cover

నందుగాడి గర్ల్‌ఫ్రెండ్

Download PDF ePub MOBI

దసరా సెలవులిచ్చి గప్పటికే రెండ్రోజులైంది, నందుగాడు అమ్మమ్మోళ్ళింటికి పోయేటోడు ఎందుకోపోలె. గానాడు పెత్రామాస, సిన్న బతుకమ్మ పేర్వటానికి డ్యాం కిందున్న సెలకల నుంచి తంగేడు పువ్వు కోసుకొని ఇంటికొచ్చిండు నందుగాడు. మా నాయినే అని మెచ్చుకుంటా “ఇంటి ముంగటి ఎమ్ఆర్ఒ సారోళ్ళకు గూడ కావల్నట, కొద్దిగిచ్చి పోరా” లచ్చువమ్మ సగం పువ్వు మళ్ళా నందుగాడి సేతులవెట్టింది. “పెద్ద బతుకమ్మ దాక అయితదని బగ్గ కోసుకచ్చిన, నేనవ్వలకియ్యా” పాలేర్ల సెమటిని దొరలు దోసుకున్నంత ఇదైపోయిండు నందుగాడు. ఆ సగం తంగేడు పువ్వు తీసుకవోయి మూడో కంటికి కనవడకుండా అంటిట్ల అటక మీదేసిండు.

గీ ఎమ్ఆర్ఒ సారోళ్ళు ట్రాన్సఫరై కొత్తగచ్చిర్రు. “ఆళ్ళ ఊళ్ళే గీళ్ళు పెద్దొరలట, నాయనమ్మోళ్ళ తల్లి గారోళ్ళది ఈళ్ళది ఒకటే ఊరట. గీ ఎమ్ఆర్ఒ సారు పెద్దొర మనవడేనట.” నాయనమ్మ తెగ ఇదిగా జెప్తుంటే నందుగాడికి దొరలంటేందో సమజ్ గాలే.

“ఆంటీ!” తియ్యగా ఎవరో పిల్తే నందుగాడు దర్వాజ దిక్కుజుసిండు.

“మా ఆంటీ… తంగేడు పూల కోసం పంపింది” రెండు జళ్ళు, ఎర్ర రిబ్బన్లు, తెల్లగౌను, ప్యారగాం స్లిప్పర్లేసుకుని దర్వాజల నిలవడ్డది ఓ పదేండ్ల పిల్ల.

“ఇగో ఇప్పుడే కొసకచ్చిండు… రా… ఇంట్లకు రావమ్మా! ఆన్నే నిల్సున్నవ్?” బీడిల శాట పక్కకు వెట్టి లేసింది లచ్చువమ్మ.

“ఎవలి పొల్ల??” నశ్యం ఎగపీలుస్తూ నాయినమ్మ.

“ఎమ్ఆర్ఒ సారోళ్ళ అక్క బిడ్డనట… సెలవులకొచ్చినట్టుంది.” లచ్చువమ్మ పెద్దింట్ల వెట్టిన సగం తంగేడు పువ్వు తీసుకచ్చి ఆ పిల్ల సేతుల వెట్టింది.

“మళ్ళా పువ్వు కొసకరమ్మంటే… గప్పుడు జెప్తా!” లోపట ఉడుక్కుంట నందుగాడు.

సగం గంపెడు తంగేడు పువ్వు పట్టుకునెదానికి ఆ పిల్ల రెండు సిట్టి సెతులు సాలట్లే.

“ఒరేయ్ నందుగా! ఈ పిల్లకి సాయంగా ఆళ్ళింటిదనకా పోయిరా పోరా” లచ్చువమ్మ ఆ పిల్ల సెతుల పట్టేటన్ని పూలు పెట్టి, మిగిలిన పూలు నందుగాడికిచ్చి పంపిద్దామని పిలిసింది.

“నేను పోను పో… నా కాళ్ళు నొత్తున్నయి” నందుగాడు గోఠిల ఆటకువోయేటనికి దిగుట్లున్న గొఠిల డబ్బా తీసిండు.

“గోఠిల ఆటకైతే ఊరుకుతవ్… గీడిదనకవోరా అంటే కాళ్ళు నొత్తున్నయ్రా నీకు? లంగ గాడ్ది” ముక్కుకంటిన నశ్యాన్ని కొంగుతోని తుడుసుకుంటా నాయినమ్మ “ఆళ్ళు దొరల్రా బాంచెన్… జర పోయిరా పో” బతిలాడింది. తనీడు పిల్ల ముంగట గాడ్ది అని తిట్టెవరకు నందుగాడికి రేషం పొడుసకచ్చింది. “ఆగు… అచ్చి నీ సంగతి జెప్తనే నాయినమ్మ… నీ నశ్యం సీస తీసి బండగొట్టకపోతే సూడు” లోపట అనుకుంట లచ్చువమ్మ సెతులున్న తంగేడు పువ్వు అందుకొని ఆ పిల్ల ఎనక నడిసిండు.

తొవ్వల “నీ పేరేంది” సక్రాల్లా కళ్ళు తిప్పుకుంట అడిగింది.

“నందు”

“నా పేరు సరిత” నందుగాడు అడగకున్న చెప్పింది. “నువ్వెన్నో తరగతి?”

“ఆరు”

“నేనూ ఆరో తరగతే… గిదే మా ఇళ్ళు” పాటకు తీసుకొని సర్రున లోపలికురికింది.

నందుగాడు దర్వాజల్నే నిలవడి సేతులన్న పూలు గల్మకాడ వెట్టిండు. “నందు… ఆన్నే నిల్సున్నవ్… లోపలికి రా” ఎమ్ఆర్ఒ సారోళ్ళ భార్య అప్యాయంగా పిల్సింది. నందుగాడు పువ్వు తీసుకవోయి ఇంట్ల వెట్టిండు. “మీ అమ్మ నీ గురించే చెప్తది… మంచిగ సదువుకుంటవట గని బాగ మొండి జేత్తవట. మంచి నీళ్ళు తాగుతవా?”

సల్లటి ఫ్రిజ్ నీళ్ళు తీసకచ్చి ఇచ్చింది.

గట గట తాగి… “నే పోతున్న ఆంటీ” అని నందుగాడు బయటకొచ్చిండు. “నందు” లోపల్నుంచి పాటకు దాక ఉరికచ్చి చాక్లేట్ సేతుల పెట్టింది సరిత. సంబరంగా చాక్లేట్ సప్పరించుకుంటు ఇంటికొచ్చిండు నందుగాడు.

సాయంత్రం గడపకో బతుకమ్మ బయిలేల్లి గుడి దగ్గరికి సేరినయి. రంగు రంగుల పువ్వులతో సూడ సక్కగా పేర్సిన బతుకమ్మల్తో పోటివడ్తు కొత్త కొత్త సీరలు కట్టీ వాడకట్టు ఆడోళ్ళంతా సింగారించుకున్నరు. ఆళ్లాయన పంపిన దుబాయ్ బంగారమంతా దిగవొసుకుని అందరికి సుపెడుతుంది సూరిగానోళ్ళమ్మ. “ఎమే… పద్మా ఎన్నో నెల?” మొన్ననే నీళ్ళోసుకున్న పద్మను ఆరా తీత్తంది నడీడు ఈశ్వరమ్మ. “ఏం పిల్లా… గజ్జెల గుర్రం లెక్క తయరైనవ్… నన్ను పెళ్ళిజేసుకుంటవా” వరుసకు మనవరాలయ్యే ఎనిమిదేండ్ల పిల్లతో ఓ తాత సరసమడుతండు. కొత్తగ పెండ్లి జేసుకొని పండుగకు తల్లిగారింటికచ్చిన ఆడపిల్లలు గుంపుగాజేరి గుసగుసలు వెట్టుకుంటున్నరు, ఆళ్ళ ముఖాలు అంతకుముందెన్నడూ కనవడని సిగ్గుతో కళకళలాడుతున్నయి. “ఎమాయుళ్ళా… పాట మొదలువెట్టరూ? సీకటివడ్డంకాడతరా ఏంది?” కనకమ్మ తొందరవెడ్తంది. నందుగాడు, ఆడి దోస్తులంతా కల్సి ఎవలి బతుకమ్మ పెద్దగుంది, ఎవల్ది చిన్నగుంది అని లెక్కలు వెడ్తుండ్రు.

“నందు” అని పిలుపినవడ్తే ఎనుకకు తిరిగి చూసిండు. పట్టు పరికిణి, పొడుగు జడ, జల్లో కనకాంబరం పూలువెట్టి ముద్దుగా తయారైంది సరిత. “చాక్లేట్ తెచ్చినవా?” ఆశగా కళ్ళింత చేసుకుని అడిగిండు నందుగాడు.

“ఇంట్లున్నయ్… రేపు తీసుకత్త” బంగారు గాజులు ధగ ధగ మేరుత్తుంటే చేతులు తిప్పుకుంట చెప్పింది సరిత.

“తంగేడు పువ్వల్ల ఉయ్యాలో… తల్లిరా బతుకమ్మ ఉయ్యాలో” బతుకమ్మ ఆడుతుంటే ఆళ్ళ సప్పట్లు, గాజుల గలగలలు, కాళ్ళ పట్టీల గణగణలు అన్నీ లయబద్దంగా పాటలో కల్సిపోతన్నయి. నందుగాడు గూడ ఆడోళ్ళందరితో కల్సి ఆడుతున్నడు.

“నువ్వు ఆడోళ్ళ పాటలు పాడ్తవా?” కిసుక్కున నవ్వింది సరిత.

“సిన్మా పాటలు గూడ పాడ్త” బతుకమ్మ పాట మధ్యల్నే ఆపి, “ఈ పేటకి నేనే మేస్త్రి… నిరుపేదల పాలిట పెన్నిధి” చిరంజీవి పాట మొదలువెట్టిండు.

“భలే భలే” అని మెచ్చుకుని సప్పట్లు కొట్టి “నాకు నేర్పిత్తవా, నీకచ్చిన పాటలు అన్నీ” ఆత్రం కొద్ది అడిగింది సరిత.

నందుగాడు హీరోలెక్క పొంగిపోయి “నేనో లెక్క అడుగుతా… దానికి జవాబు చెప్తే అప్పుడు నేర్పిత్తా” ఆడి తెలివి తేటల్ని ఇంకా సుపెట్టాలని ఫోజుకొట్టిండు.

“ఊ… అడుగు” గుడి గద్దె మీద కూసుంది.

“ఐదు నుంచి మూడు తీసేత్తే ఎంత?” ఆ పిల్లకు ఎదురుంగా సక్లముక్లం ఏసుకోని కూసున్నడు.

“రెండు” టక్కున చెప్పింది సరిత.

“పప్పుల కాలేసినవ్” నాకు తెల్సు నువ్వు గిదే చెప్తవ్ అన్నట్టు ముఖం పెట్టి, ఆడి అరచేతు ఐదు వేళ్ళు సుపిత్తూ “ఇగ చూడు… ఐదు నుండి మూడు తీసినా…” మూడూ వేళ్ళు ముడిసిండు, “… మళ్ళా ఏసినా” ముడిసిన మూడేళ్ళు తెరిసిండు, “గిప్పుడెన్నున్నయి… 1, 2, 3, 4, 5” పక పక నవ్విండు.

“నీకు లెక్కలు బగ్గోచ్చా?” ఇచ్ఛంత్రంగా చూసింది.

“ముణ్ణెల్ల పరీచ్చల 95 మార్కులొచ్చినయ్” ఏమనుకుంటున్నవ్ అన్నట్టు జూసి “మరి… నీకెన్నచ్చినయ్” అని అడిగిండు.

“ముప్ఫై” బేలగ చెప్పింది.

“గట్లయితే ముందుగాలా నువ్వు లెక్కలు నేర్సుకోవాలే”

“నాకు నేర్పిత్తవా నువ్?”

“మళ్లా నువ్వు నీ దగ్గరున్న చాక్లేట్లన్ని ఇత్తవా?”

“రేపొద్దుగాల్నే మా ఇంటికిరా… నాకు నువ్వు లెక్కల్జేప్పు, నేను నీకు చాక్లేట్లిత్తా” ఎదో గుర్తుకచ్చి… “రేపొద్దుగాల మా ఊరికివోతున్న కదా… ఎట్లా మళ్లా?… నువ్వత్తవా… మా ఊరికి?”

“అమ్మో!… మా అమ్మ కొడ్తది” కొద్దిగా ఆలోచించి “మరి… చాక్లేట్లన్నీ ఇయ్యాలే”

“మా ఊరికొత్తే… జాంకాయలు, మావిడిపళ్ళు, తేనెపట్టు అన్నీ తింద్దాం”

“అయితే మా అమ్మనడిగిజెప్తా” ఎగిరెగిరి గుడి గంటను కొట్టిండు.

“తియిర్రి తియిర్రి బతుకమ్మలు… సీకటి జుడ్తంది” బీడి తాక్కుంట ఓ పెద్దమనిషి ఎగిర్తవెడ్తండు ఆడోళ్లందరిని.

తెల్లారి ఎమ్ఆర్ఒ సారోళ్ళ భార్య లచ్చువమ్మకి నచ్చజెప్పి నందుగాన్ని సరితెంట ఆళ్ళ ఊరికి పంపించింది. సరితోళ్ళ ఊరు మారుమూల పల్లెటూరు. ఆడ అన్నీ గుడిసెలే సరితోళ్లది తప్ప. పరిగే గడ్డిని సుత ఎదగనియ్యకుండా ఊడలు దిగేసిన మఱ్ఱి సెట్టులెక్క ఉంది బంగ్లా. గంత పెద్ద బంగ్లా నందుగాడు ఎప్పుడూ సూల్లే. ఇంట్లుండే మనుసుల కన్నా నౌకర్లు పాలేర్లే ఎక్కువున్నరు. సరిత వాళ్ళ నాన్నను అంతా దొర దొర అని పిలుస్తుర్రు. బంగ్లా ఎక్కిజూత్తే కంటికి కనవడేదాక ఉన్న పొలాలన్నీ ఆళ్ళయేనట. తోటలకు, పొలాలకు తిరగడానికి గుర్రం బండి, ఏది కావాలన్నా క్సణంల ముంగటవెట్టే నౌకర్లు, యువరాజసోంటి మర్యాదలు దొరుకుతున్నయి నందుగాడికి. సెట్ల ఎంట పుట్ల ఎంట తిరుగుడు, దొరికిన కాయో పండో తినుడు… రెండ్రోజులు సుత్తుంటాల్లకు గడ్సినయి. సావిట్ల టంగుటుయ్యాల మీద గూసోని పొద్దుగాల పోద్దికీ లెక్కలు జెప్తుంటే, చిందొర్సానికి చదువు జెప్పడానికి పట్నం నుంచి అచ్చిడంట అని పాలేర్లు గుసగుసలాడుకుంటే విని నందుగాడు ఎక్కల్లేని ఇదయిపోయిండు.

ఓనాడు గిట్లనే లెక్కల్జెప్తుంటే పద్దెనిమిదెందులెంత అని అడిగిండు నందుగాడు. సరిత పెద్దెనిమిదోకట్ల పద్దెనిమిది… అని ఎక్కం సదువుడు మొదలువెట్టింది. 144 అని టక్కున సమాదానమచ్చింది ఎనక నుండి. ఎవలుజెప్పిర్రని సూత్తే ఓ పొలగాడు నేసిన దుప్పట్లు పట్టుకొని నిలవడ్డడు.

“ఒరేయ్ నారాయణ ఎప్పుడోచ్చినవ్” సరిత పళ్ళికిలించి అడిగింది.

“గిప్పుడే అచ్చిన చిందొరసాని… దొరసానికి ఇయ్యిమని మా నాయిన నేసిన దుప్పట్లు పంపిండు” వినయంగా చెప్పిండు నారాయణ.

“ఈడు నారాయణ… ఐదో తరగతి దాక నాతోనే మావూరి బల్లే సదివిండు, గిప్పుడు నేను పక్కురు బల్లేకోతున్న గదా… ఈడేమో సదువు బంజేసి ఆళ్ళయ్యతోని కల్సి మగ్గం నేత్తుండు”. “గట్ల సూత్తవేందిరా, ఆడవెట్టి ఇట్రా… నందు నాకు లెక్కలు చెప్పనీకి పట్నం నుంచి అచ్చిండు” ఎమనుకున్నవ్ ఏంది అన్నట్టు చెప్పింది.

“చిందొరసాని… నేను గూడ గీ లెక్కలు నేర్సుకుంట” నారాయణ దగ్గరికచ్చి చేతులు కట్టుకోని కింద గూసున్నడు.

నారాయణ్ణి సూత్తే నందుగాడికి బాపు గుర్తొచ్చిండు. “నీ అంత ఉన్నప్పుడే మగ్గం నేసిన్రా” అన్జెప్తడు బాపు. “నువ్వు పక్కూరు బల్లెకెందుకు వోతలేవు?” నందుగాడు పక్కకు గూసో అని జాగ చూపెట్టిండు.

“దొరకు బట్టలెవలు నేత్తరు… మా నాయినకు సాతనైతలేదిగ” నారాయణ నెత్తి గోక్కుంట లేసచ్చి నందుగాడి పక్కగూసున్నడు.

“నందు… నారాయణ మంచి మంచి కథల్జెప్తడు. ఓరేయ్ నారయణ… గా రాజు రాణి కథ సెప్పురా” పుస్తకం పక్కకు పెట్టింది సరిత.

“గిప్పుడా చిందొరసాని??… మా నాయిన జల్ది రమ్మన్నడు” నారాయణ గునిగిండు.

కథలనంగనే నందుగాడికి గూడ హుషారొచ్చి “నువ్వు కథ జెప్తే… నేను నీకు లెక్కలన్నీ జెప్తా” అన్నడు.

నారాయణ కథ మొదలువెట్టిండు. గింతట్లనే ఏన్నుంచొచ్చిందో సరితోళ్ళ నాయినమ్మ, “ఓరేయ్ నారిగా… చిందొరసాని పక్కగూసొని టుంగుటుయ్యాలూగుతున్నవా… సిన్న పెద్ద తేడా లేదురా నీకు” అని సేతి కట్టతో ఇరగ మరగ దంచింది నారాయణను.

“తప్పైంది దొరసాని… తప్పైంది” ఏడ్సుకుంటు నారాయణ ముసిలి దొరసాని కాళ్ల మీద పడ్డడు. “కొట్టకే నాయినమ్మ… కథ జెప్తా అంటే, నేనే గూసోమ్మన్న” సరిత మొత్తుకున్న నారాయణను కొట్టడం ఆపలే. “మొదలు నీకు బుద్ది జెప్పాలే… అడ్డమైన నా కొడుకలకు అలుసిత్తే నెత్తికెక్కుతరు” సరితను లోపలిటికి గుంజుకవోయింది. నారాయణ ఎడ్సుకుంటు ఇంటికురికిండు. ముసలి దొరసాని మళ్ళా సావిట్లకొచ్చి “ఏడి ఈడు… గాడ్ది కొడుకు, మాళ్ళ రాడా? గప్పుడు జెప్తా ఆడి సంగతి”.

బిక్కు బిక్కు మంటున్న నందుగాని దగ్గరికచ్చి “ఓరేయ్… ఈడ నిన్ను అందరు దొరబిడ్డ అనుకుంటున్నరు.. దొరబిడ్డ లెక్కనే ఉండు… మీ బాపు బొంబాయికి బతకవోయిండని ఎవ్వలికి జెప్పద్దు… సెప్తివో నిన్ను గుడ గట్లనే తన్ని తరుముత” కోపంగా ఎగపోత్తంది. దెబ్బకు నందుగాడికి అమ్మ యాదికచ్చింది, ఏడుపు తన్నుకచ్చింది.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, జూన్ and tagged , , , , .

3 Comments