cover

చెక్కా వారి పెండ్లి పిలుపు

Download PDF ePub MOBI

ఆదివారం పొద్దున్నే లేచి కారుఖానా పక్కన నుయ్యి చప్టా మీద నాగల గావంచా కట్టుకుని గొంతుక్కూచుని పది చేదలు తోడి దబీ దభీ ధభీ మని బుర్ర మీంచి స్నానం చేస్సేడు. గొంతుక్కూచుని లైఫ్‌బోయ్ సబ్బు ఒంటికి, బుర్రకి రాసుకుని. వేరే తువ్వాల తెప్పించి ఒళ్ళల్లా ఒత్తుకుని కారుఖానా పాక ముందు ఎండలోన రాయిమీద కూర్చుని సూర్యుడికి దండాలు పెట్టేడు. లోపట్నుండి కోడలు ఇడ్లీలు, ముద్ద చట్నీ పంపించింది, మనవడి చేత. దవడలాడిస్తూ అవి తినుకుంటూ ఎర్ర ఫ్రేం కళ్ళద్దాల్లోంచి ఎండలోకి మొహం చిట్లించుకుంటూ అయిదు గల్లీలు కలిసే చాటా పంజా లోన ఒచ్చీ పోయే మనుషుల్నీ చెత్తల్లారీని తువ్వాళ్ళు మొహాల మీద వేసుకుని పడుక్కుని బేరాల కోసం ఎదురు చూస్తున్న రిక్షా వాళ్ళనీ చూస్తూ కూచున్నాడు. కోడలు ఇల్లూ గుమ్మాలు అలికీసి ముగ్గులు పెడుతున్నాది. ఎండలో కూచుంటే ఒంటికి వెచ్చగా ఉంటుంది. ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర నమహ. సిద్దం నమహ. అనుపోజు వారి వడ్రంగం షాపు. ఇచ్చట సోఫా, డబల కాట్, బీరువాలు, అలమైర మరియు అన్ని రకముల ఫర్నిచర్సు ఆర్డర్ సప్లయర్సు’ అనీసి ఇవతల గోడ నిండా రాయించున్నాది. యెల్లాజీ, శేఖరు ‘మీఁవు షాపు చూసుకుంట్నాం కదా! ఈ ఏజీ లోన మీకెందుకీ హైరాన?! హేపీగా రెష్టు తీసుకోవచ్చు కదా!’ అనీసి వడ్రంగం షాపు గుమ్మం లోకి రానియ్యటం లేదు. తను వయసులో ఉన్నప్పుడు కూడబెట్టింది రూపాయి వడ్డీకి కులపోలకే వడ్డీలకి తిప్పుతున్నాడు. బ్రహ్మం గారి మటం లోన ధార్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు సంతర్పణలు, కధ చెప్పించటానికి ఎరోవుమెంట్లన్నీ తన మీదే వేసుకుంటాడు. ఈ చేటా పంజా అయిదు వీధుల్లోన, చిన్న బజారు వరుకు, బాబా దర్గా వరుకూ అనుపోజు సన్నిబాబు అంటే నమ్మకస్తుడైన పనివాడు అని మేస్తుర్ల మధ్యన, షావుకార్ల దగ్గిర పేరు తెచ్చుకున్నాడు. పిల్లలకి చదువులు చెప్పించినా వాళ్ళు షాపు చూసుకున్నంత బెష్టు ఇంకొకటి లేదని షాపు మీదే వుండిపోయేరు. పెద్ద షావుకార్ల పిల్లలకి సారె సామాన్లు కూడా రోజ్వుడ్ సెట్లు చేసి బెరహంపూర్ వరుకూ ఎత్తి పంపించి సెబాష్ అనిపించుకున్నారు తండ్రీ కొడుకులు. ఈ రోజుల్లో వడ్రంగులకున్న ఆదాయం జీతగాళ్ళకి లేదు. తల పూర్తిగా నెరిసిపోయింది. చిత్రికలు పట్టీ పట్టీ వొళ్ళార్చుకుపోయింది. బక్కగా, నడిచినప్పుడు నడుం వంగిపోయి కాళ్ళు అటూ ఇటూ విసురుకుంటూ నడుస్తాడనీసి పేరే గాని వొంట్లో ఏ సుస్తీ లేదు. లూజు ఖాకీ నిక్కర, ఖద్దరు బనీను వేసుకునే పన్ల మీదికెల్తాడు. బ్రహ్మం గారి మటం లోన పూజలు పునస్కారాలప్పుడు ఫుల్పేంట్ చొక్కా వేసుకుంటాడు. ‘పదివేల నూట పదహార్లు ఇచ్చిన వారు మట స్థాపనకు మూల దాతలు అనుపోజు సన్యాసి గారు’ అనీసి హుండీ మీద రాసుంటుంది. ఇప్పటికీ షాపులోకెళ్ళక పోయినా కాళ్ళకాడికి పనొస్తే వొద్దనడు. ఆశనీసి కాదు. వడ్రంగం చల్లంతల్లి. కాల కాడికొస్తే వొద్దనకూడదు!

టీ ఊదుకుని తాగుతుంటే ఒక్కుర్రాడు సైకిలు మీద స్పీడుగా వొచ్చి సడన్బ్రేకు వేసి తనెదురుకుండే ఆగేడు “ఏండీ? సన్నిబాబు కారుఖానా ఇదేనా?” అని. “ఇదేను! ఏటి కావాల?” అంటే “మా నానగారు రమ్మంట్నారు. తలుపు అడ్డ గడియా బావు చెయ్యాలి..!” అని నిలబడ్డాడు. ‘ఎవరు, ఏటి?’ అని ఏం అడక్కుండా లేచి పాక అరుగు మీద హవాయి చెప్పులు తొడుక్కుని, సంచీలో మక్కు, సేండ్పేపరు ఉన్నాయో లేవో చూసుకుని, సంచీ భుజం మీద వేసుకుని ఆ అబ్బాయెనకాల గబ గబా నడిచేడు. అతను సైకిలు దిగకుండానే ఒక కాల్తోటి మెక్కి మెక్కి తొక్కుతూ, మధ్య మధ్య తను వస్తున్నాడో లేదో వెనక్కి చూసుకుంటూ అయిదు వీధుల్లోన ఒక సందు లోకి తీసుకెళ్ళేడు. ఈ గల్లీల్లోన ప్రతీ అంగుళం తనకి తెలుసు. పడమటికి సిమింటు గచ్చుల్తోటి దిగేది కోమటి వీధి. ఉత్తరానికి మట్టి రోడ్డు వాడ బలిజీల వీధి. తూర్పుకి సముద్రం వైపు వెళ్ళే వీధి లోన ఎక్కువ మంది బ్రేమ్మర్లుంటారు. కొళాయి గొట్టాల కట్టల్లోకి డవును షరాబుల వీధి. ఈ వీధుల్లోన సగం ఇళ్ళు పెంకుటి కప్పులు పడిపోతున్నట్టుగుంటాయి. మిగిలినవి అలాటిళ్ళే కొట్టీసి ‘మోడరన్’గా మేడలు కట్టినవి. ఆ మేడల్లోన నూటికి తొంభయ్యి తనే ద్వార గుమ్మాలు, అలమార్లు బిగించేడు. ‘అందుట్లోన ఈ కుర్రాడు ఎవల్తాలూకా?’ అని అనుకుంటూ పరిగెట్టినట్లు నడుచుకుంటూ, మనుషుల్ని చేపల రిక్షాల్ని ఆవుల్ని పందుల్ని సైకిళ్ళని తప్పించుకుంటూ. ఆ కుర్రాడు వీధి చివార లేత పసుపు రంగు కొత్త సున్నాల పందిరిల్లు డాబా ముందు సైకిలాపి ‘ఇక్కడే ఇక్కడే’ అని అరిచి హడావిడిగా లోపటికి పరిగెట్టేడు. నాలుగు రాటలు నాలుగు నందియాల నూని డబ్బాల్లో మట్టి పోసి తాటి కమ్మలు కొబ్బరాకులు పందిరి వేసి మామిడాకులు చుట్టూ తోరణాలు కట్టి ఎదురింటి వరుకూ రోడ్డంతా పందిరి వేసేరు. ఇంటి గోడ మీద పసుపు రంగు వార్నీషు తోటి ‘చెక్కా వారి పెండ్లి పిలుపు’ అని రాయించేరు. డాబా మీదనుండి ఒకమ్మాయి మేక్సీ వేసుకుని, నోట్లో బ్రష్షు పెట్టుకుని, నోటిచుట్టూ తెల్లగా నురగలతోటి సన్నిబాబునే చూస్తునాది. లోపల్నుండి ఒకాయన లుంగీ మీద చొక్కా తొడుక్కుంటూ హడావిడిగా బయిటికొచ్చి “ఏఁవిండీ వడ్రంగులు?” అని జవాబుకోసం ఆగకుండా మెట్లు దిగి పక్కనున్న టేకు గుమ్మం తలుపు తీసి తలుపు వెనక చేరి గడియా టక టక మని ఇటూ అటూ ఆడించి చూపించేడు. పట్టు లుంగీ బొజ్జ ఆధారంగా నిలబెట్టుకుని, ఛాతీ నుండి బొడ్డు వరకూ వెంట్రుకలు – పూజయిపోయేక లేచి వచ్చినట్టు ఉన్నాడు. గడియా రింగు లూజయిపోయింది. గడియా వేసినా ఇట్నుంచి గట్టిగా తోస్తే తలుపు నవ్వెస్తోంది. “ఈ గడియా బావుచెయ్యాలి! ఇదా… మేడ కట్టినప్పుడిది కర్ర మిగిలింది… ఇది పెట్టి ఓ అడ్డ గడియా చెయ్యాల?!” అన్నాడు. సన్నిబాబు అతన్ని పక్కకి తప్పుకోమని సౌంజ్ఞ చేసి గడియా ఆడించి చూసేడు. కర్ర దూలాలు చూసేడు. చూసి అక్కడే మెట్టు మీద సంచీ దింపి ఒప్పుకోలుగా “అలగే..చేసెద్దాం లెండి!” అన్నాడు. ఆయన “అలగే ఇలగే కాదు! ఎంత తీసుకుంటావో చెప్పు?!” అని దబాయించేడు. “ఏటున్నాది లెండిందులోన పెద్ద పని. మీ యబ్బాయికి పంపించి ఆల్రాప్సు, రింగు బోల్ట్లు రప్పించియ్యండి. నా కష్టం చూసి ఏదో వొకటి చెటిల్మెంటు చేసిత్తుర్రండి!” అనీసి మగ్గుతో కొళాయి కింద గుమ్మిలోవి నీళ్ళు తెచ్చి పెట్టుకుని పనికి కూచున్నాడు. సంచీలోంచి ఒక కాయితం ముక్క, పెన్సిలు తీసి గుండ్రంగా

ఆల్రాప్సు (అల్యూమినిం వి) —— 9 ఇంచీలువి 2

పూతికలు —— ఇరవై గ్రాములు

రింగు బోల్టులు 1-3/4 —— రెండు సెట్లు

అని రాసి “పోష్టాఫీస్ దెగ్గిర కొత్తగుండు వాల హార్డువేర్ షాపుకెళ్ళీ….. సన్నిబాబు పంపించేడు అనీసి తెచ్చీయండి!” అని బెత్తాయించేడు. ఆ కుర్రాడు ‘ఊఁ’ అని తలూపి సైకిల్ మీద బాణం లాగ చాటా పంజా వైపు మాయం అయిపోయేడు. గడియా బోల్ట్లు ఇప్పి, కర్ర అరిగిపోయిన చోట సేనాం పెట్టి సన్నగా చెక్కేడు. మీదకి జరిపి కొత్తచోట గడియా స్క్రూలకి కన్నాలు తొలిచి పాత కన్నాలకి మక్కు పెట్టేడు. ఆయన చూపించిన చెక్కల్లోంచి ఒక సుమారైన కోడు తీసుకుని బాగా చిత్రిక పట్టి, దాని చివర ఇంకొక సన్నటిది చెక్క మేకుల్తోటి దిగ్గొట్టి అడ్డ గడియా చేసేడు. కాళ్ళు సాచుకుని ఒక కన్ను మూసుకుని ఈ చివర సీల కోసం కన్నం తొలుస్తూ వుంటే అబ్బాయి ఒగుర్చుకుంటూ వచ్చి ఆల్రాప్సు, రింగు బోల్ట్లు, పూతికలు తెచ్చిచ్చేడు. ఇల్లు గలాయన డాబా మెట్ల మీద కూర్చుని ఈనాడు పేపరు చదువుకుంటూ ఓ కంటితోటి ఇదంతా చూస్తున్నాడు. లోపట్నుండి ఇందాకా పళ్ళు తోఁవుకుంటున్నమ్మాయి ఒక పళ్ళెంలో మూడు కాఫీ గ్లాసులు పట్టుకొచ్చి, ఒకటి వాళ్ళ నాన్నకిచ్చి, ఇంకోటి తను తీసుకుని, మూడోది పళ్ళెంతోటి సహా సన్యాసి ముందు పెట్టి, తను ఆ ఇరుకు సందులోనే లాఘవంగా పక్కలకి నడుస్తూ దూరి వాళ్ళ నాన్న మీద మెట్టు మీది కెళ్ళి అక్కడ కూర్చుంది, టర్కీ టవల్ తో మొహం ఒత్తుకుంటూ కాఫీ తాగుతూ. వాళ్ళ తమ్ముడు నాన్నన్నీ ఆయమ్మాయినీ తప్పించుకుని ఇంకా మీద మెట్టు మీదికెళ్ళి తరవాత సైకిల్ తొక్కి వెళ్ళే పని ఏటో చెప్పండి? అన్నట్టు కూచున్నాడు. సన్యాసి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా తదేకంగా గడియల పేకట్టు విప్పి కొత్త గడియా తీసి పాత దాని చోట బిగించేడు. దానికి సుమారు అడుగు మీదకి అడ్డ గడియా రింగు ద్వారమ్మీద దిగ్గొట్టి గడియా దండా ఈ చివర బిగించి, గడియా కరక్టుగా పడుతోందో లేదో నాలుగు సార్లు వేసీ తీసీ చూసి సంతృప్తిగా తలాడించేడు. అప్పుడు కాఫీ గళాసా అందుకుని లేచి నిలబడి “చూసుకోండి మరి శెలవిప్పించండి…!” అని ఊదుకుని తాక్కుంటూ నిలబడ్డాడు.

ఆయన పేపరు మడిచి పడీసి, మెట్లు దిగొచ్చి గడియాలు రెండూ వేసీ తీసీ చూసుకుని తలాడించి, ఇంట్లోకెళ్ళి పది రూపాయల కాయితం తెచ్చిచ్చేడు. సన్యాసి ఆ కాయితాన్ని చూసి పాముని చూసినట్టు వెనక్కెళిపోయి నవ్వీసి “ఇదేటి బాబూ? పదా?” అన్నాడు.

“మరెంత? వందిమ్మన్నావా?”

“చూడండి. కష్టం చూడండి! పది రూపాయలకి రెండు తులాల మక్కు రాదు!”

ఆయన చాలా చీదరింపుగా “ఇదే ఈల్తోటి వెదవ న్యూసిన్సు! అందుకే ముందరే చెప్మన్నాను….!” అని సణుక్కుంటూ ఇంట్లోకెళ్ళి ఇంకో అయిదు కాయితం కలిపి పదిహేనూ మళ్ళీ అందించేడు. సన్యాసి ఆ డబ్బు ముట్టుకోకుండా ఈయనికి బోధ పరచటం ఎలాగరా అన్నట్టు చూసి రెండు చేతులూ గాల్లోకి తిప్పుకుంటూ –

“ఏఁవటి బాబూ ఇది? తమరు పెద్దవారు….. సింహద్వారం పనండీ! అయిదూ పదీ ఇస్తారేటండీ? ఎప్పుడూ వడ్రంగి పని చేయించని వారయితే అనుకోవాల!” అని అతని కష్టానికి అవమానం జరిగిందని ప్రకటిస్తున్నట్టు అలాగే నిలబడ్డాడు. ఇల్లుగలాయన కోపంగా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నాచు పట్టిన కొళాయి చప్టాని, నీళ్ళ పొయ్యిని తప్పించుకుని ఇంట్లోకెళ్ళి మళ్ళీ వేగంగా బయటికొచ్చి ఇంకో అయిదు కలిపి మొత్తం ఇరవై రూపాయిలూ బలవంతంగా సన్యాసి చెయ్యి తెరిచి గుప్పిట్లో కుక్కి, అతని సంచీ తీసి రెండో చేతికందించి “పన్లు చేయించడాల గురించీ డీలింగుల గురించీ నువ్వు మాకు లెక్చిర్లివ్వక్కలేదు. వొచ్చింతోవంటే మర్యాదగెళ్ళు!” అని కసురుకున్నట్టుగా అన్నాడు. సన్యాసి “అక్కల్లేదు తమరే ఉంచుకోండి! పన్లు చేయించిన మహారాజువి!” అని ఆ ఇరవై మెట్టు మీద పేపరు మీద పడీసి కోపం పట్టుకోలేక ఊగుతూ అరుగు మీంచి వీధిలోకి ఉక్రోషంగా దిగి పరుగులాటి నడక తోటి, ఏడుపు మొహం తోటి ఇంటి వైపు నడిచేడు. కాలవల్లోంచి నల్లటి బులవ, నారింజ డిప్పలు, కాయితాలు తొక్కులు తీసి నీళ్ళోడ్చి కుప్పలకింద పెడుతున్నారు.

ఇల్లుగలాయన అతను డబ్బలా పారీసి పోతాడనుకోలేదు. అరుగు మీదకొచ్చి వీధిలోకే చూస్తూ నిలబడ్డాడు. వంగిపోయి వడ్రంగి సంచీ భుజాన్న వేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఎండు కాళ్ళు అటూ ఇటూ విసురుకుంటూ గబ గబా వెళిపోతున్న వాడ్ని అపనమ్మకంగా చూస్తూ లోపటికొచ్చి తలుపు భళ్ళుమని మూసి రెండు గడియలూ వేసి, పేపరు తీసి, దాన్లోని ఇరవై రూపాయలూ కళ్ళకద్దుకుని షర్టు జేబులో పెట్టుకున్నాడు. పిల్లలు మెట్ల మీద కూర్చుని ఆయన్నే చూస్తుంటే ఏదోలాగ అనిపించి సంజాయిషీ చెపుతున్నట్టు “నెత్తెక్కెస్తారు! ముసిలోడికే అంత గర్రా అయితే మనకెంతుండాలి?!” అన్నాడు. మేక్సీ అమ్మాయి ఏం మాట్లాడకుండా సన్నిబాబు మధ్యలో వొదిలీసిన కాఫీ కాలవలో ఒంపి, మూడు గ్లాసులూ పళ్ళెం పట్టుకుని ఇంట్లోకెళిపోయింది. కుర్రాడు డాబా మెట్ల గోడ మీద ఈ కాలు ఇటూ ఆ కాలు అటూ వేసి జారుతూ దిగబోయి నాన్న మొహం చూసి మానుకున్నాడు.

chekkavaariసన్యాసి సంచీ చెప్పులూ పాక కింద వొదిలి, మళ్ళీ కారుఖానా ముందొచ్చి గొంతుక్కాళ్ళ మీద ఎండలోకి మొహం చిట్లించుకుంటూ కూర్చున్నాడు. అతనికి చాలా ఉక్రోషంగా ఉంది, బక్కీ కోపం లాగ. కష్టం చేయించుకుని మజూరీ ఇవ్వకుండా అవమానించి పంపినందుకు. పెద్ద మేస్తిరికి గంటన్నర కష్టానికి ఏభయ్యేనా ఇవ్వాలి. రెండు గంటల పనికి, ఆదివారం రోజు, ఇరవయ్యిస్తాడా? అలాటి టేకు గుమ్మం శాల్తీల్లెక్క చేస్తే మజూరీవే అయిదు వందలిస్తారు. ఇవన్నీ వెళ్ళి అతనితోటి తిట్లు కింద తిట్టినట్టు మనసులోనే అనుకున్నాడు. మనవడొచ్చి ‘తాతియ్యా! అమ్మ వణ్ణాలకి రమ్మంటంది!’ అని పిలిచేడు. నేను తరవాత్తింటాను మీరు తినియ్యండని కేక పెట్టి అక్కడే ఎండలోనే పళ్ళు కొరుక్కుంటూ కూచున్నాడు. ఒక్కడూ నూతిగట్టు పక్కన గొంతుక్కూచుని బుగ్గిలోంచి కర్ర పుడకలు, రాళ్ళు తీసి ఒక్కక్కటే దూరంగా నేలకేసి కొడుతూ కసితీరా తిట్టుకుంటున్నాడు, కోపం పట్టలేనప్పుడు ఖాండ్రించి తుపుక్కుమని ఉమ్ముతూ. బూతు తిట్లు ఎవరికీ పైకి వినపడకుండా. ఈయన్ని తను ఎరుగును. ఈయనకి రెల్లివీధి లోన, చట్టాల వారి వీధి లోన రేషను షాపులున్నాయి. వీళ్ళావిడి ఉద్యోగస్థురాలు. లక్షింవారాలు జగన్నాధస్వామి కోవిల్లోన ‘అభినవ వివేకానంద గాలి శేషగిరిరావు’ గారు ధార్మికోపన్యాసాలు ఇవ్వడాలకి వచ్చినప్పుడు ఈయన ‘హరే రామ హరే రామ రామ రామ హరే! హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే!’ అని ఎర్రక్షరాలతోటి నిండా వాక్యాలు రాసున్న లేత పచ్చరంగు శాలువా కప్పుకుని కుంకం బొట్టు పెట్టుకుని పంతులు గారికి ఎదురూగే కూర్చోనుంటాడు. హారతి పళ్ళెం తెచ్చి అందరిముందూ తిప్పుతాడు. ‘ఏట్రా నీ రామ రామ ఊరు సొమ్ము రాంబజన…’ అని తిడుతున్న కొద్దీ కోపం ఊట చెలమ లాగ ఊరుతోంది. మనవడు సైకిల్ టైరు తిప్పుకుంటూ వచ్చి ఆగి విచిత్రంగా చూసి “ఏటి తాతియ్యా గాలికి తిడతన్నావు?” అని అడిగితే తమాయించుకుని ఏం అనకుండా ‘నీకెందుకు నువ్వు పోరా!’ అన్నట్టు చెయ్యిసిరీసేడు, కాని తెలివి తెచ్చుకున్నాడు.

వాడొచ్చి అడిగితే తనకి ఒళ్ళు తెలీని కోపంగా ఉందని అప్పుడు స్పృహలోకొచ్చింది. ‘రాంబ్రహ్మం… రాంబ్రమ్మం…’ అనుకుని బలవంతంగా తిట్లు ఆపుకున్నాడు. తప్పిపోయిన చిన్నకొడుకు బ్రెమ్మాజీ, వాళ్ళమ్మా గుర్తొచ్చేరు. పాకలోకి చూస్తే గుమ్మం మీద ఏటవాలుగా వాళ్ళిద్దరి ఫొటోలు దండలు వేల్లాడుతూ ఎలక్ట్రీ దీపం పాములాగ వెలిగి వెలిగి ఆరుకుంటూ ఉన్నాయి. వాటివేపు చూట్టం అంటే ఏదో భయం, చిన్నతనం. ఇంట్లో ఇద్దరు కొడుకులు కోడళ్ళూ తనకేసే వేలెత్తి చూపించి ‘నువ్వే వాల్లని చంపీసేవు థూ…’ అని ఊసినట్టు చూస్తుంటారని. టెంత్క్లాసు రెండో సుట్టు పోయిందని తిట్టేడు ఇలాగే ఒక మధ్యానం. పెద్దవాళ్ళిద్దరికీ వడ్రంగఁవే కాబట్టి వీడ్నయినా చదివించి ఉద్యోగస్థుణ్ణి చెయ్యాలని అగ్నిహోత్రుడు మేష్టగారి కాళ్ళ మీద పడిపోయి ప్రేవోట్లు పెట్టిస్తే ప్రేవోట్లు ఎగ్గొట్టి తిరిగేడని. సిగరట్లు కాల్చుకుంటూ చావులమదుం దగ్గిర కనిపించేడని అన్నారని. కార్తీక సమారాధన్లప్పుడు గుడిలోవ మాఁవిడి తోటల్లోన కూరాకుల పిల్లని ఏడిపించి ఇంటి మీదకి తెస్తే కులపోలందరి ముందూ పరువు పోయిన సంగతి. అవన్నీ తల్చుకుని తల్చుకుని కోపం పట్టలేక తిట్లు తిట్టి తిట్టి గుద్దులు గుద్దేడు. వాడు తన్నే తిరిగి తిట్టేడు – ‘మళ్ళీ నీ గుమ్మాలకొస్తానేమో చూడు!’ అని. ‘ఎవలకిరా బెదిరిస్తావు?’ అని గేదె కన్ని తెచ్చి కొట్టేడు ఈ గుమ్మం మీదే. వాళ్ళమ్మ ‘వొద్దు కొట్టకండి సంపీకండి ఈ సుట్టు పేసైపోతాడు’ అని అడ్డం పడితే దాన్ని మూలకి తోస్సి. అవేళ సాయంత్రం వెళ్ళిన వాడు మరెక్కడికెళ్ళేడో ఏమయిపోయేడో ఐపు లేడు. ‘ఆడెక్కడికి పోతాడు పనీ రాదు పాటా రాదు ఆడే వొస్తాడు సచ్చిన కుక్క లాగ!’ అని బుకాయించేడు ఒక రెండ్రోజులు. ఇంక ఇంట్లోవాళ్ళని ఆపడం తన వల్లకాలేదు. చుట్టాలకీ పక్కాలకీ టెలిగ్రాములు కొట్టేరు. వాళ్ళమ్మ ఎప్పుడు చూసినా కొడుక్కోసఁవే ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన వాళ్ళందరితోటి ‘పరీక్ష పేసవలేదని కొట్టీస్సంపీసేడు మీ బావ!’ అని తన్నే నిందించి నిలబెట్టింది. లోపల కుత కుత కుతలాడినా అతి కష్టమ్మీద ఆ నిందలన్నీ పడ్డాడు. ఆ ఊసు ఎత్తినప్పుడల్లా ఆ పోయినోడి మీద దీవెయ్యలేదు సరి కదా కోపఁవే వొచ్చీది. అయినా బయటికి తిట్టకుండా పళ్ళు కొరుక్కుంటూ లోపల్లోపలే అణుచుకుని పెద్దగా “స్సాయిరం.. స్సాయిరం.. బ్రహ్మేంద్ర సిద్ద యోగీ!” అని బియ్యం గుప్పిళ్ళతో తెచ్చి ముష్టి వాళ్ళకి వేసుకుంటూ తమాయించుకునేవాడు.

నెలా పదిహేను రోజులకి ‘కనబడుటలేదు’ అని పేపర్లో వేయించేడు. ‘బాబూ బ్రహ్మాజి! నీ మీద బెంగతో మీ అమ్మ మంచము పట్టినది. నిన్ను ఎవరూ ఏమీ అనరు. నువ్వు ఎక్కడ ఉన్నదీ చిరునామా పంపితే నీ ఖర్చులకి ఎం. ఓ. పంపగలను. ఇట్లు మీ నాన్న అనుపోజు సన్యాసి’ అని పేపర్లోన వరసపెట్టి నాలుగు వారాలు వేయించేడు. వాళ్ళమ్మ పోయిన ఏడాదయినా రాలేదు. ‘ఆడు బతికున్నాడని ఖాయంగా తెలిస్తే కదా ఒచ్చేడు రాలేదు అనుకోడానికి!’ అని తీర్మానించేరు. ‘ఇంట్లోంచి పారిపోయినప్పుడే కాపులుప్పాడ దగ్గిర సముద్రంలోకి నడుచుకుంటూ వెళిపోయేడు, జాలార్లు చూసినా మరి దొరకలేదు’ అన్నారు. వాళ్ళమ్మ పక్కనే వాడి ఫొటో పెట్టి గంధం దండలు వేయించేరు. అప్పట్నించి ఇప్పటి వరుకూ తనకి మళ్ళీ ఎప్పుడూ ఇలాగ ఇంత కోపం రాలేదు. అలాటి బూత్తిట్లు కాదు ఏనాడూ ఏ తిట్లూ ఎవల్నీ తిట్టలేదు. కోపం ఎందుకొస్తాదో తెలీదు. ఇరవై రూపాయల కోసమా? కోపఁవొచ్చినప్పుడు ఒళ్ళు తెలిసిన వెంటనే ‘రామ బ్రెహ్మం రామ బ్రెహ్మం..’ అనో ‘రామ రామ రామ’ అనో ఇలాగ అనుకుంటే అనుకున్నంతసేపు ఉన్నట్టుగే ఉండి అనుకోడం ఆపీగానే ఎక్కడ్నుంచో ‘థూ నీయమ్మా..’ అనే వస్తాది. ‘ఇరవై రూపాయిల కోసం ఎందుకు తిట్టడము?!’ అనీ అనిపించింది. ‘కోపానికి కొడుకుని కాల్చీసుకున్నాను!’ అని. ‘నాకేటి లేదా పోదా!’ అని. అయినా ఆకలేస్తున్నా లెగబుద్ధి వెయ్యలేదు. చేతులు మోకాలి చిప్పల మీదికి సాచుకుని అలాగే కూర్చుంటే కోడలు మనవరాల్ని చంకలో వేసుకుని చీర చెంగుతో మూతి తుడుచుకుంటూ బయటికొచ్చి “ఏటి మాఁవయ్యా అన్నాలకి లెగండి?’ అని గద్దించింది. ‘ఈఁ… ఏటీ లేదూ…” అని అస్పష్టంగా సణుక్కుంటూ లేవబోతుంటే వీధిలోన సైకిల్ ఆగిన చప్పుడు. ఆ కుర్రాడు మళ్ళీ వొగుర్చుకుంటూ ఆగి సైకిల్ దిగి రెండు ఇరవై నోట్లు తన మీదికి అందించి “ఏండీ! మా నానగారు ఇచ్చీమన్నారండీ…..” అని నిలబడ్డాడు. “ఎందుకూ? మీరే ఉంచుకోండి…” అని గట్టిగా అసహ్యంగా అని లేచి ఇంక ఏ మాటకీ అవకాశం ఇవ్వకుండా ఇంట్లోకెళిపోయేడు. కోడలికి ఏమీ అర్థం కాక చూస్తుంటే ఆ కుర్రాడు బిక్కమొహం వేసుకుని ఆ నోట్లు జేబులో పెట్టుకుని మళ్ళీ మెక్కి మెక్కి తొక్కుకుంటూ వెనక్కెళిపోయేడు.

వెండి కంచం ముందు కూర్చుని అన్నం కలుపుకోబోతుంటే మొగుడూ పెళ్ళం స్కూటర్ మీద దిగేరు. వోనరు, వోనరు గారి భార్యా! ఆవిడ దగ్గిర దగ్గిర పదిహేనేళ్ళ బట్టి రోజూ చూస్తున్న మనిషేను. పొట్టిగా కుదూరుగా చీర చెంగు చుట్టూ కప్పుకుని విధీగా ఏవో ఒక పువ్వులు పెట్టుకుని ఒక చేతిలోన అన్నం కేరేజి, ఇంకో చేతిలోన బేగు పట్టుకుని వీధి ఒడ్డు వారంట దించిన తల ఎత్తకుండా నడుచుకుంటూ వెళ్తుంది రోజూ పొద్దుటే. తను గెడ్డానికి సబ్బు పెట్టుకుని గడ్డం గీసుకునే టైముకి. అలా వారంట వెళ్ళి వంగ పండు రంగు నేవల్ బేస్ లారీలోన ఎక్కి ఇనప బెంచీ మీద కూర్చుంటుంది ఊతానికి తాడు పట్టుకుని. గడ్డం ఒత్తుకుంటుంటే లారీ తోటే కదిలిపోతుంది. ఇంతే తెలుసును ఆవిడి గురించి. వెనక సీటు మీద నుండి దిగి ఏభయ్ రూపాయిల కాయితం చేతిలో పట్టుకుని పెద్ద గొంతుక తోటి గడప మీదకొచ్చి “ఏఁవిండీ పెళ్ళింటి కొచ్చి ఉసూరుమని ఎళిపోవచ్చిస్తారా? కాదు పెళ్ళింటికొచ్చి ఉసురు కొట్టీసెళిపోతారా?!” అని తనతోటి అనవల్సిన మాటలు కోడలికి అని దబాయిస్తోంది. వోనరు బయట స్కూటర్ దగ్గిరే ఇబ్బందిగా నిలబడున్నాడు, పక్కన సైకిల్ మీద కుర్రాణ్ణి పెట్టుకుని. కోడలు పసుపు రాసిన మొహం నిండా ఆశ్చర్యంగా “ఏంటండీ? మా మొగోల్లేరు.. డెలివరీలకెల్లేరు! మూడు గెంటలకి రండి!” అని నిలబడ్డాది. ఆవిడ గుమ్మం బయటనుండే వంగి చెయ్యి చాచి తన కంచం ముందు నీళ్ళ గుళ్ళీ ఎత్తి ఏభయ్ నోటు ఎగిరిపోకుండా గుళ్ళీ కింద పెట్టీసి “మీ ఆయన గారు కాదమ్మా.. మీ మాఁవగారు!” అని, “మీ కష్టం మామీదొగ్గెస్తారా? మాకెందుకూ మీ కష్టం?” అని వెనక్కి తిరిగి చూరు కిందకి వంగి గబాల్న వెళ్ళి స్కూటర్ మీద కూర్చుంటే వోనరు, వెనకాలే సైకిలు మీద కుర్రాడు వేగంగా చాటా పంజాలోకి కలిసి పోయేరు. ఏభయ్ నోటు తడిగా గుళ్ళీ మీద తప తపా కొట్టుకుంటుంటే చేమల వేపుడు పిడస పెట్టుకుంటూ ఒక వేలితో దాన్ని నొక్కి పట్టుకున్నాడు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, కథ and tagged , , .

5 Comments

 1. ‘వొద్దు కొట్టకండి సంపీకండి ఈ సుట్టు పేసైపోతాడు’ అని వాళ్ళమ్మ అడ్డం పడితే

  ‘పరీక్ష పేసవలేదని కొట్టీస్సంపీసేడు మీ బావ!’ కొడుక్కోసఁవే ఏడ్చుకుంటూ వాళ్ళమ్మ

  “ఏఁవిండీ పెళ్ళింటి కొచ్చి ఉసూరుమని ఎళిపోవచ్చిస్తారా? కాదు పెళ్ళింటికొచ్చి ఉసురు కొట్టీసెళిపోతారా?!” “మీ కష్టం మామీదొగ్గెస్తారా? మాకెందుకూ మీ కష్టం?”

  కళింగాంధ్ర కధా రచనల గత వైభవపు రోజులనేవో గుర్తుకు తెచ్చిన కనక ప్రసాద్ గారు
  మీ మీద ఉక్కురోసంతో కూడిన కోపం ఎందుకొస్తాదో తెలీదు, కానీ వొస్తోంది.

 2. బాగున్నాదండి మీ కత. మొక్కజొన్న కండె తింటన్నట్టున్నాది చదువుతా ఉంటే. చదవతా చదవతా తియ్యగా ఉన్నాది. ఇలాగే మంచి మంచి తేగల్లాంటి కతలు రాయండి.

 3. kathamuraliకి…

  మీ మొదటి కామెంటులో అనవసరమైన దురుసుతనం వల్ల ఆ కామెంటు డిలీట్ చేసాం. ఆ సంగతి మీ మెయిల్ ఐడీకి తగ్గ మర్యాదతోనే తెలియజేశాం. అప్పుడప్పుడూ మీ దొంగపేరుతో పెట్టుకున్న మెయిల్ ఐడీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా ఇంత దురుసుతనంతో అడిగే ప్రశ్నలకు కనీసం అసలు పేరు పెట్టుకునే ధైర్యం ఐనా ఉండాలి. నకిలీ పేర్లు వాడుతూ మళ్లీ మీకేదో జవాబు పూచీపడ్డట్టు railing కి పాల్పడే వీలిక్కడ లేదు. నానెంటిటీలకి జవాబిచ్చే ఉత్సాహం చాలామందికి ఉండదు కూడా.

  మీ రెండో కామెంటు కూడా పొరబాట్న అప్రూవ్ అయింది. ఇప్పుడు అదే దురుసుతనం కారణంగా మరలా డిలీట్ చేయడమైంది. దురుసుతనానికి నాకు కనిపించిన కారణాలు: “సన్యాసి” అనే పాత్రని కావాలని “సన్నాసి” అని రాయటం. ఇంకొన్ని పదాలు.. “వూపుకుంటూ”, “ఆ పెద్దమనిషి”, రచయిత తిండి అభిరుచి మీద insinuations, చివర్లో ఏదో తేల్చేసిన బడాయితో బల్లగుద్దిన తీర్మానం.

  ఇక రచయిత గురించి నాకు తెలిసిందాన్ని బట్టి ఆయన మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడు. He won’t condescend. అలాంటి పరిస్థితుల్లో మీ అరకొర తెలివి ప్రశ్నలు ఏవో తిరుగులేనివిగా చెల్లిపోకూడదు కాబట్టి, ఆ కథ నచ్చిన ఒక తోటి పాఠకునిగా, నేనే మీకు సమాధానం ఇస్తున్నాను.

  మీ ప్రశ్నల్లో సింహభాగం ఇర్రిలవెంట్. బహుశా కథలో ఒరిజినాలిటీ దిగమింగుకోలేక మీడియోకర్ కథల కంఫర్ట్ జోన్ మీద మళ్లీ నమ్మకం కలిగించుకోవటానికి చేసుకున్న పనికిమాలిన రంధ్రాన్వేషణలు. అయినా మీరు మీ అభిప్రాయాల్నీ ఊహాగానాల్నీ ఎలా facts గా పేరేడ్ చేయిస్తున్నారో, నేనూ అలానే చేయిస్తా:

  1) అసలు మీకు ఈ కథ 2014లో జరిగిందని కథలో ఏమన్నా ఋజువులున్నాయా? గాలి శేషగిరిరావును తీసుకురావటమే కథాకాలం 1980లది అని చెప్తోంది కదా? లేదంటే కథలకి కూడా సినిమాల్లో సబ్ టైటిల్స్ వేసినట్టు “1980 – చాటపంజా” అని సబ్ హెడింగ్స్ వేయాలా?

  ఇక ఇది 1980ల్లో కథ అన్నప్పుడే దాన్ని బేస్ చేసుకుని మీరు ధర్మాగ్రహంతో సంధించిన కొన్ని ప్రశ్నలు (నంబర్లు 2, 6) హరీమన్నాయి.

  2) హరీమన్న ప్రశ్న

  3) అంత సంపాయించి ఇంకా పాక ఎందుకు వేసుకున్నాడూ అనే ఇర్రెలెవెంట్ ప్రశ్నకు జవాబు, అంత సంపాదించి ఇంకా యాభై రూపాయల దగ్గర అంత ఎందుకు పట్టుబట్టాడూ అన్న దానిలో ఉంది. అది ఆ మనిషి స్వభావం. ఆ స్వభావ చిత్రణే ఈ కథ.

  4) నాకు తెలిసి ఆదివారం వడ్రంగులు పని చేయకపోవటం అంటూ ఏం లేదు. అమావాస్య రోజు పని చేయరు. వాళ్ళే కాదు, వేరే వృత్తుల వాళ్లు కూడా ఇష్టపడరు.

  5) ఎల్లైసీ ఏజెంటైనా సెప్టిక్ టాంక్ క్లీనరైనా ఇంటికి కార్యార్థం వచ్చినపుడు ఎవరైనా కాఫీనో మరోటో ఇస్తారు. అది కనీస మర్యాద. దానికీ మళ్లా రూడ్ గా ఉండటానికీ సంబంధం ఏముంది?

  6) హరీమన్న ప్రశ్న

  7) అదేం చిన్న పల్లెటూరు కాదు, విశాఖపట్నం. తెలియటానికి ఎంత ఆస్కారం ఉందో తెలియకపోవటానికీ అంతే ఆస్కారం ఉంది. కథలో “మబ్బుపట్టింది” అంటే ఎంత తిరుగులేని ఫాక్ట్ అవుతుందో, ఇదీ అంతే తిరుగులేని ఫాక్ట్.

  8) మా ఇంట్లో వెండి కంచం ఉంది. అందులో తినను గానీ… ఇప్పుడు నేను లైఫ్ బాయే వాడతాను మరి. రచయిత ఇలాంటి వివరాల ద్వారా పాత్ర గురించి subtleగా పాఠకునికి ఏదో చెప్తున్నాడు. అది గ్రహించే బుద్ధి అక్కడ పెట్టకుండా దాన్నే మళ్లీ ప్రశ్న చేసి అడిగారంటే… ప్లెయిన్ రిడిక్యులస్.

  9) కొందరు వడ్రంగులు నాన్ వెజ్ తినరు. ముఖ్యంగా ఆంధ్రావైపు. ఒకవేళ తిన్నా, తినకపోయినా ప్రతి ఆదివారం కక్కముక్కలు తినాలన్న రూలు ఎవరింటా లేదు. ఇప్పుడంత విచ్చలవిడిగా బాయిలర్ కోళ్లు అప్పుడు దొరికేవి కూడా కాదు కదా! :) ఫలానా పాత్ర ఆదివారం చికెన్ ఎందుకు తినటం లేదని అడిగితే… Seriously, is that really a question! చికెన్ ఎందుకు తినటం లేదంటే చేమల కూర తింటున్నాడు కాబట్టి. ఇందాక 7వ ప్రశ్నకు జవాబులో చివరి వాక్యం మరలా చూసుకోగలరు. మీ ప్రశ్న “మబ్బుపట్టిందీ” అని రాస్తే ఎండెందుకు కాయలేదు అని అడిగినట్టే ఉంది.

  10) ఇందాకే చెప్పినట్టు.. నేను రచయితను కాపాడుతుంది ప్రశ్నల నుంచి కాదు, అర్థం చేసుకో ఇచ్ఛగించని మూర్ఖత్వం నుంచి.

  చివరిగా, కినిగె పత్రిక రచయితల మీదా, రచనల మీదా విమర్శల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. కానీ ఈగల్ని దోమల్నీ మాత్రం వాలనివ్వదు. ఆరోగ్యానికి చేటు కదా.

  మీ మిగతా కామెంట్ల అంగీకార తిరస్కారాలు అవి పాటించే కనీసమర్యాద మీద ఆధారపడి ఉంటాయి.

 4. ప్రసాద్ గారూ,

  2007లో అనుకుంటాను. మొదటిసారి మీ ఇసక కథ చదివి “అబ్బ.. కథ రాస్తే ఇతనిలా రాయాలి లేకపోతే మానెయ్యాలి” అనుకున్నాను. తర్వాత మీ కవితలు, కథలు , వ్యాసాలు వెతికి వెతికి మరీ చదువుకుని, నేను మర్చిపోయిన ఉత్తరాంధ్ర భాషనీ, మా కుటుంబాల్లోని మనుషుల్నీ, చిన్నప్పటి సంఘటల్నీ అన్నిటినీ మీ రచనల్లో చూసుకుని , దాదాపు మీలాంటి నేపథ్యంలోంచే వచ్చినా, మీ అనుభవాలన్నీ నాకూ అనుభవమే అయినా నేనెప్పటికైనా ఇలా రాయగలనా అనిపించేది. తర్వాత ఆలోచిస్తే అనిపించింది. మీలా రాయడానికి కేవలం భాష మీద పట్టు, కథ చెప్పడంలోని ఒడుపు వీటన్నిటికీ మించినదేదో కావాలని. అది ప్రపంచం మీద ఎల్లల్లేని ప్రేమ, కరుణ. గొప్ప జీవితంలోంచే గొప్ప సాహిత్యం పుడుతుందని మరోసారి అవగతమైంది. మీ రచనలు చదవగలగడం నా అదృష్టం.

  త్వరలో మీ నవలొకటి కినిగెలో సీరియల్ గా రావాలని ఆశిస్తూ..

  – సుబ్రహ్మణ్యం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.