cover

ప్రపంచీకరణ వికృతిని దర్శించి తృణీకరిస్తున్న నిర్మల తాత్వికత ‘మూలింటామె’

Download PDF ePub MOBI

మా ‘చిలకముక్కు’ చిన్నోడు, అదేనండీ మా రాజా తమ్ముడు, నిన్న మద్దేనపేళ వచ్చాడు మా ఇంటికి, చాలా నెల్ల తర్వాత – ఛా, ఇదేమిటి, మా ఇల్లంటానేంటి.. ఇదిల్లు కాదు, ఎపార్ట్మెంటీ. యిల్లెక్కడుంది? అదెప్పుడో పోయింది, పుస్తకాల సంచీతో పాటు. ఆవిరై పొయ్యింది, చదువుల బతుకుతో పాటు.

ఊరులేని మనిషి, ఇల్లులేని మనిషి, మడిచెక్కలేని మనిషి, పెరడు లేని- ఏప చెట్టులేని మనిషి ఎవరైనా ఉంటే, అసొంటి సన్నాసుల్లో నేనొక మొదటి సన్నాసిని. కాంక్రీటు మనిషిని. నగర బంధీని. ఏ చెట్టు కింద కూచ్చుని తీరిగ్గా, గోముగా, ముదిగారంగా బొచ్చు పిల్లుల్ని ఒడిలో పెట్టుకుని నిమర్ను? అసలు ఒడి ఉంటే కదా! గుండెలో తడుంటే కదా! ఒడే లేని, గుండె తడే లేని వాళ్లకు పిల్లుల భాగ్యము, పిట్టల భాగ్యము ఏడ నుండొస్తుంది?

మరసొంటి నాకు మా చిలక ముక్కు రాజా, నామిని ‘మూలింటామె’ ను, అతిప్రేమగా గుండెకద్దుకు తీసుకొచ్చి నా ఒడిలో ఎందుకు బెట్టినట్టు? రాక రాక ఒచ్చినోడు ఒక పూటైనా నాతో ఉండకుండా, గబగబా రెండు ముద్దలు (ఎలిక్కాయంత సంగటి ముద్దలు కాదు సుమా!) తెల్ల బియ్యం కూడు తినేసి పది పనుల మీద ఎందుకు పరిగెట్టినట్టు? పది పనుల్లో అసలు పని ఇంకా పదిమందికి నామిని ‘మూలింటామె’ను మోసుకెల్డం.. అందుచేత గొణక్కుండా సణక్కుండా ఒప్పుకున్నా. దారిచ్చినా, ఎల్లిరమ్మని.

మా చిన్నోడికి బైబై చెప్పి, మూలింటామె గుండె పొరలు తిప్ప సాగేను. తిప్పేకొల్దీ అర్థమైతాంది మూలింటామె మంచి శాల్తయిన ఆడమనిషని, ఆమె కథలో గంగా బొండం జలమున్నాదని, గుండెలు మెలిబెట్టే అంతులేని బాధున్నాదని, భూకంపమొచ్చి కూలిపోతున్న చెట్టు చేమ కూడు గూడు మనిషి పశువు మానం దానం సర్వం సమస్తం ఉన్నాయని. ఇది ప్రకృతి తెచ్చిన భూకంపం కాదు, మనిషి తెచ్చిన భూకంపం.. మూలింటామె మూలాలను ప్రాణప్రదమైన ఆమె పిల్లులను తుడిచిపెట్టేసిన పెనుకంపం.. మనందరి జీవితాల్లో పచ్చదనాన్ని మమతల వెచ్చదనాన్ని తన్నుకు పోయిన ‘తెల్ల’ భూకంపం. చిదిమిన పసుపు కొమ్ము, బంగారు బొమ్మ తన ముద్దుల మనవరాలు, తన కోడలు, మూలింటి ముత్యం, ఇద్దరు పసిబిడ్డల తల్లి ఉన్నట్టుండి మూలింటి గడప దాటెల్లిపోయింది.

ఆమె మనసు ఏమి చెప్పిందో మనకు తెలియదు, స్వచ్ఛమైన ఆమె మనసు తీసుకెళ్ళిన చోటుకెల్లిపోయింది. మూలింటికి ఏదో అయ్యింది, ఏదో అవబోతోంది. భూకంపపు ఒణుకు ఛాయలేవో మూలింటామె గుండెల్లో, ఆమె ఒడిలో ఒబ్బిడిగా ఒదిగిపోయి నిశ్చింతగా నిదరోయే ఆమె పిల్లుల గుండెల్లో, ఆమె పెరటిలో, ఆమె చెలకలో భయపెడుతూ ప్రవేశించాయి. రూపావొతి మూలింటి గడప దాటిన క్షణమే ఆ ఇంటికి ప్రకంపనల తాకిడి మొదలయ్యింది.

అన్నమయ్య సంకీర్తనల్లోని తెలుగు ఎన్ని జిలుగు వెలుగులు బోతుందో, ఎన్ని బడాయిలు బోతుందో, ఎన్ని నృత్యాలు చేస్తుందో, సెలయేరులై జలపాతాలై వేగమై మంద్రమై వెన్నెల చంద్రమై ప్రేమ భక్తి తరంగమై మన్మధ తూణీరమై ఎలా మనలను చుట్టు ముడుతుందో, ఎలా మనలను ఆవహిస్తుందో, ఎలా మనలను కుదిపేస్తుందో నామిని దృశ్య కావ్య వచనం కూడా అంతగా మనలను మెలిపెడుతుంది, మురిపిస్తుంది, రెచ్చగొడుతుంది, బాధ పెడుతుంది, ఏడిపిస్తుంది. ఎక్కడెక్కడికో మన ఊళ్ళ మట్టి వేళ్ళ లోకి తీసుకుపోతుంది, గ్రామీణ జీవన వైవిధ్యం లోనికి, సహజ రీతుల తిట్లు-తినుబండారాల్లోనికి ఈడ్చుకు పోతుంది, నెట్టుకు పోతుంది, తోసుకు పోతుంది.

నామిని ప్రతి అక్షరం, ప్రతి వాక్యం, ప్రతి పాత్ర ప్రకృతితో, ఆయన పుట్టి పెరిగిన గ్రామీణ జీవన సహజత్వంతో మెరుస్తూ ఉంటుంది, ఉరుముతూ ఉంటుంది, పచ్చగా ప్రేమగా ఉంటుంది, జాలిగా ఉంటుంది, కర్కశంగా ఉంటుంది, రాల్లపైపడ్డ జలపాత శబ్దంలా ఉంటుంది, సెలయేటి బాటలా పాటలా ఉంటుంది. రంగురాళ్ళ పొందికగా ఉంటుంది. పిచ్చుకగూళ్ళతో నిండిన చెట్టులా ఉంటుంది, కలగలసి అదొక అధ్బుత దృశ్య కావ్యంలా ఉంటుంది.

గ్రామాన్ని ప్రపంచానికి కేంద్రంగా, ప్రపంచ ప్రకృతి కన్నుగా ప్రపంచీకరణ వికృతిని దర్శించి తృణీకరిస్తున్న నిర్మల మనస్కుడు నామిని. మూలింటామె అటువంటి తాత్వికతకు ప్రతిబింబం.

ఉదారవాద, స్త్రీవాద విముక్తి, విప్లవ స్త్రీ విముక్తి దృష్టి నుండి నామిని మూలింటామె రచనా శిల్పాన్ని పరిశీలిస్తే తిట్ల పురాణంలా, స్త్రీలను అగౌరవ పదజాలంతో కించపరిచినట్టుగా అనిపిస్తుంది. నామిని దృష్టి అది కాదు. ఊళ్ళల్లో దిగువ మధ్య తరగతి ప్రజల, శ్రామిక కులాల్లో స్త్రీ పురుషుల సహజ సంభాషణలను వికృతీకరించి అతికించడం నామినికి చేతకాదనుకుంటా! సహించదనుకుంటా!

ప్రభుత్వశాఖలు, ముఖ్యంగా వ్యవసాయ శాఖ వారు టి.వి చేనళ్ళకు, రేడియో ప్రసారానికి ఇచ్చే ప్రచార కార్యక్రమాల్లో పొలంలో పనిచేసుకునే ఆడా మగా పాత్రలచే బ్రాహ్మణ తెలుగు యేసతో మాట్లాడిస్తారు. అది ఎంత అసహజంగా వికారంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పబనిలేదు. ఈ విషయం నామిన్నడిగితే వచ్చే సమాధానం బహుశా.. “ నేనేం జేసేద్సా.. ఆ తిట్టుకునే ఆడోల్ల దగ్గరకు బోయి అట్ట గాదమ్మా, ఇట్ట తిట్టుకోండని పాటం జెప్పనా సా..” అంటాడేమో!

“మూలింటామె” ముమ్మారు చదివేను. ఒకసారి చాలదా? ముమ్మారు ఎందుకు చదవాలబ్బా అంటే – మొదటిమారు చదివినప్పుడు ఎన్నో పదాలకు, వాక్యాలకూ, నానుళ్ళకూ అర్థం వెతుక్కోవడంతోనే సరిపోయింది నా బుల్లి బుర్రకు.

రెండో మారు చదివినప్పుడు రచయిత రచనలోని ‘పదును-పవర్’ ను ఆస్వాదించడమే సరిపోయింది.

మూడో మారు చదివాక మూలింటామె తాత్వికత లోని అమోఘమైన మానవీయత, మమతానురాగాలు, తన జీవనపథంలో తనతో పెనవేసుకుపోయిన తోటి జీవాలు పిల్లుల పట్ల ఆమె కారుణ్యమయ మమకారం, తనచుట్టూ ఉన్న సామాజికతపై ఆమె మనోఘోష బాగా అర్థమయ్యాయి. ‘మూలింటామె’ ద్వారా నామిని బహుముఖమైన గ్రామీణ జీవన వైవిధ్యం, మానవ పరిణామ క్రమంలో ‘మనిషి-మొక్క-పశువు’ మధ్య ఏర్పడ్డ ఆత్మీయ త్రికోణ బంధం, సహజ గ్రామీణ జీవనంలో బ్రతుక్కు శ్రమకు ఉన్న సంబంధం, మనిషికి మనిషికి మధ్య ఉండే ఆత్మీయతలు ఇవన్నీ పెట్టుబడి చొరబాటుతో, గుడు గుడు చంద్రుళ్ళు, పందొసంతల పెనవేతతో ఏమవుతాయో, మూలింటామెలు, నడిపింటామెలు, కొనామెలే కాక మేడి, కాడి, ఎద్దు, చెలక, అరక, ఆకు, కొమ్మ, రెమ్మ, చెట్టు, ఆఖరికి ఏ హానీ చేయని ప్రేమమయ పిల్లులూ ఎలా కనుమరుగై పోతాయో చూపించారు. ఆ బాధ ఎటువంటిదో డబ్బు పట్ల కాపీనం లేని వాళ్ళకూ, శ్రమించి బువ్వతినే బుద్ధి ఉన్నవాళ్లకూ, ప్రకృతినీ మనతో తిని తిరిగి మన బతుకులో భాగాలైన జీవాలనూ కావలించి ముద్దాడే మనసున్న మనుషులకు తప్ప ఇతరులకు తెలియటం సాధ్యమా?

‘మూలింటామె’ గురించి చదువుతూంటే పిన్న వయస్సులోనే పెనిమిట్లను కోల్పోయి నికార్సుగా కుటుంబ విలువలకు నిలబడి త్యాగధనులుగా, సేవాతత్పరులుగా వారి దగ్గరి కుటుంబాలకూ, చుట్టుపక్కల వారికీ తలలో నాలుకగా మెలిగిన, తమ తమ జీవితాలను త్యాగమయం చేసుకుని జీవించిన, నా జీవితంలో నా చిన్ననాడు నేను చూసిన ఎందఱో గ్రామీణ మహిళా మణులు నా కళ్ళ ముందు ఓ సినీమా రీల్లా తిరగనారంభించారు. వారంతా దేనికి ప్రతీకలు? నా మదిలో నిద్రాణమై ఉన్న తేనెపట్టు మీద రాయి విసరిన నామిన్ని ఏమన్ను? కోపించనా? దూషించనా? బడిత పుచ్చుకు బాదనా? నెత్తినెత్తుకు మోయనా?

‘మూలింటామె’ నాకు అందేటప్పటికి మానవ సమాజం నిర్మించుకున్న ‘చెదిరిపోయిన మానవ సామూహిక తాత్వికతా తేనెపట్టు’ గురించిన అధ్యయనంలో పీకలోతు కూరుకుపోయి ఉన్నాను నేను. చెడు మంచిని ఎలా చెదరగొట్టి తుడిచిపెట్టి వేస్తుందో, మానవ సమాజాన్ని, పర్యావరణాన్ని, మనుగడ మూలాలనూ దుఃఖభాజనం చేసి ఎలా తొడలుకొట్టి నిలబడుతుందో ఇప్పుడు మనమంతా అనునిత్యం చూస్తున్న చిత్రమే, అనుభవిస్తున్న, అదే స్వర్గమనుకుంటున్న నరకమే.

పొద్దు పొడవక ముందే ఇంకా ఈనాటికీ హైదరాబాద్ నగరంలో ఏగాని ఇంధనం ఖర్చులేకుండా మన గుమ్మాల ముందుకు గొంతు చించుకు కూటిలోకి తాజాగా, కమ్మగా కూరల నందించే ప్రకృతి స్నేహితులు మనకు న్యూసెన్సై పోతున్నారు. రూపాయి కూర, కాయ, పండు పదిరూపాయల ఇందన రవాణాఖర్చుతో, వరల్డ్ బ్యాంకు అప్పుతో, చలువ నిలవ దిగుమతి మూతినాకుడు పద్ధతులు మనకు ఆరాధ్య దైవాలై పోయాయి. ‘మాల్’ కల్చర్ మూల కల్చరై గుడు గుడు చంద్రుళ్ళ – పందొసంతలు మూలిళ్ళను, మూలింటామెలను సునామీలా ముంచెత్తుతున్నాయి.

*

నామిని మూలింటామెను పరిచయం చెయ్యాలంటే, మొదుటి బాగం మొదుటక్షరం నుండి కొనబాగం కొనాక్షరం దాక ఉదహరిస్తూ, చర్చిస్తూ, చెప్పుకుంటూ బోవాలె – అది మంచిపనౌదు. పైగా ఇది చిత్ర మాలికయ్యే! దృశ్య కావ్యమయ్యే! ఎక్కడా ఏది వదలడానికి లేదు. ఇదేమీ తుకుడా ఎవ్వారం గాదు; ఏదో ఒగిటి గీకి, పెన్ను మూసి, యేల్లిరుచుకు చేతులు దులుపుకోడానికి.

నామిని తన మనో నేత్రంతో ఫోటోలు తీసి బుర్రలో పదిల పరుచుకున్న, పేర్చుకున్న ఒక్కొక్క చిత్రాన్ని అక్షరబద్ధం చేసి, పేరాలు పేరాలుగా అమర్చి, మూలింటామెను నవలా రూపంలో మన కందించాడు. నవలలో, కథలో మునుముందుగానే మనకు మూలింటామెను, ఆమె మనుమరాలు రూపావొతిని దృశ్యరూపకంగా ఎలా పరిచయం చేస్తాడో చూడండి:

“మంచి శుక్రోరం. సందల గూకతా వుండాది. రేపనంగా తిరమల శనోరం, మూడో వారం. తిరమల నెల్లో వానొగటన్నా పడతాది కదా. ఈ పొద్దు మద్దేనం వుమ్మగించిందాన్ని బట్టి మూలింటామె అనుకున్నట్టే దచ్చిన కొండ మింద ఎండ వొక పక్క కాస్తా వుండినా వూళ్ళో వాన కుమ్మరించి పారేసింది. ఈదిలో యెల్లవ గూడా సాగింది. అందాకా కూడొంచి నూరి పెట్టిన చారు పెడదా మనుకునిందల్లా, యీ వానొచ్చిందానికి సంగటి కెలికి, అద్దుడికి శెనిగ్గింజలూరిబిండి చేస్కోని, నంజుకునే దానికి మునగాకు పొరుటుకుంటే అణుకణుగ్గా సంగటి తినొచ్చని మనవరాలితో, ‘మ్మే! అన్ని శెనగ్గించలేంచు, నేను మునగాకు దూస్తా!’ అని మునగాకు దుసి చేటతో కూడా యిచ్చింది. తెల్లారి చద్దితో సఖా ఏడెనిమిది ముద్దలు జేసేసి, శెనిగ్గింజలూరిబిండి నూరేసి, మునగాకు పొరిటేసి- యిప్పుడే బయటికో, యాడికో పోయ్నట్టుండాది మూలింటామె మనవరాలు రూపావొతి.”

యే సొరగంలోనో ఉన్న ‘సత్యజిత్ రాయ్’ కు ఇది పంపిస్తే, బహుశా అక్కడ నుండి మూలింటామెను ఆయన ఒక అద్భుత సినిమాగా మలిచి చూసి తరించమని మనకు తప్పక పంపిస్తాడు. యే పరలోక ప్రేమాశ్రమంలోనో సేదతీరుతున్న ‘చలం’ గారికి ఇది పంపిస్తే శ్రీశ్రీ మహాప్రస్థానానికి రాసిన ముందుమాటలా నామిని మూలింటామెకు కూడా ఓ మంచి యోగ్యతా పత్రాన్ని తప్పక పంపిస్తాడు.

వానొచ్చిన ఆ మంచి శుక్రారం సందేళ ఇంట్లో దీపం బెట్టి, ఇద్దరు పసిబిడ్డల నొదిలి, ఇల్లొదిలి యెల్లిపోయిన మూలింటామె మనవరాలు రూపావొతి యిఖ వూరు మొహం చూళ్ళేదు, ఇంటి గుమ్మం తొక్కలేదు.

అలా మొదలైన కథలో ఇంకా ఎన్నాళ్ళో తన మనవరాలితో, మనవరాలి బిడ్డలతో, తన ప్రాణం కన్న మిన్నగా ప్రేమించిన పిల్లులతో రెండూ రెండున్నర గుంటల కయ్యలో కొలువు దీరిన అడ్డాపింట్లో, పచ్చగా బ్రతికుండాల్సిన మూలింటామెకు తనువు చాలించాల్సిన పరిస్థితులు ముంచుకొస్తాయ్. మూలింటిల్లు అంగడిల్లై పోతుంది. సహజ కవి కాళోజీ అన్నట్లు “సంగడి బ్రతుకులు అంగడి బ్రతుకులైనట్లు” — మూలింటిల్లు, అడ్డాపిల్లు, మూలింటామె ఒళ్లో దర్జాగా ప్రశాంతంగా ముదిగారంగా బ్రతికిన పిల్లుల ఇల్లు… పిశాచాల ప్రవేశంతో సరుకుల మారకపు విలువల స్మశానమై పోతుంది. మూలింటామె తనువు చాలిస్తుంది.

“మొదుటామె దినం బెమ్మాళంగా జరిగింది. ఎద్దులకు కట్టే మడకా, కాడి మానును గూడా మొగుడి చేతికి గొడ్డలిచ్చి కట్టెల్ని చీలేయించి, ఆ కట్టెల్నే పొయ్యిలో పెట్టి దినం కూడు వండింది పందొసంత. ఇంక సేద్యం ఏమీ లేదు గదా. ఆ మడక కాడి మానును యింక ఎద్దల అర్రుల మింద పెట్టి చేను దున్నేదేమీ లేదు గదా, ఎందుకు రుధా అని అత్త దినాని కంతా ఆ మడకా కాడిమాను గూడా పొయ్యిలో పెట్టేసింది పందొసంత, అడ్డాపింటి పక్కన అవి కాలికడ్డంగా పడుంటే!”

“ ‘…లంజముండ చెట్లను మొదుళ్ళతో సఖా కొట్టిన్చిందే గాక ఒక గాట నుండిన గొడ్లను తలొక దిక్కుకు తోలేసింది, మడకా కాడి మాను గూడా మిగిల్నీకుండా పోయ్యిలో బెట్టి కాల్చేస్తావంటే లంజా ముండా, మా వొదిన కుటుంబరాన్ని కండ్ల ముందర్నే ఎంత ఆగబాగల చేసేస్తివే యీనపు ముండా!’ అంటూ దుడ్డుకట్టి ముసలాయన పందొసంత మిందికి కొట్టను కొట్టను వొచ్చినాడు. కొందు రంతే, వడ్డీలు వసూల్జేసుకుంటా నీడన కూచ్చోని తింటా వుంటే కండ్లల్లో కంపలు కొట్టుకుంటారు వొప్పక. ఆ ముసిలాయన తిట్లను పందొసంత గానీ, ఆమె మొగుడు నారాయుడు గానీ చెవలల్లో యేసుకోలా.”

మడిచెక్కకు, దుక్కి పశువుకు, పాల పొదుక్కు, కుడితి గోళేనికి, పెరటి మొక్కకు, ఇంటి పాదుకు అల్లుకు పోయిన జీవితం ఏమైపోతుంది?

ఆకు పచ్చని పండ్లచెట్టంత మనిషి, మానవి, ఎలా బ్రతికింది? ఇపుడేమై పోయింది?

మూలింటామె చచ్చిపోతూ చచ్చిపోతూ చీమంతమ్మ చెవిలో ఏమి చెప్పింది?

నారదుడు ప్రహ్లాదుని చెవిలో ఏమి ఊదాడు?

పోతూ పోతూ ఈ దేశం చెవిలో తెల్లోడు ఏమూది పోయాడు?

ఈ సమాజం ఏమి కోరుకుంటోంది?

తాటాకుల బుట్టిల్నా?

రొటేషన్ రోషనారాల్నా?

పందోసంతలనా?

గుడుగుడు చంద్రుల్లనా?

కాడీ మేడీ ఒదిలేసిన నారాయుల్లనా ?

దుడ్డుకట్ట ముసిలాయిన్నా?

మంచి మాటల మంచి మనసుల గురివి చీమంతాల్నా?

ఓ ప్రశ్న: అప్పులేంది ఆస్తి ఏర్పడతాదా? (దీని లోతెంత? ప్రపంచమంత! ప్రపంచీకరణంత!)

— భూసారం శివన్న

ప్రతులకు:

విశాలాంధ్రా అన్ని బ్రాంచీలు;2

నవోదయ,

కాచిగూడ, హైదరాబాద్

కినిగె లో లభ్యం

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పుస్తక సమీక్ష and tagged , , , , , , , , , , , .

2 Comments

  1. మంచి విశ్లేషణ.
    “ఉదారవాద, స్త్రీవాద విముక్తి, విప్లవ స్త్రీ విముక్తి దృష్టి నుండి నామిని మూలింటామె రచనా శిల్పాన్ని పరిశీలిస్తే తిట్ల పురాణంలా, స్త్రీలను అగౌరవ పదజాలంతో కించపరిచినట్టుగా అనిపిస్తుంది.” అన్నారు. ఈ వర్గాల్లో దేనికి చెందుతానో తెలియదు కాని నేనూ స్త్రీ విముక్తిని కోరుకొనేదాన్నే. స్త్రీలను అగౌరవ పరిచినట్లు నాకు అనిపించలేదు. ఒక సంఘటన, ఒక సందర్చం, ఒక సంభారణ డిమాండ్ చేసినపుడు రాస్తే తప్పు లేదనుకొంటాను. ఇంకా ఈ కధ గ్రామాల్లో స్త్రీ పురుషసంబంధాలకు సంబంధిన కృత్రిమ విలువలను వివరంగా చర్చించిందనుకొంటున్నాను.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.