cover

మనిషితనాన్ని జాగృతం చేసే “నేనున్నాగా…”

Author Photo

Download PDF ePub MOBI

హితం కోరేది సాహిత్యం అనే నానుడికి తగ్గట్టుగా రచనలు చేసే వారిలో శ్రీ రంగనాథ రామచంద్రరావు గారు కూడా ఒకరు. కథకుడు, నవలాకారుడు అనువాదకుడుగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన రామచంద్రరావుగారి రచనల మూలాలు బహుశా వారి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాయేమో. ఉత్తమ ఉపాధ్యాయునిగా బహుమతి నందుకున్న ఈయన తన శిష్యులు ఉత్తములై మసలుకోవాలని, ప్రయోజకులవ్వాలని ఎలా ఆశిస్తారో, తన రచనలు కూడా సమాజానికి అంతే ప్రయోజనకరంగా ఉండాలని భావిస్తారు. వీరి కథా సంకలనం “నేనున్నాగా…” ఇందుకు అద్దం పడుతుంది. 10 కథలున్న ఈ పుస్తకంలో ప్రతీ కథా చదువరులను ఆలోచింపజేస్తుంది.

2007 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో వచ్చిన వరదలు సృష్టించిన ప్రళయం అంతా ఇంతా కాదు. ఆ వరదల నేపధ్యంగా అల్లిన రెండు కథలున్నాయి ఈ పుస్తకంలో. మొదటిది “నేనున్నాగా…”. ఇదే శీర్షిక పుస్తకానిది కూడా. రెండోది “వేయి పడగల నాగేంద్రుడు వచ్చేసినాడప్పో…”. వరద ఉదృతిని కళ్ళకి కట్టినట్లు చెప్పాయీ కథలు. జరిగిన ఉత్పాతాన్ని భయానక, బీభత్సరసాలలో కాకుండా, కరుణరసంలో చూపిన కథలివి.

“నేనున్నాగా..” కథలో కోడలు ముసలి మామగారికి తుదివరకు ఆలంబనగా నిలిస్తే, “వేయి పడగల నాగేంద్రుడు వచ్చేసినాడప్పో…” కథ ప్రళయకాలంలో జనాల ఇబ్బందులు, బాధలు, ఘోషలను నమోదు చేసింది. వరదలు తగ్గుముఖం పట్టాక, సాయం అందని ఎందరో బాధితుల గోడుని వెళ్ళబోస్తుంది. నేనున్నాగా కథలోని “నీళ్ళు… కొండరాళ్ళు కనిపించకుండా నీళ్ళు… కొండరాళ్ళను మింగేస్తూ ముందుకు దూసుకొస్తున్న తుంగభద్ర… నిశ్శబ్దంగా… నిశ్చలంగా… నెమ్మదిగా… యముని మహిషంలా ముందు ముందుకు వస్తున్న తుంగభద్ర… సర్పంలా బుసలు కొడుతూ జనాలని భయపెట్టి పరుగులు పెట్టిస్తున్న తుంగభద్ర…” ఈ వాక్యాలు చదువుతుంటే మనమూ మంత్రాలయం దగ్గర వరదల్లో చిక్కుకుని, ప్రాణాలు కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న భావం కలుగుతుంది. నేనున్నాగా అంటూ మామగారికి భరోసా కలిస్తూ ఆయనతో పాటు తనూ వరదలకి బలైపోయిన విశాలక్షి కథ ఇది. ఈ కథలో ప్రధాన పాత్రధారులు అర్చక కుటుంబానికి చెందినవారు. అర్చకుల ఇంటి వాతావారణం, పాత్రల సంభాషణలు ఔచిత్యానికి తగ్గట్టుగా ఉన్నాయి.

వేయి పడగల నాగేంద్రుడు వచ్చేసినాడప్పో కథలోని “కళ్ళెదుట మృత్యువు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నట్లు అనిపించింది. వేయి పడగల నాగేంద్రుడిలా తలలు పై కెత్తుకుని బిరాబిరా వస్తున్న గంగమ్మ దారిపొడుగునా ఎదురుపడ్డ రాయిని, రప్పని, పొలాన్ని, పంటని, గడ్డిని, గేదెని, పాకల్ని, పశువుల్ని, మనుషుల్ను, మానుల్ని ముంచేస్తూ, కూల్చేస్తూ, ఉసురులు తీస్తూ ఉన్మాదంగా ఉరుకులు పరుగుల మీద వస్తోంది.” అన్న వాక్యాలు చదివినప్పుడు ఆ విషాదం కళ్ళముందు ప్రత్యక్షమవక తప్పదు. ఈ రెండు కథలు ప్రకృతి విలయం ముందు మానవుల దైన్యాన్ని చాటాయి. ఈ రెండు కథలకు వివిధ పోటీలలో బహుమతులు రావడంలో అనౌచిత్యం ఏమీ లేదు.

ఫ్రిడ్జ్, కారు, బంగారం, ప్లాటులా జీవితం కూడా ఒక వస్తువై పోయిన పరిస్థితులలో స్వచ్ఛమైన పల్లెటూరి నుంచి నగరంలోకి అడుగుపెట్టిన ఓ అమ్మాయి మెరుపుల ప్రపంచపు మాయలో పడబోయి, తనని తాను కాపాడుకున్న వైనం “దేశమంటే మట్టికాదోయ్..” కథలో చదవచ్చు. మనం చెడిపోడానికి బయటివారెవరో కారణమైనా, బాగుపడడానికి మాత్రం మనమే పూనుకోవాలని ఈ కథ చెబుతుంది. ఎదిగీ ఎదగని, మానసిక పరిపక్వత లేని యువతీయువకలకు ఈ కథ ఓ సుతిమెత్తని హెచ్చరిక చేస్తుంది.

అమ్మని వృద్ధాశ్రమంలో పడేసిన ఓ రచయితకి అమ్మప్రేమ మీద వ్రాసిన కథకి బహుమతి వస్తుంది. తను పాటించని నీతులని ఎదుటివారికి బోధిస్తాడా రచయిత. సాంద్రత తగ్గుతున్న అనుబంధాలను, బంధాలన్నీ ఆర్థిక సంబంధాలేననే సమాజపు నూతన పోకడల్ని చెప్పిన కథ “లైన్లు లేవు”.

బంధాలన్నీ ఆర్థిక సంబంధాలనే అంతఃసూత్రంతోనే అల్లిన మరో కథ “ఇంకా ఎంతకాలం?”. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త ఎంత కాలమైనా కోలుకోకపోవడంతో, ఆసుపత్రి ఖర్చులు పెరిగిపోయి చికిత్స చేయించడానికి వెనుకాడిన భార్య కథ ఇది. డబ్బు లేని వాళ్ళు ఎంత నిస్సహాయులో, డబ్బుండీ ఆ డబ్బు వలన ప్రయోజనం పొందలేని వాళ్ళూ అంతే నిస్సహాయులవుతారు. ఒక కోణం నుంచీ చూస్తే ప్రాక్టికాలిటీ, మరో కోణం నుంచి చూస్తే బాధ్యతలనుంచీ పారిపోడంలా కనిపిస్తుందీ కథ. వర్తమాన సమాజపు తీరుతెన్నుల మీద ఓ కఠోర వ్యాఖ్యానం ఈ కథ.

పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగా చూడకపోవడం అనే అంశం మీద లెక్క లేనన్ని కథలొచ్చాయి. “ఇంకా ఉన్నారు…” కథ ఇతివృత్తం అదే అయినా, కథనం ఆసక్తికరంగా ఉంటుంది. తామెలా ఉన్నా తమ పిల్లలు మాత్రం బావుండాలనే తాపత్రయంతో పిల్లలెలా ప్రవర్తించినా తప్పు పట్టరు చాలామంది తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి పిల్లలకి పెట్టడమే తల్లిదండ్రులు చేసే తప్పేమో? వాళ్ళకు తాము పెట్టడం తప్ప, తమకీ వాళ్ళు పెట్టాలి అని తల్లిదండ్రులు నేర్పించడంలేదేమో? పిల్లలకి తీసుకోడమే నేర్పుతున్నారు గానీ, ఇవ్వడం నేర్పట్లేదనీ, పిల్లలకి కావల్సింది కొనివ్వడం, వాళ్ళు అడిగింది ఇవ్వడం తల్లిదండ్రుల బాధ్యత అని, అలా పొందడం తమ హక్కు అని పిల్లలు అనుకుంటున్నారని రచయిత అంటారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు తమ బాధ్యత నిర్వర్తించేలా చూడాల్సింది తల్లిదండ్రులేనని అంటారు రచయిత. ఓ ప్రేమ పూరితమైన మాట కోసం, ఓ స్పర్శ కోసం, ఓ ఆలంబన కోసం ఎదురుచూసే వృద్ధులకు తోడుగా నిలిచే యువకులు ఉన్నారా? ఉన్నారనే అంటున్నారు రచయిత.

ఏదైనా జబ్బు చేసి ఆసుపత్రిలో రోజుల పాటు ఉండాల్సి రావడం ఎవరికీ ఇష్టం ఉండదు. జబ్బు కన్నా ఆ వాతావరణమే ఎక్కువ రోతని కలిగిస్తుంది. రకరకాల బాధలతో ఉన్నవాళ్ళని చూడడం, వాళ్ళ వెతలకి దిగులు చెందడం… మనసుని పలువిధాల ఆలోచనలతో తొలిచేస్తాయి. మృత్యువుకి సమీపంగా వెళ్ళడం లేదా కళ్ళ ముందే నిస్సహాయంగా కన్నుమూసిన వారిని చూడడం వంటివి ఎంత గుండెధైర్యం ఉన్న మనుషులనైనా విచలితులను చేస్తాయి. భర్తను కాపాడుకోలేకపోయిన ఓ ఇల్లాలు, తన భర్త అవయవాలలో పనికొచ్చేవాటన్నింటినీ అవసరమైన రోగులకి వాడుకోమని డాక్టర్ గారిని కోరి, ఎందరికో కొత్త జీవితాన్ని అందించేందుకు దారిచూపుతుంది “పునరపి జననం..” కథలో.

ఒకప్పుడు బ్రిటీషు పరిపాలనలో కొందరు సమర్థులైన పాలకులు, నిజాయితీ గల అధికారులు చేసిన మేళ్ళను మనం ఇప్పటికీ మర్చిపోలేం. ఉదాహరణకి గోదావరి మీద ఆనకట్ట కట్టిన కాటన్ దొరని ఇప్పటికీ ఉదయాన్నే తలుచుకుంటారనేక మంది. అలాగే బీద ప్రజలను పాలెగాళ్ళ బారి నుంచి కాపాడిన థామస్ మన్రోని తమ వాడిగా చేసుకున్నారా పీడిత జనం. కుటుంబంలో తరానికికొక సంతతికి మన్రో పేరు పెట్టుకుని ఆయన మీద గౌరవం చూపారు. స్వతంత్ర్యం వచ్చాక స్వదేశీ పాలకులే తమని సర్వనాశనం చేస్తుంటే నిస్సహాయులైపోతారు జనం. పచ్చదనాన్ని ఆబగా కబళించాలనుకునే స్వార్థపరుల కథ “థామస్ మన్రో మళ్ళీ చచ్చిపోయాడు”. ధామస్ మన్రో భౌతికంగా ఎన్నడో మరణించినా, ఆయన ఆశయం ఇప్పుడు చచ్చిపోయిందని అవ్యక్తంగా చెబుతారు రచయిత.

ఆధునికత అంటే సభ్యత సంస్కారాలను వదిలేయడం కాదని చెబుతుంది “యూ ఆర్ సో…” కథ. పాశ్చాత్య పోకడలను అర్థంపర్థం లేకుండా పాటించడం, ఎదుటి వ్యక్తి మనోభావాలను గమనించకుండా వ్యాఖ్యలు చేయడం.. భార్యభర్తల మధ్య ఉండే సున్నితమైన రేఖని పరాయివారు దాటాలని ప్రయత్నించడం… వీటిని నాగరికత పేరిట సమర్థించుకోడం వంటి చర్యలని ఎండగడుతుందీ కథ.

Nenunnaga Book coverమగాళ్ళను మృగాళ్ళుగా పిలవడానికి నాంది పలికిన యాసిడ్ దాడి ఘటనలపై అల్లిన కథ “దేవుడు సాక్షిగా”. ఆడపిల్లలంటే ఓ భోగవస్తువుగా భావించే వారి సంఖ్య పెరిగిపోతున్న సమాజం మనది. ఈవ్ టీజింగ్, దారి కాసి వెంటబడడాలు, ప్రేమ పేరిట వెకిలి వేషాలు…. విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎవడో యాసిడ్ పోస్తానని బెదిరించగానే భయపడి కాలేజి మానేసిన కూతురికి ధైర్యం చెబుతూ, కూతురిని ఏడిపిస్తున్న కుర్రాడి గురించి కొడుక్కి చెప్పాలా వద్దా అని సంశయించిన తల్లి, తన కొడుకే ఇంకో అమ్మాయి మీద యాసిడ్ పోస్తానని స్నేహితులతో చెప్పడం విని షాక్‌కి గురవుతుంది. ఆ ప్రయత్నాన్ని నిరోధించే క్రమంలో తన కొడుకుని చేతులారా తనే చంపుకొంటుంది. హత్యనేరం మీద జైలు పాలై కోర్టు బోనులో నిలుచుంటుంది. కాస్త సినిమాటిక్‌గా ఉన్నా, ఆసాంతమూ చదివిస్తుందీ కథ.

పదాడంబరం లేని భాష, అలతి పదాలతో చక్కని భావాలు వ్యక్తపరచడంలో రచయిత కృతకృత్యులయ్యారు. సూటిదనం నిండిన శైలితో మనిషితనాన్ని జాగృతం చేసే అంశాలతో అల్లిన కథల సంకలనం “నేనున్నాగా..”. ‘పాలపిట్ట బుక్స్’ వారి 112 పేజీలున్న ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభిస్తుంది. ఈబుక్ కినిగెలో లభ్యం. కినిగె వెబ్‌సైట్ నుంచి ఆర్డర్ చేసి ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి పొందవచ్చు.

– కొల్లూరి సోమ శంకర్

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పుస్తక సమీక్ష and tagged , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.