cover

అనుకోకుండా (3)

Download PDF ePub MOBI

జ్ఞానమా? ఇంకా దొరకలేదు.

ఏవో ఎడతెగని ఏడుపులు మాత్రం దారాల్లా సాగుతూనే ఉంటాయి. వాటిని అలముకుని ఒక తేలికైన దేహం. చినుకు తగిలితే బొంగరంలా తిరుగుతూ ఈకలు రాల్చుకునే దేహం. పిట్టనని తెలుసుకోక ఎప్పుడో చలికాలంలో నత్తగుల్లలో నిద్రపోయినందుకు, అతుక్కుపోయిన రెక్కలు ఎవరికీ కనపడక ‘ఎగిరెగిరి నడుస్తావెందుకుని’ నిలదీసినప్పుడల్లా, సంజాయిషీ తోచక మరింతగా మట్టిలోకి కూరుకుపోవడం తప్పదని.. తెలుస్తూనే ఉంటుంది.

ఐనా అప్పుడప్పుడూ ఆకాశాలు దిగొస్తాయి, ఎంతాకలేసినా ముక్కుతో చుక్కల్ని పొడుచుకు తినడం వీలుకాదుగా! ఎవరైనా నిద్రలేస్తే తిరిగెళ్ళిపోతాయని చప్పుడవ్వకుండా ఎంతసేపు ఊపిరాపుకుంటాం?

మళ్ళీ ఇంకోసారి దేహం గురించే – ఈకలగూడు లోపల ఎక్కడో ‘ఇది ఇలా కాదని’ వణికే గుండె గురించే. నొప్పెలానూ తప్పదు కానీ, వెన్న పూస్తున్న వేళ్లమీద ఎప్పుడూ పచ్చిగా ఉండే మచ్చల గురించే..

కాదనను, ఉంటాయి కోపాలు. ఇవ్వకపోయినా తీసుకున్న మాటల్ని మీరక తప్పకపోవడాలూ. నిన్నంతా వెన్నెల్లో ఉన్నసంగతి గుర్తులేనట్టే పైకి చూడకుండా తలుపేసుకుని నిద్రపోయినట్టు నటించడాలూ.

చెప్పు మరి. ఏం చేద్దాం ఇందాకటి ఆకాశాల్ని?

‘బరువుగా ఉంటే చుక్కలన్నీ దులిపేసుకో. చందమామెవరో నాకు తెలీదు’ అని బుకాయించి పంపేద్దామా?

మరోసారి వర్షం పడితే – బొంగరాలని మాత్రం తడపొద్దని కూడా ఇప్పుడే చెప్పేస్తే…

ఏడుపు దారాల్ని తెంపేద్దాంలే – ఎలానూ జ్ఞానం ఇంకా దొరకలేదుగా!

*

Download PDF ePub MOBI

Posted in 2014, మే, మ్యూజింగ్స్ and tagged , , .

5 Comments

  1. అనుకోకుండా చదివా. చదివాకే అనుకున్నా ఆ భావగర్భితమయిన పదాల్లో నేనూ ఉన్నానని. బాధకు భాషెందుకు? కనుకొలుకుల్లో నిలిచిన భాష్ప బిందువు చారిక చాలదూ ?
    బాగుంది స్వాతి గారూ.
    ఆ నత్త పిట్ట సృష్టికర్త ఎవరో – సామాన్యుడు కాదు సుమా.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.