cover

మోహచంద్రిక

Download PDF ePub MOBI

గై డి మొపాసా (Guy de Maupassant) “మూన్‌లైట్” కథకు నరేష్ నున్నా అనువాదం ఇది. 

మోహచంద్రిక

గై డి మొపాసా

ఇటీవలే స్విట్జర్లాండ్ వెళ్ళివచ్చిన తన అక్క హెన్రిట్ లెటోరి కోసం ఎదురు చూస్తూంది జూలి రుబిరి. ఐదు వారాల క్రితం అక్క కుటుంబం స్విట్జర్లాండ్ ట్రిప్పుకి వెళ్ళింది. కల్వాడస్‌లోని వాళ్ళ ఎస్టేట్‌లో చక్కబెట్టాల్సిన వ్యవహారాలు ఉండటం వల్ల హెన్రిట్ కొంచెం ముందుగానే భర్తని పంపించేసింది.

తర్వాత ప్యారిస్‌లో చెల్లి దగ్గర కొద్ది రోజులు గడిపి వెళ్దామని నిర్ణయించుకుంది.

పొంచి ఉన్న రాత్రి అడుగులో అడుగేసుకుంటూ ప్రవేశిస్తుంది నెమ్మదిగా. సాంధ్య నీడల్తో క్రమేణాచిక్కబడుతుంది చీకటి, ఆ ప్రశాంతమైన గదిలో. అన్యమనస్కంగా పుస్తకం పేజీలు తిప్పుతూ, ఏ అలికిడైనా ఆత్రంగా అటుకేసి చూస్తుంది జూలి, అక్క రాక కోసం. అనుకున్న క్షణం రానే వచ్చింది.

తలుపు దగ్గర బెల్ మోగింది. అక్క గుమ్మం దగ్గర ప్రత్యక్షమయింది, ప్రయాణపు దుస్తుల్లో వడిలిన పూరెమ్మలా. ఒకరినొకరు చూసుకున్న ఆనందంలో ఆప్యాయంగా హత్తుకున్నారు. ఎన్నాళ్ళకో కలుసుకున్న సంబరంలో మళ్ళీ మళ్ళీ కావలించుకున్నారు. వాళ్ల గురించి, వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాల గురించి పరస్పరం తెలుసుకుంటూ, తెంపులేని ముచ్చట్లలోకి కూరుకుపోయారు.

అర్థాంతరంగా విరిగిపోతున్న వాక్యాలు, తోసుకొస్తున్న ప్రశ్నల పరంపరకి అరకొర సమాధానాలు… టోపి, వల్లెవాటు తీసేస్తూ, అన్ని కబుర్లు ఒక్క పుక్కిట పట్టాలన్న యావ పడుతుంది హెన్రిట్.

అప్పుడే ముసురుతున్నాయి చీకట్లు. దీపాలు వెలిగించమని పని వాళ్ళని పురమాయించింది జూలి. గదిలోకి దీపం తీసుకురాగానే అక్క ముఖాన్ని తేరిపార చూసింది. మరోసారి అక్కని ఆలింగన చేసుకుంది. అయితే, అక్క వాలకాన్ని చూసి గతుక్కుమంది. అక్క రెండు కణతల మీద జీరాడే వెంట్రుకల పాయ నెరవడం ఆమె ఆశ్చర్యానికి కారణం. మిగతా జుట్టంతా ఒతైన తుమ్మెద రెక్కల్లా సహజంగానే ఉంది గానీ, చెంపల పైన చెరోవైపు పాకుతున్న రెండు వెండి తీగలు నలుపు గుబురుల్లోకి ఆదృశ్యమవుతున్నాయి.

ఆమె వయసు కేవలం ఇరవై నాల్గేళ్ళే. స్విట్జరాండ్ వెళ్ళకముందీ తెల్ల వెంట్రుకలు లేవు.

అంగుళం కూడా కదలకుండా అక్కనే తదేకంగా చూసింది జూలి. దిగ్ర్భాంతిలో నీళ్ళు చిప్పిల్లిన కళ్ళతో హెన్రిట్‌ని గమనిస్తూ, తనకి కచ్చితంగా ఏదో ఉపద్రవం వచ్చిందనుకుంది. తమాయించుకుని అడిగింది- “అక్క! నీకేమయింది?”

ఎద గాయమైన దానిలా జీవంలేని నవ్వొకటి నవ్వుతూ బదులిచ్చింది హెన్రిట్. “ఏం అలా అడిగావ్. ఏమీ కాలేదు. ఈ తెల్లవెంట్రుక చూసేనా నీ కంగారు?”

కానీ ఆమె భుజాల్ని ఉద్వేగంతో పొదివి పట్టుకొని గుచ్చి గుచ్చి చూస్తూ మళ్ళీ అడిగింది జూలి: “చెప్పు. నిజం చెప్పక్కా? ఏమయింది నీకు? అబద్ధం చెబితే నా మీద ఒట్టే…”

ఇద్దరూ ఒకరి ముఖంలోకి మరొకరు చూసుకుంటూ ఉండిపోయారు. పాలిపోయిన ముఖంతో హెన్రిట్ దాదాపు స్పృహ తప్పేలా అయింది. సజలమైన ఆమె కంటి కొలనుల కొసల్లో నీటి ముత్యాలు జారడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆమెనా స్థితిలో చూస్తూ చెల్లెలు పట్టి పట్టి అడిగింది.

“ఏమయిందే నీకు… ఎందుకలా అయిపోయావు… చెప్పు…”

గద్గదమై జీరబోయిన హెన్రిట్ గొంతులోంచి గొణుగుతున్నట్టుగా వినవచ్చాయి కొన్ని మాటలు:

“నాకు… నాకొక ప్రియుడున్నాడు.”

అంతలోనే చప్పున ఏదో గుర్తుకొచ్చి చెల్లి భుజం మీద తలవాల్చి వెక్కివెక్కి ఏడ్చింది హెన్రిట్.

ఉద్రేకంతో ఎగిసిపడిన ఆమె వక్షం పొంగు చల్లారాక, తనను తాను తమాయించుకొన్నాక, తన అంతరంగాన్ని వేదనతో ముంచెత్తిన రహస్యాన్ని సానుభూతితో అర్థం చేసుకునే మరో ఆప్త హృదయానికి పంచాలని దృఢంగా నిశ్చయించుకున్నాక ఆమె కొంచెం స్థిమితపడింది. తర్వాత ఒకరి చేతులు మరొకరు గట్టిగా పట్టుకొని ఆ మసక చీకటి గది మూలనున్న సోఫాలో చేరగిలబడ్డారా అక్క చెల్లెళ్లు. అక్క మెడ చుట్టూ చెయ్యివేసి, తనని తన గుండెలకి చేరువగా పొదువుకొని ఆమె చెప్పింది వినసాగింది జూలి.

* * *

“అబ్బ! దానికి నిష్కృతి లేదని నేను గ్రహించాను. నాకు నేనే అర్థంకావడంలేదు. ఆ రోజు నుంచి నేను పిచ్చిదాన్నయ్యానేమో అన్పిస్తుంది. బంగారు తల్లి! నీ గురించి జాగ్రత్త పడు, అప్రమత్తంగా ఉండు. ఎంత బేలలం మనం. ఎంత చప్పన కరిగిపోతాం, లొంగిపోతాం. ఏదో ఓ బలహీన క్షణం. ఏదో హఠాత్ మైకపు వ్యధ నీ అంతరంగాన్ని ఒడిసిపడుతుంది. హృదయకవాటాలు తెరిచి, చేతులు బార చాచి తనివి తీరా ప్రేమించాలని, గాఢంగా కావలించాలని బలంగా వాంఛిస్తాం.

“మీ బావగారి గురించి తెలుసుకదా నీకు. ఆయనని నేనెంత ప్రేమిస్తానో నీకు తెలియంది కాదు. ఆయనొక పెద్ద మనిషి. అయితే, స్త్రీ హృదయ తంత్రీ మూర్ఛనల్ని ఆయన గమనించలేరు. ఆ అనుకంపనలు ఆయనకు బొత్తిగా అర్థంకావు. సర్వకాల సర్వావస్థల్లో ఆయనలో ఏ మార్పు ఉండదు. ఆయన మర్యాదస్తుడు. మంచివాడు. చెదరని చిర్నవ్వు, సడలని వ్యక్తిత్వం, సదా దయార్ర్ద హృదయం. అబ్బ! భరించలేనంత మంచితనం. కొన్ని సార్లు నేను బలంగా కాంక్షిస్తాను, ఆయన తన మోటు చేతుల్తో బంధించి నన్ను నలిపేయాలని. మెల్లమెల్లగా మెత్తమెత్తగా తాకుతూ, రెండు దేహాలు మిళితం చేస్తూ పరస్పర విశ్వాసాల్ని వెలిగించే ముద్దులతో ఆయన కావలింతలో కరిగి పోవాలని ఆశిస్తాను. ఆయన అంతకంత బలహీనుడై, ఒంటరై నాకోసం తపించి, నా కన్నీళ్ళకి తల్లడిల్లి, నా ఆలింగనాల కోసం అర్రులు చాచాలని ఎంతగా ఆశించానో చెప్పలేను.

“ఇదంతా వెర్రితనంగా అన్పించవచ్చు. మనం ఆడవాళ్ళం. అలానే సృజించబడ్డాం. దానికి మనమేం చేయగలం?

“ఇన్ని రకాల తీరని కాంక్షలతో రగిలిపోతున్నా, ఏనాడూ మోసమన్నది ఊహామాత్రంగా కూడా నా దరి చేరలేదు. ఈ రోజు ఆ మోసం జరిగిపోయింది. ఏ ప్రేమాలేకుండా, ఏ కారణమూ లేకుండా, ఏదీ లేకుండానే. లుసిర్నె సరస్సు మీద ఆకాశంలో పున్నమి పూర్ణ చంద్రుడు ఓ రాత్రి నిండుగా వెలగడం మినహా మరే యితర కారణం లేకుండా నా భర్తకి ద్రోహం జరిగిపోయింది.

“మేము విహార యాత్రలో ఉన్నప్పుడు మర్యాదస్తుడైన నా భర్త తన సహజ శాంత గాంభీర్య నిర్లక్ష్యంతో నాలో ఉద్రేకిస్తున్న రక్తాన్ని చల్లార్చేశాడు. పొంగిపొర్లే కవితావేశానికి కళ్ళాలు వేశాడు. ఓ సువర్ణ సుప్రభాత సమయంలో మేమిద్దరం ఒక కాలిబాటన కొండ దిగుతున్నాం. రాజసం, ఠీవితో మిసమిసలాడుతున్న నాలుగు జవనాశ్వాలు- నా ఉత్సాహాన్ని పోలిన ఉరకలెత్తుతూ ఎదురయ్యాయి. ఉదయపు ఉలిపిరి మంచుతెరల్లోంచి మార్మిక లోయల్ని, చిక్కని అడవుల్ని, సెలపాటల ఏరుల్ని, ఏకాంత సీమల్లాంటి పల్లెల్ని చూశాము. ఆనందాతిశయంతో చేతులతో చక్రబంధాలు వేస్తూ మత్తుగా అన్నానిలా: ‘ప్రియా! ఎంత మనోహర దృశ్యం. రా! మన గాఢాలింగన చుంబనంతో ఈ నిసర్గ రమణీయతలో భాగమైపోదాం…’

“కోత పెట్టే దయ ప్రదర్శిస్తూ మందహాసంతో అన్నారాయన: ‘నీకీ ప్రకృతి నచ్చినంత మాత్రాన, అకారణంగా మనమెందుకు ముద్దాడుకోవాలి?’

“ఆయన మాటలకి చలించే శిలనైపోయాను. ఎవరైనా ప్రేమికులు పరస్పరం మోహపడినప్పుడు, తాము ప్రేమతో మాత్రమే ప్రేరణ పొందామే తప్ప, మరే ఇతర సుందర దృశ్యాతిరేకం వల్ల ఉత్తేజితులంకాలేదని అనుకోవాల్సిందేనా అన్పించింది.

“అవును! నిశ్చయంగా ఆయనే!! నాలో మరిగి ఉవ్వెత్తున చిమ్మడానికి సిద్ధమైన కవిత్వాన్ని అణచివేసింది ఆయనే. ఎలా చెప్పగలను నా ఎద ఘోషని. ఆవిరితో నిండి, నిండా బిగించిన బాయిలర్‌లా కుతకుతలాడిపోతుంది అంతరంగం.

“మరో రోజు సాయంత్రం (హోటల్ డి ఫ్లూలెన్ లో నాల్గురోజులున్నాములే) తీవ్రమైన తలనొప్పితో ఆయన భోజనం తర్వాత హోటల్ గదిలో పక్కమీద ఒరిగిపోయాడు. నేను ఒక్క దానినే సరస్సు ఒడ్డున నడిచాను.

“మనం సాధారణంగా ‘అనగా అనగా…’ అపురూప కథల్లో చదివే రాత్రి అది. నడి ఆకాశంలో నిండు చందమామ, శిఖర నిమ్నోన్నతాలతో బారులు తీరిన పర్వతాలు, వెండి కిరీటాల్లా తోస్తున్న మంచుతొడుగులు, చిరు అలల కంపనతో తళతళలాడుతున్న తటాకం. జోగుతున్నట్టు మత్తుగా వీస్తున్న గాలి – తాజాదనాన్ని లోనికి చొప్పిస్తూ ఏదో అపస్మారక అనుభవాన్ని కలగజేస్తుంది, బైటకి దొరకని కారణాలతో మనల్ని చుట్టి వివశుల్ని చేస్తుంది. అటువంటి ఘడియల్లో ఎద ఎంత సొద పెడుతుంది, ఎంత సజలమైపోతుంది, ఎంత తల్లడిల్లుతుంది! ఎంతగా ఎగిసి పడుతుందా పిచ్చి హృదయం! ఎంత తీవ్రాతి తీవ్రం దాని ఉద్వేగాలు!

moha chandrika“నేనక్కడ గడ్డిపోచల మీద కూర్చుండిపోయి వ్యాకులతలా, వ్యసనపెట్టే సౌందర్యంలా అనావృతంగా విస్తరించిన సరస్సు వంక చూస్తుండిపోయాను. ఏదో చిత్రమైన మార్పు నాలో. అలవికాని వలపుని ఆశిస్తూ నిలువెల్లా వాంఛాసిక్త మయ్యాను. నా జీవితంలోని నీరవ నిర్లిప్తత మీద తిరుగుబాటుతో క్రొన్నెత్తురు పరవళ్ళు తొక్కింది. ఏమిటి నా ఖర్మ! విందారబోస్తున్న ఈ పచ్చి వెన్నెల జల్లులలో ఇటువంటి తామర పూల తటాక తీరంలో నన్ను నేను దోసిగ్గి అర్పించుకున్న ఓ మనోహరుడి చేతుల్లో ఖైదు కావాలన్న నా కాంక్ష ఈ జన్మకి నెరవేరదా? అదురుతున్న నా అధరాల మీద అతని గాఢమైన తడి ముద్రలు అద్దుకునే అదృష్టమే లేదా? భగవంతుడు తీవ్ర మోహాలింగనాల కోసం సృష్టించిన రాత్రి వేళలలో ప్రేమికులు ఒకరినొకరు మరిగి, పరస్పరం మరులుగొని, తీపి మైకాల లొంగి, పెదాల దొప్పలతో ఇచ్చిపుచ్చుకునే ఎంగిలి తాయిలాలకు నేను నోచుకోలేదా? ఆ వేసవి రాత్రి తామస చంద్రికలు మండించిన నీడల మాటుల ప్రగాఢమై ప్రజ్వలించే ప్రేమను పొందే యోగం లేదా నాకు?

“ఆలోచనలు ఆవిరైపోయి అబలై మిగిలిన ఏకాకి స్త్రీలా నేను రోదించాను. ఇంతలో ఎవరో ఒక వ్యక్తి నావెనక కదలిన అలికిడి. ఒక మగమనిషి నన్నే పట్టి చూస్తున్నాడు. నేను తలతిప్పి చూడగానే నన్ను గుర్తుపట్టి నా వంక నడిచొస్తూ అన్నాడు: ‘మీరు ఏడుస్తున్నారా?’

“అతనొక కుర్ర ప్లీడరు. తన తల్లితో కలిసి ఇక్కడికి పర్యాటనకు వచ్చాడు. మేం వాళ్ళని చాలాసార్లు కలిశాం. అతని చూపులు నన్ను చాలాసార్లు వెన్నాడాయి కూడా.

“అతను హఠాత్తుగా కనిపించి ప్రశ్నించేసరికి, అయోమయంలో నాకప్పుడు ఏమి చెప్పాలో తోచలేదు. కాస్త నలతగా ఉందని మాత్రం చెప్పాను. అతను నా పక్కనే ఎంతో సహజంగా, మన్నన పూర్వకంగా అడుగులేస్తూ ఈ ట్రిప్పులో మేము ఏమేమి చూశామో వాటి గురించి మాట్లాడటం మొదలెట్టాడు. నేను అనుభవించినది, భావించినది మొత్తాన్ని అతను తన మాటలలోకి తర్జుమా చేసి వినిపించాడు. నేను అర్థం చేసుకున్న దానికంటే ఉన్నతంగా, ఇంకా విస్పష్టంగా అతను దృశ్యావలోకనం చేయడం నన్నెంతో ఉద్విగ్నతకి గురిచేసింది. అనిర్వచనీయమైన ఉద్వేగం నిలువెల్లా కమ్మి ఉక్కిరిబిక్కిరై పోయిన భావన. కొండలు, కోనలు, ఏవో కలవరాల సరోవరం, అవిరామంగా కురుస్తున్న చంద్రకాంతి… సర్వం వర్ణనాతీతమైన తీయదనంతో నా అనుభవాన్ని గానం చేస్తున్నాయా అన్పించింది.

“అప్పుడే అది సంభవించింది – ఎలానో నాకైతే తెలినే తెలియదు. ఏదో చిత్తభ్రమలో దొర్లిపోయింది, నిష్ర్పమేయంగా. మర్నాడు ఉదయం అతను వెళ్ళిపోయేంత వరకూ నేనతన్ని మళ్ళీ చూడలేదు. తన చిరునామా, వివరాలు నాకిచ్చి వెళ్ళిపోయాడు.”

* * *

వెక్కిళ్ళతో కీచుమంటున్న గొంతు పూర్తిగా పూడుకుపోతుండగా చెల్లెలి చేతుల్లోకి ఒరిగిపోయింది హెన్రిట్.

ఆమెను సంభాళిస్తూ స్పష్టంగా, చాలా మృదువుగానూ చెప్పింది జూలి:

“చూడక్కా! చాలా తరుచుగా మనం ప్రేమించేది అసలు మగాడ్నే కాదు, కేవలం ప్రేమను మాత్రమే ప్రేమిస్తాం. ఆ రాత్రి వాస్తవంగా నీ నిజమైన ప్రియుడు వెన్నెల మాత్రమే!”

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, జూన్ and tagged , , , , , , , .

2 Comments

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.