత్త ఆవిష్కారాలు వెలుగులోకి వచ్చినప్పుడు, లేదా కొత్తపరిభావనలు ముందుకొచ్చినప్పుడు వాటిని వ్యక్తీకరించడానికి కొత్తపదాలు తప్పనిసరిగా కావాలి. ఒకవేళ ఆ కొత్తపదాలు ఒక విదేశీభాషలో ఉన్న పక్షంలో వాటిని సరి కొత్త తెలుగుపదజాలంతో అనువదించుకోవాల్సి వస్తుంది. వ్యావహారికానికి వీరు చెప్పే స్వకపోల కల్పిత అపార్థాల్ని నమ్ము కుంటే ఇదేదీ జఱగదు.

(ఆ) అందుబాటుభాష అంటే ఏమిటి? మన పదపరిజ్ఞానం ఐదేళ్ళవయసప్పుడు ఉన్నట్లు పదేళ్ళ వయసప్పుడు లేదు. పదేళ్ళ ప్పుడు ఉన్నట్లు పాతికేళ్ళప్పుడు లేదు. అది వయసు గడిచేకొద్దీ పెఱుగుతూ పోతుంది. కాబట్టి అర్థం కావడం అనేది సార్వజని కమూ, సార్వకాలీనమూ కాదు. అది వయోవిశిష్టం (age-specific), వర్గ విశిష్టం (class-specific), ప్రస్తావనవిశిష్టం (topic-specific) ప్రకరణవిశిష్టం (context-specific). పాతికేళ్ళవాడి అందుబాటు భాష పదేళ్ళవాడికి అందుబాటు కాదు. అలాగే యాభయ్యేళ్ళవాడి అందుబాటుభాష పాతికేళ్ళవాడికి అందుబాటు కాదు. మనుషులు కాస్త ఎక్కువ తెలుసుకుం దామనే చదువుతారు. మెఱుగైన కొత్త భాషాప్రయోగాలు కూడా ఈ ఎక్కువ తెలుసుకోవడంలో భాగమే. అంతేతప్ప, విష యాన్నీ, దాన్ని వ్యక్తీకరించడానికి ఉపయోగించే భాషనీ వేఱు చేసి మాట్లాడడం సరైన జీవనవేదాంతం కాదు. కనుక విషయ పరంగానూ, వ్యక్తీకరణల పరంగానూ రోజురోజుకూ ఎదగడమే మంచిమనుషుల లక్షణం. మంచి పాఠకుల లక్షణం. వారు అలా ఎదగడానికి చేయూత నివ్వడమే మంచి రచయితల లక్షణం. మెఱుగైన కొత్త పదజాలం ఈ ఎదుగుదలకు విశేషంగా తోడ్పడుతుంది. ఎందుకంటే ఆయా భావాలకి గల పేర్లు స్థూలంగా తెలియడం వేఱు. ఆ భావాల్లోని సూక్ష్మ-సూక్ష్మ తార తమ్యాల్ని సైతం నిశితంగా విచక్షించి వ్యక్తీకరించడం వేఱు. అలా విశిష్టంగా వ్యక్తీరించే నిమిత్తం విశిష్టమైన పదాలు తప్పని సరిగా కావాల్సిందే. వాటిక్కూడా మామూలు రోజువారీ పదజాలాన్నే వాడి తృప్తిపడమని ఇతరుల్ని నిర్బంధించే హక్కు ఎవఱికీ లేదు. ప్రపంచంలో 700 కోట్లమంది మనుషులున్నా సరే, ఒకఱికి ఇంకొకఱు ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాదు. అలాగే పర్యాయపదాలే అయినప్పటికీ ఒక పదానికి ఇంకో పదం ఎన్నటికీ సంపూర్ణ ప్రత్యామ్నాయం కాదు. ఒక పదం బదులు ఇంకో పదంతో సరిపెట్టుకోవాల్సినది పరమసామాన్యులు. విద్యావంతులు కాదు. కాబట్టి కొత్త వ్యక్తీకరణల కల్పన నిరంతరం అఖండ స్రోతస్సుగా కొనసాగుతూ పోవలసిందే.

(ఇ) తెలిసిన పదాల సహాయంతోనే విదేశీపదాల్ని అనువదించాలని భావించడం మఱో పొఱపాటు. ఈ అభిప్రాయం మన వారికే తప్ప ఆ విదేశీపదాల రూపకర్తలకు లేదని గమనించాలి. ప్రతికొత్త పరిభావనకూ ఒక కొత్తపదం అవసరం. తద్విప ర్యాసంగా, వాడుకభాష పేరో, సామాన్యమానవుడి పేరో చెప్పి ప్రతి కొత్తభావాన్నీ పాతపదాలతోనే వ్యక్తీకరించాలని చూస్తే కొంతకాలానికి ప్రతిపదానికీ భాషలో డజనో, అఱడజనో అర్థాలు తయారై భాష మొత్తం దురవగాహంగానూ, దుర్భేద్యం గానూ మారిపోతుంది. చాలా అయోమయంగా ఉంటుంది. ఆ పదాల బదులు విదేశీ పదాల వాడకమే నయమనే పరిస్థితి కూడా తలెత్తుతుంది. కాబట్టి రచయితలూ, పదనిష్పాదకులూ తమ మాతృభాషాపరిజ్ఞానాన్ని పెంచుకోవడం, కొత్త పదప్రయో గాల ద్వారా కొత్త పరిభావనల్ని పాఠకులకి పరిచయం చేయడం ఆవశ్యకం.

(ఈ) వ్యావహారికవాదం పేరుతో భాషాపండితుల్ని దూషించడం, ద్వేషించడం ఈ గత వందేళ్ళల్లో చాలా ఎక్కువైంది. భాష సరిగా రానివాళ్ళనీ, సరిగా నేర్చుకోనివాళ్ళనీ అనవసరంగా గ్లామరైజ్ చేస్తున్నారు. రొమాంటిసైజ్ చేస్తున్నారు. తెలిసిన వాడూ, తెలిసింది చెప్పేవాడూ, సరైన వాడుకలు చేసేవాడూ, తప్పులు సవరించేవాడూ ఈ అసహజమైన వాతావరణంలో విష మయ్యారు. ప్రతి సబ్జెక్టుకూ పండితులున్నప్పుడు, ఆ సబ్జెక్టులకు సంబంధించి వారి మార్గదర్శనాన్ని నిరభ్యంతరంగా స్వీకరిస్తున్నప్పుడు, వాళ్ళెవ్వఱినీ ద్వేషించనప్పుడు భాషాపండితుల్నే ఎందుకు ద్వేషిస్తున్నారు? భాషనీ, దాని నియమాల్నీ, పనితీరునీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారినీ, పెద్దల మార్గంలో సుశిక్షితులైనవారినీ ద్వేషించి భాషని ఎలా ఉద్ధరిస్తారు? ఎంజినీర్లని ద్వేషించి ఆనకట్టలెలా కడతారు? ఏ జాతైనా, దేశమైనా తన భాషాపండితుల్ని గౌరవిస్తుంది. వారి రూపంలో తన సభ్యతనీ, సంస్కారాన్నీ భద్రపఱచుకొని భావితరాల కోసం కాపాడుకుంటుంది. ఇక్కడిలా వారిని అవమానించే కుసంస్కారం ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నట్లు వినలేదు.

(ఉ) వ్యావహారికం పేరుతో మనకి సమకాలీనంగా వ్రాతలో దర్శనమిచ్చే భాష ముప్పాతిక మువ్వీసం గ్రాంథికం నుంచి అరువు దెచ్చుకున్నది, లేదా కాపీ కొట్టినది మాత్రమే. గ్రాంథికంలోని శక్తిమంతమైన వ్యక్తీకరణల్ని వ్యావహారికంలోకి దిగుమతి చేసుకొని వ్యాప్తిచేయగా దాన్ని ఈరోజు మనం వాడుకభాష అంటున్నాం. అంటే గ్రాంథికాన్నే మనకర్థమైనంత మేఱకు వ్యావ హారికమని పిలుస్తున్నాం. అలా వాడుకలోకి రాకుండా పుస్తకాలకే పరిమితమైన ఇంకెంతో శక్తిమంతమైన పదజాలం గ్రాంథికంలో ఉంది. ఆ మిగిలిన గ్రాంథికం కూడా ఇప్పటికీ ఎంతో ఉపయుక్తమే. అలాగే ఏ భావాన్ని కొత్తగా చెప్పాలన్నా, లేదా ఏ కొత్తభావాన్ని అనువదించాలన్నా మళ్లీ గ్రాంథిక పదబంధాలూ, వాడుకలే మనకి శరణ్యమౌతున్న పరిస్థితి ఉంది. ఇలా అడుగడుగునా గ్రాంథికంపై ఇతోఽధికంగా ఆధారపడుతూ దాన్ని ద్వేషించడం సమంజసం కాదనే స్ఫురణ వ్యావహారికవాదులకి ఈనాటికీ లేదు.

(ఊ) కవులూ, రచయితలూ, శాస్త్రవేత్తలూ అన్నాక వారికి సృజనస్వేచ్ఛ (creative freedom) ఉంటుంది. ఉండాలి కూడా. వైవిధ్యం సృజనస్వేచ్ఛకున్న ప్రధానలక్షణం. ఎంతో కొంత నవనవోన్మేషతనీ, వైవిధ్యాన్నీ చూపలేనిది సృజనే కాదు. తన రచన యొక్క విషయాన్నీ, రూపాన్నీ, శైలినీ నిర్ణయించుకునే హక్కు సృజనకారుడిదే. సృజనకారులు సాధారణంగా జన సామాన్యం కంటే ఎక్కువ తెలిసినవారూ, ఎక్కువ అనుభూతి చెందేవారూ, విషయాలకి ఎక్కువ స్పందించేవారూ అయ్యుంటారు. అలా ఎక్కువ తెలిసినవారి భావాల వ్యక్తీకరణకి ఎక్కువసంఖ్యలో ఉన్న పదాలూ, ఎక్కువస్థాయిలో ఉన్న ప్రయోగాలూ అవసరమౌతాయి. పురోగత సంస్కృతుల్లో ఒక భావాన్ని అనేక కోణాల నుంచి రకరకాలుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. “గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి” అంటాడొకడు. “గుండె జాఱిపోయింది” అంటాడు ఇంకొకడు. “గుండె గొంతు లోకొచ్చింది” అంటాడు వేఱొకడు. “గుండెలో ఱాయి పడింది” అంటాడు మఱొకడు. సరే! ఇవి వినగానే అర్థమయ్యే వ్యక్తీకరణలనుకోండి. కానీ కొన్నికొన్ని అలా వినగానే అర్థం కావు. ఎందుకంటే కవి పొందిన అనుభూతి అనిదంపూర్వమైన ప్పుడూ, దాన్ని అంతకు ముందెవ్వఱూ వెలిబుచ్చనప్పుడూ దాన్ని అనుభూతిలోకి తెచ్చుకుని ఆస్వాదించడానికి పాఠకుడికి కొంత సమయం పట్టుతుంది. దానికి కొంత మననమూ, శిక్షణా అవసరమౌతాయి. “ఎందే చిత్తము కందళించు రహిచే నేకాగ్రతన్ బొంది….” అని పోతనగారు వ్రాసినది గ్రాంథికం తెలిసినవారిక్కూడా మొదటిచూపులో అనుభూతిలోకి రాదు. ఆ పద్యాన్ని మళ్ళీ మళ్ళీ చదివి, మననం చేసుకొని, అలా మనసుకి కొంత సన్నద్ధతా, శిక్షణా కల్పించాక అప్పుడు కవి వివక్షి తార్థం ఏంటో అవగతమౌతుంది. అదీ, సదరు చదువరి ఆ పుస్తకం యొక్క లక్షిత పాఠకవర్గానికి (target readership) చెందినవాడైతేనే! అసలు ఆ సబ్జెక్టే అవసరం లేదనేవారి కోసం వ్యావహారికంలో వ్రాసి ప్రయోజనమేంటి? పద్యభావం అవగతమయ్యాక, ఆ వివక్షితార్థాన్ని మామూలు మాటల్లో చెప్పకుండా కవి మంచిపనే చేశాడనీ, ఆయన ఉద్దేశం వాడుకభాష ద్వారా వ్యంజనీయం కాదనీ గ్రహిస్తాం. తద్విరుద్ధంగా, వ్యావహారికవాదం పేరిట సృజనస్వేచ్ఛని హరించి, అన్నీ దారినపోయే దానయ్యలక్కూడా అర్థం కావాలని ఒత్తిడిచేయడం మూలాన “ప్రత్యేకవ్యక్తీకరణలూ, విశిష్టపదప్రయోగాలూ చేసేవారంతా సామాన్యపాఠకుల పట్ల ద్రోహులూ, పాండిత్య ప్రదర్శనాలాలసులూ” అనే ఒక అన్యాయప్రచారమూ, దాన్తో పాటు అవహేళనా ప్రబలాయి.

(ఋ) వీరిలోనే మఱికొంతమంది ఇటీవల బయలుదేఱి “తెలుగుభాష స్వాభావికంగా చాలా సరళమైనదనీ, కొత్త పదాల పేరుతో, లేదా ఆంగ్లపదాల అనువాదాల పేరుతో భాషని సంక్లిష్టంగా, గందరగోళంగా అర్థం కాకుండా మార్చేస్తున్నా”రనీ విమర్శించడం మొదలుపెట్టారు. కొత్త తెలుగుపదాలు బాగాలేవని చెప్పడానికి వారెంచుకున్న ‘శాస్త్రీయ’ మార్గం వాటిని అవహేళన చేయడం. ఎవఱైనా పరాయిభాషవారికి తెలుగు నేర్పడానికి ప్రయత్నించి చూడండి, ఈ భాష స్వతహాగా సరళం అవునో కాదో తెలిసిపోతుంది. వీరు సరళాంధ్రం అంటున్నది కూడా తమకి పుట్టుకతో వచ్చినది కాదనే సత్యాన్ని విస్మరిస్తారు. పుట్టి పెఱుగుతూ ఉన్న క్రమంలో కొద్దికొద్దిగా నేర్చుకుంటూ ఏళ్ళ తరబడి పెంచుకున్న పరిజ్ఞానమే అది. “ఆ కృషినే ఇప్పుడు కూడా కొనసాగించండి కొత్తపదాల విషయంలో” అని చెప్పినప్పుడు “ఎందుకు చేయాలి, అదీ తెలుగు కోసం?” ఇదీ వారి మదిలో మెదిలే ప్రశ్న.

ఇటువంటి ఫిర్యాదులు చేసే చాలామందికి కొత్త ఇంగ్లీషుపదాలు నేర్చుకునే విషయంలో మటుకు ఏ ఫిర్యాదులూ లేవని గమ నించాలి. వాటి విషయంలో ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్’ అయిపోవాలని తాపత్రయపడడం మామూలు. పైపెచ్చు అర్థమయ్యే భాషలోనే అన్నీ ఉండాలని వాదించే వీరవ్యావహారికవాదులు నరమానవుడికి అర్థం కాని ఇనపగుగ్గిళ్ళ ఇంగ్లీషుశైలిలో వ్రాయ డానికీ, మాట్లాడడానికీ ప్రయత్నిస్తూండడం కూడా సర్వసాధారణం. అదేంటో గానీ, అన్ని చిక్కులూ తెలుగుతోనే వస్తాయి. తెలుగుపేరెత్తితేనే బుఱ్ఱ పనిచేయనంటూ మొఱాయిస్తుంది. తెలుగు అంటే చాలు, ఏదో తెలీని ఏవగింపు, కంటగింపు, తిరుగు బాటు భావన వారి హృదయాల్లో చెలరేగుతాయి. ఈ విధంగా వ్యావహారికవాదమనేది మన కాలానికొచ్చేసరికల్లా గుర్తుపట్టలే నంతగా రూపుమార్చుకుని ముసుగేసుకున్న మాతృభాషాద్రోహంగా, ప్రచ్ఛన్నఆంగ్లవ్యామోహంగా, పక్కా అభివృద్ధినిరోధకంగా, ఆచరణలో యావద్భాషా విధ్వంస కార్యక్రమంగా, సకల వారసత్వానికీ పరశురామప్రీతిగా పరిణమించింది.

సమస్య ఏంటంటే, ఎవఱి వ్యక్తిగత కార్యావళులు (personal agendas) వారికున్నాయి. దురదృష్టవశాత్తు తెలుగు భాషా దేవి శరీరంలో ఒక కాలో, చెయ్యో, ముక్కో, మూతో ప్రేమించేవాళ్ళు మాత్రమే మనకు లభ్యమవుతున్నారు. యావత్తు తెలుగుభాషనీ సర్వసమగ్రంగా, ఏకమొత్తంగా ప్రేమించేవాళ్ళు కఱువుగా ఉన్నారు. తెలుగులోకి ఇంగ్లీషుని యథేచ్ఛగా దిగు మతి చెయ్యడాన్ని ఆమోదించాలనీ, అలా ఆమోదించనివారు ద్రోహులనీ, ఛాందసులనీ తిట్టే వ్యక్తి ఒకఱు తగిలారు.

వ్యావహారికానికి వ్యాకరణం లేదా?

కొన్నికొన్ని అభిప్రాయాలు ఎందుకు, ఏ విధంగా ప్రచారంలోకొస్తాయో అర్థం కాదు. అలాంటివాటిల్లో ఒకటి – వ్యావహారికమంటే వ్యాకరణంతో పనిలేని భాష అనీ, లేదా వ్యావహారికంలో వ్యాకరణ నియమాల్ని పాటించనక్కఱలేదనీ, వ్యావహా రికమంటే ఎవఱిష్టమొచ్చినట్లుగా వారు చెలరేగిపోతూ భాషాపరమైన అరాచకాన్ని ఆస్వాదించడమేననీ భావించడం. మానవ నాగరికతలోనూ, మానవ కార్యకలాపాల పరిధిలోనూ నియమాలు లేని రంగం ఒకటి కూడా దర్శనీయం కాదు. మనుషుల్ని బ్రతికించడానికీ, చంపడానిక్కూడా కొన్ని నియమాలున్నప్పుడు మేధాజీవి అయిన మనిషి సాలోచనగా మాట్లాడే భాషకి నియ మాలు లేవనుకోవడం వివేకవంతం అనిపించుకోదు. కాబట్టి వ్యావహారికానిక్కూడా తన నియమాలు తనకున్నాయి. మనకు తెలియకుండానే వాటిని అనుసరించి సంభాషిస్తాం. మన సస్పృహ సావధానంలోకి రానంత మాత్రాన అవి లేవనుకోకూడదు. ప్రపంచంలో మనకు సంబంధించిన ప్రతీదీ మనకు తెలిసి జఱగదు. మన హృదయస్పందన, జీర్ణక్రియల్లాగానే! వ్యావహారిక నియమాలు గ్రాంథిక భాషానియమాల్ని అచ్చుమచ్చుగా అనుసరించేవి కాకపోవచ్చు. కానీ అవీ నియమాలే. ఎవఱైనా వాటిని పాటించి తీఱాలి. అది తమ కోసం, తమ యొక్కా, ఇతరుల యొక్కా సమీచీన అవబోధ కోసం! మనం బళ్ళలో నేర్చుకునే ఇంగ్లీషు నిజానికి ఆ దేశస్థుల అనునిత్య వ్యావహారికమే. మఱి దానికో వ్యాకరణం ఉందని నేర్చుకుంటున్నాం గదా! వ్యావహారిక తెలుగైనా అంతే!

నియమాలన్నీ మార్పుకూ, ప్రగతికీ అవరోధాలనీ, వాటిని సమర్థించేవారూ, బోధించేవారూ మార్పుకూ, ప్రగతికీ శత్రువులనీ భావించే ధోరణి సరికాదు. మనం కోరుకునే మార్పులూ, పురోగతులూ అమల్లోకొచ్చిన తరువాత వాటిక్కూడా నియమాలేర్పడ తాయి. నియమాల్ని అనుసరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మానవచింతనలోని స్వభావసిద్ధమైన క్రమశిక్షణని గౌర విస్తున్నాం. ఆ భాష మాట్లాడే ప్రజానీకాన్నీ, వారి పూర్వీకుల్నీ, వారి మేధావారసత్వాన్నీ గౌరవిస్తున్నాం. ఆ భాషలో కాలపరీక్ష కు తట్టుకుని నిలబడగల హేతుబద్ధ సంప్రదాయాల్ని బ్రతికిస్తున్నాం.

ప్రామాణికత వేఱు – సౌలభ్యం వేఱు (Standards and Convenience)

“వాడుకభాష అంటే సామాన్యప్రజలు వాడేదేననీ, అందులో వినపడే ప్రతి వాడుకా, పదమూ ప్రామాణికమే” ననే వాదన. దీని తో ఏకీభవించడం కష్టం. ఎందుకంటే ప్రామాణికత అంటే అందఱికీ అనుసరణీయమైనది. అది వ్యక్తిగతం కాదు. కానీ సామాన్యప్రజల వాడుక వ్యక్తిగతం.

ఈ పై వాదన కేవలం ప్రామాదికం. మనుషులు సాహిత్యం నుంచీ, ప్రామాణికులైన మేధావుల నుంచి నేర్చుకోవాల్సిన అవ సరాన్నీ, అలా బౌద్ధికంగా ఎదగాల్సిన అవసరాన్నీ ఇది రద్దు చేయబూనుకుంటోంది. ఇది ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని ఆశిస్తోంది. ప్రామాణికాలంటూ ఏమీ లేవని, ఉండవని, ఉండకూడదనీ చెప్పడం దీని అంతరార్థంలా తోస్తోంది.

వాడుకలో ఉన్న ప్రతిదీ ప్రామాణికం కాదు. అదే నిజమైతే ఏ భాషాప్రజలకీ తమ భాషావ్యాకరణం అవసరం లేదు. అలాగే వారికి నిఘంటువులు కూడా అవసరం లేదు. ప్రామాణికం అనేదానికున్న అర్థం బహులోతైనది. ఒక పదానికి లేదా వాడుకకి ప్రామాణికత ఎలా సిద్ధిస్తుందో అర్థం చేసుకుంటే ఆ ప్రక్రియ ముందు వాడుక అనేది ఎంత చిన్న విషయమో మనకి అర్థమవు తుంది. పై అభిప్రాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ప్రతివారూ తన ఇష్టమొచ్చినట్లు వ్రాస్తూ, పలుకుతూ అలాంటి తప్పుల తడిక భాషని తన అధికారబలాన్ని, మందబలాన్నీ, మందిబలాన్నీ ఉపయోగించి తన అజ్ఞానాన్ని వాడుకభాష పేర ఇతరుల నెత్తిన రుద్దుతూ చెలరేగిపోతారు. (ఇప్పుడు జఱుగుతున్నది అదేననుకోండి) ఆ తరువాత కొద్ది వందల సంవత్సరాల అనం తరం ఆ భాషాప్రజలు వెనక్కి తిరిగి తమ భాష వైపు చూసుకున్నప్పుడు వారసత్వం స్థానంలో ఒక అస్తవ్యస్తపు సాంస్కృతిక అరాచకం గోచరిస్తుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత సరైన వ్యుత్పత్తుల (etymologies) ద్వారాను, శబ్దార్థాల యొక్క సమ్యక్ సమన్వయం ద్వారా ను సిద్ధిస్తుంది. ఒకే పదానికి అనేక వ్యుత్పన్నాలు (derivatives) ఉన్నప్పుడు వాటిల్లో ఒకదాన్ని మటుకు బొత్తిగా మిగతా వాటితో సంబంధం లేని అర్థంలో వాడుతూంటే, అలా ఎంతమంది వాడినా సరే, అది ప్రామాణికం కాదు. అది సరిచెయ్యదగ్గ పొఱపాటు మాత్రమే. అలాగే పదం యొక్క అసలు వ్యుత్పత్తినే నిర్మూలించే విధంగా కొంతమంది పలుకుతున్నారనే కారణం చేత ఆ దోషభూయిష్ఠ ఉచ్చారణ ప్రామాణికం కాదు. అది సరి చెయ్యదగ్గ పొఱపాటు మాత్రమే. అలా అసాధురూపాలు (incorrect forms) ప్రామాణికం అవాలంటే ఆ భాషకున్న వేలాది సంవత్సరాల చారిత్రిక నేపథ్యం చాలావఱకు (మళ్ళీ లభ్యం కావడానికి వీల్లేని విధంగా) నశించాల్సి ఉంటుంది.

పదస్వరూపాలకి ప్రామాణికత ప్రామాణిక వ్యక్తుల వాడుక ద్వారా, వారు రచించిన ప్రామాణిక గ్రంథాల ద్వారా వ్యాపిస్తుంది. ఒక్కొక్క జీవనరంగంలోను ఒక్కొక్క విధమైన ప్రామాణికులు ఉంటారు. రాజకీయాల్లో ప్రామాణికుడైన వాడు కళల్లో ప్రామాణికుడు కాడు. కళల్లో ప్రామాణికుడైనవాడు వ్యాపారరంగంలో కాడు. అలాగే భాషాసాహిత్యాలలో ప్రామాణికులైన వ్యక్తులే పదస్వరూపాలకి ప్రామాణికులు. వారు తమ సొంతుగొంతుగా, సొంత అభిప్రాయంగా, సొంత కల్పనగా వినిపించినవాటిల్లో ఏయే వాడుకలు చేశారో అవే ప్రామాణికం. అంతేగానీ దారిన పోయే ప్రతి దానయ్యా చేసే వాడుకలు ప్రామాణికం కావు -వారు ఎంతమందున్నా సరే! భాషాసాహిత్య విషయాల్లో వారు ప్రామాణికుల్ని అనుసరించాల్సినవారే తప్ప, అనుసరణీయ వ్యక్తులు ఎంతమాత్రమూ కారు.

వాడుక ఒక సౌలభ్యం. అంతే తప్ప దానికి ప్రామాణికత లేదు. రెండింటినీ కలిపికొట్టడం, రెండింటికీ అభేదం పాటించడం మాస్ రాజకీయమో, వర్గరాజకీయమో అవుతుంది తప్ప విద్యాపర చర్చ (academic discourse) అనిపించుకోదు. ఒకఱు సోషలైజేషన్ అని పలకలేక సోసలైజేసన్ అంటారు. అది అతని సౌలభ్యం. నాకు తెలిసిన ఒకాయన తొంభై కి టొంబై అనేవాడు. అది ఆయన సౌలభ్యం. అంతే తప్ప అది ప్రామాణికం కాదు.

ఇది ప్రజాస్వామ్యమైనంత మాత్రాన జనం సర్వజ్ఞులు కారు. జనానికి “ఇది తప్పు, ఇది ఒప్పు” అని చెప్పే హక్కూ, బాధ్యతా విషయపరిజ్ఞానులైన మేధావులకి, ప్రామాణికులకీ తప్పనిసరిగా ఉన్నాయి. అంతే తప్ప వారు తమ కంటే తక్కువ తెలిసిన వారిని అనుసరించనక్కఱలేదు. ఎందుకంటే విద్యావంత మేధావులు సాంస్కృతిక నాయకులు. సామాన్యప్రజల తప్పుల్ని సరిదిద్దకపోతే వారు విద్యావ్యవస్థ నుంచి పొందాల్సిన ప్రయోజనాన్ని పొందలేకపోతారు. నమూనా పాత్రలూ (role models), ప్రామాణికాలూ, మార్గదర్శకాలూ లోపించడం చేత వారిలో సృజనాత్మకత కూడా ఎదగాల్సినట్లుగా ఎదగదు.

 అర్థం కానిది ఎవఱికి?

శాస్త్రసాంకేతిక సాహిత్యాన్ని తెలుగువారికి తెలుగులో అందించాలని చెప్పినప్పుడు, “తెలుగులో అందుకు తగ్గ సాంకేతిక పద జాలమేది?” అని ప్రశ్నిస్తారు. “ఇదిగో, ఈ పదాలు మేము సిద్ధం చేశాం” అని చూపించినప్పుడు “ఇవి మా కర్థం కావట్లేదు. ఇవి సద్యఃస్ఫోరకంగా లేవు. ఇప్పటిదాకా ఇంగ్లీషులో మేము అలవాటుపడ్డ పదజాలం వేఱు. వీటిని వింటూంటే మాకు ఆ శాస్త్రం స్ఫురించడం లేదు. (అంటే, మాకు స్ఫురించదు కాబట్టి బహుశా దేశంలో ఎవఱికీ స్ఫురించకపోవచ్చు)” అంటూ ఒక బిక్కమొహాన్ని అభినయిస్తారు. “వీటిని ఈ ఈ అర్థాలలో ఈ క్రమంలో ఈ ఈ సూత్రాల ప్రకారం రూపొందించాం” అని విడమర్చినప్పుడు “మీరు రూపొందించారు సరే! వీటిని వాడేదెవఱు?” అని మళ్లీ ప్రశ్నిస్తారు. “ఇదుగో, ఈ ఈ రచయితలు ఇప్పటికే వాడడం మొదలుపెట్టారు. వీటిని ఇంకా ఇంకా ప్రచురపఱచడానికి త్వరలో అధికారుల సహాయం కూడా తీసుకుంటాం” అని చెబుతాం. అంతే! ఆ మాటతో తెలుగువిరోధుల కోపం నషాళానికి అంటుతుంది. చేసేదేమీ లేక అమాంతం అపహాస్యాలకి దిగుతారు.

ఇలాంటివారిని నమ్ముకుంటే పెళ్ళీ కుదరదు. పిచ్చీ కుదరదు. “తెలుగుపదాల్ని వాడడానికి ఆటంకంగా ఉన్నవి మానవకల్పిత మైన, లేదా స్వయంకల్పితమైన మానసిక అవరోధాలే తప్ప నిజంగా తెలుగులో పదాల కొఱత లేదు” అని ఇందుమూలంగా మనకి అవగతమవుతుంది. శాస్త్రసాంకేతిక రంగాలలో తెలుగుపదాలు లేకపోవడానికీ, ఉన్నా వాడకపోవడానికీ కారణం – తెలుగంటే ఉన్న చిన్నచూపూ, ఆంగ్లమంటే ఉన్న వెఱ్ఱివ్యామోహం- ఇవే యథార్థమైన కారణాలు. తమ వ్యక్తిగత ఇష్టానిష్టా లకు ఆచరణాత్మకత ముసుగు వేస్తున్నారనేది సుస్పష్టం.

ఆంగ్లమాధ్యమాన్ని శతాబ్దాల పాటు జనం మీద రుద్దడం ద్వారా కోట్లాది మందికి చదువు రాకుండా చేసిన దేశం మనది. ఇక్కడ ఎవఱూ మాట్లాడని, ఎవఱికీ మాతృభాష కాని ఇంగ్లీషుకి కృత్రిమంగా ఒక సామాజిక విలువని సృష్టించారు. ఇక్కడ ఈరోజున ఆఖరికి “ఇంగ్లీషే అర్థమవుతుంది, తెలుగు కా”దనే విడ్డూరపు వాదన ఊపందుకోవడం విచారకరం. మన ప్రజలు అక్షరాస్యులు కాని రోజుల్లో వారికి ఫలానా పదాలు అర్థం కావంటే అందుకొక మంచి కారణం ఉంది. కానీ జనాలంతా అక్షరాస్యులయ్యే సమయానికల్లా తెలుగుమాధ్యమాన్ని బళ్ళలోంచి బహిష్కరించారు. అందుమూలాన, విదేశాల జనానికి మాతృభాష మీద ఉన్న పట్టు మన జనానికి లేకుండా పోయింది, ఎంత చదువుకున్నా! అదే, మన ప్రజలందఱినీ తెలుగులోనే విద్యావంతుల్ని చేసి ఉంటే, విద్యారంగంలో తెలుగు మీడియం ప్రాముఖ్యం కొనసాగి ఉంటే అప్పుడు మాతృభాషలో మనవారి పద జాల పరిజ్ఞానం ఇంగ్లీషువారిని మించిపోయి ఉండేది. తమ మాతృభాషాపదాలే తమకర్థం కాకుండాపోయి, వాటికి ఆంగ్లాను వాదాన్ని ఇవ్వమని కోరుతున్న విచిత్రజనాభా పుట్టుకొచ్చేది కాదు. రంగులూ, అంకెలూ, జంతువులూ, పిలుపులతో సహా అన్ని పదాల్నీ ఇంగ్లీష్ నుంచి అరువుదెచ్చుకుంటూ ఒక నాసిరకం తెలుగు మాట్లాడే పదదారిద్ర్యపు తరం ఉద్భవించేది కాదు. ఈ రకంగా, ఒకపక్కన దేశమంతా వేలాది విద్యాలయాలతో దేదీప్యమానమై వెలిగిపోతూండగా, మఱోపక్కన విరోధాలంకా రంలా మన మాతృభాషానిరక్షరాస్యత మాత్రం యథాపూర్వంగా కొనసాగుతోంది.

మనం ఇప్పుడు వ్రాస్తున్న తెలుగు చాలావఱకు మన ప్రాచీనులకి (ఈ అర్థాల్లో) తెలీదు. నిజానికి ఇదొక కొత్త తెలుగు. ఆంగ్లం తో పోటీపడే ప్రక్రియలో భాగంగా, గత వందా-ఇఱవయ్యేళ్ళుగా మనం ఈ తెలుగుకి కొత్తపదాలు కల్పించుకుంటూ వాటిని వ్యావహారికంలోకి జతచేర్చుకుంటూ ఈ స్థాయికి అభివృద్ధి చేశాం. ఆ కృషినే ఇప్పుడు కూడా కొనసాగించడానికి అభ్యంతర మేముంటుంది? ఇంగ్లీషుపదాలు చాలుననీ, వాటికి తెలుగు సమానార్థకాల్ని సృష్టించే పనిలేదనీ మన ముందుతరాల తెలుగు వాళ్ళు అనుకుని ఉంటే ఈపాటికి తెలుగుభాష యావత్తూ మరణించి ఉండేది. ఎందుకంటే ఆంగ్లపదాల్ని అనువదించకుండా అలాగే వాడితే భాషలో ఏ వాక్యంలోనూ తెలుగు ఉండదు. అలాంటి తెలుగు మాట్లాడ్డం కన్నా ఇంగ్లీషు మాట్లాడ్డమే సులభం గా ఉంటుంది. అందుచేత జనం తెలుగుని పూర్తిగా వదిలేస్తారు. స్వకీయత (originality) లేని భాష ఎవఱికీ అవసరం లేదు. కొత్తపదాల్ని సృష్టించలేని స్తబ్ధావస్థకి చేఱుకున్న భాషలు వాడుకలోని పదజాలాన్ని సైతం కోల్పోతాయి. ఎదుగుదలే జీవితం (Growth is life). ఆ ఎదుగుదల ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే అంతిమక్షణాలు ఆసన్నమవుతాయి.

చనిపోయిన మనిషినైనా బ్రతికించగలమేమో గానీ, వ్యవహారదూరమైన భాషల్నీ వాటిల్లోని పదాల్నీ ఎట్టిపరిస్థితుల్లోనూ పున రుజ్జీవింపజేయలేమనీ, అవి శాశ్వతంగా పోయినట్లేననే కఠోరవాస్తవాన్ని తెలుగువారు గుర్తించే రోజు శీఘ్రమే రావాలి. సమకాలీనంగా సాంకేతిక విద్యలో తెలుగుకు స్థానం లేదు. మన ఎంజినీరింగ్ కళాశాలల్లో పాఠాలన్నీ ఇంగ్లీషులోనే జఱుగు తాయి. కనుక ఆ సాంకేతిక పదాలకు తెలుగు సమార్థకాల్ని సృజించాల్సిన ఆవశ్యకత వారికి లేదు. కానీ భవిష్యత్తులో అవే సబ్జెక్టుల్ని తెలుగులో చెప్పాల్సివస్తే మాత్రం తెలుగుపదాలు కావాలి. అర్థం కావడం అనేది ఒక కాలానుగతమైన ప్రక్రియ.

పుడుతూనే మనకు ఏదీ అర్థం కాదు. అందఱికీ అర్థం అవుతాయని చెబుతున్న ఇంగ్లీషు పదాలు కూడా శిక్షణాప్రక్రియలో నేర్చుకున్నవే. పుడుతూనే నేర్చుకున్నవి కావు. మన పదజాల పరిజ్ఞానం వయసుతో పాటు పెఱుగుతూ పోతుంది. ఆ పెఱిగే పదజాలంలో తెలుగు ఎందుకు ఉండకూడదు? ఇంగ్లీషు పదాల పరిజ్ఞానాన్ని మాత్రమే ఎందుకు పెంచుకోవాలి? మన వర్ధ మాన పదజాలంలో తెలుక్కి ఎందుకు స్థానం ఉండకూడదు?

కాబట్టి కొత్త తెలుగుపదాలు జనానికి అర్థం కావనే వాదాన్ని మనం అంగీకరిస్తే దాని సారాంశం ఏమౌతుందంటే -

౧. తెలుగులో ఏ శాస్త్రానికి సంబంధించీ, ఏ విధమైన సాంకేతిక పదజాలమూ ఉండకూడదు. డు,ము,వు.ల్లాంటివి మాత్రమే

ఉండాలి. ఇంగ్లీషుని తెలుగులిపిలో వ్రాస్తే అదే తెలుగు.

౨. ఉన్నా అది అందఱికీ అర్థం కాకూడదు. (ఎందుకంటే వాళ్ళకు ఏది అర్థం కావాలో ఏది కాకూడదో మనం ముందే

నిర్ణయించేశాం. అంతకు మించి వాళ్ళకు ఇంకేమీ అర్థం కాకూడదు)

౩. తెలుగులో సాంకేతిక పదజాలాన్ని ప్రచారం చేయకూడదు (ఎందుకంటే మేము ఇదివఱకే ఒక విధమైన ఇంగ్లీషు

 పదజాలాన్ని ప్రచారం చేసేశాం. దానికి మీరు అడ్డం రావద్దు)

౪. కాబట్టి తెలుగులో సాంకేతిక శాస్త్రాలేవీ వద్దు. అవన్నీ ఇంగ్లీషులోనే ఉండాలి.

౫. ఆ విధంగా తెలుగులో సాంకేతికపదాలూ, సాంకేతిక పదాలూ లేకుండా చేస్తాం కనుక తెలుగు పొట్టపోసుకోవడా నికి పనికి రాదు. పోనివ్వండి. మాకు ఇంగ్లీషుంది.

౬. తెలుగు మనకు పొట్టపోసుకోవడానికి పనికిరాదు కనుక మనం అసలు అది మాట్లాడొద్దు. నష్టమేముంది?

ఇంత కథ ఉంది.

వ్యావహారికం అంటే అర్థం – ఆంగ్లమాధ్యమ జనాల సంకుచిత అవగాహనకి అనుగుణంగా యావత్తు తెలుగుభాషనీ అంతం చేయడం కాదు. ఈమాత్రం ఆంగ్లమాధ్యమం గిడుగువారి కాలంలో కూడా ఉంది. జనానికి అర్థం కావడం అంటే కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్థమవుతున్న భాషలోనే కొత్త పరిభావనల్నీ, తత్సంబంధిత పదాల్ని మిశ్రమం చేయడమని!

ఇంకో కోణం : అచ్చతెలుగువాదం

ఇదిలా ఉండగా, ఆర్య-ద్రావిడ జాతివాదాల్ని గ్రుడ్డిగా నమ్మేవారు కొందఱున్నారు. అలా నమ్ముతూ, వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు శాస్త్రీయ చింతనాధారని పరిపుష్టం కావించిన సంస్కృతాన్ని వారు పరాయిభాషగా పరిగణిస్తారు. ప్రతిదీ అచ్చ తెలుగులోనో, తెలుగు మాండలికాల్లోనో, పచ్చివ్యావహారికంలోనో ఉండాలని వారంటారు. ఈ వాదాన్ని కూడా యథా తథం గా ఆమోదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచిన చరిత్రని రద్దుచేసి పారెయ్యలేం. ఇప్పటికే భాషలోకి వచ్చిన పదాల్నీ, సంప్రదాయాల్ని వెళ్ళగొట్టలేం. ఎట్టి పరిస్థితుల్లోను కాలం వెనక్కి నడవదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి. తప్పదు. కానీ ఆ క్రమంలో ఇలాంటి హఠాన్ నాటకీయ పరిణామాలు మట్టుకు ఎంతమాత్రమూ పనికిరావు. అలాంటివాటికి దిగితే మనం యావత్తు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్నీ తరువాతి తరాలకు అర్థం కాకుండా చేసినవారమవుతాం. పాత తెలుగు పుస్తకాలూ, పాటలూ, పద్యాలూ, కథలూ తరువాతి తరాలకు అర్థం కావాలి. అలా అర్థమయ్యేలా మన విద్యావిధానమూ మనం రూపొందించే పదాలూ ఉండాలి. మన విద్యావిధానం గతానికీ భవిష్యానికీ వారధిగా పనిచేయాలి. సంస్కృతాన్ని పరాయిభాషగా చూసే ధోరణి సమీచీనం కాదు. అది పూర్తి అవాస్తవికమైనది. దాన్నొక ఊహాలోకంగా అభి వర్ణించడానికి నేను సంకోచించను. సంస్కృతం తెలుక్కి కన్నతల్లి కాకపోవచ్చు గాని పెంపుడుతల్లి మాత్రం అవును. సవతితల్లి మట్టుకు కానేకాదు. మన జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. ముస్లిములకి అరబ్బీ ఎంతటి పవిత్రభాషో హిందు వులకు సంస్కృతం కూడా అలాంటిదే. వారికి సంస్కృత సంపర్కం అత్యంత సహజమైనది. వారికి ఆ భాషతో దైనందిన అవస రాలు ఉన్నాయని మఱువరాదు.

1. ‘అర్థం కావడం’ ఒక్కటే మన కృషికి కొలబద్ద కాకూడదు. భాషాసాహిత్యాలనేవి ఏ యుగంలోనూ ఆ కొలబద్ద ననుసరించి వర్ధిల్లినవి కావు. ఇంగ్లీషులో సైతం నూటికి 99 పదాలు అది మాతృభాషగా గలవారిక్కూడా అర్థం కావు. అంతమాత్రాన ఆ భాషలో కొత్తపదాల సృష్టి ఆగిపోలేదు. ప్రతి కొత్తప్రచురణ నాటికీ ఆంగ్లనిఘంటువుల రాశి పెఱక్కుండా పూర్వపరిమాణం దగ్గఱే స్తంభించిపోవట్లేదు. ఇప్పుడు అర్థమౌతున్న పదాలు కూడా గాల్లో తేల్తూనో, కలలోనో జనం దగ్గఱికి రాలేదు. ఈ అర్థం కావడం వెనుక కొంత ప్రయత్నం ఉంది. కొంత శిక్షణ ఉంది. కొంత ప్రచార ప్రక్రియ ఉంది. ఉండాలి కూడా.

2. అర్థం కావడం అనేది- ఒకఱు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారు? ఏ వృత్తి/ వ్యాపార రంగానికి చెందిన వారు? ఎంతవఱకు చదువుకున్నారు? ఏ విధమైన అభిరుచి గలవారు? మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందు చేత అర్థం కాకపోవడం అనేది ఆ అర్థం కానివారి లోపమే తప్ప పదప్రయోగంలోని లోపం కాదు.

3. కొత్త పదాలు కల్పించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కొత్త పదాలు నేర్చుకోమని కూడా ప్రోత్సహించాలి.

4. భాషలో పదాలు ఎల్లప్పుడూ అంతకు ముందున్న పదాల నుంచే పరిణామం చెందుతాయి. లేనిది ఎక్కణ్ణుంచీ రాదు. పదం మీద పదం పేఱుకుంటూ (pile up) పోతుంది. అయితే పేర్చేవారు కావాలి. ఆ పేర్చేవారికి అంతకు ముందు పేర్చబడ్డ పదాలూ, అవి పేఱుకున్న విధానం తెలిసి ఉండాలి. అలా తెలిసినవారు ఎంత ఎక్కువమంది ఉంటే అంత తొందఱగా భాష అభివృద్ధి చెందుతుంది.

5. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతిక పదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవఱికీ అర్థం కాని పదాలే. వ్యకాలు (వ్యక్తిగత కలనయంత్రాలు అంటే PCలు) జనం చేతుల్లోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం Hard disk అనేది సాధారణ ఆంగ్లే యులక్కూడా హాస్యాస్పదమైన పదమే. మనం కోరుతున్నదల్లా “తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్పదమైనవే” అనే ఈ మూఢ విశ్వాసం నుంచి బయటపడమనీ, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమనీ! కొత్త తెలుగుపదాల్ని వాడుతున్న కొద్దీ నవ్వురావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ, వాడుతున్నకొద్దీ తెలుగు పదాల క్రమ బద్ధతనీ, నిర్మాణాన్నీ జనం ఆస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులో కూడా గౌరవనీయమైన పదజాలం (vocab-ulary) విస్తారంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క మౌలిక స్వభావాన్నీ, స్వాతంత్ర్యాన్నీ నిలబెట్టాలి. మన భావదారిద్ర్యానికీ, మాతృభాషాపరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషుపదాలతో అతుకు వేసుకున్నంత మాత్రాన గౌరవం పొందుతా

మనుకోవడం ఒక భ్రమ. ఆ సదరు “గౌరవనీయ పదాలు” కూడా మళ్ళీ మళ్ళీ అందఱూ వాడడం మూలాన కేవలం ఒక్క తరంలోనే అగౌరవనీయాలవుతాయి. అప్పుడు మళ్ళీ మన గౌరవనీయ పదాల వేట యథామామూలే. గతంలో ఎన్నోసార్లు అలా జఱిగింది.

6. స్వకీయత (originality) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. ఆంగ్లపదాలు ఆంగ్లేయుల స్వకీయతకి నిదర్శ నం. మఱి ఒక స్వతంత్ర, విభిన్న జాతిగా మన స్వకీయత సంగతేంటి? భావాలతో పాటు పదాల్ని కూడా అనుకరించి తీఱా ల్సిందేనా? అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగుపదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాలతోనే లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు వ్రాసేసరికి “దీని బదులు నేరుగా ఇంగ్లీషులోనే వ్రాయడం నయం” అనిపిస్తుంది. ఇక తెలుగెందుకు? “తెలుగు పదాలు అవసరం లేదు” అనే వాదన ఇంకా ముందుకెళ్ళి “అసలు తెలుగే అవసరం లే”దనే వాదనకి దారితీస్తుంది. ఇప్పుడు జఱుగుతున్నది అదే.

7. ఈత అన్నాక నీళ్ళలోకి దూకి నేర్చుకోవలసిందే. భాష సర్వాంగసుందరంగా అభివృద్ధి చెందాకనే అందులో సాంకేతికాం శాలు రాస్తానంటే కుదఱదు. ముందు రాస్తూ, రాస్తూ, ఆ క్రమంలో కొత్తపదాల్ని కనిపెడుతూ వాడుకలోకి తెస్తూంటేనే భాష అభివృద్ధి చెందుతుంది. సాహిత్యభాష సాంకేతిక భాషగా పరిణామం చెందుతుంది. ఇంగ్లీషు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

మఱో కోణం : తెలుగులో పదాలు లేవనే వాదన

“తెలుగులో పదాలు లేవు. లేదా తెలుగులోకి అనువదించలేం” ఇది సరైన అభిప్రాయమా? లేక “మనకు తెలుగు భాషలో సరైన శిక్షణ లేదు, ఇంగ్లీషులో ఉన్నంత” ఇది సరైనదా? ఇంగ్లీషుభాషలో ప్రస్తుతం కనిపిస్తున్న ఇంగ్లీషు పదాలన్నీ ఆ భాష పుట్టినప్పటినుంచే అందులో ఉన్నాయా? మధ్యలో ఆ పదజాలాన్ని పెంచడానికి ఆంగ్లమేధావులు చేసిన మానవప్రయత్న మేమీ లేదా? ఆ పదాలు హఠాత్తుగా ఆకాశంలోంచి ఊడిపడ్డాయా?

మనకి తెలుగులో ఉన్న పూర్వశిక్షణ మనచేత ఈ భాష గొప్పదనాన్ని ప్రశంసింపజేయడానికి సరిపోవడం లేదు. కొత్త తెలుగు పదాల్ని కల్పించడానికి చాలడం లేదు. ఇంగ్లీషుని అనువదించను సహాయపడలేకపోతోంది. మనకి పాఠశాలల్లో తెలుగు నేర్పుతున్న విధానం- మనం పదో తరగతిలో భాషాపరంగా ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలోనే జీవితాంతం మనల్ని ఉంచుతోంది. తెలుగుపాఠ్యాల బోధనలో ఏ విధమైన కొత్త పద్ధతులూ చోటుచేసుకోవడం లేదు. ముప్ఫయ్యేళ్ళక్రితం ఎలాంటి పాఠాలూ, పాఠ్యక్రమమూ, బోధనాపద్ధతీ, మూల్యాంకన విధానమూ ఉండేవో సరిగ్గా వాటినే ఏ మార్పూ లేకుండా కొనసాగి స్తున్నారు. తతిమ్మా అన్ని సబ్జెక్టులలోనూ విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్నారు. అథవా, తెలుగుసబ్జెక్టులో ఏమైనా మార్పులు తెచ్చినా అవి ఈ భాషని నాశనం చేసే దిశలో ఉంటున్నాయి తప్ప బాగుచేసే దిశలో ఉండట్లేదు. మనం ఈ భాషాపరమైన స్తబ్ధత (linguistic stagnation) కి అలవాటుపడి “ఓహో తెలుగంటే ఇదే, ఇంకేమీ లే”దనుకుంటున్నాం. తెలుగు సాహిత్య పఠనం పేరుతో మనం అనంతర జీవిత దశాకాలంలో చదివేదంతా వ్యావహారికం, లేకపోతే పచ్చివ్యావహారికం.

ఒకపక్క ఇలా తెలుగులో స్తబ్ధం (stagnate) అయిపోయిన మనం మఱోపక్క మన ఆంగ్లపరిజ్ఞానాన్ని మాత్రం రోజు రోజుకూ పెంచుకుంటున్నాం, ప్రయత్నపూర్వకంగా! మన బహుభాషాపరిజ్ఞానం మన భాషని ఉద్ధరించడాని క్కాక దాన్ని కించపఱచడానికి దుర్వినియోగమవుతోంది. కొన్నికొన్ని ప్రారంభిక తభావతులు చోటు చేసుకున్నప్పటికీ ప్రయోగశీలతని సాదరంగా ఆహ్వానించాల్సి ఉంది. ప్రయోగాలు చేస్తూ చేస్తూ పోగా వాటిల్లోంచి కొంత మంచి పుట్టే అవకాశం ఉంది. ఒక కొత్తప్రయోగం నచ్చకపోతే ప్రత్యామ్నాయాలు ఆలోచించే స్వేచ్ఛ మనకెప్పుడూ ఉంది. అసలు ప్రయోగాలే చేయొద్దనడం సరైన ధోరణి కాదు.

జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ (constant learning process). కొత్తపదాలు సృష్టి అవుతున్నకొద్దీ వాటిని మన పదజాల పరిజ్ఞానంలో భాగంగా చేసుకోక తప్పదు. అది తెలుగైనా, ఇంగ్లీషైనా! అయితే ఇక్కడ ఆచరణాత్మకంగా జఱుగుతున్నది ఏంటంటే– ఆ అభ్యసన ప్రక్రియలో ఇంగ్లీషు ఉండొచ్చుగానీ తెలుగు ఉండకూడదు అని వాదించడం. తెలుగు మాత్రం స్తబ్ధం అవ్వాలి, ఎందుకంటే మనం స్తబ్ధం అయ్యాం కనుక!

ఇహపోతే అర్థం కావడం. ఏ పదానికీ స్వతహాగా సద్యఃస్ఫోరకత (spot understandability) లేదు, తెలుసుకుని, పలికి, అలవాటుపడితే తప్ప! వాడుతూ ఉంటే అంతా వ్యావహారికమే. వాడకపోతే అన్నీ గ్రాంథికమే. మాతృభాష కానటు వంటి ఇంగ్లీషులో ఏ కొత్తపదం వచ్చినా ఆబగా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న మనం తెలుగు దగ్గఱికొచ్చేసరికి ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది తెలుగు తప్పా? మన తప్పా? ఆలోచించాల్సి ఉంది. ఏ కారణాన్నో ఇక్కడ చాలా ప్రతి ఘటన (resistence) ఉన్నది, కొత్త పదాల్ని కల్పించుకోవడం పట్ల, వాటిని వాడడం పట్ల! ఇంగ్లీషుపదాల్ని యథాతథంగా దిగుమతి చేసుకోవడాన్ని అభ్యుదయంగా భ్రమించే వాతావరణం ఉంది.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBIMOBI

Posted in 2014, ఏప్రిల్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.