cover

ఇల్లాలు

Download PDF ePub MOBI

(ఇస్మత్ చుగ్తాయ్ “ఘర్‌వాలీ” కథకు అనువాదం) 

మీర్జా ఇంటికి, కొత్త పనిమనిషి వచ్చిన రోజున, ఆ వాడంతా కలకలం చెలరేగింది. ఎప్పుడూ పని ఎగ్గొట్టాలని చూసే ఊడ్చేవాడు ఆ వాళ రోజు కన్నా ఎక్కువ సేపు ఉండి, గచ్చంతా మెరిసిపోయేలా తుడిచాడు.

ఎప్పుడూ కల్తీ పాలే అమ్మే పాలవాడు, ఆ రోజు మీగడ తరకలు కట్టిన చిక్కటి పాలు తెచ్చాడు.

ఈ కలకలం అంతటికీ కారణమైన లాజోకి ఆ పేరు ఎవరు పెట్టారో కానీ, సిగ్గు, లజ్జ అనే పదాలకు అర్థం తెలీని మనిషి లాజో! ఆమెను ఎవరు కనిపారేశారో ఎవరికీ తెలియదు. ఆమె బాల్యం అంతా వీధుల్లోనే. ఒంటరితనంతో, దుఃఖంతో అనాథగా గడిచిపోయింది. తన తిండేదో తను సంపాయించుకోగలిగే వయసు వచ్చేదాకా, ఆమె అడుక్కుంటూ, ఆకలితో అలమటిస్తూనే గడిపేసింది.

కానీ ఎదిగే కొద్దీ, యవ్వనం ఆమె వంట్లో పసందైన మార్పులు తెచ్చింది. వయసు తెచ్చిన ఆ ఆకర్షణీయమైన ఒంపుసొంపులే, ఆమెకు ఆస్తిగా మారాయి. అప్పటివరకూ ఆమె తిరిగిన ఆ వీధులే, ఆమెకు జీవితంలో కొన్ని కొత్త రహస్యాలను విప్పి చూపాయి. కొన్ని కొత్త బతుకుపాఠాలు నేర్పాయి. ఒక కొత్త వృత్తిని చూపాయి.

ఆ వృత్తిలో ఆమె ఎప్పుడూ బేరాలాడేది కాదు. అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వలేనివారికి అప్పుగానైనా శృంగారం పంచేది. వచ్చిన ప్రియుడికి, ఆ అప్పు తీర్చే స్థోమత కూడా లేదని తెలిస్తే, ఒక్కోసారి, తనని తాను ఉచితంగానే అర్పించేసేది.

“ఛీ! ఇట్లాంటి పనులు చేయటానికి నీకు సిగ్గు లేదటే?” చుట్టూ ఉన్నవాళ్ళు అడిగేవారు.

“ఎందుకు లేదూ?” తెగ సిగ్గు పడిపోయేది లాజో!

“చూడూ… ఏదో ఒక రోజు కుళ్లి కుళ్లి ఏడుస్తావ్! ఇట్టాంటి బతుకు బతికేమమ్మా అని!” అనే వారు.

“ఆ! చూద్దాం లెద్దూ…” తేలిగ్గా అనేసి వయ్యారంగా తిప్పుకుంటూ వెళ్లిపోయేది లాజో!

మరే! అమాయకత్వం ఉట్టిపడే ముఖమూ! నల్లకలువల్లాంటి కళ్లూ, నున్నటి చర్మపు నిగారింపూ, మతిచెదిరిపోయే అందం, మత్తెక్కించే నడకా! ఇవన్నీ ఉన్న లాజోకి, వాళ్ల మాటలన్నీ పట్టించుకునే అవసరం ఏంటట!

* * *

మీర్జా బ్రహ్మచారి. రోజూ రొట్టెలు ఒత్తుకోవటం, అవి కాలుస్తూ, వాటితో పాటు చేతులు కాల్చుకోవటంతోనే అతని జీవితం గడిచిపోతోంది. ఊరి సెంటర్లో చిన్న పచారీ కొట్టుంది అతనికి. కొట్టు చిన్నదే, పేరు మాత్రం భారీగా ఉంటుంది. జనరల్ స్టోర్! అని.

పొద్దస్తమానూ, అతనికి కొట్లో కూచోడంతోనే సరిపోతుంది. కనీసం ఊరికి వెళ్లి ఓ పిల్లను తెచ్చి పెళ్లి చేసుకుందామన్నా తీరిక లేదు.

ఇలా ఉండగా, ఇదిగో! ఒకరోజు మీర్జా స్నేహితుడు బక్షీ తీసుకొచ్చాడు లాజోని. “అలా సంపాదించిన నాలుగు కాసులు సానికొంపల మీద తగలేసే బదులు దీన్ని ఉంచుకోరాదూ…” అంటూ, “ఉచితంగా వాడుకోవచ్చు” అన్నాడు.

“ఛా! ఛా!” ఇలాంటి బజారుదాన్ని నా ఇంట్లోనా? వద్దు వద్దు, పంపించెయ్!” బెదురుగా చూస్తూ అన్నాడు మీర్జా.

కానీ అప్పటికే ఇంట్లోకి దూరేసింది లాజో. కట్టుకున్న లంగాన్ని ఎగ్గట్టి గోచీలా దోపుకుని, చీపురు పట్టుకుని ఇల్లంతా శ్రద్ధగా ఊడ్వసాగింది.

“ఇదిగో ఆయనకి వద్దంట వచ్చేయ్!” అంటున్న బక్షీ మాటలు వినిపించుకోకుండా వంటింట్లోని గిన్నెలన్నీ చక్కగా సర్దేసి, బావిలోంచి నీళ్లు తీసుకువస్తానంటూ కుండ పట్టుకుని బయల్దేరింది లాజో.

“ఇదిగో మీర్జా వద్దంటున్నాడు! వచ్చేయ్! వెనక్కి దిగబెట్టేస్తా పద!” అన్నాడు బక్షీ.

“ఏంటి దిగబెట్టేది? నువ్వేమైనా నా మొగుడివా, నన్ను పుట్టింట్లో దిగబెట్టి రావటానికి? నువ్వు ముందు బయటికి నడు. ఈయన సంగతి నేను చూసుకుంటాగా!” ఒక్క అరుపు అరిచింది లాజో.

బక్షీ జారుకున్నాడు. మీర్జా నిస్సహాయంగా చూస్తూండిపోయాడు. ఏం చేయాలో అర్థం గాక బయటికి పరిగెత్తి, మసీదులోకి పోయి కూర్చున్నాడు.

“నాకే సరిపోవట్లేదు అంటే, దీని ఖర్చు ఎవడు భరిస్తాడు? పైగా అదింట్లో ఉండి ఏవేం తగలబెడుతుందో, ఏం దొంగిలిస్తుందో? వీధిన పోయేదాన్ని తెచ్చి నా నెత్తిన కూచోబెట్టాడు ఈ బక్షీగాడు.” కసిగా తిట్టుకున్నాడు మీర్జా.

ఆ వేళంతా బయటే తిరిగి, చీకటిపడుతుండగా ఇంట్లోకి అడుగుపెట్టిన మీర్జా, ఒక్క నిముషం అవాక్కయిపోయి నుంచుండిపోయాడు. ఒక్క క్షణం అతనికి చనిపోయిన తన తల్లి తిరిగివచ్చినట్టు అనిపించింది. అద్దంలా మెరిసిపోతోంది ఇల్లు!

“వడ్డించేయమంటారా?” గుమ్మం వెనగ్గా నిల్చొని పైట సవరించుకుంటూ అడిగింది లాజో.

బంగాళదుంప, పాలకూర, వేయించిన పెసరపప్పు, ఉల్లివెల్లుల్లి దట్టించి కమ్మటి తిరగమోతతో వండిన పప్పు! ఆహా! అచ్చు అమ్మ వండినట్టే!

“ఇవన్నీ ఎలా చేశావు?” ఆశ్చర్యంగా ఒకింత అయోమయంగా అడిగాడు మీర్జా.

“కోమటి దగ్గర అప్పు తెచ్చానులే” చెప్పింది లాజో.

“చూడు… నీకు తిరుగు ప్రయాణానికి డబ్బులిస్తాను. వెళ్లిపో! పనిమనిషి ఖర్చు నేను భరించలేను” అన్నాడు మీర్జా.

“నేను డబ్బులు అడిగానా?” అంది లాజో.

కానీ మీర్జా నీళ్లు నమిలాడు.

“వేడి వేడిగా ఉంది, ఇంకో రొట్టె వేయనా?” పెనం మీద కాల్తున్న రొట్టెని కంచంలో వేస్తూ అడిగింది లాజో.

“రొట్టె కాదు, నాకు కాలుతోంది, పై నుండి కింద దాకా” అరవాలనుకున్నాడు మీర్జా.

మర్నాడు పొద్దున్న మళ్లీ ఆ ప్రసక్తి తెచ్చాడు మీర్జా.

“చూడు మియాఁ… నేనిక్కడ ఉండాలని వచ్చాను. ఇక్కడే ఉంటాను” ఖచ్చితంగా చెప్పింది లాజో.

“కానీ…”

“నీకు నా వంట నచ్చలేదా?”

“అది కాదూ…”

“నేను ఇల్లూ అవీ సరిగా శుభ్రం చేయట్లేదా?”

“అబ్బే అది కాదూ…”

“మరింకేంటి?” కస్సుమంది లాజో.

ఆమె అప్పటికే పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. మీర్జాతో కాదు, ఆ యింటితో!

ఆ దొంగముండాకొడుకు బక్షీ ఒకసారి ఒక గది అద్దెకు చూపించాడు. ఆ గదిలో అంతకుముందు నంది అనే ఒక ఎద్దు ఉండేదట. అది చచ్చి నరకానికి పోయినా దాని పేడకంపు మాత్రం ఆ గదిని వదిలిపోలేదు. పైగా ఆ బక్షీగాడు ఇష్టం వచ్చినప్పుడల్లా తనని పక్కలోకి రమ్మని సతాయిస్తూండేవాడు.

కానీ… ఈ ఇంట్లో తను మహారాణి. తనకు ఎవరూ పోటీ లేరు! పైగా మీర్జా కూడా సాదా మనిషి. మెల్లగా మెత్తగా మాట్లాడతాడు. ఏది పెడితే అదే తింటాడు.

మీర్జాకి కూడా, కొన్నిసార్లు రజో పెట్టిన ఇంటి ఖర్చు లెక్కలు చూసాక, ఆమె పై నమ్మకం కుదిరింది. ఇంక ఊరుకున్నాడు.

లాజో ఇంటి పనంతా చక్కబెట్టుకున్నాక, కాసేపు ఎదురింటి రాము వాళ్లింటికెళ్లేది. వాళ్ల నానమ్మతో కాసేపు పిచ్చాపాటీ మాట్లాడటానికి.

రామూ, మీర్జా కొట్లో పని చేసే కుర్రాడు. మీర్జా ఇచ్చిన కాస్త జీతం బయటి తిరుగుళ్లకు తగలేసేవాడు. లాజోని చూసిన మరుక్షణమే ఆమెపై మనసు పారేసుకున్నాడు.

మీర్జా బయటి తిరుగుళ్ల గురించి లాజో చెవిన పడేసింది వాడే. అది విని లాజోకి చాలా బాధేసింది. హు! తనుండి ఏం లాభం. తనని ఎవరు ఎక్కడ పనికి పెట్టుకున్నా, తన శక్తి మేరకు ఒళ్ళు దాచుకోకుండా కష్టపడేది, కానీ ఇక్కడ ఒక వారం మొత్తం పవిత్రంగా గడిచిపోయింది. తను అంత పనికిరాకుండా పోయిందా? ఇక్కడికి వచ్చాకా చాలామందే తనకి ఎర వేయాలని చూశారు. తాను మీర్జా ఇంటి మనిషి! అందుకే అందర్నీ కాదనింది. లేకపోతే మీర్జా నవ్వులపాలైపోడూ!

కానీ ఈయనగార్ని చూస్తే వట్టి మంచుముద్దలా ఉన్నాడు. లేక అలా కనిపిస్తున్నాడా?

మీర్జా ఒంట్లో బద్దలవుతున్న అగ్నిపర్వతాలు లాజోకి ఏం తెలుసు? అతను కావాలనే ఇంటి నుండి దూరంగా ఉండసాగాడు.

ఆ వాడలో ప్రతీ వాడి నోటా లాజో పేరే. నిన్న పాలవాడు ఏదో పరాచికాలు ఆడబోతే చెంప పగలగొట్టిందట. మొన్న ఆ కోమటి ముఖాన ఏకంగా ఒక పిడక తీసుక్కొట్టిందట. ఇంకా ఇలాగే ఎన్నో… బళ్లో పంతులు ఆమెకు ఎలాగైనా చదువు నేర్పిస్తానని పట్టుపడుతున్నాట్ట. మసీదులో ముల్లాగారు… ఆమె కనపడగానే అరబ్బీలో బిగ్గరగా ప్రార్థన అందుకుంటున్నారట. ఏ ఆపద రానుందో అనుకుంటూ!

మీర్జా చాలా చిరాగ్గా ఇంటికొచ్చాడు. అప్పుడే స్నానం చేసి ఇంటికొచ్చింది లాజో. భుజానికి అతుక్కుని ఉన్న తడివెంట్రుకలు, పొయ్యిలో గొట్టం ఊదీఊదీ ఎర్రబడ్డ బుగ్గలూ, నీళ్లు నిండిన కళ్లతో ఉంది లాజో. ఆమె రూపం చూసిన మీర్జాకి మూర్ఛ వచ్చినంత పనయింది.

ఇలా వేళ కాని వేళ వచ్చాడేంటి? చెప్పాపెట్టకుండా వచ్చి హడలగొట్టేశాడు. పళ్లు నూరుకుంది లాజో. కానీ సర్దుకుని అరగంటలో భోజనం వడ్డించింది.

ఆమె పెట్టిన భోజనాన్ని అతను మౌనంగా ఇబ్బందిగా తినేసి, చేతికర్ర తీసుకుని బయటపడ్డాడు. వెళ్లి మసీదులో కూర్చున్నాడు. కానీ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఇంటి గురించే ఎడతెగని ఆలోచనలు. బుర్ర అంతా చిందరవందరగా ఉంది. ఇక ఉండబట్టలేక ఇంటిదారి పట్టాడు. గుమ్మంలోనే నిల్చొని ఎవరితోనో గొడవపడుతోంది లాజో.

మీర్జాని చూడగానే ఆ మనిషి గబుక్కున జారుకున్నాడు.

“ఎవడువాడు?” అనుమానం మొగుళ్లా అడిగాడు మీర్జా.

“రాఘవ, పాలుపోసేవాడు” చెప్పింది లాజో.

“రాఘవా!” ఎన్నో ఏళ్ల నుంచి పాలుపోయించుకుంటున్నా మీర్జాకి వాడి పేరే తెలియదు ఇన్నాళ్లూ.

“హుక్కా తీసుకురానా మియాఁ…” మాటమారుస్తూ మృదువుగా అడిగింది లాజో.

“వద్దు! ఇంతకీ వాడెందుకు వచ్చాడు” ఉరిమాడు మీర్జా.

“రేపటి నుండి ఎన్ని పాలు తేవాలి, అని అడగటానికి వచ్చాడు” చెప్పింది.

“నువ్వేమన్నావ్?”

“నేనా… నీ పాడెగట్టా. నీకా అనుమానం ఎందుకొచ్చిందరా. రోజూలాగే తీసుకురా, అన్నాను.”

“ఇంకా?” మీర్జా నిప్పులు చెరుగుతున్నాడు.

“ఆ మిగిలిన పాలు మీ అక్కకీ అమ్మకీ తాగించరా అన్నాను.”

“ఆ దొంగవెధవకి ఎంత ధైర్యం” పళ్లు నూరాడు మీర్జా. “వాడినింకోసారి ఇక్కడ అడుగుపెట్టనివ్వను. రేపటి నుండి కొట్టు నుంచి వచ్చేటప్పుడు నేను పట్టుకువస్తాను పాలు” చెప్పాడు.

ఆ రాత్రి భోజనం ఆయ్యాకా మీర్జా చక్కగా గంజి పెట్టి ఇస్త్రీ చేసిన కుర్తాపైజమా ధరించి చెవిలో అత్తరు పూసిన దూదివుండ పెట్టుకుని చేతికర్ర ఊపుకుంటూ బయటికి వెళ్లిపోయాడు.

అతను ఎక్కడికి వెళ్ళాడో అర్థమైన లాజో అసూయతో ఊగిపోయింది. ఏం చేయాలో తోచక ఆ సానిదాన్ని శాపనార్థాలు పెట్టుకుంటూ కూర్చుండిపోయింది. మీర్జాకి తనంటే ఏమాత్రం పట్టింపు లేదా. అసలు అది ఎలా సాధ్యం? మధనపడిపోతూ ఉండిపోయింది.

అక్కడ మీర్జా వెళ్లిన చోట సానిది అప్పటికే ఎవడో విటునితో బేరాలాడుతోంది. మీర్జాకి ఒళ్లు మండిపోయింది. “ఛీ!” వెనుదిరిగి లాలా దుకాణం దగ్గరికి వచ్చి ఆగాడు. అక్కడ కూర్చుని అర్ధరాత్రి దాకా పెరుగుతున్న ధరల గురించి, దేశరాజకీయాల గురించి ఇలా అన్నిటి మీదా తన అక్కసునంతా వెళ్ళగక్కాడు. అర్ధరాత్రికి అలసిపోయి చిరాగ్గా ఇంటికి తిరిగివచ్చాడు.

చల్లని నీళ్లు కడుపునిండా తాగాడు గానీ, లోపల మండుతున్న అగ్ని చల్లారలేదు.

వంటింట్లో చాప మీద పడుకుని ఉంది లాజో. పావడా పైకి చెదిరిందో ఏమో, ఓరగా వేసి ఉన్న తలుపుల్లోంచి లాజో పిక్క భాగం నున్నగా మెరుస్తూ కనిపిస్తోంది. నిద్రలో ఆమె కదిలినప్పుడల్లా ఆమె కాలిమువ్వలు సన్నగా సవ్వడి చేస్తున్నాయి. మీర్జా ఇంకో చెంబుడు నీళ్లు తాగి మంచం ఎక్కి ముడుచుకు పడుకున్నాడు, ప్రపంచంలో ఉన్న అన్నింటినీ తిట్టుకుంటూ. మంచంలో అటూ ఇటూ దొర్లి వళ్ళంతా రాచుకుపోయింది. మంచినీళ్లు తాగి తాగి పొట్టంతా ఉబ్బిపోయింది. కానీ తలుపు వెనక దాగున్న ఆ కాలిపిక్కల నునుపుదనం అతణ్ణి వదలటం లేదు. తెలీని భయాలు ఏవో అతణ్ణి చుట్టుముట్టాయి. మనసులోని సైతాను పదపదమని తొందరపెడుతుంది. కానీ అడుగుమాత్రం ముందుకి పడటం లేదు.

ఇంతలో గతుక్కున అతనికి ఒక అమాయకమైన ఊహ వచ్చింది. అసలు లాజో దుస్తులు చెదిరి ఆమె కాలు కనపడుతూ ఉండటం వల్ల కదా, తాను ఇంత ఇబ్బంది పడుతున్నదీ. తనే వెళ్లి ఆ దుస్తులు సరిచేసేస్తే.

ఆలోచించగా మెల్ల మెల్లగా అదే ఆలోచన బలం పుంజుకుంది. అతనూ మెల్లగా బలం పుంజుకుని లేచాడు. ఒకవేళ ఆమెకు మెలకువ వస్తే? కానీ తప్పదు. తను తన క్షేమం కోసమైనా ఈ పని చేయక తప్పదు.

మంచం కింద చెప్పులు వేసుకుని మెల్లగా శబ్దం కాకుండా ఊపిరి బిగబట్టి మునివేళ్ళ మీద నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లి ఆమె పావడా అంచు పట్టుకుని మెల్లగా కిందకి జరిపి సరిచేశాడు. ఆ తర్వాత కాసేపు తటపటాయిస్తూ అక్కడే నిల్చొని వెనుదిరిగాడు.

కానీ లాజో అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక్క అంగలో లేచి అతణ్ణి తన మీదకు లాక్కొంది. అవాక్కయిపోయాడు మీర్జా. జీవితంలో అతనెప్పుడూ ఇంతగా పొరబడలేదు. అతను పెనుగులాడాడు. లాజోని బతిమిలాడాడు. కానీ ఆమె వదిలితేగా.

మర్నాడు పొద్దున మీర్జా ఎదురవగానే కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడింది లాజో. ప్రపంచాన్ని జయించిన విజేతలా హాయిగా పెద్దగా ఒక ‘కజ్రీ’ పాడుకుంటూ పనులు చేసుకోసాగింది. రాత్రి జరిగిన ఉదంతం తాలూకు ఛాయలేమీ ఆమె కళ్లల్లో ఇసుమంత కూడా కనపడలేదు.

మీర్జా పొద్దుటి నాస్తాకి కూర్చోగానే ఎప్పటిలాగే అతనికి పళ్లెంలో పెట్టి, గుమ్మం పైన కూర్చొని విసరసాగింది. ఆ రోజు మధ్యాహ్నం కొట్టు దగ్గరికి భోజనం తెచ్చిన లాజో నడకలో ఒక కొత్త ఊపు ఉత్సాహం కనిపించాయి మీర్జాకి. కొట్లో లాజో ఉంటే చాలు, వెళ్లే జనాలు ఆగి మరీ ఏదో మిష మీద కొట్టుకు వచ్చేవారు. వస్తువుల ధరలు అడిగేవారు. మీర్జా రోజూ మొత్తం మీద అమ్మినదానికంటే రెట్టింపు లాజో ఆ కాసేపట్లో అమ్మేది.

* * *

మీర్జా ఈ మధ్య కాస్త సన్నబడ్డాడు, నీటుగా తయారవుతున్నాడు. జనాలందరికి ఆ మార్పుకి కారణం తెలుసు. కనుక కుళ్లుకున్నారు. మీర్జాకి మాత్రం స్థిమితం లేదు. అతనికి అంతా అశాంతిగా ఆందోళనగా ఉంది. లాజో అతడ్ని బాగా చూసుకునే కొద్దీ అతనికి ఆమె మీద మోజు పెరగసాగింది. అలాగే చుట్టపక్కల వారి పట్ల భయమూ పెరగసాగింది.

స్వతహాగానే నడకలో నడతలో మాటల్లో అన్నిట్లో ఒక నిర్లక్ష్యం, ఒక విచ్చలవిడితనం ఉండేవి. ఆమె కొట్టుకి భోజనం పట్టుకురాగానే ఆ వీధంతా ఒక కలకలం చెలరేగేది. ఆమె అక్కడ ఉన్నంత సేపూ ఆ బజారంతా ప్రాణం ఉన్న వస్తువులా, ఆమె ఉనికితోనే ఊపిరిపోసుకున్నట్లుగా ఉండేది.

“ఇవాళ్టి నుండి మధ్యాహ్నం భోజనం తీసుకురాకు” చెప్పాడు మీర్జా.

“అదేం?” లాజో మొహంలో నిరాశ. రోజంతా ఇంట్లో ఉండే ఆమెకి మధ్యాహ్నం కాసేపు అలా కాసేపు బజారుకి రావటం ఆటవిడుపుగా ఉండేది.

ఆమెని కొట్టుకి రావొద్దని చెప్పాడు గానీ, మీర్జాకి ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఆమె మీద నిఘా వేయటానికి వేళ గాని వేళలో ఇంటికి వస్తుండేవాడు. అతను ఏ వేళలో వచ్చినా లాజో మాత్రం అందుకు ప్రతిగా అతడ్ని పూర్తిగా సంతృప్తిపరచిగానీ వెళ్లనిచ్చేది కాదు.

ఒక రోజు మాత్రం మీర్జాకి అంతులేని కోపం వచ్చింది. అతను కొట్టు నుండి ఇంటికి వచ్చే దారిలో రోడ్డు మీద వీధి పిల్లలందరితోనూ చేరి కబాడీ ఆడుతోంది లాజో. ఆమె ఆటలో పూర్తిగా లీనమై ఉంది. ఆమె పావడా మాత్రం గాలికి పైదాకా ఎగిరిపోతోంది. వీధి వాళ్ల దృష్టంతా ఎగురుతున్న ఆమె పావడా పైనే ఉంది. లోపల మండిపోతున్నా, మీర్జా ఆమె ఎవరో తెలీనట్టూ తనకేమీ పట్టనట్టూ తల పైకెత్తి చూస్తూ గబగబా నడిచివెళ్ళిపోయాడు.

అతని అవస్థ చూసి వీధి వాళ్లంతా నవ్వుకున్నారు.

మెల్లమెల్లగా మీర్జాకి లాజోపై అభిమానం పెరగసాగింది. ఇప్పుడు అతను ఆమెని విడిచి ఉండాలన్న ఊహే భరించలేకున్నాడు. ఏదో ఒక రోజు ఆమె తనని వదిలివెళిపోతుందేమో అని అతని భయం.

“మరి ఆమెనే పెళ్లి చేసుకోకూడదూ…” మీరన్‌మియా సలహా ఇచ్చాడు.

“ఛీ! ఆ బజారుదాన్ని పవిత్రంగా పెళ్లి చేసుకోవడమా” అరిచాడు మీర్జా.

అదేం చిత్రమో, ఆ రోజు సాయంత్రమే మీర్జా కొట్టు నుండి ఇంటికి వచ్చేసరికి లాజో కనపడలేదు. అతనికి దిక్కు తోచలేదు. ఆ దరిద్రుడు లాలా ఎప్పటి నుండో ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నాడు.

లాజోకి ఒక బంగళా కూడా రాసిస్తానన్నాడు. అంతెందుకు తన స్నేహితుడు మీరన్‌మియా మాత్రం తక్కువతిన్నాడా? లాజోకి రహస్యంగా ఎర వేశాడట. అంతే అయిపోయింది, అంతా అయిపోయింది! ఆమె ఇంకెవరితోనో వెళ్లిపోయింది. మీర్జాకి ఆమె ఇక తిరిగి వస్తుందన్న ఆశ చచ్చిపోతుండగా… వచ్చింది లాజో.

ఎదురింటి రామూ వాళ్ల నాయనమ్మ దగ్గరికి వెళ్లిందట. అంతే! ఆ రోజు ఇక మీర్జా గట్టిగా నిర్ణయించుకున్నాడు. తన కుటుంబ పరువుప్రతిష్ట మంటలో కలిసినా పర్వాలేదు గానీ, లాజో పెళ్లి చేసుకుని తీరతాడంతే!

అదే విషయం లాజోతో చెప్పాడు. అయోమయంగా చూసిందామె. “పెళ్లా! పెళ్లెందుకు మియాఁ?” అడిగింది.

“ఏం? ఇంకెవడితోనన్నా తిరుగుదామనా?” నొసలు చిట్లించి అడిగాడు మీర్జా.

“నాకేం అవసరం?” అమాయకంగా అంది లాజో.

“లాలాజీ, ఏది బంగళా ఇస్తానన్నాడట?”

“ఉమ్మెయ్యనూ వాడి మీద! వాడి బంగళా మీద!” అంది లాజో.

పెళ్లి అవసరం మాత్రం ఆమెకు బొత్తిగా బోధపడలేదు. తను ఇక జీవితాంతం మీర్జాతోనే గడపదల్చుకుంది. ఇలాంటి యజమాని దొరకటం చాలా అరుదు. అతను వజ్రం లాంటి వాడని ఆమెకు తెలుసు. తను అంతకుక్రితం పని చేసిన ఇళ్లల్లో యజమానులంతా తనను శారీరకంగా వాడుకున్నవాళ్లే. జీతం అడిగితే నాలుగు తన్నేవాళ్లు. వాళ్ల మోజు తీరాక తన్ని తగలేసేవాళ్లు. మీర్జా మాత్రం అలాక్కాదు. తనని ఎంతో ప్రేమగా అపురూపంగా చూసుకున్నాడు. తనకి మంచిబట్టలూ, ఒక బంగారుగాజుల జత కూడా కొనిచ్చాడు. లాజో వంశంలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల వాళ్లెవరూ బంగారం వేసుకుని ఎరగరు.

మీర్జా, రాము నాయనమ్మతో పెళ్లి విషయం కదిపితే, ఆమె కూడా ఆశ్చర్యపోయింది.

“ఆ గుదిబండను తెచ్చి మెళ్లే ఎందుకయ్యా కట్టుకునేది? ఆ ముండ ఏమన్నా గొడవ చేస్తోందా ఏమిటి? గట్టిగా తగిలిస్తే అదే పడుంటుంది. నాలుగు దెబ్బల్తో పోయేదానికి పెళ్లి దాకా ఎందుకు చెప్పు?” అంది.

కానీ మీర్జా మనసులో పెళ్లి ఆలోచన బాగా నాటుకుపోయింది.

“మీర్జా మతం వేరని నీకేమన్నా అభ్యంతరమా?” అంటూ లాజోని అడిగింది ముసలిది.

“అబ్బే అదేం లేదు. ఆయన్నే నా భర్తగా భావిస్తున్నాను నేను.” చెప్పింది లాజో.

కానీ దారిపోయే విటుడ్ని కూడా ఆ కాసేపూ భర్తగానే భావించేది లాజో. వాళ్లు ఆమెపై కనకవర్షాలేమీ కురిపించకపోయినా, ఆమె మాత్రం వారికి తనువూ మనసూ నిష్టగా అర్పించేది.

మీర్జా విషయం మాత్రం వేరు. అతనొక్కడి దగ్గరే, ఆమె ఇవ్వడంతో పాటు తీసుకోవటంలోని ఆనందం కూడా పొందింది. అతడితో పోలిస్తే మిగతావారు పందులకన్నా హీనం.

కాకపోతే, పెళ్లి అనేది కన్యలకు! తనకేం అర్హత ఉంది పెళ్లి చేసుకోవటానికి? ఆమె ఎంత నచ్చచెప్పినా బతిమాలినా మీర్జా వినలేదు. ఆమెను చట్టపరంగా నిఖా చేసుకుని తీరతానన్నాడు.

ఆ రోజు సాయంత్రమే నమాజు తర్వాత వారి నిఖా జరిగింది. ఇరుగుపొరుగులోని కన్నెపిల్లలంతా పెళ్లి పాటలు పాడారు. మీర్జా తన స్నేహితులందరికీ విందు ఏర్పాటు చేశాడు.

‘కనీజ్ ఫాతిమా’ అనే పేరుతో లాజో మీర్జా ఇఫ్రాన్ అలీ బేగ్‌కు ఇల్లాలయింది.

chugtaiపెళ్ళవగానే లాజోని ఆ పావడాలు మానేసి చుడీదార్ పైజమాలు వేసుకోమన్నాడు మీర్జా. లంగాలో సౌకర్యంగా కాళ్ల మధ్య ఏ అడ్డంకీ లేకుండా అలవాటైన లాజోకి ఆ కొత్త దుస్తులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఒకరోజు మీర్జా కొట్టుకు వెళ్లగానే గబగబా పైజమా విప్పేసి పావడాలోకి మారిపోతుండగా హఠాత్తుగా మీర్జా వచ్చాడు. కంగారులో నడుం చుట్టూ ఉన్న లంగాని వదిలేసింది లాజో. అది కుప్పలా నేల మీద పడిపోయింది. నగ్నంగా ఉన్న ఆమె మీదకి గబుక్కున ఓ దుప్పటి విసిరేశాడు లాజో. “ఆ సైతాన్ నిన్నెత్తుకెళ్లా!” కోపంగా ఖురాన్‌లోని శాపాలన్నీ తిడుతూ ఆమెకి ఆ తరవాత ఒక గంట సేపు ఒక ఇల్లాలు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా నడుచుకోవాలో, సిగ్గు ఎలా కాపాడుకోవాలో పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు.

అతని కోపానికి కారణం ఏమిటో అర్థం కాలేదు లాజోకి. ఆ ఉపన్యాసం ఎందుకో అంతకన్నా అర్థం కాలేదు. అసలు ఎక్కడ తప్పు జరిగింది. గతంలో ఎన్నోసార్లు అతడ్ని వెర్రెక్కించిన తన రూపం చేష్టలు ఇప్పుడు ఎందుకు కోపం తెప్పిస్తున్నాయి.

అతనికి ఎంత కోపం వచ్చిందంటే, ఆ లంగాని తీసి మంటల్లో పడేసి పోయాడు. లాజో నిర్ఘాంతపోయి చూస్తూండిపోయింది. అతను తనకు కప్పిన దుప్పటి తొలగించి అద్దంలో తన ఒంటిని పరీక్షగా చూసుకుంది. కొంపదీసి రాత్రికి రాత్రే తనకేమన్నా భయంకరమైన చర్మవ్యాధి వచ్చిందా! ఆమెకి అతని ప్రవర్తన బోధపడక చాలా దుఃఖం కలిగింది.

ఆ తర్వాత పంపుకింద స్నానం చేస్తున్నప్పుడు కూడా ఆమెకి ఆ దుఃఖం తగ్గలేదు. కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. తుడుచుకుంటూనే స్నానం చేయసాగింది. పక్కింటి మేస్త్రి కొడుకు మిత్వా అలవాటు ప్రకారం పతంగులు ఎగరవేసే మిషపై డాబా ఎక్కి ఆమెనే చూడసాగాడు. కానీ ఆమె ఎంత దుఃఖంలో ఉందంటే ఎప్పటిలాగా అతడ్ని వెక్కిరించటమో, చెప్పు తీసి విసిరేయటమో చేయలేదు. మౌనంగా తువ్వాలు చుట్టుకుని లోపలికి నడిచింది.

బరువైన గుండెతోనే ఒళ్లు తుడుచుకుని పైజమా ధరించబోయింది. కానీ వస్తేగా! కానీ ఆ చుడీదార్ పైజమా సన్నగా పొడుగ్గా అచ్చు పిశాచపు పేగులల్లే ఉంది. ఆమె బాధకి తోడు దాని నాడా కాస్త ఎక్కడికో లోపలికి వెళ్లిపోయి దొరకలేదు. పక్కింటి పిల్ల జుల్లూని పిలిచి మొత్తానికి దాని సాయంతో నాడానికి పట్టుకుని బయటికి లాగారు.

“ఛీ! తుపాకీ పెట్టెలాంటి దుస్తులను ఆడాళ్లకు కనిపెట్టింది ఎవడో!” లాజో తిట్టుకుంది. ఆ రాత్రి మీర్జా ఇంటికి వచ్చాకా కూడా ఆ నాడా అలాగే ఇబ్బంది పెట్టింది. ఆమె అవస్థ చూసి మీర్జాకి చాలా ముచ్చటేసింది. ఇద్దరూ కలిసి ప్రయత్నం మీద దాన్ని దొరకబట్టారు.

మీర్జాకి ఇప్పుడు ఇంకో కొత్త సమస్య ఎదురైంది. ఇదివరకూ లాజోలో మత్తెక్కించే శృంగార చేష్టలుగా అనిపించిన కొన్ని అలవాట్లు కనీజ్ ఫాతిమాలో చూసేసరికి విచ్చలవిడితనంగా అనిపించసాగాయి. ఒక గౌరవప్రదమైన ఇల్లాలికి ఆ లక్షణాలు చాలా అసభ్యంగా అమర్యాదగా ఉన్నాయి.

అతడు కలలుగన్న పెళ్లికూతురిలా లేదు లాజో. అతని కలలరాకుమారి అతని చేష్టలకు సిగ్గుపడుతూ అతడ్ని దూరంగా నెట్టేస్తూ అతని చర్యలు అర్థంకానట్టు నటించాలి. కానీ లాజో పాపం! ఉత్త రోడ్డుపక్క ఇటుకుముక్క. ఆమెకి ఈ నాజూకుతనమంతా ఏం తెలుసు.

అడుగడుగునా ఆమె ప్రవర్తన తప్పుపడుతూ సరిదిద్దుతూ ఆమెని అడవిజంతువు నుండి పెంపుడుజంతువు చేయాలనుకున్నాడు మీర్జా.

సాయంత్రాలు కూడా అతను ఇంటికి త్వరగా వచ్చేయాలని ఆత్రపడటం లేదు. ఎక్కువసమయం స్నేహితులతో గడుపుతున్నాడు. లేకపోతే కొత్తపెళ్లాం కొంగుపట్టుకు తిరుగుతున్నాడంటారని అతని భయం. కానీ లాజో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది కదా అని ఒక పనిపిల్లని పెట్టుకుందాం అన్నాడు. లాజోకి మండిపోయింది. అప్పటికే ఆమె మీర్జా మళ్లీ సానికొంపకు వెళ్తున్నాడని విని వుంది. ఆ వాడలోని మగాళ్ళందరూ అలాగే వెళ్తారని ఆమెకి తెలుసు.

కానీ తన ఇంట్లో మాత్రం ఇంకో ఆడదానికి స్థానం లేదు. తన వంటింట్లోకి ఇంకో ఆడది అడుగుపెట్టి, తన మిలమిలలాడే పాత్రలు ముట్టుకుంటేనా…? నరికిపారెయ్యదూ! మీర్జాని ఇంకో ఆడదానితో పంచుకుంటుందేమో కానీ, ఇంటిని మాత్రం.. ఊహూ అసలు పంచుకోదు!

* * *

మీర్జా ఏమంటూ లాజోని పెళ్లి చేసుకున్నాడో గానీ, ఆమెని ఇంట్లో పెట్టి ఇక ఆ సంగతి పూర్తిగా మరిచిపోయినట్టున్నాడు. ఆమెతో మాటలు కూడా బొత్తిగా తగ్గించేశాడు. ఆఁ… ఊఁ… ఉహూ… లతోనే కొన్ని వారాలు గడిచిపోయేవి.

మీర్జాకి ఉంపుడుగత్తెగా ఉన్నన్నాళ్ళూ, అందరి కళ్లు లాజోపైనే ఉండేవి. పెళ్లితో పాటు ఆమెకి లభించిన గౌరవ స్థానం దృష్ట్యా, ఆమెని ఇష్టపడే అందరూ ఇప్పుడు తల్లిగానో, చెల్లిగానో, కూతురుగానో చూస్తున్నారు. కనీసం ఆమె ఇంటి పరదా వైపు కూడా చూసే సాహసం ఎవరూ చేయట్లేదు. ఒక్క మిత్‌వా తప్ప!

వాడు మాత్రం విశ్వాసంగా, ఇంకా లాజో ఇంటి చుట్టూనే తచ్చాడుతూ, ఆమె స్నానానికి వెళ్లినప్పుడల్లా డాబా ఎక్కి పతంగులు ఎగరేస్తూ, దొంగచాటుగా చూస్తూండేవాడు. అదీ మీర్జా ఇంట్లో లేనప్పుడే లెండి!

ఒక రోజు రాత్రి, మీర్జా స్నేహితులతో కలిసి దసరా సంబరాలు చేసుకుంటూ ఇంటికే రాలేదు. మర్నాడు పొద్దునకూడా వచ్చిన వెంటనే మొహం కడుక్కుని కొట్టుకి వెళ్లిపోయాడు. లాజోకి చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ రోజు స్నానం చేస్తూ అప్రయత్నంగానే ఆమె చూపు డాబాపైకి సారించింది. లేక ఆ రోజు మిత్వా చూపుల వాడి ఆమె తడి ఒంటిని అంతగా గుచ్చుకుందో తెలీదు.

ఇంతలో హఠాత్తుగా పతంగి తెగి ఆమె వైపు వాలింది. దాని పదునైన దారం ఆమె ఒంటిని చీరుకుంటూ కింద పడింది. ఉలిక్కిపడిన లాజో ఒక్క ఉదుటున లేచి ఒంటికి తుండైనా చుట్టుకోకుండా లోపలికి పరుగు తీసింది. కంగారులో మరి తువ్వాలు చుట్టుకోవడం మరిచిందా, లేక కావాలనే అలా చేసిందా ఆ దేవుడికే తెలియాలి.

కానీ అప్పటినుండి మిత్‌వాని చూడాలి. మీర్జా ఇంటి చుట్టూనే వేలాడసాగాడు. లాజోకి ఏదైనా వస్తువు కావాల్సివస్తే పరదా కాస్త పక్కకి జరిపి అరిచేది “ఏయ్ మిత్‌వా! అలా పేడకడిలాగా అక్కడ నిల్చొని ఉండక బజారుకి వెళ్లి కచోరీలు పట్టుకురా!” అని.

ఆమె స్నానం చేసేటప్పుడు పొరబాటున మిత్‍వా డాబాపైన లేకపోతే, బకెట్లూ చెంబులూ డబడబా శబ్దం చేసేది. ఎంత పెద్దగా అంటే, ఆ శబ్దాలకు సమాధిలోని శవాలైనా లేచి కూచోవాల్సిందే. ఇక మిత్‌వా సంగతి చెప్పాలా?

ఆమె జీవితమంతా అడిగినవారికి లేదనకుండా ప్రేమను కురిపించింది. అదంతా ఇపుడు మిత్‌వా మీద కురిపించటానికి సిద్ధంగా ఉంది. అతడు అడగటమే ఆలస్యం.

మీర్జా ఒక పూట భోజనానికి రాకపోతే ఆ అన్నాన్ని వృధాపోనిచ్చేది కాదు. ఆకలితో ఉన్నవారికి పెట్టేసేది. అక్కడ మిత్‌వా కన్నా ఆకలిగొన్నదెవరు!

ఇవేమీ పట్టని మీర్జా వివాహబంధంతో బంధింపబడ్డ లాజో నిజమైన ఇల్లాలుగా మారిపోయిందనుకున్నాడు.

అసలు ఆ రోజు తన కళ్లతో తాను స్వయంగా చూసివుండకపోతే నమ్మేవాడు కూడా కాదు. అనుకోకుండా హఠాత్తుగా గుమ్మంపైన ప్రత్యక్షమైన మీర్జాని చూసి లాజో నవ్వు ఆపుకోలేకపోయింది. పక్కలోనున్న మిత్‌వాని చూసి మీర్జా అంత మండిపడతాడని ఆమె ఊహించలేదు.

కానీ మిత్‌వాకు తెలుసు మీర్జా కోపం! ఊడిపోతున్న చెంపను గట్టిగా పట్టుకొని పరుగోపరుగు. మూడు ఊళ్లు దాటేదాకా కనీసం ఊపిరి పీల్చుకోవటానికి కూడా ఆగలేదు.

ఆ రోజు మీర్జా లాజోని బాదాడు చూడూ… ఇంకోళ్లు ఇంకోళ్ళయితే ఆ దెబ్బలకి చచ్చూరుకునేవారు. లాజో గట్టిది కాబట్టి బతికిపోయింది.

మీర్జా భార్య లాజో మిత్‌వా కలిసి పట్టుబడ్డారన్న విషయం నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది. ఆ తమాషా చూడటానికి జనాలు పెద్ద సంఖ్యలో పోగయ్యారు. కానీ అప్పటికే ఆ ఉదంతపు కథానాయకుడు మిత్‌వా పారిపోవటం, లాజో దెబ్బలు తిని మూలపడటం చూసి నిరుత్సాహంగా వెనుదిరిగారు.

రాము నాయనమ్మ వచ్చి సగం చచ్చిపడివున్న లాజోని ఇంటికి తీసుకుపోయింది.

మీర్జా ఆమెని అంత చావబాదాక ఇకలాజో అతని మొహం కూడా చూడదు అని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగింది. పెళ్లి చేసుకుని సాధించలేనిది మీర్జా చితకబాది సాధించగలిగాడు. లాజో దృష్టిలో ఇప్పుడు వారి బంధం ఇంకా గట్టిపడింది.

కాస్త స్పృహలోకి వచ్చి తేరుకోగానే ఆమె మొట్టమొదట అడిగింది మీర్జా గురించే. ఆమె పాత యజమానులంతా ఆమెను వాడుకుని జీతం అడిగితే చితకబాదేవారు. ఆ తర్వాత ఇక జీతంబత్తెం లేకూండానే వాళ్లకు చాకిరీ చేసేది. అప్పుడప్పుడూ ఆమెను వారు తమ స్నేహితులకు కూడా అప్పుగా వాడుకునేందుకు ఇచ్చేవారు. కానీ మీర్జా అలాంటివేమీ చేయలేదు. ఆమెను పూర్తిగా తనదిగా భావించాడు.

చుట్టుపక్కల వాళ్లందరూ లాజోని పారిపోయి ప్రాణాలు దక్కించుకోమన్నారు. కానీ ఆమె వింటేగా…

* * *

అక్కడ మీర్జా పోయిన తన పరువును ఎలా దక్కించుకోవాలో తెలియక తల బద్దలుకొట్టుకుంటున్నాడు. లాజోని చంపితే తప్ప తన పరువు నిలబడదు అనుకున్నాడు. మీరన్‌మియాఁ నే ఆపాడు. “ఆ కుక్కకోసం ఎందుకు భాయ్, నీ నెత్తి మీదకు తెచ్చుకుంటావు… దానికి విడాకులు ఇచ్చి వదిలించుకో!” అన్నాడు.

మీర్జా అప్పటికప్పుడు లాజోకి తలాఖ్ ఇచ్చేసి ముప్ఫై రెండు రూపాయల మెహెర్, ఆమె దుస్తులు, వస్తువులు అన్నీ రాము ఇంటికి పంపించేశాడు.

విడాకులు విషయం విని లాజో హాయిగా ఊపిరి పీల్చుకుంది. పెళ్లి తనకి అచ్చిరాలేదు. దాని వల్ల తనకు అన్ని విధాలా అనర్థాలే జరిగాయి. ఇప్పుడు పీడా పోయింది.

“మీర్జా ఇంకా కోపంగానే ఉన్నాడా?” ముసలిదాన్ని అడిగింది లాజో.

“ఇంక నీ మొహం కూడా చూడడట. నిన్ను ఎందులోనన్నా దూకి చావమన్నాడు.”

మీర్జా విడాకుల సంగతి ఊళ్లో మళ్లీ దుమారం లేపింది. లాలా వెంటనే వర్తమానం పంపాడు లాజోకి, బంగళా తయారుగా ఉందంటూ.

“నీ అమ్మను ఉంచరా అందులో…” లాజో జవాబు.

ఒక రెండువారాలు మంచంలో ఉన్నాకా లాజో మళ్లీ మామూలు మనిషైంది. మీర్జా బాదటమేమో గానీ, లాజో కడిగిన ముత్యంలా మునుపటికన్నా మెరుపు సంతరించుకుంది.

ఏ పాన్ కొనటానికో బయటకు వస్తే చాలు బజారు మొత్తం తుఫాన్ రేగేది. అది చూసినపుడల్లా చచ్చేచావుగా ఉండేది. ఒకసారి కోమటివాడితో బేరమాడుతూ కనపడింది. ఆ కోమటి చొంగ కార్చుకుంటూ చూస్తున్నాడు. వాళ్ల కంటపడకుండా ముఖం దాచుకుంటూ జారుకున్నాడు మీర్జా.

“నీకు పిచ్చెక్కిందా మియాఁ? అది ఎటు పోతే నీకెందుకు, ఎవరితో మాట్లాడితే నీకేంటి? నువ్వు విడాకులు ఇచ్చేశావు కదా?” అన్నాడు మీరన్‌మియాఁ.

“ఎంతైనా ఆమె నా ఒకప్పటి భార్య కదా!” అన్నాడు మీర్జా.

“నీకు నిజం చెప్పాలంటే ఆమె నీ భార్య కాదు ఎప్పుడూ” అన్నాడు మీరన్‌మియాఁ.

“అదేంటి? నేను నిఖా చేసుకున్నాను కదా?” మీర్జా ఆశ్చర్యపోయాడు.

“అది చట్టపరంగా చెల్లనే చెల్లదు.”

“ఎందుకు?”

“ఆ నిఖా చెల్లదు. లాజో ఎవరికి పుట్టిందో ఎవరికీ తెలీదు. అలాంటి అనాథతో నిఖా చెల్లనే చెల్లదు.” మీరన్‌మియాఁ తీర్పు చెప్పాడు.

“అంటే మా నిఖా జరగలేదంటావ్?” మీర్జా అన్నాడు.

“జరగనేలేదూ” నొక్కి వక్కాణించాడు మీరన్‌మియాఁ.

“అయితే నా పరువు పోనట్టేగా, నా కుటుంబ ప్రతిష్ట పటిష్టంగా ఉన్నట్టేగా?” మీర్జాకి పోయిన ప్రాణం లేచి వచ్చింది. “మరి తలాఖ్ సంగతి?” మళ్లీ అనుమానం.

“నిఖానే లేనప్పుడు తలాఖ్ ఎక్కడిది?”

“ఛా! అనవసరంగా దాని ముఖాన ముప్ఫై రెండు రూపాయలు పోశాను” మీర్జా బాధపడ్డాడు.

ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. మీర్జాకి అతని భార్యకీ పెళ్లే అవలేదట అని, పెళ్లీ – విడాకులూ రెండూ చెల్లవట అనీ.

ఇది విన్న లాజో ఆనందంతో గెంతులేసింది. పెళ్లీ, విడాకులూ అన్నీ పీడకలలా గడిచిపోయాయి. అన్నిటికన్నా ఆమెకి సంతోషం కలిగించింది… మీర్జా పరువు పోలేదు. అప్పటివరకూ తన వల్ల అతని పరువు మంటలో కలిసిపోయింది అని బాధపడేది. ఇప్పుడు ఆ చింత తీరిపోయింది.

“అబ్బా! అనాథగా ఉండటం ఎంత అదృష్టం! అమ్మో! తను నిజంగా ఏ సంసారుల పిల్లో అయితే అపుడు మీర్జా గతేమిటి?” ఊహించటానికి కూడా భయపడింది.

రామూ నానమ్మ ఇంట్లో ఆమెకి ఇక ఉండ బుద్ధి కాలేదు. ఇంటివైపు గాలి మళ్లింది. మియాఁ కనీసం ఇల్లు ఊడ్చి కూడా ఉండడు ఇన్ని రోజులు. ఇల్లంతా ఎంత చిందరవందరగా ఉందో!

ఒక రోజు మీర్జా కొట్టు నుండి వస్తుంటే దార్లో ఆపి అడిగింది. “మియాఁ.. పనిలోకి ఎప్పటి నుండి రానూ?” అని.

“ఛీ!” మీర్జా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు గానీ, అతని మనసులో అనిపించింది. “ఎలాగూ తనకూ ఒక పనిమనిషి అవసరం ఉంది. దీన్నే పెట్టుకుంటే ఏం!” అని.

కానీ లాజో అతనికి ఆలోచించేటంత వ్యవధి ఇవ్వలేదు. మర్నాడే గోడ దూకి ఇంట్లోకి వచ్చేసింది. ఎప్పటిలాగే లంగా ఎగ్గట్టి పనిలోకి దిగింది.

ఆ సాయంత్రం కొట్టు నుండి ఇంటికి తిరిగి వచ్చిన మీర్జా, ఒక్క నిముషం ఊపిరిపీల్చుకోవటం మర్చిపోయి నిల్చుండిపోయాడు. ఒక్కసారిగా అతనికి చనిపోయిన తన తల్లి తిరిగివచ్చినట్టనిపించింది. ఇల్లు అద్దంలా మెరుస్తోంది. గాల్లో తేలి వస్తున్న అగరుపరిమళం, గట్టు మీద నిండా నీళ్లు నింపిన కుండా, దాని పైన బాగా తోమి బోర్లించిన గిన్నె.

అతనికి గతజ్ఞాపకాలతో మనసు బరువెక్కింది.

లాజో వడ్డించిన మాంసం వేపుడు, పరాటాలు మౌనంగా తినేశాడు. అతను తింటున్నంత సేపూ ఆమె ఇదివరకటి లాగే గుమ్మం మీద కూర్చొని విసురుతూ ఉంది.

ఆ రాత్రి వంటింటి గచ్చుపై గోనెతట్టులు పరుచుకుని లాజో పడుకోగానే మీర్జాకి మళ్లీ విపరీతమైన దాహం వేసింది. వంటింట్లో నుండి వినిపిస్తున్న చిరుమువ్వల సవ్వడి అతడ్ని రెచ్చగొడ్తోంది. నిద్ర రాక అటూయిటూ దొర్లసాగాడు. అపరాధభావంతో, భయంతో అతని హృదయం భారమైంది.

పాపం లాజో పట్ల తాను చాలా అన్యాయంగా అనుచితంగా ప్రవర్తించాను. పశ్చాత్తాపం ఒక్కసారిగా అతడ్ని చుట్టుముట్టేసింది. తనను తానే తిట్టుకుంటూ పడుకున్నాడు. ఐనా శాంతి లేదు. కాసేపటికి దిగ్గున లేచిన మీర్జా “ఛట్! ఏదైనా కానీ ఇంక నేను ఆగలేను” అనుకుంటూ పరిగెత్తుకుని వంటింట్లోకి వెళ్ళాడు. చాప మీద పడుకుని అమాయకంగా నిద్రపోతున్న తన ఇంటి ఇల్లాల్ని వంగి ఎత్తుకుని, రెండు చేతుల్లో పొదువుకొని లోపలికి తీసుకు వెళ్లాడు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, అనువాదం, జూన్ and tagged , , , , , , , .

5 Comments

 1. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత ప్రముఖ ఉర్దూ రచయిత్రి. ఇస్మత్‌ చుగ్తాయ్‌ ని (1915 – 1991) ఇరవయ్యో శతాబ్దపు ఆధునిక ఉర్దూ కధా సాహిత్యానికి నాలుగు మూల స్తంబాలులో ఒకరిగా పరిగణిస్తారు ( మాంటో, కిషన్ చందర్, రాజిందర్ సింగ్ బేడి లతో కలుపుకుని )

  ఇస్మత్ ఆపా ఆలోచనలను ప్రభావితంచేసి, పునాదివేసిన వారు ఆధునిక ఉర్దూ కధా సాహిత్య దిశానిర్దేశకుడు మున్షీ ప్రేంచంద్; పాశ్యాచ్య రచయితలు డోస్తొయెవిస్కి, చెఖోవ్, డికెన్స్, టాల్ స్టాయి, సోమర్సెట్ మాం. తను కాలేజి రోజుల్లో చదివిన గ్రీకు నాటికలు, షేక్స్ పియర్, ఇస్బెన్, బెర్నాడ్ షా రచనలతో కూడా ప్రభావితం అయ్యారు. ప్రేమ్‌చంద్‌ ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘం ( Progressive Writers’ Association ) లో కొంతకాలం పని చేసారు.

  ఫెమినిజం అనే మాట వేళ్లూనుకోని 1940 దశకంలో, పురుషాదిక్య, ఫ్యూడల్ సమాజంలోని వైరుధ్యాలు, స్త్రీ పురుషుల మధ్య ధనిక పేదల మధ్య ఉన్న అసమానతలు, మానవ సంబంధాలు, వివాహ వ్యవస్థ పై తన రచనల ద్వారా తిరుగుబాటుతనంతో ధైర్యంగా ఒంటరి పోరాటం చేసారు. గ్రామీణ, మధ్య తరగతి సమాజం లోని స్త్రీల జీవితాలను ప్రతిభావంతంగా చిత్రించారు. ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిం సమాజం, సంస్కృతుల నేపధ్యంలోని ( సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ) ధిక్కార స్వరంతో కధలు రాసినా వాటిలోని మానవత్వపు మధురిమలు సార్వజనీయతను సంతరించుకున్నాయి.

  ” స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ, పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం, విషాదాన్ని చురుక్కుమనిపించేలా పాఠకుల ముందుంచిన అసాధారణ ప్రజ్ఞాశీలి ఇస్మత్‌. సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. “ ( పి. సత్యవతి )

  భారత్, పాక్ లు గా దేశ విభజన జరిగినప్పుడు తను ఇక్కడే ఉండాలని ఎంచుకున్నారు. తన మాతృభూమి ఇండియాలో మళ్లీ జన్మించాలన్నది తన తుది కోరిక అని చెప్పుకున్న ఇస్మత్ ఆపా తన తరం, మరెన్నో తరాల పాఠకులు, రచయితలు, మేధోవర్గానికి స్పూర్తిదాయకంగా నిలిచారు.
  ____________________________________________

  ఇస్మత్ చుగ్తాయ్ “ఘర్‌వాలీ” కథను మణిరత్నం “లాజో” (Lajjo) పేరిట హిందీ సినిమాగా తీస్తున్నారట. అదెంతో బావుంటుంది గాని, “ఘర్‌వాలీ” కథను అంతకన్నా చాలా చాలా బాగా అనువదించిన శింగరాజు రమాదేవి గారికి వినయపూర్వక కృతజ్ఞతలు. “పడుకుని అమాయకంగా నిద్రపోతున్న తన ఇంటి ఇల్లాల్ని వంగి ఎత్తుకుని, రెండు చేతుల్లో పొదువుకొని లోపలికి తీసుకు వెళ్లాడు” వాక్యాలు మనసుని ఆర్ద్రం చేసాయి.

  ~ ఇట్లు గొరుసన్న గారి తం. మా. రామయ్య ( aka త్రిపుర గారి ఓ వీరాభిమాని )

 2. చుగ్తాయ్ అంటేనే చురక. బురద సంప్రదాయాల పై ఝుళిపించే ఒక చర్నాకోల. మురికి ముసుగు లాగి లాగిపెట్టి కొట్టిన చెంపపెట్టు. ఆమె కథ కంబళి (స్మైల్ గారి అనువాదం ) చదివినప్పుడే చలించిపోయాను. ఈ కథ గతం లో మరొకరు అనువాదం చేయగా చదివిందే. అయినా ఒక అద్భుతం. చుగ్తాయ్ మన దేశం లో పుట్టడం మన అద్రుష్టం . అంతే – మాటల్లేవ్ .
  శింగరాజు రమాదేవి గారి అనువాదం బాగుంది. హాయిగా చదివించింది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.