cover

‘సప్త’స్వర వినోదం – మే 2014

మంచి సాహిత్యాన్ని ప్రేమించే పాఠకులు మంచి సంగీతాన్ని మాత్రం ఎందుకు ఆస్వాదించలేరు? అందుకే ఆపాత మధురమైన సినీ సంగీతాన్ని మరోసారి గుర్తుకు తీసుకురావాలని రసహృదయులైన పాఠక శ్రోతల ముందుకు ఇలా వచ్చాం. ఉత్తినే పాడుకోవడం చప్పగా ఉంటుందని సరదాగా మీ బుర్రకు చిన్న పని కల్పిస్తున్నాం. ఈ సంచికలో మొత్తం ఏడు పాటలకు సంబంధించిన ఒక్కో చరణాన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాం. మీరు చెయ్యాల్సిందల్లా ఆయా చరణం గల పాట పల్లవిని వెతికి పెట్టడమే. పాటకు పల్లవి ప్రాణం కాబట్టి అది సాకీతో ఆరంభమైనా సరే.. మాకు పల్లవే ముఖ్యం. మీ సౌలభ్యం కోసం చరణం కిందే చిన్న క్లూ కూడా ఇచ్చాం.

మరో ముఖ్యమైన విషయం: ఈ పాటలను జాగ్రత్తగా పరిశీలిస్తే పూదండలో దారంలా వీటన్నిటినీ కలిపే ఒక విశేషం దాగి ఉంటుంది (గాయని, గాయకుడు, నిర్మాత, దర్శకత్వం, సంగీతం, కథానాయిక, నాయకుడు, ఛాయాగ్రహణం… ఇలా ఏవైనా/ ఏదైనా కావచ్చు). ఆ విశేషం ఏమిటో కనిపెట్టి పల్లవులతో పాటూ విధిగా చెప్పాల్సి ఉంటుంది. తప్పుల్లేకుండా పల్లవిని రెండు లైన్లు రాస్తే సరిపోతుంది. మీ జవాబుల్ని ఇక్కడ కామెంట్ రూపంలో పెట్టండి. దానిని ఫలితాలు వెలువడే వరకూ అప్రూవ్ చేయం. లేదా editor@kinige.comకు మెయిల్ చేయండి. అన్నీ సరైన సమాధానాలతో మాకందిన మొదటి ఎంట్రీకి చిన్న బహుమతి షరా మామూలే. తర్వాత సరైన జవాబులు చెప్పిన అందరి పేర్లూ కూడా ఫలితాల్లో ప్రస్తావిస్తాం.

1.

“వాలుకనుల చూపులే చెంగల్వ తోరణాలు

వాలారు చిరునవ్వులే వన్నె విరుల హారాలు

నా మేనే మెరుపు తీవ; నగుమోమే చందమామ

నవరసాల సమ్మోహ సమ్మేళన మేనే”

క్లూ: ఈ పాటకు నృత్యం చేసిన నటీమణులిద్దర్లో అందాల నటి శ్రీదేవి అమ్మ రాజేశ్వరి ఒకరు.

.

2.

“విను వీథుల తారకలే

విరజాజుల మాలికలై

కనులముందు నిలువగా

నీ కురులలోన ముడిచెదనే”

క్లూ: ఎన్.టి.రామారావు నటించిన ఈ పాటగల సినిమా పేరుతోనే చిరంజీవి సినిమా కూడా వచ్చింది.

.

3.

“పూల పడవలో పూలరాణివై

కొలువు తీర్చగా, దేవీ

నీ పరిపాలనలో నే పాటకుడనుగా

పడవను నడిపిన ప్రేమయాత్రలో…”

క్లూ: ‘వైతాళికులు’ కవితా సంకలనానికి సంపాదకత్వం వహించిన ముద్దుకృష్ణ రాసిన పాట ఇది.

.

4.

“ఘుమ ఘుమ లాడే చల్లని పూలు

నీకోసం విరిసేనోయ్

నీ సేద దీరి నిదురించేలా

విసిరేను చిరుగాలి నీ చెంత చేరి”

క్లూ: శరత్‌చంద్ర చటర్జీ నవలిక ‘రామేర్ సుమతి’ ఆధారంగా తయారైన చిత్రంలోని పాట.

.

5.

“కాదని ఎంతగ కసిరినా

కడ కన్నుల కెంపులు కురిసినా

ఏ నాటికైన నీ రాధనురా

ఒక నాటికి తీరని గాథనురా… నీ రాధనురా”

క్లూ: విజయనిర్మల, శోభన్‌బాబు జంటగా నటించిన చిత్రంలోది.

.

6.

“వెన్నెల కురిసే వేళ

మల్లెలు పూచే వేళ

విరిసే నిండు వెన్నెల్లో

వేచితి అభిసారికనై…”

క్లూ: 1970 సంవత్సరంలో ‘త్రై ఊర్వశి’ నటించిన చిత్రంలోని పాట.

.

7.

“వాకిటిలో నిలబడకు

ఇంక, నాకై మరి మరి చూడకు

ప్రతి గాలి సడికి తడబడకు

పదధ్వనులని పొరబడకు

కోయిల పోయెలే, గూడు గుబులై పోయెలే..”

క్లూ: కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రంలో, దేవులపల్లి కలం నుండి జాలువారిన గీతం.

నిర్వహణ: ఇశైతట్టు

(Image Courtesy: https://www.flickr.com/photos/42931449@N07/5771025070)

Posted in 2014, మే and tagged , , , , .

6 Comments

 1. ఈ పాటల్లో ఉన్న విశేషం: సంగీత దర్శకులు అశ్వత్థామ గారు

  1. అందానికి అందము నేనే..జీవన మకరందము నేనే
  తీవెకు పువ్వును నేనే…పువ్వుకు తావిని నేనే

  2. ఎంత మధుర సీమ ప్రియతమా… సంతతమూ మనమిచటే సంచరించుదామా

  3. కల ఏమో ఇది నా జీవిత ఫలమేమో…ఇది నా కల ఏమో

  4. కలలుగనే వేళ ఇదే కన్నయ్యా… నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా

  5. నా మనసే వీణియగా పాడనీ
  నీ వలపే వేణువుగా మ్రోగనీ

  6. నిన్నే వలచితినోయి…కన్నుల్లో దాచితినోయి
  వెన్నెల్లో వేచితినోయీ… నీకై అభిసారికనై …

  7. రానిక నీకోసం సఖీ రాదిక వసంత మాసం
  రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకోని

 2. 1. అందానికి అందము నేనే
  జీవన మకరందము నేనే
  తీగకు పూవును నేనే
  పూవుకు తావిని నేనే ||తీగకు||
  ధరణి అమరధామమై ఆనందము నేనే ||అందానికి||
  2. ఎంత మధురసీమ ప్రియతమా
  సంతతము మనమిచటే…
  సంతతము మనమిచటే సంచరించుదామా
  ఎంత మధురసీమ ప్రియతమా
  3. కలయేమో, యిది నా జీవిత
  ఫలమేమో, చెలియా, యిది నా కలయేమో!
  కొండల కోనల లోయల లోపల
  అడవుల నీడల అలసగమనమున
  నిండు నీరుతో నడిచే నదిలో
  4. ఎంత మధురసీమ ప్రియతమా
  సంతతము మనమిచటే…
  సంతతము మనమిచటే సంచరించుదామా
  ఎంత మధురసీమ ప్రియతమా
  5. నామనసు వేణియగా పాడనీ
  నీ వలపే వేణువుగా మ్రోగనీ
  6. . నిన్నే వలచితినోయి…
  నిన్నే వలచితినోయి…కన్నుల్లో దాచితినోయి
  వెన్నెల్లో వేచితినోయీ… నీకై అభిసారికనై …
  ఓ ప్రియా ఆ …ఆ …ఆ ….
  నిన్నే వలచితినోయి…
  7. రానిక నీ కోసం సఖీ.. రాదిక వసంత మాసం..
  రాలిన సుమాలు ఏరుకొని.. జాలిగ గుండెల దాచుకొని..
  ఈ దూరపు సీమలు చేరుకొని..
  రానిక నీ కోసం సఖీ.. రాదిక వసంత మాసం..
  ఈ పాటల అన్నింటికీ సంగీత దర్శకులు అశ్వత్థామ

 3. ఏకకాలంలో చెవుల్ని చల్లగాలికి పరవశంగా ఊగిపోయే ఆకుల్ని చేసి – ఆత్మకు గొప్ప సాహిత్య మృష్టాన్న భోజనాన్ని అందించే పాతపాటల (ఆకుచాటు పిందె తడిసె – లాంటి పాత పాటలు కాదు…. జగమేమారినది మధురముగా ఈవేళ – లాంటి పాటలు) గురించి ఎవరు మాట్లాడినా, ఎవరు పాట్లాడినా, ఎవరు తాపత్రయపడ్డా, ఎవరు పాటత్రయపడ్డా భలే సంతోషం కలుగుతుంది. ప్రతి తరమూ తర్వాతి తరం చెవుల్ని ఆశీర్వదించి అందించాల్సిన కానుకల్లో ఇవి కూడా ఒకటి. ఆ ప్రయత్నంలో ‘మేము సైతం తెలుగు రొదకు సుధనొక్కటి జ్ఞప్తికి తెచ్చాం’ అని పూనుకున్నందుకు కినిగె సంపాదకులకు, శీర్షిక నిర్వాహకులు ఇశైతట్టు గారికి కృతజ్ఞప్తి.

 4. Common factor: same music director.. అశ్వధ్ధామ

  1)అందానికి అందం నేనే
  జీవన మకరందం నేనే
  (movie: chivariki migiledi)

  2) ఎంత మధురసీమ ప్రియతమా
  సంతతము మనమిచటే
  (movie:దేవాంతకుడు)

  3) కలయేమో.. ఇది నా జీవిత ఫలమేమో
  ఇది నా కలయేమో..
  (movie: పక్క ఇంటి అమ్మాయి)

  4. కలలు కనే వేళ ఇదే కన్నయ్యా
  నిదురలో ఎంతో హాయి చిన్నయ్యా
  కలత మాని తీపి నిదుర పోవయ్యా
  (movie:మా వదిన)

  .
  5)నా మానసే వీణియగా పాడనీ
  నీ వలపే వేణువుగా మ్రోగనీ
  (movie:విచిత్ర దాంపత్యం)

  6) నిన్నే వలచితినోయి
  కన్నుల్లో దాచితినోయి
  (movie: pasidi manasulu)

  7)రానిక నీకోసం సఖీ
  రాదిక వసంత మాసం
  (movie: maayani mamata)

 5. మంచి క్విజ్!
  పల్లవులు మాత్రం గుర్తుపెట్టుకొని, చరణాలు మర్చిపోయే నాలాంటి వాళ్ళకి చాలా కష్టం!

  1
  అందానికి అందం నేనే జీవన మకరందం నేనే
  తీవెకు పూవును నేనే – పూవుకు తావిని నేనే (చివరకు మిగిలేది [1962] – జమునారాణి – అశ్వత్థామ – మల్లాది)

  2
  ఎంత మధురసీమా
  సంతతమూ మనమిచటే సంచరించుదామా (దేవాంతకుడు [1960] – పి బి శ్రీనివాస్, జానకి – అశ్వత్థామ – ఆరుద్ర)

  3
  కలయేమో .. ఇది నా జీవితఫలమేమో
  చెలియా.. ఇది నా కలయేమో (పక్కింటి అమ్మాయి [1953] – ఏ ఎమ్ రాజా – అశ్వత్థామ – ముద్దుకృష్ణ)

  4*
  కలలుగనే వేళ ఇదే కన్నయ్యా
  కలత మాని తీపి నిదుర పోవయ్యా (మా వదిన [1967] – పి సుశీల – అశ్వత్థామ – దాశరథి)

  5
  నా మనసే వీణియగా పాడనీ…
  నీ వలపే వేణువుగా మ్రోగనీ (విచిత్ర దాంపత్యం [1970] – పి సుశీల – అశ్వత్థామ – దేవులపల్లి)

  6
  నిన్నే వలచితినోయి…కన్నుల్లో దాచితినోయి
  వెన్నెల్లో వేచితినోయీ… నీకై అభిసారికనై (పసిడిమనసులు [1970] – పి సుశీల – అశ్వత్థామ – ఉషశ్రీ)

  7
  రానిక నీకోసం సఖీ
  రాదిక వసంతమాసం (మాయని మమత [1970] – ఘంటసాల – అశ్వత్థామ – దేవులపల్లి)

  సామాన్యాంశం: పై ఏడూ అశ్వత్థామ గారి పాటలే!

  * (మిత్రులు జీజే గారికి కృతజ్ఞతలతో)

 6. ఇశైతట్టు గారు
  మీ ప్రయోగం అద్భుతం. పాత పాటలను నెమరేసుకునే పని పెట్టారు. అందుకు కృతజ్ఞతలు.
  ఇక మీరు ఇచ్చిన చరణాలకు పల్లవులు
  1.అందానికి అందం నేనే, జీవన మకరందం నేనే,
  చిత్రం : చివరకు మిగిలేది, పాడింది జమునారాణి, రాసింది మల్లాది రామకృష్ణశాస్ర్తి గారు

  2. ఎంతమధుర సీమ ప్రియతమా, సంతతము మనమిచటే సంచరించుదామా
  చిత్రం : దేవాంతకుడు, పాడింది జానకి, పి.బి.శ్రీనివాస్‌,

  3.కలయేమో, యిది నా జీవిత ఫలమేమో, చెలియా, యిది నా కలయేమో!
  కొండల కోనల లోయల లోపల అడవుల నీడల అలసగమనమున
  చిత్రం : పక్కయింటి అమ్మాయి, పాడింది ఎ.ఎం.రాజా

  4.కలలు కనే వేళ ఇదే కన్నయ్య, నిదురలో ఎంతో హాయి చిన్నయ్య
  చిత్రం : మా వదిన, పాడింది సుశీలమ్మ, రచన : దాశరథి

  5.నా మనసే వీణియగా పాడనీ, నీ వలపే వేణువుగా మ్రోగనీ
  చిత్రం : విచిత్ర దాంపత్యం, పాడింది సుశీలమ్మ, రాసింది నారాయణరెడ్డి

  6.నిన్నే వలచితినోయి, కన్నుల్లో దాచితినోయి
  చిత్రం : పసిడి మనసులు, పాడింది సుశీలమ్మ

  7.రానిక నీకోసం సఖి రాదిక వసంత మాసం
  చిత్రం : మాయని మమత, పాడింది ఘంటసాల, రాసింది దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు

  ఇక మీరు పూదండలో దారంలా వీటన్నిటినీ కలిపే ఒక విశేషం దాగి ఉంటుందన్నారే…అది అశ్వత్థామ..
  పైన పాటలన్నింటికీ స్వరాలు సమకూర్చింది అశ్వత్థామ మాస్టారే!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.