cover

వయసుడగని వాంఛ

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “బాబిట్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

వయసుడగని వాంఛ

గై డి మొపాసా

ఆ వృద్ధవికలాంగ శరణాలయం తనిఖీకి వెళ్లడం మీద నాకేమంత ఆసక్తి లేకపోయినా, మాటకారీ బహులెక్కల మనిషీ అయిన సూపరింటెండెంట్ గారికి తోడుగా వెళ్లవలసివచ్చింది. ఆ శరణాలయ స్థాపకురాలి మనువడు మాకు సహకరిస్తూ నిశితమైన మా తనిఖీకి ఎంతో సంతోషించాడు. నేను అతని నాయనమ్మగారి లోకోపకార ప్రవృత్తికి ముగ్ధుడ్నైనట్టు నటించడంతో స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు తన స్వంత అటవీ ప్రాంతంలో వేటకు నాకు అనుమతిచ్చాడు. ఇక హద్దుపద్దులేని మా సూపరింటెండెంట్ గారి మాటలకచేరికి తోడు తబలాగా మధ్య మధ్యలో నా పెదాలు కొన్ని రొడ్డకొట్టుడు పదాల్ని ఉచ్ఛరిస్తున్నాయి: ‘ఓహో! నిజంగా! బహు చిత్రం సుమండీ! అదసలు నమ్మశక్యం కాదనుకునేవాడ్నంటే నమ్మండి!’

నేనసలు ఏ మాటలకు అలా ప్రతిస్పందిస్తున్నానో నాకే తెలియదు. ఎందుకంటే మా వసపిట్ట తెంపులేని వాగుడికి నా ఆలోచనలు అణిగిపోయాయి. నేను ఉబుసుపోక ఒక్కడ్నే వచ్చి ఉన్నట్టయితే సందేహం లేకుండా ఇక్కడ పరిసరాలు వ్యక్తుల్ని శ్రద్ధగా పట్టించుకునేవాడ్ని. ఆ మాటకొస్తే కచ్చితంగా సూపరింటెండెంట్ గార్ని అడిగివుండేవాడ్ని కూడా: ‘ఎవరండీ ఈ బాబిట్ చాలా మంది ఆశ్రమవాసుల నోళ్లలో ఆమె పేరే నానుతుంది.’

కనీస పక్షం ఓ డజనుమంది ఆడ మగ ఆమె గురించి మాట్లాడి ఉంటారు. నిష్టూరమాడి ఉంటారు కొందరు పొగిడారు కూడా. ముఖ్యంగా ఆడవాళ్లయితే సూపరింటెండెంట్ గార్ని చూడ్డంతోనే ముక్కులు చీదుకుంటూ ఒకటే ఫిర్యాదులు: ‘అయ్యా! అది… ఆ బాబిట్ మళ్లీ…’

‘నేను చూస్తా… నేను చూస్తానన్నానుగా…’

ఎంతో మృదువుగా ఉండే సూపరింటెండెంట్ గారి గొంతు ఆ విషయంలో మాత్రం చాలా కరుకుగా మారిపోతుంది. ఇక అడపాదడపా ఎదురౌతున్న ఒక్కో వృద్ధున్ని స్నేహపూర్వకంగా పలకరిస్తూ ‘ఏమబ్బా! ఇక్కడ నీకు బాగానే ఉంది కదా…’ అంటున్నారాయన.

చాలా మంది కృతజ్ఞతలు ఒలికిపోయే జవాబులిస్తున్నారు. వారి మాటల్లో తరచూ బాబిట్ నామసంకీర్తన పరిపాటి అయింది. అలాంటప్పుడు మాత్రం సూపరింటెండెంట్ గారు మబ్బుల్లో తేలిపోతున్నట్లు చేతులు కట్టుకొని ఆకాశం వంక చూస్తూ తలపంకిస్తూ చెప్పారు: ‘ఆహా! బాబిట్‌ ఎంత అపురూపమైన స్త్రీ. చాలా అద్భుతం…’

అటువంటి సందర్భంలో సదరు జీవి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కచ్చితంగా కలిగే తీరుతుంది కదా. అయితే అప్పటి పరిస్థితుల్లో ఆమె ఎటువంటిదో బాగానే ఊహించాను గనుక తన గురించి అంతకంటే ఎక్కువ తెలుసుకోవడానికి మొగ్గు చూపించలేదు. ఆమె – ఈ మారుమూల నిర్లిప్త నీరవ సీమల్లో విరిసిన కెందామరో ఈ దుస్సహ దుర్భర దారుల ముసిరిన ప్రేత కాంతుల మీదకు ప్రసరించిన సూర్యకిరణమో అన్పించింది. తన గురించి తెలుసుకోవాలన్న కోర్కె ఏమీ లేకుండానే చాలా స్పష్టంగా నాలో ఆమెను చిత్రించుకున్నాను. ఆమె ప్రస్తావన వచ్చినపుడు ఆ వృద్ధుల ముఖాల్ని వెలిగించిన ప్రమోదాల సాక్షిగా తాను నాకు చాలా ప్రియమైపోయింది. ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడిన వృద్ధురాళ్ల మీద చెప్పలేనంత కోపమొచ్చింది. మా సూపరింటెండెంట్ గారు కూడా ఆమెను తలచుకొని మైమరిచిపోవడం మాత్రం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి తన గురించి ఆయన్ని అడగాలని గట్టిగా అన్పించిందే తప్ప నా ఆసక్తికి మరే కారణంలేదు.

నేర్పుగా ఆలోచించటానికి బదులు నిరంతరం స్వప్నించడానికే ఇష్టపడే నాలో ఏ విధమైన ఆలోచనలు ఆటుపోట్లు ఏర్పడకుండా లేదా తిష్టవేయకుండా పై ఊహలన్నీ ఏదో తొడతొక్కిడి గందరగోళంలో నా మదిగదిలోంచి దాటిపోయాయంతే. ఆమె హఠాత్ దర్శనంతో చరించినట్టు మేల్కొని నాలోపల గొప్ప మధురోహల కాల్పానికతతో నే గీసుకున్న వర్ణచిత్రానికి వాస్తవికంగా ఆమె రూపానికి బొత్తిగా పొంతన కుదరక గిజగిజలాడిపోయాను కాబట్టి బాబిట్ సంగతి జ్ఞాపకముంది గానీ, సాధారణంగా మరో విషయమైతే గుర్తు కూడా ఉంచుకోను.

అక్కడ మేమొక సావిడి దాటి ఒక చీకటి బాటలోకి నడిచినప్పుడే తటాలున ఒక తలుపు తెరుచుకొని అనూహ్యంగా ఒక ఆకారం ప్రత్యక్షమయింది. అదొక ఆడమనిషని అస్పష్టంగా అర్థమైంది మాకు. అప్పుడే సూపరింటెండెంట్ గారు కోపంగా పిలిచారు: ‘బాబిట్! బాబిట్!!’

అప్రయత్నంగా పరుగులాంటి నడకతో అటువైపు వెళ్ళారాయన. ఆయన్ని మేము కూడా అనుసరించాము. ఆ ఆకారం అదృశ్యమైన ఇంటి తలుపు తోసి లోపల మెట్టెక్కుతూ మళ్లీ పిలిచారామెని. విరగబడిన నవ్వులే ఆయనకి సమాధానం. మెట్లు పక్కన నగిషీలు చెక్కిన స్థంభం మీదుగా చూశాను ఓ ఆడమనిషి సూటిగా చూస్తుంది మావంక. ఆమె టోపీ కిందనుంచి తొంగి చూస్తూ జీరాడుతున్న నెరిసిన జుట్టు ముఖాన దాగని మడతలు ఆమెకు వయసు మళ్ళిందని చెప్పకనే చెబుతున్నాయి. కాని ఆమె కళ్లు… అసలా కళ్లు చూస్తే మాత్రం ఆలోచనలు అక్కడికక్కడే ఆగిపోతున్నాయి. తన వంక చూసిన వాడెవడైనా ఆ అద్భుతమైన నవయవ్వన మిసిమితో మిలమిలాడే ఆ కళ్లు చూస్తుండిపోవలసిందంతే. ఎంతో గాఢమైన నిగూఢమైన విశాలమైన కళ్ళు – వసివాడని పసి నీలాలు.

‘నువ్వు మళ్లీ ఆ లా-ఫ్రైజ్ గాడితో కులుకుతున్నావటగా’ సూపరింటెండెంట్ గారు అరిచారు పెద్దగా. ఆమె నోటితో బదులివ్వలేదు పగలబడి నవ్వుతూ తలూపింది. అంతకు ముందులానే పారిపోతూ సూపరింటెండెంట్ గారి వంక ఒక చూపు విసిరింది. ఆ చూపుని మాటల్లోకి తర్జుమా చేస్తే ‘నువ్వు నాకు వెంట్రుక సమానం సుమా!’

ఆ అవమానకర వాక్యం ఆమె ముఖాన చదివిన నేను ఆ క్షణమే తన చూపులో వచ్చిన మార్పుని కూడా గమనించాను. ఆ కొద్దిపాటి వ్యవధిలోనే అందమైన ఆ పసి కళ్లు గుర్రుమనే కోతి కళ్లలా చింతనిప్పులయ్యాయి. ఇక అప్పుడు మాత్రం ఆయన్నేమి ప్రశ్నించకూడదన్న నిర్ణయాన్ని పక్కన పెట్టకుండా ఉండలేకపోయాను: ‘తనేనా బాబిట్ అంటే?’

ఆ ముసలిదాని చూపుల లెక్కలేనితనం నాకర్థమయిందన్న క్రోధంతో ఆయన ముఖం కందగడ్డయింది. ఆ ఉక్రోషంతోనే బదులిచ్చాడు – అవునంటూ

‘చాలా అమూల్యమైన అపురూపమైన ఆడది ఆమేనా?’

నా ప్రశ్నలోని వెటకారంతో ఆయన ముఖం మరింత జేవురించింది. నా ప్రశ్నల్నుంచి తప్పించుకోవడానికి వడివడిగా అడుగులేస్తూ ‘అవును అదే…’ అన్నాడు. నాలో ఉత్సుకత కట్టలుతెంచుకోవడంతో మాకు తోడుగా వస్తున్న ఆశ్రమ నిర్వాహకుడి విధేయతని నాకు సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశాను నా ప్రశ్నలతో: ‘ఫ్రైజ్‌ని చూడాలొకసారి. ఇంతకీ ఎవరతను?’

అతను గిర్రున వెనక్కి తిరిగి ‘అబ్బే! వాడిని చూడటం శుద్ధ దండగ. ఏముంది వాడ్ని చూడ్డానికి’ అన్నాడు. రెండేసి మెట్లు చొప్పున దిగిపోయాడతను. అతను సాధారణంగా చాలా నమ్రత ఉన్నవాడు. ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా వివరించే మనిషి. కాని అప్పుడు మాత్రం చాలా ఆదుర్దా పడ్డాడు. ఇక మా తనిఖీ కార్యక్రమం అంతటితో ఆగిపోయింది.

బాబిట్ గురించి మరింకేమి తెలుసుకోకుండానే ఆ మర్నాడే నేనా పల్లె విడిచి వెళ్లిపోవలసి వచ్చింది. మళ్లీ వేట సీజను మొదలవడంతోనే నాలుగు నెలల తర్వాత తిరిగి ప్రయాణమయ్యాను ఆ ప్రాంతానికి. నేనామెను కొంచెమైనా మర్చిపోలేదు. నేనే కాదు ఎవరైనా మర్చిపోవడానికి సాధ్యమయ్యే కళ్ళేనా అవి – కాబట్టే స్టేషన్ నుంచి మాకు ఆతిధ్యం ఇచ్చే నా మిత్రుడి ఊరి వరకు జరిగిన మూడుగంటల ప్రయాణంలో నా సహ ప్రయాణీకుడు ఆమె గురించే కబుర్లాడడంతో చాలా సంబరపడ్డాను. నా సహగామి ఓ కుర్ర మేజిస్ర్టేట్. అతను అంతకుముందే పరిచయం నాకు. తన హాస్య చతురత, అంశాలను నిశితంగా పరిశీలించే తీరు, నైతిక సంబంధిత సమస్యల్ని తీర్చడంలో తనంతట తానుగా అలవరుచుకున్న చాతుర్యం, అన్నింటినీ మించి అతని వృత్తిపరమైన కాఠిన్యానికి ప్రవృత్తిరీత్యా కలిగి ఉండే ఉపేక్షకి మధ్య ఉండే వైరుధ్యం నన్ను బాగా ఆకర్షించాయి. అయితే ఆ కొరకరాని కొయ్య బాబిట్ చరిత్ర పూసగుచ్చినట్టు చెప్పిన ఆ రోజు కంటే ఆకర్షణీయంగా అతను అంతకుముందెన్నడూ కనిపించలేదు. క్షుణ్ణంగా వివరాలు తెలుసుకోవడంతో పాటు తన వివేచనా శక్తులన్నింటినీ క్రోడీకరించి ఒక నిఖార్సయిన న్యాయమూర్తిలాగా ఆమె గురించి అర్థం చేసుకున్నాడతను. నాకు మల్లే తను కూడా వృద్ధ శరణాలయానికి వెళ్లి ఆమెను చూసిన తరువాత కుతూహలం పెంచుకుని ఆమె గురించి తెలుసుకున్నాడు. తాను అర్థంచేసుకున్నదే నాకు చెప్పాడు:

maupassantఆమెకు పట్టుమని పదేళ్లుకూడా లేనప్పుడే ఒక రక్త సంబంధీకుడి చేత అత్యాచారానికి గురయింది. విశృంఖలత, పచ్చి వ్యభిచార నేరాల కింద పదమూడేళ్లకే సంస్కరణల జైలుకు తరలించబడింది. ఇరవై ఏళ్ల నుంచి నలభై సంవత్సరాల వరకూ పనిమనిషిగా చేస్తూ చాలా ఇళ్లు మారింది. దాదాపు పనిచేసిన ప్రతి ఇంటి యజమానికి ఉంపుడుగత్తెగానే బతికింది. ఏ హోదా, డబ్బు సంపాదించుకోలేదు గానీ, ఎన్నో కాపురాలు నిలువునా కూల్చిన ఘనకీర్తి మాత్రం దక్కించుకుంది. ఒక దుకాణందారుడు ఆమె పాలిట పడి వ్యసనపరుడై సర్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో గౌరవప్రదమైన యువకుడు ఆమె మైకంలో పడి దొంగగా తంపులమారిగా తయారై, చివరికి దగుల్బాజీగా ఎందుకూ కొరకాకుండా పోయాడు. రెండుసార్లు ఆమె పెళ్లాడింది రెండు సార్లూ విధవయింది కూడా. మరో పదేళ్లు అంటే తనకి ఏభై ఏళ్లు వచ్చేవరకూ ఆ జిల్లా మొత్తంలో పెద్ద వేశ్యగా ఆమె పేరు మోసింది. సెలవు రోజుల్లో ఖుషీగా ఆమెతో గడపడానికి చుట్టుపక్కల అయిదు గ్రామాల మగాళ్లు తరలివస్తుండేవారు.

‘నేననుకోవడం ఏమిటంటే, ఆమె చాలా అందగత్తె!’

‘ఎంత మాత్రం కాదు. ఎప్పుడూ కాదు. పొట్టిగా బక్కపల్చగా ఉంటుంది. నిమ్నోన్నతాలు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఎతైన గుండెలు ఇసుకతిన్నెల్లాంటి పిరుదులు… ఏమీ లేవు. నాకు చెప్పినంత వరకూ ఎవరూ ఆమె చక్కనిదని అన్నవారు లేరు. కనీసం ఆమె యవ్వనంలో ఉన్నప్పుడైనా సరే.’

‘మరయితే దీన్నెలా వివరిస్తారు మీరు?’

‘ఎలాగంటారా!’ చెప్పాడు కుర్ర మేజిస్ర్టేట్ – ‘ఆ కళ్ల మాటేమిటి? మీరు వాటివంక చూడకుండా ఉండగలిగేవారా?’

‘అవునవును మీరన్నది నిజం’ బదులిచ్చాను – ‘కచ్చితంగా ఆ కళ్లు ఇంకా ఎన్నింటికో అర్థాలు చెబుతాయి. అవి ముక్కుపచ్చలారని ఒక పసిదాని అమాయకమైన కళ్లు’

‘ఓహో!’ అలవిమాలిన ఆసక్తితో అన్నాడతను ‘క్లియోపాత్ర, డయానా, నినన్ డి ల-ఎన్‌క్లోజ్… ఇంకా అటువంటి ప్రణయసామ్రాజ్ఞులకి వయసు మీరుతున్నప్పుడు కూడా బహుశా అటువంటి కళ్లవల్లే ప్రేమించబడ్డారేమో. అసలు అటువంటి కళ్లున్న ఏ స్త్రీ అయినా ముసలిదయ్యే ప్రసక్తే లేదేమో. ఒకవేళ బాబిట్ వందేళ్లు బ్రతికినా అంతకుముందు ఎలా మోహపెట్టిందో ఎప్పటికీ అలానే ప్రలోభ పెడ్తుంది ఆ చిత్కళల కళ్లతో’

‘అవును అచ్చం వెనకటి మల్లే ప్రేమించబడుతుంది. అయ్యో! ఎవరిచేత బాబూ…’

‘వృద్ధాశ్రమంలో ఉన్న ముసలోళ్ళందరి చేతనూ. ఎవరయితే ఒక తమకపు స్పర్శకై తపిస్తూ తమ గుండె గదుల్లో వాంఛని పదిలంగా దాచుకుంటారో, ఆ మదిగది మూలల్లో కాంక్షాజ్వలనాన్ని అనవరతం ఆశిస్తారో, ఎవరికైతే కోర్కెల నిప్పురవ్వ కనీసం ఒక్కటయినా సజీవంగా మిగిలిపోతుందో… వారందరి చేతా ఆమె ప్రేమించబడుతూనే ఉంటుంది.’

‘… అని మీరు నమ్ముతున్నారా?’

‘నిస్సందేహంగా. ఇక సూపరింటెండెంట్ గారయితే అక్కడ అందరికంటే ఎక్కువగా…’

‘అసంభవం’

‘నా మీద ఒట్టేసి మరీ చెబుతున్నాను’

‘సరే. అది నిజమే అయిండొచ్చు. నాకు గుర్తుకొస్తున్నాయి దాని సాధ్యాసాధ్యాలు…’

ఆనాడు సూపరింటెండెంట్ గారి వంక ఆమె చూసిన చూపు, ఎంతో చొరవ ఉన్నవాడి వైపు మాత్రమే విసిరే ఆ కోర చూపు నాకు గుర్తుకొచ్చింది చప్పున. మళ్లీ దాన్ని గురించే ఆలోచించాను. ఆమెతో సూపరింటెండెంట్ గారి చెలిమి నిజమేననిపించింది.

‘ఫ్రైజ్‌ని ఆమె ప్రేమించిందా?’

‘అవును ఆమె ఎంచుకున్న ప్రియుడతను.’

మేమిద్దరం మా అతిథేయుడి ఇంటికి చేరే సరికి ఆ పరిసరాలో ఏదో కలకలం. ప్రతి ఒక్కరిలో ఏదో ఆదుర్దా కనిపించడంతో మేము గాబరాపడ్డాం. వృద్ధాశ్రమంలో ఏదో ఘాతుకం జరిగిపోయిందట. అక్కడ పోలీసులు ఉండడం, మా అతిథేయ మిత్రుడు కూడా వాళ్లతోనే మాట్లాడుతూ ఉండడంవల్ల మేము కూడా అతనికి తోడయ్యాం. సూపరింటెండెంట్ గారిని ఫ్రైజ్ దారుణంగా హత్య చేశాడట. వారు చెప్పిన వివరాలకి వెన్నులో చలి పుట్టింది. గతంలో కసాయివాడిగా పనిచేసిన ఫ్రైజ్ తలుపుచాటున నక్కి సూపరింటెండెంట్ గారు రావడంతోనే మీదకి లంఘించి, నేలమీద పొర్లించి, గొంతుమీద భీకరంగా కొరికి మెడను బీభత్సంగా విరిచేశాడట. రక్తం పిచికారిలా హంతకుడి మొఖాన చిమ్మిందట.

ఫ్రైజ్ వంక చూశాను. దుబ్బు ముఖాన్ని అస్తవ్యస్తంగా కడగడంవల్ల అక్కడక్కడ నెత్తుటి మరకలున్నాయి. చిన్న నుదురు పెద్ద దవడలు తలకి చెరోపక్క నిక్కిన చెవులు ఏదో క్రూర జంతువు కండలాంటి చప్పిడి ముక్కు.

వీటన్నింటినీ మించి నేను బాబిట్‌ని చూశాను ఆ పక్కనే. నేను చూసినప్పుడు ఆమె పెదాలపై మందహాసం. అప్పుడామె కళ్లు ఎంత మాత్రం కోతి కళ్లను తలపించడంలేదు. చాలా బేలగా నిర్మలంగా ఉన్నాయి వాటి సహజ పసి కాంతిని ప్రతిఫలిస్తూ –

‘ఇది విన్నారా?’ – మా మిత్రుడు మంద్ర స్వరంతో చెప్పాడు ‘పాపం ఆ ఆడది వార్ధక్యంలో వచ్చే బుద్ధి మాంద్యతకి గురయింది. అందుకే అలా పిచ్చి చూపులు చూస్తుంది.’

‘మీకలా అన్పిస్తుందా ఏమిటి?’ అంటూ కుర్ర మేజిస్ర్టేట్ కొనసాగించాడు – ‘తనకి ఇంకా అరవై ఏళ్లు కూడా నిండలేదు. ముసల్దానికి వచ్చే మానసిక దౌర్బల్యం తనకి సోకిందని నేననుకోను. జరిగిన నేరం గురించి ఆమెకి స్పష్టమైన అవగాహన ఉందనిపిస్తుంది.’

‘అయితే ఎందుకామె చిర్నవ్వు చిందిస్తోంది?’

‘జరిగిందానికి తనెంతో సంతోషపడ్తుండొచ్చు’

‘అబ్బా! అలా కాకపోవచ్చు. మీరు మరీ గూఢార్థాలు వెదుకుతారు.’

హఠాత్తుగా కుర్ర మేజిస్ర్టేట్ బాబిట్ వంక తిరిగి ఆమెనే తీక్షణంగా పరిశీలిస్తూ

తననుద్దేశించి అన్నారు: ‘నేననుకోవడం నీకంతా తెలుసు. ఎందుకీ నేరం జరిగింది?’

ఆమె ముఖంలో చిర్నవ్వు మాయమయింది. ఆమె అందమైన కళ్లలో పాలుగారే పసితనం కవ్వించే యవ్వనం కూడా మాయమయ్యాయి. చింతనిప్పుల కోతి కళ్లలా మారాయి. ఆమె సమాధానంగా తన లో-లంగా పైకెత్తి తన మానాన్ని చూపించింది.

ఓహ్! మా మేజిస్ర్టేట్ చెప్పింది అక్షరాలా నిజం. ఆ ముసల్దాని ఒంట్లో ప్రతి అంగమూ క్లియోపాత్ర, డయానాలను గుర్తుకుతెచ్చేదే. ఆమె కళ్లను మించిన యవ్వనం తొణికసలాడుతుందా శరీరంలోని అంగాంగంలో. ఆమె చర్యకు మేమంతా ఖిన్నులమయ్యాం.

‘పంది నాయాళ్లరా!’ ఫ్రైజ్ మా వంక చూసి రంకెలేస్తున్నాడు ‘మీకు కూడా అది కావల్సి వచ్చిందంట్రా…’

అప్పుడు చూశాను కుర్ర మేజిస్ర్టేట్ పాలిపోయి చిన్నబోయిన ముఖాన్ని. ఏదో చీకటి నేరం చేస్తూ పట్టుబడిన వాడిలా అతని చేతులు పెదాలు వణికిపోతున్నాయి.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, మే and tagged , , , , , , .

4 Comments

 1. గీ దె ముపాసా అంటే నాకెందుకో మొహమ్మీద గుద్దినట్టుందండీ.. చిన్నప్పటి నుండీ గైడి మపాసా అనే చదువుకున్నాను. పాత విపుల అనువాద మపాసా కథలలో గైడి మపాసా అనే ఉంటుంది. ఈ మధ్య పీకాక్ వారి బుక్కు మీద గీ దె మపాసా (మహీధర అనువాదం) అని చదివి బిత్తరపోయాను. ఇటీవల మరొక కధకుడి అనువాదాలు చదివి కళ్ళు బైర్లు కమ్మాయి. సరే మెహర్ అన్నట్లు వేయి అనువాదాలు వికశించనీ అని సర్దుకోవాలి… అయినా పేరులో ఏముందిలేండి మన పతంజలి గారిలా “శబాసో మపాసా” అనుకుని ఆయన కధలని మన తెలుగులో రకరకాలుగా చదివి ఆనందిస్తే చాలు…

 2. ఇంకెందుకో స్టార్ట్ అయిన discussion, కట్టలు తెంచుకొని unintentioned మార్గంలో పోతుందని నాకు అనిపిస్తోంది. ఆయనకు మీ అనువాదం నచ్చలేదు, ఓకె. కాని పేరు కూడా సరిగ్గ పలకడం రానివాడు అనువదిస్తున్నాడన్న వ్యాఖ్య సబబు కాదు. అలాగే, మీరు ఈ చర్చలోకి patriotism, self-esteem ల ప్రస్తావన తేవడం కూడ కొంచెం exaggerate చేసినట్టు తోచుతుంది నాకు.

  మెహెర్ గారు అన్నట్టు, ప్రతి అనువాదం కేవలం ఒక interpretation మాత్రమె. ఆ మాటకొస్తె ఒక కథను చదవడానికీ, అర్థంచేసుకోడానికీ, అనువదించడానికి సరయిన తీరు యెదో నిర్దేశించె హక్కు రచయితకు కూడ ఉండదు. ఇక రచయితల పేర్ల విశయానికొస్తే , ప్రతి గొప్ప కళాకారుడికున్న aura కి ఆ పేరు తార్కాణంగ నిలుస్తుంది. ఎలా transcribe చేసినా, Dostoevsky అని తెలిస్తే చాలు.

  గోర్తి గారి comment raises one interesting issue. ఇంగ్లీషులో చదివేవాడు original translation చదువుతాడు. మరి ఇంగ్లీషు రాని వాడి కొసం చేసె అనువాదంలొ, ఆ settings అంతగా అబ్బవు. మరి అలాంటప్పుడు కథను ప్రేరణగా తీసుకుని, మన environmentకి అనుగుణంగా recreate చేయడం మంచిది కాదా? ( విశాల్ భరద్వాజ్ షేక్స్పియర్ నాటకాలు, మణి రత్నం రామయణ, మహాభారత adaptations లాగ ).

  దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

 3. కినిగె వెబ్ పత్రికలో నెల నెలా మొపసా కథల నా అనువాదాలు పోస్ట్ అవుతున్నాయి. రచయిత పేరు ‘గి దె ముపాస’ అని పలకాలి అని గొర్తి వారు నాకు మెయిల్ పెట్టారు.
  “మీ అనువాదం అస్సలు నచ్చలేదు. రచయిత పేరే తప్పు. గై డి మొపాసా కాదు. గి దె ముపాస. పూర్వం మనకి ఫ్రెంచ్ పేర్లు ఎలా పలకాలో తెలియకపోవచ్చు. ఇంటర్నెట్లో పేర్లు ఎలా పలకాలో గూగిలిస్తే తెలుస్తాయి” అని వారు హితవు చెప్పారు.
  దానికి నా బదులు ఇది:
  “Pronunciations విషయంలో నేను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ఉంటాను. దానికి కారణం ఏమిటంటే, వాళ్లు ఎలా ఉచ్ఛరిస్తారో నానాతంటాలు పడి మనం ఆ విధంగానే పలకడానికి ప్రయత్నిస్తామే గానీ, మన విషయంలో వాళ్లు అంత శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించదు. తీయని మన ‘గోదావరి’ని వాళ్లు ‘గోడావ్రి’ అని నోటికొచ్చినట్టు పలకడంలో ఏదో cultural hegemony, supremacy ని మించిన పొగరు కనిపిస్తుంది. అందుచేత, పేర్లు ఎలా పలికితే ఏమిలే అనుకుంటాను. పేర్లు పక్కన పెట్టి, అనువాదంలో ఉన్న ఇతరేతర తప్పిదాల్ని తెలియజేస్తే సంతోషిస్తాను.”

  నా యీ సమాధానంతో ఆయన ఖంగుతిన్నారట (కంగుని వత్తి పలకడం ద్వారా ఆయనెంత ఇబ్బంది పడ్డారో అర్థమయ్యింది). పెద్ద రచయిత కమ్ జర్నలిస్టు’ అని ‘పెద్ద’ అనే విశేషణంతో నన్ను ఎత్తిపొడుస్తూ, గొర్తి సాయి బ్రహ్మానందం గారు ఈ మాట వెబ్ పత్రికలో వేరే అనువాద కథ మీద పెట్టిన కామెంట్- http://eemaata.com/em/issues/201405/3890.html/3.
  దాని మీద ఇది నా వివరణ:
  మన సర్వనామాలు ‘మనం రాసే స్పెల్లింగ్ ప్రకారమే వాళ్ళు ఉచ్చరిస్తారు కాబట్టి, నేరం మనదే కానీ, వారిది కాదు అంటున్నారు గొర్తి వారు. ఆయన మాటల ప్రకారమే చూస్తే, స్పెల్లింగ్ ప్రకారం Guy De Maupassant ని గై డి మొపాసా అని ఎందుకు పలక కూడదు. వారు నాకు రాసిన mailలో “గి దె ముపాస’ అని, ఇక్కడ ‘ఈ మాట’ వెబ్ లో ‘గి ద ముపసా’ అని రాసారు (రెంటిలో ఏది సరైన ఉచ్ఛారణ?). International Phonetic Alphabet (IPA) ప్రకారం
  Guy De Maupassant : /gi də moʊ paˈsɑ̃/ అని ఉంది.
  అంటే “గి డ మొపసా” అని పలకాలని ఉంది.
  రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ రచయితల్ని వారి స్పెల్లింగ్ ల బట్టి కాకుండా, అక్కడ వారెలా పిలుస్తారో నానా తంటాలు పడి తెలుసుకోవల్సిందే అంటున్నారు గొర్తి వారు. తూర్పున ఉన్న మనం, మన లిపి వేరైనా, వారి వర్ణమాలలో వారి సౌలభ్యం మేరకి సాధ్యమైనంత కృషి చేసి వారికి మన పేర్లు రవి, గోదావరి ఇత్యాదుల్ని Ravi, Godavari అని అని వాళ్ల అక్షరాల్లో తెలియజేసుకుంటుంటే, ‘గాంధీ’ని మేము ‘గాండీ’ అని పిలుస్తామని, అలా పిలవకూడదనుకుంటే, ఎలా పిలవాలో IPA వంటి tools అందించవల్సిన అగత్యం కూడా మనదే అనడం పొగరుగానే అనిపిస్తుంది, పాశ్చాత్య భక్తి, కలోనియల్ విధేయతా బొత్తిగా లేని నాకు.
  ఈ విషయంలో మిత్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది :-)

  • పరభాషా పేర్ల పలుకుబడి విషయంలో కొందరు అదేదో ఘోరపాపమన్నట్టూ ఎంచి చెప్పే self-righteous సుద్దులు నాకు high-level pedantry గా అనిపిస్తాయి.

   Borgesని సరిగ్గా బోర్హెస్ అని గాక తప్పుగా బోర్జెస్ అని పలికినంత మాత్రాన నేనాయన్ని అరకొరగా చదువుకున్నట్టు కాదు. Flaubert ని ఫ్లాబె అని పలకాలట. కానీ నా తెలుగు నోటికి అదెంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. అదొక్కటే కారణం కాదు, అసలు ఆ రచయిత గంభీర మూర్తిమత్వానికి కూడా అలా తేలిపోయినట్టుండే పేరు అతికినట్టనిపించదు. గంభీరంగా ఫ్లాబెర్ట్ అనే పలకబుద్ధవుతుంది. అలాగే ఫ్రాం కాఫ్కాని, ఫ్రాంజ్ కాఫ్కా అనే అనబుద్ధవుతుంది. Goetheని ఏదో గేదెలాగా గెథె అని రాయబుద్ధవదు. Roberto Bolaño ని రొవెర్తొ బొలాన్యో అని పలకాలని తెలిసినా, అలా పలకటం లేనిపోని పెడాంటిక్ బడాయిని చూపెట్టుకుంటున్నట్టూ ఉంటుందనిపించి, రొబెర్టో బొలానో అని పలకడానికే ఇష్టపడతాను. Julio Cortázar ని హూలియో కొర్తసార్ అని ఎలాగో అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా స్పానిష్, ఫ్రెంచి, జర్మన్, రష్యన్ పేర్లతో ఈ ఇబ్బంది వస్తుంది.

   Salinger, Updike లాంటి కొన్ని అమెరికన్ రచయితల పేర్లు కూడా మొదట్లో నన్ను ఇబ్బంది పెట్టాయి. శాలింజర్‌ని సలింగర్ అనీ, అప్‌డైక్‍ని ఉప్డికె అనీ కొన్నాళ్లు నాలో నేను అనుకుంటూ వచ్చాను, ఎవరో కరెక్టు చేసేదాకా. వాళ్లు కరెక్టు చేసిన పద్ధతి కూడా నేను మార్చుకోవటానికి కారణమైందేమో. లేదా, అవి అమెరికన్ పేర్లు కాబట్టి మార్చుకోవాల్సొచ్చిందో. :) మీరన్న నిర్లక్ష్యం ఇంకా అలవాటవలేదు. అలవాటు కావాలి. అది అవసరం కూడా. పేరులో ఏముంది. వాళ్లంటే వాళ్ల పేర్లు కాదుగా.

   ఐనా కొత్తగా ఒక రచయితను తెలుగులోకి అనువదిస్తున్నప్పుడు మాత్రమే ఇలా కరెక్టు చేయటం పనికొస్తుంది. Maupassant, Chekhov, Tolstoy, Dostoevsky… ఇత్యాది రచయితల పేర్లు ఈ సరికే రకరకాల పలుకుబడులతో తెలుగులో స్థిరపడిపోయాయి. మొపాసా/ మపాసా, చెఖోవ్/ చెహోవ్, తోల్‌స్తోయ్/ టాల్‌స్టాయి, దాస్తవిస్కీ/ దాస్తోయెవ్‌స్కీ/ డాస్టవిస్కీ… ఇలాగ. (ఈ ఆంగ్లేతర పేర్లలో చాలా పేర్లు ఇలా తారమారవటానికి గల కారణాల్లో ఆ పేర్లను ఆంగ్లేయులు అవకతవకగా పలకడం కూడా ఒకటన్నది గమనార్హం.)

   ఇక మీ అనువాదాల్ని I consider them more as interpretations than translations. I know you can’t do it otherwise. ఐతే మాత్రం ఏమైంది? వేయి అనువాదాలు వికసించనీ, కోటి అనుసృజనలు వెల్లువవనీ.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.