cover

రచన కళ – విలియం ఫాక్నర్

Download PDF ePub MOBI

నోబెల్ బహుమతి పొందిన అమెరికన్ రచయిత విలియం ఫాక్నర్. ప్రధానంగా నవల, కథా రచయితగా పేరుపొందాడు. 

రచయితగా మీ గురించి?

నేననేవాణ్ణి లేకపోతే, నా రచనలు నా బదులు ఇంకెవరో రాసుండేవారు. హెమింగ్వే, దాస్తోయెవ్స్కీ, అందరూ అంతే. షేక్స్పియర్ సాహిత్యాన్ని రాసింది ముగ్గురు వేర్వేరు రచయితలన్న వాదనే దానికి ఋజువు. “హామ్లెట్”, “ఎ మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్” ముఖ్యం కానీ దాన్ని రాసిందెవరన్నది కాదు.

మీ సమకాలీనుల గురించి…

మేమందరం పరిపూర్ణత్వమనే మా కలని చేరుకోవటంలో విఫలమైనవాళ్లమే. నా రచనలన్నింటినీ మళ్లీ రాసే అవకాశమే గనుక వస్తే, ఇంకాస్త బాగా రాస్తానని అనుకుంటాను. అది ప్రతీ ఆర్టిస్టుకీ ఒక ఆరోగ్యకరమైన స్థితి. అందుకే అతను పని చేస్తూనే ఉంటాడు, ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఒకసారి అతను తన రచనని తన కలకు ధీటుగా తేగలిగాడంటే, ఇక అతనికి మిగిలేదల్లా పీక కోసుకోవటం, పరిపూర్ణత అనే శిఖరపు ఆవలి వైపు దూకి ఆత్మహత్య చేసుకోవటమే. నేను ఒక విఫల కవిని. బహుశా ప్రతీ నవలాకారుడూ ముందు కవిత్వమే రాయాలనుకుంటాడేమో, కానీ రాయలేడు, అప్పుడు కవిత్వం తర్వాత అంత కష్టమూపడాల్సిన కథ అనే మాధ్యమాన్ని ప్రయత్నిస్తాడు. అందులో కూడా విఫలమయ్యాక, ఇక అప్పుడు మాత్రమే అతను నవలా రచనకు ఉపక్రమిస్తాడు.

మంచి నవల రాయటానికి ఒక సూత్రం లాంటిదేమన్నా ఉందా?

తొంభైతొమ్మిది శాతం ప్రతిభ… తొంభైతొమ్మిది శాతం క్రమశిక్షణ… తొంభైతొమ్మిది శాతం శ్రమ. ఎప్పుడూ చేసేదానితో తృప్తిచెందిపోకూడదు. ఎంత బాగా రాసే వీలుందో అంత బాగా ఎప్పుడూ రాదు. ఎంత ఎత్తుకు ఎగరగలవో అంతకుమించి ఎగిరేందుకు ప్రయత్నించు. నీ సమకాలీనుల కన్నా, నీ ముందువాళ్ల కన్నా గొప్పగా రాయటం మాత్రమే నీ లక్ష్యం కాకూడదు. నీ కన్నా గొప్పగా రాయటానికి ప్రయత్నించు. ఆర్టిస్టు అనే వాణ్ణి నిత్యం ఎన్నో భూతాలు తరుముతూంటాయి. అవి తననే ఎందుకు ఎంచుకున్నాయో తెలీదు, ఎందుకో ఆలోచించేంత తీరికగా కూడా ఉండడు. పని పూర్తి చేయటానికి ఎంతకైనా తెగిస్తాడు.

అంటే రచయిత పూర్తి నిరంకుశునిగా ఉండాలంటారా?

రచయిత అతని కళకు మాత్రమే జవాబుదారీ. అతను మంచి రచయిత ఐతే పూర్తి నిరంకుశునిగానే ఉంటాడు. అతనికి ఒక కల ఉంటుంది. అది అతణ్ని ఎంతగా నలిపేస్తుందంటే దాన్ని వదిలించుకు తీరాలి. అప్పటిదాకా శాంతి ఉండదు. మిగతావన్నీ పక్కనపెట్టేస్తాడు: మర్యాద, ఆత్మాభిమానం, భద్రత, ఆనందం, అన్నీ, పుస్తకం రాయటం కోసం.

ఐతే భద్రత, ఆనందం, మర్యాద లేకపోవటం ఇవి కళాకారుని సృజనను ప్రభావితం చేసే అంశాలు కాగలవా?

కాదు. అవి అతని ప్రశాంతతకూ, సంతృప్తికీ అవసరమైన అంశాలు ఐతే కావొచ్చు, కానీ కళకు ప్రశాంతతోనూ, సంతృప్తితోనూ నిమిత్తం లేదు.

మరి రచయితకు ఆదర్శమైన వాతావరణం ఏమిటి?

కళకు వాతావరణంతో కూడా నిమిత్తం లేదు; తానెక్కడున్నా లెక్క లేదు. మీరు నా గురించి అడుగుతున్నట్టయుతే, నాకు ఆఫర్ చేయబడిన ఉద్యోగాల్లోకెల్లా ఉత్తమమైంది ఒక వేశ్యాగృహానికి సంరక్షకునిగా ఉండటం. అది పని చేయటానికి ఒక రచయితకు చాలా వీలైన వాతావరణం అని నేననుకుంటాను. అక్కడ ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది; ఆకలీ భయాలకు తావుండదు; తలదాచుకునేందుకు ఒక నీడ ఉంటుంది; ఏవో కొన్ని పద్దులు సరిచూడటం, నెలనెలా లోకల్ పోలీసుల దగ్గరకు వెళ్లి ముడుపులు ముట్టజెప్పటం తప్పించి ఇంకే పనీ ఉందదు. రాయటానికి అనుకూలమైన పగటి సమయాల్లో ఆ చోటు కావాల్సినంత నిశ్శబ్దంగా ఉంటుంది, అతనికి మరీ బోరు కొడితే పాల్గొనటానికి సాయంత్రాల్లో బోలెడంత సామాజిక జీవితం కూడా ఉంటుంది; సమాజంలో ఒక హోదా ఉంటుంది; చుట్టూ ‘సారూ’ అని పిలిచే ఆడవాళ్లుంటారు; ఆ చుట్టుపక్కల దొంగసారా కాసేవాళ్లందరూ కూడా ‘సార్’ అనే పిలుస్తారు.

నేను చెప్పదల్చుకున్నదేమిటంటే, మరీ పెద్ద మూల్యం చెల్లించాల్సిన అవసరం లేకుండా దొరికే ఏ చోటైనా సరే, ఏ ఏకాంతమైనా సరే, ఏ సంతృప్తి సరే ఆర్టిస్టుకు మంచి వాతావరణమే. అలాంటి వాతావరణం లేనప్పుడు అతని మీద ఒత్తిడి పెరుగుతుంది; అతని సమయమంతా చిరాగ్గానూ, కోపంతోనూ ఉండటానికే సరిపోతుంది. నా వ్యాసంగానికి నాక్కావాలిన అంశాలు ఏమిటంటే: కాగితం, పొగాకు, భోజనం, కాస్త విస్కీ.

మీరు ఆర్థిక స్వేచ్ఛని ప్రస్తావించారు. రచయితకు అది అవసరమా?

లేదు. రచయితకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం లేదు. అతనికి అవసరమైందల్లా ఒక పెన్సిలూ కొంత పేపరూ. ఆర్థిక వెసులుబాటు వల్ల మంచి రచన వచ్చిన సందర్భం ఏమీ నాకు తెలీదు. మంచి రచయిత ఏ ఫౌండేషన్కూ దరఖాస్తు చేసుకోడు. ఏదోటి రాయటంలో తీరిక లేకుండా ఉంటాడు. సరుకులేనివాడైతేనే తనకు సమయం లేదనీ, ఆర్థికస్వేచ్ఛ లేదనీ వాపోతూ తనను తాను మోసపుచ్చుకుంటాడు. మంచి కళ అనేది దొంగల నుంచీ, దొంగసారాకాసేవాళ్ల నుంచీ రావొచ్చు.

రచయితకు పాఠకునికి పట్ల బాధ్యతేదైనా ఉండాలా?

అతని బాధ్యతల్లా రాయాల్సింది ఎంత బాగా రాయగలడన్న దాని పట్లనే; ఆ తరువాత ఇంకా బాధ్యతేదైనా మిగిలి ఉంటే అది అతను ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టుకోవచ్చు. జనబాహుళ్యాన్ని పట్టించుకునేంత తీరికైతే నా వరకూ నాకు లేదు. నన్ను చదివేది ఎవరూ అని ఆలోచించేంత సమయం నాకు లేదు. నా రచన మీదైనా, ఇంకెవరి రచన మీదైనా ఫలానా గుంపులో గోవిందయ్య అభిప్రాయం ఏమిటన్నది నాకు లెక్కలేదు. ముందు నా ప్రమాణాల్ని నేను అందుకోవటమన్నది ముఖ్యం.

మీ ప్రమాణాల్ని మీరు అందుకోవటానికి ఏ టెక్నిక్ పాటిస్తారు?

టెక్నిక్ మీద ఆసక్తి ఉన్న రచయితలు రాయటం వదిలేసి ఏ శస్త్ర చికిత్సో, తాపీపనో ఎంచుకోవటం మంచిది. రాయటానికి యాంత్రికమైన పద్ధతి అంటూ ఏదీ లేదు, దగ్గరి దారుల్లేవు. యువరచయితకు సూత్రాలంటూ ఏమీ ఉండవు. నీ తప్పుల నుంచే నువ్వు నేర్చుకో; ఎవరైనా తప్పుల నుంచే నేర్చుకునేది. తనకు సలహా ఇచ్చే స్థాయి ఎవరికీ లేదని నమ్ముతాడు అసలైన ఆర్టిస్టు. అతనికి అనంతమైన గర్వం ఉంటుంది. పాతరచయితను ఎంతగా అభిమానించినా, అతని తలదన్నాలని కూడా అంతే కోరుకుంటాడు.

మీ రచన ఎంతవరకూ మీ స్వీయానుభవంపై ఆధారపడింది?

చెప్పలేను. అలా ఎప్పుడూ లెక్కపెట్టుకోలేదు. ఎందుకంటే “ఎంతవరకూ” అనేది ముఖ్యం కాదు. రచయితకు మూడు అంశాలు అవసరం: అనుభవం, పరిశీలన, కల్పనాశక్తి. వీటిలో ఏ రెండైనా, ఒక్కోసారి ఏ ఒక్కటైనా సరే మిగిలినవి లేని లోటును పూరించవచ్చు. నా వరకూ ఐతే కథ ఒక ఊహతోనో లేదా జ్ఞాపకంతోనో లేదా మనోచిత్రంతోనో మొదలవుతుంది. ఇక ఆ దిశగా, అలా ఎందుకు జరిగిందీ లేదా ఆ తర్వాత ఏం జరిగిందీ అన్నది కనుగొనే దిశగా రాత సాగిపోతుంది. రచయిత అనేవాడు కాస్త వాస్తవికమైన వ్యక్తుల్ని నమ్మదగ్గ పరిస్థితుల్లో పెట్టి కదిలించగలిగేట్టు రాయటానికి ప్రయత్నిస్తాడు. అందుకు ఉపకరించే సాధనాల్లో తెలిసిన వాతావరణాన్ని వాడుకోవటమన్నది కూడా ఒకటి. నాకు తెలిసినంతవరకూ సంగీతం వ్యక్తీకరణకు చాలా సులువైన సాధనం. అదే మానవచరిత్రలో ముందుపుట్టటం మూలాన కావొచ్చు. కానీ నాకున్న నైపుణ్యం పదాల్లోనే కాబట్టి, స్వచ్ఛమైన సంగీతం దేన్నైతే ఇంకా బాగా అందజేయగలదో, దాన్ని పేలవమైన పదాల సాయంతో అందించే ప్రయత్నం చేయక తప్పదు. సంగీతం దాన్నే ఇంకా బాగా, ఇంకా సులువుగా వ్యక్తం చేయగలదు, కానీ నా ప్రాధాన్యత పదాలకే, వినటం కన్నా చదవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టే. నాకు శబ్దం కన్నా నిశ్శబ్దం ఇష్టం, పదాలు నిశ్శబ్దంలోనే బొమ్మ కడతాయి. వచనం ఉరిమినా పాడినా అంతా నిశ్శబ్దంలోనే చేస్తుంది.

రచయితగా మీ ప్రారంభం ఎలా జరిగింది?

నేను న్యూఓర్లీన్స్లో ఉండేవాణ్ణి, ఆదాయం కోసం చిన్నా చితకా పనులు చేస్తూండేవాణ్ణి. షెర్వుడ్ ఆండర్సన్ పరిచయమయ్యాడు. మధ్యాహ్నాలు ఇద్దరం కలిసి ఊళ్లో తిరుగుతూ వాళ్లతో వీళ్లతో కబుర్లు చెప్పేవాళ్లం. సాయంత్రమయ్యాక మళ్లీ కలిసేవాళ్లం, మందు పుచ్చుకుంటూ ఆయన మాట్లాడేవాడు, నేను వినేవాణ్ణి. పగలు మాత్రం కలిసేవాణ్ణి కాదు. ఆ సమయాన్ని రాయటానికి అట్టేపెట్టుకునేవాడు. ప్రతి రోజూ దినచర్య ఇలాగే సాగేది. ఇదే రచయిత జీవితమైతే నేను తప్పనిసరిగా రచయిత కావాలని అనిపించింది. అలా నా మొదటి పుస్తకం రాయటం మొదలుపెట్టాను. వెంటనే రాయటంలో సరదా అర్థమైంది. అందులో పడి ఆండర్సన్ని కలవటం మూడువారాలు మర్చిపోతే, చివరకు ఆయనే మా ఇంటికొచ్చాడు, అదే ఆయన తొలిసారి రావటం, వచ్చి, “ఏమైంది? నా మీదేమన్నా కోపమా?” అని అడిగాడు. నేను ఓ పుస్తకం రాస్తున్నానని చెప్పాను. ఆయన “మైగాడ్!” అంటూ బయటకు వెళ్లిపోయాడు. “సోల్జర్స్ ప్లే” అనే ఆ పుస్తకం రాయటం పూర్తయ్యాకా ఒక రోజు ఆండర్సన్ భార్య నాకు వీధిలో తారసపడింది. పుస్తకం ఎలా సాగుతోందని అడిగితే పూర్తి చేసేశానని చెప్పాను. ఆమె అంది, “షెర్వుడ్ నీతో ఒక ఒప్పందానికి వస్తానంటున్నాడు. నీ రచన చిత్తుప్రతిని ఆయన చేత చదివించనూ అంటే అప్పుడు ఆయన తన ప్రచురణకర్తతో దాన్ని ప్రచురించేందుకు ఒప్పిస్తాడట.” నేను సరేనన్నాను. అలా రచయితనయ్యాను.

*

Download PDF ePub MOBI

 

Posted in 2014, జూన్, రచన కళ and tagged , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.