Download PDF

శరీర అవగాహన

Download PDF ePub MOBI

ఇది ఎస్. రామకృష్ణన్ కథకు అవినేని భాస్కర్ అనువాదం. మూల రచయిత పరిచయం ఇక్కడ.

శరీర అవగాహన

ఎస్. రామకృష్ణన్

ఎప్పుడు పన్ను పడిపోతుందో అని భయపడుతూ ఉంది చిన్ను. రెండు రోజులుగా తన దవడపన్ను ఊగుతూ ఉండటంవల్ల ఒక వైపు దవడ వాచిపోయి నొప్పిగా, చిరాగ్గా ఉంది. ఆరో తరగతితో బడి చదువు మానేసి శనగ మిఠాయి కంపెనీలో పనిచేస్తుంది.

తినేప్పుడు పన్ను ఊడిపోతే పొట్టలోకి వెళ్ళిపోతుందని అపర్ణ చెప్పినప్పట్నుండి తినాలంటేనే భయమేస్తుంది. ఒకవేళ నిద్రలో పన్ను పడిపోతే ఏమౌతుంది? పొట్టలోకి వెళ్ళిపోతుందా? స్వయంగా పీకి పడేద్దామా అని అప్పుడప్పుడూ పన్నుని కదిలించే ప్రయత్నం చేస్తోంది చిన్ను. పంటి చుట్టూ రక్తం గడ్డకట్టినట్టు అనిపించింది.

పళ్ళ మీద కోపం వచ్చింది. ఎందుకని ఈ వెదవ పళ్ళు ఊడిపోతాయి? చెవులు, కళ్ళు, ముక్కు ఇవి ఊడిపోవుగదా? పన్ను మాత్రమే ఎందుకు ఊడిపోయి మొలుస్తుంది? అందునా సగం పన్ను చివుళ్ళలో లోపల దాక్కుని ఉంటుంది. లోపలున్న పన్ను ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకు మనకిన్ని పళ్ళున్నాయి అని కూడా ఒక్కోసారి ఆలోచించేది చిన్ను. నొప్పి మొదలైన రోజునుండి దంతాల మీద చిరాకు మొదలైంది.

చిన్ను వాళ్ళ ఇంట్లో ఇటికెల్ని పొడిచేసి పళ్ళు తోముతారు. ఆ పొడిని కూడా ఒక టెంకాయచిప్పలో పోసిపెట్టుకుంటారు. పెద్దన్నయ్య మాత్రం పేస్ట్ కొనుక్కుని తనొక్కడే వాడుకుంటాడు. దాన్ని వేరే ఎవరూ వాడకూడదన్నట్టు ఎవరికీ అందకుండ చూరుపెంకుల్లో దోపి పెడతాడు. తనూ, చిన్నక్కా ఎప్పుడూ ఇటికెలపొడితో కలిసే పళ్ళు తోముతారు. వేలితో పళ్ళు తోముతుంటే ఇటికెలపొడి వల్ల వచ్చే ఆ చప్పుడంటే చిన్నుకి చాలా ఇష్టం.

శ్రీలక్ష్మీ శనగ మిఠాయి కంపెనీలో చిన్నూలా పన్నెండుమంది ఆడపిల్లలు పేకింగ్ సెక్షన్ లో పనిచేస్తారు. శనగ పాకం మిఠాయిని వాటి అచ్చుల్లోనుండి తీసి వెయ్యడానికి ఒక నలుగురు మగవాళ్ళు పనిచేస్తారు. అందులో ఒకతను చిన్నుతో ఐదోక్లాస్ చదివిన సిందువాళ్ళ అన్నయ్య. అతను మాత్రం ఎప్పుడైనా ఒక్కోసారి ఎవరికీ తెలీకుండ తినడానికి బెల్లంపాకం తెచ్చిచ్చేవాడు.

LOGOఈ ఆడపిల్లల పని శనగపాకం మిఠాయిల్ని ఎంచి పేర్చి ప్యాకెట్‌ చెయ్యడం మాత్రమే. అచ్చువేసిన శనగ మిఠాయిల్ని చెక్కబల్ల మీద పోసిపెట్టేవారు. గదంతా బెల్లం పరిమళం ఘుమఘుమలాడుతూ ఉంటుంది. పనిజేసేవాళ్ళని పర్యవేక్షించడానికి ముత్యాలయ్య అనొకతను ఉంటాడు. అతను ఇనప కుర్చీలో కూర్చుని రోజంతా పేపర్ చదువుతూ ఉంటాడు. ఆడపిల్లలు ఒంటికి వెళ్ళాలంటే కూడా అతనికి చెప్పే వెళ్ళాలి. రోజుకు రెండు కంటే ఎక్కువసార్లు అనుమతించడు. ఎవరైనా నోరు మెదుపుతు కనిపిస్తే ముత్యాలయ్య వచ్చి నోరు తెరిచి చూపించమంటాడు. అలా చెయ్యమనడం చాలా అవమానకరంగా ఉంటుంది. నోట్లో వేలుపెట్టి తనిఖీ చెయ్యడం కూడా జరుగుతుంది.

చిన్ను ఆరో తరగతి సెలవుల్లో ఈ పనిలో చేరింది. రెండు నెలల సెలవూ పూర్తయ్యి ఏడో తరగతికి వెళ్ళడానికి బయల్దేరిన రోజు మిఠాయి కంపెనీ ఓనరు ఇంటికి వచ్చి రెండువేలు అడ్వాన్సు ఇస్తాను అనగానే తనని చదువు మాన్పించేశారు ఇంట్లో వాళ్ళు. అలవాటుపడిన పని కాబట్టి చిన్ను సరేనని ఒప్పేసుకుంది.

నాలుగు రోజులు క్రితం కంపెనీలో ఉండగా చిన్ను బాత్రూంకి వెళ్ళినప్పుడు అక్కడి గోడమీద కొత్తగా ఒక టూత్‌బ్రష్ ఉండటం చూసింది. సరుకు తీసుకొచ్చిన లారీ డ్రైవరు ఎవరో మరిచి వదిలిపెట్టి పోయినట్టున్నాడు. దాన్నెలా అందుకోవాలో ఆలోచించింది. పైకెగిరి అందుకోడానికి చూసింది. అందనంత ఎత్తున ఉంది. చీపురుతో చివర్న కొడితే టాయ్‌లెట్లో పడిపోతుందేమో అని ఆ ఆలోచన వదిలేసి ఇనప బకెట్టు బోర్లించి దానిమీద ఎక్కి అందుకుంది. బకెట్టు కిందభాగం ఊడిపోయి కాలికి గీసుకుంది. ఎవరైనా చూస్తారేమో అని భయపడుతూ బ్రష్ని బొడ్డులో దాచుకుని పరుగున తన చోటికెళ్ళి కూర్చుంది.

ఎవరైనా చూసుంటారా అని లోలోపల భయపడుతూ ఉంది. అయితే బ్రష్ గురించి ఎవరూ పట్టించుకున్నట్టు లేరు. కేషియర్ మాత్రం ఇనప బకెట్టుని ఎవడో డ్రైవరు విరగ్గొట్టి వెళ్ళాడు అని తిడుతూ ఉన్నాడు. చిన్ను కి ఆనందం. ఎవరూ చూడనప్పుడు బొడ్డున దాచుకున్న బ్రష్ తీసి తన టిఫిన్బాక్సులో దాచుకుంది. సాయంత్రం వరకు పని సరిగ్గా చెయ్యలేకపోయింది. సాయంత్రం ఇంటికెళ్ళేప్పుడు రైలు పట్టాలు దాటుకుని అడ్డ దార్లో వెళ్తే తొందరగా వెళ్ళిపోతాను అని చెప్పి తనతో వచ్చే అందర్నీ వదిలిపెట్టి వెళ్ళింది. మిగిలిన పిల్లలు రైలు పట్టాలు దాటడానికి భయపడతారు; తనతో రారు అని ఆ దారిన వెళ్ళింది.

రైలు పట్టాలు దాటేప్పుడు రెండువైపులా చూసింది. కింద పట్టాలు, పైన ఆకాశం తప్ప ఏం కనిపించలేదు. పట్టాల పక్కన ఉన్న కమ్మీలకు తగలకుండా వెళ్ళాలి. కమ్మీల్లో చిక్కుకుంటే కిందపడిపోగలదని కమ్మీల్ని అదిమి పట్టుకుని లంగాని జాగ్రత్త చుట్టుకుని బొడ్లో దోపుకుని దాటింది. అయినా కాలికి కమ్మీ తగిలి వింగ్ వింగ్ అని శబ్ధం వచ్చింది.

పట్టాల మధ్యనున్న కర్ర మీద నడిచి అవతలి వైపు చూసింది. నల్ల తుమ్మ చెట్లు గుబురుగా కనిపించాయి. మధ్యలో కాలిదారి ఉంది. తననెవరైనా చూస్తున్నారా అని తిరిగి చూసుకుంది. టిఫిన్బాక్సు తెరిచి బ్రష్ తీసి చూసుకుంది. పచ్చరంగులో మెరుస్తుంది. దాన్ని చేతిలోకి తీసుకోగానే ఎందుకో నవ్వొచ్చింది. వొట్టి బ్రష్ని ఒకసారి నోట్లో పెట్టి తోమి చూసుకుంది. పంటిమీద తాకగానే కొత్తగా అనిపించింది. మళ్ళీ బ్రష్ని బాక్సులో పెట్టుకుంది. సంతోషంగా గెంతుతూ పరుగులు తీస్తూ ఇంటికి నడిచింది.

చిన్ను ఇంట్లో దూరేప్పటికి లైట్ వేసుంది. గుండుబల్బు పచ్చగా వెలుగుతోంది. టిఫిన్‌బాక్సు తీసుకుని కడగడానికన్నట్టు పెరటి వైపెళ్ళింది. సిమెంట్ తొట్లోకి తొంగి చూసింది; నీళ్ళు సగానికున్నాయి. ఇత్తడి చెంబుతో నీళ్ళు ముంచుకుని బ్రష్ని అందులో తడిపి ఇటికెల పొడిలో అద్దుకుని తోమింది. పొడి బ్రష్కి అంటనే లేదు. పెద్దన్నలా తను కూడా పేస్టు కొనుక్కోవాలి అనుకుంది. పళ్ళు తోమడం పూర్తవ్వగానే టవల్తో పళ్ళని అదిమి తుడిచింది. లోపలికెళ్ళి అద్దంలో పళ్ళు చూసుకున్నప్పుడు నవ్వొచ్చింది.

నోటిలో పళ్ళు ఎలా ఇంత అందంగా అమర్చబడి ఉన్నాయి? పంటికి వేరుంటుంది అంటారు కదా? అయితే పన్నేమైనా చెట్టా? పన్నుని చెట్టు అనుకోగానే నవ్వొచ్చింది. పన్నుకి పువ్వులు పూస్తాయా? పన్ను విత్తనమున్న చెట్టా? విత్తనం లేని చెట్టా? తను తిన్న వస్తువులేమిటో పంటికి గుర్తుంటుందా? ఇలా మనసుకు తోచినట్టూ ఆలోచిస్తూ ఉండిపోయింది.

అప్పట్నుండి రోజూ ఉదయమూ, సాయంత్రమూ ఎవరికీ తెలీకుండ ఆ బ్రష్తో పళ్ళు తోముకునేది. తన బ్రష్ని ఎవరూ చూడకూడదని ప్లాస్టిక్ పేపర్లో చుట్టి దాచిపెట్టి వెళ్ళేది. ఒక రోజు తన చిన్నక్క చూసి చిన్ను బ్రష్ కొనుక్కుందని అమ్మకి చెప్పేసింది. అమ్మ “చెప్పవే ఎక్కడివి నీకు డబ్బులు బ్రష్ కొనడానికి?” అని చెవులు పిండి ఒక మొట్టికాయ మొట్టగానే చిన్ను నిజం చెప్పేసింది.

sareera avagahanaఅమ్మ కోపంతో వీపు మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టి చేతిలో ఉన్న బ్రష్ పీకి పొయ్యిలో వేసేసింది. అక్కడంతా ప్లాస్టిక్ కాలుతున్న వాసన వ్యాపించింది. పెద్దక్క, చిన్నక్క ఇద్దరూ రాత్రి నిద్రపోయేంతవరకు చిన్నుని తిడుతూ ఉన్నారు. చిన్ను ఆవేశంగా తన పళ్ళన్నిట్నీ పీకి అవతల పడేస్తే బాగుండు అనుకుంది. అయితే పళ్ళని అసలు కదల్చలేకపోయింది. ఇది జరిగిన రెండురోజుల తర్వాతొక రోజు ఉదయాన్నే తన పంటినుండి రక్తం రావడం గమనించింది. కంపెనీకి వచ్చాక కూడా ఆ నొప్పి తగ్గలేదు. అపర్ణ రక్తం కారుతున్న పన్నుని చూసి “పన్ను ఊగుతుంది, అదే ఊడిపోతుందిలే” అంది. తినేప్పుడూ, నీళ్ళు తాగేప్పుడు, నవ్వేప్పుడు ఆ పంటి దగ్గర ప్రాణం పోయేంత నొప్పి అనిపిస్తోంది.

పగలూ రేయీ చిన్ను భయపడుతూనే ఉంది. నిద్ర మధ్యలో లేచి వేలితో పన్ను ఉందా లేదా అని తాకి చూసుకునేది. గవర్నమెంటాసుపత్రికి వెళ్తే పన్ను పీకేస్తారు, అయితే పన్ను పీకేప్పుడు చాలా రక్తం వస్తుంది అని మేరీ చెప్పడం విన్నాక అలా చెయ్యొద్దు అనుకుంది.

చిన్నుకి నొప్పి ఏ మాత్రం తగ్గలేదు. కంపెనీ నుండి వచ్చేదారిలో ఉన్న కాళీశ్వరి గుడిలో పన్ను క్షేమంగా ఊడిపోతే కర్పూరం వెలిగిస్తాను అని మొక్కుకుంది. మరుసటిరోజు ఉదయం టీ తాగుతుంటే పన్ను తానుగా ఊడిపోయింది. అప్పుడు చిన్నక్క మాత్రమే ఉంది ఇంట్లో. ఆమె ఊడిన పన్నుని పేడలో ఉండగా చేయమనీ, దాన్ని ఎవరి కంటా పడని చోట పడేసి వచ్చేమనీ, ఎవరి కంటైనా పడితే మళ్ళీ పన్ను మొలవదనీ చెప్పింది. చిన్నూకి కొత్త భయం మొదలైంది.

చిన్ను ఊడిన పన్నుని చూసుకుంది. అదొక అపురూపమైన వింత వస్తువులా అనిపించింది. వేళ్ళతో తడిమి, అదిమి, నొక్కి చూసుకుంది. అది చాలా గట్టిగా అనిపించింది. చిన్ను పన్నుని గుప్పిట్లో దాచుకుని పాలమ్మే రంగి ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటి కొట్టంలో ఉన్న పేడని ఒక చేత్తో కొంత ఉండ చేసుకుని అందులో పన్నుని పెట్టింది. ఎవరి కంటా పడని చోటు ఎక్కడుంటుంది అని అనుమానం వచ్చింది. ఇంటి దగ్గర ఎప్పుడూ ఎవరో ఒకరు మసులుతూ ఉంటారు. వేరే ఎక్కడైనా తీసుకెళ్ళి పడేయాలి. నడవటం మొదలుపెట్టింది.

తన ఇంటికి పక్కనున్న వీధులు, రైలు పట్టాల దగ్గర ప్రాంతం, కారు మెకానిక్కు షెడ్డు వెనక, సినిమా థియేటర్ పక్కనున్న కంపు గల్లీ, కూరగాయల మార్కెట్టు వెనుకనున్న చెత్త మైదానం, బస్సుడిపో అవతలున్న చింత తోపు.. అంటూ పన్ను దాచిన పేడ ఉండని చేతబట్టుకుని అంతా తిరిగింది. అన్ని చోట్లా ఎవరో ఒక మనిషో, కుక్కో, మేకో, తొండో, ఉడతో తిరుగుతూండటం చూసింది.

ఎవరి కంటాపడని చోటంటూ ఎక్కడుందీ అని తికమక మొదలైంది. ఎందుకని అన్ని చోట్లా మనుషులు తిరుగుతున్నారు అని చిరాకేసింది. ఆ ఊర్లో తనకి తెలిసిన అన్ని చోట్లకీ తిరిగింది. పేడ ఉండ ఎక్కడైనా జారిపోతుందేమో అని దిగులు కూడా కలిగింది. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురైనా కూడా వాళ్ళని చూడనట్టు తప్పుకుని వెళిపోయింది. ఉన్నట్టుండి ప్రపంచం చాలా చిన్నదైపోయినట్టనిపించింది.

ఇళ్ళు, అంగళ్ళు, తోపుడుబళ్ళు, గుళ్ళు, బళ్ళు, హాస్పిటళ్ళు, ప్లాట్‌ఫారం అంగళ్ళు, వాహనాలు, చెట్లు, నీళ్ళ కొలనులు, ఆవులు, కూరగాయలంగళ్ళు, బేకరీలు, చెత్త దిబ్బలు, విగ్రహాలు, వీధి కుక్కలు, లారీలు, చర్చిలు, బేంకులు, బట్టలంగళ్ళు, స్టూడియోలు, పార్కులు, ప్లే గ్రౌండ్లు, పువ్వుల బుట్టలు… ఎక్కడ చూసినా జనాలు తిరుగుతూనే ఉన్నారు.

జనం లేని చోటంటూ ఒకటి కూడా లేదా? అన్ని ఊళ్ళల్లోనూ ఇలానే ఉంటుందా? అలసిపోయి రైల్వేగేటు దగ్గరున్న సిమెంటుపిల్లర్‌కి ఆనుకుంది. తిరగడంవల్ల జుట్టు బాగా చెదిరిపోయింది.

పళ్ళ మీద విసుగు కలిగింది. సాయంత్రపు ఎండ రోడ్డు మీద పెద్దదవుతూ ఉంది. బైపాస్‌రోడ్డులో ఉన్న రైసుమిల్లు వెనుక ఎవరూ ఉండరని అనుకుని వడివడిగా ఆ మిట్ట ఎక్కింది. ఐదుగంటలైన శబ్దం వినిపించింది. అవతల ఖాళీ అట్టపెట్టెలు, తడిసిన గోనెసంచులు, చిరిగిన కేలండరు అట్టలు, పేపర్లూ ఎగురుతూ ఉన్నాయి. వాటి మధ్య తుమ్మి మొక్కలు పూసి ఉన్నాయి.

ఇక్కడ పడేద్దాం అన్నట్టు చుట్టూ చూసింది. దూరాన గేదెలు మేపుతున్న ఒక చిన్న పిల్లాడు తనకేసి చూస్తున్నాడు. అతను చూస్తున్నాడే, ఎలా అని తికమకతో వెనుతిరిగింది. పెట్రోలుబంకు దగ్గర జనం ఉండరు అనుకుని దార్లో కనిపించిన ఒక కర్రని మరో చేత్తో అందుకుని నడిచింది. ఆమె పెట్రోలుబంకు అవతలకి చేరుకున్నప్పుడు అక్కడ కొందరు ఒక ట్రాక్టర్ని విప్పదీసి రిపేరు చేస్తున్నారు. చేతిలో ఉన్న పేడ ఉండ కేసి చూసింది. ఆ పేడ ఉండ ఎండిపోయి గట్టిపడినట్టు అనిపించింది. చీకటి పడిపోతుందేమో అన్న భయంతో ఇక ఏం చేయాలో తెలీక ఇంటికెళ్ళిపోదాం అనుకుంది.

ఈ పన్ను వల్లే ఇన్ని సమస్యలు అని మనసులో తిట్టుకుంది. రేపు మిఠాయి కంపెనీకి పనికెళ్ళాలి అని గుర్తురాగానే దుఃఖం కళ్ళల్లో తిరిగింది.

ఆమె ఇంటికెళ్ళేప్పటికి పెద్దక్క గిన్నెలు కడుగుతోంది. చిన్ను బెరుకుగా రావడం గమనించి, “చేతిలో ఏంటే?” అని గద్దించింది. చిన్ను మాటలు పెగుల్చుకుని చిన్నగా చెప్పింది. పన్ను ఊడిపోయింది అందుకే పేడలో ఉండ చేసి దాచాను అంది.

పెద్దక్క కోపంగా చూసి, “ఇలా పేడలో దాచుకుని చేతిలో పెట్టుకుంటే రాలిన పన్ను మొలుస్తుందా? అక్కడ పడేసి చేతులు కడుక్కో” అంది.

చిన్ను జంకుతూ – ఎవరి కంటా పడకుండా పారేయకపోతే ఊడిన చోట కొత్తపన్ను రాదు అని చిన్నక్క చెప్పింది అంది. పెద్దక్క కోపంగా చేతిలో ఉన్న పేడ ఉండని లాక్కుని చీకట్లో దూరంగా పడేసింది. అన్ని చోట్లూ కంటపడనివేలే పో అంది. వెళ్ళి పని చూడు అంది. చీకట్లో చూస్తుంటే పెద్దక్క అన్నది కూడా నిజమేనేమో అనిపించింది.

చిన్ను వంగి ఇత్తడి చెంబుతో నీళ్ళు ముంచుకుని ముఖం కడుక్కుంది. నోరు పుక్కిలించేప్పుడు ఊడిన పంటి సందులో నీళ్ళు వెళ్ళడం నవ్వు తెప్పించింది. ఆ తొర్రిని నాలుకతో తాకి చూసుకుంది. అలా తాకడం బాగుంది అనిపించింది. మళ్ళీ నోట్లో నీళ్ళు పోసుకుని తొర్రిపంటిలో నీళ్ళని కిందకి జారవిడిచింది. నవ్వొచ్చింది.

పెద్దక్క గిన్నెలు కడగడం అయిపోగానే అన్నీ తీసి లోపల పెడుతూ అన్నేసి నీళ్ళెందుకు కింద పోస్తావు అని అరిచింది. ఈ గిన్నెలు సర్దు, నాన్న రాగానే సెకండ్ షో సినిమాకి వెళ్దాం అంది. వాళ్ళందరూ సరస్వతి థియేటర్‌కి నడిచి వెళ్తుంటే చిన్నక్క చిన్ను భుజంపైన చేతులు వేసి నడిచింది. చిన్నుని చూసి “తొర్రిపళ్ళేసుకుని నువ్వు నవ్వుతుంటే బాగున్నావే!” అంది.

సినిమాహాల్లో చిన్నక్కని అదేపనిగా అడుగుతూ ఉంది, మళ్ళీ కొత్త పన్ను వస్తుంది కదా? అని. నువ్విలా సినిమా చూడనివ్వకుండ వాగుతుంటే పన్ను అసలు మొలవదు నోర్మూసుకుని సినిమా చూడు అంది చిన్నక్క.

చిన్ను మధ్యలో లేచి నీళ్ళు తాగాలని బయటకెళ్ళింది. అక్కడున్న కొళాయి తిప్పి తాడుకు వేలాడుతున్న నొక్కులబోయిన గ్లాసులో నీళ్ళు పడుతుంటే గొంతులో ఏదో పడినట్టు అనిపించింది. గుండెలోని దుఃఖం పైకి ఏడుపులా వచ్చేసింది. చిన్నూ ఆ సగం చీకట్లో ఏడుస్తుంది, లోపల సినిమా ఆడుతుంది, గ్లాసు నిండి నీళ్ళు కిందకి జారిపోతున్నాయి.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, అరవ కథలు, మే and tagged , , , , , , , .

One Comment

  1. కధని చక్కగా అనువదించారు. కధకూడా చాలా బావుంది. కానీ నాకు ఒకటే అనిపించింది కధ పేరు అంతగా సరిపోలేదేమో అని .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.