cover

రచన కళ – హూలియో కొర్తసార్

Download PDF ePub MOBI

1960-70 ల్లో లాటిన్ అమెరికన్ సాహిత్యాన్ని అమాంతం ప్రపంచం పటం మీదకు లాక్కొచ్చి అంతకుముందు లేని ప్రఖ్యాతిని తీసుకొచ్చిన రచయితలు ప్రధానంగా నలుగురు: హూలియో కొర్తసార్, గాబ్రియెల్ గార్సియా మార్కెజ్, కార్లోస్ ఫుయెంతస్, మారియో బార్గస్ జోసా. వీళ్లందర్నీ కలిపి “లాటిన్ అమెరికన్ బూమ్” అంటారు. వీరిలో ముఖ్యుడు హూలియో కొర్తసార్ (Julio Cortázar). ఈయన Hopscotch (తొక్కుడు బిళ్ల) నవలతోనే ఆ “బూమ్” మొదలైందని అంటారు. ఇది విభిన్న నిర్మాణం గల నవల. ఇందులో అధ్యాయాల్ని వరసగానూ చదువుకోవచ్చు, లేదా పేరుకు తగ్గట్టు అటూ ఇటూ గెంతుతూ కూడా చదువుకోవచ్చు. కొర్తసార్ నవలాకారునిగా కన్నా కథకునిగా ఇంకా ప్రసిద్ధుడు. ఆయన కథలు అద్భుతరస ప్రధానమైనవి. Devil’s Drool అనే కథ ఆధారంగా ‘బ్లో అప్’ అనే సినిమా తీశారు. ఆయన బాల్యం అర్జెంటినాలోని బ్యునోస్ ఐర్స్ లో గడిచింది. అక్కడే ఉపాధ్యాయ వృత్తిలో కుదురుకున్నాడు. అర్జెంటినా సైనిక పాలనని బహిరంగంగా వ్యతిరేకించటంతో దేశ బహిష్కరణకు గురయ్యాడు. తర్వాత ఎక్కువ జీవితం పారిస్ లో గడిపాడు. ప్రముఖ రచనలన్నీ అక్కడే చేశాడు. దరిమిలా లాటిన్ అమెరికన్ రాజకీయ పరిస్థితి ఆయన దృష్టిని అటు మళ్లించింది. సైనిక నియంతృత్వాల్ని వ్యతిరేకిస్తున్న వివిధ విప్లవ పోరాటాలకు మద్ధతుగా నిలబడ్డాడు. ఆయన పారిస్ రివ్యూ ఇంటర్వ్యూలో కొన్ని భాగాలు ఇక్కడ:—

మీ ఇటీవలి సంకలనంలోని కథల్లో అద్భుతరసానికి (fantastic) చెందిన అంశాలు వచ్చి వాస్తవిక ప్రపంచంతో (real world) కలుస్తున్నట్టున్నాయి, ఇదివరకటికన్నా ఎక్కువగా. అద్భుతమూ వాస్తవికమూ ఒకటైపోతున్నట్టు మీకు అనిపిస్తుందా?

అవును, నా ఇటీవల కథల్లో అద్భుతరసానికీ మనం వాస్తవం అనేదానికీ మధ్య దూరం తగ్గిందనే నాకూ అనిపిస్తుంది.

మీరు గతకొన్నేళ్లుగా లాటిన్ అమెరికాలో జరుగుతోన్న వివిధ స్వేచ్ఛాపోరాటాలకు మద్ధతు తెలుపుతూ వస్తున్నారు. మీ రచనల్లో అద్భుత అంశాలు, వాస్తవిక అంశాలూ చేరువై మీరు మరింత సీరియస్ రచయిత కావటానికీ అది కూడా దోహదం చేసిందంటారా?

సీరియస్ అనే భావన నాకు నచ్చదు, ఎందుకంటే నేను సీరియస్ మనిషినని నాకనిపించదు. కాని గతకొన్నేళ్లుగా కొన్ని లాటిన్ అమెరికన్ పక్షాల – అర్జెంటినా, చిలీ, ఉరుగ్వే ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా నికరగ్వాల – తరపున నా ప్రయత్నాల్లో ఎంతగా నిమగ్నమయ్యానంటే కొన్ని కథల్లో ఈ ఇతివృత్తాల్ని డీల్ చేయటానికి అద్భుతరసాన్ని వాడాను, వాస్తవికతకు దగ్గరగా ఉండే పద్ధతిలో. నాకు ఇదివరకూ ఉన్నంత స్వేచ్ఛ లేదు. ఎందుకంటే ముప్ఫయ్యేళ్ల క్రితం నేను నా బుర్రలో పుట్టిన ఇతివృత్తాల్ని మాత్రమే రాసేవాణ్ణి, కళాత్మక దృక్కోణం నుంచే వాటిని బేరీజు వేసేవాణ్ణి. ఇప్పుడు కూడా నేను కళాత్మక దృక్కోణం నుంచే వాటిని బేరీజు వేస్తాను, ఎందుకంటే అన్నింటికన్నా ముందు నేనొక రచయితని. కానీ ఇప్పుడు నేను లాటిన్ అమెరికాలోని పరిస్థితుల పట్ల ఆవేదన చెందుతున్న రచయితని కూడా; అందువల్ల అది నాకు తెలిసో తెలియకుండానో నా రచనల్లోకి చొరబడుతుంది. కానీ నా కథలు సైద్ధాంతిక రాజకీయ సమస్యలతో నిమిత్తం కలిగిఉన్నప్పటికీ, వాటి అంతస్సారం మాత్రం మారలేదు. అవి ఇప్పటికీ అద్భుతరసంతో నిండిన కథలే.

ఇప్పుడు అందరూ నిబద్ధ రచయిత (engagé writer) అని పిలుచుకుంటున్న రచయిత ఎదుర్కునే ప్రధాన సమస్య ఏమిటంటే, రచయితగా మిగిలివుండటం. అతను రాసే సాహిత్యం కేవలం రాజకీయాంశాలతో నిండిపోతే, అది చాలా పేలవం అయిపోతుంది. చాలామంది రచయితల విషయంలో ఇదే జరిగింది. కాబట్టి సమతౌల్యం పాటించటం ముఖ్యం. నా వరకూ ముందు నేను రాసేది సాహిత్యం అవ్వాలి, నాకు చేతనైనంత ఉత్కృష్టమైన సాహిత్యం. అదేసమయంలో, అందులో కాస్త సమకాలీన వాస్తవికతను మేళవించాలి. అలాంటి సమతౌల్యం చాలా కష్టం. నా Deshoras సంకలనంలో ఎలుకల గురించి Satarsa అనే ఒక కథ ఉంది – అది అర్జెంటినా గెరిల్లాలకు వ్యతిరేకంగా పోరాడటం గురించి – అది రాస్తున్నప్పుడు కేవలం రాజకీయ స్థాయిలోనే కథ చెప్పాలన్న చాపల్యాన్ని నిగ్రహించుకోవాల్సి వచ్చింది.

అలాంటి కథలకు స్పందన ఎలా ఉంది? సాహితీవర్గాల నుంచి వచ్చే స్పందనకూ, రాజకీయవర్గాల నుంచి వచ్చే స్పందనకూ పెద్ద తేడా ఉందా?

ఉండక తప్పదు కదా. లాటిన్ అమెరికాలో రాజకీయాలంటే పట్టని బూర్జువా పాఠకులూ, లేదా మితవాద (రైట్ వింగ్) పక్షానికి చెందిన పాఠకులూ, వీళ్ళున్నారే, నన్ను కదిలించే దోపిడీ అణచివేత వంటి సమస్యలేవీ వీళ్ళను కదిలించవు. నా కథలు తరచూ రాజకీయాల వైపు మళ్లటం ఇలాంటి పాఠకులకు నచ్చదు. వేరే రకం పాఠకులుంటారు, ముఖ్యంగా యువకులు – నా భావాలనూ, నా పోరాడాల్సిన అవసరాన్నీ పంచుకునేవాళ్లూ, సాహిత్యాన్ని ప్రేమించేవాళ్లూ – వాళ్లు ఈ కథల్ని ఇష్టపడతారు. క్యూబన్ దేశస్తులు నా “Meeting”ను ఇష్టపడతారు. అలాగే నికరాగ్వన్లు నా “Apocalypse at Solentiname” అనే కథకు పదే పదే చదువుకుంటారు.

రాజకీయాంశాల పట్ల పెరుగుతున్న మీ ఆసక్తికి కారణం ఏమిటి?

లాటిన్ అమెరికాలోని సైనిక పాలన – వాళ్లే నన్ను మరింత శ్రమించేట్టు చేస్తున్నారు. వాళ్లు గద్దె దిగినట్టయితే, ఏదన్నా మార్పు సంభవించినట్టయితే, అప్పుడు నేను కాస్త విశ్రాంతి తీసుకుని పూర్తిగా సాహిత్యమే అనదగ్గ నా కవితలూ కథలూ రాసుకునే వీలుంటుంది. కానీ వాళ్లే నాకు ఇంత పని పెడుతున్నారు.

మీరు చాలాసార్లు సాహిత్యం అనేది ఒక ఆట అన్నారు. ఎలా?

నా వరకూ సాహిత్యం ఒక రకమైన ఆటే. కానీ దాంతో పాటు ఆటల్లో ఎప్పుడూ రెండు రకాలుంటాయి అని కూడా చెప్తూ వచ్చాను: ఉదాహరణకి ఫుట్‌బాల్, అది ఒకరకం ఆట, అలాంటివి గాక గొప్పవీ గంభీరమైనవీ ఆటలున్నాయి. పిల్లలు తమ సరదా కోసమే ఆడుతున్నా ఆ ఆటని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అది చాలా ముఖ్యం వాళ్లకి. ఇంకో పదేళ్ల తర్వాత ప్రేమని ఎంత సీరియస్‌గా తీసుకుంటారో ఇప్పుడు ఆటనీ అంతే సీరియస్‌గా తీసుకుంటారు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా తల్లిదండ్రులు అనేవారు “సరే ఇంక ఆటలు ఆడింది చాలు, వచ్చి స్నానం చేయి” అని. అది నాకు చాలా పిచ్చిమాటగా అనిపించేది, ఎందుకంటే, నా వరకూ స్నానం అనేది చాలా సిల్లీ విషయం. దానికి ఏ ప్రాముఖ్యతా లేదు, మరోపక్క నా స్నేహితులతో ఆటలు ఆడటం అనేది చాలా సీరియస్ విషయం. సాహిత్యం కూడా లాంటిదే – అది ఒక ఆట, కానీ పూర్తి జీవితం సమర్పించుకునేంతటి ఆట. ఆ ఆట కోసం ఏదైనా చేయచ్చు.

మీకు అద్భుతరసం పట్ల ఆసక్తి ఎప్పుడు మొదలైంది?

చిన్నతనంలోనే మొదలైంది. బడిలో నా తోటి విద్యార్థులు చాలామందికి అద్భుతత్వం పట్ల ఆ స్పృహ లేదు. వాళ్లు ఏది ఎలా ఉంటే అలానే స్వీకరించేవారు… ఇది ఒక మొక్క, అది ఒక కుర్చీ. కానీ నా దగ్గర అంత ఖచ్చితమైన నిర్వచనాలు లేవు. అమ్మ కూడా నన్ను ప్రోత్సహించింది. “తప్పురా అలాక్కాదు, సీరియస్‌గా ఉండాలి” అనటానికి బదులు, నేను ఊహలు అల్లుతుంటే సంతోషించింది; నేను అద్భుత కల్పనల ప్రపంచం వైపు మళ్లినపుడు, అందుకు పుస్తకాలిచ్చి సాయపడింది. నేను ఇంకా తొమ్మిదేళ్ల వయస్సులో ఉండగానే ఎడ్గార్ అలెన్ పో ను మొదటిసారి చదివాను. అమ్మకి నేనది చదవటం ఇష్టం లేదని దొంగిలించి మరీ చదివాను; కానీ అమ్మే కరెక్టు. ఆ పుస్తకం నన్ను భయపెట్టిన తీరుకి నేను జ్వరంతో మూడు నెలలు మంచం పట్టాను, ఎందుకంటే ఆ పుస్తకంలోనిదంతా నిజమని నమ్మాను. నావరకూ అద్భుత కల్పనలన్నీ పూర్తిగా సహజమనిపించేవి, సందేహమే ఉండేది కాదు. ప్రపంచం అలానే ఉందనిపించేది. అలాంటి పుస్తకాలు తోటి పిల్లలకు ఇచ్చినప్పుడు మాత్రం, “ఇది కాదు, మాకు కౌబోయ్ కథలిష్టం” అనేవారు. అప్పట్లో కౌబాయ్స్ అంటే బాగా పాపులర్. ఎందుకో అర్థమయ్యేది కాదు. నేను మానవాతీత ప్రపంచాన్నే ఇష్టపడేవాణ్ణి.

దరిమిలా చాలా యేళ్ల తర్వాత మీరు ఎడ్గార్ అలెన్ పో రచనలన్నింటినీ అనువదించారు. అంత దగ్గరగా చదివటం మూలంగా అందులో ఏమన్నా కొత్తగా కనుగొన్నారా?

ఎన్నో విషయాలు కనుగొన్నాను. నేను ఆయన భాషని దగ్గరగా పరిశీలించాను, ఆయన భాషని ఇటు ఇంగ్లీషు వాళ్లూ అటు అమెరికన్లూ కూడా చాలా అట్టహాసమైనదని (baroque) విమర్శిస్తారు. నేను అటు ఇంగ్లీషూ ఇటు అమెరికనూ కాదు కాబట్టి కొత్త దృక్కోణం నుంచి చూడగలిగాను. ఆయన రచనలో పాతబడిపోయిన అంశాలు, అతిశయోక్తులు చాలా ఉన్నాయని తెలుసు, కానీ ఆయన ప్రజ్ఞతో పోలిస్తే అవన్నీ అల్ప విషయాలు. ఆ కాలంలోనే The Fall of the House of Usher, Ligeia, Berenice, The Black Cat లాంటి కథలు రాయగలిగాడంటే అద్భుత మానవాతీత కల్పనలు చేయటంలో ఆయన సిసలైన ప్రజ్ఞ ఏమిటో తెలుస్తుంది. నిన్న ‘ఎడ్గార్ అలెన్ పో వీధి’లో ఒక స్నేహితుణ్ణి కలుసుకున్నాను. ఆ వీధి మొదట్లో శిలాఫలకంపై “ఎడ్గార్ అలెన్ పో, ఇంగ్లీషు రచయిత” అని ఉంది. ఆయన ఇంగ్లీషు రచయిత కానే కాదు!

మీ రచనల్లో అద్భుత రసంతో పాటూ పాత్రల పట్ల మీ ఆర్ధ్రత ఆత్మీయత వ్యక్తమవుతాయి.

బాల్య కౌమార దశల్లో ఉండే నా పాత్రల పట్ల నేను చాలా మార్దవంగాఉంటాను. నా కథల్లోను నవలల్లోనూ వాళ్లు చాలా సజీవంగా ఉంటారు; వాళ్లను చాలా ప్రేమతో ట్రీట్ చేస్తాను. నేను రాసే కథలో ఒక కుర్రాడి పాత్ర ఉంటే, అది రాస్తున్నంత సేపూ నేనే ఆ కుర్రాడినైపోతాను. పెద్దవయసు పాత్రలతో అలా ఉండదు.

మీ పాత్రల్లో చాలామంది మీకు తెలిసినవాళ్లేనా?

చాలామంది అనను గానీ కొందరున్నారు. చాలా సందర్భాల్లో నా పాత్రలు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మేళవింపు. ఉదాహరణకి నాకు తెలిసిన ఇద్దరు స్త్రీల నుంచి నేను ఒక స్త్రీ పాత్రని సృష్టించాను. అందువల్ల కథలోని ఆ పాత్రకు సంక్లిష్టమైన వ్యక్తిత్వం సమకూరుతుంది.

అంటే ఒక పాత్రని మరింత సాంద్రతరం చేయదల్చుకున్నప్పుడు ఇద్దర్ని కలిపి సృష్టిస్తారా?

అలా చెప్పలేం. పాత్రలే నన్ను నడిపిస్తాయి. అంటే, నేనొక పాత్రను చూస్తాను, వాడు నా కళ్లెదుట ఉంటాడు, అప్పుడు వాడిలో నాకు తెలిసిన ఎవర్నో గుర్తిస్తాను, లేదా అప్పుడప్పుడూ కాస్త దగ్గరగా కలిసిపోయిన ఇద్దర్ని గుర్తిస్తాను, అక్కడితో అది ఐపోతుంది. ఇక ఆ తర్వాత ఆ పాత్ర తనంతట తానుగా ప్రవర్తించటం మొదలుపెడుతుంది. మాట్లాడటం మొదలుపెడుతుంది… నేను సంభాషణలు రాస్తున్నప్పుడు అసలు ఏ పాత్ర ఏం మాట్లాడబోతుందో ముందుగా నాక్కూడా తెలియదు. అది వాళ్ల ఇష్టం. నేను చేసేదల్లా వాళ్లు మాట్లాడేది టైప్ చేయటమే. ఒక్కోసారి నేను పగలబడి నవ్వేస్తాను, లేదా ఆ కాగితం నలిపి పక్కన పడేస్తాను, “ఇదిగో, నువ్వు మాట్లాడింది పిచ్చి వాగుడు. ఫో!” అంటాను. తర్వాత ఇంకో కాగితం ఎక్కించి మళ్లీ వాళ్ల సంభాషణ టైప్ చేయటం మొదలుపెడతాను.

అంటే మిమ్మల్ని రాయటానికి ప్రేరేపించే పాత్రలు మీకు తెలిసినవి కాదన్నమాట?

అస్సలు కాదు. చాలాసార్లు ఏమవుతుందంటే, నాకు ఒక కథ తడుతుంది, కానీ అప్పటికింకా పాత్రలేవీ ఉండవు. నాకేదో వింత ఆలోచన తడుతుంది: ఏదో ఊళ్లో ఒక పెద్ద ఇంట్లో ఏదో జరగబోతుంది, నేను చూస్తాను… రాసేటప్పుడు నా నయనేంద్రియం ఎక్కువ పని చేస్తుంది, నేను అంతా చూస్తాను, నాకు అంతా కనపడుతుంది. ఆ ఊళ్లో ఉన్న ఆ ఇంటిని స్పష్టంగా చూస్తాను, ఉన్నట్టుండి, అక్కడ కొన్ని పాత్రల్ని తీసుకొచ్చి పెడతాను. ఆ పాత్రల్లో ఎవరో ఒకరు నాకు తెలిసిన వాళ్లు కావొచ్చు. కాకపోవచ్చు కూడా. చివరకొచ్చేసరికి నా పాత్రల్లో ఎక్కువశాతం కల్పితమే అయివుంటాయి. ఇవిగాక, ఇక నేనొకణ్ని ఉన్నానుగా. Hopscotch నవలలో ఒలీవియెరా పాత్రకీ నా జీవితానికీ కొన్ని పోలికలు కనపడతాయి. ఆ పాత్ర నేను కాదు, కానీ పారిస్‌లో నా తొలిరోజుల అరాచక జీవితం నుంచి తీసుకున్న అంశాలు చాలా ఉన్నాయి. అలాగని ఒలీవియెరా అంటే కొర్తసారే అనుకుని చదివిన పాఠకులు పొరపడినట్టే. కాదు, కాదు, నేను అందుకు చాలా భిన్నంగా ఉండేవాణ్ణి.

అలా ఎందుకు, మీ రచనలు ఆత్మకథాత్మకం కావటం ఇష్టం లేకనా?

ఆత్మకథ అంటే నాకు ఇష్టం లేదు. నేనెప్పుడూ నా జ్ఞాపకాలు రాయబోను. వేరేవాళ్ల ఆత్మకథలు నాకు ఆసక్తి కలిగిస్తాయి, కానీ నాది కాదు. ఆత్మకథ రాయాలంటే, నిజాయితీగా నిజాలే రాయాల్సొస్తుంది. ఆత్మకథ కల్పించి రాయలేనుగా. అప్పుడిక, నేను చేసేది ఒక చరిత్రకారుని పని అవుతుంది, నాకు నేనే చరిత్రకారుణ్ణి కావాలి, ఆ పని బోరుకొడుతుంది. ఎందుకంటే నాకు కొత్తగా పుట్టించటం ఇష్టం, కల్పించటం ఇష్టం. కాని నిజమే, తరచూ నేను ఒక నవలకో కథకో ఆలోచన చేసినపుడు, నా జీవితంలో కొన్ని క్షణాలూ సన్నివేశాలూ సహజంగా ఆ సందర్భంలో వచ్చి కూచుంటాయి. నా Deshoras కథలో ఒక కుర్రాడు తన స్నేహితుని అక్కతో ప్రేమలో పడటం అనేది నా జీవితంలోంచి తీసుకున్నదే. కాబట్టి అందులో చిన్న ఆత్మకథాత్మక అంశ ఉన్నదనే చెప్పాలి, కానీ అక్కడ మొదలయ్యాక ఇక అంతా అద్భుత కల్పనే ఎక్కువశాతం ఆక్రమిస్తుంది.

మీ కథల్ని ఎలా మొదలుపెడతారు? ఏదన్నా వాక్యం నుంచా, దృశ్యం నుంచా?

నా వరకూ కథలూ నవలలూ ఎక్కణ్ణుంచైనా మొదలుకావొచ్చు. కానీ రాయటానికి ముందే ఆ కథ చాన్నాళ్ల నుంచి, కొన్ని వారాల ముందు నుంచి, నాలో తిరుగుతూ ఉంటుంది. కానీ స్పష్టత ఉండదు; కథకి సంబంధించిన పైపై ఆలోచన మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి బహుశా ఆ ఇంట్లో ఒక మూల ఒక ఎర్రని మొక్క ఉంటుంది, ఆ ఇంట్లో ఎవరో ఒక ముసలాయన తిరుగుతూ ఉంటాడు. అంతే నాకు తెలిసేది. ఇప్పుడు కలల గురించి కూడా చెప్పుకోవాలి. ఇలా కథ రూపుదిద్దుకుంటున్న దశలో నాకు వచ్చే కలలన్నీ నా కథలో ఉండబోయే అంశాలకు చెందిన సంకేతాలూ ప్రతీకలతో నిండి ఉంటాయి. ఒక్కోసారి కథ మొత్తం కల రూపంలో వచ్చేయవచ్చు. నాకు బాగా పేరు తెచ్చిన నా మొదటి కథ House Taken Over నిజానికి నేను కన్న ఒక పీడకల. మెలకువ రాగానే కూర్చుని రాయటం మొదలుపెట్టాను. కానీ మామూలుగా ఐతే కలల్లోంచి బయటపడేవి తలా తోకాలేని సంకేతాలు మాత్రమే. అంటే నా అంతశ్చేతన కథ మీద పని చేస్తోంది – నేను కల కంటున్నప్పుడు ఆ కథ నా లోపల రాయబడుతుంది. కాబట్టి కథ ఎక్కణ్ణుంచైనా మొదలుకావొచ్చు అంటున్నానంటే దానర్థం అప్పటికి ఇంకా ఏది మొదలు అవుతుందో ఏది ముగింపు అవుతుందో నాకు తెలియదని. నేను రాయటం మొదలుపెడితే అదే మొదలు. అంటే కథ ఇలా మొదలవ్వాలని నేనేం అనుకోను; దానికదే అలా మొదలవుతుంది, అక్కణ్ణించి కొనసాగుతుంది, చాలాసందర్భాల్లో నాకు ముగింపు ఏంటన్నదానిపై కూడా స్పష్టత ఉండదు – ఏం జరగనుందో నాకు తెలియదు. కథ క్రమేణా ముందుకు సాగుతుంటే నాకు కొద్ది కొద్దిగా విశదమవుతూ వస్తుంది, ఉన్నట్టుండి ముగింపు ఎదురవుతుంది.

అంటే మీరు రాస్తూ రాస్తూనే కథని కనుగొంటున్నారన్నమాట?

అవును. జాజ్ సంగీతంలో ఇంప్రొవైజింగ్ లాంటిదే ఇదీను. మీరు ఒక జాజ్ సంగీతకారుణ్ణి “ఏం వాయించబోతున్నావు?” అని అడిగారంటే అతను ముఖం మీదే నవ్వుతాడు. అతనికి ఒక థీమ్ ఉంటుంది, మన్నించితీరాల్సిన కొన్ని శృతులుంటాయి, అప్పుడు తన ట్రంఫెట్ లేదా శాక్సఫోన్ తీసుకుని వాయించటం మొదలుపెడతాడు. ఐడియా ఏమిటన్నది ముఖ్యం కాదు. అతను వరుసగా వేర్వేరు అంతర్గత స్పందనల మీదుగా పయనిస్తాడు. ఒక్కోసారి అది చక్కగా వెలికి వస్తుంది, ఒక్కోసారి అలా రాదు. నాకూ అంతే. ఒక్కొసారి కథలకు నా సంతకం పెట్టడం కూడా ఇబ్బందనిపిస్తుంది. నవలల సంగతి వేరు, ఎందుకంటే నవలలపై నేను చాలా పని చేస్తాను; ఒక నిర్మాణం ఉంటుంది. కానీ నా కథల విషయంలో మాత్రం, నాలో ఉన్నదేదో చెప్తుంటే నేను రాసినట్టు ఉంటుంది తప్ప దానికి నేను బాధ్యుణ్ణి కాదనిపిస్తుంది. అలా ఐనా కూడా అవి నావే అనుకోవాలి కాబట్టి నేను వాటిని అంగీకరించక తప్పదేమో.

కథా రచనలో మీకు తరచూ సమస్యాత్మకంగా తయారయ్యే అంశాలేమైనా ఉన్నాయా?

లేవనే చెప్పుకోవాలి, ఎందుకంటే నేనిందాకే చెప్పినట్టు, కథ అంతకుముందే నాలో ఎక్కడో తయారై సిద్ధంగా ఉంది. అంటే దాని పరిమాణం నిర్మాణం దానికి ఉన్నాయి; అది చాలా చిన్న కథ అవుతుందా, లేదా కాస్త పెద్ద కథ అవుతుందా అన్నీ పూర్వనిశ్చితమే. కానీ గత కొన్నేళ్లుగా నాకు కొన్ని సమస్యలుగా తోస్తున్నాయి. నేను కాగితం ముందు కూర్చున్నాక ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఇదివరకటి కన్నా నెమ్మదిగా రాస్తున్నాను. రాసే పద్ధతి పొదుపుగా మారింది. కొంతమంది విమర్శకులు దానికి నన్ను తప్పుబట్టారు, వాళ్ళు అనేదేమిటంటే నేను రాన్రానూ నా కథల్లో అలవోకడ కోల్పోతున్నానని. నేను చెప్పదల్చుకున్నది చెప్పటానికి మరింత పొదుపైన దారిలో వెళుతున్నాను. అది మంచికో చెడుకో నాకు తెలియదు – ఏదేమైనా, ఇప్పుడు నేను రాసే పద్ధతి ఇది.

రాసింది మళ్లీ దిద్దుతారా?

చాలా తక్కువ. కారణం ఏమిటంటే ఆ రాస్తున్నదానిపై అంతకుముందు నుంచే నా మనసులో పని జరుగుతోంది కాబట్టి. నా రచయిత మిత్రులు కొందరి చిత్తుప్రతులు చూస్తాను, అంతా దిద్దుబాట్లతో, మార్పులతో, ఎడాపెడా బాణం గుర్తులతో… లేదు లేదు. నా చిత్తుప్రతులెప్పుడూ చాలా శుభ్రంగా ఉంటాయి.

మీ రాత అలవాట్లు (writing habits) గురించి చెప్పండి? ఏమన్నా మారాయా?

ఇప్పటివరకూ మారనిదీ, ఇకముందు మారబోనిదీ ఏమంటే, పూర్తి అరాచకత్వమూ గందరగోళమూ. నాకు అసలు ఒక పద్ధతి అనేదే లేదు. ఒక కథ రాయాలని బుద్ధి పుడితే మిగతా అన్నీ పక్కనపెట్టి ఆ కథ రాసేస్తాను. ఒక్కోసారి ఒక కథ రాశాకా, ఆ తదుపరి నెలా రెండునెలల్లో ఇంకో రెండో మూడో కథలు రాసేస్తాను. మామూలుగా కథలు వరుసల్లో తరలివస్తాయి. ఒక కథ రాయటం నన్ను కాస్త సంసిద్ధ స్థితిలో ఉంచుతుంది, అప్పుడు ఇంకో కథని వెంటనే “పట్టుకుంటాను”. నేను వాడుతున్న పోలిక చూశారుగా, నిజంగా అలానే జరుగుతుంది; కథ నాలోపలికి జారి పడుతుంది, నేను పట్టుకుంటాను. కానీ తర్వాత నేను ఏమీ రాయకుండా ఏడాది గడిచిపోతుంది… అస్సలేమీ ఉండదు.

మీకు రాయటానికి అనువుగా తోచే ప్రత్యేక స్థలాలేమైనా ఉన్నాయా?

అలాగనేం లేవు. మొదట్లో, నేను కాస్త వయసులో ఉన్నప్పుడు, Hopscotch నవలని ఈ పారిస్‌లో కాఫీ షాపుల్లో కూర్చుని రాశాను. అప్పుడు శబ్దాలు నన్ను ఆటంకపరిచేవి కాదు, పైగా అవి చాలా అనుకూలమైన ప్రదేశాలనిపించేది. అక్కడే చాలా పని చేశాను – రాయటమో లేదా చదవటమో. కానీ వయసుపెరిగే కొద్దీ కాస్త మార్పు వచ్చింది. కాస్త నిశ్శబ్దం ఉంటుందనిపిస్తేనే రాయటం మొదలుపెడుతున్నాను. సంగీతం ఉంటే అస్సలు రాయలేను. సంగీతం రచనా రెండు వేర్వేరు విషయాలు. ఇప్పుడు నాకు నిశ్శబ్దం కావాలి; కానీ అప్పుడప్పుడూ ఏదో హోటల్లోనో, విమానంలోనో, స్నేహితుని ఇంట్లోనో రాస్తూనే ఉంటాను.

జీవితానికీ సాహిత్యానికీ మధ్య సమతూకం సాధించటం కష్టం కదూ…

అవునూ కాదు కూడా. ఏవి మన ప్రాధాన్యతలన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి నైతిక బాధ్యతలకు సంబంధించిన ప్రాధాన్యతలైతే నేను ఒప్పుకుంటాను. కానీ నాకు తెలిసిన చాలామంది ఎప్పుడూ వాపోతూనే ఉంటారు. “అయ్యో, నాకు నా నవల రాయాలనుంది, కానీ ఇల్లు అమ్ముకోవాలి, పైపెచ్చు పన్నులు, ఏం చేయగలను?” అని. లేదా “నేను రోజంతా ఆఫీసులో పని చేస్తాను, ఇక ఎలా రాయగలననుకుంటున్నావు?” లాంటి కారణాలు చెప్తారు. నా వరకూ నేను UNESCO లో రోజంతా పని చేసి ఇంటికి వచ్చి నా Hopscotch నవల రాసుకున్నాను. ఒకడు రాయాలనుకుంటే రాస్తాడు. రాయటమనే శాపానికి గురైన వాడు రాసి తీరతాడు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, రచన కళ and tagged , , , , .

3 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.