cover

పదనిష్పాదన కళ (8)

Download PDF ePub MOBI

దీని ముందు భాగం

గ్రంథ విషయ పట్టిక

ఆఱో అధ్యాయం

తెలుగు ఉపసర్గల సహాయంతో కొత్త క్రియాధాతువుల నిష్పాదన పద్ధతి
ఉపోద్ఘాతం : ఉపసర్గలంటే ఏంటి ?

ఉప అంటే దగ్గఱ. సర్గ అంటే సృష్టించడం. అంటే, మూలధాతువుకి దగ్గఱగా ఉన్న అర్థంలో కొత్త పదాల్ని సృష్టించడానికి ఉపయోగపడేది ఉపసర్గ. ఆంగ్లంలో Prefix అంటున్నారు. ఉదాహరణకి – Reduction, deduction, induction, production మొదలైన పదాలలో అసలు (ల్యాటిన్) క్రియ ducio. దానికి re- de- in- pro ఇత్యాది కొసఱుపదాల్ని ముందుచేఱిస్తే అర్థం మారుతుంది. అంటే ఉపసర్గల సహాయంతో ఒక క్రియని పదీ-ఇఱవై భిన్నఅర్థాలలో రూపాంతరించి వాడుకోవచ్చునన్నమాట. ఫలితంగా, భాషలో పదసంపద పదీ-ఇఱవై రెట్లు పెఱుగుతుంది. అలాగే, ఉదాహరణకి – సంస్కృతంలో హృఞ్ (తీసుకోవడం) అనేది మూలధాతువు కాగా దానికి ఉపసర్గల్ని చేర్చడం ద్వారా వివిధ అర్థాల్లో వాడు కునే సౌలభ్యం ఉంది.

ఆ + హృ – ఆహర = తిను

వి + హృ = విహర = వాహ్యాళి చేయి

ప్ర + హృ = ప్రహర = కొట్టు

సమ్ + హృ = సంహర = చంపు

ఉప + హృ = ఉపహర = తీసుకురా

ఉప + ఆ + హృ = ఉపాహర = టిఫిన్ చేయి

ఉప + సమ్ + హృ = ఉపసంహర = వెనక్కి తీసుకో

అలాగే, భూ అనే మూలధాతువుకి కావడం, ఉండడం అని అర్థాలుండగా, వివిధ ఉపసర్గల మున్‌జేర్పు వల్ల రకరకాల కొత్త క్రియాధాతువులేర్పడి కొత్త అర్థాల్ని ఇస్తాయి. ఉదాహరణకి-

సమ్ + భూ = సంభవతి = జఱుగుతోంది

ప్ర + భూ = ప్రభవతి = చేయగలుగుతున్నాడు

పరి + భూ = పరిభవతి = అవమానిస్తున్నాడు

అను + భూ = అనుభవతి = అనుభవిస్తున్నాడు

వి + భూ = విభవతి = వెలిగిపోతున్నాడు

అభి + భూ = అభిభవతి = తిరస్కరిస్తున్నాడు

ఇవి నామవాచకాలుగా కూడా ఇలాంటి అర్థవైవిధ్యాన్నే సృష్టిస్తాయి.

ఉదా :- డుకృఞ్ = కరణే = చేయుట అధికారం, అపకారం, ఉపకారం, ప్రతీకారం, ప్రకారం, వికారం, ఆకారం, సంకరం, అవకరం, అనుకరణం, ప్రకరణం, అధికరణం మొ||

ఇలా సంస్కృతం, ఇంగ్లీషు భాషల తరహాలో పదాలకు ముందు చేర్చదగిన ఉపసర్గలు (prefixes) తెలుగులో లేవు. కారణం-తెలుగుభాష, పదం పక్కన పదం/ ప్రత్యయం చేఱే టర్కిష్ మొదలైన భాషల కోవకి చెందినది. ఈ రకం భాషల్లో పదాలకి ముందు కాక తరువాత ప్రత్యయాలు చేఱతాయి.

(i) ఉపసర్గలుగా తుమున్నంతాలు :

అయితే తెలుగులో అచ్చం ఉపసర్గల్లాగానే ప్రవర్తించే పదాలున్నాయి. వాటిని తుమున్నంతాలంటారు. తుము న్నంతాలంటే – చెయ్యడానికి, పోవడానికి, చేయుటకు, పోవుటకు (in order to do, in order to go etc.) అని అర్థమిచ్చే క్రియారూపాలు. ఇవి ప్రాచీన తెలుగులో చేయన్, పోవన్, అనన్ అనే విధంగా ఉంటాయి. తుమున్నం తాలు పై అర్థాన్నే కాకుండా “చేసేలా, పోయేలా” (so that/so as to) అనే విధంగా కూడా అర్థాన్నిస్తాయి.

ఉదా:- పోవన్ + కొట్టు = పోవగొట్టు à  పోగొట్టు = పోయేలా కొట్టు

చావన్ + కొట్టు = చావగొట్టు (చచ్చేలా కొట్టు)

లేవన్ + కొట్టు = లేవగొట్టు (లేచేలా కొట్టు) మొ.

విడి మొదలైనవి విశేషణాలు గనుక, “విడు” మొదలైనవి వాటి మూల ధాతువులు కనుక, వాటి తుమున్నంత రూపాలైన విడన్ మొ. వాటిని (వేఱుగా అనే అర్థంలో) ఉపసర్గలుగా వాడుకునే సౌలభ్యముంది.

ఉదా:- విడన్ + కొట్టు = విడగొట్టు

చెడన్ + కొట్టు = చెడగొట్టు మొ.

ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి :

ఎగు = ఎక్కుట ; ఎగన్ + తీయు = ఎగదీయు

దిగు = దిగుట ; దిగన్ + తీయు = దిగదీయు

అలయు = చేసినదే చేసి కష్టపడుట ; అలియన్ + బడు = అలబడు à అలవడు à అలవాటు

అలియన్ + పోవు = అలఁబోవు à అలఁబోక à అలవోక

అలియన్ + ఆడు = అలియాడు = అల్లాడు

అలియన్ + చడి = అలజడి (మళ్ళీమళ్లీ చెలరేగుతున్న చప్పుడు)

తడయు = ఆలస్యము చేయుట ; తడయన్ + పడు = తడఁబడు à  తడబాటు

పొఱయు = కలఁతపడు ; పొఱయన్ + పడు = పొఱఁబడు à  పొఱబాటు

ఎడము = దూరము ; ఎడయు = దూరమగు ; ఎడయన్ + పడు = ఎడఁబడు à  ఎడబాటు

ఒడ్డు = పందెములో పెట్టుట ; ఒడ్డన్ + పడు = ఒడఁబడు –> ఒడబాటు (ఒప్పందము)

కలియు = కలియు ; కలియన్ + పడు = కలఁబడు

కలియన్ + చూచు = కలియజూచు à  కలజూచు (చుట్టూ చూచు)

అకు = అగుట ; అకన్ + చేయు = కాజేయు (అయ్యేలా చేయడం)

పోవు = వెళ్ళుట ; పోవన్ + పడి = పోవబడి à  పోఁబడి (పోయే చోటు, పోయే మార్గం = జాడ, గమ్యం)

పోవన్ + కాలం = పోవగాలం à  పోఁగాలం

పెనఁగు = అల్లుకొను ; పెనగన్ + వేయు = పెనవేయు (పేనేట్లు వేయు)

పెనగన్ + కొను = పెనఁగొను (పేనుకొను)

పైన ప్రతిపంక్తిలోనూ చివఱ బాణంగుర్తు తరువాత ఫలితార్థంగా చూపించినవి ఇప్పుడు అందఱికీ తెలిసిన శబ్దస్వరూపాలు. సంధులుగా చూపించినవి ఆ స్వరూపాల మూలరూపాలు. వీటిని పరిశీలించినప్పుడు క్రియాధాతువుల తుమున్నంతాలే తెలుగులో ఉపసర్గల్లా ప్రవర్తిస్తాయని అర్థం చేసుకుంటాం. తుమున్నంతాలంటే -చెయ్యడానికి, పోవడానికి అని అర్థమిచ్చే క్రియారూపాలు. ఇవి ప్రాచీన తెలుగులో చేయన్, పోవన్, అనన్ అనే విధంగా ఉంటాయి. తుమున్నంతాలు పై అర్థాన్నే కాకుండా ‘చేసేలా, పోయేలా’ అనే విధంగా కూడా అర్థాన్ని ఇస్తాయి. ఉదా:-

పోవన్ + కొట్టు = పోవఁగొట్టు à  పోఁగొట్టు = పోయేలా కొట్టు

నిజానికి ఈ నిర్మాణాలు క్రియాగుచ్ఛాలు లేక మాలికాక్రియలు అనే రకానికి చెందుతాయి. కారణం – తెలుగులో క్రియ మీద

పక్కన క్రియ దండలాగా చేరే సౌలభ్యం ఒకటుంది. ఇతర భారతీయ భాషల్లో కూడా ఉందనుకోండి. కాని తెలుగులో ఉన్నంత విస్తారం కాదు. ఉదా:-

౧. పట్టుకోలేకపోయాడు (ఇందులో పట్టు, కొను, ఉండు-వ్యతిరేకార్థకం, పోవు అనే ధాతువులున్నాయి) ౨. పడగొట్టగలడు (పడు + కొట్టు + కలుగు)

మనం తెలుగులో ఉపసర్గల్ని కల్పించాలంటే ముందు ఇలాంటి క్రియాగుచ్ఛాల్ని కల్పించాలన్నమాట. ఈ సందర్భంగా కొన్ని అంశాల్ని గమనంలో ఉంచుకోవాలి:

(అ) తెలుగు ఉపసర్గలు పైన ఉదాహరించిన పద్ధతిలో తుమున్నంతాలై ఉండాలి.

(ఆ) అవి తెలుగులిపిలో గరిష్ఠంగా మూడు అక్షరాలకు మించనివై ఉండాలి.

(ఇ) అవి ప్రసిద్ధ అర్థాన్నే కాక సంబంధిత వ్యంగ్యార్థాన్ని సైతం ఇవ్వాలి. అంటే ఒకే ఒక్క నిశ్చితార్థాన్ని ఇచ్చే విధంగా ప్రయోగించకూడదు.

(ఈ) ఉపసర్గల్ని ఏర్పఱిచే క్రమంలో పనికొస్తాయనుకున్న పాత ధాతువుల్ని సైతం పునరుద్ధరించడానికి వెనుకాడ కూడదు.

(ఉ) క్లుప్తత నిమిత్తం అక్షరాల్ని కుదించడానికి అనుమతించాలి.

ఉదా: పొఱయన్ + పడు = పొఱబడు

(ఊ) సంస్కృతంలో లాగా తెలుగులో ఉపసర్గ మీద ఉపసర్గ చేర్చడం సాధ్యపడదు. అంటే ఒక క్రియాధాతువుకు ఒక్క ఉపసర్గనే చేర్చగలం.

(ఎ) తెలుగు ఉపసర్గల్ని స్వతంత్రపదాల్లా ప్రయోగించకూడదు. అలా చేస్తే అవి నామవాచకాలవుతాయి. ప్రతి నామ వాచకానికీ ఒక ఖచ్చితమైన అర్థం ఉంటుంది కనుక ఉపసర్గసహిత పదాల అర్థంలో అవి చెడ్డజోక్యాన్ని కలి గించుకుంటాయి.

పూర్వీకుల పద్ధతిలోనే చిఱుధాతువుల తుమున్నంతాల్ని ఉపసర్గలుగా మార్చి నేను కల్పించిన క్రియాధాతువులు కొన్నింటిని ఇక్కడ ప్రదర్శనకి పెడుతున్నాను.

1. అలయన్ + పల్కు = అలబల్కు = అలవల్కు = (మళ్ళీ మళ్ళీ పలుకు) వాదించు

2. విడన్ + పల్కు = విడఁబల్కు = (విడగొట్టి పలుకు) వివరించు

3. అకన్ + పల్కు – కాఁబల్కు = (అయ్యే విధముగా చెప్పు) జోస్యము చెప్పు

4. రాన్ + పల్కు = రాఁబల్కు = (వచ్చే విధముగా పలుకు) ఆహ్వానించు

5. (కవ అంటే జంట) కవన్ + కలుపు = కలుపు = కౌఁగల్పు (కౌఁగలించు లాగా) అనుసంధానించు

వీటినే నామవాచకాలుగా కూడా యథాతథంగా ప్రయోగించవచ్చు.

(ii) ఉపసర్గలుగా విభక్తి ప్రత్యయాలు :

విభక్తి ప్రత్యయాల్ని ఉపసర్గలుగా వాడుకునే సౌలభ్యమొకటి తెలుగులో ఉంది. విభక్తి ప్రత్యయాలంటే నామవాచకాలకు చివఱ వచ్చే తోన్, లోన్, పై, క్రీ (క్రిందు), మీన్ (మీఁదు) మొదలైనవి.

ఉదా:- తోడ – తోన్ + పుట్టువు = తోఁబుట్టువు (కలిసి పుట్టినవాడు) పైన – పైన్ + చరిమి == పైసరము ( పైకి జఱుగుట – స్త్రీతో కలయిక) క్రింద – క్రిన్ + కంటి = క్రీఁగంటి మీద – మీన్ + కట్టు = మీఁగడ మీఁదు + కట్టు = మీదుకట్టు, ముడుపుకట్టు to pledge

(iii) ఉపసర్గలుగా నామవాచకాలు (Nouns) :

ఉదా :- కవ = జంట కవన్ + కలియించు = కవంగలించు  కౌఁగలించు (తన జంటగా చేఱేలా చేయు)

నామవాచకాన్ని క్రియాధాతువుతో కలిపి ప్రయోగించే ఇలాంటి ఉదాహరణల్ని శబ్దపల్లవాలు (phrasal verbs) అంటారు. కాని కొన్నిసార్లు వీటిల్లో మొదటి పదం మనకు ఉపసర్గ (prefix) గా ఉపయోగపడుతుంది.

మచ్చుకు కొన్ని శబ్దపల్లవాలు :

ఉరితీయు, వలవిసురు, కన్నుమూయు, గుఱిపెట్టు, చేపట్టు, దారితీయు, దారిపట్టు, మనసుపడు, మనసగు, తెఱదించు, మిన్నంటు, గాలిసోఁకు

(iv) ఉపసర్గలుగా విశేషణాలు :-

కొన్నిపదాలు ప్రాచీనకాలంలో విశేషణాలుగా ఉండి తరువాత్తరువాత ఉప సర్గల్లా ఉపయోగపడడం మొదలుపెట్టాయి.

ఉదా:- మఱు = తరువాతి/ ప్రత్యామ్నాయంగా

మఱు + నాడు = మఱుచటినాడు

పెద + తల్లి = పెత్తల్లి

చెన్ను = అందమైన

చెన్ను + కలువ = చెన్ + కలువ = చెంగలువ

ప్రాత + మినుకులు = ప్రాన్ + మినుకులు = ప్రామినుకులు = పాత మాటలు (వేదమంత్రాలు)

ప్రాన్ + చదువులు = ప్రాజదువులు = పాత చదువులు (వేదమంత్రాలు)

క్రొత్త + కారు క్రొ + కారు = క్రొక్కారు (కొత్త ఋతువు)

క్రొత్త + సీమ = క్రొ + సీమ = క్రోసీమ (కొత్తదేశం)

భాష బాగా తెలియాలే గానీ ప్రతి 2 – 3 అక్షరాల పదాన్నీ సంధిసమాస పద్ధతిలో ఉపసర్గలా వాడుకోవచ్చు.

కొన్ని సంస్కృత ఉపసర్గలకి దీటైన తెలుగు ఉపసర్గలు :

వీటిల్లో కొన్ని ప్రాచీనకాలం నుంచి ఉన్నటువంటివి. మఱికొన్ని నేను సూచిస్తున్నవి.

1. అప = చెడన్, చెడు

ఉదా :- అపకరించు = చెడుసేయు, చెడగొట్టు

2. ఉప = తోడు, తోన్, ఒడన్

ఉదా :- ఉపకరించు = ఒడగూర్చు

ఉపమంత్రి = తోడుప్రెగ్గడ

3. సహ = తోడు, తోన్

ఉదా :- సహకరించు = తోడ్పడు

సహోదరి = తోబుట్టువు

4. అవ = దిగన్

ఉదా :- అవమానించు = దిగనాడు

5. అతి = తెగన్, మీఱన్, కడు

ఉదా :- అతిబలం = కడులావు

6. అను = వెన్ (వెను), మఱు

ఉదా :- అనుసరించు = వెనుగొను

7. నిర్ = లోన్

ఉదా :- నిలయం = లోగిలి

8. నిర్/నిస్ = వెలి, కొఱ

ఉదా :- నిర్గమించు = వెలువడు

కొఱలోతు = లోతులేనిది

9. అధి = మీన్, మీదు, పై, మున్

ఉదా :- అధిపతి = మీదుకాడు

10. సు = సరి, మంచి, మేటి, మేల్, బాగు, బాగ, బా

ఉదా :- సురూపం = సరిపొడ, మేల్పొడ

11. దుర్/దుస్ = చెడు, చెడ్డ

ఉదా :- దురహంకారం = చెడ్డ ఏనరితనం

12. ప్రతి = ఎదురు, మాఱు, మఱు

ఉదా :- ప్రతివచనం = మాఱుపలుకు

13. వి = విడన్, విడి, మఱు

ఉదా :- విభజించు = విడగొట్టు వివాసనం = విడికాపరం

14. సం = కలన్, కూడన్, కవన్ (కౌన్)

సమ్మేళించు = కలగలుపు, సముచ్చారణ = కూడబలుకుకొను

15. పరా = మీఱన్, మీదు, మీన్

16. పరి = చుట్టు, కలయన్, మీన్, మున్.

పరిలోకనం = చుట్టుచూపు, కలయజూపు

17. ఉత్/ ఉద్ = ఎగన్, మీన్, పై

18. ఆఙ్ = ఎల్ల

 

అభ్యాసకార్యములు

I. ఈ క్రింది క్రియాధాతువుల్నీ, నామవాచకాల్నీ ఉపసర్గల్ని చేర్చడం ద్వారా వేఱే అర్థంలోకి మార్చి, ఆ అర్థాన్ని స్పష్టంగా పేర్కొంటూ వాక్యరూపంలో ఉదాహరణలివ్వండి :

అలన్ (మళ్ళీ మళ్ళీ) :- 1. కఱపు 2. చేయు 3. పాడిక (పాట) 4. క్రుమ్మఱు (తిరుగు) 5. చదువు 6. విఱుపు 7. తుది 8. అందించు 9. తలపు 10. అను

సమాధానాలు :- అలన్ (మళ్ళీ మళ్ళీ) :- 1. అలగఱపు = శిక్షణ ఇచ్చు 2. అలజేయు = పునరావృత్తం చేయు 3. అలవాడిక = పల్లవి 4. అలగ్రుమ్మఱు = పర్యటించు 5. అలజదువు = అధ్యయనం చేయు 6. అలవిఱుపు = వాక్యవిరామం (comma), లేక పద్యంలోని యతి 7. అలందుది = శతకపద్యాల్లోని మకుటం 8. అలందించు = అంచెలంచెలుగా అందించు (to pass on) 9. అలదలపు = ధ్యానించు 10. అలనను = జపించు (అలననికి = జపం)

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పదనిష్పాదన కళ and tagged , , , , , , , , , , , , , , .

One Comment

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.