cover

ప్రళయకావేరి జీవన సంస్కృతి

Download PDF ePub MOBI

“అమ్మంటే కన్నతల్లి మటుకే కాదురా, అమ్మంటే అమ్మ బాస కూడా. అమ్మంటే అమ్మ నేల కూడా…” అని బాల్యంలో తాత చెప్పిన మాటలను, ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మార్చుకుని జీవిస్తున్న రచయిత స. వెం. రమేశ్. ఆయన కలం తెలుగు జాతికి అందించిన మహత్తరమైన సాహిత్యం “ప్రళయకావేరి కథలు”. అంతరించి పోతున్న ఒకానొక ప్రాంతపు భాషాసాంస్కృతిక జీవన విలువలను మన ముందు నిలుపుతున్న యీ కథలు, రచయిత తన బాల్యంలో మక్కువతో తిరిగిన ప్రాంతాలకు సంబంధించినవే కావడం విశేషం.

“ఒకప్పుడు కావేరినది ‘ప్రళయకావేరి’ అన్న చోటే సముద్రంలో కలిసేదట. భూకంపాల వలన ప్రస్తుతం దిశను మార్చుకున్నదట” అన్న భౌగోళికమైన సత్యం మనకెంత ఆశ్చర్యాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందో, నేడు ‘ప్రళయకావేరి’ అన్న పేరే మాయమై, ప్రభుత్వ కైఫియతులలో ‘పులికాట్’గా స్థిరపడిపోయింది అన్న సత్యం అంత ఆవేదననూ కలిగిస్తుంది. దాదాపు ముప్ఫై మైళ్ళ పొడవు, పదిమైళ్ళ వెడల్పుతోనున్న ఉప్పునీటి సరస్సు ప్రళయకావేరిలో నలభై దీవుల దాకా ఉన్నాయి. ఆ దీవుల్లో ఒదిగినట్లు ఉండే ఒక దీవి ‘జల్లలదొరువు’. “తెలుగుపున్నమి వెన్నెట్లో దిశాంబరంగా సాగిపోతున్న బతుకు చక్కదనం. కలుపు మొక్క లేని తెలుగు పంట” అని పొగడ్తగన్న ‘జల్లలదొరువు’కు, ‘ఉత్తరపొద్దు’ అన్న మొదటి కథతోనే, మనలను చేయి పట్టి నడిపించి తీసికెళ్లే ‘ప్రళయకావేరి కథలు’ ఆర్ద్రతతో కూడిన బాల్య జ్ఞాపకాల నేపథ్యంతో ఆ ప్రాంతపు సామాజిక జీవనాన్ని వివరిస్తాయి. మరిచిపోతున్న మాండలిక భాషను అందిస్తాయి. ఆ ప్రాంతంలో ఒకప్పుడు పరిఢవిల్లిన సాంస్కృతిక సౌరభాన్ని పరిచయం చేస్తాయి. సెలవుల్లో మాత్రమే అవ్వతాతల ఊరైన జల్లలదొరువుకు వెళ్ళే ఒక కుర్రవాడి బాల్యం వెలిగిన నేపథ్యాన్ని వివరిస్తాయి. అదిగో, అప్పటి ఆ వెలుగు, బాల్యంతో ఆగిపోకుండా, భాషాసంస్కృతుల పట్ల ప్రేమతో తెలుగు భాషను ఉద్దీపింపచేస్తున్న అరుదైన వ్యక్తిత్వంగా ఎదిగిన తీరుకు అద్దం పడతాయి. రాకెట్ కేంద్రం ఏర్పాటు వంటి జాతీయస్థాయి అభివృద్ధి, గులకబాటలు, కరెంటుసౌకర్యం, బస్సుల ఏర్పాటు వంటి సౌకర్యాల వలన ఆ దీవుల్లోని ప్రజల జీవితాలలో ఏర్పడిన శైథిల్యాలను, మనసు తడిసేలా చెబుతాయి.

PralayaKaveriKathaluఒక ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధంలో వరుసగా వెలువడిన ఇరవై ఒక్క కథలతో కూడిన ఈ ‘ప్రళయకావేరి కథలు’ ఒక ప్రాంతపు జీవన సంస్కృతిని అక్షరబద్ధం చేసే చారిత్రకకావ్యం వంటిది అనడం అతిశయోక్తి కాదు. అందమైన సజీవమైన మాండలిక భాషాసౌందర్యంతో సాగే యీ కథాసంకలనం లోని కథలన్నీ ఉత్తమ పురుషలో సాగే కథలే! భాషల పేరుతో రాష్ట్రాలేర్పడిన నేపథ్యంతో, ప్రళయకావేరి సరస్సును కూడా రెండు రాష్ట్రాలు పంచుకున్న వైనం మొదలు, ఆ దీవులలో క్రమంగా కనుమరుగవుతున్న భాషా సంస్కృతులను, జానపద కళలను గూర్చి అచ్చతెనుగు పదాలతో వివరిస్తాయి ఈ కథలు. ఆ ప్రాంతంలో పండే తమిదల (రాగులు) మొదలు వరిపంట దాకా వచ్చిన మార్పులను వివరిస్తాయి. అంతేకాదు, ‘ఉత్తరపొద్దు’ తో ప్రారంభమైన ‘ప్రళయకావేరికథలు’, అక్కడి పంటలు మొదలు, ఆటపాటలు, పండుగలు, వేడుకలతో బాటు, ఆ ప్రజల, మానవత్వ పరిమళంతో కూడిన జీవన నేపథ్యాన్ని, నిసర్గసుందరంగా వర్ణిస్తాయి.

‘జల్లలదొరువు’ అంటే, వెంకన్న తాత పెద్దరికపు సౌందర్యమేనని చాటే యీ కథలు, ఎన్నో అరుదైన వ్యక్తిత్వాలను పరిచయం చేస్తాయి. సంక్రాంతికి వారం రోజులముందే వచ్చి, ఒంటి చేత్తో పనులన్నీ చక్కబెట్టి, గ్రామీణ మహిళాశక్తికి ఆనవాలుగా నిలిచే గేణత్త శ్రమశక్తినీ; వీధి భాగోతంలో సీత కష్టాలకు కారకుడైన రావణాసురుని పాత్రధారిని తరిమికొట్టిన కాశెవ్వ అమాయకత్వాన్నీ; ఉప్పు జవురుకురావడానికి వెళ్ళి దాహంతో అతలాకుతలమైన పన్నెండేళ్ళ పిల్లవానిని చనుబాలతో రక్షించిన వసంతక్క మానవత్వాన్నీ; దిగులుతిప్ప బురదలో ఇరుక్కున్న పిల్లవాడికి తన చీరనందించి పైకి లాగిన సుబ్బవ్వ వంటి దేవతా మూర్తులనూ; ఎప్పుడూ గొప్పలు చెప్తుండే సుబ్బతాత ఎచ్చులమారి వ్యక్తిత్వాలనూ; కాన్పుకోసం సినమ్మను పేటకు తీసికెళ్లాలని బండి కట్టి దాపటెద్దును పోగొట్టుకున్న వెంకన్నతాత త్యాగాన్నీ… యిలా ఎన్నో లక్షణాలను గ్రామీణ సౌందర్య ప్రతీకలుగా నిలబెడతాయి యీ కథలు.

మనం మర్చిపోతున్న మూలికా వైద్య విధానాలనూ, పిల్లల ఆటలనూ, పట్టణవాసులు గుర్తించడానికి కష్టసాధ్యమైన ఋతువుల సౌందర్యాన్నీ, జానపద విజ్ఞానాన్ని నిరూపించే మౌఖిక సాహిత్యంతోబాటు కళల ప్రదర్శనలు వంటి అపురూపమైన అంశాలనెన్నిటినో అందిస్తాయి. ఉత్తరేణి ఆకు, కుప్పిగంటాకులను నలిపి గాయాలకు పూస్తే గాయాలు మానుతాయనే మూలికా వైద్యాన్ని పరిచయం చేస్తాయి. తండ్రికి భయపడి “మన భూమి మల్లాంలో గుండ్రంగా, జల్లలదొరువులో సదరంగా ఉంటాది” అనిచెప్పే పిల్లల సమయస్ఫూర్తినీ; వలపన్ని పట్టుకున్న కుందేళ్ళు తినడానికని తెలిసి “యింత కస్టపడి పట్టుకునింది, సంపేసే దానికా?” అని కళ్ళనీళ్లు పెట్టుకుని వాటిని విడిచిపెట్టేలా చేసిన బాల్యంలోని కరుణ రసాన్నీ… యిలా జీవనోత్సాహాన్ని కలిగించే ఎన్నో అంశాలను పరిచయం చేస్తాయి.

కడవ బాయిలో దూకుడు పందాలు, బలిగుడు ఆట వంటి మగపిల్లల ఆటలూ, వామనగుంటలు, అచ్చంగాయలు, చికుచికుపుల్ల, తొక్కుడుబిళ్ళ వంటి ఆడపిల్లల ఆటలతోబాటు, పండుగలప్పుడు ఆడే, మనం మర్చిపోతున్న, నెమిల్లాటలు, పామాటలు, కీలుగుర్రాలు, మరగాళ్ళు, యీరదాళ్ళూ, పంబజోల్లు, యానాది సిందులు, యీరబద్ర పూనకాలు, హరికతలు, బుర్రకతలు వంటి ఆటలనూ, పాటలుపాడే బాగోతాలు, పద్యాలు పాడే నాటికలు వంటి వీధి నాటకాలను, గ్రామీణులు పాడుకునే, లచ్చుందేవర నవ్వు, ఊరిమిళనిదర, పాంచాలమ్మ దాయాలాట, సీతమ్మ చెర వంటి స్త్రీల పాటలను, పిల్లలకు చెప్పే బాలనాగమ్మ కత, కాంబోజరాజుకత, కార్తవరాయుడికత, కాటమరాజు కత, నల్లతంగ కత వంటి జానపద కథలను గుర్తుచేస్తాయి. సరదాగా వేసుకునే పొడుపు కథలను, జానపద విజ్ఞానానికి దాఖలాగా నిలిచే జాతీయాలను, సామెతలను, యిలా ఎన్నో సాంస్కృతిక సంపదలనూ, అంతరించిపోతున్న సాంస్కృతిక సంపదలను మన ముందుంచుతాయి యీ కథలు.

మనం మర్చిపోతున్న పిట్టలను, బెళవాయిలు, జీనివాయిలు, టకుటకు పిట్టలు, జిట్టివాయిలు, పాలపిట్టలు, అంటూ వాటికున్న తెలుగుపేర్లను, గుర్తు చేయడమే కాదు, మంచుకాలంలో ప్రళయకావేరి సరస్సుకు వచ్చే వలసపక్షులు… గూడబాతు, పుల్లంకులు, గుండు పుల్లంకులు, తెడ్డుమూతి కొంగలు, నారాయణకొంగలు, నీళ్ళ కాకులు, చిలవలు, చింతొక్కులు, ఆడేటి బాతులు, నత్తగుల్ల కొంగలు, పాముమెడ కొంగలు అంటూ, తెలుగు పేర్లను చెప్తూ, తెలుగుభాష సుసంపన్నతను అద్దంపట్టి చూపుతాయి. అలాగే వడ్లరకాలు, పండ్లరకాలు, గృహోపకరణాలు, వ్యవసాయ పనిముట్లకున్న తెలుగు పేర్లను అక్షరబద్ధం చేస్తూ మనం మర్చిపోతున్న తెలుగు పదాలను గుర్తుచేస్తూంది.

‘ముక్కర్ర’ అంటే ముగ్గు అనీ, ‘ఎత్తుబారపోడు’ అంటే అమాయకుడనీ, ఊటబాయిని ‘కీన్రబాయి’ అంటారనీ, చిన్నపిల్లలకు వచ్చే ఒక శ్వాసకోశవ్యాధిని ‘ఎళువు’ అంటారనీ, ఆ పదం తిట్టుగా మారిన సంస్కృతినీ తెలుపుతాయి. గరాటును ‘లొడిగ’ అనీ, అల్పపీడనాన్ని ‘అలపీడ’ అనీ, పాచికలాటను ‘దాయాలాట’ అనీ, సవక్కట్టిలంటే సరుగుడు కట్టెలనీ, ‘కొరవాసరవా’ అంటే మిగతా అనీ అర్థాన్నిచ్చే పదాలు ఆ ప్రాంతపు మాండలికపద సౌందర్యాన్ని పరిచయం చేసే కొన్ని ఉదాహరణలు మాత్రమే!

భాషాసౌందర్యంతో అలరారే యీ కథల్లో జాతీయాలకూ, సామెతలకూ కొదువలేదు. ‘ఎద్దుగిల్లో ముల్లంత’, ‘తోకమ్మిడ నారాయణా’ వంటి జాతీయాలూ; ‘పాటి మింద గంగమ్మకు, కూటి మిందే గెవనం’, ‘ఆత్రగాడికి అరువు తక్కువ’, ‘తుంగ దూలం కాదు, తూనాతోడు సుట్టం కాదు’, ‘చిక్కిబిక్కిరిచ్చే దాని కన్న యెల్లి యెక్కిరిచ్చేది మేలు’… వంటి సామెతలు మచ్చుకు కొన్ని మాత్రమే!

భోగిమంటలోకి చిల్లకంప ఐనా, పొయ్యిలోకి చిదుకులైనా పంటరంగం అడవుల నుండి సేకరించే పద్ధతి, సంవత్సరానికొకసారి ప్రళయకావేరి నుండి ఉప్పు సేకరించే పద్ధతి… ఆనాటి సామాజిక జీవనానికి ఆధారంగా నిలుస్తున్నాయి. చీరాల నుండి సూళ్ళూరు పేట దాకా తెల్లవాళ్లు తవ్వించిన కాలువలు ఉప్పు, చింతపండు, మిరపకాయలు, రాగులు, వడ్లు మొదలైన నిత్యావసరమైన వస్తువులనూ గొర్రెలు, మేకలు మున్నగు జీవాలనూ రవాణా చేసేందుకు ఉపయోగపడేవి అన్న చారిత్రక సత్యాన్ని వివరిస్తాయి. అంతరించిపోతున్న ఎన్నో గ్రామీణ క్రీడలతో బాటు, ప్రాచీన కావ్యాలలో పేర్కొనబడిన సిడిమాను అన్న క్రీడ, సుడిమాను పేరిట యీ ప్రాంతాలలో జాతరలు మొదలైన సమయంలో యింకా నిర్వహింపబడే జానపద సౌందర్యాన్ని వివరిస్తాయి.

ఈ పుస్తకంలోని యిరవై కథలు ప్రళయకావేరి అడుసునేల సౌందర్యాన్ని పట్టి చూపుతుంటే, ‘ప్రవాళ ప్రయాణం’ అన్న ఒక్క కథ అడుగుకొక మడుగూ, బార కొక గుండం, ఆమడకొక కోన, కోన కోనకీ నాలుగయిదు ఝరులు, లెక్కలేనన్ని సెలలు, దొనలు, గవులతో నిండిన గట్టినేల… ఈ అడవి అందాలను పరిచయం చేస్తుంది. ‘ప్రవళ వర్ణేశ్వర పురం’ అన్న పేరు ‘ప్రవాళం’ గా కుదించుకున్న వైనాన్నీ, ప్రవాళంవాగు, కాళంగినది, యీ రెండూ ప్రళయకావేట్లో కలిసే విధాన్ని, వివరిస్తాయి. ఆకాశాన్నంటే శిఖరాలతో, జలపాతాల ప్రవాహానికి నున్నగా మారిన కొండ కొనలతో, దొమ్మలగొండ్లు మొదలైన క్రూరమృగాలు తిరుగాడే ముళ్లదార్ల నిండిన దట్టమైన అడవులతో, హాయిగా పలుకరించే రకరకాల పక్షుల రాగాలతో సాగే ‘ప్రవాళప్రయాణం’ కథ ఎంతో మార్మికమైన జీవితానుభవాన్ని కళ్ళకు కట్టిస్తుంది.

నీలివర్ణంతో మెరిసే ప్రళయకావేరి అందాలనూ, హరిత వర్ణంతో వెలిగే అడవి అందాలనూ, ఆ ప్రాంతపు వైవిధ్యమైన పంటలను, వడ్ల రకాలను, పండ్ల రకాలను, చిరుతిండ్లను, వ్యవసాయ జీవనాన్ని, ప్రళయకావేటి దీవుల్లో ‘శ్రీహరికోట’ రాకెట్ కేంద్రంగా ఏర్పడటంవలన వారి జీవన విధానాల్లో వచ్చిన మార్పులను… ఇలా ఎన్నింటినో గ్రంథస్థం చేస్తాయి. అన్యభాషల సాయం అక్కర లేకుండా ప్రతిభావానికి తగిన అచ్చమైన తెలుగు పదాలను అందించే నిధిగా, పర్యావరణ స్పృహకు పెన్నిధిగా నిలిచే యీ “ప్రళయకావేరి కథలు” పటిష్టమైన ఎత్తుగడతో, రసాత్మకమైన కథనంతో, హృద్యమైన శైలీవిన్యాసంతో సాగుతాయి.

జీవితానుభవాన్ని, దాని వెనకాల ఉండే జీవనసూత్రాలనూ ఆకళింపు చేసుకున్న రచయిత కలం – స్నేహితుడు ‘లోలాకులు’ చెంగాళమ్మ తిరనాళ్ళలో తప్పిపోవడాన్నీ, పరిచయమైన పదినాళ్లకే చుట్టమైన కొత్త స్నేహితుడు ‘మిద్దెలోని’ వీరమరణాన్నీ, ప్రాణమైన అవ్వను బలితీసుకున్న వరద బీభత్సాన్నీ, ప్రాణానికి ప్రాణమైన వెంకన్న తాత ప్రళయకావేటి ఒడిలో పొందిన దీర్ఘ నిద్రనూ గుండె తడిసేలా వివరిస్తూ ‘అన్నీ క్షణికమే’ అనే జీవన సత్యాన్ని అనుక్షణం గుర్తుచేస్తూ సాగినా, మానవతాబంధురమైన జీవనవిలువల సానుకూల దృక్పథంతో మనలను బలోపేతులనూ చేస్తుంది. అందుకే, మూడుపదులకు పైబడిన కథలను అందించడంతో బాటు, “తెలుగు వాణి” సంస్థ స్థాపకులుగా, నిరంతర యాత్రికులుగా, తమిళనాట తెలుగును మర్చిపోతున్న తెలుగు ప్రజలకు మాతృభాషను నేర్పుతూ, తెలుగులో కథలను రాయిస్తూ, ఆయా ప్రాంతాల భాషా సంస్కృతులను అక్షరబద్ధం చేయిస్తూ, ఈ సంవత్సరం ‘అజోవిభో విష్ణుభొట్ల ఫౌండేషన్’ నుండి “సరిలేరు మీకెవ్వరూ” అన్న బిరుదును సొంతం చేసుకున్న స.వెం. రమేశ్ గారి “ప్రళయకావేరి కథలు” మన జ్ఞాపకాలను జాగృతం చేసే ఒక మంచి పుస్తకం అనడం అక్షర సత్యం!

– డా. రాయదుర్గం విజయలక్ష్మి

(చెన్నై ఆకాశవాణి సౌజన్యంతో; ఈ మే నెల 21న హోసూరులో విడుదల కానున్న “పొరుగు తెలుగు బతుకులు” అన్న పుస్తకంలో ఈ వ్యాసం ఒక భాగం.)

Download PDF ePub MOBI

Posted in 2014, పుస్తక సమీక్ష, మే, వ్యాసం and tagged , , , , , .

One Comment

  1. ప్రళయ కావేరి కథలు అచ్చయ్ దశబ్ది దాటినా వాటి పరిమళం వీగి పోవడమే లేదబ్బా. పల్లె గుడిసెల్లోంచి లేచే తెల్లని పొగలా తెలుగు నేల అంతా కమ్ముకునింది. ప్రళయ కావేరిని రమేశ్ గారు కొండ మాదిరి చిత్రిస్తే దాన్ని రాయదుర్గం గారు మాకు అద్దం లో సూపిరి. మీ ఇద్దరికి నా మప్పిదాలు .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.