cover

అనుకోకుండా (4)

Download PDF ePub MOBI

పొద్దుపొద్దున్నే వాళ్ళిద్దర్నీ చెరొక ఒడ్డులో దించేసి – పడవ గుండెకు చిల్లు పెట్టుకుని మునిగిపోలేదూ? రేవులో గాలి రెండుగా చీలి చెట్ల మానుల్ని నిలువునా కోసెయ్యలేదూ? కొమ్మల్లో కాకులు నిద్రలోనే రెక్కల్ని రాల్చేసుకోలేదూ?

సరిగ్గా ఈ దృశ్యంతోనే మన కథ మొదలయ్యేది.

*

ఆ రాత్రి తర్వాత, ఆ ఉదయం తర్వాత – రక్తమధనం సుడిగుండాలుగా రేగి రేగి ఏ రాత్రీ నది నిద్రపోలేదు. పగటి వెలుగుని రవ్వలుగా చిలికి వూరంతా పంచుకున్నాక, వెక్కుళ్ళాగిన చప్పుడొకటి మధ్యాహ్నపు ఉక్కపోతలో చన్నీళ్ళతో మొహం కడుక్కునేది.

ఎవరూ గమనించరు కానీ, అరికాళ్లలో సూదంటు రాయితో రాసుకున్న పేర్లని చూడలేరు కానీ, అరచేతిలో కొవ్వొత్తి వెలిగించుకుంటే తప్ప ఓర్చుకోలేని దుఃఖం ఉందంటే నమ్మలేరుకానీ, పాత సత్తుగిన్నె ఒకదాన్ని – ఆకలిని కలిసి తిన్నగుర్తుగా దాచుకుంటారని అస్సలు ఊహించలేరు కానీ…

*

ఇదంతా ముందే తెలీదూ?

మునిగిందనుకున్న పడవ అతుకేసుకుని మనం చూడకుండా మరో ప్రయాణానికి సిద్ధమవ్వక తప్పదని,

పంచుకున్న రవ్వల్ని ఊర్లో ఒక్కరూ మనకోసం మిగల్చరు కాబట్టి కలలోని కొవ్వొత్తి తప్ప కళ్లకి మరో చూపు మిగలదని,

నరాల్లోపల ఉబికే సెల ఎవరితో ఏమీ చెప్పుకోనివ్వక ఒకటే సలపరిస్తుందని.

*

ఉన్నదొకటే, శరీరం. ఇంకేం లేవు.

చుట్టూ ఉన్నదంతా నువ్వు కాదు లోకమనీ, నిన్ను చంపుతున్నదంతా నొప్పి కాదు బాధ అని, సుఖాన్ని గాల్లోకి ఊది సంగీతాన్ని పీల్చుకు బతకమని – బ్రతిమాలే ఇదే శరీరం.

*

ఐతే కథ ముగించే ముందు ఒకమాట చెప్పుకోవాలి;

మాటలన్నీ సద్దుమణిగిన తర్వాత కూడా ఆగని వెక్కిళ్ళ చప్పుడు గురించి ఒక్కమాట –

అందరూ వెళ్ళిపోయాక, సగం తెరిచి వదిలిన తలుపులు గుమ్మానికేసి తలబాదుకోవడం గురించి కూడా.

*

Download PDF ePub MOBI

(Image Courtesy: https://www.flickr.com/photos/52428195@N02/11257890313)

Posted in 2014, జూన్, మ్యూజింగ్స్ and tagged , , , .

2 Comments

  1. స్వాతీ, ఈ కవితలో మీరేదో గమ్మత్తు చేసారు. కథ చెప్పడం అనేది కవితలో బాగా ఇమిడింది. ఆ చివరి వాక్యాల్లో కథా కవితా రెండూ కలగలిసిపోయాయి.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.