cover1

కామెర్లు

Download PDF ePub MOBI
ఇది ఎస్. రామకృష్ణన్ కథకు అవినేని భాస్కర్ అనువాదం. మూల రచయిత పరిచయం ఇక్కడ.

కామెర్లు

ఎస్. రామకృష్ణన్

గోడకి పాకుతున్న బల్లిని చూస్తూ పడుకుని ఉన్నాను. అమ్మ ఏదో చెప్తోంది. తను చెప్పేవేవీ నాకెక్కట్లేదు. నన్ను కదిలించటానికి, “పబ్లిక్ పరీక్షలైనా రాస్తే బాగుంటుంది” అంది. నేను ఏమీ మాట్లాడకుండా చాపలో ముడుచుకు పడుకుని ఉన్నాను. “ఈ ఏడవ తరగతి పరీక్షలు రాసేస్తే చాలు తర్వాత నెల రోజులు వేసవి సెలవులు. ఇంట్లోనే ఉండొచ్చు” అని చెప్పింది. నేను బదులేమీ చెప్పలేదు. బల్లి నా చూపు నుంచి తప్పుకుంది.

బడికి వెళ్ళి నెలరోజులైంది. ఇంట్లో ఈ చాప పైనే పడుకుని ఉన్నాను. కామెర్లు వచ్చి నా ఒళ్ళు బెండులా చిక్కిపోయింది. వేపాకు వాసన వస్తోంది. చేతులూ వేళ్ళూ పచ్చగా నన్నే భయపెట్టేలా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఇంటి పైకప్పులో పాకుతున్న ఒక బల్లిని చూస్తూ ఉన్నాను. అది అటూ ఇటూ తత్తరపాటుతో తిరుగుతోంది. ఉన్నట్టుండి నా పక్కన పడింది. పడగానే దాని తోక తెగిపోయింది. తెగిన తోక కొట్టుకుంటోంది. బల్లి మాత్రం పాక్కుంటూ గోడ మీదకి ఎక్కేసింది. తోక తెగిన బల్లినీ, నేలమీద కొట్టుకుంటున్న తోకనీ చూడటానికే భయమేసింది. కళ్ళు మూసుకున్నా తోక లేని బల్లి నా కళ్ళ లోపలికి పాకుతున్నట్టు అనిపించింది. భయంతో కళ్ళు తెరిచి చూస్తే బల్లి గోడపైన కనిపించలేదు. అప్పట్నుండి ఆ బల్లి నీడ మాత్రం గోడమీద పాకుతున్నట్టు లీలగా కనిపిస్తుంది. అది నిజమో భ్రమో తెలియదు.

LOGOకళ్ళు మూసుకుని నిద్రపోలేకున్నాను. కొన్నిసార్లు నీటిలో పడిపోయి ఊపిరాడనట్టు అనిపిస్తుంది. పగలు అమ్మ నా పక్కనే కూర్చుని కొబ్బరి నీళ్ళు తాగించింది. ఆ రోజు రాత్రి నాకే తెలీకుండా పక్క తడిపేశాను. తెల్లారాక కళ్ళు తెరిచి చూస్తే తలుపు చాలా దూరంగా ఉన్నట్టు అనిపించింది. అమ్మ గొంతు కూడా ఎక్కడో దూరం నుండి వినిపిస్తున్నట్టు ఉంది. ఒళ్ళంతా పచ్చరంగు పూసినట్టు ఉంది. అమ్మ లోలోపలే ఏడుస్తుండటం వినిపిస్తోంది. ఎప్పుడైనా ఒక్కోసారి దేసింగుగాడు బడికి వెళ్తూ దార్లో మా ఇంటికి వచ్చి కాసేపు నా పక్కన కూర్చుని బడిలో విశేషాలు చెప్పి వెళ్తాడు. వాడి పెదవుల కదలిక మాత్రమే కనిపిస్తుందిగానీ వాడి మాటలు నాకు ఎక్కడంలేదు. పక్కన కూర్చున్నా నన్ను తాకడానికి భయపడుతూ కూర్చుంటాడు.

రోజులు గడిచేకొద్ది ఇలా ఇంట్లో పడుకుని ఉండటం చిరాగ్గా అనిపింది. స్నానం చెయ్యడం తప్ప మరే పనీ ఉన్నట్టులేదు నాకు. ఇల్లు వదిలి ఎక్కడికీ వెళ్ళడానికి ఉండదు. పగలూ రాత్రీ రెండుపూటలూ పడుకునే గడపడం ఎంత కష్టమో! నిద్రపట్టక పొర్లుతుంటే కిటికీనుండి ఇంట్లోకి వచ్చే ఎండ నా కళ్ళదగ్గరవరకు వస్తుంది. అది మెల్లమెల్లగా నాకు దూరమవ్వడాన్ని చూస్తూ ఉండేవాణ్ణి. అమ్మ ఏవో పనులు చేస్తూ ఉంటుంది.

ఈ నెల రోజులుగా నా ఒంటిని నేనే పరీక్షగా చూస్తూ ఉన్నాను. చేతులు, కాళ్ళు, నాలుక, వేళ్ళు, గోళ్ళు – అన్నీ వింతగా అనిపిస్తుంది. అందులోనూ నిద్ర సగం మెలుకువ సగం అనిపించే వేళల్లో ఒళ్ళు గాల్లో ఎగిరే కాగితంలా అనిపిస్తుంది. చొక్కా లేనప్పుడు నా ఒంటిని చూస్తే చాలా దిగులూ, ఆశ్చర్యమూ కలుగుతుంది.

* * *

ఆ రోజు బడిలో ఉండగా కడుపులో తిప్పేసింది. వాంతి చేసేశాను. బావి దగ్గరకెళ్ళి కడుక్కురా అని నాకు తోడుగా శివప్రసాద్ ని పంపించింది టీచరు. శివప్రసాద్ చిల్లు బకెట్టుని బావిలో వేసి నీళ్ళు చేఁదుతూ నొప్పిగా ఉందారా అనడిగాడు. నేను బదులైనా చెప్పలేకపోయాను. కళ్ళలో మంట. తెరవలేకపోతున్నాను. పొత్తికడుపులో ఏదో లాగేస్తున్నట్టు భరించలేని నొప్పి. బకెట్లోని నీళ్ళని ఎలాగో దోసిట్లోకి తీసుకుని ముఖం కడుక్కున్నాను. నోరు పుక్కిలించుకోరా అన్నాడు శివప్రసాద్. రెండో సారి వంగి నీళ్ళు దోసిట్లోకి తీసుకోలేకపోయాను. బకెట్ ఎత్తిపట్టుకుని నా దోసిట్లోకి నీళ్ళు పోశాడు. మోచేతుల ద్వారా నీళ్ళు కారి చొక్కా తడిసింది. ఆ చల్లదనంతో నొప్పి తగ్గినట్టు అనిపించింది.

క్లాసురూముకి తిరిగి రాగానే టీచరు అడగకున్నా శివప్రసాద్ నేను పచ్చగా వాంతి చేసుకున్నాను అని చెప్పాడు. టీచరు బోర్డు మీద రాసినదాన్ని చెరుపుతూ ఉంది. ఆమె జడలోని మల్లెపూలు వాడిపోయి పలచగా అయి సరంకట్టిన దారం కనబడుతుంది. ఇప్పుడెలా ఉంది అని టీచరు అడుగుతుందేమో అనుకున్నాను. టీచరేమో నా వైపసలు చూడలేదు. తలవొంచుకుని కూర్చున్నాను. మళ్ళీ పొట్టలో నొప్పిగా అనిపించింది. ఏడ్చేస్తానేమో అనికూడా భయమేసింది. క్లాసురూము లో ఏడవకూడదని పళ్ళు కరుచుకుని ఉన్నాను.

టీచరు బోర్డు మీద ఏవో ప్రశ్నలూ వాటి సమాధానాలూ రాస్తోంది. బెంచీ మీద కూర్చోలేకపోతున్నాను. నొప్పి కొద్దికొద్దిగా ఎక్కువవుతువుంది. మళ్ళీ తలవంచుకుని కాడ తెగిపోయిన నా ఊదారంగు పుస్తకాల సంచిని చూస్తూ ఉన్నాను. ఒక కాడ తెగిపోతే మరో కాడతో ముడివేసిపెట్టుకున్నా నాల్రోజుల క్రితం.

నా పక్కన కూర్చున్న దేసింగు, పొట్టి సుబ్బయ్య మాత్రం బోర్డు చూసి నోటుబుక్కులో రాసుకుంటున్నారు. నేను నోటికి చేయి అడ్డుపెట్టుకుని ఏడవటం మొదలుపెట్టాను. అమ్మాయిలెవరైనా చూస్తారేమో అని సిగ్గుగా అనిపించింది. టీచరు తన చేతికంటుకున్న చాక్‌పీసు దుమ్ముని దులుపుకుంటూ తన కుర్చీలో కూర్చుంది.

ఉన్నట్టుంది నేను ఈ క్షణమే చచ్చిపోతానేమో అన్న భయం కలిగింది. ఈ భయం కలగ్గానే కళ్ళముందే క్లాస్ రూమంతా కరిగిపోతున్నట్టూ, పొట్టలో నొప్పి తాళలేనట్టూ తోచింది. పళ్ళు కరుచుకుని ఏడుపుని ఏంత ఆపుకున్నా నా వల్ల కాలేదు. నా వెనక కూర్చున్న వెంకటేశం లేచి మణికంఠం ఏడుస్తున్నాడు టీచర్ అని అరవగానే రాస్తూ ఉన్న అమ్మాయిలు కొందరు రాయడం ఆపి నా వైపు తిరిగి చూడటం చూశాను. టీచరు మాత్రం కుర్చీనుండయినా కదలకుండ “ఏమైందిరా?” అని అడిగింది. మాట్లాడలేకపోయాను. పొంగుకొస్తున్న ఏడుపుని దిగమింగుకుంటూ లేచి నిలుచున్నాను. అమ్మాయిల నా గురించి ఏదో మాట్లాడుకున్నారు.

టీచరు లేచి వచ్చి నా నుదుటి మీద చేయి పెట్టి జ్వరంగా ఉందేమో చూస్తుందేమో అనుకున్నాను. అయితే టీచరు పేడ తొక్కిన మనిషిలా ముఖంపెట్టుకుని “మణికంఠం ఇల్లు ఎవరికి తెలుసురా” అని అడిగింది. దేసింగు గాడు చెయ్యెత్తాడు. దేసింగు గాడ్ని నా సంచి తీసుకోమని చెప్పి నన్ను ఇంటిలో వదిలిపెట్టమంది. బయటికొచ్చినప్పుడు సాయంత్రపు ఎండ సగం వరండాని అలుకుతుంది. నాలుగో తరగతి పిల్ల అటెండెన్స్ రిజిస్టరు చేతపట్టుకుని హెడ్‌మాస్టరి గది వైపుకి వెళ్తుంది. కాళ్ళలో శక్తిలేనట్టు నేను ఊగుతూ నడుస్తున్నాను. దేసింగు నా సంచిని భుజాన వేసుకుని గేటు దాక వచ్చాడు. అక్కడున్న రాతిబండ మీద సంచి పెట్టేసి “ఇక్కడే కూర్చుని ఉండు వస్తా” అని బడిలోకి పరుగు తీశాడు.

బడి బయటున్న పెద్ద గేట్ ముందు నిల్చుని ఉన్నాను. ఇప్పుడు నొప్పి తగ్గినట్టు అనిపించింది. ఏడుపుకూడా ఆగిపోయింది. బడివైపు చూస్తే ఎందుకో సిగ్గుగా అనిపించింది. నేను క్లాసులో ఏడ్చినందుకు రమ్య ఏమనుకుని ఉంటుందో! ఎగతాళి చేస్తుందా? నిర్మలైతే చేస్తుంది గానీ రమ్య అలా చెయ్యదు. మళ్ళీ బడికేసి చూశాను. మోటర్ సైకిల్ నడిపేవాడిలా గాలిలో చేతులు పైకెత్తి పట్టుకుని వాడి సంచి భుజానికి వేసుకుని వస్తున్నాడు దేసింగు.

“నిన్నొదిలి వచ్చేలోపు బెల్ కొట్టేస్తే?” అందుకే సంచి తెచ్చుకున్నాను అన్నాడు నవ్వుతూ. మేము స్కూల్ నుండి బయల్దేరినప్పుడు గువ్వల గుంపొకటి తూరుపునుండి పడమరగా ఎగురుతూ ఉంది. దారిలో టూరింగ్ థియేటర్ ముందర మంచుపల్లకి సినిమా నేడే చివరి ప్రదర్శన అని ఉన్న పోస్టర్ ని చూస్తూ నడిచి వెళ్ళాము.

ఇంటిముందు పడుకుని ఉన్న కుక్క నన్ను చూడగానే లేచి తోకాడించింది. ఇంట్లో అమ్మ నిద్రపోతున్నట్టుంది. దేసింగు “సరోజత్తా” అని అమ్మని కేక వేస్తూ తలుపు నెట్టాడు. నేనెప్పుడూ అమ్మని పేరు పెట్టి పిలిచిందిలేదు. బయటివాళ్ళలా పేరుపెట్టి పిలిచినప్పుడు నాకూ అలా పిలవాలి అనిపించేది. దేసింగు పిలుపుకి అమ్మ లేచి వచ్చి సగం తెరుచుకున్న తలుపు అవతల నుండి ఎవరు అని నిద్ర కళ్ళతో చూసింది. “నేనమ్మా” అన్నాను. ఈ లోపు దేసింగు గాడు “అత్తా మణి క్లాసులో వాంతి చేసుకున్నాడు. టీచర్ ఇంట్లో వదిలిపెట్టి రమ్మని చెప్పింది” అని గట్టిగా అన్నాడు.

అమ్మ కంగారుగా వచ్చి నా మెడ నుదురు తాకి చూసింది జ్వరముందేమో అన్నట్టు. తలా వెన్నూ దువ్వుతూ దగ్గరగా తీసుకుని “ఏమైందిరా నాన్నా” అని అడిగింది. నోట్నుండి మాటలు రాలేదు. ఏడుపు ఎగతన్నుకుని వచ్చేసింది. కుక్కేమో దేసింగు గాడి కాళ్ళని వాసన చూస్తూ వాడి దగ్గరే తిరుగుతుంది. వాడు భయపడుతూ అదిలిస్తూ అటూ ఇటూ తప్పుకుంటున్నాడు. బడిలో మింగుకున్న ఏడుపునంతా ఇప్పుడు ఏడ్చేస్తున్నాను. నా ఏడుపుకి అర్థం తెలుసుకోలేక అమ్మ “నేనున్నా కదా నాన్నా ఏడవకు అంటుంది. ఇంకాస్త దగ్గరకి తీసుకుని గట్టిగా హత్తుకుంది. నా ఏడుపు ఆగలేదు.

దేసింగు గమ్మున చూస్తూ ఉన్నాడు. మూలనున్న చాప తీసి పరచింది. దానిపైన రెండు చీరల్ని మడిచి వేసి నన్ను పడుకోబెట్టింది. నేను ముడుచుకుని పడుకున్నాను. దేసింగు బడిలో జరిగిందంతా వివరంగా చెప్పాడు. అమ్మ ఇంకాస్త కంగారుగా “మధ్యాహ్నం తిన్నాడా లేదా” అని అడిగింది. దేసింగు ఏదో చెప్పాడు. “కావాలంటే ఇప్పుడు అంగటికెళ్ళి బన్ను తీసుకురానా” అని అడిగాడు. అమ్మ వద్దు అని చెప్తూ ఒక పావలా తీసి వాడి చేతబెట్టి ఏవైనా కొనుక్కు తినమని చెప్పింది. దేసింగు పావలా తీసుకుని సంతోషంగా ఈల వేసుకుంటూ పరుగు తీశాడు.

కాసేపటికి అమ్మ కాఫీ తీసుకొచ్చి తాగించింది. ఆ రోజు సాయంత్రం పక్కింటి మంజుల పిన్ని వచ్చి పిల్లాడికి కామెర్లు వచ్చినట్టుందక్కా చేతులూ ఒళ్ళూ చూడు ఎంత పచ్చగా ఉందో అంది. అమ్మ చేతులు చాచి చూపమంది. పచ్చగా ఉన్నాయి అరచేతులు. ఒంటికి పోసేప్పుడు మంటగా ఉందా అనడిగింది. అవునని తలూపాను. కామెర్లకి ఆకు మందు నూరిచ్చే పెద్దిరెడ్డి ఇంటికి తీసుకెళ్ళమని మంజుల పిన్ని చెప్పింది. చూస్తూ ఉండగానే అమ్మకి ఏడుపు వచ్చేసింది. మంజుల పిన్ని అమ్మ చేతులు పట్టుకుని “నయమైపోతుందిలే అక్కా ఏడవకు” అని పదే పదే చెప్పింది.

కొంతసేపటికి అమ్మ కళ్ళు తుడుచుకుంది. ఏడుపు సగంలోనే ఆపుకుంది. తెల్ల బట్టొకటి నా మీద కప్పి పెద్దిరెడ్డి ఇంటికి వెళ్ళొస్తానని వెళ్ళింది. ఆ రోజు నుండి కామెర్లు ముదురుతూ వచ్చాయి. అమ్మ రెండు రోజులకొకసారి నేల ఉసిరి ఆకు నూరి ఇస్తుంది. అయినా తగ్గుతున్నట్టులేవు. వేళ్ళు ముడతలు పడిపోయి పచ్చగా ఉన్నాయి. గోళ్ళకింద రక్తంలేదు. పైన కప్పుకునే తెల్లబట్టంతా పచ్చగా మారిపోయినట్టు ఉంది. ఎండిన వేపాకు చుట్టుకున్నట్టు వొళ్ళు చిక్కిపోతు ఉంది.

* * *

అమ్మ పరీక్ష రాయడానికి వెళ్ళే ముందు రోజుల్లో మాత్రం దేసింగు గాడిని ఇంటికి రమ్మని చెప్పి నాలుగైదు ప్రశ్నల్నీ జవాబుల్ని నాకు చదివి వినిపించమని అడిగింది. పాఠాలేవీ నాకు ఎక్కలేదు. గోడమీద పాకే బల్లీ, పగటి ఎండ, వేపాకు తప్ప మరొకటి గుర్తుండట్లేదు. అద్దంలో నా ముఖం చూడగానే నాకే భయమేసింది.

పరీక్ష తొలి రోజు అమ్మ వేళ్ళు పట్టుకుని నడిచి వెళ్ళాను. కొత్త పెన్ను కొని ఇచ్చింది. సంచి తనే మోసుకొచ్చింది. కొత్తగా స్కూల్ కి వెళ్తున్నట్టు భయం వేసింది. బడిలోకి వెళ్తుంటే ఇంతకు ముందెప్పుడూ చూడని ప్రదేశంలా తోచింది. అక్కడున్న పిల్లలూ, వాతవరణం అన్నీ పరిచయంలేనివిలా తోచింది.

హెడ్మాస్టర్ ని కలిసి అనుమతి తీసుకున్నాకే పరిక్షలు రాయడానికి వీలుంటుంది అని టీచరు చెప్పడంతో నేనూ అమ్మా హెడ్మాస్టర్ గదిలో కూర్చుని ఉన్నాము. పరీక్షలకి కావలసిన ప్రశ్నాపత్రాల కట్టలు బల్ల మీద పేర్చి ఉండటం నా కంటపడింది. ఇవన్నీ తగలబడిపోతే బాగుండు అనిపించింది.

టీచర్లు వచ్చి వారి వారి తరగతుల ప్రశ్నాపత్రాలను తీసుకెళ్ళారు. హెడ్మాస్టరు నన్ను పరిక్ష రాయగలవారా? అనడిగాడు. నేను తలూపాను. అమ్మ సంచిలోనుండి పరీక్ష అట్ట, పెన్ను తీసి చేతికిచ్చింది. నేను పరీక్ష హాల్లోకి వెళ్ళేప్పటికి పిల్లలు పరీక్ష రాస్తు ఉన్నారు. నన్ను చివర బెంచీ మీద కూర్చోబెట్టారు. ఒక అమ్మాయి తలెత్తి నాకేసి చూసింది. ప్రశ్నాపత్రం అందుకోగానే వణుకు మొదలైంది. అట్ట మీద పెట్టుకున్న తెల్ల కాగితాన్ని చూస్తూ ఉన్నాను. మళ్ళీ జ్వరం వచ్చేలా అనిపించింది. ప్రశ్నలకి జవాబులేవీ గుర్తుకు రావడంలేదు. అమ్మ వచ్చి పక్కన నిల్చుంటే పరీక్ష రాసేయగలను అనిపించింది.

ఏదీ రాయలేక తలవంచుకుని కూర్చున్నాను. గమ్మున కూర్చున్న నన్ను చూసిన టీచరు “ఏంట్రా రాయలేదా?” అని అడిగింది. నేను దుఃఖం కమ్ముకున్న గొంతుతో “మా అమ్మని చూడాలి” అన్నాను. “ఏం ఆవిడ పరీక్ష రాస్తుందా నీ బదులు? అని ఎగతాళి చేసింది టీచరు.” అమ్మాయిలెవరో నవ్వారు. నా కాళ్ళు వణుకుతున్నాయి. పరీక్ష హాల్ అప్పటికప్పుడు చీకటిగా మారుతున్నట్టు అనిపించింది. టీచరు “పరీక్ష సరిగ్గా రాయి” అని గద్దించి వెళ్ళింది.

దేసింగు ఎక్కడ కూర్చున్నాడా అని వెతికాను. వాడు మొదటి బెంచ్ లో కూర్చుని గబగబా రాసేస్తున్నాడు. కనీసం వాడి పక్కనైనా కూర్చోబెట్టి ఉంటే బాగుండేది అనిపించింది. పరీక్ష పేపరు మీద నా పేరు, శ్రీరామ జయం ఈ రెండు మాత్రమే రాశాను. మరో అక్షరమైనా రాయలేదు. అమ్మ ఇంటికి వెళ్ళిపోయుంటుందా లేక బయట నాకోసం కూర్చుని చూస్తూ ఉంటుందా? నేను ఒక్కడినే ఇంటికి వెళ్ళగలనా? లేదంటే సగం దార్లో కళ్ళు తిరిగి పడిపోతానా అని కలత మొదలైంది.

టైం అయింది. బెల్ కొట్టారు. టీచరు నా దగ్గరకొచ్చి పేపరు తీసుకుంటూ దాని వంక చూసింది. తీసుకుని “శ్రీరామ జయం రాస్తే పరీక్షలో పాసైపోతావా” అని అడిగింది. అది విని పిల్లలందరూ గొల్లున నవ్వారు. ఇలానే అన్ని పరీక్షలూ అయ్యాయి. చివరి రోజు టీచరు నన్ను హెడ్మాస్టర్ గదికి తీసుకు వెళ్ళింది.

వాళ్ళు మాట్లాడుతూంటే చప్పుడు కాకుండ నేను బయటికెళ్ళి ఇంటి వైపుకి నడవడం మొదలుపెట్టాను. రోడ్డు పక్కనున్న చెట్లన్నీ నా మీద వాలిపోతున్నట్టు అనిపించింది. ఇంటికెళ్ళే దారి దూరం పెరిగిపోయినట్టుగా ఉంది. నడిచిన కొద్దీ దూరం పెరుగుతున్నట్టు ఉంది. అట్ట, సంచి కూడా తీసుకోకుండా ఇంటికి పరుగు తీసినట్టున్నాను. ఇంట్లో అమ్మ తిరగలి తిప్పుతోంది. ఆమె ఒడిలో వాలిపోయాను.

“ఏం నాన్నా పరీక్ష ఎలా రాశావు” అని అడిగింది. ఏడుస్తూ చాప పరచి పడుకుని “నేను చచ్చిపోతానమ్మా” అన్నాను. అయ్యో నా బిడ్డ ఏవేవో మాట్లాడుతున్నాడే అని అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. ఆ రోజు రాత్రి ఇంటికొచ్చిన దేసింగ్ గాడు అమ్మ దగ్గర టీచరు గురించి ఏవో చెప్పి తిడుతున్నాడు. అయ్యో టీచరు అలాంటిది కాదు తిట్టకురా అని అరవాలి అనిపించింది. అయినా చెప్పలేకపోయాను.

వాడెళ్ళిపోయాక గుడ్డి దీపం వెలుగులో నేను ప్రశ్నాపత్రాలన్నిట్నీ తీసుకుని చూశాను. ఇంచుమించు అన్ని ప్రశ్నలూ నాకు జవాబులు తెలిసినవే ఉన్నాయి. మనసులోపల అన్ని ప్రశ్నలకీ అప్పటికప్పుడు జవాబులు రాసుకున్నాను. అమ్మ ఇంటి బయట వీధిలో కూర్చుని మంజుల పిన్నితో టీచరు గురించి ఏవో ఫిర్యాదులు చెప్తోంది. నాకు జ్వరం ఉందా అని ఒకే ఒక్క సారి టీచరు నన్ను పట్టుకుని చూసుండవచ్చు కదా అని మనసులో దుఃఖం కలిగింది. టీచరు గనక అలా చేసుంటే నాకు కామెర్లు వచ్చుండేవి కావేమో అనిపించింది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, అరవ కథలు, జూన్ and tagged , , , , , , , , .

5 Comments

 1. కామెర్లు కథ ఆర్ద్రతగా ఉంది. 12 ఏళ్ళ వయసులో పిల్లలు టీచర్లను ఎంతగా ఆరాధిస్తారో, వాళ్ళ ప్రెమకై ఎలా తపిస్తారో సూక్ష్మంగా, సున్నితంగా చెప్పారు. ముఖ్యంగా కంటికి కనిపించిన ప్రతి చిన్న అంశాన్ని కథనం లో చొప్పించడం వలన, కథా పరిధి లోకి తీసుకోవదం వలన రచయిత పాఠకుడిని తన వశం చేసుకోవచ్చు . ఉదా – ఆమె జడలోని మల్లెపూలు వాడిపోయి పలచగా అయి సరంకట్టిన దారం కనబడుతుంది.
  పిల్లల మానసిక స్తితి తెలుసుకోవడం అందరికీ సాధ్యం కాదు. వాళ్ళ ఆలోచన మేరకే కథ రాయాలి. లేదంటే కథ అభాసు అవుతుంది .
  చాసో ” ఎందుకు పారేస్తాను నాన్నా” , ” కుంకుడాకు ” , స్మైల్ ” ప్రుధ్వీ ” .. లాంటి కథలు గొప్ప కథలు.
  ఇలాంటి కథలు ఉత్తమ పురుష లో కంటే థర్డ్ పెర్సన్ లో రాస్తే మంచిదని నా ఉద్దేశ్యం – ఇది అనువాదం గనక మనచేతిలో ఏమీ లేదనుకోండి .

 2. @కె. కె. రామయ్య గారూ,
  మీ అభిమానానికి ధన్యవాదాలండి. మీవంటి పెద్దలు చిన్న పిల్లాడి ప్రయత్నాన్ని మెచ్చుకున్నందుకూ, రచయితకి ఫోన్ చేసి మాట్లాడినందుకు సంతోషమం!

  @S. Narayanaswamy
  థేంక్స్ అన్నా.

 3. ప్రియమైన శ్రీ ఆవినేని భాస్కర్ గారు,

  మీ యీ కామెర్లు కధ నాకెంతగా నచ్చిందంటే చిన్నప్పుడు చదువుకున్న రవింద్రనాథ్ టాగోర్ Home Coming కధను జ్ఞప్తికి తెచ్చింది. అనువాద కధ అనే భావనే కలగలేదు. హృద్యమైన యీ కధ వల్ల పొంగి పొరలిన నా మనో భావాలను మూలకధా రచయిత శ్రీ రామకృష్ణన్ గారితో వచ్చీ రాని తమిళ్ లో ఇలా చెప్పుకున్నాను :
  _______________________________________________________

  మంజ కామెర్లు సిరుకధై నల్ల ఇరిక్కు. రామకృష్ణన్ సార్ రొంబ నండ్రి.
  చిన్న పసంగలొడల నట్పు నల్లా కాట్టిరికింగె. తాయ్ పాశం సిరప్పా ఎళిదిరి ఇరికింగె.
  చిన్న పయ్యనుడ ( మణి ) ఉనరవు ఎన్న నల్లా బాదిచ్చిదు.
  క్లాస్ టీచర్ అంద చిన్న పయ్య మేల పరిదాపం కాటలే. అది ఎనక్కు రొబ కష్టమా ఇరిందిదు.
  ఇంద కధను తాంగళ్ పడితవిట్టు Audio File యా పణ్ణితర ముడియుమా ?

  అంటూ రామకృష్ణన్ గారికి నా కృతజ్ఞతలను తెలియచేసుకున్నాను.
  _______________________________________________________

  ఇందులో ఉన్న కధ, కధనం, శిల్పం, సార్వజనీయత వంటి గుణగణాల గురించి చెప్పగల సామర్ధ్యం నాకు లేదు. గొరుసన్నలాంటి సీనియర్స్ విడమర్చి చెప్పగలరు.

  తమిళ ఆంధ్ర ఉభయ భాషా ప్రావీణ్యంతో, గ్రామీణ ప్రాంత మమకారాల సొబగుల నెరిగిన ఆవినేని భాస్కర్ ఇంత మంచి కధను ఇంత మంచిగా
  తెనుగించి మనకిచ్చాడని తను అప్యాయంగా బాబాయి అని పిలుచుకునే నామిని గారికి కూడా చెబుదామని ఉబలాటంగా ఉంది.
  కినిగె, మెహర్ చేస్తున్న తెలుగు సాహిత్య సేవకు మనసా అభినందనలు

  ~ ఇట్లు గొరుసన్న గారి తం. మా. రామయ్య

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.