cover

కర్నాటకలో నా తిరుగాట (2)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

(తన ఇటీవలి కర్నాటక పర్యటన గురించి రచయిత, అనువాదకుడు శాఖమూరు రామగోపాల్ రాసిన యాత్రా వ్యాసం చివరి భాగం ఇది)

మరవంతె బీచ్

మరవంతె బీచ్

08-11-2013: ఈ రోజున గొప్పయాత్ర చేసి వద్దాం అని కుటుంబసభ్యులతో చెప్పి నన్ను వేగిరమే సిద్ధంకండి అని రావుగారు తొందరపెట్టారు. రావుగారి అల్లుడికి కారొకటి ఉంది. అది నలుగురికి మాత్రమే సరిపోతది. పరివారంతో కల్సి ఒక విలాసవంతమైన వాతానుకూలిత పెద్దకారులో (బాడుగది) డ్రైవర్‌తో సహా ఆరు మందిమి ఉదయం 9.30 తర్వాత మంగళూరు నుంచి గోకర్ణంకు బయల్దేరాం. మంగళూరు-ఉడిపి-కోట-మరవంతె-కుందాపుర-భట్కల్-మురుడేశ్వర-హోన్నావర-కుమటా మార్గంగా వెళ్ళే జాతీయ రహదారి నుంచి గోకర్ణంకు చేరేదుంది. పోతున్న ఆ మార్గంలో ‘కోట’లో ఉండే సుప్రసిద్ధ (దివంగత) కోట శివరామ కారంత గారి గృహం చూసాం. కోట శివరామ కారంతగారి సాధన గురించి చెప్పాలంటే అల్పుడనైన నాకు అసాధ్యంగా ఉంటుంది. కుందాపురలో భవ్యమైన హోటెల్ ఒక దాన్లో భుజించాం. కుందాపుర దాటిన తర్వాత ‘మరవంతె’ బీచ్ వస్తది. బీచ్ ఒడ్డునే జాతీయ రహదారి, రహదారి చెంతనే సమానాంతరంగా సముద్రంలో కల్సే నది ఒకటి, ఆ నదికి ఆవలివైపు కొంకణ రైలు మార్గం…. నయనమనోహరంగా ఉండే వీట్ని మనం చూడొచ్చు. మరవంతె బీచ్ చెంత రహదారికి ఆనుకొని ఒక భవ్య దేవళం ఉంది. క్షేమంగా ఎక్కడినుంచో వచ్చి చేరాం అనే భావంతో ప్రయాణికులు దేవాలయం వద్ద కొంచెం సేపు ఆగి దైవదర్శనం చేసుకొంటారు. రావుగారి మేనల్లుడు నది చెంతనున్న గ్రామంలోని యువతిని వివాహమాడాడని రావుగారు తెల్పారు. మరవంతె బీచ్ దాటిన తర్వాత ఉత్తర కన్నడ జిల్లాలోని భట్కల్ పట్టణం ద్వారా జాతీయ రహదారి వెళ్తుంది. ఉత్తర భారతంకు సరకు రవాణా చేసే ఎన్నో ట్రక్కులు తిరువనంతపురం నుంచి కొంకణ రైలు మార్గంలో గూడ్సుబండి ఎక్కి (రైళ్ళలో) ప్రయాణీకుల మాదిరి ఆ మార్గంలో వెళ్ళడం చూసిన నాకు ఆశ్చర్యమేసింది. ఉత్తర భారతంకు ఈ విధంగా సరకు రవాణా ఉన్నందున పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని రావుగారు నాకు బోధపరిచారు. భట్కల్ పట్టణంలో శత్రుదేశంకు చెందిన ఉగ్రవాది సంస్థలు తమ కార్యకలాపాల్ని చేస్తున్నవని తెల్పారు. నరహంతక ఉగ్రవాదైన యాసిన్ భట్కల్ ఈ పట్టణానికే చెందినవాడని తెల్పారు రావుగారు. భట్కల్ దాటిపోతుంటే మురుడేశ్వర క్షేత్రం కనబడుతది. కుమటాకు చేరాం. కుమటాలో ‘శ్రీధర బళిగార’ను కల్సేదుంది. ప్రొఫెసర్ శ్రీధర్ గారికి మా రాకను ముందుగానే తెలియపర్చాం. ప్రొఫెసర్ గారు కుమటాలోని సర్కిల్ వద్ద కొచ్చి మమ్మల్ని తమ ఇంటికి తోడ్కొని వెళ్ళారు. మా మధ్య సాహిత్య చర్చ రసవత్తరంగా జరిగింది. అనువాద క్రియలో మరింతగా నిమగ్నమవ్వండి అని నాతో ప్రోత్సాహక మాటలు పలికారు. వారి ఇంట్లో సాయంకాల టిఫిన్ ఆరగించి శ్రీయుతల నుంచి వీడ్కోలు పొంది చివరి మజిలి అయిన గోకర్ణంకు బయల్దేరాం. జాతీయ రహదారి నుంచి గోకర్ణం వెళ్ళేందుకు ఒక మలుపు ఉంది. చీకటి పడినందున మార్గసూచికను గమనించకనే బెళకేరి దాటాం. బెళకేరి వద్ద గాలిజనార్ధనరెడ్డి అక్రమ కేంద్రం ఉంది. రెడ్డిగారు భవ్యంగా తన కార్యకలాపాల్ని సాగించుతున్నప్పుడు ఏర్పాటు చేసుకొన్న గృహం ఒక దాన్ని దాటుతుంటే నాకు చటాల్నే గుర్తుకొచ్చింది దారి తప్పి ముందుకే సాగుతున్నామని. దరిదాపుగా అంకోలా వరకు చేరామని గమనించుకొన్న మీదట తిరిగి మరలా 20 కి.మీ వెనక్కి వచ్చి గోకర్ణం చేరే మలుపుకు చేరాం. రాత్రి ఎనిమిది గంటలకు గోకర్ణం చేరాం. రావుగారు తమ కుటుంబ నేపథ్యంలో కొన్ని వైదిక కార్యాలు చేసేదున్నందున ముందుస్తుగానే విడిదితోపాటు పూజాకార్యక్రమాలు చేసే భట్టు (వైదిక పురోహితుల్ని ఇక్కడ భట్టుగా పిలుస్తారట) గారి తోడ్పాటు తీసుకొన్నారు. స్థళీయులైన భట్టుగారి భవంతి విశాలంగా ఉంది. ఆ రాత్రి మేమంతా భట్టుగారు భవంతిలోనే వారి మహిళలు చేసిన వంటకాలనుంచి భుజించి అక్కడే విడిది చేసాం.

gourish kaikini

గౌరిష్ కాయ్కిణి

09-11-2013: ఈ రోజు ఉదయ కాలమంతా దైవదర్శనం, పూజా కార్యక్రమాలలో మునిగాం. గోకర్ణ క్షేత్రంకు ఆనుకొనే అరేబియా సముద్రం ఉంది. సముద్ర తీరం ఓంకార రూపంలో ఉంది. సముద్రతీరంకు వెళ్తుంటే గౌరీశ్ కాయ్కిణి, జయంత్ కాయ్కిణి గార్ల (తండ్రీ కొడుకులు) వారసత్వ ఇల్లు చూసాం. ఉత్తర కన్నడ జిల్లా కర్నాటక ప్రాంత రచనకు ముందు బాంబే ప్రెసిడెన్సిలో ఉండేది. గౌరీశ్ కాయ్కిణి తన జీవితమంతా గోకర్ణంలోనే ఉండి కన్నడంలో శ్రేష్ఠ రచనలు చేసారు. ఆయన భార్య కూడా అక్కడే ఉద్యోగం చేసారు. వారి కుమారుడైన జయంత్ కాయ్కిణి సాహితీవేత్తగా పేర్గాంచి బెంగళూరులో ఉంటున్నారు. వారెవరూ లేనందున ఇల్లు పాడుబడియుంది. మెయిన్ రోడ్ నుంచి ప్రక్కకు పోయే ఒక దారికి గౌరీశ్ కాయ్కిణి వీధిగా పంచాయితి వారు నామకరణం చేసిన శిలా ఫలకంను చూసాం.

సముద్ర తీరంలో స్నానాలు అయినమీదట, తీరానికి అనుకునే ఉన్న కొండ వద్దకు వెళ్ళాం. అక్కడున్న ఒక కొలనులో 300 అడుగుల నుంచి ధారగా పడుతున్న నీళ్ళలో రావుగారు మరలా తనివితీరా స్నానం చేసారు. ఆ నీళ్ళలో ఔషదగుణాలున్నవని తెల్పారు రావుగారు. ఆ పిమ్మట మహాబలేశ్వరుడి దేవళంకు వెళ్ళాం. కాశీవిశ్వేశ్వరుడి దేవళం తర్వత అంత విశిష్ఠమైన దేవాలయం (క్షేత్రం) ఇది అట. ఈ దేవళంలో శివుడి ఆత్మలింగం భూస్థాపితమైన దాన్ని, భక్తులతో పాటు మేమూ స్పృశించి తెల్సుకోగలిగాం. బాల గణపతి నుంచి తనకు కలిగిన ద్రోహానికి కుపితుడైన రావణబ్రహ్మ గణపతి నెత్తిని మొట్టినందువల్ల, సొట్టపడిన గణపతి శిరస్సును మనం తడిమి చూసుకోవచ్చు! ఆ దేవళంలో జరుగుతున్న పూజాకార్యక్రమాలలో పాల్గొన్నాం. గోకర్ణం గోవా చెంతనున్నందున విదేశీయులెందరో జట్లు జట్లుగా తిరుగుతున్నారు. దేవాలయ వీక్షణం అయిన తర్వాత భట్టుగారు చేయబోయే క్రతువులో పాల్గొన్నారు రావుగారి కుటుంబ సదస్యులంతా. ఇదంతా రావుగారి వైయక్తిక పూజా కార్యక్రమం. పూజ ముగిసిన తర్వాత, భట్టుగారి కుటుంబ మహిళలు మడి పద్దతితో వండి వడ్డించిన భక్ష్యాల్ని భుజించాం. గోకర్ణంలో పూజాదికాలు మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగినవి. ఇక ఆ తర్వాత భట్టుగారి నుంచి సెలవుపొంది కొల్లూరు క్షేత్రంలో ఉండే మూకాంబికా దేవాలయంకు పయనమయ్యాం.

జాతీయ రహదారి నుంచి తిరిగి వస్తుండగా బైందూరులోని ఒక మలుపు వద్ద టర్నింగ్ తీసుకొని 28k.m దూరానుండే కొల్లూరు గ్రామంలోని మూకాంబికా క్షేత్రంకు చేరాం. అక్కడుండే వసతి గృహంలో పెద్దగది ఒకటి తీసుకొని దేవి దర్శనంకని వెళ్ళాం. సుమారుగా గంట వేచియున్న తర్వాత దేవి దర్శనం లభించింది. పూజాకార్యక్రమాలన్నీ మళయాళీ రీతులలో జరుగుతున్నాయి. వివిధ రకాల వాద్యఘోషలు మిన్నంటుతున్నవి. దేవాలయం నుంచే భక్తులకని నిర్వహింపబడే ఉచిత భోజనాలయంలో భుజించి వసతిగృహానికి చేరాం.

mookambika

మూకాంబికాదేవి ఆలయం

10-11-2013: వసతి నిలయంలో వేకువనే లేచి ఊరు చూద్దామని బయల్దేరాను ఒంటరిగా. మూకాంబికాదేవి మూలంగా చిన్న ఊరుగా విలసిల్లుతుంది కొల్లూరు. ముఖ్య వీధిలో నడుస్తుండగా, ఆ జాములోనే భక్తులు తడిబట్టలు నుంచి నిష్ఠగా దేవి దర్శనానికి వెళ్తున్నారు. బస్ నుంచి దిగిన బృందం ‘ఆరు’ ‘ఆరు’ ఎక్కడ అని నన్ను అడిగారు. నాకు గజిబిజి. ‘ఆరు’ అంటే ఏమిటనేది తెలియక మూగబోయా. కొన్ని క్షణాల తర్వాత ‘మున్నార్, పెరియార్’ గుర్తుకొచ్చినది. మళయాళ, తమిళ భాషలలో ‘ఆరు’ అంటే నది కదా! నేను కూడా ఆ భక్త బృందంతో కల్సి ‘ఆరు’(నది) వద్దకు వెళ్ళాను. ముంజాములో నదిలో భేదభావాలు పాటించకనే స్నానాలు చేస్తున్నారు భక్తులు. శుచిస్నానం అయిన మీదట దేవి దర్శనంకు బయల్దేరుతున్నారు. స్వర్గీయ యమ్.జి.ఆర్ నుంచి ఇళయరాజా, క్రికెటర్ శ్రీశాంత నాయర్ వరకూ… ప్రముఖులెందరో ఈ దేవికి పరమ భక్తులట. కొన్ని మళయాళ కుటుంబాలైతే మాసంలో రెండు పర్యాయాలు దేవి దర్శనంకని వస్తుంటారట. దాదాపు ఎనభై శాతం భక్తులు మళయాళసీమకు చెందినందున, కొల్లూరులో మళయాళం ధారాళంగా వినబడుతుంది. రెండోసారి ఈ ఉదయంలో దేవి దర్శనం చేసుకొని అక్కడ్నుంచి వెనుదిరిగి మంగళూరుకు వెళ్ళే ఉద్దేశంతో పయనిస్తుంటే మధ్యలో చిట్టడవిలో జీడిమామిడి వృక్షాలతో నిండియున్న భూభాగం దాటుతూ హట్టిదంగడి, ఆనెగుడ్డలలో ఉండే వినాయకుడి గుళ్ళను సందర్శించాం.

Murudeshwara

మురుడేశ్వర దేవాలయం

మరిక జాతీయ రహదారి మీద కొచ్చి మురుడేశ్వరలోని దేవళంకు వెళ్ళాం. ముంబైలో స్థిరపడిన ఆర్.ఎన్.షెట్టిగారు శ్రమతో నిర్మంచిన నవీన (భవ్య) దేవాలయం ఇది. పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తుంది ఈ క్షేత్రం. గోకర్ణంకు వెళ్ళి వచ్చేవారు విధిగా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. దేవాలయం సముద్రం అంచునే ఉంది. అక్కడ చేపల వేటలో మునిగియున్న మత్స్యకారుల్ని కల్సి ఎండబెట్టి ముంబై మార్కెట్ కని తరలిస్తున్న మత్స్యసంపద మీద గుచ్చి గుచ్చి (తరచి తరచి) అడుగుతున్నారు శుద్ధ శోత్రీయుడైన రావుగారు! ‘ఇదేంటి రావుగారు…… ఈ మత్స్యసంపద మీద ఉత్సుకత’ అని నేనడిగితే, ‘ఔనండి మీరైతే మీ హైద్రాబాద్ బిరియాని గురించి చెపుతారు…. మా ప్రాంతంలో నైసర్గిక స్థితి నుంచి మత్స్య ఆహారం విరివిగా తీసుకొనేది, తినేదుంది…… రచయితగా మనం ప్రత్యక్షంగా చూసి తెల్సుకొనేదుంది’ అంటూ ఉద్బోధ చేసారు భావుకుడిలాగ. మరిక ఉడుపికి బయల్దేరాం. ఉడుపిలో భుజించి అక్కడుండే మల్పే బీచ్ కు వెళ్ళాం. మల్పే బీచ్ నుంచి సెంట్ మేరీస్ ద్వీపంకు (షిప్ ద్వారా) వెళ్ళి అక్కడ కొన్ని గంటలు గడిపాం. నిర్జనమైన దీవి ఇది. చూడ చక్కని దీవి. మరలా వెనుదిరిగి ఉడుపి నివాసైన ప్రొఫెసర్ శాంతరామ సోమయాజి గార్ని కలిసాము. సోమయాజిగారి మూడు కథల్ని నేను తెనిగించాను. సోమయాజిగారు సహదాతగా నిల్చినందున నేను ‘చినరావురులోని గయ్యాళులు’ ముద్రించగలిగాను. ఈ రోజు వార్ని కల్సి వారి ఇంట్లో ఆ సాయంత్రాన ఉపాహారం సేవించి మరిక ప్రఖ్యాతమైన శ్రీకృష్ణ దేవాలయంకు వెళ్ళాం. చిరుచీకట్లలో వేలాది ప్రమిదల వెలుగులో శ్రీకృష్ణ మందిరం భవ్యంగా ఉంది. మూలవిరాట్‌ను కిటికి నుంచే చూసేదుంటది. అక్కడే పేజావర మఠాధీశుడి ధార్మిక సంభాషణ కార్యంలో పాల్గొని, ఆ తరువాయి మంగళూరుకు రాత్రి ఎనిమిది గంటలకు చేరాం.

11-11-2013: ధర్మస్థళకు వెళ్దామని రావుగారు ఈ రోజు కార్యక్రమాన్ని రూపొందించారు. మంగళూరు-పుంజలకట్టె-బెళ్తంగడి-ఉజిరె మార్గంగా సుమారు 80 k.m దూరంతో ధర్మస్థళకు చేరేదుంది. రావుగారు సీనియర్ సిటిజన్ అయినందున కర్నాటక ప్రభుత్వం తన ప్రజలకని జారీ చేసే ఐ.డి.కార్డ్ ద్వారా (ఆ రాష్ట్ర ప్రభుత్వపు) ఏవిధమైన బస్సులలో పయనించినా టికెట్‌లో 25% రాయితీ లభిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మస్థళలో దిగాం. ఈ సుక్షేత్రం మంగళూరు జిల్లాలో ఉంది. పశ్చిమ కనుమలలోని ఘోరారణ్యంలో ధర్మస్థళ ఉంది. మంగళూరు నుంచి ఉజిరె పట్టణం దాటుతుండగా పూర్ణచంద్ర తేజస్వి రచించిన ‘నిగూఢ మనుషులు’ పెద్ద కథ గుర్తుకొచ్చింది. ఉజిరె చెంతన ఉగ్రగిరి పర్వతం కనబడుతుంది. భయానకమైన ఉగ్రగిరి పర్వతం, దాని పరిసరాలలోనే ఉజిరె, బెళ్తంగడి పట్టణాలలో నివసించే జనం వర్షాకాలంలో ఎదుర్కొనే ప్రకృతి భీభత్సాన్ని, దురంతాల్ని అతిసహజంగా (ఉత్తరాఖండ్‌లో జరిగిన ఉత్పాతం లాగ) కథా రూపంలో 1980లో తేజస్వి వ్రాసింది గుర్తుకొచ్చి రోమాంచితుడనయ్యాను ఈ వేళ.

Dharmasthala_Temple

ధర్మస్థళ మంజునాథ ఆలయం

ధర్మస్థళలో బస్సుదిగిన మీదట దేవస్థానం వారిచే నిర్వహింపబడుతున్న వసతి గృహాలలో వసతికని వెతికాం. సులువుగానే రోజుకు 100 రూపాయల బాడుగతో గది దొరికింది. మా చేతి సంచులను గదిలో పెట్టి మంజునాధుడి దివ్యదర్శనానికి బయల్దేరాము. సమయం మీరుతున్నందున, భక్తుల తాకిడి అంతగాలేదు. దైవదర్శనం అయిన మీదట దేవాలయం వారిచే ఏర్పాటు గావింపబడిన ఉచిత భోజనాలయంకు వెళ్ళాం. భక్తుల సేవకని సంతృప్తికరంగా నిత్యభోజన దాన ఏర్పాట్లు ఉన్నవి. పరిశుభ్రమైన పరిసరం. భేషజాలకు పోకనే తారతమ్యలు లేకనే ఎక్కడెక్కడ్నుంచో వచ్చిన భక్తులు కడుపారా తింటున్నారు సంతోషంగా. వారితో పాటే మేమూ సంతుష్టులుగా భుజించాం. వసతి గృహానికి చేరుకొని రెండు గంటలు విశ్రాంతి తీసుకొని మరలా ధర్మస్థళలో అడ్డదిడ్డంగా తిరిగాం. దేవాలయంకు ధర్మాధికారి హెగ్డె. వీరు జైన మతస్తులు. దేవాలయం హిందువులకు చెందినది. హెగ్డెగారి నిర్వహణలో దేవాలయం భారతదేశమంతా పేర్గాంచినదట. కర్నాటకలో దిగంబర జైన పథానికి చెందిన జనులు రాజ్యమంతటా పల్లెలలో ఉన్నారు. బెళగావి నుంచి చామరాజనగర వరకు జైనులు ఉన్నారు. శిశువిహార్ మందిరం(L.k.g) నుంచి వైద్య, వ్యవసాయ కళాశాలల వరకూ వివిధ విద్యాలయాలు మంజునాథుడి పేరున హెగ్డెగారి నేతృత్వంలో ధర్మస్థళ నుంచే నిర్వహింపబడుతుండడం నేను గమనించాను. హెగ్డె గారి నేతృత్వంలో ఒక మ్యూజియం నడుస్తుంది. దీని పేరు మంజూష. హెగ్డె గారి సేవల్ని చూసి మెచ్చిన బిర్లా కుటుంబ మహిళ ఒకరు ప్రయాణికులు వాడే ఒక విమానాన్ని కానుకగా ఇచ్చినది, ఆ పెద్ద విమానాన్ని ఆ మ్యూజియం చెంతనున్న షెడ్‌లో భద్రపరచగా చూసాం. రాత్రి ఎనిమిది తర్వాత మరలా మంజూనాథుడి దివ్వదర్శనం పొంది వెనుదిరిగాం. ఆ రాత్రి వేళలో హెగ్డె గారి ప్రజాదర్బారు సాగుతుంది. ఎంతో మంది హెగ్డె గార్ని కల్సి తమ గోడు వెళ్ళడించుకొంటున్నారు. వారిని దైవసమానులుగా భావిస్తున్నారీ భక్తులు. ‘జనం వెళ్తున్నారు …. మనమూ వెళ్దామా’ అని నేనడిగితే, “మనం ఏమైనా ‘పనామా’ ప్రశస్తి, ‘జ్ఞానపీఠ పురస్కారం’ కోరుతున్నామా” అంటూ హస్యమాడారు రావుగారు.

Kukke_Subramanya_Swami

కుక్కె సుబ్రమణ్య క్షేత్రం

12-11-2013: ధర్మస్థళలో వేకువనే లేచి కాలకృత్యాలు ముగించి, ధారాళంగా దొరికే నీళ్ళలో శుచిస్నానం చేసి వసతిగృహ నిర్వహకులకు గది తాళం అప్పగిస్తుంటే, అడ్వాన్స్ ఎమౌంట్ వంద నుంచి తిరిగి 50 రూ. వాపస్సు ఇచ్చారు. పదిమందికి సరిపడే గదికి ఏబై రూ. మాత్రమే బాడుగ. చిత్రం కదా! ఉదయం 6 గంటలకు ధర్మస్థళ నుంచి కుక్కె సుబ్రమణ్య క్షేత్ర దర్శనంకు బయల్దేరాం. 50 కి.మీ దూరం ఉంది. అడవిలో ప్రయాణం. విషసర్పాల వేటకి మయూరాలు తిరుగాడుతున్నవి. అడవి జంతువులు రోడ్ దాటకుండా ఉండేందుకని మూడు నాలుగు అడుగుల లోతులో రహదారి అంచులలో అటు ఇటు కందకాలు తవ్వారు ఫార్టెస్ట్ డిపార్ట్‌మెంట్ వారు. 8 గంటలకు సుబ్రమణ్య క్షేత్రంకు చేరాం. ఎంతో పురాతనమైన రెండు దేవాలయాలు (ఆది సుబ్రమణ్య, కుక్కె సుబ్రమణ్య) భవ్యంగా ఉన్నవి. సుబ్రమణ్య రోడ్‌గా పిలవబడే రైలు స్టేషన్‌కు 8k.m దూరంలో ఈ క్షేత్రం ఉంది. సర్పదోషనివారణకని యజ్ఞయాగాదులు ఈ దేవాలయ సముచ్ఛయంలో జరుగుతున్నవి. దేవాలయ నిర్వహణ మళయాళ సాంప్రదాయరీతులలో జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఎన్నో శాఖలకి చెందిన పీఠాధిపతులు ఉన్నారు. రావుగారు తమశాఖకు చెందిన పీఠాధిపతి వద్దకు తీసుకెళ్ళారు. నిండు పళ్ళాలతో వచ్చిన శ్రీమంతుల్ని మనసారా దీవిస్తున్నాడు పీఠాధిపతి. రిక్తహస్తాలతో వెళ్ళిన మమ్మల్ని అరకొరగా దీవన ఇచ్చి పంపారు స్వామీజి. I.P.L క్రికెట్‌లో ఆడే క్రీడాకారుడిలాగ యువకుడిగా ఉన్న ఈ పీఠాధిపతి వైభోగం మీద రావుగారు మార్క్స్‌వాదంలోకి జారి ఐదు నిమిషాలపాటు లౌకిక అలౌకిక విషయాల మీద మాటల వర్షం కురిపించారు. పుత్తూరు మార్గంగా బస్సులో పయనించి మధ్యాహ్నం రెండు గంటలకు మంగళూరు చేరాం. సుబ్రమణ్య దేవాలయం మంగళూరు జిల్లాలో ఉంది.

ఇక ఈ రోజు సాయంత్రం కార్పోరేషన్ బ్యాంక్ హెడ్ ఆఫీసులో సీనియర్ మేనేజరుగా ఉండి, సాంస్కృతిక వ్వవహారాల విభాగానికి అధిపతి అయిన రాఘవ ఆచారి గార్ని కల్సేదుంది. ఆచారిగారు పేర్గాంచిన ఛాయాచిత్రకారుడు. పూర్ణచంద్ర తేజస్వి, యజ్ఞ ఆచారిగార్లకు అంతేవాసి (శిష్యుడు). మంగళూరులో వారికొక ఇల్లు ఉంది. వారి పరివారం (భార్య- కుతూరు) బెంగళూరులో ఉంటున్నారట. పుత్రిక ఇంజినీరింగ్ చదువుతుందని తెల్పారు. రావుగారి అల్లుడు నీళ్ళ వ్యాపారం (మినరల్ వాటర్) చేస్తున్నందున మంగళూరంతా ఆ బాబుకు సుపరిచితమే. కార్లో నన్ను, రావుగార్ని ఆచారి ఇంట్లో దిగబెట్టాడు ఆ బాబు.

ఎంతో ఏకాగ్రత, నైపుణ్యంతో తీసిన పలు ఛాయాచిత్రాల్ని మాకు చూపించారు రాఘవఆచారి. వారి ఛాయాచిత్రాల్ని బ్యాంక్ వారు ఉపయోగించు కొంటున్నారట. నేను అనువదించిన పుస్తకాల్ని వారికి ఇచ్చాను. భేష్….. బహుత్ అచ్చా అంటూ ఆచారిగారు, నేను పరస్పర ప్రశంసలు చేసుకోవటం….. మధ్యలో రావుగారి నుంచి కన్నడ సాహిత్య అవలోకన, దృశ్య మాధ్యమం (టి.వి) నుంచి పుస్తక పఠనం మీద జరుగుతున్న దాడి మొదలైన వాటి మీద రాత్రి ఎనిమిది గంటల వరకూ చర్చోపచర్చలు జరిగినవి. ‘రండి…. ఆఫీసర్స్ మెస్‌లో భోజనం చేద్దాం’ అని ఆచారి గారి నుంచి ఒత్తిడి ఉన్నా, వినయంగా వారి నుంచి వీడ్కోలు పొంది వారి ఇంటికి 4 కి మీ దూరానుండే రావుగారి పుత్రిక నివాసంకు చేరాం. ఈ రోజు కార్యక్రమం ఈ విధంగా జరిగింది.

13-11-20113: ‘రావుగారు…… ఈ రోజు మన తిరుగాట ఎక్కడికి’ అని అడిగితే, దానికి జవాబుగా ‘న్యూయార్క్‌కుగాని, నార్వేగాని వెళ్ళి వద్దాం’ అన్నారు రావ్ గారు నాతో. ఆ జవాబుకి నేను బిత్తరపోయాను. ‘అదేటండి…. మనం ఉంది మంగళూరులో. న్యూయార్క్‌కు, నార్వేకు ఎలా వెళ్ళగలం’ అని నేను ప్రశ్నించగా, దానికి ప్రత్యుత్తరంగా నవ్వుతూ ‘న్యూయార్క్‌ మాండ్య జిల్లాలో, నార్వే షిమొగాలో ఉండే చిన్న పల్లెలు కదా! మొరటుగా ఉన్న ఎనుబోతుల పేటను నార్వేగా, హనుమనదొడ్డిని న్యూయార్క్‌గా మార్చేసారండి అక్కడున్న తుంటరి యువజనం. రెవిన్యూ రికార్డ్‌లకు ఆపేర్లు ఇంకా ఎక్కలేదు. డిపో మేనేజర్లను అడిగితే ఆయా మూల గ్రామాలకు వెళ్ళే బస్సు వివరాల్ని తెల్పుతారు’ అన్నారు రావుగారు తుంటరిగా. ఆస్తికుడిగా, నాస్తికుడిగా, మార్క్స్‌వాదిగా ఉండే రావుగారిలో హస్యప్రియత్వమూ ఉంది.

‘ఈరోజంతా ఇంట్లోనే గడుపుదాం. సాయంత్రం నారాయణగురు ధర్మపీఠంచే నిర్వహింపబడే దేవళంకు వెళ్ళివద్దాం. యువదంపతులైన పుత్రిక-అల్లుడు సంతానానికని ఆరాటపడుతున్నారు. ప్రస్తుతానికి మనమే వారికి సంతానం. రెండు రెండు గంటల విరామంగా తిండి తీర్థాలు వస్తవి. మొహమాట పడకండి. అమ్మాయి M.Com, అల్లుడు చదివింది ఇంజనీరింగ్. చేసేది నీళ్ళ ఉత్పదనా వ్యాపారం. సు(సుకన్య) త (తమ్మాజిరావ్) ఇండస్ట్రీస్. నా మీద, నా శ్రీమతి మీద అనన్య భక్తి వీరిలో ఉంది. హాయిగా గడపండి, లేదంటే మీ తెలంగాణా గురించి చెప్పండి, మాకు తిరుమలను ఇవ్వండి, బళ్ళారిని మీరు తీసుకొండి, గాలి జనార్థన రెడ్డి దోపిడి తర్వాత ఏమి మిగిలింది మా బళ్ళారిలో’ అని నాతో ముగ్ధుడిగా చెప్పారు రావుగారు. ఇలాగున గడిచిపోయింది ఈ రోజంతా.

14-11-2013: ఈ రోజుతో ఇక నా మంగళూరు ఋణబంధం ముగుస్తది. ఉదయం 9 గంటలకే వెజిటబుల్ కిచిడి ప్యాక్ చేయించారు రావుగారు, మినరల్ వాటర్ బాటిల్ సమేతంగా. మంగళ, గురు, శని వారాలలో కార్వార్ నుంచి మంగళూరు స్టేషన్ మీదుగా యశ్వంతపురకు వెళ్ళే రైల్లో ఉదయం 11గంటలకు నేను ఎక్కేదుంది. రిజర్వేషన్ టికెట్‌ను రావుగారే ఇంటర్నెట్ ద్వారా తీసుకొన్నారు. అల్లుడితోపాటు స్టేషన్‌కు వచ్చి వీడ్కోలు పలికారు రావుగారు. వారి పరివారం సుకన్యగారు, పుత్రిక (శ్రీలక్ష్మి), అల్లుడు (నరేంద్ర) మరీ మరీ జాగ్రత్తలు చెప్పి వీడ్కోలు ఇచ్చారు.

పగటి వేళలో మరలా ఘోరారణ్యంలో రైలు పయనించి, రాత్రి 10.10కు యశ్వంతపురకు చేర్చింది. ఆ రాత్రే కంటోన్మెంట్ చెంతనున్న యూత్ హస్టల్‌కు చేరుకొన్నాను సుభద్రంగా.

15-11-2013: ఈ రోజు రాత్రి 11.15కు యశ్వంతపుర నుంచి కోర్బాకు వెళ్ళే ‘వయన్ గంగా’ ఎక్సప్రెస్‌లో కాచిగూడాకు స్లీపర్ కోచ్ (బెర్త్) రిజర్వేషన్ నాకుంది. పగలంతా ఖాళీ ఈ రోజు. అనువాద క్రీడలో బ్రహ్మైన పెండేకూరు గురుమూర్తిగారిని కల్సేదుంది. వారు తెలుగు నుంచి కన్నడంకు విశిష్ట (దిగంబర) సాహిత్యాన్ని అనువదించారు. తెలుగు కవిత్వాన్ని సులలితంగా కన్నడంలోకి తర్జుమా చేసిన సాహితీవేత్తగా గుర్తించుకోబడినారు. బెంగళూరు వస్తే తనని కలవండి అని ఎన్నో మార్లు చెప్పియున్నారు. వారు బళ్ళారి సీమకు చెందిన పేర్గాంచిన వణిక ప్రముఖుడు. వారి కుమారుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో గురుతరకార్యాన్ని నిర్వహిస్తూ, ప్రమోషన్ మీద ఇండియా తిరిగొచ్చి బెంగళూరు కేంద్రంగా 15 దేశాలలో మూల కంపనీకి చెందిన విధుల్ని అజమాయిషి చేస్తున్నాడట. వయోమాన ప్రభావం, కుమారుడి ప్రీతి నుంచి వ్యాపారాన్ని వదిలేసి శ్రీమంతుల నివాసస్థానమైన H.S.R.Layoutలో ఉన్న కుమారుడి భవ్య భవంతిలో నివసిస్తున్నారు. వారు చెప్పిన అడ్రస్సు ప్రకారం సెంట్రల్ సిటి బస్ స్టేషను నుంచి పరంగిపాళ్యకు వెళ్ళే బస్సులో రెండు గంటల ప్రయాణంతో 12 గంటలకు వారి వద్దకు వెళ్ళాను. వారు కొంగ్రొత్తగా వచన సాహిత్యం మీద కన్నడంలో 2013లో రచించిన పుస్తకం (కవనంలో ఉంది) నాకు ఇచ్చారు పరిశీలించండి అని. పుస్తకం వెల 280 రూపాయలు. కర్నాటక, తమిళనాడు గవర్నర్ల చేతుల మీదుగా ఈ పుస్తకం ఆవిష్కరింపబడింది. రేఖాచిత్రాలతో దళసరి కాగితంతో ముద్రించబడిన ఈ పుస్తకం చూపులకేకాదు, చదివితే గురుమూర్తిగారి ప్రజ్ఞాపాటవం మనకు తెలుస్తది. వారి వైదుష్యం మెచ్చతగినది. వారిని ఇప్పటి వరకూ అనువాదకుడిగా, రచయితగానే భావించుకొన్నాను. అయితే వారు సహజ కవిగా వచన రచనలో మునిగింది ఇప్పడు తెల్సుకొన్నాను! అప్పట్లో బళ్ళారి జిల్లా మద్రాస్ ప్రావిన్స్‌లో ఉండేదట. మద్రాసు నుంచి తెలుగు ప్రాంతం (ఆంధ్ర) విడిపోయినప్పుడు బళ్ళారి కర్నాటకలో చేరిందని తెల్పారు గురుమూర్తిగారు. కాంపోజిట్ స్టేట్‌గా ఉన్న మద్రాసు ప్రావిన్స్ నుంచి ఆంధ్ర విడిపోవటం, తెలంగాణాతో కలసి విశాలాంధ్రగా ఏర్పడి, ఆ ప్రాంతపోళ్ళతో మమేకం కాకపోవడం, తెలంగాణా ఏర్పాటు తథ్యం అని ఎన్నో చారిత్రక విషయాల్ని ముచ్చటించారు. మధ్యాహ్నం వారి ఇంట్లో భోజనం. ఆ తర్వాత వారి ఇంటి చెంతనున్న చిత్తూరు జిల్లాకు చెందిన సీకల వేణుగోపాలరెడ్డి గారి ఇంటికి వెళ్ళాం. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, విలేకరి, కవి. రెడ్డిగారు సాహిత్యం కన్నా రియల్ ఎస్టేట్ మీద ఎన్నో విషయాల్ని మాట్లాడారు.

రాత్రి వరకూ అక్కడే గడిపి మరోమారు వారి ఇంట్లోనే భుజించి వెనుదిరిగాను. స్వయంగా తమ కారు డ్రైవర్ (సహకారం)తో నన్ను యూత్ హాస్టల్‌లో దిగబెట్టమని చెప్పి వీడ్కోలు ఇచ్చారు గురుమూర్తిగారు.

యూత్ హాస్టల్ ఖాళీచేసి యశ్వంతపుర స్టేషన్‌కు చేరుకొని వైన్ గంగా ఎక్స్‌ప్రెస్ ద్వారా మరునాడు 16-11-2013 ఉదయం 9 గంటలకు కాచిగూడాకు చేరుకోవటంతో నా ఈ మూడువేల కిలోమీటర్ల తిరుగాట ముగిసింది!

శాఖమూరు రామగోపాల్, హైదరాబాదు
రచనాకాలం: 15-01-2014.
Author Contact Details:
Sakhamuru Ramagopal,
5-10, Road No. 21,
Deeptisri Nagar, Miyapur (post),
Hyderabad – 500 049;
Ph: 09052563666; email: ramagopal.sakhamuru@yahoo.co.in

Download PDF ePub MOBI

(Image Courtesy: Wikipedia & https://www.flickr.com/photos/raghu7jana/7824063182)

Posted in 2014, ఏప్రిల్, వ్యాసం and tagged , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.