cover1

“అంతా జీవికే! జీవితం కోసం ఏం చేయటం లేదు.” ~ రమణజీవి

Download PDF ePub MOBI

(కథకుడు, కవి, చిత్రకారుడు, డిజైనరూ ఐన రమణజీవి ఇంటర్వ్యూ ఇది. ఆయనకున్న ఈ ఐడెంటిటీల్లో చిత్రకారుడూ, డిజైర్లనే ప్రధానంగా తీసుకొని ఈ ఇంటర్వ్యూ సాగింది.)
ఆర్టు వైపు మీ తొలి అడుగుల గురించి చెప్పండి?

నేను పుట్టింది కడపజిల్లా రాజంపేట. మా కుటుంబంలో ఆర్టిస్టులంటూ ఎవరూ లేరు.  నాకు మాత్రం ఒకటి బాగా గుర్తుంది, ఫస్ట్ టైం నేను స్కూలుకు వెళ్లినపుడు, పలక మీద ఆంజనేయస్వామి బొమ్మ వేసేవాణ్ణి. అక్షరాలు దిద్దటం అంటే ఎందుకో నాకు చాలా డ్రై గా అనిపించేది. ఒక పైక్లాసు అబ్బాయితో ఆంజనేయస్వామి బొమ్మ పలక మీద మేకుతో గీయించుకున్నా. మేకుతో గీస్తే చెరిగిపోదు కదా. ఇక దాన్ని దిద్దుతూ కూచునేవాణ్ణి. అట్లా బొమ్మలనేది నాకు పిచ్చి. ఒకటో తరగతి నుంచీ.

అంత చిన్నవయసులోనే ఆ దృష్టి మొదలవుతుందంటారా?

నేననుకునేది ఏమిటంటే, (ఇది జ్ఞాపకాన్ని ఎగ్జాజరేట్ చేయటం కూడా కావొచ్చేమో గానీ,) నాకు ఆరేళ్లకు మాటలొచ్చాయి. మా ఇంట్లో అందరూ మూగవాడేమో అనుకుని మందులూ మాకులూ కూడా ఇప్పించారు. ఆ ఎఫెక్టు ఉంటుందనుకుంటాను. ఆ ఇన్ఫీరియార్టీ కాంప్లెక్సు, అందరిలోకీ తక్కువ అన్న భావన… ప్రపంచమంటే అయిష్టత ఏర్పడింది. జీవించాలంటే నా కోసం నాకు ఒక ప్రపంచం అవసరమనుకున్నాను. నేను ఎన్నుకున్న ప్రపంచం బొమ్మలేయటం. పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, స్కూలంటే నరకం, రెండు మూడు తరగతుల దాకా స్కూలుకి కాళ్లూ చేతులూ పట్టుకుని తీసుకువెళ్లేవారు. ఒక్క ఆటలంటే మాత్రం పిచ్చిగా ఆడుకునేవాణ్ణి. మిగిలిన సమయమంతా బొమ్మలు.

అది ఇక నిర్విరామంగా కొనసాగుతూ వచ్చిందా?

Untitled-2ఎనిమిదో తరగతిలో అనంతపూర్‍కి వచ్చాం. ఆ తర్వాత కూడా పదిహేను పదహారేళ్ల వరకూ అలాగే కొనసాగింది. ఆయిల్ కలర్సూ, ఎనామిల్ కలర్సూ కూడా తెప్పించుకుని వేసేవాణ్ణి. తొమ్మిదో తరగతిలో ‘యువ’ పత్రికలో వచ్చిన వడ్డాది పాపయ్య బొమ్మ ఒకటి వేయటం గుర్తుంది. ఏది అసలో ఏది నకలో ఎవరూ తేల్చలేనట్టుగా వచ్చింది.

బొమ్మలు ఎప్పుడు ఆపేశానంటే, పదిహేడేళ్ల వయస్సులో నాకు ఇంకొక ఆల్టర్నేటివ్ దొరికింది జీవితంలో. అది జిడ్డు కృష్ణమూర్తి. అంతకుముందున్నదీ నాకు బొమ్మల మీద ప్రేమ కాదు. జీవించటానికి అవసరం. అవి వేస్తుంటే నాకు ఏం తెలియదు. ఈ ఆలోచనలూ, అవకతవకల మనస్సూ అదంతా కూడా పనిలో పడిపోతే ఇక ఉండదు కదా. పని అనేది ఎంత అద్భుతమైనదో! అందుకే వేశాను.

జిడ్డుకృష్ణమూర్తి ప్రభావం ఏమిటి?

ఎప్పుడైతే జిడ్డు కృష్ణమూర్తి పరిచయమయ్యాడో అప్పుడు కాస్త ఓదార్పు వచ్చింది జీవితానికి. ఈ కన్ఫ్యూజనూ ఈ కాంట్రడిక్షన్సు ఇవన్నీ ఉన్నవే ప్రపంచంలో అని కన్ఫర్మ్ చేశారు కృష్ణమూర్తి. అంటే మనముండే ప్రపంచం వేరు కదా, అందులో నైతికమూ అనైతికమూ ఈ ఘర్షణలు జరుగుతుంటాయి లోపల. ఆ అన్నీ పని చేసి డిస్టర్బ్డ్ గా ఉండేది మైండంతా. ఆయన్ని చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత, నేనొక్కణ్ణే కాదూ ప్రపంచం అంతా ఇలానే ఉంది అని అర్థమైంది. ఆ తర్వాత ఒక రేంజ్ లో కొంత ఓదార్పు. ఇక ఆ తర్వాత బొమ్మలేయటం పూర్తిగా మానేశాను. పదిహేడేళ్ల దాగా పగలూరాత్రీ వేసినవాణ్ణి ఇక మళ్లీ ముట్టుకోలేదు.

మరి చదువు?

డిగ్రీ మధ్యలోనే మానేశాను. అంతకుముందే నేను రిషివాలీ స్కూల్లో talks కి వెళ్లేవాణ్ణి. ఒకసారి అక్కడ బొమ్మల ఎగ్జిబిషన్ కూడా పెట్టాను. అది చూసి అక్కడ ప్రిన్సిపల్ మీరు ఎప్పుడైనా సరే వచ్చి పిల్లలకు చెప్పవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. బియస్సీ రెండో సంవత్సరంలో పరీక్షలకు ముందు ఆ ఆఫర్ గుర్తొచ్చింది. పరీక్షలు రాయకుండా ఉండటానికి అదొక దారి అనిపించింది. ఇంట్లో ఒక ఉత్తరం రాసి పెట్టేసి రిషి స్కూల్ కి వెళ్లిపోయాను. అక్కడ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఏడాదిన్నర పని చేశాను. తర్వాత స్థిమితం లేక అక్కణ్ణించీ వచ్చేశాను.

Untitled-1తర్వాత మా స్నేహితులు ముగ్గుర్ని తీసుకుని ఢిల్లీ వెళ్లిపోయాను. “హరిద్వార్ పోదాము, అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచు కొండలూ అవీ వుంటాయి, ఆశ్రమాల్లో మంచి భోజనం దొరుకుతుందీ, జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం పదండి” అని వాళ్లని ఇన్‌ఫ్లుయెన్సు చేసి తీసుకుపోయాను. మా డబ్బులు టికెట్లకు మాత్రం సరిపోతాయి. హరిద్వార్ దాకా పోలేకపోయాం. ఆగ్రా వరకూ వెళ్లి అక్కణ్ణించి ఢిల్లీకి నడుచుకుంటూ వెళ్లిపోయాం. అక్కడ ఒక బాటిక్ సెక్షన్లో కొన్నాళ్లు పని చేశాను. (అంటే మైనంతో బట్ట మీద బొమ్మలు వేస్తారు.) ఒక నెల పాటు గడిపాం. రోజుకి పది రూపాయలిచ్చేవారు. వెళ్లిపోయేటప్పుడు చార్జీలకి డబ్బులవీ వాళ్లే ఇచ్చారు.

తర్వాత అక్కడైన పరిచయాలతో రెండోసారి నేను ఒక్కణ్ణీ వెళ్లి ఏడాదిన్నర ఉన్నాను. ఈసారి మా నాన్న డబ్బులిచ్చాడు. పద్దెనిమిది వందలిచ్చి ఏమన్నా చేయరా అన్నాడు. కానీ ఈ సారి డబ్బులున్నాయి కదా. నేను అట్టర్‌ఫ్లాపు. నా ఇష్టప్రకారం బొమ్మలు వేస్తానంటే అక్కడేం నడవలేదు. ఒక్కటి కూడా అమ్ముడు పోలేదు. మా ఫ్రెండ్ ఇంట్లో కొన్నాళ్లు ఇబ్బంది పడి మళ్లీ వచ్చేశాను. ఆ తర్వాత ఒక ఆర్నెల్లు మద్రాసులో పత్రికల్లో గానీ, సినిమా ఫీల్డులో గాని ఏమన్నా పని దొరుకుతుందేమో అని తిరిగాను.

చివరికి ఇక మా అనంతపూర్ తిరిగి వచ్చి ఒక సైన్‌బోర్డు షాపు పెట్టుకున్నాను. అది పెట్టిన తర్వాత రాసిందల్లా ‘రమణ ఆర్ట్స్’ అని నా ఒక్క సైన్‌బోర్డు మాత్రమే. మిగతా అంతా ఫ్రెండ్సూ పేకాట ఫిలాసఫీ డిస్కషన్సూ.. ఇది తప్ప అక్కడ చేసిన పనేం లేదు.

హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు?

illustration udayamఅప్పటికే ఇంట్లో ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంది. మేం ఎనిమిది మంది పిల్లలం. మా నాన్న ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాడు. బిజినెస్ మంచిదే, కానీ ఆయనకి జాగ్రత్తా భయం లేకపోవటం వల్ల నష్టం వచ్చింది. అప్పుడు ఉద్యోగానికని అప్లయి చేశాను. సమాధానం రాలేదు గానీ, నేను హైదరాబాద్ వచ్చేశాను. 1980లో, అప్పటికి 24 యేళ్లుంటాయేమో. ఆంధ్రభూమి ఆఫీసుకి వెళ్తే అప్పటికే ఆ ప్లేసులో ఇంకో ఆర్టిస్టును ఎంపిక చేసేసుకున్నారు. ఒక స్నేహితుని ద్వారా ఇక్కడ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌‌లో ఒక ప్రింటింగ్ ప్రెస్సులో చేరాను. ఏడాది సినిమా పోస్టర్లకి పేర్లవీ రాయాలి. ఒక ఏడాది చేశాను. అప్పుడు ‘ఈనాడు’లో ఆర్టిస్టులు కావాలని ప్రకటన వచ్చింది. బొమ్మలేసి పంపాను. చలసాని ప్రసాదరావు ఇంటర్వ్యూ చేశారు. అక్కడే నాలుగేళ్లు పని చేశాను. తర్వాత కొన్నాళ్లు తార అడ్వర్టయిజింగ్ అసోసియేట్స్‌లోను, స్రవంతి, పల్లకీ పత్రికల్లోను పని చేశాను.

తర్వాత ‘ఉదయం’ వీక్లీలో చేరాను. అక్కడ కాస్త స్వేచ్ఛగా పని చేసే అవకాశం లభించింది. నా మీద వడ్డాది పాపయ్య ప్రభావం ఎక్కువ. ఆయన బొమ్మలంటే ప్రాణం. బాపు అంటే అంత పెద్ద ఆసక్తి ఉండేది కాదు. ఎన్టీ రామారావు అభిమానులకి అక్కినేని ఎట్ల నచ్చడో అట్ల నాకు బాపు అంత నచ్చేవాడు కాదు. కానీ ఈనాడులో పనిచేసేటప్పుడు (‘విపుల’, ‘చతుర’ల్లో) బొమ్మలు వేయాలంటే అట్లే లైన్ డ్రాయింగ్సు వేయాల్సొచ్చేది. అక్కడ మల్టీకలర్ తక్కువ. సింగిల్ కలర్, లేదా డబల్ కలర్ ఉంటుంది. లైన్ డ్రాయింగ్ వేయక తప్పదు. అది నాకు ఇష్టం లేదు, అంత ప్రాక్టీసు కూడా లేదు. అందుకని ఆ విషయంలో నేను గోపీని ఫాలో అయ్యేవాణ్ణి. నా వరకూ గోపీ లైన్ డ్రాయింగ్స్ అల్టిమేట్, బాపు కన్నా కూడా. ఆయన బొమ్మల్ని అలా దించేసేవాణ్ణి. ‘ఉదయం’లోకి వచ్చాకా నాకు ఏ హద్దులూ లేవు. నాకు నచ్చినట్టు వాటరుకలర్స్‌తో వాష్ వర్కు వేసేవాణ్ణి. చాలామంది మెచ్చుకున్నారు దాన్ని.

పెయింటింగ్ మీదకు ఆసక్తి ఎప్పుడూ మళ్ల లేదా?

ఈ బొమ్మలేస్తే ఇమ్మీడియట్ డబ్బులొస్తాయి, ఇప్పుడు కూడా కవరుపేజీ లేస్తే డబ్బులొస్తాయి, కానీ పెయింటింగ్స్ వేస్తే డబ్బులెవరిస్తారు నాకు. ఆ పెయింటింగు లేయాలీ, తర్వాత మార్కెట్లో క్లిక్ కావాలీ, ఇలా ఏవో ఉంటాయి. ఇమ్మీడియట్‌గా ఐతే డబ్బుల్రావు. నేను డబ్బులు ఇమ్మీడియెట్ అవసరంగానే బతికాను జీవితమంతా. డబ్బులు ఎక్కువొచ్చిన రోజుల్లో కూడా జాగ్రత్తయితే లేదు. చాలామంది ఆర్టిస్టుల్లాగే. ఆర్టిస్టులు కాదు, చేతిపనివాళ్ల లాగే. పని ఆనందం ఆ రెండూ ముఖ్యం వాళ్లకి. డబ్బనేది మూడోది. అదే లక్షణంతోనే డబ్బులు ఎక్కువొచ్చిన రోజుల్లో కూడా దాన్ని పెద్దగా పట్టించుకొనేది లేదు, ముందు ఆ డబ్బుల్ని ఆనందంగా మార్చుకోవాలి, దాచుకుంటే ఏమొస్తుంది. నాన్సెస్ అది. ఈ ఆటిట్యూడ్ వల్ల డబ్బులు ఎప్పుడూ అవసరముండే పరిస్థితిలోనే బతికాను. ఇప్పుడు 58 యేళ్లొచ్చినా కూడా ‘ఈ నెల యెట్లా’ అన్నట్టే ఉంటుంది.

సరే, ఉదయంలో ఎన్నాళ్లు చేశారు?

ఐదేళ్లు చేశాను. మూసేయక ముందే వచ్చేశాను. అక్కడ నన్ను అనవసరంగా యూనియన్ ప్రెసిడెంటుగా ఏదో పెట్టారు. అక్కడ ఏదో ఓవరాక్షను చేసి అందర్నీ బండబూతులు తిట్టేసరికి వాళ్లు అసలు ఈ కాంపౌండులోనే నువ్వొద్దు అనేసి విజయవాడకి ట్రాన్స్‌ఫర్ చేసారు. నేను రిజైన్ చేశ్శాను. అప్పట్నించీ మళ్లీ ఉద్యోగంలో చేరలేదు. అదే ఆఖరు ఉద్యోగం. ఇప్పటికి పాతికేళ్లయింది. ఇప్పటి దాకా ఫ్రీలాన్సర్ గానే ఉన్నాను.

ఫ్రీలాన్సర్ అంటే ఏమేం చేశారు?

అన్నీ చేశాను. డిజైన్లూ, కంపెనీ లోగోలు, ఎంబ్లమ్సూ, పేపర్ ఆడ్సూ, కంపెనీస్‌కీ రియలెస్టేట్‌కీ బ్రోచర్సూ… చాలా చేశాను. బహుశా ఇలాంటి ఫ్రీలాన్స్ ఆర్టిస్టుల్లో మొట్టమొదట కంప్యూటర్ కొన్నది నేనే. 1996లో… అప్పుడు కంప్యూటరే రెండు లక్షలయింది. అంత డబ్బు పెట్టినా ఆపిల్ కంప్యూటరు చాలా చిన్న కన్ఫిగరేషన్ ఉన్నదే వచ్చింది. అప్పుడు ఫొటోషాపు ప్రైమరీ వెర్షన్ ఉండేది. అందులోనే త్రిపురనేని శ్రీనివాస్ “హో” అనే పుస్తకం మొత్తం డిజైన్ చేశాను. దానికి చాలా వర్కు చేశాను. అ చిన్న కన్ఫిగరేషన్లో చేయటానికి ఒక నెల పట్టింది.

కవర్‌పేజీ వర్కు ఎప్పట్నించి మొదలుపెట్టారు?

ఉదయంలో ఉన్నప్పుడే మొదలుపెట్టాను. ఈ పాపులర్ రచయితలు యండమూరి, మల్లాది వీళ్ళందరివీ చాలా చేశాను. అంతా మాన్యువలే. స్ప్రేమిషన్ ఉండేది, బొమ్మ అవసరమైతే వేయడం, పేపరు కట్ చేసి అతికించి పెట్టడం… అలా అప్పట్లో చాలా తెలుగు నవల్స్‌కి చేశాను. ఎప్పుడైతే ఆ కమర్షియల్ నవలల సామ్రాజ్యం కూలిపోయిందో, కొంచెం గాప్ తర్వాత ఈ సీరియస్ కథకులు, కవులూ వీళ్లు మొదలయ్యారు. ఆ సామ్రాజ్యం ఉన్నప్పుడు వీళ్లంతా ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు. నాకు సాహిత్యంతో పెద్దగా టచ్ లేదు. సాహిత్యంతో నాకు పరిచయం ఎప్పుడు మొదలైందంటే నా “ఒత్తు థ” కథల పుస్తకం వచ్చాక. మొదటి కథ ‘మేధావిని కరిచిన కుక్క’ అని 1986లో ‘పల్లకి’లో వచ్చింది.

అప్పటి కమర్షియల్ సాహిత్యానికీ, ఇప్పుడు ఈ సీరియస్ సాహిత్యానికి మధ్య కవరుపేజీలు విషయంలో ఎలాంటి బేధం ఉంది?

maa-coverఅంటే, ఒక కమర్షియల్ నవలకు కవరుపేజీ సౌష్టవంగా ఉండాలి. ఎందుకంటే దాని పాఠకులు వేరే, వాళ్లకు కాస్త కమ్యూనికేటివ్‌ గానూ, స్పష్టం గానూ, గాఢంగా ఉండాలి కవరుపేజి. కవిత్వానికి వచ్చేటప్పటికి… కవిత్వమే ఒక ఎక్స్‌పెరిమెంటు కదా. అది అన్ని సౌష్టవాల్నీ డిస్ట్రాయ్ చేసే ఒక ఎక్స్‌పెరిమెంటు. కాబట్టి కవిత్వానికి కవరుపేజీ కూడా ఎక్స్‌పెరిమెంటల్ గానే చేయొచ్చు. దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ లేవనే అనుకోవచ్చు. నేనైతే ఏం పాటించలేదు. కమర్షియల్ వాటికి కొంత పాటించేవాణ్ణి, కంటికి నదురుగా ఉండాలనేసి.

కవరుపేజీ అంటే బాగుండటమూ బాగోకపోవటమూ అనేది ముఖ్యం కాదు నా ఉద్దేశంలో, కొత్తగా ఉండటం, ప్రత్యేకంగా ఉండటం ముఖ్యం. దాన్నే అందం అనాలి నా ఉద్దేశంలో. అందమంటే ఎన్టీఆర్ ముక్కులాగా సావిత్రి కళ్ల లాగా కాదు, అందమంటే కొత్తగా ఉండటం అని నేననుకుంటాను. అదే ఎప్పుడూ అనుసరించాను. ఈ కవిత్వానికీ, సీరియస్ సాహిత్యానికి వేసే కవరుపేజీల విషయంలో పూర్తి స్వేచ్ఛ తీసుకుంటాను. పూర్తి స్వేచ్ఛ. ఒకరకంగా చెప్పాలి అంటే ఆట అనుకోండి. ఆడుకున్నా!

ఇప్పుడు చేసే పని అంతా జీవిక మాత్రమే అంటున్నారుగా. మరి వాటితోనే మీలోని ఆర్టిస్టు సంతృప్తి చెందుతున్నాడా?

ఊ.. చాలా! అంతా జీవికే! జీవితం కోసం ఏం చేయటం లేదు నేను. జీవితం అంటే… ఇది చేయకపోతే నేనుండలేను, నాకు చాలా అవసరం ఇదీ… అన్నది లేనే లేదు. అసలు నాకే గనుక లాటరీ తగిలినట్టయితే నేను బొమ్మలు వేయను, కవరుపేజీలేయను, ఏం చేయను. ఊరికే అట్లా తిరుగుతూ తాగుతూ కూర్చుంటా. ఏం అవసరం లేదు. “ఇదిగో అతనే కవర్ పేజీలేసే ఆర్టిస్టు చూడు” అని చప్పట్లు కొట్టి, “చూడు చూడు అతనే!” అనీ… అంతా నాన్సెన్సు. చెత్త.

బహుశా “వేయాలీ”, “లేదంటే ఉండలేను” అన్న కంపల్షన్ మీరన్నట్టు ఆ పదిహేడేళ్ల వయసులో జిడ్డుకృష్ణమూర్తి అప్పుడే పోయిందేమో.

పోయింది కదా! అసలు ఆర్టే అవసరం లేకుండా పోయింది. ఇక అప్పణ్ణించీ జీవిక. అంతే. జీవిక కాకుండా నేను చేసిన పనులేమన్న ఉంటే కవిత్వాలు, అప్పుడప్పుడూ కథలు రాయటం. అవి రెండే ఏదో నాకోసం నాకు బాగుంటుందని రాయటం.

బొమ్మల మీద పోయిన ఆసక్తి రచన మీద ఎందుకు పోలేదు?

bandhana-coverఈ విషయం గురించి నేనూ ఎప్పుడూ ఆలోచించలేదు. “రచన జీవికకు ఏం ఒరగబెట్టకపోయినా రాస్తున్నారు, మరి ఆ పని బొమ్మల విషయంలో ఎందుకు చేయటం లేదూ…” అన్నది కదా మీ ప్రశ్న? బహుశా నేనేమనుకుంటున్నా అంటే, బొమ్మలు వేసీ వేసీ ఆనందం పోయిందేమో. ఈ పత్రికల్లో పన్చేసి పన్చేసి రోజుకి నాలుగైదు బొమ్మలు అనివార్యంగా వేయాల్సి రావటం వల్ల బొమ్మల మీద ఆసక్తి పోయి ఉంటుందనుకుంటాను.

అసలు ఆ పదిహేడేళ్ల వయస్సులో కృష్ణమూర్తిని చదువుకున్నప్పుడు బొమ్మల మీద ఆసక్తి ఎందుకు పోయిందంటే, అప్పుడు నాకు ఆల్టర్నేటివ్ దొరికింది. ఈ జీవిక అనేది ఎప్పుడొచ్చిందంటే నాకు పెళ్లయినాక వచ్చింది. ఇంకొకళ్లకి మనం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినపుడు అది సీరియస్ అవుతుంది. మన వరకే అయితే సరే ఇప్పుడు తినపోతే చస్తామా ఎల్లుండి తిందాంలే అనుకోవచ్చు గానీ, పెళ్లాన్నీ పిల్లల్నీ మీరు తినొద్దు ఇప్పుడు డబ్బుల్లేవూ అని చెప్పటానికి కుదరదు కదా. ఇక అప్పణ్ణించీ జీవిక కోసమే వేశా బొమ్మలన్నీ. అంతే తప్పించి వాటి మీద పాసినేషనూ, గ్లామరూ ఏవీ లేవు. భ్రమలు లేవు.

కొన్ని బిట్టర్ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి. ఒక కవి తన స్నేహితునితో వచ్చి నన్ను అతనికి పరిచయం చేస్తూ “ఇతను రమణజీవి అని పెద్ద ఆర్టిస్ట్ అండి, ఆంధ్రదేశంలోనే ఇతణ్ణి కొట్టేవాడు లేడూ” అని పరిచయం చేశాడు. నేను… “లేదండీ అట్లా అనొద్దూ. నాకు తెలుసు. మీకు తెలీదు. ఎందుకంటే మీది ఈ లైన్ కాదు. మీరు కవి. మీకు ఆర్ట్ గురించి తెలియాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు నాకంటే బాగా చేసేవాళ్లు. బాగా డిజైన్ చేసేవాళ్లున్నారు. బాగా వేసే వాళ్లున్నారు.” అన్నాను. ఆయన ఫీలయ్యాడు. “మిమ్మల్ని పొగిడితే నాకేం వస్తుందండీ. నాకేం అవసరం?” అన్నాడు. నేను చేతులుపట్టుకు చెప్పాల్సొచ్చింది, “మిమ్మల్ని హర్ట్ చేయటానిక్కాదు. నాకే లోపల గిల్టీగా అనిపించింది. ఒక అబద్ధం. దాన్ని తట్టుకోలేకపోయాన్నేను. అర్థం చేసుకోండి, అని చెప్పాను.”

కాబట్టి… దీని మీద నాకు గౌరవమేం లేదండి. కీర్తి, ప్రతిష్టలు, అప్రిసియేషన్స్… అన్నీ. అంటే అప్రిసియేషన్ బాగుంటుంది. కానీ నిజంగా అప్రిసియేషన్ అయి ఉండాలి. అలాగాక ఒక ఉద్దేశం మనసులో ఉంచుకుని అనేది ఎప్పుడూ బాగుండదు. ముక్కూ మొహం తెలీని వాళ్లు ఫోన్ చేసి “ఈ కథ బాగుంది, కవరుపేజి బాగుందీ” అన్నా బాగుంటుంది.

మీ దృష్టిలో కవరుపేజీకి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఏమిటి?

ఇంకొక పుస్తకం గుర్తుకురాకూడదు. ఇదొక్కటే… కింద ఉపలక్షణాలెన్నున్నా, ప్రధానలక్షణం ఇదొక్కటే. బాలేకపోయినా ఫర్లేదు, కానీ అది unique గా ఉండాలి. అది ముఖం… పుస్తకానికి. అది అందవికారంగా ఐనా ఉండొచ్చు గానీ, ఒకరిలాగా ఉండకూడదు.

కవరుడిజైన్‌కు ప్రేరణ ఎలా కలుగుతుంది?

పుస్తకం ఇవ్వగానే అది మొత్తం చదివినా చదవకపోయినా దాని సారాంశం పట్ల ఒక అవగాహన ఐతే ఉంటుంది. ఇక అక్కణ్ణించి మైండ్ వర్క్ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు కూచుని ఒక ఆటలాగా గీసేస్తా. అదో పండగ. అంతే. పని కాదు, పనిలో ఉండే బరువు లేదు, కానీ ఆనందం ఉంటుంది. నేనైతే రియలిస్టిక్ ఆర్ట్ చేయటం లేదు. ఫ్రీ స్ట్రోక్స్‌తో చేస్తుంటా.

ఇల్లస్ట్రేటరుగా చేసినపుడు రియలిస్టిక్ వర్కు చేశారుగా, అది పూర్తిగా ఎందుకు వదిలేశారు? కంప్లీట్ ఆబ్‌స్ట్రాక్ట్‌గా—

narendra-coverఅబ్‌స్ట్రాక్ట్ అనలేను. స్టయిలైజ్డ్, అనొచ్చు. అది ఎందుకొచ్చిందంటే, లెక్కా పక్కా ఉండకూడనుకోవటం వల్ల. ముక్కు వేశాం, దానికి ఇంత దూరంలో కన్ను ఉండాలి… ఈ రియలిస్టిక్ కొలతలు కాదనుకోవటం వల్ల. ఎందుకంటే అందులో అంత ఆనందం ఉండదు. ఆ కొలతలు వేసీ వేసీ విరక్తి పుట్టింది. ఉదయంలో వేల బొమ్మలు వేశా. ఆ కొలతలు పక్కకు తీసేయటం వల్ల అది స్టయిలైజ్ అయింది, అంతే. ఆర్ట్ మైనస్ కొలత ఈజ్ స్టయిలైజేషన్. జనానిక్కూడా అది నచ్చినట్టుంది. లేదంటే మళ్లీ నా దగ్గరకు రారు కదా. అది నా అదృష్టం. నాకు ఇష్టమైన వర్కు జనానికి నచ్చటం. వాడంటాడు కదా సినిమాలో, జనం కోరేది మనం చేయటమా, మనం చేసేది జనం చూడటమా అని. అట్లాగ.

ఒకప్పుడు బాపు, మోహన్, బాలి, చంద్ర లాంటి ఆర్టిస్టుల బొమ్మలు మన కవరుపేజీల్ని అలంకరించాయి. ఇప్పుడు అలాంటి illustration based కవరుపేజీలు ఎందుకు తగ్గిపోయాయి?

అంటే, ఉన్నాయి గానీ తక్కువున్నాయి. ఎందుకంటే, ఇప్పుడు కంప్యూటర్లో రంగులు వేయటం చాలా సులువు, మార్చటం కూడా చాలా సులువు. ఇంతకుముందు చేత్తో వేసే రోజుల్లో రంగులు మార్చాలంటే పేపరు పక్కన పెట్టి మళ్లా వేయాల్సిందే. కాబట్టి ఈ సౌలభ్యం వల్ల కంప్యూటర్లో మనకు నచ్చేంతవరకూ సులువుగా మార్చుకుంటూ పోవచ్చు. ఆ సౌలభ్యం వల్ల నా వరకూ నేను ఇల్లస్ట్రేషన్స్ లేని కవరుపేజీలు ఎక్కువ వేశాను.

కవరుపేజీ వేయటానికి కష్టపడిన పుస్తకాలు?

palapitta-coverకష్టపడిన పుస్తకాలున్నాయి. అవేమిటంటే, రచయిత బాగా ఇంటర్‌ఫియర్ అయిన పుస్తకాలు. అయితే చాలామంది రచయితలు నాకు free hand ఇచ్చారు. ఇలాగే వేయాలి అన్నవారు తక్కువే. బహుశా నేను కూడా కథలూ కవిత్వం రాసాను కాబట్టేమో తెలీదు, నాకే వదిలేస్తారు. వట్టి ఆర్టిస్టునైతే దగ్గర కూర్చుని చెప్పటానికి ప్రయత్నించేవారేమో. నేను అవి కూడా చేశాను కాబట్టి, ఇతను ఈ మూడింటినీ దృష్టిలో పెట్టుకుని చేస్తాడు అనే గుడ్డినమ్మకం ఏదో ఉన్నట్టుంది. ఎవరూ వేలుపెట్టరు.

మీరు ఇష్టపడిన మీ కవరుపేజీలు?

“అస్తిత్వానికి అటూ ఇటూ” – మధురాంతకం నరేంద్ర; “ఇతర” – శ్రీకాంత్; “ఒంటరి దీపస్తంభం” – అని ఒక కవితల పుస్తకం; “బా” – రహమతుల్లా… ఇవి వెంటనే గుర్తొచ్చేవి.

ప్రపంచస్థాయిలో వస్తున్న కవరుపేజీలకీ మన కవరుపేజీలకీ తేడా ఏమిటి?

వాళ్లకు ఎక్స్‌పెరిమెంటేషన్‌కి ఎక్కువ అవకాశం ఉంది. అంటే సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంటేషన్ కాదు, ఫిజికల్ ఎక్స్‌పెరిమెంటేషన్. అంటే డబ్బుపెట్టి ఫోటోలు కొనటం, శ్రమపడి తీయటం ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరూ ఫొటో కొనటానికి కూడా ఇష్టపడరు. ఒక్కోసారి ఫోటో ఆరేడు వేలు ఉంటుంది. దానికి అంత రెడీగా ఉండరు. పైగా అంత సీను కూడా లేదు మన తెలుగు సాహిత్యానికి. డబ్బులొస్తే డబ్బులుపెట్టడానికి ఎవరైనా సిద్ధపడతారు గానీ…  ఎట్లాగూ డబ్బులు పోగొట్టుకోవటానికి రెడీ అయే ఏ కవి ఐనా కవిత్వం వేసేది… అందులో ఇంకా డబ్బులు పోగొట్టుకోవాలంటే పాపం బాధే కదా. కాబట్టి కవరుపేజీల మీద అంత సీరియస్ ఎక్స్‌పెరిమెంటేషన్ చేసే పరిస్థితి లేదు తెలుగు సాహిత్యంలో.

తెలుగు కవరుపేజీలో మున్ముందు ఏం మార్పులు చూడబోవచ్చు…

మార్పులంటే చెప్పలేం. నేను ఇంకొన్నాళ్లు వేస్తాను. ఈలోగా కొత్త చూపుతో కొత్త స్ట్రోక్స్‌తో అద్భుతమైన వాళ్లు వస్తారు. అది మనం ఊహించలేం ఇప్పుడు. వాళ్లు వచ్చినప్పుడు మీరు తెలుసుకోగలరు గానీ, ముందు ఊహించలేరు.

కవరుపేజీలకి ఫొటోషాపు వల్ల జరిగిన మంచీ, చెడూ?

మంచి అంటే నాణ్యత పెరిగింది బాగా. చెడు ఏంటంటే, ఈ ఫొటోషాపునీ ఇట్లాంటి టెక్నాలజీలని అందుకోలేకపోయిన ఆర్టిస్టులకి తిండి లేకుండాపోయింది.

డిజైను విషయంలో మీ స్టయిల్ అని మీరనుకునే కొన్ని అంశాలు చెప్పండి?

palamneru--coverఇప్పుడు శీలా వీర్రాజు ఉన్నారనుకోండి, ఆయనకొక స్టయిలు ఉంది, ఆయన కొన్ని వేల కవరుపేజీలు వేశారు, కవిత్వం అంటే శీలావీర్రాజు వేయాల్సిందే. అలా వేసేవాళ్లు. చూడగానే ఆయన కవరుపేజీ అని తెలిసిపోతుంది. అలా ఒక శైలి మెయింటైన్ చేసేవారు. అక్షరాలు ఒక ప్లస్‌పాయింటు. ఆయన ఒక సొంత శైలిలో అక్షరాలు రాస్తాడు. నా విషయంలో నాదంటూ ఒక స్టయిల్ ఏమీ లేదు. ఈ టెక్నాలజీని వాడుకుంటూ వేయటం వల్ల, నేను ఒక ఆరేడు రకాలుగా వేస్తాను. ప్లస్, నాదంటూ ఒక అక్షరాలు డెవలప్ చేసుకోలేదు నేను. శీలావీర్రాజు అక్షరం, మోహన్ అక్షరం, అన్వర్ అక్షరం… ఇట్లా ఉన్నాయి కదా. అది నాకు లేదు. మొత్తం ఫాంటే వాడతాను. కాబట్టి నా వర్కేమీ అంత ఇండివిడ్యువల్ శైలితో ఉండదు. ఎట్ల బుద్ధి పుడితే అట్లా వేస్తూ పోతుంటాను.

ఇక్కడ ఆర్టిస్టుల్లో మీకు ఇష్టమైనవాళ్లు.

పాతవాళ్లలో నాకు వడ్డాది పాపయ్య, గోపి, ఎస్. ఎమ్. పండిట్ అని కేలెండర్లు వేస్తారు.. ఆయనా ఇష్టం.

ప్రపంచ ఆర్టిస్టుల్లో ఎవరు ఇష్టం?

Paul Klee, Picasso, Francis Bacon, Basquiat… వీళ్లు ఇష్టం.

ఇండియన్ పెయింటర్లు?

తాయెబ్ మెహతా, డిసౌజా, అర్పితా సింగ్

అబ్‌స్ట్రాక్టు శైలిపై మీ అభిప్రాయం…

ఈ జవాబుని ఆర్ట్‌ పరంగా చెప్పడం కన్నా కొంత కవిత్వాన్ని కూడా కలుపుకోవటం అవసరం. బొమ్మ అనేది ఎట్లయినా ఉండొచ్చు. కానీ ఒక పదాలతో తయారు చేసిన కవిత్వానికి దానికంత స్వేచ్ఛ లేదు. కనీసం ఆ పదాల్నయినా వాడాలిగా. కుక్క అంటే “కు” అని రాసి వదిలేయలేం కదా. పూర్తిగా రాయాల్సిందే. కాబట్టి కవిత్వానికి కొన్ని రూల్సూ రెగ్యులేషన్సూ ఉన్నాయి. కాబట్టి ఈ అబ్‍స్ట్రాక్టు అనేదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని నేననుకుంటానంటే… ఇప్పుడు ఒక బొమ్మలో నది, కొండ, ఆకాశం ఉన్నాయి. చూసి “అబ్బో చాలా బాగుంది, కొండ కొండలాగే వేశాడు, ఆ నది చూడు నీళ్లు ఎలా మెరుస్తున్నాయో, అచ్చం నిజంగా చూస్తున్నట్టే ఉంది” అనొచ్చు. అది తప్పకుండా ఒక క్రాఫ్టు. అచ్చంగా కాపీ చేయటమనేది అది చాలా వింతగా ఆనందంగా అనిపిస్తుంది మనిషికి. ఒక మనిషి ఈ పని చేశాడే అని. “సేమ్ దించాడబ్బా” అన్నదే ఆనందం, అదే అచీవ్మెంటు రియలిస్టిక్ ఆర్టుకి.

కానీ అబ్‌స్ట్రాక్టు దగ్గరకు వచ్చేసరికి, కంటికి అతీతంగా, మనసులో కలిగే ఇంప్రెషన్ ముఖ్యం (మనసు అనేది అంత కాంక్రీటుగా ఉండదు; ఆ మనసు కదులుతూంటుంది, కరుగుతూంటుంది, నిలకడ ఉండదు). అంటే అలా ఒక భౌతికమైనది మానసికమైనపుడు కలిగే ఇంప్రెషన్సే అబ్‌స్ట్రాక్టు అని నేననుకుంటా.  ఇప్పుడు ఆ నది, కొండ, ఆకాశాన్నే అబ్‌స్ట్రాక్టుగా వేసేస్తే… పైనొక నీలం, కిందొక నీలం, మధ్యలో బ్రౌన్ వచ్చేస్తుంది.

కళ పట్ల మీ దృక్పథం…?

ఆర్ట్ అంటే నేను నెర్వస్ వీక్నెస్ అనుకుంటా. బొమ్మలనే కాదు, కవిత్వం కథా ఇవన్నీ కూడా. సీరియస్ ఆర్టిస్టుల గురించి నేను చెప్పేది. ఫేక్ వాళ్ల గురించి కాదు. వాళ్ల నరాలు చాలా బలంగా ఉంటాయి. రియల్ ఆర్టిస్టు అంటే నెర్వస్ వీక్నెస్ ఉంటుందీ అని నేననుకుంటా. దాని వల్ల చాలా ఇబ్బంది పడతాడు. దాని వల్ల వాడు ఇంట్రావర్టు అవుతాడు. నాకూ ఉంది. అదెంత క్రూరమైందో నేను చాలా యేళ్ల క్రితమే గ్రహించా. దాన్నుంచి బయటపడటానికి ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఆర్ట్ పోయినా ఫర్లేదు. దాని వల్ల అతిగా ఆలోచించటమూ, అతిగా ఫీలయిపోవటమూ, భయపడటమూ, ఆ ఛండాలంలోనే బతకటం… బయటకు రాలేక. ఇంట్రావర్ట్స్‌కి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎక్కడకు పోయినా మళ్లీ తీసుకువచ్చి అక్కడ పడేస్తుంది. అదేదైనా మంచి దృశ్యం చూస్తున్నా కూడా టపక్‌మని వాణ్ని తీసుకెళ్లి మళ్లీ మురికిగుంటలో వేసేస్తుంది. దాని వల్ల గొప్ప ఆర్ట్ పుట్టొచ్చు, గొప్ప కథ రాయొచ్చు గానీ…  వాడిలో వాడికి అది నరకమే. అది జైల్లో బతకటం. చాలా ఘోరం. ఎదుటి మనిషిని చూడలేడు. ఊరికే రాస్తాడు గానీ.. ఈ పాత్రలూ ఈ సన్నివేశాలూ అవీ ఇవీ అని… ఏవి రాసినా అవి బాగానే అనిపిస్తాయి. “కారెక్టరయిజేషను దెబ్బతినలేదూ” అని ఊరికూరికే అంటుంటారు కదా… ఉట్టి మాటలవన్నీ. ఆ పాత్ర ఆ మాట కాకుండా ఇంకో మాట మాట్లాడినా కూడా అది బాగానే ఉంటుంది. ఆర్టిస్టుకి మాత్రం నరకం. ఆర్ట్ అంటే శాపమే. శాపగ్రస్తులే దాన్ని ఆశ్రయిస్తారు. ఆరోగ్యంగా ఉన్నవాడికి  ఆర్ట్‌తో పనేముంది?

మరి కొందరు చాలా peaceful గా, boisterous గా, హుందాగా కనిపిస్తారు కదా…?

నేను దానికి జవాబు చెప్పలేను. ఒకటి వాళ్లు ఆర్టిస్టులు కాకుండానన్నా పోవాలి, లేదంటే వాళ్లు హుందాగా కనిపించేది నటనన్నా అయుండాలి. లేదా నా స్టేట్మెంటు తప్పయినా కావాలి. కానీ ఇది గాఢంగా నమ్ముతున్నా. ఇంతవరకూ తప్పని ఋజువు కూడా కాలేదు నాకు.

అంటే మిగతావాళ్లంతా ఆరోగ్యవంతులని కాదు. ఎజి ఆఫీసులో ఉద్యోగాలు చేసుకుంటూ, సాయంత్రం అయిదుగంటలకు ఇంటికి వెళ్లి, పద్ధతిగా బతుకుతుంటారుగా… వాళ్లందరూ ఆరోగ్యవంతులని కాదు నా ఉద్దేశం. కానీ వీళ్లు పడే సఫరింగ్ మాత్రం వాళ్లకు ఉండదు. ఉట్టినే ఆర్ట్ గీయటం కోసం కథ రాయటం కోసం కాదు ఆ సఫరింగు. సఫరింగ్ ఇన్ లైఫ్. సంబంధాల్లో, మనుషుల్లో. అర్థం కారు మనుషులు ఆర్టిస్టులకి. ఏదో రాస్తాడు గానీ తెలిసినవాడిలాగా… వాడి మనస్తత్వం ఇదీ, ఆమె ఇట్లాంటిది, ఇట్లా నవ్విందీ, దీని ఉద్దేశం ఇదీ… అని, వాడికేమీ తెలియదు. ఎదుటిమనిషి ఏమనుకుంటున్నాడో తెలీదు, ఏం ఆలోచిస్తున్నాడో తెలీదు. మామూలు మనుషులకు తెలుసు, వాడేం ఆలోచిస్తున్నాడో, ఏం చెప్తే సంతోషిస్తాడో అనేది. కానీ ఆర్టిస్టులకు తెలియదు. వాడి ధ్యాసే వాడికి. లోపల్లోపలే తిరుగుతుంటాడు. ఆర్టిస్టులెవరూ జీవితంలో మానవసంబంధాల్లో సక్సెస్‌ఫుల్ కాదు.

నాకు ఇదే ఇష్టం. ఆర్టూ, కవిత్వం, కథలకంటే కూడా… ఈ జీవితం గురించి ఆలోచించటం, మాట్లాడటం… ఇదే ఇష్టం నాకు. ఏంటిది, ఏం చేయాలి దీన్ని, చచ్చేలోపులో ఏం చేయటానికి లేదా, మార్గం లేదా, ఏం ఆల్టర్ చేయటానికి లేదా…

మరి జిడ్డు కృష్ణమూర్తి మీకు ఏ జవాబూ ఇవ్వలేదా?

ఏం లేదు. ఎవరూ ఏమీ ఇవ్వరు. నాలుగైదేళ్లు జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంలో ఉన్నాను. బానే ఉన్నాను. కానీ it leads no where. ఎక్కడికీ తీసుకుపోదు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, మే and tagged , , , , , , .

9 Comments

 1. రామయ్య గారూ … అప్పారావు అనేవాడికి అప్పు పుట్టకుండా చేసారు ముళ్ళపూడి వెంకట రమణ గారు.
  అంతర్ముఖుడయిన త్రిపురను అంతర్జాలం చుట్టూ తిప్పారు తం. మారి . రామయ్య గారు .
  గొరుసన్నను చిన వాల్తేరో , ఎర్రగడ్డో పంపే వరకు నిద్ర పోరేమో మీరు !

 2. “ బాపు అంటే అంత పెద్ద ఆసక్తి ఉండేది కాదు “ అని రమణజీవి గారు అన్న మాట ఆంధ్ర దేశంలోని కోట్లాది బాపూ భక్తులలో ఒకడినైన నన్నూ నిరాశపర్చింది. లైన్ డ్రాయింగ్స్ కి అల్టిమేట్ బాపునే.

  “ రమణజీవి మెహర్ ను వెతుక్కున్న వైనం “ అంటూ తొందర పడి నేను రాసిన వాక్యాలు, నేను చెప్పాలనుకున్న భావాన్ని వక్రీకరించాయి. క్షమించాలి. “రంగు వెలిసిన రాజు గారి మేడ“ కధ ప్రచురింపబడటానికి ముందు నెల రోజులకు పైగా తెగ పొగుడుతూ ( చలం రాయలేదు, త్రిపుర స్టైల్ లో లేదు అంటూ పొగుడుతూ ) మెహర్ గారిని, కధను పరిచయం చెయ్యకుండా రమణజీవి ఊరించాడు. ఆ ఎదురుచూపులకు ప్రతిఫలంగా కళ్లు మిరుమిట్లు గొరిపాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే.

  వ్యక్తిగా రమణజీవి ఎంతో మంచోడు అని తనని బాగా ఎరిగున్న పెద్దలు త్రిపుర, రామడుగు రాధాకృష్ణమూర్తి, భమిడిపాటి జగన్నాథరావు గార్ల ద్వారా వినే భాగ్యం కలిగింది నాకు. చిత్రకారుడు, డిజైనరూ కన్నా కవిగా; అంతకన్నా తాత్వికతతో నిండిన గొప్ప కధా రచయితగా; అంతకన్నా ఎంతో మిన్నైన మంచి మనిషిగా రమణజీవి ఎందరికో తెలుసు.

  కధా రచయిత రమణజీవి ని నరేష్ నున్నా గారిలాంటి వారెవరైనా ఇంటర్వ్యూ చేస్తే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తోంది.

  వ్యాస విషయ పరిధిని అతిక్రమించి రాస్తున్న నా అధికప్రశంగ వ్యాఖ్యలను గొరుసన్నతో పాటు మీరందరూ మన్నిస్తారని ఆశిస్తూ

 3. బహూశా ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరపు రోజుల్లో వుండొచ్చు లెక్కేసుకుంటే వయసు పన్నెండేళ్ళు నావి, యండమూరి సీరియల్ ఒకదానికి బొమ్మల్నుంచి గుర్తున్న పేరు రమణ జీవి గారిది, ఆనాటి నుండి లెక్కేసుకుని ఈనాటి వరకు , ఇంత కాలానికి నాకు తగిలిన మొదటి ఇంటర్యూ రమణ జీవి గారిదిది ఇదే . అందుకెన్ని థేంక్స్ చెప్పుకోవాలో శ్రీ మెహర్ గారికి!

  ఆహా! పీ ఎస్ బాబు కాక బాస్కియా పేరు తెల్సిన రెండో ఆర్టిస్ట్ కూడా వున్నాడా తెల్గులో!

 4. “it leads no where. ఎక్కడికీ తీసుకుపోదు” “ఆర్టిస్టులెవరూ జీవితంలో మానవసంబంధాల్లో సక్సెస్‌ఫుల్ కాదు’ భలే అనిపించిన రెండు వాక్యాలూ మళ్ళీ మెన్షన్ చేద్దామనిపించి ఇక్కడ రాశాను. – చాలా బాగుంది రమణజీవి గారూ, మెహర్ గారూ.

 5. రమణజీవి గారు ప్రతి ఒక్క కళాకారుడి సఫరింగ్ గురించి చెప్తున్నప్పుడు ఒక ఆలొచన తట్టింది. ఆయనన్నట్టు చాలా మంది కళాకారులు introverts ఎ నేమో ( మళ్ళీ ఆయనే అన్నట్టు ఒక పిల్లాడు కళకు దెగ్గరయ్యెది యదార్థం నుండి తప్పించుకొవడానికెనేమో ) కాని స్వతహాగా boisterous గా ఉండెవారు కూడ solitude ని, suffering ని self-inflict చేసుకుంటారు. కళా సృష్టికి బాహ్యజగత్తు ఎంత inspiration అయినా, ముడిసరుకు మాత్రం ఎప్పటికయినా ఒక రచయిత అంతర్మథనమే- తనగురించి, తన అస్తిత్వం గురించి తాను తెలుసుకోడానికి తన మేధస్సుని, తన భావాలని, తన జీవితాన్నే పణంగా పెట్టి చేసె ప్రయాణం.

 6. యీ ఇంటర్వ్యూ ని నేను ఊపిరి ఉగ్గబెట్టుకుని ఎందుకు చదివానంటే, ఇందులో ఏ మారు మూలన్నా రమణజీవి గారి “సముద్రం“ కధ గురించి గాని, రమణకి పేణమైన త్రిపుర గురించి గాని, “రంగు వెలిసిన రాజు గారి మేడ“ కధకి అబ్బురపడి రమణజీవి మెహర్ ను వెతుక్కున్న వైనం గురించి గాని చెపుతాడేమోనని ( చిత్రకారుడూ, డిజైర్లనే ప్రధానాంశంగా తీసుకున్నట్లు ఇంటర్వ్యూ హెడ్డింగ్ లో వార్నింగ్ ఇచ్చిఉన్నా ).

  సరదాగా Jiddu కోట్
  ” I maintain that Truth is a pathless land, and you cannot approach it by any path whatsoever, by any religion, by any sect. ” ~ Jiddu Krishnamurthi

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.