cover

“నిమగ్నత లేని నిబద్ధత ఏంటి?” హెచ్చార్కెతో ముఖాముఖి

Download PDF ePub MOBI

కవి హెచ్చార్కెతో ముఖాముఖి

మీ బాల్యం గురించి చెప్పండి?

“నాకు మాల్గుడీ డేస్ లేవు” అని ఒక లైన్ ఎప్పుడో అనుకున్నా, తర్వాత ఇంకేం రాయలేదు గాని, ఆ లైన్ మాత్రం తట్టింది. ఆ పంక్తి తర్వాత మరొకటి ఏమీ రాయలేకపోవటం కూడా లేకపోవటానికి చిహ్నమే. అసలేం లేవు.

పేదరికం వల్లా?

దిగువ మధ్యతరగతి. ఏ ఆశా ఉండేది కాదు. ఆ హోప్‌లెస్‌నెస్ చుట్టూరా ఉండేది, నాలోనూ ఉండేది. నేను పుట్టేసమయానికే మా నాన్న చాలా పెద్ద అప్పులో ఉన్నాడు. అందుకనే చిన్న తప్పులకు కూడా బాగా కొట్టేవాడు. కొట్టడాన్ని అర్థం చేసుకోగలను గానీ, బాధ బాధే కద. ఒక చోట “నాన్నంటే నాకో చర్నాకోల” అని అన్నాను కూడా. ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది, బాల్యం లేని తనం. ఎవరన్నా బాల్యం అందంగా చెప్తూంటారు; అమ్మ ఒడిలో పడుకోవటం, అమ్మ కథలు చెప్పటం, అమ్మమ్మ కథలు చెప్పటం… ఇలాంటి జ్ఞాపకాలేవి నాకు లేవు.

ఎలాంటి పరిస్థితులూ సందర్భాలూ మిమ్మల్ని కవిత్వం వైపు మళ్లించాయి?

కవిత్వం అనేది లోకంలో ఉందని తెలిసినప్పటి నుంచీ నాకు కవిత్వం ఇష్టమైంది. ఎనిమిది తొమ్మిది క్లాసుల్లో ఎప్పుడో రవీంద్రనాథ ఠాగూర్ “రాజర్షి” నవల చదివాను నేను. అమాయకత్వమని ఇప్పుడు తెలుసు గానీ, అప్పుడు అలాంటివి మనమూ రాయొచ్చు అనిపించింది. దాన్నే మళ్లీ కొద్ది మార్పులతో తిరగరాశాను. ఆయన దేవాలయం అంటే నేను “దేవ్యాలయము” అని రాయటమూ, మా తెలుగు టీచరు చూసి “అరె గుణసంధి చేశావురా నువ్వూ” అనటమూ… అవి గుర్తున్నాయి.

పుస్తకాలు చాలా ఇష్టం. నాన్‍డిటెయిల్డు పుస్తకాలు అందరివీ పై తరగతి వాళ్లవి కూడా తెచ్చుకుని చదువుకునేవాణ్ణి. మా ఊళ్లో విజయాత్రేయ అని ఒక కవి ఉన్నారు. ఛందోబద్ధంగా పద్యాలు రాసేవారు. వాళ్లింటో ఎమ్.వి.యస్ పబ్లికేషన్ వాళ్ల క్రైం నవలలు బాగా దొరికేవి. సాంఘిక నవలలనీ, డిటెక్టివ్ నవలలనీ, జానపద నవలలనీ ఇట్లా అనేవాళ్లు. కృష్ణమోహన్, వి.ఎస్. చెన్నూరి, విశ్వప్రసాద్ వీళ్ల నవలలు. పదవతరగతి వరకూ అవి బాగా చదివేవాణ్ణి.

ఒకసారి ఎనిమిదో తరగతిలో అనుకుంటాను రాజేశ్వరశర్మ అని మా కరణం కొడుకు నన్ను తిట్టాడు “సూద్దరోడా” అని. నాకు చాలా కోపం వచ్చింది. అప్పటికి నాకు వచన కవిత అనేది ఎట్లా పరిచయం అయిందనేది నేను చెప్పలేను, కానీ “నన్ను సూద్దరెదవా అంటావా, మీ బాపనోళ్లు ఏం గొప్ప” అన్నట్టు ఒక కవిత రాశాను. అతనికే ఇచ్చాను “చదువుకో” అని. అతను దాన్ని తీసుకెళ్లి అతని చిన్నాన్న రాఘవశర్మ అని మా టీచరు ఆయనకి ఇచ్చాడు. ఆయన నన్ను పిలిపించి బెత్తంతో చాలా దెబ్బలు కొట్టాడు. అది నా మొదటి కవిత, అది నా మొదటి సన్మానం.

ఆ తర్వాత రావూరి భరధ్వాజ గారు ఏదో నవల రాశారు, ఏంటో గుర్తు లేదు గానీ, వ్యోమగమనానికి సంబంధించిన సైన్స్‌ఫిక్షన్ నవల అది. అది చదివిన కొద్ది రోజుల్లోనే అలాంటి కథ రాశాను. ఆ సందర్భం ఏమిటంటే… మాకు సైన్స్ రికార్డు రాయకపోతే సారు కొడతారు. మా వూర్నించి స్కూలు చాలా దూరం. మా ఊరు తర్వాత ఇంకో ఊరు వెళ్లి అక్కణ్ణించి ఇంకో ఊరు వెళ్లాలి. ఈ మధ్యలో ఒకే వాగు రెండుసార్లు దాటాలి. (మధ్యలో ఉన్న ఊరుకి చుడుతుందది.) ఈ మధ్యలో కంది చేను ఉండేది. సైన్స్ రికార్డు రాయకపోతే ఎట్లా మరి సార్ తిడతారు కదా అని భయమేసింది. మేం ముగ్గురు స్నేహితులం కలిసి వెళ్లేవాళ్లం. వాళ్లు ముందూ వెనకా నడిస్తే నేను మధ్యలో నవల చదువుకుంటూపోయేవాణ్ణి. ఆ రోజు “నేను ఇవాళ బడికి రాను, మీరు వెళిపోండి, ఇక్కడ కందిచేలోనే ఉండిపోతాను, మీరు వెనక్కి వచ్చిన తర్వాత కలిసి ఇంటికి వెళిపోదాం” అని చెప్పి వాళ్లను పంపేశాను. ఆ రోజు అక్కడ కూర్చుని ఆ కథ రాశాను. రామూ, సీతా అని.. వాళ్లు విమానంలో కూర్చుంటారు… పొరబాట్న ఏదో మీట నొక్కితే అది పైకి వెళిపోతుంది. అక్కడ ఇంక నాకు తెలిసిన సైన్స్ అంతా చొప్పించాను. పైకి వెళ్లిన కొద్దీ గాలి ఉండదు, వేడి పెరుగుతుందీ.. ఇట్లా. ఇదొక అనుభవం. ఎందుకు అనిపించిందో రాయటం అనేది సులభసాధ్యం అనిపించింది.

సీరియస్ సాహిత్యం వైపు మళ్లాకా మిమ్మల్ని తొలిగా ఆకట్టుకున్నది ఎవరు?

శ్రీశ్రీ, రంగనాయకమ్మ గారు. అట్లాగే కృష్ణశాస్త్రి గారు కూడా. అందరికీ నచ్చే ఆయన పద్యాలు తర్వాత నచ్చాయి. అందరూ పెద్దగా పట్టించుకోని పద్యాలే అప్పుడు ఎక్కువగా నచ్చేవి. “వికట పాండుర శుష్క వదన దంష్ర్టాగ్నిలో/ నవ్వేలా” అంటే ఎక్కువ ఇష్టం. ఎంతబాగా చెప్పాడూ! ఆకలిగొన్నవాడు కూడా నవ్వుతాడు కదా అప్పుడప్పుడూ! ఎందుకుంటుందీ! అట్లా ఆ విచికిత్సకు లోను చేసేవి. బాధ, అది కూడా స్పిరిచ్యువల్ పెయిన్ కాకుండా, ఫిజికల్ పెయిన్… ఆకలిగొంటే, దప్పికగొంటే… ఎందుకంటే I’ve been through it. ఇక “ఆకులో ఆకునై” లాంటివి తర్వాత అందరూ బాగుందంటే బాగుందనిపించేది. స్టాండర్డయిజేషన్ నుంచి నేర్చుకోవటమన్నమాట.

తొలిరోజుల్లో మీ కవిత్వాన్ని చక్కదిద్దుకోవటానికి ఉపయోగపడిన ప్రభావాలేమైనా ఉన్నాయా?

చక్కదిద్దుకుంటే కదా నేను! చక్కదిద్దుకున్నాను అనుకోను. రాయాలన్పించినప్పుడు రాయటమే. చక్కదిద్దుకోవటం అంటూ ఉంటే అది inadvertent గా జరిగుంటుంది. ఐతే రాస్తున్నవాళ్లందరూ, ఏం చదువుతున్నా, మనం రాస్తున్నదాంతో తెలిసో తెలియకో పోల్చుకుంటాం. ఉన్నట్టుండి ఒక turn of phrase చాలా బాగుంటే, అరె! నేనిట్లా చేయగలనా… ఎప్పుడన్నా ఒక వాక్యం ఇట్లాంటిది రాయగలనా అనుకుంటాం.

తొలి కవిత్వాన్ని ఇప్పుడు ఆబ్జెక్టివ్‌గా చూడగల ఈ దూరం నుంచి వెనక్కి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

అందులో చాలా రాయకుండా ఉంటే బాగుండుననిపిస్తుంది. ఐతే, అలా “తొలి” “మలి” “ఇప్పటీ” అని చెప్పేటపుడు నాకు ఇంకో అనుమానం కూడా వస్తుంది: ఇంకో పదేళ్ల తర్వాత ఇప్పుడు రాసింది రాయకుండా ఉండాలని అనిపిస్తుందేమో అని నేననుకుంటాను. ఇప్పుడొస్తున్న పుస్తకంలో ఒక పద్యం ఉంటుంది, “నేనెన్నిసార్లు చచ్చిపోతానో” అని. పశువులు కాస్తూ ఏటి ఒడ్డున కల్లుకుండ దింపుకున్న పిల్లవాడు లేడు కదా ఇప్పుడు, ఫస్ట్ టైం కాలేజికి సిగ్గుపడుతూ భయపడుతూ వెళ్లిన పిల్లవాడూ ఇప్పుడు లేడు, ఉద్యమంలో పాల్గొంటూ నిప్పుల రాస్తాలో నడిచిన పిల్లవాడూ ఇప్పుడు లేడు, అందుకే ఒకణ్ణి ఎన్నిసార్లు చనిపోతానో అన్నట్టు ఉంటుంది.

మీ ఉద్యమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది?

అప్పుడు చాలా బాగా బతికాననిపిస్తుంది. మనోవాక్కాయకర్మల జీవించటం అంటే ఏమిటో అది చేశాను. ఏమనుకున్నానో అదే చేశాను. నేను అనుకున్నదాంట్లో ఏదన్నా అబద్ధముంటే అది చెప్పలేను. అది పెద్దగా లేదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నాకు ఆలోచనకి డయలెక్టిక్ మెటీరియలిజం మంచి ఉపకరణంగానే కన్పిస్తుంది. కవిత్వానికి అందమే కాకుండా ప్రయోజనం కూడా ఉండాలని ఇప్పటికీ నాకు అనిపిస్తుంది.

ఆ జీవితాన్ని వదిలి ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది. నా కుటుంబాన్ని వదిలిపెట్టొస్తె ఎట్ల ఉంటుందో అట్లగే ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఆ కుటుంబంతో ఉండగలనా అని ప్రయత్నిస్తూ ఉంటాను.

ఎమర్జన్సీ టైంలో మీ రెండేళ్ల జైలు జీవితం ఎలా గడిచింది?

నరకం. జైలుకు పోక ఇరవై రోజుల ముందు మా జయమ్మకూ నాకూ పెళ్లి. అంతకుముందు ఏడేళ్లుగా అనుకుంటూ అప్పుడు చేసుకున్నాం. మేం బావామరదళ్లమైనా మా రెండు కుటుంబాలవాళ్లకీ ఇష్టం లేదు మా పెళ్లి. ఇక వాళ్లు చేయరులెమ్మని మా పెళ్లి మేమే చేసుకున్నాం. పెళ్ళయిన ఇరవై రోజులకే మీసా చట్టం మీద నేను అరెస్టయ్యాను. రెండోదేమిటంటే, నేను జైల్లో ఉండగానే మా పాప పుట్టింది. అదింకా నరకం. అలా… రెండేళ్లు కాదనుకుంటాను. ఎమర్జన్సీ పెట్టడంతో లోపలికి వెళ్లాను, అది తీసేయగానే బయటకి వచ్చాను. బహుశా పద్దెనిమి నెలలనుకుంటా. మధ్యలో ఒక సిఐడీ వాడొచ్చి అండర్‌టేకింగ్ ఇస్తే బయటకు వదిలేసే ఏర్పాటు చేస్తాను అన్నాడు. సిపిఐ (ఎమ్.ఎల్)తో నాకు ఎలాంటి సంబంధం లేదూ అని రాసిమ్మన్నాడు. నేనన్నాను… “సంబంధం లేదు, నేను ఒక స్టూడెంట్‌ని. ఎమ్మే అయిన ఆర్నెల్లకి ఇవన్నీ జరిగాయి. ఇది నోటిమాటగా చెప్తున్నాను. కానీ సంబంధం లేదని రాసివ్వను అని”. కాబట్టి పెరోల్ దొరకలేదు. పాపని చూడాలనిపిస్తుంది ఒక నెల పెరోల్ ఇవ్వమని పెట్టుకున్నా ఇవ్వలేదు. కాబట్టి it was a hell. కానీ మంచి ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ.

కమ్యూనిజం చాలా చోట్ల ఒక ఫాలెన్ ఐడియల్‌గా మిగిలిపోయింది, దాని పట్ల ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి?

కమ్యూనిజం పడిపోయే అవకాశం లేదు, ఎందుకంటే అదెప్పుడూ పైకి లేవలేదు. అదెప్పుడూ రాలేదు. ఎక్కడైనా సోషలిస్టు ఎటెంప్ట్స్ జరిగాయి అంతే. ఆ తర్వాత వచ్చేది కమ్యూనిజం. కమ్యూనిజం నా కల మాత్రమే. నాలాగా ఆలోచించేవాళ్ల కల మాత్రమే. కల పతనం కావటమేంటి? ఏవన్నా పడిపోయి ఉంటే అవి సోషలిజం కోసం జరిగిన ఎటెంప్ట్స్ మాత్రమే. ఇంకా డీప్ పాలిటిక్సులోకి వెళ్లాలంటే ఆ ప్రయత్నాలు కూడా సోషలిజం కోసం జరిగినవి కాదు, న్యూ డెమాక్రసీ కోసం జరిగినవని నేను అనుకుంటాను. వాటి బానర్స్ సోషలిజానికి సంబంధించినవై ఉండొచ్చు గాని, అవన్నీ ప్రజాస్వామ్యం కోసం జరిగినవే. ఎందుకంటే రష్యాలో అంతకుముందున్నది జారిస్టు పరిపాలన, చైనాలో ఫ్యూడల్ పరిపాలన. వీటి నుంచి తర్వాతి అడుగు ఉండేది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పరిపక్వమైన తరువాత సోషలిజం. ఐతే కార్మికులు పాల్గొన్నారు కాబట్టీ, ఆ పార్టీల ఆదర్శం సోషలిజం కాబట్టి సోషలిస్టు పోరాటాలు అంటున్నారు. అంతే తప్ప అవి దశ రీత్యా నిజమైన సోషలిస్టు పోరాటాల కిందికి రావు. కమ్యూనిజం ఐతే పతనం కాదు. I am still dreaming.

ఉద్యమ జీవితం తర్వాత జర్నలిస్టు ఉద్యోగంలో చేరి ఒక రెగ్యులరైజ్డ్ జీవితంలో పడటం… ఆ మార్పును ఎలా వర్ణిస్తారు?

నేను ఉద్యోగం చేయటం తప్పనిసరి, నా కోసమూ, నా కుటుంబం కోసమూ. అప్పుడు i felt very competitive, challenging, “నేనిప్పుడు 36 యేళ్ల వయస్సులో ఉద్యోగం చేసి జీవించాలి అనే రంగంలో ప్రవేశిస్తున్నాను, ఏ ఉద్యోగంలో చేరినా మళ్లీ ఈగో సాటిస్ఫాక్షన్… అహాన్ని సంతృప్తిపరచుకునే ప్రయత్నం కూడా చేయాలి” అనుకున్నాను. అలా చేయగలిగాను.

అంటే జర్నలిస్టు జీవితంలో కూడా మీ ఐడియల్స్‌ని పట్టించుకుంటూనే ఉన్నారా?

లేదు. ఐడియల్స్ గురించి పెద్ద పట్టించుకున్నానని అనుకోను. కేవలం నేను నిలబడాలి, మంచి జర్నలిస్టు అనిపించుకోవాలి. ఎందుకంటే జ్ఞానీ జైల్‌సింగ్ చనిపోతే కూడా ఒక నివాళి రాసి (ఏ పేరుతో రాస్తేనేమీ, రాసింది నేనే కదా), ఐడియల్స్‌తో జీవించానని చెప్పటం అబద్ధమవుతుంది.

ఉద్యమాన్ని వదిలి ఉద్యోగం వైపు రావటానికి కుటుంబాన్ని పోషించాలన్నదే కారణమా, ఇంకా ఏమన్నా కారణాలున్నాయా?

కాదు. కుటుంబం కోసమే ఐతే అంత అవసరం లేదు. నా భార్య జయ కూడా నాలాగే పూర్తి స్థాయి కార్యకర్త. మేం ఇద్దరం కలిసే పార్టీలోకి వెళ్లాం. ఇద్దరం కలిసే పార్టీలోంచి బయటకొచ్చాం. బయటకు రావటానికి కారణం, 1985లో పార్టీలో స్ప్లిట్ వచ్చింది. I couldn’t take it. ఆ విభజన నాకూ, జయకూ కూడ పరమ నిర్హేతుకమనిపించింది. ఎవర్ని తప్పుపట్టాలి. ఇరువర్గాలదీ తప్పే అనిపించింది. అసలు విభజన దాకా ఎందుకొచ్చాం ఎలా వచ్చాం అనేది ఆలోచించాం. ఉద్యమం ఒక ధ్యేయం పెట్టుకుంది, రాజ్యాధికారం అనే ధ్యేయం. అక్కడి దాకా వెళ్లటానికి కొన్ని దశలు పెట్టుకుంది. ప్రతిఘటన, పోరాటం విస్తరించి ప్రజాసైన్యంగా మారటం… ఇవన్నీ అనుకుంది. కానీ ఈ ప్రతిఘటన దశలోనే ప్రతిష్టంభనను ఎదుర్కొంది. మొదటిదశలోనే ఉండిపోయాం. దాన్ని అధిగమించే పరిస్థితి కనిపించటం లేదు. (ఇప్పటికీ అంతే.) అలాంటి పరిస్థితిలో సహజంగానే ఒక కుళ్లు ప్రవేశిస్తుంది. వస్తువు ఎప్పుడన్నా ముందుకన్నా పోవాలి, కుళ్లి అన్నా పోవాలి. అలా ఉద్యమంలోకి కుళ్లు ప్రవేశించింది అని మాకన్పించింది. మరి అప్పుడేం చేయాలి. మేం అక్కడే ఉంటే ఏం జరుగుతుంది? అక్కడే ఉండటం అంటే అర్థం ఏమిటి? మేం కార్యకర్తలమే గాక రచయితలం కూడా, నేను ఉపన్యాసకుణ్ణి కూడా. ఆ స్థానంలో మనుషుల్ని కలుస్తాం, చాలామందిని ఉద్యమంలోకి తీసుకువస్తాం. వాళ్లు వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక అది జీవన్మరణపోరాటం. మేమైనా, మా వల్ల వచ్చే వాళ్లయినా వాళ్ల ముందు ఉన్న ఆప్షన్స్ ఏమిటంటే, ఐతే ప్రతిష్టంభన తొలగి ఉద్యమంతో పాటు ముందు దశల్లోకన్నా పోగలగాలి, లేదంటే పోరాటంలో చనిపోవాలి. అలా చావు వైపు వాళ్లని ఆకర్షించిన వాళ్లమవుతాం. మనం దీనికి బాధ్యత వహించాలా? అనే ఆలోచన మాకు వచ్చింది. ప్రతిష్టంభన తొలిగే దారి మనకే కనిపించనపుడు ఆ పని చేయకూడదు అనిపించింది. అందుకని వదిలేశాను.

వదిలేశాక ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేస్తున్నప్పుడు మాత్రం అక్కడ నేను ఐడియల్స్ ఉంచుకోవటం అట్లా ఏం లేదు.

పదహారేళ్లపాటు జర్నలిస్టు జీవితం ఎలా సాగింది?

బాగుంది. బాగుంటానికి కారణం ఆట. కేరమ్స్ ఆడుతున్నామనుకోండి, కేరమ్సు వల్ల వచ్చేదేంటి లోకానికి. కాస్త ఆనందంగా పొద్దుపోవటం ఉంటుంది. ఆట బాగా ఆడాలనే కోరిక అంతకుముందు లేదు నాకు. అంతకుముందు అంతా ఇన్వాల్వ్డ్. ప్రత్యేకించి అనుకోవటం, సంకల్పించటం లేదు. అంతా సహజంగా అలా జరిగిపోయింది. జర్నలిజమైతే దరఖాస్తు పెట్టుకుని ఉద్యోగం సంపాదించి పని చేయటం.

అట్లగే నేను రాసినవాటికి (నా పేరుతో ఎప్పుడూ రాయలేదు గానీ) చాలా అప్రిసియేషన్స్ వచ్చేవి. భాషకు సంబంధించి. నేను భాష గురించి మాత్రమే పట్టించుకునేవాణ్ణి. నాకు తెలుసు నేను చెప్పేది సత్యం కాదని. పావని, దినకర్ పేర్లతో ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు రాసేవాణ్ణి. అలాగే దొంగతనంగా కవిత్వం రాసేవాణ్ణి. “కె. సంజీవ్” అనే పేరుతో రాసేవాణ్ణి. అప్పుడెప్పుడో రాసానని చెప్పి మూడేళ్లు రాసి, “అబద్ధం” అనే పుస్తకం వేశాను. వేసినప్పుడు మాత్రం హెచ్చార్కె పేరుతో వేశాను. ఆ దొంగతనంగా ఏదైతే రాశానో అందులో మాత్రమే నేను చెప్పాలనుకున్న సత్యం చెప్పాను. నేను ఏం ఫీలయ్యానో అదే చెప్పాను. మిగతావన్నీ ఎంత ఒక ఫెర్ఫార్మర్‌గా, ఒక ఎంటర్టయినర్‌గానే రాశాను. ఆ పని బాగా చేశాననే అనిపించుకున్నాను.

నిత్యం పదాలతో వృత్తిగతమైన సంబంధాన్ని మాత్రమే కలిగి ఉండటం తప్పనిసరైన జర్నలిస్టు ఉద్యోగం వల్ల ఒక సృజనాత్మక రచయితకు (కవి ఐనా, కథకుడైనా) కలిగే మంచి చెడులేమిటి మీ ఉద్దేశంలో?

మంచే జరుగుతుంది. నా అనుభవం మాత్రమే కాదు; హెమింగ్వే జర్నలిస్టు, మార్క్వెజ్ జర్నలిస్టు. జర్నలిజం రచయితను చేయదు, అయితే చంపదు కూడా. మార్క్వెజ్ “లివింగ్ టు టెల్ ద టేల్” లో జర్నలిస్టుగా తన అనుభవాలు చెప్తాడు. మరి అవి తనకు ఉపయోగపడ్డాయనే నాకు అనిపించింది.

మనలో సత్యాన్ని చెప్పటానికి కాకుండా కేవలం వృత్తిగతంగా వాడటం వల్ల, అక్షరాలతో మన సంబంధం దెబ్బతినదంటారా?

దొంగతనం బహిరంగంగా చేస్తాం అక్కడ. శ్రీశ్రీని, ఆరుద్రను, తిలక్‌ను మంచని చూడకుండా కొట్టేస్తాం కదా. చరణ్‌సింగ్‌ని పొగడటానికి కూడా శ్రీశ్రీని వాడతాం కదా. సో, వాటి మీద మీకు రివరెన్సు కూడా ఉండదు.

మరి అవే అక్షరాల్ని మీ రచనకు వాడుతున్నప్పుడు…

రాసేటప్పుడు, కాలానికి కన్నం వేసి దొంగిలించిన క్షణాలేవో… అవి కద, అక్కడ మనం ఉంటాం. ఉద్యోగంలో మాత్రం వేషం తప్పదు. నేను “ఈనాడు”లో చేరేటప్పుడు అనుకున్నాను కూడా. నా డైరీలో రాసుకున్నాను: “ఈ రోజు నుంచి నేను జర్నలిస్టుగా వేషం వేస్తాను. ఈ వేషం బాగా వేస్తాను. మెప్పిస్తాను.” నేను జర్నలిస్టుగా బాగా పని చేస్తానని, నా తెలుగు వాక్యం బాగుంటుందని జనం అనాలి. అంతే, అంతకుమించేం లేదు.

“బాధ కవిత్వానికి పర్యాయపదం” అనేది నమ్ముతానని ఒక చోట అన్నారు. మీ ప్రత్యేకమైన బాధనీ, మీ దిగులునీ నిర్వచించగలరా?

సంతోషం అనేది intermittent గా అప్పుడప్పుడు తగిలే flicker ఏమో అనుకుంటాను. బాధే జీవితం అనుకుంటాను. జీవితం యొక్క ఎసెన్స్ చెప్పటానికి ప్రయత్నించేకొద్దీ మనం బాధనే వ్యక్తం చేస్తాం అనిపిస్తుంది. రచయితలుగా మన ప్రయత్నమంతా బతుకును తిరిగి వ్యక్తం చేయాలనే కదా. అలాగే నేను ఇంకొకరి బతుకునైతే వ్యక్తం చేయలేను. నాకు తెలిసిన నా బతుకునే వ్యక్తం చేయాలి. మరి మిగతావాళ్లలో ఉందో లేదో తెలియదు గానీ, నాలో మాత్రం బాధే ఎక్కువ ఉంది.

దాని మూలాలు?

చాలా అహేతుకమైన హింస ఉంది. Why should there be so much suffering? It’s very unnatural. అవసరం లేదు. ఇవాళ మనం ప్రపంచంలోని సంపదను తీసుకుంటే (సంపదకు వస్తురూపాలైన తిండి గింజల్నీ, బట్టల్నీ తీసుకుంటే) మొత్తం ఏడువందల కోట్లమందీ తినొచ్చు, బట్టలు కట్టుకోవచ్చు, నీడకు ఉండొచ్చు. అంత సంపద ఇప్పుడు ప్రపంచంలో ఐతే ఉంది. మరి ఎందుకని కొందరు ఆకలికి ఉంటున్నారు? ఎందుకు కొందరు ఫ్రస్ట్రేషన్స్‌కి లోబడి చస్తున్నారు? నాకైతే ఇది చాల అహేతుకంగా ఉంది. దీనికి స్పిరిచ్యువల్ కారణాలు నాకు పట్టవు. పడితే బాగుండు. కొంచెం హేపీగా ఉండేవాణ్ణేమో. కాని నాకు దీనికి జవాబులు కావాలి. మరి నాకు బాధ గాక ఇంకేం మిగులుతుంది?

మీ కవితా వ్యక్తిత్వంలో సామాజిక పార్శ్వమూ, వైయక్తిక పార్శ్వమూ రెండూ బలంగా co-exist అవుతున్నట్టు అనిపిస్తాయి. ఏది వ్యక్తమవుతున్నప్పుడు మీ కలం ఎక్కువగా సంతృప్తి చెందుతుంది?

నేను రాసిన ప్రతీదీ వైయక్తికమే. వ్యక్తి ఎక్కడున్నాడనేదే ముఖ్యం. వ్యక్తిగతం కానిదేదీ లేదు, అలాగే వ్యక్తి కూడా సామాజికం కాకుండా లేడు. పర్సన్ కన్నా సోషల్ పర్సన్ అనే పదం నాకెక్కువ నచ్చుతుంది. అందరం సోషల్ పెర్సన్సే. కేవలం పర్సన్ అనేవాడు ఉంటాడా? ఉండడనుకుంటాను. నేను సోషల్ పర్సన్‌ని అనే అనుకుంటాను. కానీ దానికి “సామాజిక స్పృహ” అనేది తెచ్చిపెట్టడం ఉంది చూశారా… ఒకరకమైన పడికట్టు పదం చేశారిక్కడ. స్పృహ నాకిష్టం ఉండదు. స్పృహరాహిత్యమే ఇష్టం. నిజంగా ఇష్టంగా రాస్తున్నప్పుడు మనం స్పృహరాహిత్యంలో ఉంటాం. స్పృహకోల్పోయిన తర్వాత కూడా మనలో సోషల్ పర్సన్ ఉంటాడు, అతను మాట్లాడతాడు. నేను అప్పుడు సోకాల్డ్ “రివల్యూషనరీ పొయెట్”గా రాసిందీ, ఇప్పుడు రాసిందీ వ్యక్తిగతమే.

తరచూ మీరు వినే ఉంటారు “నిబద్ధత” అని. అంతకంటే చెత్తపదం ఇంకోటి లేదనుకుంటాను. ఉంటే నిమగ్నత ఉంటుంది, లేకుంటే ఉండదు. నిమగ్నత లేని నిబద్ధత ఏంటి? “నాకు ఊళ్లంటే చాలా ఇష్టం, కానీ ఊళ్లో నేను ఉండను” అని ఎవరైనా అంటే అర్థంపర్థం ఉంటుందా దానికి. నాస్టాల్జిక్‌గా “అప్పుడు చాలా బాగుండేది” అని చెప్పు. కానీ ఇప్పుడు ఊరంటే చాలా ఇష్టం.. మట్టీ గిట్టీ అదీ ఇదీ అని రాస్తుంటారు. అంత ఉంటే why don’t you go there? ఎవరాపారు నిన్ను. ఉద్యమం చాల గొప్పదీ అదీ ఇదీ అని చెప్తుంటారు. why don’t you do it? If you really feel (I’m not using the word belief), why are you not there? “అనిపిస్తోంది గానీ నేను చేయలేకపోతున్నానూ” అని చెప్పు, అది వేరు. ఆ ఫీలింగ్ వేరే ఉంటది. అలా… నిబద్ధత అనే పదం నాకు ఇష్టం లేదు. నిమగ్నత అనేది లేకుండా నిబద్ధత గురించి ఎవరు మాట్లాడినా అది ఒకటి: మంచి చేయదు, రెండోది: నీ చేత నిజాన్ని చెప్పించదు.

మీ కొన్ని కవితల్లో కనిపించే నిష్క్రమణభావం గురించి…

నిష్క్రమణభావం కాదు గానీ, అదొక ఆర్తనాదం. నాకు ఇష్టం లేదు నిష్క్రమించటం, i want to stay. బహుశా it’s a coping mechanism అనుకుంటున్నా నేను. ఆర్తనాదం సూసైడల్ కాదు, అరుపు. నేను గుంటలో పడి ఉన్నాను, అరుస్తున్నాను. I want to be saved, i want to get out, i am sharing my shout with you by publishing it. కాబట్టి నిష్క్రమణ అన్నది కరెక్టు కాదేమో.

మీ రచనావ్యాసంగపు అలవాట్ల గురించి చెప్పండి?

నేను ఏం రాయబోతున్నా అన్నది ఎప్పుడూ నాకు తెలియదు. కాగితం ముందు కలం పట్టుకున్నా, లేదా కంప్యూటర్ ముందు కూర్చున్నా, రాయబోతానో లేదో మాత్రం నాకు తెలియదు. ఒక్కోసారి ఆశ్చర్యపోతా, అరే! నేను రాసేశానే పొయెం అని. అందుకనే చాలాసార్లు మంచి పొయెం రాశాకా చాలా దిగులేస్తుంది, మళ్లీ ఎప్పుడు రాస్తానో అని. అందుకే స్పృహరాహిత్యం అన్నాను. ఎవరేమనుకుంటారనీ… స్పృహలో ఉంటే ఇవన్నీ ఉంటాయి కదా. నేను సామాజికస్పృహ గురించి కూడా మాట్లాడటం లేదు. వ్యక్తి స్పృహ గురించే మాట్లాడుతున్నాను. కన్ను తెరుచుకునే ఉంటుంది, కలం పని చేస్తూనే ఉంటుంది, కానీ స్పృహలో ఉండం.

పుస్తకం అంటే చనిపోవటం, అన్నారు. ఒకసారి పుస్తకం వేసిన తర్వాత కవి ఆ కవిత్వాన్ని దాటుకొని కొత్త కవిత్వంతో మళ్లీ కొత్తగా పుడతాడని అర్థం చేసుకున్నాను. పుస్తకం వేసిన తర్వాత (ఆ పబ్లిషింగ్ అనే ఆక్ట్ వల్ల) నిజంగా అలా జరుగుతుందా?

నేనయితే ఫీలయ్యాను అట్లా. ఎందుకంటే, ఒక ఫీలింగ్ పుడుతుంది. నువ్వు అది చెప్పటం కోసం ప్రయత్నిస్తావు, కవిత రాస్తావు, ఆ రాయటం ఐనపుడు చెప్పాన్లే అనుకుంటావు, ఇప్పటికి చెప్పాన్లే అని. కానీ రెండు మూడ్రోజుల తర్వాత ఆ పగిలిన సూక్ష్మాణువు ఇంకా తొలుస్తూనే ఉంటుంది. అది మళ్లీ ఇంకో కవిత అవుతుంది. నేననుకోవటం ఆ ఒరిజినల్ ఫీలింగ్ ఎన్నాళ్లు ఉంటుందో అన్నాళ్లూ (ఈ మధ్యలో చాలా చేస్తాం, బువ్వ తింటాం, స్నానానికెళ్తాం, ఉద్యోగాలు చేస్తాం, వడ్డీలకిస్తాం.. ఇవన్నీ), ఆ ఒరిజినల్ ఫీల్ తొలుస్తున్నంత వరకూ, అది పూర్తయ్యే వరకూ, చాలా కవితలు రాస్తాం. ఒక కవితలో కాదా పని. (ఒక్కోసారి కావొచ్చు కూడా, ఒక కవితతో ఐపోయి కొన్నాళ్ల పాటు ఏమీ రాయకపోవచ్చు.) సో ఆ ఫీలింగ్ కంప్లీట్ అయినప్పుడే మనకు పుస్తకం వేద్దామనిపిస్తుంది. పుస్తకానికి సరిపడా కవితలయ్యాయా అనేది కాదు మనం చూస్కునేది. “ఇక నేను చెప్పేది ఏమీ లేదు ఈ భావం మీద” అనిపించినప్పుడు, పుస్తకం వేయాలి అనిపిస్తుంది. అలా చెప్పేది ఏదీ లేదన్న నిర్ణయానికొస్తాం, లేదా చెప్పేదేం లేక ఆగిపోతాం. అది ఒక్కోసారి 26 కవితల తర్వాత జరగొచ్చు, ఒక్కోసారి 260 కవితల తర్వాత జరగొచ్చు. అప్పుడు వేస్తాం పుస్తకం. కాబట్టి ఆ ఫేజ్‌లో చనిపోయినట్టే కద. That HRK is no more. “వానలో కొబ్బరిచెట్టు” రాసిన హెచ్చార్కె ఇప్పుడు లేడు. ఇప్పుడు అందర్లాగే అతనూ దానికి ఒక పాఠకుడు.

అలా ఒక భావం పూర్తయి పుస్తకం వేసేశాక మరలా ఒక కొత్త భావం మిమ్మల్ని పలకరించటం కోసం ఎదురుచూడటం—

ఎదురుచూడటమనేదే ఉండదు. అలా బతికేస్తాం అంతే. హెచ్చార్కె ఇక రాయకపోవచ్చు. అలాంటి దశ అది. ఇక ఎదురుచూడటం, వెతుక్కోవటం నేనైతే చేయను. “అయ్యో ఈ మధ్య పొయెట్రీ ఏం రాయలేదే” అని అనిపించిన సందర్భాలుంటాయి, కానీ అలా అనిపించినప్పుడు అస్సలు రాయను.

ఏ కవిత్వమూ పలకరించకపోవటమూ అనే దశ అలా ఎన్నాళ్లు కొనసాగినా మీకు ఇబ్బందిగా అనిపించదా…?

అనిపించదు. బహుశా నేనింక రాయకపోవచ్చు. అలా నేను రెండుమూడేళ్లు రాయకపోయిన సందర్భాలున్నాయి, ఒకే సంవత్సరం వంద కవితలు రాసిన సందర్భాలూ ఉన్నాయి.

కవి ఎప్పుడూ ఒకే యుగంలో జీవించలేడు అన్నారు “వానలో కొబ్బరి చెట్టు” ముందుమాటలో. ఇప్పుడు మీ రాబోతున్న కొత్త పుస్తకం “రగిలే వీలుందని”లో ఏ యుగం కనపడతోంది. ఆ పుస్తకం గురించి చెప్పండి?

ఈ సంవత్సరంలో వ్యక్తిగత జీవితంలో నన్ను ఎక్కువగా బాధపెట్టిన కొన్ని విషయాలున్నాయి. అదిగాక, రెండోది, I support Telangana movement, but i suffered. మేధోపరంగా, సిద్ధాంతపరంగా తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తాను. మనసుకు మాత్రం నచ్చలేదు. ఎందుకు విడిపోవాలి; విడిపోకుండా, విడిపోవటానికి ఏ కారణాలున్నాయో అవన్నీ పరిష్కరించుకుంటే బాగుండేది. కానీ పరిష్కారం కావవి. కోస్తా పెట్టుబడిదారులు అని వాళ్లు చెప్తున్న మాట కరెక్టే. వాళ్లు కానీయరు దాన్ని. అంతకుముందు ఉన్న “లగ్జరీ”ని అలా నిలుపుకోవటానికే వాళ్లు ఆ కలిసివుండాలన్న మాట అంటున్నారు.

కానీ ‘మనం’ అనుకునేవాళ్లమల్లా, సడెన్‌గా ‘నువ్వూ’ ‘నేనూ’ అని మాట్లాడుకుంటున్నాం. “వివిధ”లో ఒక వ్యాసం రాశాను. దాన్ని ఇట్లాగే మొదలుపెట్టాను. “నిన్నటి దాకా ‘మనం, మనం’ అనుకునే ఫ్రెండు ‘మీరూ’, ‘మేమూ’ అని మాట్లాడుతున్నాడు” అని మొదలవుతుంది. నా ప్రియమిత్రుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డితో ఫోన్ సంభాషణ గురించి. అయితే అది అసహజం కాదు. ఆ ఇష్యూ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను సీమాంధ్రవాణ్ణి, ఆయన తెలంగాణ వాడు. ‘మీరూ’, ‘మేము’ అనే మాట్లాడతాడు. ఆయన తెలంగాణను సపోర్ట్ చేస్తాడు, నేను తెలంగాణని సపోర్ట్ చేస్తానని ఆయనకు తెలుసు, అయినా ‘మీరూ’, ‘మేము’ అనే మాట్లాడతాడు.

అదిగాక, కొంత అపనమ్మకం కూడా ఉంటుంది. వాళ్లు అందరు కలిసి చేసే పనుల్లోకి నేను వెళ్లినా, వెళ్లినట్టుండదు. ఇన్నాళ్లు ఎర్రజెండా అనుకున్నాం, కవిత్వం అనుకున్నాం, జర్నలిజం అనుకున్నాం. ఇందులో ఎక్కడా ‘మనం’ కానిది లేదు. ఇక్కడ ఇది మాత్రం ‘మనం’ కానిది అయిపోయింది.

ఇదిగో ఈ బాధా, నా వ్యక్తిగతజీవితంలోని బాధా ఈ రెండూ బాగా పని చేశాయి. అలాగని మరీ నిరాశ ఉన్న కవితలు తీసేశాను. కవికి ఒక పని కూడా ఉంది. పాఠకుణ్ణి చంపకూడదు. నిరాశకి గురి చేయకూడదు. ఒక పాఠకునిగా తీవ్రమైన నిరాశ కలిగించే కవితలు నేను చదవలేను. కాస్త ఎక్కడో flicker ఉండాలి. “రగిలే వీలుంద”నే అవకాశం ఉండాలి.

చాలా యేళ్లుగా కవిత్వం మాత్రమే రాసి, మరలా కథల వైపు ఎందుకు వెళ్లాలనిపించింది?

కొన్ని విషయాలు కవిత్వంలో చెప్పలేం. అవి మాత్రమే కథలు రాశాను.

ఇందాక చెప్పిందాని ప్రకారం మీ తొలి ప్రేరణలన్నీ (డిటెక్టివు నవల్సు, జానపద నవలలూ) వచనం నుంచే కదా. కథల వైపు రావటానికి అంత ఆలస్యం ఎందుకైంది?

ప్రయత్నించాను కానీ, అస్సలు రాయలేకపోయాను. మొన్నీ మధ్యనే ఒక పాత నోట్‌బుక్కు చించేశాను కూడా. ఒక పది కథల దాకా అటెంప్ట్ చేశాను. అస్సలు కథే రాలేదు, భాషా బాలేదు. ఇక ఆ నోట్‌బుక్కు నేనే మరోసారి చూడొద్దని చింపేశాను. కాబట్టి అస్సలు రాయలేదని కాదు గానీ, ఫెయిలయ్యాను. మధ్యలో కొన్ని మంచి కథలు రాశాను. 1977లో ఒకటి “బచ్చా బారక్” అని రాశాను. జైల్లో ఉన్నప్పటి అనుభవాలు వెంటనే రాశాను. అది చాలా బాగా రాశాననిపించింది. అలాగే “సృజన”లో “కుక్కబతుకు” అని ఒక కథ రాశాను. అదీ నచ్చింది. ఆ రెండు కథలూ తప్ప నేను ఇంక రాయలేదు. అంటే చాలా చెత్త రాశాను. మొన్న “చేతికి రాని కొడుకు” అని ఒక కథ రాశాను, నా బ్లాగులో ఉంది. దాని తర్వాత ఇక చెత్త కథలు రాయలేదనిపిస్తుంది. నాకు చెత్తగా ఉన్న కథలు రాయలేదు.

కవిత్వం, వచనం ఈ రెంటినీ మీరు భిన్నంగా ఎలా నిర్వచించుకుంటారు?

నాకు సంబంధించినంత వరకూ కథలో కవిత్వం రాకూడదనుకుంటాను. కవిత్వమనగా ఏమి? అలంకారికత. ఎపుడన్నా ఒక పదం రావొచ్చు, కానీ కొందరు కథ రాస్తారో కవిత్వం రాస్తారో తెలియకుండా రాసేస్తారు. ఏంటి రెండూ వేరా అంటే, మరి వేరే కదా. అతి-అలంకారితక ఎందుకు? Terse prose ఎందుకు రాయం మనం? కాబట్టి కథ రాసినప్పుడు నేను వీలైనంతవరకూ terse prose నే రాస్తాను. అలంకారికతను పనిగట్టుకుని రానివ్వనూ అని చెప్పను. అది రాదు అంతే.

నేటి కవిత్వంలో భాష కొత్త జవసత్వాలతో పునర్జన్మిస్తోంది. కానీ అది వచనంలో ఎందుకు జరగటం లేదు?

వచనం నేను అంత చదివానని అనుకోవటం లేదు. చదివినంతవరకూ “ఉంది కదా” అనిపిస్తుంది. మరీ అన్యాయంగా ఐతే లేదు. మొన్న అనిల్ ఎస్. రాయల్ గారికి మెయిలు కూడా పెట్టాను. “శిక్ష” కథ భాష బావుంది, నడిపిన తీరూ బాగుంది. అలాగే రమణజీవిసముద్రం”. వెంటనే జ్ఞాపకమొస్తున్నాయి కదా కొన్ని.

మీ పఠనాసక్తుల గురించి చెప్పండి. తెలుగులో ఏ రచయితల్ని ఇష్టపడతారు.

ముందు చెప్పిన వాళ్లంటే ఇప్పటికీ ఇష్టమే. ఐతే, ఈ మధ్య రంగనాయకమ్మ గారి “చదువుకున్న కమల” నవల ఎవరింట్లోనో చూశాను. చదవటం మొదలుపెట్టాను. కానీ చదవలేకపోయాను. అప్పుడు మాత్రం పడి పడీ చదివాను. ఇప్పటికీ కొన్ని ఇష్టం. “అమ్మకు ఆదివారం లేదా?” మొదలైనవి. ఇక శ్రీశ్రీ ఐతే ఏం రాసినా ఇష్టమే. తిలక్ ఇష్టమే. కృష్ణశాస్త్రి, బసవరాజు అప్పారావు, ఇస్మాయిల్ గారు, నగ్నముని, శివారెడ్డి.

మీ సమకాలీనుల్లో…

ఇప్పుడు రాయటం ఆపేశాడు ఎన్.కె. రామారావు అని. అట్లాగే శ్రీకాంత్. సిద్ధార్థ అప్పుడప్పుడూ… ఒక్కోసారి మరీ ఆబ్‌స్ట్రాక్టు చేస్తున్నాడని నాకు కంప్లెయింటు ఉంది. నాకు అర్థమైనప్పుడంతా బాగుంది. అర్థం కాకపోవటం కూడా కాదు, అందకపోవటం. విమల, మా జయమ్మ… జయమ్మ పొయెట్రీ చాలా ఇష్టం. ఎస్. జయ అనే పేరుతో రాస్తుంది. ఎంత సరళంగా ఉంటుందో అంత బాగుంటుంది. కొండేపూడి నిర్మల బాగా రాస్తారు. ఘంటశాల నిర్మలవి రెండు మూడు కవితలు… ముఖ్యంగా “వీర్య వర్షాలు”. రెడ్‌లైట్ ఏరియాలో ఆడవాళ్ల స్థితి. ఇంకా చాలామంది ఉన్నారు. అసలు ఇట్లా పేర్లు తీయటం ఒక్కొసరి ప్రాబ్లెమ్ అయితది. ఎందుకంటే తీయని పేర్లు మనకి చాలా ఇష్టమైనవి ఉండొచ్చు.

ప్రపంచ రచయితల్లో…

ప్రాణం జాక్ లండన్. శ్రీశ్రీ గురించి చెప్పానే ఏం రాసినా అని… అలాగే జాక్ లండన్. ఎంత ఇష్టం అంటే, అదే అమెరికా రచయిత హెమింగ్వేకు అంత పేరేంటీ, మా జాక్ లండన్‌కు లేకుండా, అని కూడా అప్పుడప్పుడూ అనుకుంటాను. హెమింగ్వేని తక్కువచేయటం అని కాదు. ఎందుకంటే “ఫర్ హూమ్ ద బెల్ టోల్స్” నవల, “కిలిమంజరో” కథ… బాగా ఇష్టం, అయితే “ఏంటో…” అనిపించినవీ చాలా ఉన్నాయి. ఆయన కలెక్టెడ్ స్టోరీస్ ఉంది నా దగ్గర. అన్నీ చదవలేకపోయినాను. కానీ జాక్ లండన్ మళ్లీ “టేల్స్ ఆఫ్ ది నార్త్” అని చిన్న బుక్ వస్తే అవి కూడా ఇష్టంగా చదివాను. మార్క్వెజ్ “ఒన్ హండ్రడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్” బాగా ఇష్టపడ్డ పుస్తకాల్లో ఒకటి. ఎపిక్ అంటే ఇదీ అనిపించింది. అందరికీ ఇష్టమైన నిహిలిస్టు దాస్తోయెవ్‌స్కీ నాక్కూడా ఇష్టమే. “యమా ది పిట్” రచయిత అలెగ్జాండర్ కుప్రిన్ ఒకడు.

ఇప్పటి తరానికి, అంతకుముందున్న తరానికి కవిత్వమనే మాధ్యమాన్ని స్వీకరించటంలో, దాన్ని వాడుకోవటంలో కనిపిస్తున్న మార్పేమిటి?

ఇంతకుముందున్న తరంలో కవులు ఎక్కువగా తెలుగు ఎమ్మే చదువుకున్న వాళ్లూ, లేదా జర్నలిస్టులూ ఉండేవాళ్లు. ఇప్పుడొక విచిత్రమైన పరిస్థితి ఉంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, అడ్వర్టయిజ్మెంట్ కంపెనీల్లో పని చేసేవాళ్లూ… అలాంటి వాళ్ల సంఖ్య పెరిగింది. ఆ తేడా పొయెట్రీలో కూడా కన్పిస్తుందని అనిపిస్తుంది. వాళ్ల అనుభవాలు వేరు, వీళ్ల అనుభవాలూ వేరు. అది తెలుస్తోంది.

అలాగే ఉద్యమాల్లో వస్తున్న తేడాలు కూడా. స్థూలంగా చెప్పాల్సి వస్తే, ఇంతకుముందు తరం వాళ్లంతా ఉద్యమాల వెనుక నడిచారు. అప్పట్లో ఆ ఉద్యమాల రిఫరెన్సుతోనే సాహిత్య చరిత్ర రాయాల్సొచ్చేది. సాహిత్య చరిత్రకు సంబంధించి ఎవరన్నా వ్యాసాలు రాస్తే కూడా… అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళిత కవిత్వం.. ఇలా ఉద్యమాల్ని పేర్కొంటూ రాసేవారు. కానీ ఇప్పుడు నడుస్తున్న చరిత్రని ఎవరూ ఉద్యమాల పేరుతో రాయటం కుదరదు. కుదరకపోవటం తప్పా రైటా అన్నది వేరే సంగతి. నాకైతే ఇలా బాగుంది కూడ. ఎందుకంటే కవిత్వాన్ని కవిత్వంగా చూడాలి తప్ప విప్లవ కవిత్వమా, వేరే కవిత్వమా అట్ల చూడక్కర్లేదు. సిన్సియరా కాదా అన్నది చూడాలి. అది వాక్యంలో తెలిసిపోతుంది. ఇందాక చెప్పినట్టు ప్రకటించిన నిబద్ధత వేరు, నిజంగా ఉన్న నిమగ్నత వేరు. ఇల్యా ఎహ్రెన్‌బర్క్ ఒక మాట అంటాడు: “జీవితంలో తలనొప్పే రానివాడు, ఎప్పుడూ తలనొప్పి గురించి రాయొద్దు” అని.

జీవితం పట్ల మీ తాత్త్విక దృక్పథం ఏమిటి?

దాన్ని తాత్త్వికత అనాలో లేదో తెలియదు. నాకు మార్క్సిజం బాగా ఇష్టం. సార్త్ర తాత్త్వికత చాలా ఇష్టం. ఆయన్ని చదివి ఔపోసన పట్టానని కాదు. ఆ existentialist tendencies. కామూ “ద స్ట్రేంజర్” నవల, దాని వెనకనున్న ఫిలాసఫీ ఇష్టం. Without being away from Marxism, i love existentialism అని చెప్పొచ్చు. ఎగ్జిస్టెన్షియలిజం ఎక్కడన్నా మార్క్సిజం యొక్క కోర్ ఫిలాసఫీని కాంట్రడిక్టు చేస్తే, i am with Marxism. చేయదనే అనుకుంటున్నాను.

 *

Download PDF ePub MOBI

Posted in 2014, ఇంటర్వ్యూ, మే and tagged , , , , , , , , .

5 Comments

  1. హెచ్చార్కే గారి అభిప్రాయాలు, ఆలోచనలు గౌరవించదగ్గవి. ఆయన ఉద్యమ జీవితం నుండి జర్నలిస్టుగా మారినప్పుడు ఆయన సంఘర్షణ చాలా చక్కగా వివరించారు. “కమ్యూనిజం ఓడిపోయింది” వాదనను ఆయన తిప్పికొట్టిన విధం గొప్పగా ఉంది. అయితే పార్టీలు చీలినంత మాత్రమా ఉద్యమాచరణ మీద విశ్వాసం కోల్పోవటానికి ఆయన చెప్పిన కారణాలు నాకు నచ్చలేదు. హెచ్చార్కే లాంటి పెద్దలు, అన్ని చదివీ తెలిసిన వాళ్ళు కూడ నిరాశకు గురవటం బాధ కలిగిస్తుంది. అయినప్పటికి సాహిత్యంలో ఆయన ఉనికి, పాత్ర చాలా అవసరమైనవి.

  2. నిబద్ధత, నిమగ్నత విషయంలో చెప్పిన విషయం చాలా బాగుంది. చాలా రోజులుగా నేను ఇదే విషయం మీద చాలా మందితో గొడవ పడుతూ వచ్చాను. చాలా చాలా విషయాల్లో మీరు నేనూ ఒక్కటే.. చాలా చెప్పాలని ఉంది. ఎక్కువ మంది ఈ ఇంటర్వ్యూ చదివితే బాగుంటుందేమో…

  3. హెచ్చార్కే గారి గురించి చదివినప్పుడు, ఆయనతో ఏ కొంచమైనా interaction జరిగినప్పుడు , ఆయన మనసుకు దగ్గరగా జరగాలని, అదే సమయంలో ఆయనకు దూరంగా ఉండాలని ఒకే సమయంలో అనిపిస్తుంది. ఆయన కవిత్వం కూడా అంతే. ఆ కవిత్వం ఆయన రాయడం జరిగింది అంతే. ఆ కవిత్వం పాఠకులకు, అందునా నిమగ్నం కాగలిగిన వారికే ఎక్కువగా చెందుతుంది.

    Good interview from Kinige. Kudos.