cover

తొలి ప్రేమ

Download PDF ePub MOBI

కళ్ళు బైర్లు కమ్మాయి. ఏమీ కనిపించడం లేదు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. ఎగిరే పక్షులు ఆగిపోలేదు. ఎగసే అలలూ ఆగిపోలేదు. ప్రపంచం స్థాణువై నిలిచి పోలేదు.

తన చెంప పగిలింది అంతే. ఆదిత్య ఎందుకు అలా చేసాడు? అతనూ, తనూ ప్రాణ స్నేహితులు కాదు, కానీ ఒకే ఊరిలో పుట్టారు. పెరిగారు. చదువుకున్నారు. కులాల అంతరాల వల్ల తమ మధ్య చనువు ఏర్పడలేదు, కానీ ఇలా చెంప పగలగొట్టేంత శత్రుత్వం ఏమీ లేదే?

అరె! వాడ్ని ఆపి అడిగి ఉండాల్సింది ఎందుకు కొట్టాడో! ఇప్పటివరకు గ్రౌండ్లో వాలీబాల్ ఆడి వచ్చాడు తను. ఆఫీస్ కి వరుసగా మూడు రోజులు సెలవులని ఆదిత్య కూడా వచ్చాడు. పాత స్నేహితులంతా కలిసి అలా ఎప్పుడైనా ఆడుతూనే ఉంటారు క్రికెట్టో, వాలీ బాలో. అక్కడ కూడా గొడవ ఏమీ జరగలేదే!

రాఘవ అలా విస్తుబోతున్న సమయానికి ఆదిత్య బస్టాపు వైపు వడివడిగా నడుస్తున్నాడు. అతని గుండె వేగం ఇంకా తగ్గలేదు. ఇదే మొదటిసారి తను ఎవరిదైనా చెంప పగలగొట్టడం. సరిగ్గా కొట్టాడా? అసలు అతనికి తగిలిందా? అలా సరిపోతుందా? తనకి తెలిస్తే ఎలా ఫీలవుతుంది? బస్టాపు చేరుకొని ఎటు వెళ్ళే బస్సో కూడా చూడకుండా బస్సు ఎక్కి ఖాళీ సీట్లో కూలబడిపోయాడు, నాలుగు రోజుల క్రితం వైజాగ్ రైల్వేస్టేషనులో జరిగిన అపూర్వఘటన గుర్తు చేసుకుంటూ.

ఆరోజు రైల్వేస్టేషన్లో ఆమె కనిపించకపోతే ఆ అద్భుతమైన నిజం తనకి తెలిసేదే కాదు. ఆ రోజు తను ఎక్కాల్సిన రైలు ఓ రెండు గంటలు ఆలస్యం కాకపోయి ఉంటే ఇరవై ఏళ్ళ క్రిందటి ఓ సత్యం కాలం మరుగున పడిపోయి ఉండేది. ఒక రహస్యం ఉంది అన్న విషయం కూడా తనకి తెలియకుండా మాయం అయిపోయేది.

ఆ నిజం చరిత్రలు తిరగరాసేంత గొప్పది కాకపోవచ్చు. కానీ తనకి మాత్రం అంత కంటే ఎక్కువే. తను జీవితాంతం గుర్తుపెట్టుకోదగ్గ గొప్ప విషయమే. ఏ క్షణాన తలుచుకున్నా తనని ఆనందపరుస్తుంది. కాసేపు తన సమస్యల్ని పక్కన పెట్టిస్తుంది.

బక్క పలచగా, నాజూగ్గా, తెల్లగా చుడిదార్లో ఉంది ఆమె. దూరం నుండి చూసి కాలేజీ స్టూడెంటేమో అనుకున్నాడు. తనని చూసి నవ్వుతుంటే ఎవరో అనుకుని పొరపాటు పడిందేమో అనుకున్నాడు. తన అయోమయం చూసి ఆమె ముఖంలో నవ్వు చమురు అయిపోతున్న దీపపు కాంతిలా మెల్ల మెల్లగా తగ్గిపోయింది.

“మీరు ఆదిత్య కదూ” అంది. ఆ స్వరం, తన మాటల వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అన్నంత మెల్లగా, మెత్తగా ఉంది. కానీ కోయిలపాటకీ, కమ్మని వీణానాదానికీ ఎవ్వరూ ఇబ్బంది పడరు అని ఆమెకి తెలిసినట్లు లేదు. మరీ అతను అనుకున్నంత చిన్న పిల్లేమీ కాదు. మెడలో నల్లపూసలు వివాహిత అనే ఆమె హోదాని హుందాగా తెలియజేస్తున్నాయి.

ఇదేమిటి! ఆమెకి తను తెలుసు అన్న విషయానికి ఆశ్చర్య పోవడం మానేసి, ఏమిటేమిటో ఆలోచిస్తున్నాడు. “అవునండి, క్షమించాలి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేక పోతున్నాను” అన్నాడు వినిపించీ వినిపించకుండా. ఈ సారి ఆమె ముఖం మీద విషాదఛాయలు పున్నమి చంద్రుణ్ణి ఆక్రమించుకుంటున్న నీలి మేఘాల్లా అలుముకున్నాయి. కనుకొలుకుల్లో పేరుకుంటున్న రెండు కన్నీటిచుక్కలు కనిపించకుండా ఉండేందుకేమో తల కిందికి దించుకుంది. తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలబడి ఉండిపోయాడు. ఈ సారి అవసరమైన దాని కంటే కొంచెం వేగంగా ఆమె తల పైకెత్తింది తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో.

“అలా కూర్చుని కొంచెం సేపు మాట్లాడడానికి మీకు అభ్యంతరం ఏమీ లేదుగా” అన్న ఆమె అభ్యర్థనని కాదనలేకపోయాడు. “చెప్పండి నేను మీకు ఎలా తెలుసు” అని అడిగాడు, ఆమె కొంచెం కుదుటపడింది అనిపించాక.

“అది సరే కానీ ఇంకా క్రికెట్ ఆడుతున్నారా ఎండలో పడి”అందామె. ఈ సారి ఆమె వదనం మరీ అంత విచారంగా లేదు.

“అవును, ఎప్పుడైనా”

“మంచిది. మీ పాత చేతక్ ఇంకా ఉందా?”

“నా చేతక్ నాకే సరిగా గుర్తు లేదు మీకెలా తెల్సు?” ఆశ్చర్య పోయాడతను.

“మీ ఊరు వెళ్తుంటారా ఎప్పుడైనా?”

“సెలవుల్లో వెళ్లి ఫ్రెండ్స్ ని కలుస్తూనే ఉంటాను”

“మీ అమ్మగారు, నాన్నగారు, అన్నయ్య ఎలా ఉన్నారు?”

“అందరూ బాగున్నారు. ఇన్ని విషయాలు చెబుతున్నారు అంటే నేను మీకు బాగా తెలుసన్నమాట, కానీ మీరు నాకు గుర్తు రావడం లేదు. ఏమీ అనుకోకపోతే నా గురించి కాకుండా మీ గురించి చెప్పండి కొంచెం” అభ్యర్థనగా అన్నాడు.

మళ్ళీ నవ్వింది ఆమె ఈసారి, నీటిచుక్కల్ని వెలుగు కిరణం విశ్లేషించినప్పుడు మెరిసే హరివిల్లుని తలక్రిందులుగా పట్టుకున్నట్లు, పెదవుల్ని బలవంతంగా సాగదీసి.

“మీకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో మీ ఇంటి చుట్టూ ఎవరెవరు ఉండేవారో గుర్తుచేసుకోండి పోనీ”

తను చాలా తీవ్రంగానే ఆలోచించాడు. కానీ తల దేన్నో వేసి బలంగా బాదితే కొంచెం సేపు అన్నీ మరిచిపోయినట్టు ఏమీ గుర్తు రావడం లేదు. ఆమె వైపు చూడాలంటే కొంచెం బెరుకుగా ఉంది.

అప్పుడు చెప్పడం మొదలుపెట్టింది ఆమె, “మేము మీ ఎదురింట్లో అద్దెకి ఉండేవాళ్ళం. సరిగ్గా ఇరవై ఏళ్ళ క్రితం మా నాన్నగారి ఉద్యోగ రీత్యా మేము అక్కడికి వచ్చాం. నేను ఒక్కదాన్నే సంతానం. మీకు నన్ను చూసిన జ్ఞాపకమే లేదు కాబట్టి నా పేరు మీకు తెలిసి ఉండదు. నా పేరు విశాల. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేదాన్ని. కాలేజి నుండి వచ్చాక వీధి గదిలో కూర్చుని నేను చదువుకుంటూ ఉండేదాన్ని. ఆ కిటికీ తలుపులు ఎక్కువగా మూసే ఉంచేదాన్ని. ఆ కిటికీ రెక్కల మధ్య కొంత ఖాళీ ఉండేది. మేము అక్కడికి వచ్చిన కొత్తల్లో మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉండేవారు. రోజూ మీ పాత చేతక్ మీద బయటకి వెళ్లి వస్తూ ఉండేవారు.

“నేను మొదట్లో కాలక్షేపానికి స్కూటర్ చప్పుడు అయినప్పుడల్లా ఆ కిటికీ రెక్కల మధ్య ఖాళీలో నుంచి మిమ్మల్ని చూసేదాన్ని. పోను పోను అలా చూడటం అలవాటుగా, తర్వాత వ్యసనంగా మారింది.

“కొన్ని రోజులకి ఆ వ్యసనం మీ మీద ఇష్టంగా నాకు తెలియకుండానే రూపాన్ని మార్చుకుంది. ఎంతగా అంటే చదవడం మానేసి గంటల తరబడి మీ స్కూటర్ శబ్దం కోసం చెవులు రిక్కించి వింటూ ఉండేదాన్ని. మీరు ఇంట్లో ఉంటే ఎప్పుడు బయటకి వస్తారా అని అలా ఆ చిన్న ఖాళీ లోంచి చూస్తూ ఉండేదాన్ని.”

చెప్పడం ఆపి తల ఎత్తి అతని వైపు చూసింది. అసలు ఆదిత్య ఆ క్షణాన వెర్రివాడిలా ఉన్నాడు. తన జీవితం తనకి తెలియని మరో కోణంలో ఆమె చూపిస్తోంది.

ఇప్పుడు ఆమెని చూసిన జ్ఞాపకం వస్తోంది. అవును ఎదురింట్లో ఉండేవారు. ఆ అమ్మాయి పేరు నిజంగానే తనకి తెలీదు. అప్పుడు తను ఉద్యోగం వెతుక్కోవడంలో తలమునకలై ఉండేవాడు. ఆ విషయంలో చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాడు కూడా. పోటీ పరీక్షలు రాస్తూ, వాటికీ ప్రిపేరవుతూ ప్రతీ నిమిషం అదే ఆలోచిస్తూ ఉండేవాడు. ఆమె గురించి అస్సలు పట్టించుకోని మాట నిజం.

చిన్నగా నవ్వి మళ్ళీ చెప్పడం ఆరంభించింది, “మూడేళ్ళు అలాగే మిమ్మల్ని మూగగా ఆరాధించాను అని చెప్పచ్చు. నాన్నగారికి బదిలీ అయి వెళ్లిపోతున్నప్పుడు, నా ప్రాణాన్ని అక్కడ విడిచి వెళ్తున్నంతగా విలవిల్లాడాను. ఈ మూడేళ్ళలో మీకు ఉద్యోగం రావడం, మీరు వేరే ఊరు వెళ్ళడం, శని ఆదివారాల్లో ఇంటికి వస్తుండడం జరిగేది. నేను ఆ శనివారం కోసమే మిగిలిన రోజులన్నీ ఎదురుచూసే దాన్ని. ఉదయాన్నే మీ చేతక్ బయట పెట్టి ఉంటే మీరు వచ్చారని అర్థం చేసుకుని సంతోష పడిపోయేదాన్ని. ఆ రెండు రోజుల్లో మీరు రెండు మూడు నిమిషాలు కనిపించేవారు అంతే. సోమవారం వస్తే నాకు మళ్ళీ శూన్యంలా ఉండేది.”

మళ్ళీ తనవైపు చూసి అంది ఆమె, “ఇన్నేళ్ళ తర్వాత మిమ్మల్ని కలవడం కల లాగా ఉంది. కానీ నన్ను మీరు గుర్తు పట్టలేక పోవడం ఓ పెద్ద షాక్. నేనంటే మీకు కూడా ఇష్టమనీ, నాలాగే భయం వల్ల మీరూ చెప్పలేక పోయారనీ భ్రమలో ఉన్నాను ఇన్నేళ్ళు.”

“దయచేసి నన్ను క్షమించండి. అసలు నేను గమనించుకోలేదు. మీరైనా కొంచెం ఫీలర్ పంపాల్సింది” అన్నాడు అతను గిల్టీగా ఫీలవుతూ.

“అప్పట్లో నాకంత ధైర్యమూ లేదు, నాకలా ఇష్టం కూడా లేదు. మీ అంతట మీకు అనిపించాలి కానీ, నేను చెప్పాకా కలిగేది అదేం ప్రేమ? సరే వదిలెయ్యండి. జరిగింది ఏదో జరిగిపోయింది. మనకి రాసిపెట్టి లేదు అంతే. మీతో రాసిపెట్టి ఉన్న అమ్మాయి పేరు ఏంటి” అందామె దుఃఖాన్ని మరిచిపోయినట్లుగా ఉత్సాహంగా.

తర్వాత రెండు గంటలు రెండు నిమిషాల్లా గడిచిపోయాయి వాళ్ళకి. ఇన్నేళ్ళలో జరిగిన విషయాలన్నీ ఒకరితో ఒకరు పంచుకున్నారు. వారి వారి జీవిత భాగస్వాముల్ని మొబైల్లో ఒకరికి ఒకరు చూపించు కున్నారు. ఆ ఊరి విశేషాలన్నీ ఆమె ఆత్రంగా అడుగుతుంటే అతను ఎంతో ఉత్సాహంగా చెప్పాడు. వాళ్ళిద్దరూ తమ సంబోధన మీరుల్లోంచి నువ్వుల్లోకి ఎప్పుడు మార్చుకున్నారో వాళ్ళకే తెలియలేదు.

అప్పుడు అందామె, “ఆదిత్యా, నా ట్రైన్ టైం అయింది”

“అవును కదూ, ఇంత సమయం గడిచినట్లే అనిపించలేదు”. ఈ మధ్యలో తను ఎక్కాల్సిన ట్రైన్ వచ్చి వెళ్లి పోయిందని చెప్పలేదు అతను.

“ఇంకో చిన్న కోరిక మిగిలిపోయింది. అది నువ్వు మాత్రమే తీర్చగలవు. తీరుస్తావా”

“తప్పకుండా విశాలా, చెప్పు”

toliprema“మీ ఊరిలో మన ప్రక్క వీధిలో రాఘవ అనే వాడు ఒకడు ఉండేవాడు తెలుసా నీకు?”

“నాకు తెలియకపోవడం ఏమిటి? ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరు తెలుసు నాకు”

“వాడు మొదట్లో చాల రోజులు నా వెంట పడ్డాడు. నేను ఏమీ స్పందించక పోయేసరికి నన్ను ఏడిపించడం మొదలు పెట్టాడు. వీధిలోకి రావాలి అంటే భయపడేలా చేసాడు. ఆ ఊళ్లో నేనున్న రోజుల్ని నరకంలా మార్చాడు. వాడిని లాగిపెట్టి ఒక్క చెంప దెబ్బ కొట్టగలవా”

“నీ కోసం ఆ మాత్రం చెయ్యలేనా? చేస్తాను”

“మంచిది. అదిగో ట్రైన్ కూడా వచ్చింది. ఇక నేను వెళ్తాను. నిన్ను ఇలా అనుకోకుండా కలిసినందుకు చాలా సంతోషం గా ఉంది.”

ఆమె కన్నీళ్ళతో ట్రైన్ ఎక్కుతుంటే అడిగాడు, “నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా?”

“వద్దు ఆదిత్యా, ఈ పరిచయాన్ని ఇక్కడికే పరిమితం కానీ, మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మధురమైన జ్ఞాపకంగా నిలవనీ”

తర్వాత ఆమె ఏమందో ట్రైన్ శబ్దంలో వినిపించలేదు అతనికి. గుండెల్లో కలవరాన్నీ, కళ్ళలో కన్నీటినీ మిగిల్చి ఆమె వెళ్ళిపోయింది, గతంలో నుండి భవిష్యత్తు లోకి.

తనని మాత్రం ఒంటరిగా వర్తమానంలో వదిలేస్తూ !

ఆమె కోరిక తీర్చడం కోసమే మళ్ళీ ఆ ఊరు వెళ్లి రాఘవని చెంప దెబ్బ కొట్టాడు ఆదిత్య. బహుశా ఈ రహస్యం మాత్రం రాఘవకి ఎప్పటికీ తెలియకపోవచ్చు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, మే and tagged , , , .

6 Comments

  1. ఈ ప్రేమ కథ పూర్తి చేయగానే దిక్కులు పిక్కటిళ్ళేలా నవ్వు వచ్చింది … ఎందుకు చెప్మా?!

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.