cover

పదనిష్పాదన కళ (4)

Download PDF epub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

రెండో అధ్యయం

పదజాలాల ఆవిర్భావ గతం

తెలుగు పదజాలం (Telugu vocabulary) ఎలా పుట్టింది ? 

తెలుగులోని పదజాలాన్ని పదిరకాలుగా వింగడించవచ్చు.

౧. అచ్చతెలుగు మూలధాతుజన్యం:— తెలుగుపదాలకు తమవంటూ కొన్ని మూలధాతువులున్నాయి. Dravidian Ety-mological Dictionary (DED) లో కనపడనంత మాత్రాన అవి లేవనుకోకూడదు. వాటినుంచి వందలాది తెలుగు పదాలు జన్మించాయి. అవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు చెర్ (తడి, నీరు) అనే మూలధాతువు నుంచి చెఱువు, చెలక, చేను, చేపు, చేద, చెఱుకు, చెక్క, చెమ్మ, చెలమ, చెఱమ, చెత్త, చెట్టు, చెంబు మొదలుగా గల విస్తారమైన పదకుటుంబం ఆవిర్భవించింది. ఇవన్నీ నీటిలో/ నీటితో పెఱిగేవి. లేదా నీరు కలిగినవి. లేదా నీరు అవసరమైనవి. లేదా నీటి కోసం ఉన్నటువంటివి. ఇలాంటి ముప్ఫై-నలభై మూలధాతువుల నుంచి సుమారు ఒక వెయ్యి పదాల దాకా ఆవిర్భవించాయి.

౨. అచ్చతెలుగు దేశ్యం:— సంస్కృతప్రాకృతాల నుంచి గానీ, తోటి ద్రావిడభాషల నుంచి గానీ, ఉర్దూ-ఇంగ్లీషుభాషల నుంచి గానీ, పరిసర రాష్ట్రాల నుంచి గానీ అరువు దెచ్చుకోకుండా తెలుగుగడ్డపై తెలుగుప్రజల స్వోపజ్ఞామూలకంగా, స్వయంభువుగా వెలసిన పదజాలమే అచ్చతెలుగు దేశ్యం. అయితే వీటికి మూలధాతువులతో నిరుక్తి (etymology) చెప్పడం సాధ్యం కాదు.

ఉదా:- అంచన, అందం, అకరువు, అక్కసు, అచ్చు, అటుకులు, అట్టువ, అతివ, అత్తము, అదనము, అలుసు, ఆకు, గిన్నె, పళ్లెం, గరిటె, మిల్లి మొదలైనవి

౩. ద్రావిడ మూలధాతుజన్యం:— దక్షిణ భారత భాషలన్నింటికీ ఉమ్మడిగా ఉన్న మూలధాతువుల నుంచి (తెలుగు ఒక ప్రత్యేకభాషగా ఉనికిలో లేని కాలంలోనే) వచ్చిన పదజాలమిది.

ఉదా :- కాలు, చేయి, కన్ను, గోరు, మ్రాను, కాయ, నీరు, వాన, విన్ను (మిన్ను), ఉప్పు, కడలి, కాదిలి., వచ్చు, పోవు, తిను మొదలైనవి

౪. అర్వాచీన ద్రావిడ ఆదానం:— తెలుగు తక్కిన ద్రావిడభాషల నుంచి విడిపోయి ఒక ప్రత్యేకభాషగా రూపొందిన అనేక శతాబ్దాలకి వాటిల్లోంచి తెలుగులోకి రాజకీయ, మత, సాంస్కృతిక కారణాల వల్ల మళ్లీ ప్రవహించిన పదజాలం. ఇది ఎక్కువగా తమిళ-కన్నడజన్యం.

ఉదా:- తిరుమణి, అడియేను, మాళిగ, వరుమానం, హొన్ను, హెగ్గడి, హెచ్చు, తొణికిసలాడు మొదలైనవి

౫. ప్రాకృతసమం మఱియు ప్రాకృతభవం:— సంస్కృతంలోంచి నేరుగా కాకుండా, ముందు ప్రాకృతంగా వికృతి చెంది ఆ ప్రాకృతం నుంచి తెలుగులోకి వచ్చిన పదాలు. ఇవి ఎక్కువగా ఆంధ్రశాతవాహన చక్రవర్తుల కాలంలో వచ్చాయి. కారణం – అది ఆ రాజుల మాతృభాష కావడం. పైగా అదే అప్పుడు దక్షిణాపథానికి రాజభాషగా ఉండడం.

ఉదా :- అగ్గిపెట్టె, సింగారం, సిరి, కంబం, కారం, అయ్య, అమ్మ, తనం, పనస, కకపాల మొదలైనవి

౬. సంస్కృతసమం:— దీనికే తత్సమమని నామాంతరం. సంస్కృతంలోని పదాలకి డు,ము,వు,ల వంటి పదాంత మార్పులు చేసి గానీ, చేయకుండా గానీ చాలావఱకు సంస్కృత వర్ణక్రమాన్నీ, గుణితాలనే అనుసరిస్తూ తెలుగులోకి తెచ్చిన పదజాలం. దీనికి మన భాష యావత్తూ నిలువెత్తు ఉదాహరణే. నిజానికి తెలుగువారి దృష్టిలో తెలుగూ, సంస్కృతమూ రెండు వేఱువేఱు భాషలు కావు. మన కావ్యసంప్రదాయాన్ని అనుసరించి, తెలుగుని యథేచ్ఛగా సంస్కృతపదాలతోనూ, సమాసాలతోనూ నింపి వేయవచ్చు.

౭. సంస్కృతభవం:— దీనికే తద్భవమని నామాంతరం. ముందు సంస్కృతంలోంచి పండితాంధ్రం (Scholarly Telugu) లోకి వచ్చినాక, మళ్ళీ ఆ పండితాంధ్రంలోంచి సామాన్యప్రజల వాడుకలోకి ప్రవహించి, వారి నోళ్ళల్లో కొంతకాలం పాటు నలిగి, కాలక్రమేణా రూపాంతరం చెంది వినపడుతున్న పదజాలమిది.

ఉదా:- అచ్చం, దెయ్యం, రాకాసి, మచ్చరం, వెధవ, తావు, పగ్గాలు, రచ్చ, నిస్సంతు, చక్కెఱ, అక్కరాలు మొదలైనవి

౮. ఇస్లామిక ఆదానం:— ఇది వాస్తవానికి ఏకభాషాజన్యం కాదు. అనేక భాషల పదాలు ఆనాటి అధికారభాష అయిన ఉర్దూ ద్వారా తెలుగులోకి ప్రవేశించాయి. ఆ భాషల్లో అరబ్బీ, తుర్కీ, ఫారసీ, హిందూస్థానీ ఉన్నాయి. ఏ ఉర్దూపదానికి ఏ భాష మూలమో మనకి తెలియదు గనుకా, ఈ తెఱగు పదజాలమంతా మహ్మదీయుల ద్వారా మనకి సంక్రమించింది గనుకా వాటన్నింటినీ కలిపి ఇస్లామిక ఆదానాలనే ఒక స్థూల వింగడింపుతో సరిపెడుతున్నాం.

ఉదా :- ఆఖరు, ఆఖరి, ఆజమాయిషీ, ఆబ్కారీ, ఆరిందా, ఆవర్జా, ఆసరా, ఆసామి, ఈనాం, ఇలాఖా, ఉడాయించు, ఉల్టా, కచ్చేరి, కబురు, కబుర్లు, కబేళా, కమాను, కమామిషు, కలేజా, కలం, ఖరారు, కవాతు, కసరత్తు, కసాయి, ఖాతా, ఖామందు, ఖాయిలా, ఖాళీ, కితాబు, కుమ్మక్కు, కుర్చీ, కిరాయి, కుస్తీ, ఖుషీ, ఖూనీ, ఖైదీ, కైఫీయతు, కొజ్జా, కొత్వాలు, కౌలు మొదలైనవి

౯. ఆంగ్ల ఆదానం:— ఇంగ్లీషు మన దేశంలో గత 200 సంవత్సరాలుగా పరిపాలనాభాషగా, వ్యాపారభాషగా, విద్యా భాషగా ఉండడం వల్ల ఆ భాషాపరిచితీ, పాండిత్యమూ గలవారి ద్వారా సామాన్యప్రజల్లోకి సైతం వందలాది ఇంగ్లీషు పదాలు చొచ్చుకుపోయాయి. ముఖ్యంగా ఇవి ఆధునిక యంత్రసాధనాల వాడకం మూలానా, వృత్తిపరమైన అవసరాల్ని పురస్కరించుకునీ, అంతకంటే ముఖ్యంగా ఇంగ్లీషుపదాల ప్రయోగం ఒక ఉన్నత సామాజిక హోదాని ప్రసాదిస్తుందనే అభిప్రాయం వల్లా వాడుకలోకి వచ్చాయి.

౧౦. ఆంగ్లద్వార ఆదానం:— ఇంగ్లీషులో ఉన్నవన్నీ అచ్చ ఇంగ్లీషుపదాలు కావు. తెలుగులో మాదిరే ఇంగ్లీషులో కూడా అనేక భాషల పదాలు ప్రవేశించాయి. అయితే వాటిని ఇంగ్లీషువారు వాడుతున్నారనే కారణం చేత మనం కూడా వాడుతున్నాం. వారి యందలి ప్రమాణబుద్ధిని బట్టి వారు వాటిని ఏ అర్థంలో వాడుతున్నారో మనమూ అదే అర్థంలో వాడుతున్నాం, వాటి యథార్థమైన మూలభాషా-అర్థాలు ఏమైనప్పటికీ! అలాగే వారు వాటిని ఎలా వ్రాసి పలుకుతున్నారో మనమూ అలాగే వ్రాసి పలుకుతున్నాం. ఆంగ్లం ద్వారా మనకి సంక్రమించిన ఈ బహుభాషాపదాల ఆదానాన్ని ఆంగ్లద్వార ఆదానాలు అని చెప్పు కోవచ్చు.

ఉదా:- సువో మోటు, సునామి, పీజా, హాంబర్గర్, కిండర్‌గార్టెన్, కంగారూ, కాఫీ, ఆల్కహాల్, క్యారట్, జిరాఫీ, హెన్నా, సిరప్, బ్రాందీ, బండిల్, కోకో మొదలైనవి

ఆంగ్ల పదజాలం ఎలా పుట్టింది ?

తెలుగులో కొత్తపదాల కల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు పదాల్ని మక్కికి మక్కి దించుకోవడమో, అనువదించడమో కాక, ఇంగ్లీషులో పదాలు ఏర్పడిన విధానాన్ని ముందు సమగ్రంగా అధ్యయించి ఆ పద్ధతుల వెలుగులో తెలుక్కి వర్తించే సూత్రాల్ని ఏర్ప ఱచుకోవాలి. ఇంగ్లీషు పదాలు స్థూలంగా రెండు చారిత్రిక రకాలుగా ఏర్పడ్డాయి.

1. అచ్చ ఇంగ్లీషు పదాలు 2. ఆదానాలు.

వీటిల్లో అచ్చ ఇంగ్లీషు పదాలు నాలుగు రకాలుగా ఏర్పడ్డాయి.

(అ) జెర్మానిక్ పదాలు:— తోటి జెర్మానిక్ భాషలైన డచ్, జర్మన్ ఇత్యాది భాషలతో పోలికలు గల ఇంగ్లీషు పదాలివి. ఉదా :- friend, thanks, good, God, church, round, free మొదలైనవి.

(ఇ) ఆంగ్లో-శాక్సన్ పదాలు:— మొదట్లో Angles అని పిలవబడ్డ ఆదిమ ఇంగ్లీషు వలసదార్లు ఇంగ్లండులోని స్థానిక శాగ్సన్‌జాతివారితో సమ్మేళనమై మాట్లాడ నారంభించిన భాష. ఇంగ్లండులో 11 వ శతాబ్దం దాకా ఈ భాషని మాట్లాడారు. ఉదా :-

.
an – one

twa – two

þreo – three,

feower – four

fif – five,

siex or syx – six,

seofan – seven

eahta – eight

nigon- nine

tyn – ten

twentig – twenty,

hundred–hundred

hwæt – what,

hwær – where

hlaf bread (loaf)

cese – cheese

scyld – shield

reod – red

grene – green

geolu – yellow

man – human

wifman – woman

modor – mother

fæder – father

dohtor – daughter

sunu – son

hors – horse

cu – cow

bridd – bird

dæg – day,

nihte – night

middæ -midday

(ఉ) కెల్టిక్/ గేలిక్ పదాలు:— ఇంగ్లీషుకు పరిసర భాషలైన గాలిష్, ఈరిష్, స్కాటిష్, వెల్ష్ భాషల ప్రభావంతో ఇంగ్లీషులోకి వచ్చి చేఱిన పదాలు. కార్నిష్, కంబ్రిక్ , బ్రెటాన్ భాషల నుంచి కూడా ఇదే విధంగా పదాలు ఇంగ్లీషులోకి దిగుమతయ్యాయి.

ఉదా :- ఈరిష్ నుంచి – drum, galore, hooligan మొ|| స్కాటిష్ నుంచి – clan, pet, pillion, slogan మొ|| వెల్ష్ నుంచి – crag, flannel మొ||

(ఎ) నోర్డిక్ (Old Norse) పదాలు:— వైకింగులు ఇంగ్లండుని పరిపాలించిన కాలంలో వచ్చి చేఱిన పదాలు.

ఉదా :- aloft, anger, awe, awkward, axle, bag, bait, ball, band, bark, bask, berserk, birth, bleak, blunder, bulk, bylaw, cake, call, clip, club, call, crook, die, dirt మొ||

ఇంగ్లీషులో రెండో అతిపెద్ద శబ్దవర్గమైన ఆదాన పదాల్ని కూడా 4 రకాలుగా వింగడించవచ్చు.

(అ) ప్రామాణిక ఆదానాలు (Learned Borrowings): సంస్కృతప్రాకృత భాషల పదాల్ని తెలుగు గ్రహించి నట్లే మత-మతేతర కారణాలవల్ల ముఖ్యంగా పునరుజ్జీవన (Renaissance) కాలంలో లాటిన్, గ్రీకుపదాలు ఇంగ్లీషుని ముంచెత్తాయి.

ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

(ఇ) చారిత్రిక ఆదానాలు: తెలుగు ఉర్దూ రాజుల ప్రభావానికి లోనైనట్లే, ఇంగ్లండుని నార్మన్ రాజులు పరిపాలించిన కాలం లో ఇంగ్లీషు ఫ్రెంచి ప్రభావానికి గురైంది. ఫ్రెంచివారిని అనుకరిస్తూ ఇంగ్లీషువారు కూడా పదాల చివఱ ఒక అనవసరమైన e చేర్చి రాయసాగారు. ఉదా :- wyf కాస్తా wife అయింది.

(ఉ) సామ్రాజ్య ఆదానాలు: ఇంగ్లీషువారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తమ రాజకీయాధికారాన్ని స్థాపించినప్పుడు స్థానిక భాషలు నేర్చుకోవడం, వాటిలోంచి అవసరమైన పదాల్ని గ్రహించడం జఱిగింది.

ఇది తెలుగుని ఇంగ్లీషుతో పోల్చడానికి కాదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఆ పొఱపాటు చేస్తారు. నార్మన్ రాజుల కాలం లో తప్ప మిగతా అన్ని కాలాల్లోను ఇంగ్లీషు ఒక దేశానికి అధికార భాషగా ఒక హోదాని వెలగ బెడుతూ వచ్చింది. ఒక దేశానికి జాతీయభాషగా రాజపోషణకీ, దానిద్వారా ప్రజాపోషణకీ అది నోచుకుంది. అందుచేత అది ఎన్ని భాషల ప్రభావానికి లోనైనా తన అస్తిత్వానికి ప్రమాదం రాలేదు. తెలుగు పరిస్థితి పూర్తి విరుద్ధం. విజయనగర సామ్రాజ్యం అంతరించాక (క్రీ.శ. 1665 ప్రాంతం) అప్పట్నుంచి ఒక అధికారభాషగా తెలుగు యొక్క అధ్యాయం ముగిసిపోయింది. అయినా ఇప్పటిదాకా ఈ భాష బతికే ఉండడం గొప్ప సర్కస్ ఫీటే. అందుచేత చారిత్రికంగా అడుగడుగునా క్రూరమైన అణచివేతలకు గుఱై, వ్యవస్థాగతంగా అన్యాయానికి బలైన తెలుగుని అభిమానించడం – ఎంత తీవ్రస్థాయిలోనైనా సరే భాషోన్మాదం కాజాలదు.

అందుచేత చిరకాల బాధితురాలైన తెలుగుభాషని నిలబెట్టుకోవడమే మన లక్ష్యంగా ఉండాలనీ, ఆ క్రమంలో భాషని మింగేసే చర్యలకి పాల్పడకూదదనీ, అంతిమంగా మనం మన తెలుగువ్యాప్తికే ఉపయోగపడాలి తప్ప ఇతర భాషల భుజకీర్తులకి మెఱుగులు దిద్దే కార్యక్రమంలో పాలు పంచుకోకూడదనీ చెప్పడానికే ఇదంతా వ్రాశాను.

తెల్లదేశాల్లో వారికి తెలిసిన plain language, layman’s vocabulary అనే పదాలకి అర్థం వేఱు. మన దేశంలో layman’s language కి అర్థం వేఱు. అక్కడి layman’s language మన layman’s language కంటే అత్యంత సంపన్నమైనదీ, శక్తిమంతమైనది కూడా. మన దేశంలో వాడుకలో ఉన్న layman’s language శాబ్దికంగా ఒక బీదభాష. ఇందులో పదాలు కొద్ది. వ్యక్తీకరణలు పూజ్యం. మన laymen కనీసం ఐదో తరగతి వఱకైనా చదివినవారు కాక పోవడం ఇందుకో కారణం. పదో తరగతి వఱకు చదివినవారిక్కూడా పుస్తకపఠనాసక్తి లేకపోవడం మఱో కారణం. కాబట్టి అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని మనం కొత్త పదజాలాన్ని రూపొందించడానికి పూనుకోరాదు. అలా పూనుకుంటే తెలిసిన పదాల గుడుగుడుగుంచంలోనే తిరగాల్సి వస్తుంది.

ఆంగ్లమేధావులు తమ మాతృభాషలో నూతన పదనిష్పాదన ఎలా చేశారు ?

కొందఱు తలపోస్తున్నట్లుగా ఇంగ్లీషులో ఈనాడు మనకి కనిపించే పదాలు ఇతర భాషల నుండి మక్కికి మక్కి దిగుమతి చేసుకున్నవి కావు. ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడ్డవీ కావు. అవి మొదట్లో యావత్తు జనసామాన్యానికీ తెలిసినవీ కావు. వాటి వెనుక ఇంగ్లీషు మేధావుల కృషి చాలా ఉంది. అలాంటి కృషినే ఇప్పుడు మనం కూడా చెయ్యాలనుకుంటున్నాం. కొత్త పదాల రూపకల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు మేధావులు అనుసరించిన పద్ధతులనే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం.

1. పోలిక (Analogy):— అంతకుముందున్న పదాలకి సంబంధించిన కొత్త పదాలు అవసరమైనప్పుడు ఆయా పదాల స్వరూపానికి కొద్దిగా మార్పులూ చేర్పులూ చేసి వేఱే అర్థంలో వాడారు. అంతకుముందు కేవలం uncanny అనే పదం ఒక్కటే ఉండగా canny అనే పదాన్ని కల్పించారు. అంతకుముందు gnostic (ఒక ప్రాచీన క్రైస్తవ శాఖ సభ్యుడు) ఒక్కటే ఉండగా agonstic (అజ్ఞేయవాది, నాస్తికుడు) అనే పదాన్ని కల్పించారు. Outrage అనేది అచ్చమైన ఆంగ్లో-శాగ్జన్ పదం కాగా దానికి విశేషణంగా outrageous అని లాటిన్ శైలిలో కల్పించారు. అంటే ఉన్న పదాల నుండే కొత్త పదాల్ని కల్పించారు. అలా కల్పించడం ఇంగ్లీషు/లాటిన్ వ్యాకరణ సూత్రాలకు విరుద్ధమైనా లెక్కచెయ్యలేదు. సూత్రాలు వర్తింపశక్యమైతే పాటించారు. పాటించడానికి అవకాశం లేనిచోట త్రోసిపుచ్చారు.

2. ధ్వన్యనుకరణ (Imitation):— మనుషులు భావోద్వేగపుక్షణాల్లో చేసే అవ్యక్త కాకుస్వరాలకీ, ధ్వనులకీ శబ్దప్రతిపత్తిని కల్పించారు. ఆ ధ్వనులకి- తెలిసిన ప్రత్యయాల్ని జోడించి కొత్త పదాల్ని నిష్పాదించారు. ఆ క్రమంలో lispism, yahoo, pooh-poohing, booing మొదలైన పదాలు పుట్టాయి. మనవాళ్ళు కూడా “చకచక, నిగనిగ” నుంచి చాకచక్యం, నైగనిగ్యం, నిగారింపు మొదలైన పదాల్ని నిష్పాదించారు. అయితే ఈ ప్రక్రియ ఇటీవలి కాలంలో వెనకబట్టింది.

3. అర్థాంతర ప్రకల్పన (Semantic alteration):— సాధారణ పరిస్థితుల్లో భాష చనిపోదు. ఇసుమంత మారుతుందంతే! ఇంగ్లీషువారు అంతకుముందున్న పదాలకే కొత్త అర్థాల్ని అనువర్తించారు. Fan, straw, (cheque) leaf, web, portal మొదలైనవి ఈ కోవకి చెందినవి. కాని ఇలా చెయ్యాలంటే భాషాపటిమ కన్నా మనిషిలో కొంత కవితాత్మకత తోడవ్వాలి.

4. పునరుద్ధరణ (Revival):— భాషలో కొన్ని పదాలు బహుపాతవై ఉంటాయి. అవి నిఘంటువులకి మాత్రమే పరిమితమై ఉంటాయి. వాటిని ఇప్పుడెవఱూ ఏ మాండలికంలోను వాడకపోవచ్చు. వాటికి సమానార్థకాలైన వేఱే పర్యాయపదాలు ఇప్పుడు లభ్యమవుతూ ఉండొచ్చు. అంతమాత్రాన ఆ పాతపదాలు పనికిమాలినవి కావు. ఈ సత్యాన్ని ఇంగ్లీషువారు లెస్సగా కనిపెట్టారు. ఆ పదాల పాత అర్థాలకి సరిపోలిన కొత్త అర్థాల్లో వాటిని వాడడం మొదలుపెట్టారు.

ఆధునికంగా లభ్యమౌతున్న పదాలకి తోడు ఈ పాతపదాలు కొత్త అర్థాల సోయగాలతో జతచేఱి ఇంగ్లీషుభాషని నవయౌవనంతో పరిపుష్టం చేశాయి. Olympics, carnival, domain మొదలైనవి ఇందుకు ఉదాహరణలు.

5. మాండలికాల విస్తృత వినియోగం (Universalization of dialects):— ఇంగ్లీషులో ఎన్ని మాండలికా లున్నాయో ఎవఱికీ అంతుచిక్కదు. అయితే ఇంగ్లీషువారు ఆ మాండలికాలన్నింటినీ సందర్భానుసారంగా ఉపయోగించుకుని భాషని శక్తిమంతం చేసుకున్నారు. మాండలిక పదాలకి ఇప్పటికే ఉన్న అర్థాలకి తోడు కొత్త అర్థాల్ని జతకలిపారు. కొన్ని సందర్భాల్లో Slang నుండి సైతం ప్రామాణిక భాషని సిద్ధం చేశారు. ఉదాహరణకి jazz అనే పదం New Orleans రాష్ట్రంలో ఒక అశ్లీల క్రియాధాతువుగా మాత్రమే వాడుకలో ఉండేది. అదిప్పుడు ఒక గౌరవనీయమైన సంగీత కళారూపానికి నామధేయమైంది.

6. మిశ్రపద నిష్పాదన (Hybrid coinage):— ఇంగ్లీషులో ఇప్పుడు “చెయ్యదగిన” అనే అర్థంలో క్రియాధాతువుల చివఱ చేర్చబడుతున్న able అనేది నిజానికి ఫ్రెంచి ప్రత్యయం. మొదట్లో ఇది adorable మొదలైన ఫ్రెంచి ఆదాన పదాలకి మాత్రమే చేఱేది. క్రమంగా దాన్ని దేశి ఇంగ్లీషు పదాలక్కూడా యథేచ్ఛగా చేర్చడం మొదలైంది. ఈరోజు think, drink, eat, walk లాంటి అచ్చ ఇంగ్లీషు పదాలక్కూడా ఇలాంటి పరిణామాన్ని చూస్తున్నాం.

7. వైరిసమాస ఘటనం (Mixed compounds):— మన సంప్రదాయంలో సంస్కృత పదాలతో జతకలిపి తెలుగుతో సహా ఏ ఇతర భాషాపదాలకైనా సరే సంధులూ, సమాసాలూ చెయ్యడం అనాదిగా నిషిద్ధం. కలిసే సమాస అవయవాలు రెండూ సంస్కృత పదాలైతేనే వాటి మధ్య సంధి-సమాసకార్యాలు అనుమతిపాత్రం. ఆ రకంగా అవసరంలేని సంస్కృత పదాలు కూడా తెలుగులోకి సమాసాల రూపంలో యథేచ్ఛగా చొఱబడిపోయాయి ఒకప్పుడు ఇంగ్లీషులో కూడా ఇలాంటి సంప్రదాయమే ఉండేది. లాటిన్ గ్రీకు పదాలతో శుద్ధాంగ్ల పదాల్ని కలపకూడదు. అంతే కాక లాటిన్ సమాసాలు లాటిన్తో జఱగాలి. గ్రీకుసమాసాలు గ్రీకుతోనే జఱగాలి. లాటిన్ పదాలతో గ్రీకుపదాల్ని కలపకూడదు.

కాని ఆధునిక ఆంగ్లమేధావులు ఈ సంప్రదాయాన్ని కావాలనే విశృంఖలంగా ఉల్లంఘించారు. తప్పలేదు, తప్పు లేదు. ఎందుకంటే సమాసంలో రెండో పదం కూడా ఆ భాషాపదమే అయివుండాలంటే, ఎంతమందికి లాటిన్ గ్రీకుల మీద పట్టుంటుంది ? అలా నూతన పదసృష్టి స్తంభించిపోతుంది.

8. సమాస ఘటనం (word compounds):— ఆంగ్ల మేధావులు గత శతాబ్దాల్లో ఉనికిలో లేని కొన్ని వ్యాకరణ సంప్రదాయాల్ని తమ భాషలో ప్రవేశపెట్టారు. వాడుకలో బహుళప్రాచుర్యాన్ని పొందినప్పటికీ ఆంగ్లవ్యాకరణాల్లో మాత్రం ఆ నిర్మాణాలకు ఇప్పటికీ సముచితస్థానం లేదు. వాటిల్లో సమాసాలొకటి. సమాసం రెండు వేఱువేఱు అర్థాలు గల పదాలతో ఏర్పడే మిశ్రమం. ఆ మిశ్రమం నుంచి ఉప్పతిల్లే కొత్తపదం ఒక కొత్త అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తుంది. ఉదా :- రాజభవనం. ఇది రాజు కంటేనూ, భవనం కంటేనూ వేఱైన ఒక ప్రత్యేకమైన శ్రేణికి చెందిన కట్టడాన్ని సూచిస్తుంది. సమాసాల సౌలభ్యాన్ని ఆంగ్లమేధావులు త్వరగానే గ్రహించారు. ఇప్పుడు సమాసాల్లేకుండా ఇంగ్లీషు మాట్లాడడమే అసాధ్యం. ఒకవేళ అలా మాట్లాడితే ఇంగ్లీషు రాదేమోనని జాలిపడడం కూడా జఱగొచ్చు.

సమాసం = విగ్రహవాక్యం (సమాసనామం – మన అవగాహనలో)

1. Customer-care = Care for customers చతుర్థీతత్పురుషసమాసం

2. User-friendly = Friendly to the user చతుర్థీతత్పురుషసమాసం

3. User-serviceable parts = Parts serviceable by the user తృతీయాతత్పురుషసమాసం

4. Gas dealer = Dealer in gas సప్తమీతత్పురుషసమాసం

5. Expiry date = Date of expiry షష్ఠీతత్పురుషసమాసం

6. God-forsaken = Forsaken by God తృతీయాతత్పురుషసమాసం

7. Bible-thumping = Thumping the Bible ద్వితీయాతత్పురుషసమాసం

8. A London-bound airliner = An airliner bound for London చతుర్థీతత్పురుషసమాసం

9. Earth-fill = Filling with earth తృతీయాతత్పురుషసమాసం

10. Sky-diving = Diving in the sky సప్తమీతత్పురుషసమాసం

11. Trustworthy = Worthy of trust చతుర్థీతత్పురుషసమాసం

12. Action-packed = Packed with action తృతీయాతత్పురుషసమాసం

13. Painstaking/ breath-taking etc.

అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైచిత్రి ఉంది. దీన్నొక ప్రత్యేకమైన పదనిర్మాణ భేదంగా గుర్తించినప్పటికీ తాము వాడుతున్నవి సమాసాలు (word compounds) అని ఆంగ్లేయులకి ఇప్పటికీ తెలియదు. అలాంటి మిశ్రమాల్లో మొదటిపదం functional గా adjective అవుతోందని వారు భ్రమిస్తున్నారు. ఆ మాటే తమ వ్యాకరణాల్లో వ్రాసుకుంటున్నారు కూడా! రెండుపదాలు కలుస్తున్నప్పుడు మాయమౌతున్న విభక్తిప్రత్యయాల (prepositions)ని వివరించే వైయాకరణ బాధ్యత (grammarian’s burden) గుఱించి మర్చిపోతున్నారు.

సమాసాలే మన భాషక్కూడా బలం. ఇంగ్లీషు వ్యాకరణాల్లా కాకుండా మన వ్యాకరణం సమాసాల్ని క్రోడీకరించి వర్గీకరించింది కూడా. అవి మన భాషలో ఇప్పటికే వందలాదిగా ఉన్నాయి. కాని ఆధునిక అవసరాలకి అవి సరిపోవు. మన భాషకున్న సమాసశక్తిని సక్రమంగా వినియోగించుకుని చాలా కొత్తపదాల్ని సృష్టించుకునే సౌలభ్యం ఉంది.

9. సందర్భాంతర (ప్రకరణాంతర) ప్రయోగాలు:— నామవాచకాల్ని క్రియాధాతువులు (programming, airing, parenting, shopping, modelling, typing, cashing, triggering, highlighting, Focussing మొదలైనవి) గా మార్చి ప్రయోగించడం ఇంగ్లీషుకు ఎంత ఊపునిచ్చిందో ఇది కూడా అంతే ఊపునిచ్చింది. సందర్భాంతర ప్రయోగాలంటే- సాంప్రదాయికంగా ఒక సందర్భంలో మాత్రమే వాడాల్సిన పదాల్ని ఇంకొన్ని ఇతర సందర్భాలక్కూడా అనువర్తించి వాడ్డం. అలాగే ఒక రంగంలో వాడాల్సిన సాంకేతిక పదాల్ని ఇంకో రంగానికి ఆరోపించి వాడడం కూడా! ఉదా:- screen (తెఱ) నాటకాలకూ, సినిమాలకూ అన్వయించే మాట. దాన్ని సమా.సాంకే. (IT) రంగంలో కొన్నిరకాల పుటల్ని సూచించడానిక్కూడా వాడుతున్నారు. అలాగే, campaign కి ప్రాథమికంగా దండయాత్ర అని అర్థం. కాని ఇప్పుడు దాన్ని ప్రచారయుద్ధం అనే అర్థంలో కూడా వాడుతున్నారు. గుఱ్ఱాల శారీరాన్ని (horse anatomy) అందు లో భాగాల్నీ కార్లకీ, ఇతర యంత్రాలకీ అన్వయించి ప్రయోగించడం కూడా జఱిగింది.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF epub MOBI

Posted in 2014, పదనిష్పాదన కళ, మే and tagged , , , , , , , , , , , , .

2 Comments

  1. @అచంగ… ఆంగ్లద్వార ఆదానాలు అనే categorization అదే సూచిస్తోందనుకుంటున్నానండీ, ప్రత్యేకంగా Source language ని మెన్షన్ చేయకపోయినా !

  2. “Tsunami (సునామీ) అనే పదం జపనీయ భాషనుండి (ఆంగ్లం ద్వారా) తెలుగులోకి వచ్చిన పదం” అనటం సముచితం.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.