cover

ప్రేమ కథ – రిఫైన్డ్

Download PDF ePub MOBI

సన్నగా ఎండ కారుతోంది. అప్పుడప్పుడూ గుళ్ళో గంటలు వినిపిస్తున్నాయి. ఒక కొబ్బరి పెంకుని తీసి కోనేట్లోకి విసిరాను. రిపుల్స్…!! నవ్వొచ్చింది. కాళ్ళు తీసి కోనేట్లో ముంచాను. జిల్లుమనే చల్లదనం. చుట్టూ చూసాను… ఎవరూ చూడట్లేదు! నెమ్మదిగా మెట్ల మీద నడుము వాల్చాను. పైన నీలంగా ఆకాశం… ఎంతందంగా ఉంది! ఈ విరహం, ఈ ఎదురుచూపు, మధురమైన భావన! సాయంకాలపు ఎండ, పాదాలు నీళ్ళలో చల్లదనాన్ని ఆస్వాదిస్తుంటే చూపులు అనంతనీలాకాశంలో లీనమయ్యాయి. ఇలాగే చనిపోతే? నిర్వాణం అంటే ఇదేనేమో…

ఎవరో వస్తున్న అలికిడయ్యింది. చప్పున కాళ్ళు సర్దుకుని కూర్చున్నాను. ‘అతనేనా?’ గుండె దడదడలాడింది. కాదు ఎవరో చిన్నపాప. కోనేట్లోకి ఒక రూపాయి విసిరి దణ్ణం పెట్టుకుంటోంది. ఎందుకో మనసు చిన్నబోయింది… ‘ఏడీ అతను?’ గాలికి నా చీర కొంగు రెపరెపలాడుతోంది. కొంగుని సర్దుకుంటూ ఆలోచిస్తున్నా… ఏమనుకుంటాడు? అతనికిష్టమైన రంగు చీరా, ప్రత్యేకంగా తయారైన నేనూ, నేను చెప్పబోయే మాటా…. ‘డజ్ హి డిసర్వ్ దిస్ కన్ఫెషన్?’

“అమ్మాయ్, ఏం చేస్తున్నావిక్కడ?” అమ్మయ్యో వచ్చేసాడు.

“ఎంతసేపూ? చుక్కలు లెక్కపెట్టుక్కుంటూ కూర్చున్నా?” నవ్వేస్తూ అన్నాను.

“బావుంది భావికా” అంటూ నా పక్కన కూర్చున్నాడు. చుట్టూ పరికిస్తూ, “ఊరి చివర గుడి అనగానే ఆలోచించాగాని, నీ టేస్ట్ లానే ఉంది ఈ ప్లేస్ కూడా…”

“ఎలా ఉంటుందేంటి నా టేస్ట్?” కళ్లెగరేశాను.

“కాస్త అందంగా… కాస్త గాఢంగా…”

“అంతేనా – మరి శాంతము, ప్రశాంతము, బ్లిస్ లాంటి మంచి మాటలు…”

“జోకులేయ్యకు. నీకు సూట్ అవ్వని పదాలవి.”

“సరే. ఒప్పుకున్నాలే”

“టూ బాడ్. నీతో దెబ్బలాడదామని చూస్తుంటే…”

ఇది దెబ్బలాడే సమయం కాదు, అతని వైపు చూస్తూ అనుకున్నా.

“ఏంటి, సడన్ గా సైలెంట్ అయిపోయావు? కొంపతీసి దెబ్బలాట ఆల్రెడీ అయిపోయి కోపం కూడా వచ్చేసిందా ఏంటి?” నవ్వుతూ అడిగాడు.

“లేదు, ఇంత ప్రశాంత వాతావరణంలో దెబ్బలాట ఏంటి” మెత్తగా అన్నాను. ‘నిజమే’.. నాటకీయంగా తల పంకించాడు.

“ఇంతకీ ఏదో ముఖ్యమైన విషయం అన్నావు. చెప్పు ఏంటి?”

మాటలు మనసులోనే అంటుకుపోయాయి. ఎలా చెప్పాలీ. “చెప్పు” ఇంకోసారి. పెంకుల్ని నీటిలోకి విసురుతున్నాడు. ఆనందంగా స్వీకరిస్తాడా, అదిలిస్తాడా, తనకీ ఈ భావనే ఉందని చెప్తాడా, లేక తిరకాసుగా మాట్లాడతాడా. ఇవన్నీ గాక, ఒక అమ్మాయి నా మీద పడిచస్తుందని ఫ్రెండ్స్ తో మందు పార్టీలో గొప్పలు పోతాడా?

“చెప్పూ…”

చెప్పనా? తేలికైపోతానేమో… ఊహు.. అంత దూరం నుంచి వచ్చి ఇంత ఎదురుచూసింది ఇందుకోసమేగా… “ఊ… ఇందాకటి సంభాషణతోనే మొదలుపెడతా… గాఢ, ఘాటు మాటలు కాదు.” మాటలు వెతుక్కుంటూ ఆగాను. “ఏదన్నా అనుభూతిస్తే ఆ స్పందనను చెప్పకుండా ఉండడం నా వల్ల కాదు. ఐ డఫినెట్లి నీడ్ ఆన్ అవుట్లెట్ ఫర్ మై మొమెంట్స్ ఆఫ్ ఎక్స్టేసి” నా మాటలు తనకెలా అనిపించి ఉంటాయో అనుకుని నవ్వాను. “నా భాష తో కంగారుగా ఉందా?”.

“లేదు. నీతో కాస్త అలవాటయ్యిందిలే” తనూ నవ్వాడు.

“సరే, నీతో పరిచయం సంచలనం కలిగించింది. ఇంతకూ ముందెప్పుడూ ఇంకెవ్వరితోను కలగలేదని కాదు. కాని ‘మనసు పూర్తిగా ఆకర్షణల స్థాయి నుంచి ఎదిగిందనుకున్నాక కూడా మళ్ళి ఈ బాధేంటి’ అని చాలాసార్లు ప్రశ్నించుకున్నా. బయట పడడానికి, నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాను. నీ చొరవా, నా ఆకర్షణా? అది జరగలేదు. బాగా దగ్గరగా గమనిస్తే ఏమన్నా తెలుస్తుందేమోనని దగ్గరయ్యాను. నీలో తప్పులు పనికట్టుకు వెదికాను. కాని…”

తన ఆకర్షణలో ఎంత పిచ్చెక్కిపోయానో తలచుకున్నాను. ఆఫీసులో టెండర్ తప్పుగా రాసినప్పుడు మా చాదస్తపు మేనేజర్ అవమానపు తూటాల్లాంటి మాటలు…. తన దగ్గరనుంచి ఫోన్ రాలేదని రోషంతో, ఫోన్ చెయ్యాలంటే అభిమానపడి రోడ్డుమీద ఆరుకిలోమీటర్లు ఏకబిగిన నడిచి ఇంటికొచ్చి భరించలేక పడిన యాతన… ఇంట్లో పిల్లల మీద అరవడం, నా అదుపులో నేను లేకపోవడం ఎంత రగిల్చింది నన్ను… ఎన్ని రకాలుగా ప్రశ్నించి చిత్రవధ చేసుకున్నాను నన్ను! మరైతే ఎందుకు?!! కానీ ఇంతేనా…? ఒక్కసారి ఈ భావనను దగ్గరకు తీసుకుని ఒప్పుకోగానే ఎంత బావుంది. ఇంత తీవ్రంగా నేను ఏ విషయానికైనా స్పందించి ఎంత కాలమైంది! వణికే చేతులు, ఎదురు చూపులు, చిన్న మాటలు… ఇంత ఆనందం… బహుశా పదహారేళ్ళప్పుడు ఒక ఇంఫాచ్యుయేషన్. మళ్ళీ ఇప్పుడే…

‘ఇప్పుడు ఇతను నా పక్కనే ఉన్నాడు.’ అతని ఉనికి గుర్తుకువచ్చి ఉలికిపడ్డాను. ఏమనుకుంటున్నాడు. తలతిప్పి చూసాను. కోనేట్లో పడుతున్న వెలుతురూ మరకలను చూస్తున్నాడు. “చెప్పు” నిశ్చలంగా అన్నాడు.

“ఏముందింక… ఈ ఆకర్షణ ఏంటి? ప్రేమలాంటి పెద్దమాటలను నమ్మను. ఇన్ఫాచ్యుయేషన్ అనే మాట చాలా తేలికగా అనిపిస్తుంది. దీని పేరేంటో! కొత్తగా, కంగారుగా ఒక కొత్త వైబ్రన్సులోకి తోయబడుతున్న థ్రిల్లర్ సినిమాలాంటి ఫీలింగ్ వస్తోంది. దానికి మీకు థాంక్స్ చెప్పాలి. సో, థాంక్ యు ఫర్ మేకింగ్ మీ గో త్రూ దిస్ ప్రాసెస్… హౌ ఎవర్ టఫ్ ఇట్ మైట్ బి.”

అయిపోయినట్లు సర్దుకుని కూర్చున్నాను. నెమ్మదిగా చీకటి పడుతోంది. చల్లగాలి పెరిగింది. దూరంగా గుడిలో గంటలు ఆగకుండా మోగుతున్నాయి. మసక వెలుతురులో అతని భావాలు చదవడం కష్టంగా ఉంది. కొద్దిసేపు మౌనం… గాలికి రెపరెపలాడే నా చీర కొంగు చేస్తున్న చప్పుడు, అప్పుడప్పుడూ వినిపించే మంత్రాలూ మా మధ్య మౌనం… ఏదో సంభాషణ సాగుతున్నట్లే అనిపిస్తుంది నాకు. మంద్రంగా అతని మొబైల్ మోగింది. లేచి గట్టు మీదే పచార్లు మొదలు పెట్టాను.

స్తబ్దుగా ఉంది మనసు. కాని నా గురించి చెబితే వినాలని ఉంది. నీలాగే నేను కూడా ఇంత హింసే పడ్డానని చెబుతాడా? కాని అవన్నీ పక్కన పెడితే ఇంత చల్లని సాయత్రం నా మనసు తెలిపేందుకు నాకిష్టమైన వ్యక్తి నా ఎదురుగా ఉండడం ఎంత అదృష్టం! తరవాత ఏమైతే ఏంటి? ఫోన్ ముగించి నాదగ్గరికి వస్తున్నాడతను. సిల్హోట్ లో కనిపిస్తున్న ఆకారాన్ని గర్వంగా చూసుకున్నా… ఏమి చెబుతాడు…

“నడుద్దామా?” తలూపి లేచాను. నడుస్తున్నాం.

“ఏమనుకుంటున్నారు?” చటుక్కున నోరుజారాను.

“ఏమనుకోవట్లేదు” చురుగ్గా చూసాను. “నిజంగానే ఏమనుకోవట్లేదు. ఇందాక నువ్వు చెప్పిన విషయాలు కాస్త తెలిసినవే. నాకు ఎంతో కొంత ఆసక్తి ఉంది నీ మీద. అందుకే నీతో సమయం గడుపుతాను. నీ ధైర్యం, నీ వ్యక్తిత్వం నచ్చుతాయి. అలాంటప్పుడు నీ దగ్గర నుంచి అలాంటి మాటలు వింటే బావుంది” ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నా. ఇంకేమన్నా చెబుతాడా?

“కానీ…” ఏదో మాట్లాడించాలి తనతో “ ఈ మొత్తం ప్రాసెస్ చాల బాధగా ఉంది.”

“ఊహూ… ఎందుకు?”

“ఎందుకు అంటే.. ఒక రకమైన హింస కనిపిస్తుంది నాకిందులో… మీ దగ్గర్నుంచి ఒక కబురో మాటో, పలకరింపో కావాలనిపిస్తుంది. ఎప్పుడన్నా, మీరు నాగురించి నేను ఫీల్ అయినంతగా అవడం లేదన్న ఆలోచన నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ సమయాల్లో మీ మీద కోపం వస్తుంది. మీ దగ్గరకి రాలేకపోయిన నా పరిస్థితి చాలా బాధపెడుతుంది. ఆ స్థితిలో కోపం, ఆవేశం…” ఆగాను “మీకలా అనిపించదా?” .

“ఎందుకనిపించాలనుకుంటున్నావు?”

“ఎందుకనిపించదు, ఒక మనిషి మీద ఆకర్షణ కన్నా బలమైన ఫీలింగ్ ఉన్నప్పుడు? అప్పుడప్పుడూ అనిపిస్తుంది… నిజంగా ఇంత ఫీల్ అవుతున్నాను… అతనికి నామీద ఎలాంటి ఫీలింగ్ లేకపోతే ఇదంతా ఎంత వృధా… అని. ఏమిటేమిటో మాట్లాడుతున్నా… కానీ ఈ రోజుకు వదిలెయ్యండి. నాలో ఉన్న ఇంత ఇంటెన్స్ ఫీలింగ్స్ ని అందుకునే మనిషికి ఎంత అర్హత ఉంది. ఇదంతా నాకెంత రిస్కుతో కూడిన పని.” మాట్లాడుతున్న కొద్దీ మనసులో ముడులు వదులవుతున్నట్టుగా ఉంది. “సమాజంలో నేనంటూ కొన్ని ముఖ్యమైన పాత్రలు పోషించాల్సి ఉంది. ఇలా కొట్టుకుపోతే నేనేమవుతానా అని. కానీ ఇక నావల్ల కావడం లేదు. అందుకే ఈ రోజు మీకు చెబితే కాని నాకు ప్రశాంతత ఉండదని చెప్పడానికొచ్చాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఇక్కడితో ఆపేస్తాను. కనీసం ఇది నాకు అందదు అనుకుంటే నా మనసుకు కాస్త ప్రశాంతత దొరుకుతుంది. చెప్పండి. మీకు ఇబ్బందిగా ఉందా…”

“లేదు.” తల అడ్డంగా ఊపాడతను. “కాని ఒక వేళ నాకిష్టమో, లేకపోవడమో ఏదీ లేకపోతే…”

“అదెలా అవుతుంది. మధ్యస్తంగా ఉండడం పలాయనవాదం అవుతుంది. అయినా ఒకమ్మాయి ఇంత స్పష్టంగా అడిగాక కూడా తికమకగా ఉంటుందా…” కాస్త రోషం వచ్చింది. “నిజమే, నాకేమి కమిట్మెంట్లు వద్దు. నిజానికి నాకిష్టం కూడా లేదు. ఈ మాటలతో నేనేమీ మన జీవితాలలో మార్పులు చేసుకుందాం అనడం లేదు. అవి అసాధ్యం కాకపోయినా అంత శ్రమ అవసరం లేదేమో…”

“ఇదే చెబుదామనుకున్నా… చెప్పనా…”

“చెప్పండి…”

“నువ్వు జెనరలైజ్ చేస్తున్నానొచ్చు. కానీ ఆడవాళ్ళిలా ప్రేమించడాన్ని ఫేవర్ చేస్తున్నట్లుగా ఎందుకనుకుంటారు? ఎమోషనల్ గానే కాదు. ఫిజికల్ గా కూడా ఇదే కనిపిస్తుంది.”

“ఫేవరా? నేనలా ఏమన్నాను?” తెల్లబోయాను.

“నువ్వు ఆ మాట వాడలేదు కాని, ఇంచుమించుగా నీ మాటల్లో నాకు వినిపించింది అదే! నువ్వు నా గురించి అనుకునే విషయాలు నా కర్థం కావూ? ఇంత దూరం నీకోసం ఈ సమయంలో వచ్చానంటే నాకు నీ మీద ప్రత్యేకమైన ఇష్టం ఉండికాదా.. చెప్పనవసరం లేదనుకుంటా? ఇప్పుడీ విషయం తెలిసాక ఏమవుతుంది? ఒక నాలుగు ఫోన్లు కాస్త సరస సంభాషణలు ఒకటి రెండు సార్లు కలుసు కోవడం అంతేనా?”

ఇంతే అర్థమవుతుంది! “వెళ్దామా?” అసహనంగా వెనక్కి తిరిగాను. కాదనకుండా నాతో నడుస్తున్నడతను.

మా అడుగుల చప్పుడు వినబడుతోంది. ఒక కంకరరాయి చప్పుడు చేసుకుంటూ దొర్లింది. ఇక్కడి దాకా వచ్చాము, చెప్పనీ. “చెప్పండి” తన వైపు తిరిగాను.

“మనకు కావలసిన రెస్పాన్స్ రానప్పుడు అదే విషయం బరువులా మారడం ఎందుకు? భావం ముఖ్యమైనప్పుడు, ఇంకా చేసేదేం లేనప్పుడు దాని నిస్పృహగా తీసుకోకుండా ఒక భావనని ఆస్వాదించే మంచి అవకాశంగా ఎందుకు తీసుకోలేం?”

“……….”

“ఇందాక హింస అన్న మాట వాడావు. హింసంటే… అసలు హింసలా ఫీల్ అయితే అది ప్రేమ ఎలా అవుతుంది.”

“నేను చాలాకాలం అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాను. చెప్పాగా, ప్రేమ అనేంత పెద్ద భావన కాదేమో కాని అటువంటిదే ఏదో…”

“కాని ఇబ్బంది పడుతున్నావు కదూ…”

“చాలా…!” నిట్టూర్చాను. “చాలా కష్టం గా ఉంటుంది. కొన్నిసార్లు ఏడుపొస్తుంది… ఒక్కోసారి ఇతనికి నా మీద ఇంత కంట్రోల్ ఏంటి అని కోపం వస్తుంది. ఇంట్లో సమస్యల వల్ల మీ వైపు ఇంటరెస్టు పెరుగుతుందేమో అని నా భర్త మీద, పిల్లల మీద కోపం వస్తుంది. గిల్టీగా ఉంటుంది. కాని మీతో మాట్లాడినా కొంచెం సేపు కలిసినా సంతోషంగా అనిపిస్తుంది.”

“మనసులో ఉన్న ఖాళీని ఎక్కడో పూడ్చుకోవాలనీ, అందుకే మనుషులు ఇంకొకరి వైపు ఎట్రాక్ట్ అవుతారనీ ఒక థియరీ ఉంది. కొంత వరకు నిజమేనేమో… కాని పూర్తిగా అలా జరుగుతుందా?”

“అయినా ఒక మనిషి ఇంకో మనిషిని ఇష్టపడడానికి ఆ మనిషికి ఏదొక రకమైన కష్టముండి తీరాలా? అంటే కష్టాలు లేని మనిషికి ఇంకో మనిషి మీద ఇష్టం కలగకూడదన్న మాట,” ఆలోచిస్తూ అన్నాను.

“ఎక్జాట్లీ… ఇదే చెప్పేది.” గుడి దగ్గరికొచ్చేసాం. టైం చూసుకున్నా. “ఇంకో రౌండ్ నడుద్దామా?”

చిలిపిగా నవ్వాడు. “ఇంకో రౌండ్ మందేద్దమా అన్నట్టు…” కన్ను మలిపాడు.

నవ్వేసాను. కాదు, ఈ రోజేలాగైనా ఈ విషయం తేల్చెయ్యాలి. “సమాజంలో మనం ఇచ్చిన డెఫినిషన్ బట్టి ప్రేమను ఆ చట్రాలలో ఇరికించడానికి ప్రయత్నిస్తాము.”

“తెలిసిన విషయమేగా…” సన్నగా నవ్వాడు.

“సరే, మీ కథ చెప్పండి.” అర్థమైందనట్లు అన్నాను.

premakathaమా అడుగులు లయబద్ధంగా కదులుతున్నాయి. కాసేపు మౌనం…. “నాకప్పుడు ఒక ఇరవైఏళ్ళు అనుకుంటా. నాకన్నా పెద్దది. బంధుత్వంలో కూడా అసలు వరుస కలవదు. ఇంచుమించుగా ఒక పదీపదిహేనేళ్ళ తేడా ఉంది మామధ్య. చదువుకున్నన్ని రోజులు తనని కలుస్తూనే ఉండేవాడిని. చదువవగానే వెనక్కి ఊరెళ్ళిపోవాలి. హటాత్తుగా రేపటినుంచి తనని చూడను అనే నిజం భరించలేననిపించింది. తనను తీసుకుని ఎటైనా వెళ్లిపోవాలనిపించేది. తన భర్తతో, పిల్లలతో ఉన్నా కష్టమేసేది. నన్నే ఎక్కువ ప్రేమించాలని ఉండేది. నేను తనని ప్రేమించినంతగా నన్ను ప్రేమిస్తుందా అనే ప్రశ్నే ఎప్పుడూ. కొన్నిసార్లు ఆఫీసులో నుంచి ఉన్నట్టుండి తనని చూడాలనిపించి తన ఊరు వెళ్లిపోయేవాడిని. వెళ్ళాక తనని, తన కుటుంబాన్ని, తన బాధ్యతలని చూసాక అందులో నా స్థానం ఎంత అని తలుచుకుని కుమిలిపోయేవాడిని. తనకి నేనంటే ఇష్టం అని తెలుసు కానీ నాకే ఏదో పంతం. నాకు తన మీద ఉన్నంత ఇష్టం తనకి ఉందా? అని. ఒకలాంటి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మనుషులతో కలవడం తగ్గించేసా.” అతని చూపులెక్కడికో చూస్తున్నట్టుగా ఉన్నాయి. “కానీ ఒకరోజు ఉన్నట్టుండి ఈ బాధ నుంచే జ్ఞానోదయం లాంటిది కలిగింది. అసలు దేన్నైనా పొందితీరాలి అనుకునే కోరికేంటి? నేను తనను గురించి లోనైనా భావోద్వేగం కన్నా గొప్పదేముంది. తనని ఇబ్బంది పెట్టి పరీక్షిస్తే వచ్చే ఆనందంలో ఉండే పెట్టినెస్ అర్థమైంది. ఇంకో విషయం కూడా తెలిసింది. ఇది నేను దాటగలిగితే నేనన్నీ సాధించగలను. అన్నీ నావే కాని ఏదీ నా స్వంతం కాదు అనే భావన..!! చూసావా, నీతో చేరి నాలో కూడా తెలుగు ప్రవహిస్తోంది!” మనస్పూర్తిగా నవ్వాడు.

నేను కూడా నవ్వేసాను. మనసు కాస్త తేలికపడింది. “ఒక్కమాట చెప్పండి. నేనేమన్నానని మీరంతలేసి మాటలన్నారు? నేనేమి ఫేవర్ చేసినట్లు మాట్లాడాను. మీరలా అంటే కాస్త కష్టం వేసింది. అసలు మీ కథలో ఫేవర్ అన్న విషయమే లేదే, మరి ఈ విషయం గురించి అంత రియాక్ట్ అయ్యారేంటి?”

“తన తర్వాత ఇంకెవ్వరు పరిచయం కారా… ఆకర్షణలుండవా…” తేరిపార చూసాను. ఎందుకుండవు మంచి రూపం, డబ్బు, సంభాషణా చాతుర్యం…

“ఒకరు ఇష్టపడ్డారు ఆ విషయం ఒప్పుకుంటున్నారు అంటే, ఎంత ధైర్యం కావాలి. అదికూడా పెళ్ళయ్యి పిల్లలున్న ఆడవారికి… అదే ఒక గొప్ప విషయం అయినప్పుడు అది ఫేవర్ లా అనిపిస్తే ఏం చెయ్యగలం.” గొంతు తగ్గించాను.

“నువ్వక్కడితోనే ఆగితే అదే పెద్ద సాహసం. ఒక భావన మనని కుదిపేసినప్పుడు మనం దానిలో ప్రవహించి ఒడ్డున చేరకుండా ఒక గడ్డిపోచను పట్టుకుని నువ్వు నన్ను ఒప్పుకోకపోతే నువ్వు వృథా, నీ మీద ఆధారపడి నేనిన్ను ఉద్ధరించాను అన్నట్లు ప్రవర్తిస్తే…” నా తీవ్రమైన చూపులు చూసి ఆగాడు. “నిన్ననలేదు… కాని ఈ విధంగానే ఉంటాయి ఆడవారి డిమాండ్లు ప్రేమలో. పెళ్ళిలో ఆనందం లేదనడం, నీలాంటివాడే కావాలనడం, కొన్నిసార్లు వాళ్ళ భర్తల్నో, పరిస్థితులనో కారణాలుగా చెప్పడం… ఇంకొన్ని సార్లు ఏడుపులు… నాకు చెప్పాలనిపిస్తుంది, మీలో ఉన్న బలం మీకు అర్థం కావడం లేదని. ఇబ్బంది మీ సంబంధాలలో లేదు, మీలో ఉందని… ఇంకొకరి మీద ఆధారపడి ఉన్న ఎమోషన్ వల్ల మనకు సంతోషం కలుగుతుంటే… ఎప్పటికీ వాళ్ళను సంతోషపెట్టే బాధ్యత వాళ్ళ పార్ట్నర్లు తీసుకోవాలంటే ఎంత కష్టం?”

“నాకు చెప్పేది కూడా అదేనా?”

“అది నువ్వే తెల్చుకోవాలేమో. నీలో ఎనర్జీ ఉంది. కానీ ఈ కండిషనల్ సంతోషం ఏంటి? అది ఆలోచించాలేమో!”

“కాసేపు కూర్చుందామా…” కోనేటి దగ్గరకు వచ్చేసాం.

“ఎందుకు నన్ను తన్నే ప్రోగ్రామేదైనా ఉందా, ఏంటి? అసలే పిల్లలున్నవాణ్ణి.”

“కాసేపు అలా కుర్చోవచ్చుకదా… బావుంటుంది!”

“పద…” దారి తీసాము… పూర్తిగా చీకటి పడింది. అప్పుడప్పుడూ గంటలు… చల్లటి గాలి వీస్తోంది… అసలిక్కడికి ఎందుకొచ్చినట్లు… ఈ వయసులో రొమాన్స్ కోసమా… తనేమన్నా నా గురించి కాస్త పొగిడి ప్రేమ ప్రతిపాదనలు చేస్తే విందామనా… నిజంగా వినేదాన్నేనా… నా మోనోటొనీని బ్రేక్ చేసే ప్రయత్నాలా… ఒకవేళ తనన్నట్టు నాలోనే ఒక చిన్న ఆకర్షణని తట్టుకోలేని గుణం ఉంటే… మొదట్లో తనతో పరిచయం గుర్తొచ్చింది… ఎవరో నీటిలోకి మళ్లీ ఏదో విసిరారు… చీకటి మెరుపుల్లో నీళ్ళు తళతళలాడాయి… మొనోటొనీ… మనని మనం నమ్మలేక పోవడం… ఎక్కడో లంకె అందుతోంది… చిన్నగా కూనిరాగం తీస్తున్నాడతను… ఏం పాట? హమే తుమ్సే ప్యార్ కిత్ నా… నీళ్ళలో ఏదో బుడుంగుమని మునిగింది. క్యా క్యా జతాన్ కర్తే హై… తుమ్హే క్యా బతా… “దొరికింది” లేచి నుంచున్నా…

“ఏంటి?”

“వెళ్దాం పదండి,” నా గొంతులో ఉన్న మార్పును గమనించాడు

వర్షం పడేలా ఉంది. పార్కింగ్ ప్లేస్ కి వచ్చాము. “నిన్ను దింపనా… ఎలా వచ్చావు?”

“నా బండి తెచ్చాను,”అబద్ధం చెప్పాను.

కారు ఎక్కి స్టార్ట్ చేసి, ఫస్ట్ గేర్ వేసి… చేయఎత్తాడు… ఇలాంటి నాటకీయ ముగింపు కోసమే ఎదురు చూసింది…

“ఆగండి. ఒక్క నిమిషం. మీరిందాక చెప్పింది బాగానే అర్థమయ్యింది. మీరన్నది నిజమే… ఇదొక బోలుతనంలో పలాయవాదంలానో, టైం పాస్ లానో అయిపోయింది, ఆకర్షణ కూడా! వల్నరబిలిటి వల్లో మరెంటో, నిజంగానే ఆడవాళ్ళం – మేమే ఎక్కువగా తేలిపోతున్నాం, ఈ ఎమోషనల్ బిజినెస్ లో… మీరన్నది బాగా గుర్తుంచుకుంటాను. థాంక్స్! నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది.” మనోహరంగా నవ్వాడు.

ఆ నవ్వును పొదువుకుంటూ అన్నాను. “కానీ, ఒక విషయముంది మీరు కూడా చూడలేకపోయింది. ఈ రోజు వచ్చే ముందు మీకు ఇలాంటి సంభాషణ మన మధ్య జరగబోతోందని తెలుసు. తెలుసు కదూ? అన్నిటికీ ప్రిపేరయ్యే వచ్చారు… ఇప్పుడు మీరు నాతో మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు ఎంతమంది ఆడవారితో చెప్పారు? ఇలాంటి ఎమోషన్స్ ను కంట్రోల్లో పెట్టుకోలేని నన్ను దారిలో పెట్టారని గర్వపడే మీలో… వాయిడ్ తెలుస్తోందా… మధ్యవయస్కులు, మంచి మనిషి, మోరల్లీ ట్రైన్డ్ – ది లిబెరేటేడ్ యు… అయిన మీకు? భావావేశాలను ప్రేరేపించి ఈగోను తృప్తిపరుచుకుని? బహుశా మీరు కూడా ఆలోచించాలేమో…” అతని మొహంలో రంగులు మారుతుంటే చూడలేకపోయాను. “సరే మరి. థాంక్ యు అండ్ బై” గబాగబా బస్టాప్ వైపు నడిచాను. వెనక్కి తిరిగి చూడడం కూడా అనవసరమనిపించింది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, మే and tagged , , , , .

14 Comments

 1. Liked the theme and can relate to my observations and (mis)conceptions about what is going on around. An egotist can never fall in love. ఎక్కడ పల్చన అయిపోతామో అనే ఓ థర్మామీటర్ పట్టుకుని జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పటి తరానికి సంబధాలని కూర్చుకోవటం లో అదే సమస్య. ఉమ్మడి కుటుంబాలు పోవడం మూలంగా పంచుకోవడం మర్చేపోయాం. (నేనేమీ ఉమ్మడి కుటుంబాల కి అనుకూలమేమీ కాదు). ఈ పోటీ ప్రపంచంలో నాదే పైచెయ్యి అవ్వాలనే తపన ఒకటి నర నరానా ఎక్కించుకున్న professionals మనుషులమని మర్చేపోతున్నాం. ఇవ్వన్నీ కలసి హాయిగా మనస్ఫూర్తిగా మనని మనం ఓ గొప్ప అనుభవం (మానసికంగా, శారీరకంగా) కోసం కొంచెసేపు, కొంచెం కూడా కోల్పోలేక పోతున్నాం. అదే ప్రేమరాహిత్యం. చిట్ట చివరికి మనకి మనమే పూర్తిగా మిగిలిపోతాం… ఏం లాభం? వీళ్ళు నిజమైన స్నేహితుల్లేకూండా ఉంటారు… సమస్య లేదు. కానీ, మనుషులు కదా, పాపం కాస్త ముద్దూ ముచ్చటా కూడా కావాలి. ఆ ఆకర్షణ తట్టుకోలేక ప్రేమ కోసం ఇంత రాద్ధాంతం, ఓ టెక్నికల్ పేపర్ రాసినట్టుగా లాజికల్ గా ప్రేమించాలంటే… గుడ్ లక్ అంటం తప్పా ఏం చెయ్యలేం.

  రాసిన పద్ధతి మాత్రం ఇంకా బాగుండొచ్చు. పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద మాటలు, నిజ జీవితంలో మనం వాడని మాటలు… ఓవర్ డ్రమటిక్ గా అనిపించాయి.

  అపర్ణ కి లోతైన ఆలోచనలూ, నిక్కచ్చి అభిప్రాయాలూ ఉన్నాయని తెలిసిందే.ప్రపంచం పట్ల కంప్లైంట్స్ ఉండొచ్చు గానీ సినికల్ కాకుండా చూసుకోవడం మంచిది. (కథలు రాయమంటే కష్టం కానీ ఇలా ఉచిత సలహాలు ఇవ్వటం చాలా సులభం సుమీ)

  -Akkiraju

 2. చాలా బాగుంది అనేదానికన్నా .. కొత్తగా ఉంది అపర్ణా.. ముఖ్యంగా, విసుగ్గా అనిపించినా, సరైన క్లారిటీ లేని, తనకి ఏం కావాలో తెలీని అమ్మాయి పాత్ర చాలా గా సృష్టించావు. చాలా చోట్ల ఎవరు ఏది మాట్లాడుతున్నారో ( అంటే హీరో, హీరోయిన్ ) తెలీని కన్ఫ్యూజన్ అనిపించింది. మొత్తానికి భలే కొత్తగా ఉంది.. కంగ్రాట్స్

 3. “వల్నరబిలిటి వల్లో మరెంటో, నిజంగానే ఆడవాళ్ళం – మేమే ఎక్కువగా తేలిపోతున్నాం, ఈ ఎమోషనల్ బిజినెస్ లో…” ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది అపర్ణ గారూ. ఆడవాళ్ళు ఎంత ఎమోషనల్ స్టెబిలిటీ తో ఉండాలో అర్థమవట్లా? పాపం ఆ అమ్మాయి. బాగుంది. అభినందనలు.

 4. బావుంది అనే మాట చప్పగా వుంది.
  అయినా అవతల వాళ్ళముందు తేలిపోతున్నామని తెలిసి మనసు విప్పి చెప్పేవాళ్ళు, ఎంతో మంది వున్నారు. అలాగే చివరలో తను ఏదో పెద్దరికంతో ,ఇలాంటి వాటినీ గురుంచి దాటిపోయి ఒక తామరాకు మీద నీటిబొట్టు స్తితిని చేరానని చెప్పకనే చెప్పిన అతని అహంభావాన్ని గుర్తించినట్లు రాయడం నాకు బాగా నచ్చిన విషయం

 5. రచయిత్రి పేరు చూడగానే చదవకుండ ఉండలేకపోయాను! కథల గురించి క్షుణ్ణమైన విశ్లేషణలు రాసే వక్తి కథ ఎలా రాసుంటుంది? కథ ఎలా ఉంటుంది? కథ చెప్పే తీరులో ఎక్కడైనా దొరికిపోతుందా? పట్టుకుందాం అనే ఉద్దేశంతోనే చదవడం మొదలుపెట్టాను!

  సైకాలజిస్ట్ కోణంలో, analysis లా రాశారు కథని! బాగుంది. కథ చెప్పిన తీరు, ముగించిన తీరు — చాలా మెఛ్యూరిటీ కనిపిస్తుంది.

  ఈ కథలోని మగపాత్ర పోలిన ఒక వ్యక్తిని నేనెరుగుదును. “నన్ను ఆడవాళ్ళు ప్రేమించాలి, ఆరాధించాలి; కానీ వాళ్ళు బయటపడి అడిగితే మాత్రం హితోపదేశం చెయ్యడం! అలా చేసి వాళ్ళ మనసుల్లో ఇంకా గొప్ప స్థానం పొందాలి” ఆ మనస్తత్వాన్ని బాగ చిత్రించారు. Hats off!

  చివరిగా — వాక్యాల నిర్మాణం చాలా చోట్ల కొత్తగా అనిపించింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.