jeediki raju evaru

జీడికి రాజు ఎవరు?

Download PDF   ePub   MOBI

ఇంక టెంత రిజల్సొస్తాయనగాను. అల్లంత దూరాన్న పట్టాలు కలిసిపోయే చుక్క మీద ఊగూగే ఆవిర్లు రేపుకుంటూ ఎర్రటెండ. ఇంత పిసరూ గాల్లేదు, ఆకైనా అల్లాడ్డంలేదు. బొగ్గుల కుప్పలు, ఐరనోర్ కుప్పలని దాటుకోని ఎదర చూపందినంత మేరా తోమిన గళాసా లాగ మెరుస్తున్న పట్టాల డౌనంట గేంగిమేన్లు తొయ్యకుండానే క్లిట్టక్ కడకడ, క్లిట్టక్ కడకడామని జారిపోతున్నాది మా ట్రాలీ. ఎక్కడా పిట్ట మనిషి ఐపు లేడు. త్రాగే నీరు కొలాయి ముందర మెడకాయ పిక్క ముందుకీ వెనక్కీ కదుల్తుంటే గళాసా ఎత్తిపోసుకుని తువ్వాలతో విసురుకుంటూ బొగ్గు జెట్టీల మేస్త్రీ ఒకాయన చూపులోకొచ్చి వెనక్కి దాటిపోయేడు. జేగురు రంగు ఇనప చెక్కల ఫెన్సింగవతల్నుండి బూరుగు చెట్టు రైల్వే రంగు ఆకులూ కొమ్మలూ చుట్టుకుని ఇవతల ప్లాట్‌ఫారం మీదికి దిగి వంగిపోయి ఇలా…గ్గున్నాది. ఆకు, కాయ, రెమ్మయినా అల్లాడకుండా ఓ కదలకుండా మెదలకుండాను. గుడ్డ గొడుగు కింద ఇనప బద్దల బెంచీ మీద మయాన్న పెద్దెంకట్రావు గారు, సైడుకొదిగిపోయి చిన్నెంకట్రావు గారు, గేంగిమేన్లు ఫిట్టరా కూచోగా మిగిల్న ఈరిక ముక్కలోనే ఒక్క పిర్ర ఆనుమీద కూచోని నీను. దాటిపోతున్న గూడ్సు ప్లాట్‌ఫారాన్నీ, బొగ్గుల కుప్పల్నీ, ఐరనోరు కుప్పల్నీ, నల్లటి బొగ్గు నేల మధ్యన అద్దంలాగ మెరుస్తున్న బురద బందలోన ఆకాశానికి మోరలెత్తి నిర్వికారంగా నిలబడ్న గేదెల్ని చూసుకుంటూ నా బుర్రలోన ఒక్క తలంపూ లేదు. పీటీడబల్యా గారు ఎయిట్‌నైన్ అప్పులోన రప్పించుకున్న పేపరు చుట్ట సగం చదివి చెమట చేతిలో తడీగా నలుగుతున్నూసు తప్ప ఇంకొకూసు లేదు.

బొగ్గు జట్టీల ప్లాట్‌ఫారం చివార్న తేగల ముసిల్దాయి జంగిడి ముందర బండాపించి బైనాక్లర్స్ తీసిమ్మన్నారు పెద్దెంకట్రావుగారు. ట్రాలీ తోసే గేంగిమేన్లిద్దరు, ముందర పీటీడబల్యా గారి కాళ్ళకాడ మెట్టుమీద కూచున్న కీమేనూ ముగ్గురూ చెంగున మెట్లంగి మీదగ్గెంతీసి, ఎర్ర తలపాగాలు ఇప్పి మళ్ళీ బిగించి కట్టుకుంట్నారు. చిన్నెంకట్రావుగారు టర్నౌట్స్, చింక్సులు, ట్రేకీలు ఫిష్‌ప్లేట్ల బేంకింగులు చూసుకుంటూ ట్రేక్కిటూ అటూ కలదిరుగుతుంటే గేంగిమేన్లోన వొగిసినాయన ఇనప రాడ్డుతోటి ఫిష్‌ప్లేట్స్ చుట్టు కంకరని పొడిచి చూస్తున్నాడు. పెద్దెంకట్రావుగారు పట్టాలు చూపుకందినంతమేరా బైనాక్లర్స్‌తో చూసి ‘ఇంక వెల్దాం పదం ‘ డన్నట్టు సంజ్ఞ చేసేరు. గేంగిమేన్లు, కీమేనూ అప్పుమీదికి ముగ్గురు కుడబలుక్కుని తొయ్యడాలకి రడీ అవుతుంటే కటకం కిష్టమూర్తి గారాలావిడి హాడావుడిగా పరిగెట్టుకోనొచ్చి కేరేజీ వైరుబుట్ట చిన్నెంకట్రావుగారి కాళ్ళ దుక్కు బెంచీకిందకి సర్దీసి ‘ఒస్తాను ‘ అన్నట్టుగా నవ్వీసే ఏం మాటాడకుండా ఫెన్సింగవతల గన్నేరు చెట్లెనకాల కోర్టర్స్ దుక్కెళిపోయింది. చిన్నెంకట్రావుగారు ఆవిడి కేరేజీ బుట్ట సర్దడానికని ఎత్తిన కాళ్ళు ఇరుగ్గా మళ్ళీ కర్ర నేల చెక్కలమీద కూర్చున్న గేంగిమేన్లకి తగలకుండా ఎత్తి పెట్టుకుని బెంచీ మీద ఇటూ అటూ సర్దుకున్నాడు. పెద్దెంకట్రావుగారు చెమటలో తడిసిన తెల్లటోపీ లబ్బరు తాడుతో గెడ్డాన్ని గోక్కుని రుమాలతో మొహం తుడుచుకుని నిద్దరాపుకోలేక అవస్థ పడుతున్నారు. ట్రాలీలోన మొత్తం ఏడుగిరిమీ అలాగే జోగుతున్నాము. నా ఎదురుగా బెంచీ చివారకి చిన్నారివలస ఓయీసీ మార్షలింగ్ యార్డ్లో ఫిట్టర సగం బెంచీ అంచునీ సగం గాల్లోనీ కూర్చుని జోగుతున్నాడు. ఆయన పక్కని కొత్తగా జాయినయిన పండావోల ఎన్నెమ్మార్ కుర్రోడు తెల్లచొక్కా ఖాకీ పేంటు మీదకి చెమట్లు ధారలు ధారలు కారిపోతుంటే నోరెల్లబెట్టుకోని కుదుపు కుదుపుకీ ఉలిక్కిపడిపోయి లెగిసినప్పుడల్లా ట్రేక్‌ని ఐరనోర్ జెట్టీల్ని అపనమ్మకంగా విచిత్రంగా చూసుకుంటున్నాడు. పెద్దెంకట్రావు గారు ఎండ మొహమ్మీద పడీటప్పుడల్లా మొహం గొడుగు నీళ్ళోకి లాక్కుని కాళ్ళు ఇంకొంచెం నిగడదన్నీసి గుడ్డ గొడుగు లోపటకి మొహం వెనక్కి వేలాడేసుకుని PTWI అని కుట్టిన చొక్కామీదనుండే గుండీలిప్పిన బొజ్జని ఉండుండి తడుముకుంటూ మాగన్నుగా జోగుతున్నారు. చిన్నెంకట్రావుగారు అటుసైడు తిరిగి కూర్చున్నా ఆయన చెంప, కాయ బుగ్గ, ఎత్తు పన్ను కనిపిస్తున్నాది. ఏమీ కారణం లేకుంటానే ఎప్పుడూ నవ్వుమొఖం వేసుకోని కిళ్ళీ చారల ఎత్తుపళ్ళమీదన పైపెదఁవు విప్పార్చుకోని చిద్విలాసంగాను. ఉండుండి ఇనప చెక్కబల్లల నేల బద్దల మజ్జిలోనుండి ట్రేక్ ఇనస్పెక్షన్ చేస్తున్నట్టుగ వంగి చూసి మళ్ళీ కళ్ళు మూస్సుకోని. ఓయీసీ ఫిట్టర కళ్ళ చివార్లనుండీ నేను ఎటుదుక్కో చూస్తున్నంత సేపూ నాదుక్కు చూసి, నేనూ ఆడివైపు తిరిగీసరికి చూపు అటు తిప్పుకున్నట్టుగ, కళ్ళు సగం మూసుకున్నట్టుగా. బెంచీ వెనక్కి వాలిపోయి ఎటూ చూణ్ణట్టుగ చేతిలో కేరేజీ పట్టుకోని ఏమీ చూణ్ణట్టుగున్నాడు గాని. తీరా నేనూ అతన్ దుక్కు చూస్సరికి ఈమాటు తన మాను తనే ఎండకి వేలిపోతున్న డేరా గుడ్డ గొడుగు కప్పు మూలల్లోకి చూసుకుంట్నాడు. కావాలని. అంత మండిపోతున్న ఎండ ధనరు మళ్ళీ బొగ్గుల కుప్పలు ఐరనోరు కుప్పల మీదా ఉండుండి గంధకం కుప్పల మీదా ఇనప ధూళీ అట్టలు కట్టిన మెట్లంగి నేలల మీద పడీ ఈడ్చి కొడుతుంటే ఈ నిప్పుల బండీ మీద కళ్ళు తెరిచి కుదురుగా కూర్చోడం ఎవరివల్లా కాడం లేదు. నేనూ సగం కళ్ళు మూసుకునే కూచున్నాను. గేంగిమేన్లు ఇందాక అప్పెక్కించీసేక ఇంక గుమడగెడ్డ బ్రిడ్జీ వరుకూ సుమారొక మైలు దూరం ఎక్కువేమీ తొయ్యక్కల్లేదు. పెద్దెంకట్రావుగారు నిద్దట్లో ఉన్నట్టుగే ఉండీ ఎక్కడన్నా స్పీడు తక్కువైనా మరీ ఎక్కువైపోయినా ఉట్టుట్టికే గొంతు సవరించుకుని దగ్గుతారు ‘ఉగ్ఘుమ్ .. ఉమ్మ్….హుగ్ఘుం…’ అని ‘ఎందుకర్రా? అంతిది..!’ అన్నట్టుగ. ఈ ఎండ దెబ్బకి టక్కుపెట్టీసి అదీ లేదు.

ఉన్నట్టుండి ట్రాలీ గుడ్డ గొడుగు అంచు మీదన తెల్లటి సీతాకోకచిలకొకటి వచ్చి వాలింది. ఉన్నకాడున్నది ఉన్నట్టే ఉండి టకామని లేచిపోయి రపఱపఱఫ్మని ఈ గజమ్మీదా ఆ గజమ్మీదా వాలి లేచి మళ్ళీ ఒచ్చొచ్చి గుడ్డ గొడుగు అంచుల నాలికలమీదికే ఏంటో పెద్ద పైల్మేన్‌లాగ హేపీగా ఎగురుకుంట్నాది. ట్రాలీ దానిమానాన్నది క్లింగ్ కిట్టకాటక్ కిట్టకాటక్. గుబగుబా ఉడకపోస్తున్న ఎండకి ఉక్కకి తట్టుకోలేక బండిమీద ప్రతీవోడూ ఎక్కడికెళ్తున్నామో ఏం పనిమీదున్నామో ధ్యాసే లేనట్టుగా నోళ్ళు సగం సగం తెరుచుకుని ఖాళీ కళ్ళలో తెల్లగాను, మాగన్నుగా తెలిగేసీ లేకుండా నిద్దట్లోనూ లేకుండా. సీతాకోకచిలక్కి అప్పుడే ట్రాలీ మీద ఇల్లొదిలి ఓ వంద గజాలేనా ఒచ్చీసుంటాదన్న దీవే లేకుండా బెంచీ గజాల మీదా ఇనప బద్దీల నేల ఫ్రేముల మీదా చెక్కల పిట్ట గోడా గజాల మీదా గొడుగు ఇనప రాట మీదనా ఇలాగెళ్ళి కూచోని అల్లల్లల్లల్లమని అలాగెగిరి లేచీ మళ్ళీ ఆటలు. అది ట్రాలీని ఒదలకుండా గిరికీలు కొడుతుంటే దాని తోవనే కనిపెట్టుకోని చూసుకుంటుంటే నాకు సీతాకోక చిలక తెల్లగాను, దాని చుట్టూ ఎండ వేడి పొగంచులు నల్ల నల్లగాను అది ఎగిరిన తోవ రింగురింగులుగా పచ్చపచ్చగానూ మతాబాల్లాగ్గనా పిచ్చిగీతల్లాగున్నాది నిద్దర కళ్ళముందు.

కూర్చున్నది కూర్చోకుండా మళ్ళీ టకామని లెగిసి గొడుగు లోపలి కప్పు గుడారం మీదివరుకూ వెళ్ళి గుద్దుకుని ఇంకెటూ పోలేక టిక్కడిపోయి వెనక్కొచ్చి, మళ్ళీ అదంతా మర్చిపోయి పట్టుదలగా గుడారం కొసమీదకే వెళ్ళీ వెనకా ముందూ అవుతున్నాది. వాలి కూర్చోడానికి ఎక్కడా జాగా దొరక్క చివరికి ఒచ్చొచ్చి గొడుగు ఇనప రాటకి S.C.R అని రాసున్న రైల్వే అక్షరాల బోర్డుమీదికి దిగింది. అడ్డ గీతలకీ నిలువు గీతలకీ మధ్య స్టెన్సిల్ ఖాళీలతోని నల్లగా నిగనిగలాడుతున్న కొత్త పెయింట్ అక్షరాలమీద దాని తెల్లటి రెక్కలు మరీ కొట్టొచ్చినట్టు చాలా ముచ్చటగా ఉన్నాయి. అంతలాగ తిరిగి తిరిగి ఇంకలిసిపోయి రెష్ట్ తీసుకుందునా అన్నట్టుగ ఆ నల్లక్షరాలమీదే ఇంత లెక్కని ఇటూ అటూ కదలకుంటా మెదలకుంటా గమ్మున కూచోనున్నాది. ట్రాలీ దానిమానానది చిన్న చిన్న కుదుపుల్తోటి జారిపోతున్నాది. నిద్దరమొహాలు చెఁవట్లు ఆరీ ఆరకా నిద్దర్లొచ్చీ రాకా బెంచీల మీదా, బద్దీల్నేల మీదా కమ్మీలమీదా ఎక్కడ ఆను దొరికితే అక్కడ ఆనుకోని ఈగిలపడిపోయున్నారు. నా బుర్రింక ఖా…ళీగా ఉన్నాది, కళ్ళ ముందు బుగ్గి తుప్పలు అలుక్కుని దాటిపోతుంటే దేనూసూ లేకుండాను.

జాఁ…మ్మని నిమానుగా జారుతున్నాది ట్రాలీ. “ఓరి గుంట్నాకొడకొఱేయ్….!!” అని లైన్‌మేన్ కేకతోటి ఉలిక్కిపడి తలెత్తి చూసేను, నిటారుగైపోయి. ఎదురుగా ఒక చిన్న కుర్రోడు కుడివైపు కేబిన్ సైడు సిగ్గులేని మొక్కలు జిల్లేడు మొక్కలు రెల్లు దుబ్బుల్ని దాటుకుని కోరమాండల బాబులాగ పట్టాలదుక్కు పరిగెట్టుకోనొచ్చెస్తనాడు. మాదుక్కు ట్రాలీ దుక్కు చూణ్ణైనా చూస్కోకుండా ఆడి సత్తువంతా కూడాదీసుకుని పట్టాలు బేగా దాటెద్దామని. రెల్లు దుబ్బుల మీంచి ఎగ్గిరుకోని పట్టాల కంకర మెట్లంగి మీదికొచ్చీసేడు. గేంగిమేన్ గారు గాంగాభరా అయిపోయి ‘వొఱే! వోఱాగురా వోర గుంట్నంబ్డికేయ్…’ అని రెండు చేతుల్తోనీ బ్రేకు రాడ్డు మీదికి లాక్కున్నాడు. గేంగిమేన్లు తొయ్యకుండానే సరామని జారుతున్నదల్లా ఇంక కరక్టుగా ఆ గుంటణ్ణి గుద్దీసి కదా మనం ఆగుదామన్నట్టుగ కీచుమని మెట్లంగి గొంతుకుతోటి రేవిట్నక్కలాగ అరుచుకుంటూ ఆగడానికి పీండ్రించుకున్నాది ట్రాలీ. ఇంక ఏంచెయ్యడానికీ వల్లకాకుంట అవకూడని ఆలిస్యం అయిపోయింది. ఇంకిలాగ గుంటడు ముందర జాలీ కిందన పడి మరి కనిపించకుండా పోయేడూ, ధడామని పెద్ద చప్పుడు చేసుకుంటూ కీచు కేకలాపీసి నాలుగడుగులు ముందుకే ఒసిలి అప్పుడాగింది ముండా ట్రాలీ. గేంగిమేన్లూ కీమేను కంగారుగా లైనుమీదిగ్గెంతీసేరు. యెనకాలే చిన్నెంకట్రావుగారు, ఫిట్టరా. నేనూ యెన్నెమ్మార్ ఆత్రంగా లెగిసి నిల్చున్నాము. ట్రాలీ కిందనుండి ఓఁ… వోఁ… వోఁ… మనీసి ఏడుపందుకున్నాడు…గుంటడు బతికీసేడు!! నాకు అమ్మియ్యా అనిపించింది. గుంటడిమీదని కాదు. పోనీ మనకీ, మన బండీకేమి కాలేదుర దద్దా అనీసి హేపీ అయినట్టుగ.

బెంచీ మీదనుండీ అంగలేసి అటు జాలీ సైడు గెంతీసి ట్రాలీ కిందన వాడు ఎక్కడ టిక్కున్నాడోనని ఎవరికందిన కన్నాల్లోంచి వాళ్ళము. అప్పుడే ఆ కుర్రోడి గావుకేకలు విని పట్టాలకిట్నుండీ అట్నుండీ సొమ్ములకాపు గుంటలు, బందల కాడి చాకలమ్మలు జనాలు మూగుతున్నారు ట్రాలీ చుట్టూను. గేంగిమేన్లు ‘ఉమ్‌మ్ ‘ మని ట్రాలీ ని గాల్లోకెత్తి పట్టుకుంటే పెద్దెంకట్రావుగారు కంగారుగా చూస్తుంటే ఫిట్టర జాలీ మెష్షు ఎత్తిపట్టుకుని ట్రాలీ కిందికి దూరి గుంటణ్ణి ఒంటి రెక్కతోని పట్టుకోని ఎత్తి బయటికి లాగి పీటీడబల్యా గారి సీట్లోన తలగడా మీద కూచోబెట్టేడు. ఒంటిమీచ్చొక్కా లేదు, నిక్కర వెనకది సగం చిరిగిపోయి జాలీకి చిక్కడిపోయింది. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న పిల్లణ్ణి ఎలాగూరుకోబెట్టాలో తెలీక ఫిట్టర వాణ్ణి మళ్ళీ ఎత్తిపట్టుకోని, పెద్దెంకట్రావుగారి పక్క సీట్లోన తను కూచుని,వాణ్ణి తనొళ్ళో కూచోబెట్టుకోని ఊరుకోరా ఊరుకో అన్నటుగ నోటిమీద వేలితో ఉష్ష… మంటుంటే వాడు ఇంకా చించుకోని ఏడ్చుకుంటూ ఒళ్ళోంచి గెంతీయాలని రుంజుకుంటున్నాడు. పెద్ద బుర్ర, చింపిరి ఉంగరాల జుత్తూ కదిలి కిందపడుతుంటే వెనక జాలీకి టిక్కుకుని చిరిగిన నిక్కర్లోంచి ఊసు పిర్రలు కనిపించుకుంటూ ఫిట్టర ఒళ్ళో ఓఁ వోఁ వ్వోఁ…మని.

jeediki raju evaru“ఒస్సూరుకోరా….లేదమ్మ ఊరుకోరోలమ్మొస్సి?!” అని చిన్నెంకట్రావుగారు వాడి భుజాలు నడ్డిమీద, బుర్రమీద రాసి ఊరుకోబెడుతున్నాడు. పెద్దెంకట్రావుగారొచ్చి ఆదుర్దాగా వాడి ఒంటిమీద దెబ్బలేమైనా తగిలేయేమోనని పరీక్ష చేస్తుంటే వినయంగా పక్కకి తప్పుకుని “పిడికిలి బిగించ్సుకున్నాడు బాబూ! ఆడి గుప్పిట్లో ఏటున్నాదో చూడవై…!” అని ఫిట్టరుకి కొంచెం బతిమాల్నట్టూ కొంచెం పెత్తనాలు కలిపి చెప్తున్నాడు. పెద్దెంకట్రావు గారు ఆ మాటలు వినుండీ విన్నట్టే ‘ఏదీ ముందు ఇటు తిప్పు సరిగ్గా చూదాం…’ అన్నట్టు సైగలు చేసుకుంటూ ఆ గుంటడి ఒళ్ళల్లా ట్రేకినస్పెక్షన. ఫిట్టర ఎగిరెగిరి గింజుకోని ఏడుస్తున్న గుంటడ్ని బలవంతంగా తన ఒళ్ళోనే అట్నించిటు తిప్పితే వాడు అందరు జనం తనచుట్టూ మూగుండటం చూసి బేజారైపోయి బొటకనేలు నోట్లో పెట్టుకుని, తన మీదికే వంగి చూస్తున్న పెద్దెంకట్రావు గార్ని బెదురుగా చూస్తున్నాడు. “ఏదిరా ఏది చెయ్యేదిరా…?” అని వాడు ఏడుస్తున్నా ఖాతరు లేనట్టే పెద్దెంకట్రావుగారు వాణ్ణి కళ్ళు చేతుల్తో ఇప్పీ, ఈ రెక్కా ఆ రెక్కా ఎత్తీ, మెడకోళ్ళు, భుజాలు, బొజ్జ, కాళ్ళు అన్నీ ఒక్కొక్కటీ ఎత్తి కదిలించి తృప్తిగా తలాడించుకుంటూ చివరికి పిడికిలి మూసున్న చెయ్యి గాల్లోకెత్తి నిలబెట్టి “సుబ్బరంగున్నాడు గుంటడు. ఎక్కడా ఒక దెబ్బలేదు, ఒక రక్కు లేదు! ఒక గీరన్నా గీరుకోలేదు…!” అని నమ్మలేనట్టుగ పొంగిపోతనట్టుగా, మళ్ళీ బుగ్గీ కళ్ళంట్నీళ్ళూ చారికలు కట్టీసున్న వాడి బుగ్గలు ఒంటిచేత్తో పుణికి నొక్కీసి ఇంక గాలి కోసం బండి దిగిపోయేరు. చిన్నెంకట్రావుగారు ఆయన ఖాళీ చేసిన చోట్లో నిలబడి ఫిట్టర్ని మళ్ళీ “చూడమ్మ చూడవై! సమింగ చూడండ్రా …!” అని వాడి పిడికిలి ఇప్పీమని గాం గాభరైపోతున్నాడు. ‘మూర్చరోగఁవో ఏటోనమ్మా?! ఎవల్తాలూకోనివై గుంటడు…?’ అని పెద్ద గేంగిమేను గారు. ఫిట్టర వోణ్ణి రుంజుకోకుండా నొక్కిపట్టీ వాడి పిడికిలి ఒకొక్కవేలూ ఇప్పాలనీసి ఎంత గింజుకుంటున్నా ఒద్దుగాక ఒద్దనీసి బెదురుగొడ్డులాగ ఆడేడుపులు ఆడేను.

చాకళ్ళ ముసిలావిడ ఎర్రకూజాలోన మంచినీళ్ళు తెచ్చి ఫిట్టరెదురుగా ఎత్తిపట్టుకుని తాగించుతావా లేదా? అన్నట్టుగ నిలబడ్డాది, కుంకం ముక్కు కమ్మీల మీదకి జారుకుంటూను. “జాలీ హుక్కులకి నిక్కర తగులుకుని గాల్లోకిసిరీసిందండి. బతికీసేడు గుఁణ్ణాకొడుకు! ఆయుష్షున్నాది అదుష్టమంతుడు…!” అని చిరిగిన నిక్కరు పీలికలు జాలీ నుండి ఒకొక్కటీ ఊడబీకి అందరికీ చూపిస్తున్నాడు గేంగిమేను. ‘అదుష్టఁవా మరీ అదుష్టఁవా..?’ అని ప్రశ్న లాగడిగింది చాకల్లావిడి అందరిదుక్కూని. చిన్న నవ్వు మొహాలు పెట్టుకుని వాడి ఏడుపునే చోద్యం చూస్తూ ఎవరూ ఏం మాటాడలేదు. ఎన్నెమ్మారు ఇంత హడావిడిలోనూ సీట్లోంచైనా లేవకుండా ఆ కుర్రాడి గుప్పిట్లోకే చూస్తున్నాడు. నాకు చెమటలు పట్టడం ఆగింది. అందరు జనాల్లోనూ, ఎండ మీదా ఇప్పుడు ఉండుండి గాలికి గుడ్డ గొడుగు ఊగుతున్నాది. గుంటడు మంచినీళ్ళ గళాసు కరిచిపట్టుకుని గటగటా తాగుతుంటే ఇదే సందనీసి ఫిట్టర వాడి గుప్పిటి మీద చెయ్యేస్తే చిటామని గ్లాసిసిరీసి చివార నీళ్ళు ‘తుఫ్ఫ్…’మని వంగి ఇడ్డూరం చూస్తున్న చాకల్ల పెద్దావిడి మీదికుమ్మీసి బుర్ర ఫిట్టర గుండెలమీదికి గుభీ గుభీ గుద్దుకుంటూ మళ్ళీ రాగం ఎత్తుకున్నాడు. చాకలావిడి మురిసిపోయి గాజుల మీద మోచేతుల మీదా నీళ్ళ తుప్పర్లు చీరకి తుడుచుకుంటూను ముద్దులాడుతున్నట్టుగ ‘అద్దుష్టఁవా మరీ అద్దుష్టఁవా..? సిరంజీవ సెతాయుష్షు దీర్గాయుష్షు మార్కండాయుష్షో..?!’ అన్నాది మళ్ళీని.

“ఎవల కుర్రాడివిరా నువ్వూ? నీ పేరేటమ్మా… వోర ఇందర! ఇంద…?!” అని తన చేతిలోనూ ఏదో మూసున్నట్టుగ ఉట్టుట్టికే ఏక్షన్ చేసుకుంటూ చిన్నెంకట్రావు గారు. ఫిట్టరగారు ఏడుస్తున్న కుర్రాణ్ణింక ఏం చేసీ సంబాళించుకోలేనన్నట్టు కాళ్ళు నిగడదన్నీసి సర్దుకుని “ఎంచేపండీ ఇలాగ్గన? ఎవల్తాలూకో కనుక్కోండి బేగి?” అని బైట పెద్దెంకట్రావు గారికేసి బతిమాల్తున్నట్టు. “ఆలమ్మొస్తందుండండి! అదుగో దుర్గతల్లి గుడెనకాల …” అని తుప్పలెనక తాటితోపుల వెనక పేటకేసి చూపించేడు చాకల్ల కుర్రాడు. అప్పటివరకు పిడిగుద్దులు గుద్దుతూ ఏడుస్తున్న గుంటడు వాళ్ళమ్మూసు వినగానే ఫిట్టర వొళ్ళోంచి తప్పించుకుని లెగిసెళ్ళిపోవాలని నడ్డి కావిడిబద్దలాగ వంచీసి రుంజుకుంటునాడు. ఫిట్టరగారు ఉక్రోషంగా వాడి భుజాలు నడ్డీ బిగ్గట్టి పట్టుకుంటే ఇందాకట్నుండి పుక్కిట్లో పట్టుకున్న నీళ్ళు ఉమ్మి తీసి ‘ఫూ…’మని తుప్పర్లు ఊసుకుంటూను. చట్టల మీద గుద్దీసి రక్కీసి వ్వో..వ్వో…మని అల్లడతల్లడ. వాడు చేతులు రక్కీకుండా తప్పించుకుంటూ ‘ఒల్లకోయెస్ కికారపు గుంటడు!’ అని కన్నింతా గుడ్డింతా చేసి వాడి రక్కులకీ గుద్దులకీ అందకుండా దూరాన్న పెట్టి ఒడిసిపట్టుకుని పళ్ళు కరుసుకుంటున్నాడు ఫిట్టర.

పెద్దెంకట్రావుగారు కాలరు చుట్టు రుమాల ఒదుల్చుకుని ప్రసన్నంగా ఒక్కాలు ట్రాలీ మెట్టు మీదేసి రెండోది నేలమీదానించి దుర్గతల్లి గుడివైపు నుండి తరలొస్తున్న జనాన్ని అరిచెయ్యి కళ్ళకి అడ్డం పెట్టుకుని చూస్తున్నవాడల్లా ఇటీపు తిరిగి “ఓసూరుకోరా వోఁర! అదా మీయమ్మొస్తంది! ఎందుకు … బక్కీ కోపము?” అని ఫిట్టర బుర్ర మీంచి కుర్రాడి మీదికి వంగి బుగ్గి, చెమట, కన్నీళ్ళు పాముకున్న వాడి బుగ్గల మీద తడుతంటే. ఫిట్ట్ర మీద అంత రుంజుకున్నావోడల్లా పెద్దెంకట్రావుగారనీసరికి వాడు మళ్ళీ బొటకనేలు నోట్లో పెట్టి గుడుసుకుంటూ ఆయనకేసే బిత్తర చూపులు చూసుకుంటూ కామాప్ అయిపోయేడు. ఆయన ఇంకోసారి వాడి బొజ్జ కిందా మీదా పక్కటెముకల్ని నొక్కి ఆసికాలుగా చూస్తుంటే ఇంక ఏం గింజుకోకుండాను. ఆయన ఆ నొక్కుతున్న చెయ్యి ఉన్నట్టుండి కంగారుగా వెనక్కి లాక్కుని నాలిక వెనక్కి మడత పెట్టుకుని “అడ్డడ్డే! ఉష్షా ఈడి పెంకితనము?! ఎంత కోప్మవితేని తప్పు! అవుట్సైడెల్లెస్తావుర?” అని తడిచెయ్యి గాల్లోకెత్తి. చుట్టూ మూగిన జనం ఆ పిల్లడి అమ్మొస్తున్నాదని అటు చూస్తున్నవాళ్ళల్లా ఇటు కుర్రాడి వేపు తిరిగి చూస్తుంటే పీటీడబల్యా గారు “ఒకటికెల్లీసేడండీ …చిచ్చీ!” అని మురిపెంగా ఫిట్టరు ఒళ్ళోకి చూపిస్తూ ప్రకటిస్తే అందరూ గొల్లుమన్నారు. ఫిట్టరు ఉడుకుమోత్తనంగా చొక్కా కిందన, ఒళ్ళో వాడు కూచున్నంత మేరా ఫేంటు తడి తడిగా తగుల్తుంటే ఉడుకుమోత్తనంగా అసయ్యంగా తన బట్టలకేసీ ఆ గుంటడికేసీ మిర్రి మిరి చూస్తుంటే అందరూ ఇకిలించి మళ్ళీ నవ్వుతుంటేను.

“ఇందండీ! నావొక్కడికేనేటి ఈడి సేవ …? పీటీడబల్యా గారు. ట్రాలీ మీ రైల్వేవోల్ది! ఇందండి రార్రా..?!” అని పెద్దెంకట్రావుగార్నీ గేంగిమేన్లకేసీ ఏం చెయ్యాలో తోచనట్టు వాడ్ని ఎత్తిపట్టుకుని చూస్తుంటే పెద్దెంకట్రావుగారు “ఓసొల్లకోవై! చంటి పిల్లడుచ్చ. బకీట్ల నీళ్రప్పింతాను కడిగిద్దుగాని! చిన్న పిసరు అవుటుకెల్తే ఏటున్నాది, పెద్ద గండం తప్పింది!” అని అనునయిస్తుంటే చిన్నెంకట్రావుగారు “అవున్రైటేని!” అని ఇగటానికి నవ్వుతున్నావోడల్లా అటీపు తిరిగీసి జెండా మెట్టు మీంచి గాళ్ళోకి తేలుతూ మెడకోళ్ళు నిక్కించుకోని “అదిగో వొస్తంది తల్లి!” అన్నాడు పెడసరంగాను. రెల్లుదుబ్బులు రెండు చేతుల్తో విడదీసుకుంటూ “త్రినాదా? త్రినాద రావూ..?” అని శోకన్నాలు పెడబొబ్బలు పెట్టుకుంటూ మెట్లంగి ఎక్కి పట్టాలు దాటుకోని పరిగెట్టుకోనొస్తంది ఆయాడమనిషి. అటీపూ ఇటీపూ చాకలోలమ్మలు, సొమ్ములకాపు కుర్రాలు సంబాళించుకుంటూ సాయానికి పరిగెడుతుంటే. ట్రాలీ దగ్గిర పడగానే గొంతు ఇంక పెగల్నట్టు ‘బండికిందెలాగ పడిపోయేవురా నీను సచ్చిపోయేనే…’ అని నెత్తి మీద చేతులు పెట్టీసి కూలబడిపోయి. అమ్మ గొంతు విని త్రినాద ఫిట్టర వొళ్ళోంచి గెంతబోతుంటే తనే మరిడమ్మలాగ మళ్ళీ లెగిసొచ్చి జనాల్ని ఇటూ అటూ తోసుకుంటూ ఊగిపోతూ ట్రాలీలోనకొచ్చీసి వాడి రెక్క పట్టుకుని గాల్లోకి లేపి రెండో చేత్తోటి మొట్టికాయలు మొట్టుకుంటూ “దొంగ వెదవ! ముష్టివెదవ! య్యెందుకురా…? య్యెంధుకలగ సస్తనావుర…?? తినీసొక్కాడ తొంగోలేకా? పోగాలమూ…!” అని రాగాలు పెట్టుకుంటూను. ఏడ్చుకుంటూ పళ్ళు గిట్టకరుచుకుని ‘యెందుకలగ? య్యెందుకలగా…? సస్థనావు? సస్థనావేమీ..? థిన్నగుండ్లేకా…?’ అని తిట్టుకో దెబ్బా దెబ్బకో తిట్టూ చెళ్ చెళ్ళుమనిపించీసి. ఇంక లేచి నిలబడదామనుకున్న ఫిట్టర లేవకుండా కూచుండిపోయి గుంటడి రెక్క ఒదలకుండా “నీకేటి పిచ్చేటమ్మా? కుర్రోడిక్కనిపెట్టుకోకుంట ట్రేకీల కాడొదిలీడం నీత్తప్పా ఆడి తప్పా? పిల్లణ్ణొగ్గీసి ఎక్కడికెలిపోనావు తల్లి పెత్తనాలకి?” అని ఆవిడి దెబ్బలు తగల్నివ్వకుండా చెయ్యడ్డం పెట్టి త్రినాదని మళ్ళీ తనొళ్ళోకే తీసుకున్నాడు. ఆవిడి ట్రాలీ మెట్టు మీద చిన్నెంకట్రావుగారు ఖాళీ చేసిన జాగాలో కూలబడిందల్లా కొంచెం తత్తరపడి తమాయించుకుని ‘నా పిల్లడు నా ఇష్టం మజ్జిలోన్నువ్వెవ ‘రన్నట్టు ఫిట్టర్ని తప్పించుకుంటూ వాణ్ణి తనొళ్ళేకే లాక్కున్నాది మళ్ళీ.

చిన్నెంకట్రావు గారావిడికి త్రినాద చెయ్యి చూపిస్తూ “చేతిలేటున్నాదో చూడు, చెయ్యి బిగబట్టీసేడూ?” అంటున్నాడు. గేంగిమేన్లు అప్పుడే ఎక్కడి జనాల్నక్కడ చెదరగొడుతున్నారు. పెద్దెంకట్రావుగారు తైనాతు పెర్మనెంట్ వే ఇనస్పెక్షన్‌కి బయల్దేరే ముందు సద్దుకునీటట్టుగే బొజ్జమీంచి జారుతున్న బెల్టు ఇలాగలాగ తిప్పుకోని సర్దుకుని, టోపీ లబ్బరు తాడు తుడిచి బిగించుకుని పదండి పదండనీసి గేంగిమేన్లకి సైగలు చేసుకుంటూ ట్రాలీ దుక్కు నడుస్తున్నారు. మెట్లంగి మీద కూచున్న గేంగిమేన్లు ఎర్ర తలపాగాలిప్పి ఫేంట్లకంటుకున్న బుగ్గీ గడ్డిపరకలూ విదిలించుకుంటూ తలపాగాలు మళ్ళీ చుట్టుకుంటూ డూటీకి లెగుస్తున్నారు. జనాలు ట్రేకీ కిందికి దిగిపోయి కొంచెం దూరం నుండే మళ్ళీ పన్లమీదికి పోబోతూనే ఇంకా నిలబడీ ఇటేపే చూస్తుంటే మేము ట్రాలీ లోకి మళ్ళీ ఎవరి జాగాలంట వాళ్ళమూ సద్దుకుంటుంటేను. త్రినాదని చంకనేసుకుని వాళ్ళమ్మ ఇప్పుడింక ఫిట్టరకీ, పెద్దెంకట్రావుగారికీ చిన్నెంకట్రావుగారికీ మార్చి మార్చి దండాలు పెడుతుంటే వాడు ఒక చేత్తో బొటకనవేలు చీకుతూనే రెండో చెయ్యి పిడికిలి ఇప్పి వాళ్ళమ్మకి చూపించేడు. వాళ్ళమ్మ వాడి గుపిట్లోది తీసి చూసి కోపంగా నవ్వుతుంటే చీమిడి ముక్కు ఎగబీసుకుంటూ వెక్కిళ్ళు పెట్టుకుంటూ భుజమ్మీద మెడకాయ వేలాడేసుకోని అమ్మ గుండెల్ని అత్తుకోని కామాప్ అయిపోయేడు. వాళ్ళమ్మ వాడి గుప్పిట్లోంచి తీసిన మాఁవిడికాయ జీడిని చిన్నెంకట్రావు గారికి చోద్యంగా ఎత్తెత్తి చూపించుకుంటూ “జీడితోటి గోడ్లమీద రాస్తనావా మల్లీ? ఆ యెలుమంతోడూ నువ్వూనీ…? గార్డుగారు రాయొద్దూ రాసేవంటే రాత్తుర్లు కేబీన్లెట్టీసి తాళాఁవేసెత్తానన్నాడా? అన్నాడా లేద! ఎందుకొచ్చేవూ ఇటు దుక్కు …? పట్టాల్దాటుకోని రావద్దూ, రైలొస్తాదీ అనీసన్నాన లేద? గోడల మీద రాయొద్దనీసన్నానా లేద…?!” అని ముద్దులు ముద్దులు చేస్తుంటే వాడు తన తప్పు తెలిసుండీ ‘అదే నాకిష్టం!’ అన్నట్టుగు ముద్దులు గునుసుకుంటూ వాళ్ళమ్మ బుర్రని బలవంతంగా ఇందాక ట్రాలి కింద పడ్డానికి ముందు తను పరిగెట్టుకుంటూ వచ్చిన దుక్కు రైల్వే కేబిన్ గోడల కేసి చూపిస్తున్నాడు.

ఫిట్టర గారు బట్టలు ఉచ్చకి తడిసిన చోట్ల బకిట్లోంచి నీళ్ళు పోసుకుని, తడిసిపోయిన చొక్కాని ఇప్పీసేడు. గేంగ్‌మేన్లు తెచ్చిన బకిట్లోన చొక్కా జాడించి బిర్రుగా పిండుకుంటూ ఆ నీళ్ళే ఇన్ని మొఖం మీదా గుండెలమీదా జల్లుకుని ఆ చొక్కాతోనే తుడుచుకున్నాడు. చెమటలు పట్టిన ఒంటిమీద, మెడలు, కండలు, నడుమ్మీద కిందన తడిసిన ఫేంటు మీదా ఇన్నీసి నీళ్ళు జల్లుకుని ఒత్తుకోనొచ్చి కూచున్నాడు. చొక్కా పిండుకుంటుంటే పని చేస్చేసొచ్చేక కడిగిన నల్లటి మొహం తెల్లదౌడు తేరి సేదతీరిపోయి ఏదో గర్రాలాగ హేపీ అయిపోయి నవ్వుతున్నాడు ఫిట్ట్ర గారు. ఇందాకటి వరుకు ఎండ ధాటీకి మాగన్నుగా నిద్దరమొహాల్తోటి వేలిపోతున్న పేసింజర్లందరూ ఇప్పుడు నవ్వుమొహాల్తోటి ఇష్టంగా బెంచీ మీదా బద్దీల నేల మీదా సర్దుకున్నారు. గేంగిమేన్లు ట్రాలీ పుష్షింగుకి రడీ అవుతుంటే పెద్దెంకట్రావుగారు త్రినాద వాళ్ళమ్మని ‘కూచో కూచొ … అక్కడ ముందుకి దిగిపోదువు గాని ‘ కూచోమన్నారు. నాకు శనివారము పది గంటలు నిద్దర తీసి లెగిసొచ్చి మొహం కడుక్కుని టీ తాగీసొచ్చినోడికున్నట్టుగ మంచి మెలుకువగా ఉషారుగా ఉన్నాది. ట్రేకు డౌన్లో ట్రాలీ జారిపోతుంటే త్రినాద వాళ్ళమ్మ భుజం మీంచి నాదుక్కూ ఫిట్టర దుక్కూ ఎన్నెమ్మార్ దుక్కూ గుడ్డ గొడుగు గోపురం లోకీ మిడుకూ మిడుకూ చూస్తన్నాడు, వేలు చీక్కుంటూ గుడ్లతోనే దొంగ నవ్వులు నవ్వుకుంటూని.

బండి వందా రెండువొందల గజాలు జారి ఇంక కేబిను దాటుతున్నామనగా ఆఁవిడి పవిట సర్దుకోని గేంగిమేను తోటి “అన్నయ్యా ఇక్కడేని! ఇలాగాపియ్యండి…” అన్నాది. ఆవిడి త్రినాదనెత్తుకుని గబ గబా మెట్లంగి మీంచి ట్రేకీ దాటీసి కేబినవతల పాకలిళ్ళవైపు మట్టి తోవల్లోకి దిగిపోబోతున్నాది. త్రినాద ఎత్తుకున్న చంక జర్రున జారిపోయి అటు ఆలింటి తోవ వైపు కాకుండా ఇటు కేబిను గోడలవైపు ఆలమ్మని చెయ్యి పట్టుకోని లాక్కెళుతుంటే కేబిన్ నీడలో గేదల్ని నిలబెట్టి రాళ్ళ మీద కూచున్న సొమ్ములకాపు గుంటలిద్దరు చోద్యంగా లేచి నించున్నారు. పెద్దెంకట్రావుగారు మెళ్ళోని బైనాక్లర్స్ తీసి కేబిన్ దుక్కు చూసి కూడబలుక్కుంటూ చదువుతూ పగలబడి నవ్వుతున్నారు. ఏంటి ఏంటని ఆతృతగా చూస్తుంటే నాకు బైనాక్లర్సిచ్చీసి బొజ్జ మీదికి లెగిసి కదిలీలాగ ‘అహ్హహ్హా అమ్మోడియమ్మ..! అహ్హ..అహ్హ…!’ అనీసి. చెక్కుడ్రాయి గోడ కిందన కొత్తగా సున్నాలేసిన అంచు ముక్క మీద అడ్డదిడ్డంగా మాఁవిడికాయ జీడి తోటి రాసిన రాతలు – పసరాకుపచ్చ రంగు అక్షరాలతోని ఒక తీరూ తిమ్మూ లేకుండా వంకర టింకర గాను:

జిడికి రాజు ఎవారు?

జిడికి రాజు త్రినాద  అని.

గుంట్నావొడుకు నిజ్జింగానే జీడికి రాజాలాగ చిరిగిన్నిక్కర్లోంచి ఊసుపిర్రలు కనిపించుకుంటూ చేతులు రెండూ మక్కలమీదేసుకోని వాళ్ళమ్మకి ఆ రాతలు చూపింస్తున్నాడు. ట్రాలీ నెమ్మదిమీద జారిపోయి ట్రేకు మలుపు తిరిగిపోయి గుమడగెడ్డ కేబిను కొద్ది కొద్దీగ తుమ్మిక తుప్పలు, తాటి తోపులెనక్కి మాయమైపోయింది. ఇందాకలల్లా నిద్దర మొహాలేసుకుని జోగుతున్నోలందరూ ఇప్పుడు ఉషారుషారుగా కబుర్లాడుకుంట్నారు. పెద్దెంకట్రావు గారు బిలాస్‌పూర్ లైన్లో గూడ్సులు గుద్దీసుకోకుండా సిగ్నల్లు తప్పించి ఎలాగాపించేడో చెప్తుంటే చిన్నెంకట్రావు గారు అవును రైటేను అనీసి. ఎన్నెమ్మార్‌కి ఫిట్టర చేతుల్తిప్పుకోని ట్రైనేక్సిడెంట్ల గురించి చెప్తుంటే గేంగిమేన్లు నవ్వుమొహాలేసుకోని వినుకుంటూను.

నాకూ గాలాడుతున్నట్టుగ చెమటలారిపోయి బనీన్లోంచి ఫుల్లు. చల్లగా కులాసాగాని.

ఉన్నట్టుండి ఇందాకటి సీతాకోకచిలక జ్ఞాపకమొచ్చి చూసుకుంటే నల్లక్షరాలమీద కూచున్నదాయి ఎటెగిరిపోయిందో, ఎక్కడా అవుపళ్ళేదు.

*

(జాపనీస్ కధకుడు నయోఆ షిగా కధ An Incident ఆధారంగా)

జీడికి రాజు ఎవరు? – Download PDF    జీడికి రాజు ఎవరు? – Download – ePub   జీడికి రాజు ఎవరు? – Download – MOBI

Posted in 2013, Uncategorized, కథ, డిసెంబరు and tagged , , .

4 Comments

  1. చాలా చాలా గొప్ప కథ. ఇంతకంటే ఎక్కువ చెప్పాలని ఉన్నా వాడి చినిగిన నిక్కర్లోంచి కనిపిస్తోన్న రెండు పిర్రలు నా కళ్లల్లోకి రెండ్రెండు చుక్కలుగా రూపాంతరం చెందుతోన్న ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇక వెళ్లాలి. సీతాకోక చిలుక ఎగిరిపోయిన దారిని వెతుక్కుంటూ.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.