cover

పదనిష్పాదన కళ (3)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

ఆదాన అనువాదాల పట్ల అపోహలు

ఆంగ్లపదాల ద్వారా వ్యక్తమయ్యే భావాన్ని తెలుగుపదాలతో అనువదించి వాడుతూంటే “మక్కికి మక్కి” అని, “True translation” అనీ పేర్లుపెట్టి వెక్కిరించడం కనిపిస్తోంది. ఈ వెక్కిరింపులకి పాల్పడుతున్నది తెలుగువారే, ఇతరులు కారు. ఆ విధంగా తెలుగులో నూతనపద నిష్పాదకుల్నీ, పదప్రయోక్తల్నీ మానసికంగా క్రుంగదీయాలనే ప్రయత్నమూ, నిరుత్సాహ పఱచాలనే వ్యూహమూ, అలా తెలుగుపై ఇంగ్లీషుపదాల బాహుళ్యాన్ని శాశ్వతంగా వ్యవస్థాపించాలనే ఆకాంక్షా వెల్లడవుతు న్నాయి. అనువాదాల రూపంలోనైనా సరే, తెలుగు బతికి బట్టగట్టడం వారికి ఇష్టం లేదు.

ఇలా అవహేళనలకి దిగేవారి ఉద్దేశంలో– ఆ తెలుగు ప్రత్యామ్నాయాలు ఒరిజినల్ కావు. అవి నకిలీ. కాబట్టి వెకిలి. ఒరిజినల్ ఇంగ్లీష్ ఐడియాస్‌ని ఇలా అనువాదాల రూపంలో దొంగిలించి ఆ ఐడియాస్‌కి మూలపురుషులైన ఇంగ్లీషువారి గొప్పదనాన్ని తెలుగువారు తెలుసుకోకుండా చేసి కప్పిపుచ్చడమూ, అవేవో తెలుగువారి ఒరిజినల్ ఐడియాస్ అయినట్లు ప్రచారమైపోవడమూ ఘోర అన్యాయం, అక్రమం. దురాగతం. తెలుగు తెలివితక్కువ, వెనకబడ్డవాళ్ళ భాష. ఇందులో తెలివైన వ్యక్తీకరణలెలా ఉంటాయి? మా లెక్క ప్రకారం ఉండకూడదు. తెలివైన, నాగరికమైన వ్యక్తీకరణ ఏదైనా ఉంటే దానికి ఇంగ్లీషు ముద్ర ఉండాలి. అదే ఆధునికత. అదే అభివృద్ధి. అదే గౌరవనీయత. అదే విజ్ఞానానికీ, నాగరికతకీ, అభ్యుదయ దృక్పథానికీ అసలైన చిహ్నం. మేము సాక్షాత్తూ ఒరిజినల్ ఇంగ్లీషే తెలిసినవాళ్ళం. ఈ నకిలీ (తెలుగు) పదాలతో మాకేం పని?”

గ్రహించగలిగితే, ఇంతుంది ఈ ఎగతాళ్ళ వెనక!

అయితే, ఓ విషయం. ఇలా అనుకుంటున్నది, ఇంగ్లీషు అఱకొఱగా నేర్చుకుని తలలెగరేస్తున్న ఒక వర్గం మాత్రమే. ఇంగ్లీషు తెలియని ఆంధ్రులు అనువాద పదాల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఆంగ్లపదాల బదులు అవే వాడుతున్నారు. ఎందుకంటే వారివఱకూ వాటికి (తెలుగుపదాలకి) ప్రత్యామ్నాయం లేదు. కానీ ఆంగ్లవిద్యావంతులైన ఆంధ్రుల వఱకూ ప్రత్యామ్నాయం (ఇంగ్లీషు) ఉంది. తెలుగంటే ఉన్న చిఱాకువల్ల అనవసరమైన మూలవిధేయతని కౌగలించుకుంటున్నారు. కాబట్టి తెలుగు వారికి ఒక ప్రత్యామ్నాయభాషని చూపించినప్పుడు వారు తెలుగుని వదిలేయడమే కాకుండా దాన్ని కించపఱుస్తారని సూచించబడుతోంది. అందువల్ల భాషాపరమైన మానసిక పరిణతి విషయమై ఇంకా ఎన్నో మైళ్ళు ప్రయాణించాల్సి ఉన్న ఈ జాతికి ఇంత విస్తృతంగా విదేశీభాషాశిక్షణ ఇవ్వడం భస్మాసురహస్తంలాంటిది కావచ్చుననిపిస్తోంది. ఆంగ్లవిద్యావంతుల విషయానికొస్తే, తాము ఒరిజినల్ ఇంగ్లీష్ ఐడియాస్ అనుకొని వాడుతున్న అనేక పదాలు, వాస్తవానికి ఇతరభాషల నుంచి ఆంగ్లేయులు మక్కికి మక్కి అనువదించుకొని వాడుతున్నవని ఈ బడాయితెగ ఆంధ్రులకి తెలియదు. మచ్చుకు ఈ క్రింది జాబితా పరికించండి :

ఆంగ్లేయులు చైనీయభాష నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని :

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం           దాని మూలపదం

Running Dog                                         zǒu gǒu.

Brainwashing                                        xǐ nǎo

Look-see calques                                 kànjiàn

lose face                                                  diū liǎn

Paper tiger                                             zhǐ lǎohǔ

ఆంగ్లేయులు పరాసుభాష (ఫ్రెంచి) నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని:

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం           దాని మూలపదం

Adam’s apple                                         pomme d’Adam

Bushmeat                                               viande de brousse

deaf-mute                                               sourd-muet

By heart (or off by heart)                   par cœur                          

Governor-General                                Gouverneur Général

Free verse                                                vers libre

Old guard                                                 Vieille Garde (the most senior regiments of the

Flea market                                             marché aux puces

Marriage of convenience                    mariage de convenance

New Wave (artistic period)                Vague

rhinestone                                               caillou du Rhin “Rhine pebble”

Staircase wit                                            l’esprit de l’escalier

that goes without saying                     cela va sans dire

Point of view                                           point de vue

ఆంగ్లేయులు ఒలందుభాష (డచ్చి) నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని:

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం          దాని మూలపదం

Masterpiece                                           meesterstuk

Pineapple calques                                pijnappe

Superconductor                                    Dutch supergeleider[20]

ఆంగ్లేయులు శార్మణ్యభాష (జర్మన్) నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం           దాని మూలపదం

Antibody                                                 Antikörper

Ball lightning                                         Kugelblitz

Beer garden                                            Biergarten

Concertmaster                                       Konzertmeister

Flamethrower                                        Flammenwerfer

Foreword                                                  Vorwort

Heroic tenor                                            Heldentenor

Homesickness                                         Heimweh

Intelligence quotient                             Intelligenzquotient

Loan translation                                      Lehnübersetzung

Loanword                                                  Lehnwort

mercury/quicksilver vapor lamp       Quecksilberdampflampe

Motorway                                                   Autobahn

Overman and superman                        Übermensch

Power politics                                            Machtpolitik

Rainforest                                                   Regenwald

Standpoint (point of view)                    Standpunkt

Superego                                                    Überich

Stormtroopers                                          Sturmtruppen

Subliminal                                                 unterschwellig

Thought experiment                              Gedankenexperiment

Watershed                                                 Wasserscheide

Worldview                                                  Weltanschauung

World war                                                  Weltkrieg

ఆంగ్లేయులు యూదీయభాష (హీబ్రూ) నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో ఒకటి.

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం         దాని మూలపదం

Scapegoat                                              עזאזל (Azazel) (A departing goat)

ఆంగ్లేయులు రోమకభాష (ల్యాటిన్) నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని:

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం           దాని మూలపదం

Commonplace                                       locus commūnis

Devil’s advocate                                    advocātus diabolī

Wisdom tooth                                       dēns sapientiae

Milky Way                                              via lactea

Rest in Peace                                         requiescat in pace

In a nutshell                                           in nuce

ఆంగ్లేయులు శ్పానిష్ నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని:

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం                 దాని మూలపదం

Blue-blood                                                    sangre azul

Moment of truth                                        el momento de la verdad

ఆంగ్లేయులు ఇతరభాషల నుంచి అనువదించుకున్న వ్యక్తీకరణలలో కొన్ని:

ఆంగ్లంలోని ఆదాన అనువాదపదం                 దాని మూలపదం

Gospel                                                             evangelion (good news) (Greek)        

Hotdish                                                          varmrett/varmrätt (Scandinavian)

ఇంగ్లీషే కాదు, అన్ని భాషల్లోనూ ఆదాన అనువాదాలు మామూలే. అవి లేని భాషే ప్రపంచంలో లేదు. అలాంటప్పుడు కేవలం తెలుగులోనే దాన్నెందుకు తప్పుగా చూడాలో అగమ్యగోచరం. మనం పదాలని అనుకుంటున్నవన్నీ నిజానికి పరిభావనలే. కొన్ని పరిభావనలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, ప్రత్యేక పరిస్థితుల మధ్య, ప్రత్యేక వాతావరణాల్లో కవితాత్మకంగా అంకురి స్తాయి. జనం వ్యక్తీకరణ అవసరాల్ని పురస్కరించుకొని వాటిని తమ మాతృభాషకి చెందిన కొత్తపదాల్లోనూ, పదబంధాల్లోనూ వెలిబుచ్చుతారు. అవే సందర్భాలూ, పరిస్థితులూ, వాతావరణాలూ తారసిల్లనివారు, లేదా తారసిల్లినప్పటికీ వాటి గుఱించి కవితాత్మక ఊహలు తట్టనివారు ఆ కవితాత్మకత తమకి నచ్చినప్పుడు వాటిని తమ భాషలోకి అనువదించుకోవడం తప్పు కాదు. ఆలోచనల్ని వ్యక్తీకరించనంతవఱకే అవి వ్యక్తివి. ఒకసారి వ్యక్తీకరించడమంటూ జఱిగాక అవి సమాజానివీ, దేశానివీ, ప్రపంచానివీ, యావన్మానవజాతివి కూడా! ఇది వ్యక్తులకే కాదు, భాషలక్కూడా వర్తిస్తుంది.

ప్రతికూల వాతావరణం

తెలుగువారి ఈ మాతృభాషావ్యతిరేక మనస్తత్త్వమూలాలు చాలా లోతైనవి. ఈ సందర్భంలో వాటిని టూకీగానైనా గుర్తుచేసు కోకుండా ఉండలేం. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నిదశాబ్దాలైనా మనం భాషాపరంగా సంపూర్ణ బానిసత్వంలోనే కొనసాగుతున్నాం. నోటిమాటగా ప్రజాస్వామ్యం అంటూ ఊదరగొడుతున్నా, వాస్తవంగా ప్రజాభాషైన తెలుక్కి ఏ విధమైన రాజకీయ, ఆధికారిక హోదా లేకపోవడం వల్ల ఈ భాష పట్ల విస్తారంగా వ్యాపించిన చిన్నచూపూ, హీన భావన చివఱికి ఈ భాషాప్రజలు తమ మాతృభాషాపదాల్ని తాము వాడుకోవడాన్ని కూడా ఓ అప్రాచ్యప్పనిగా, అవహేళనగా, ఎగతాళిగా ఒక రహస్య నిషిద్ధ కార్య కలాపంగా మార్చాయి. నాలుగు ఇంగ్లీ‌షుముక్కలు నేర్చుకున్న ప్రతితెలుగువాడూ తన జాతీయతామూలాలు మర్చిపోయి “తానో పుట్టు అమెరికన్” అన్నట్లు ప్రవర్తిస్తూ తెలుగుని బహిరంగంగా కించపఱచడానికి వెనకాడ్డం లేదు. నిజంగా అమెరికన్‌ లై పుట్టినవాళ్ళు కూడా ఇలా చేయరు. ఆంధ్రప్రభుత్వం తెలుగుని ఏ మాత్రమూ పట్టించుకోకపోవడంతో “మొగుడు ముండా అంటే ముష్టివాడు కూడా ముండా అన్నా” డన్నట్లు తయారయింది పరిస్థితి. అలాంటివాళ్ళు అలా కించపఱుస్తూంటే “అది తప్పు. మన మాతృభాషని మనం అలా అనకూడ”దని ఎలుగెత్తి ఖండించేవాళ్ళు కూడా లేకుండాపోయిన దౌర్భాగ్య పరిస్థి తుల మధ్య ఈ జాతి జీవిస్తోంది. దేశపౌరుల్ని విదేశాలకీ, విరాష్ట్రాలకీ సామూహికంగా ఎగుమతి చేయడానికీ, ఆ విధంగా వారిని శాశ్వతంగా ఇక్కణ్ణుంచి లేవగొట్టి వలసపంపడానికీ మాత్రమే ఉద్దేశించిన మన విద్యావ్యవస్థ మాతృభూమి, మాతృభాష, స్వజాతి అనే భావనల్ని మనవారిలో లోతుగా నాటడంలో విఫలమవుతోంది. జాతిపరమైన స్వాభిమానమూ, ఆత్మ గౌరవమూ లేకుండా ప్రవర్తించడమే ఆధునికతగా, విశాలహృదయంగా మన మధ్య ప్రచారంలోకి వచ్చేసింది.

దీనికి తోడు పెక్కు అంతర్జాతీయ ప్రసారసంస్థలూ, జాలగూళ్ళూ (websites) తెలుగుని తమ భాషల జాబితాలో చేర్చవు. కానీ ఆ జాబితాలో తమిళం, హిందీ, బెంగాలీ మాత్రం ఉంటాయి. కొన్నిసార్లు ఉర్దూ, గుజరాతీ, పంజాబీ కూడా ఉంటాయి. దీనిక్కారణం, తమిళమూ, హిందీ, బెంగాలీ ఏదో ఒక స్వతంత్ర దేశానికి జాతీయభాషలూ, అధికార భాషలై ఉండడం. తమిళం శ్రీలంక, సింగపూర్, మలేషియా అనే స్వతంత్ర దేశాల్లో (సహ) అధికారభాషగా ఉంది. హిందీ ఇండియాకి అధికార భాషగా ఉంది. బెంగాలీ బాంగ్లాదేశ్‌కి అధికారభాషగా ఉంది. కానీ టోకున పన్నెండుకోట్లమంది తెలుగుభాషులూ, 2000

సంవత్సరాల చరిత్రా, అనేక దేశాలకంటే సువిశాలతరమైన ఒక పెద్దరాష్ట్రమూ ఉన్నప్పటికీ, తెలుగు ఏ దేశానికీ జాతీయభాష గానీ, అధికారభాష గానీ కాకపోవడంతో ప్రపంచభాషల జాబితాలోకి ఎక్కలేని, ప్రపంచానికి పరిచితం కాలేని విచిత్ర నిస్సహాయ పరిస్థితిలో పడిపోయింది.

“పిచ్చి ముదిరింది, ఱోకలి తలకు చుట్ట”మన్నట్లు ఈ పరిస్థితికి భాషాశాస్త్రవేత్తలమని చెప్పుకునేవారు కొందఱు తోడయ్యారు. భాషని సరిగా నేర్పడం, కాపాడడం, దాన్ని భవిష్యత్తరాలకి భద్రంగా అందించడం– ఇలాంటివాటిమీద సుతరామూ నమ్మకం లేనివారు వీరు. భాషాపరంగా పక్కా శూన్యవాదులూ, భాషానాస్తికులు. భాషావేదాంతులు. వీరు తమ ఆయుర్దాయంలో అనేక సంవత్సరాలు వెచ్చించి చివఱికి నేర్చుకున్నది,భాష శాశ్వతం కాదు. భాష నశించిపోతూంటే మనం గుడ్లు మిటకరిస్తూ చూస్తూ కూర్చోవాలి. ఏ భాషైనా ఒకటే. ఏ పదమైనా ఒకటే అని! నిజానికి ఇలా ప్రసంగించేవారు భాషాశత్రువులే తప్ప శ్రేయోఽభిలాషులు కారు. కానీ దురదృష్టవశాత్తూ, తెలుగుమీద మాట్లాడడానికి ఈరోజున ఇలాంటివారే గొప్ప ప్రామాణిక విద్వాంసులై కూర్చున్నారు. వీరి వైరాగ్యపూరితమైన దుర్బోధల ఫలితంగా నిజమైన భాషాభిమానులూ, భాష మనుగడ కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న కార్యశూరులు కూడా తప్పుదోవ పడుతున్నారు, నిరుత్సాహం చెందుతున్నారు. మనం ఒక జాతిలో జన్మించాక దాని భాషా, మత, సంస్కృతుల పట్ల తటస్థంగా ఉండే హక్కుని కోల్పోతాం. ఎందుకంటే ఆ సంస్కృతికి మనం తప్ప వేఱే దిక్కులేదు.

మానసిక అవరోధాల్ని అధిగమించాలి

నా దృష్టిలో ఇది తెలుగూ-ఇంగ్లీష్ గొడవ కాదు. ఇది ఒక మానవ కల్పిత మానసిక అవరోధానికి (mental barrier కి) సంబంధించిన విషయం. నిజానికి తెలుగుపదాలూ మన సృష్టి కాదు. ఇంగ్లీషు పదాలూ మన సృష్టి కాదు. ఈ రెండూ కూడా ఎవఱో, ఎప్పుడో, ఎక్కడో కల్పించగా మనం నేర్చుకుని వాడుతున్నవే. మనకి ఈ విషయంలో ఏ విధమైన నిర్ణయాధికారమూ (judgment) లేదు. కానీ మనం అలా తీర్పుతీర్చబూనుకుంటున్నాం. ఇంగ్లీషుని అందుకోవడానికి సిద్ధంగా మనం మన మనస్సుల్ని కార్యక్రమించాం. తెలుగు విషయంలో అలాంటి కార్యక్రమణం (programming) జఱగలేదు.

అర్థం కావడమనేది ఒక ఉత్తరోత్తర ప్రక్రియ (incremental process). మనకి పదేళ్ళప్పుడు అర్థం కానివి ఇఱవ య్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. ఇఱవయ్యేళ్ళప్పుడు అర్థం కానివి నలభయ్యేళ్ళప్పుడు అర్థమవుతాయి. “జీవితం ఒక నిరంతర అభ్యసనా ప్రక్రియ” అని ఇందాకనే చెప్పుకున్నాం కదా! అలా కాదు, అన్నీ విన్నవెంటనే అర్థమైపోవాలని పట్టుపట్టితే అది అపరిణతి అవుతుంది. భాష యొక్క ప్రయోజనం అర్థం కావడమొక్కటే కాదు. ఇంకా చాలాపనులు (functions) ఉన్నాయి దానికి! భాష ఒక జాతి యొక్క దృక్పథాన్ని ఆవిష్కరిస్తుంది. అది ఒక జాతిని సృష్టిస్తుంది కూడా. గతానికీ, వర్తమానికీ వార ధిగా నిలుస్తుంది. అలాగే వర్తమానానికీ, భవిష్యత్తుకీ మధ్య కూడా వారధిగా నిలుస్తుంది. అది విజ్ఞానాన్ని అందిస్తుంది. వినో దింపజేస్తుంది. అది సంగీతాది కళలకి ఆలంబన. ఆధ్యాత్మికతకి తొలిమెట్టు. అది ఒక సమాజాన్ని కలుపుతుంది. తెలిసిన పరిభావనల నుంచి తెలియని పరిభావనలకి అది మనల్ని తీసుకెళుతుంది.

తెలుగులో అనేక భాషాపదాలున్నప్పుడు ఇంగ్లీషు పదాలు ఎందుకు ఉండకూడదు?

అరువు దెచ్చుకున్న పదాలతో తదుపరి పదనిష్పాదన సాధ్యం కాదు. వాటి మూలధాతువులూ, నిర్మాణసరళీ తెలియకపోవడం వల్ల అలాంటి పదాలనుంచి స్వతంత్రంగా పదకుటుంబాల్ని నిష్పాదించే స్వేచ్ఛని జనసామాన్యం కోల్పోతుంది. అందువల్ల ఈ వాదాన్ని ఇంతకుముందే పరాస్తం చేయడం జఱిగింది. ప్రత్యామ్నాయం లేనప్పుడు పరభాషాపదాలు వాడొద్దని ఎవఱూ అనరు. పునరుద్ధరించి వాడుకోవడానికీ, కొత్తగా సృజించడానికీ తెలుగులో విస్తారమైన అవకాశమున్నప్పుడు కూడా, ఆ ప్రయత్నం ఇసుమంతైనా చేయకుండా బస్తాలకొద్దీ విదేశీపదాల్ని కృత్రిమంగా దిగవెయ్యడాన్నే ప్రశ్నిస్తున్నాం. కొత్త తెలుగు పదాల్ని కల్పించినప్పుడు “ఆ రూపకర్తలు సొంత పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నా”రని ఆరోపించే ఆంగ్లాభిమానులు తెలుగంతా ఇంగ్లీషుపదాలతో నింపడం ద్వారా తమ ఆంగ్ల పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు కాదా? భాషాప్రయోజనమూ, వాడుకా – వీటన్నింటి కంటే ముఖ్యమైనది భాషాభిమానం. అదంటూ అసలుంటే, వాడుక మొదలైనవన్నీ చిన్న విషయాల్లా కనిపిస్తాయి. ఆ అభిమానమే లోపించాక ప్రతి చిన్నవిషయమూ ఓ పెద్దసమస్యై కూర్చుంటుంది. చర్చల స్థానంలో అహంకారప్రదర్శనలు బయల్దేఱతాయి.

“ఇది వాడాలి, అది వాడకూడదు” అని కాదు భాషాభిమానులు చెబుతున్నది. ఈ భాషాజాతిలో జన్మించినందుకు ఈ భాష మీద అభిమానాన్ని పెంచుకోమని చెబుతున్నారంతే. అది మనిషి యొక్క కనీస ధర్మం. కర్తవ్యం కూడా! భాష అనేదొక వ్యక్తి కాదు. దానంతట అది వృద్ధి చెందడానికి. దాన్ని ఎవఱు మాట్లాడతారో వారే దాన్ని వృద్ధిచేయాలి. ఆ బాధ్యత వారిదే. అన్ని ఇతర భాషల విషయంలోనూ ఇప్పటిదాకా ఇలాగే జఱిగింది. మన ప్రయత్నం లేకుండా మన భాష వృద్ధిచెందదు, వ్యాపిం చదు. అది వృద్ధి చెందకపోతే ఆ పాపం మనదే. భాషది కాదు.

తెలుగులో ఉన్న పదవైవిధ్యం దాన్ని ఇతరభాషాపదాలతో నింపెయ్యొచ్చు నన్నదానికి సమర్థకం గానీ అనుమతి పత్రం (license) గానీ కాదు. ఒక భాషలో ఉన్న వైవిధ్యం ఆ భాషాప్రజల వైవిధ్యభరిత ఆలోచనావైఖరి (variety thinking) కి నిదర్శనం. భాష ఎంత ఎక్కువ భౌగోళిక విస్తీర్ణంలో మాట్లాడబడితే అంత వైవిధ్యభరితంగా ఉంటుంది దానిలోని పద జాలం! తద్విరుద్ధంగా ప్రతిపదాన్నీ అరువు దెచ్చుకోవడం సృజనాత్మక శక్తిలోపానికి తార్కాణం. అది కనీసం మూడు విష యాల్ని సూచిస్తుంది.

౧. ఆ వ్యక్తుల్లో సృజనాత్మకత లేదని, స్వకీయంగా (original) గా ఆలోచించడం సంగతలా ఉంచి వారు కనీసం అను వాదాలు కూడా చెయ్యజాలరని!

౨. వారికి తమ భాషపైనే పట్టులేదని! తమ మాతృభాషాపదాల నిర్మాణాల్ని వారు అర్థం చేసుకోలేక పోతున్నారని, వాటి ననుసరించి సరికొత్త పదనిర్మాణాలు చెయ్యడానికి అవసరమైన భాషా-శాబ్దిక-వైయాకరణ-శిక్షణ వారిలో దయనీయంగా లోపించిందని!

౩. అలాంటివారి చేతుల్లో ఉండడం వల్ల ఆ భాష ఎదగాల్సినంతగా ఎదగడం లేదని!

మనం కల్పించిన పదాల్ని తత్‌క్షణమే వాడడం మొదలుపెట్టాలి. మనం ఇప్పుడు వాడినా అవి విస్తృతంగా వ్యవహారంలోకి రావడానికి చాలా కాలం పట్టుతుంది. మొదలే వాడకపోతే ఇంకా ప్రమాదం. ఔత్సాహిక పదకల్పకులు/ వ్యవహర్తలూ తమ రచనల్లో కొత్త పదాల్ని పతాక శీర్షికలుగా పెట్టి వ్రాస్తే బావుంటుంది. పదాల్ని ప్రచురపఱిచేందుకు చిన్న కిటుకు ఏమిటంటే- ఒక్కొక్క వాక్యంలో ఒకటి, రెండు కన్నా ఎక్కువ కొత్త పదాలు ఉండకూడదు. అలా ఉంటే పాఠకుడిలో “ఈ రచయిత దారే వేఱు” అనే భావన ఏర్పడి మొదటికే మోసమొస్తుంది. కొత్తపదాలు వాటి ఉద్దిష్ట అర్థంలో వెంటనే అర్థం కావడం కష్టం కనుక ప్రతి కొత్త పదానికీ కుండలీకరణాల (brackets) లో దాని ఆంగ్లసమార్థకాన్ని ఇవ్వడం ప్రయోజనకరం. ఇలాంటి జమిలి ప్రయోగాలు చాలాకాలం పాటు తప్పవు. మన రచనలన్నీ ఇలా కుండలీకరణాలతో నిండిపోయినా విచారించకూడదు.

కొత్త పదాల నిష్పాదనకు తెలుగులో ఉన్న వనరులేంటి?

చాలా భావాల వ్యక్తీకరణకి ఇంగ్లీషులో చేస్తున్న వాడుకలు ఇంగ్లీషు కానేకావు. అవి లాటిన్, గ్రీకు పదప్రత్యయ నిర్మాణాలు. అది వారికి చేతైనప్పుడు మన తెలుగు-సంస్కృత పదప్రత్యయ నిర్మాణాలతో స్వకీయత (originality) కలిగిన దేశీయ ప్రత్యామ్నాయాల్ని రూపొందించడం మనకెందుకు చేతకాదని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. మన భాష అంత పదదారిద్ర్యంతో అలమటిస్తున్నది కాదు. తన పదాల్ని నేర్పేవారూ నేర్చుకునేవారూ దూరం చేయబడి అల్లాడుతున్నది మాత్ర మే. మన భాషకి ఇంగ్లీషు కంటే ప్రాచీనచరిత్ర ఉంది. ఇంగ్లీషుకంటే ప్రాచీనమైన సాహిత్యమూ ఉంది. పదాలు ఒక జాతి యొక్క మేధశ్చరిత్రని సూచిస్తాయి. పరాయిపదాల్ని భారీగా వాడడమంటే ఒక జాతిగా మనకి బుద్ధి లేదని, స్వకీయత (ori-ginality) శూన్యమనీ ఒప్పుకోవడమే అవుతుంది. తాత్కాలికంగా పని జఱగడం కంటే ఒక భాషాజాతిగా మన అస్తిత్వమూ, మన సంప్రదాయమూ, మన ప్రతిష్ఠ శాశ్వతప్రాతిపదికన నిలబడ్డం ముఖ్యం. ఆ దృష్టి లేనివారూ, రోజువారీ మనుగడ గుఱించీ, “జఱగడాల” గుఱించీ మాత్రమే ఆలోచించే స్థాయిలో ఉన్నవారూ మేధావులు (intellectuals) కాజాలరు. అలాంటివారి చేతుల్లో జాతి భవిష్యత్తు అంధకార బంధురం.

నిఘంటువులు/వ్యాకరణాలూ పనికొస్తాయి, అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ!

  1. మనం మర్చిపోయిన పదాల్ని మనకి గుర్తుచేస్తాయి.
  2. మనకి పనికొచ్చే/మనం అనుసరించదగ్గ పదనిర్మాణ నమూనాల (word construction models) ని సరఫరా చేస్తాయి.
  3. మనం అర్థాన్ని అన్యథాప్రకల్పన చేసి వాడుకోదగ్గ పర్యాయపదాల్నీ, ప్రత్యామ్నాయాల్నీ అందిస్తాయి.
  4. మనం కార్యవ్యగ్రులం కావడానికి కావాల్సిన ముడిసరుకుల్ని సమకూఱుస్తాయి.
  5. మనం అనవసరశ్రమ తీసుకుంటున్నామా? ఇప్పటికే ఉన్న పదాల్ని మళ్ళీ కష్టపడి కనుక్కుంటున్నామా కాదా? తనిఖీ చేసుకోవడానికి ఆచూకీలు (references) గా ఉపకరిస్తాయి.

మన జాతి సుదీర్ఘకాలం పాటు నిరక్షరాస్యతలో గడపడం చేత పెక్కు పదాలు వ్యవహారదూరమైపోయాయి. మన వారు అక్ష రాస్యులయ్యేలోగా నాగరికతా, సంఘజీవనమూ కూడా మారిపోయి వియ్యంకుడు, షడ్డకుడు, ఏరాలు లాంటి వరసలూ, ’దబ్బనం, గుండ్రాయి, ఱాతిచిప్ప, గిలక, కొబ్బరికోఱం, మరచెంబు’ మొదలైన సామాన్య గృహోపకరణాల పేర్లు కూడా అర్థం కాని పరిస్థితి దాపురించింది. Dashboard కి ‘యుగంధరం’ లాంటివి సూచిస్తే “సద్యఃస్ఫోరకాలు (వెంటనే అర్థమయ్యే తరహావి) కావా”లని మొండిపట్టు పట్టుతారు. అన్ని బౌద్ధిక ఉరువుల (intellectual items) కీ వాడుకభాషలో వ్యక్తీ కరణలు ఉండవంటే వినరు. కనుక కొత్తపదాల్ని కనుగొనడం ఒక్కటే కాదు. పాతపదాల్ని పునరుద్ధరించడం కూడా భాషాసేవే.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, ఏప్రిల్, పదనిష్పాదన కళ, సీరియల్ and tagged , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.