cover

చెప్పుల తాత

Download PDF ePub MOBI

కొండప్ప మా స్కూలు ఆవరణలో ఉన్న చింత చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. మా స్టాఫ్ రూమ్ కిటికీకి దగ్గరగా నా టేబుల్ ఉంటుంది. అక్కడ నుంచి కొండప్ప ఏం పని చేస్తుందీ నాకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. నాకు పని లేనప్పుడంతా అతన్ని గమనిస్తూ ఉండటం నాకు అలవాటు.

అతడు ఎవరితోనూ మాటలు పెంచుకోడు. చెప్పదలుచుకున్నది చెప్తాడు. ఆ చెప్పే మాటలు తన పనికి అవసరమైనంత వరకే.

పొద్దున్నే ఎన్ని గంటలకి వస్తాడో మరి, నేను స్కూలు కొచ్చేటప్పటికి చెట్టు కింద శుభ్రంగా ఊడ్చి ఉంటుంది బ్లూ టార్పాలిన్ పట్ట మడతలు లేకుండా పరచబడి ఓ పక్క కొత్త చెప్పులు, బూట్లు, స్లిప్పర్స్ నాలుగైదు జతలు పెట్టి ఉంటాయి. పట్టకి మధ్యలో అతను కూర్చుని ఉంటాడు. అతనికి మరో వైపు పాత చెప్పులు, తోళ్ళు, సీలలు ఏవేవో సామన్ల డబ్బాలు సర్ది ఉంటాయి. ఎవరైనా ఒక కొత్త చెప్పుల జత కొనుక్కుని పోతే మళ్ళీ దాని స్థానం లోకి మరో జత చేరుతుంది తప్ప చాలా జతలు అమ్మకానికి ఉండవు. బహుశా అతనికి కొత్త చెప్పుల అమ్మకాలు తక్కువన్నా అయి ఉండవచ్చు లేదా పెట్టుబడికి డబ్బులు లేకపోయి ఉండవచ్చు.

అతని దగ్గరకి మనుషులు ఎక్కువగా తెగిపోయిన వాటిని కుట్టించుకోవడానికో, బూట్ పాలిష్ కో వస్తుంటారు. అతని ఎడమవైపు భుజం మా స్టాఫ్ రూమ్ వైపుకి ఉంటుంది. కుడి భుజం వైపు రోడ్డు ఉంటుంది. అతడు తల ఎత్తి ఎవరినీ చూడడు. రోడ్డున పోయే వాళ్ళ కాళ్ళకున్న చెప్పులని మాత్రం పని చేసుకుంటూ అప్పుడప్పుడూ తల తిప్పి చూస్తుంటాడు. అతడు తల తిప్పి చూసినప్పుడల్లా నేను కూడా రోడ్డున పోతున్న వాళ్ళ చెప్పులని చూస్తాను. ఆశ్చర్యం ఏమిటంటే అతడు చూసే ఆ చెప్పులన్నీ కొత్తవి అయి ఉంటాయి. అతనికి తెలుస్తుందా అడుగులని బట్టి అవి కొత్త రకం అని!?

అలాగే స్కూల్లో ఎంత మంది పిల్లలున్నారో, వాళ్ళేసుకున్న చెప్పుల రకాలేమిటో కొండప్పకి తెలుసు. ఎవరి కాళ్ళకైనా కొత్త చెప్పులు చూశాడంటే మాత్రం తల ఎత్తి ఆ చెప్పులు వేసుకున్నది ఎవరా అని చూస్తాడు. ‘ఆ పాత చెప్పులు ఏం చేశావ’ని అడుగుతాడు.

“తెగిపోయినయ్ తాతా” అంటారు వాళ్ళు. ఇక ఏ భాగంలో తెగిందో కనుక్కోని రిపేరు చేయగలిగే చోటైతే “తీసకరా రిపేరు చేసి పెడతా” అంటాడు. వాళ్ళు తెచ్చి ఇస్తే రిపేరు చేసి పెడతాడు. లేకపోతే మళ్ళీ అడగడు తీసుకురమ్మని.

ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాడు కొండప్ప. కష్టమర్లున్నప్పుడు వాళ్ళు అడిగిన పని చేస్తుంటాడు. వాళ్ళు లేనప్పుడు కొత్త చెప్పులు కుట్టుకుంటూనో, రిపేర్లు చేసుకుంటూనో ఉంటాడు. పనేమీ లేకపోతే అతనికి వెనకగా చింత చెట్టు కింద పెట్టిన మా టీచర్ల టూ వీలర్ల దగ్గరకి వెళ్లి ఏది మురికిగా ఉందో చూస్తాడు. ఆ టీచర్ నడిగి బండి తాళాలిప్పించుకొని అవతలకి తీసుకెళ్ళి కడిగిపెడతాడు.

అతనికి అతని పని మీదున్నంత శ్రద్ధ ఒక ఉపాధ్యాయుడిగా నాలో లేదన్న సంగతి అతన్ని చూస్తుంటే నాకు తెలుస్తుంది.

***

పదవ తరగతి పిల్లలకి ఫ్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు మొదటి పరీక్ష తెలుగు. ఉదయం పరీక్ష జరుగుతుంది కాబట్టి నాకు క్లాసులు లేవు. తీరిగ్గా ఒక నవల తీసుకుని చదువుకుంటున్నాను. కొండప్ప దగ్గర కొచ్చి ఎవరో మాట్లాడుతుండటం వినిపించి పుస్తకం లోంచి తల ఎత్తి చూశాను.

కొండప్ప తలవంచుకుని అతనిచ్చిన బూటుకి వేళ్ళాడుతున్న సోల్ ని పరీక్షిస్తున్నాడు. బాగున్న బూటు అతని చేతిలో ఉంది. ‘కొత్తగా ఉన్నాయి సోల్ ఎందుకు ఊడిందో మరి’ అని నేననుకుంటుండగా “కొని నాలుగు రోజులు కూడా కాలేదు తాతా! సోల్ ఊడిపోయింది. షాప్ వాడినడిగితే ‘మేమేమీ చేయలేమండీ’ అంటున్నాడు. ఎక్కడ చూసినా అన్యాయమే అనుకో” అన్నాడు.

కొండప్ప దానికి ఏమీ మాట్లాడకుండా పరీక్షించడం పూర్తయిందన్నట్లు తల ఎత్తి “అంతా ఊడదీసి గమ్మేసి అతికించి కుట్టాల. రెండు రోజులు పడతాది” అన్నాడు.

“ఊడదీయకుండా అలాగే కుట్టేస్తే సరిపోదా?”

“లేదు బాబూ! అలా కుదరదు. బారుకీ ఊడదియ్యాల గమ్మేసి సక్కంగా అంటించి కుట్టాల. అప్పుడే రెండూ ఒకలాగే ఇప్పుడే కొనుక్కోనొచ్చినోటిలాగా ఉంటాయి” అన్నాడు కొండప్ప. అతని గొంతులో అతని పని పట్ల నమ్మకం స్పష్టంగా వినిపిస్తోంది.

“ఆఁ అలాగే ఉండాలి. ఖర్చు కాస్త ఎక్కువైనా పర్లేదు. ఆఫీసులో నలుగురిలో తిరిగేవాడిని – బాగుండాలి” అన్నాడతను.

“సక్కంగా కుడతాను”

“సరే ఎంతవుతుంది?”

“యాబై రూపాయలు”

“యాభై రూపాయలా? కాస్త తగ్గించుకోవచ్చుగా!”

“చాలా పని సెయ్యాల బాబూ!”

“ఔనులే …. కాస్త తగ్గించుకో” అన్నాడతను.

కొండప్ప ఇక మాట్లాడటం ఇష్టం లేనట్లుగా చేతిలో ఉన్న బూటుని అతని కాళ్ళ దగ్గరగా పెట్టి మరో చెప్పును కుట్టుకోసాగాడు.

“ఊ! సరేలే తాతా! 50 రూపాయలు ఇస్తాను. బాగా ఉండాలి – రెండు బూట్లూ ఒకేలాగా – ఏమాత్రం

తేడా లేకుండా” అన్నాడు.

కొండప్ప రెండు బూట్లనూ తన పక్కన పెట్టుకుంటూ “ఇయ్యాల మంగలవారం …. బుద … గురు…. గురువారం ఇదే టైముకి రా బాబూ రెడీ సేసి పెడతా” అన్నాడు.

అతను తల ఊపి వెళ్ళిపోయాడు. కొండప్ప పనిలో, నేను నా పుస్తకం చదవడంలో మునిగిపోయాము.

మధ్యాహ్నం భోజనాలయ్యాక మా కొలీగ్ ప్రభాకర్ కొండప్పని కేకేశాడు.

స్టాఫ్ రూములోకి వచ్చిన కొండప్పకి బండి తాళాలిస్తూ “కొండప్పా! ఏమీ అనుకోకుండా ఈ రోజు కాస్త నా బండిని కడిగిపెట్టు. సాయంత్రం మా బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళాలి” అన్నాడు.

“ఇయ్యాల పనుంది బాబూ …. సరేలే అన్నం తినేసి కడగతా” అని బండి తాళాలు తీసుకొన్నాడు. అంత పని ఉన్నా, ఈ పనికి ప్రభాకర్ ఏమీ ఇవ్వడని తెలిసినా అతని గొంతులో ఏమాత్రం విసుగు కాని బాధ కాని లేదు.

మా ఆవిడ క్యారియర్ లో కట్టిచ్చిన కోడిగుడ్ల పులుసుతో బాగా లాగించానా నిద్ర తూగొస్తోంది. ఇంటికెళ్ళిపోయి హాయిగా కాసేపు పడుకొని లేచి నవల చదువుకుందామనిపిస్తోంది కాని కుదరదు. రేపు నా లెక్కల పరీక్ష. సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు పదవ తరగతి పిల్లల స్టడీ అవర్ నేనే తీసుకోవాలి. అది తల్చుకుంటేనే నాకు విసుగ్గా ఉంది.

టేబుల్ మీదే కాసేపు తల వాలుద్దామనుకుంటుండగా “సార్” అంటూ వచ్చింది సురేఖ.

“ఈ లెక్క అర్థం కావడం లేదు” అని తెరిచి ఉంచిన పుస్తకం ఇవ్వబోయింది.

ఆ లెక్కేంటో కూడా చూడకుండా “స్టడీ అవర్ లో చెప్తాలే. అది వదిలేసి వచ్చినవి ప్రాక్టీస్ చేసుకో పో” అన్నాను విసుగ్గా.

“సరే సార్” అంటూ వెళ్ళిపోయింది కాని ఆ అమ్మాయి ముఖంలో అసంతృప్తిని చూశాను. కొండప్ప గుర్తొచ్చాడు ఆ క్షణంలో. సురేఖని వెనక్కి పిలుద్దామనిపించింది. మళ్ళీ వెంటనే ‘ఆఁ సాయంత్రం చెబ్దాం లే’ అనుకొని టేబుల్ పైన తలపెట్టుకొని పడుకున్నాను.

సాయంత్రం మూడయినట్లుంది. సూర్యుడు తన ప్రతాపాన్ని తగ్గించాడు. ఎండ దెబ్బకి చెట్లల్లో చేరిన కాకులు బయటకొచ్చి కావ్! కావ్! అంటూ అరుస్తున్నాయి.

“సేయ్! సేయ్! ఇష్షూ ఇష్షూ సేయ్” అంటూ పెద్దగా అరుస్తున్నాడు కొండప్ప.

ఏమయిందోనని ఉలిక్కిపడ్డట్లుగా తల ఎత్తి కిటికీలోంచి చూశాను. ఉదయం కుట్టమని ఇచ్చిన అతని బూటుని నల్ల కుక్కొకటి తీసుకొని పరిగెత్తుతుంది. బండిని కడుగుతున్నట్లుంది కొండప్ప… చేతిలో మగ్ ని పట్టుకొని దాని వెనక అరుస్తూ పరిగెత్తుతున్నాడు.

ఆ అరుపులు విని కిటికీ దగ్గరగా వచ్చిన సైన్స్ టీచర్ శ్యామల “అయ్యో! బూట్ ఎత్తుకుపోతుందండీ కుక్క!” అంది.

“ఔను” అని నవ్వేసి మళ్ళీ తల వాల్చుకున్నా.

కాసేపటికే గణగణమని లాంగ్ బెల్ మోగింది. పదవ తరగతి పిల్లలు తప్ప మిగతా పిల్లలు, టీచర్స్ అందరూ ఇళ్ళకి వెళ్ళారు. పిల్లలు వరండాలో ఒకరి వెనక ఒకరు కూర్చుని లెక్కలు చేసుకుంటున్నారు.

నేను పిల్లలకెదురుగ్గా వరండా చివర కుర్చీ వేసుకొని కూర్చుంటూ “సురేఖా! పుస్తకం తీసుకురా ఆ లెక్కేంటో చూద్దాం” అన్నాను.

ఆ అమ్మాయితో పాటు నలుగురైదుగురు లేచి నా దగ్గరకి వచ్చారు. వాళ్ళకి లెక్క అర్థం అయ్యేట్లు చెప్తుండగా “సార్” అని వినిపించింది.

తల తిప్పి చూశాను

నాకు వెనగ్గా కొండప్ప నిలబడి ఉన్నాడు. నాతో ఏదో మాట్లాడాలన్నట్లుగా నిలబడి ఉన్న అతన్ని చూస్తూ “వస్తున్నా ఉండు కొండప్పా!” అన్నాను.

లెక్క అర్థం అయ్యేట్లు చెప్పి లేచి అవతలకి వెళ్ళాను. కొండప్ప నా వెనకే నడిచాడు. మా మాటలు పిల్లలకి వినపడవనుకున్నంత దూరం వెళ్ళి ఆగాక “సార్ ఇయ్యాల పొద్దున ఒకాయన బూటు రిపేరు సెయ్యమని ఇచ్చాడు….”

“ఆఁ చూశాను కొండప్పా దాన్ని కుక్క ఎత్తుకుపోయిందిగా దొరికిందా” అన్నాను.

“దొరికింది సారూ! అది దాన్ని తీసుకోని వంతెన కిందికి దూరింది. నేను ముక్కతా మూలగతా ఎళ్ళేలకి బూటు సోలంతా కొరికేసింది” అన్నాడు కొండప్ప దిగాలుగా.

“అయ్యో! ఇప్పుడెలా? ఆయనకేం సమాధానం చెప్తావ్?” అన్నాను.

“తోలు కొనుక్కోనొచ్చి ఇంకొకటి అట్లాగే తయారు సెయ్యాల బాబూ…. సేస్తాను. ఓ రెండొందలు అప్పుగా ఇచ్చారంటే …… ఆ బూట్లు రిపేరు సేస్తే ఆయన 50 రూపాయలు ఇస్తాడు. అయ్యి మీకే ఇస్తా. మిగతా డబ్బు రెండు వారాల్లో ఇచ్చేస్తా సారూ” అన్నాడు బతిమాలుకుంటున్నట్లు.

“డబ్బులు గురించి కాదు కొండప్పా! అచ్చంగా అలాగే ఎలా చేస్తావ్? చాలా కష్టం” అన్నాను ఆత్రంగా.

“లేదు బాబూ సేస్తాను. లేకపోతే ఆ బూట్ల కరీదు నేనేడ తెచ్చేది? కష్టపడతా బాబూ – మీరు రెండొందలు ఇస్తే చాలు” అన్నాడు కొండప్ప. అతని కళ్ళల్లో పల్చగా కన్నీరు.

జేబులోంచి రెండొందలు తీసి ఇచ్చాను. దణ్ణం పెట్టి వెళ్ళిపోయాడు.

***

తర్వాత రోజు నా లెక్కల పరీక్ష కావడం వల్ల చాలా పెందరాడే స్కూలుకి వచ్చాను. అప్పటికే కొండప్ప చెట్టు కింద కూర్చుని ఏకాగ్రతగా పని చేసుకుంటున్నాడు. కొత్త లెదర్ తెచ్చినట్లున్నాడు అనుకుంటూ స్కూల్లోకి నడిచాను. గోల చేస్తూ అరుస్తున్న పిల్లలని గదమాయించి పదవ తరగతి పిల్లల దగ్గరకి వెళ్ళాను. నన్ను చూడగానే పిల్లలంతా వాళ్ళకున్న డౌట్స్ ఏకరువు పెట్టారు. అప్పుడనగా క్లాస్ రూములోకి పోయిన వాడిని పరీక్ష అయిందాకా అక్కడే ఉన్నాను. పెందరాడే స్కూలుకి రావడం వల్ల మా ఆవిడ ఈ రోజు క్యారియర్ కట్టివ్వలేదు.

ఆన్సర్ షీట్లన్నీ తీసుకొని కట్టగట్టి స్టాఫ్ రూమ్ లో పెట్టి క్యాంటిన్ కి వెళ్ళి భోంచేసి వచ్చేప్పటికి దాదాపు 3 అవుతోంది. నా టేబుల్ దగ్గరకొచ్చి ఉసూరుమంటూ తల వాల్చుకుని పడుకున్నాను. పిల్లలు పరీక్ష బాగానే రాసినట్లనిపించి తృప్తి కలిగింది. నిన్న సురేఖ అడిగిన లెక్క వచ్చింది పరీక్షలో అనుకోగానే కొండప్ప గుర్తొచ్చాడు. అదాటున తల ఎత్తి కొండప్ప వైపు చూశాను. ఉదయం ఎలా కూర్చుని ఉన్నాడో అలాగే – అదే భంగిమలో కూర్చుని పని చేసుకుంటున్నాడు. సోల్ తయారయినట్లుంది. బాగున్న బూటుతో సరి చూసుకుంటున్నాడు.

“చేయగలిగాడు!! సాధించాడు!!!” లేచి పరిగెత్తినట్లుగా బయటకి నడిచాను. కిటికీలోంచి అయితే అతను నాకు దగ్గరగా కనిపిస్తాడు కాని అతనిని చేరుకోవడానికి స్కూలు చుట్టి తిరిగి వెళ్ళాలి. రెండు నిమిషాల్లో అతన్ని చేరి “కొండప్పా!” అని పిలిచాను.

ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్లుగా తల ఎత్తి చూశాడు. కళ్ళు లోతుకి పీక్కు పోయి ఉన్నాయి. అన్నం తినకుండా పని చేస్తున్నట్లు అర్థం అయింది.

“చేసేశావుగా కొండప్పా!” అన్నాను ఆనందంగా.

“సే … శా…. బాబూ!” మాట తడబడింది. నేను వెనక్కి తిరిగి పరిగెత్తినట్లుగా క్యాంటిన్ కి వెళ్ళాను. అప్పటికే వాళ్ళు మిగిలిన పదార్థాలన్నీ చిన్న చిన్న గిన్నెలకి వేసి అంట్లు తోముకుంటున్నారు.

“అన్నం ఉందా?” అన్నాను ఆత్రంగా.

“ఆఁ ఉంది. కూరలు అయిపోయాయి. సాంబారు, రసం మాత్రం ఉన్నాయి – ఎవరికి సార్?” అన్నాడు క్యాంటిన్ మేనేజర్.

“సరే కట్టివ్వు. ఆమ్లెట్ కూడా వేసివ్వు” అన్నాను అక్కడ పెట్టిన కోడిగుడ్లని చూడగానే ఐడియా వచ్చి.

నా హడావుడి చూసి ఎవరో గెస్ట్ వచ్చారనుకొని గబగబా ఆమ్లెట్ వేసి సాంబారు కూడా వేడి చేసి పార్సిల్ కట్టిచ్చారు. పార్సిల్ తీసుకొని కొండప్ప దగ్గరకి వచ్చాను.

“కొండప్పా! ఇదిగో అన్నం తిను. తర్వాత కుట్టుకోవచ్చులే శోష వచ్చి పడిపోతావు” అని చేతిలో ఉన్న సోల్ ని లాక్కుని పార్సిల్ కొండప్ప చేతికిచ్చాను.

“ఇది సేసేసి ఎల్లి తినేవోడినిగా బాబూ – ఈ పేదోడి మీద ఎంత దయ బాబూ నీకు – అన్నం తెచ్చి ఇచ్చావు” అన్నాడు.

అతని కళ్ళల్లో నీళ్ళు గమనించనట్లుగా “సరేలే తిను పో చేతులు కడుక్కొచ్చుకో” అన్నాను సోల్ ని పరీక్షగా చూస్తూ. అచ్చం కంపెనీ వాళ్ళు తయారు చేసినట్లుగానే చేశాడు. బాగున్న బూటు సోల్ నీ , ఈ సోల్ నీ తిప్పి తిప్పి చూశాను.

చూస్తుండగా… ఒక్క సారిగా నాకు తేడా ఏంటో తెలిసింది. సోల్ మధ్య భాగం లో బూటు సైజు ‘8’ అని వేసి ఉంది. కొండప్ప తయారు చేసిన దానికి ఉండదుగా!!? చెబ్దామని కొండప్ప వైపు చూశాను. తల వంచుకొని ఆకలిగా, తృప్తిగా పెద్ద పెద్ద ముద్దలు నోట్లో వేసుకుంటున్న కొండప్పని చూడగానే నా నోటి వెంట మాట పెగలలేదు. ఇప్పుడు చెప్తే తినే తినే అన్నాన్ని అలాగే వదిలేసి దిగులు పడతా కూర్చుంటాడేమోనని భయం వేసింది. చేతిలో ఉన్న సోల్ నీ, బూటునీ టార్పాలిన్ పట్ట పైన పడేసి స్టాఫ్ రూములోకి వచ్చాను.

టేబుల్ ముందు కూర్చుని కొండప్ప వైపే చూడసాగాను ఆలోచిస్తూ – సమస్యకి పరిష్కారం ఏమిటా అని ఆందోళన పడుతూ. నెంబరు రావాలంటే డై ఉండాలనుకుంటా. కత్తితో గీసినట్లుగా రాస్తే!? ఉహు! తెలిసిపోతుంది. ఎలా?… కొండప్ప వైపే చూస్తూ ఆలోచిస్తున్నాను.

అన్నం తినేసి సోల్ కి గమ్ ని పట్టించి బూటుకి అంటించాడు. తదేక ధ్యానం తో నిదానంగా, ఎక్కడా కుట్టు తప్పిపోకుండా జాగ్రత్తగా కుడుతున్నాడు.

సాయంత్రం నాలుగయింది. పిల్లలందరూ కొండప్ప పక్క నుంచి రోడ్డు మీదకి నడుచుకుంటూ వెళుతున్నారు. ఎప్పడూ వాళ్ళనీ, వాళ్ళ కాళ్ళనీ చూస్తూ నవ్వుకునే కొండప్ప ఈ రోజు తల కూడా తిప్పకుండా సోల్ ని కుట్టుకుంటున్నాడు. నేను ఇంటికి వెళ్ళడం కూడా మర్చిపోయి అలాగే చూస్తూ కూర్చుండిపోయాను.

కుట్టడం పూర్తయింది. రెండు బూట్లనీ తిరగేసి చూసుకుంటున్నాడు. బాగు చేసిన బూటుకి పాలిష్ పట్టిస్తున్నాడు. అప్పుడు లేచాను నెమ్మదిగా. కొండప్ప దగ్గరకి వెళ్ళి నేను గమనించిన విషయాన్ని చెప్పాను. తృప్తితో వెలుగుతున్న అతని ముఖం నేను చెప్పింది వినగానే గప్పున ఆరిపోయింది.

“ఔను సారూ! ఇప్పుడేం జేసేది?” ఆందోళనగా అంటూ నా వైపు చూశాడు. నువ్వు చదువుకున్నోడివి, తెలివైనోడివి ఏదైనా ఉపాయం చెప్పగలవు అన్నట్లున్న అతని చూపులకి నాకు నా మీద విశ్వాసం కుదిరింది.

“అతడు గమనించడనే అనుకుంటున్నా కొండప్పా! ఒకవేళ చూసి అడిగాడనుకో – ‘నాకేం తెలుసు?’ అనేసెయ్” అన్నాను.

“అంతేనంటావా సారూ!” అన్నాడు ఆలోచించుకుంటున్నట్లుగా.

“అంతే! అంతే! నేనిక్కడే ఉంటానుగా! ఇంకా ఏమైనా అతను ఎక్కువగా మాట్లాడితే నేను వచ్చి చెప్తాలే. కొన్ని కంపెనీల వాళ్ళు ఒక బూటుకే నంబరు వేస్తారనో లేకపోతే ఇంకొకటేదో పరిస్థితిని బట్టి..” అన్నాను.

ఒక ఉపాధ్యాయుడిగా నేను నిజమే చెప్పాలి కాని నాకెందుకో ‘అబద్ధం చెప్పమని’ నేర్పిస్తుంటే ‘నిజమే పలకాలి’ అని చెప్తున్నప్పుడు కలిగే గర్వమే కలిగింది. అది ‘తప్పు’ అనిపించలేదు. కొండప్ప కుట్టిన చెప్పులు ఎక్కువ కాలం మన్నుతాయి అనే నమ్మకం నాలో ఉంది కాబట్టి తప్పు అనిపించలేదేమో బహుశా!

“సరేలే బాబూ! ఇంకేం జేసేది? ఆ దేవుడే కాపాడతాడు. లేకపోతే ఆ బూట్ల కరీదు నేనేడ బరించగలను బాబూ?” అన్నాడు. ఆ మాటలంటున్నప్పుడు అతని గొంతులో దిగులుతో కూడిన వణుకు తెలుస్తోంది.

“దిగులు పడకు కొండప్పా! ధైర్యంగా నేను చెప్పినట్లే చెయ్యి. అతనొచ్చేది రేపు పొద్దున్నేగా?” అన్నాను.

“ఔను బాబూ” అన్నాడు.

“వస్తా కొండప్పా” అంటూ బండి తీసుకొని ఇంటికి వచ్చాను.

ఆ రాత్రంతా టెన్షన్ తో నిద్ర రాలేదు. ‘అతను కనిపెట్టకుండా ఉంటే బాగుండు’ అని అనుకుంటూనే ఉన్నాను. ఒకవేళ కనిపెడితే కొండప్పకి ఎలా సపోర్టుగా మాట్లాడాలో ఒకటికి పదిసార్లు మననం చేసుకున్నాను. ‘నాకే ఇలా ఉంటే కొండప్పకి ఎలా ఉందో పాపం’ అనుకున్నాను.

***

ఎవరికెన్ని సమస్యలున్నా నా పని నేను చేసుకుపోతూనే ఉండాలి కదా అనుకుంటూ సూర్యుడు సమయం తప్పకుండా ఉదయించాడు. నిద్ర లేచీ లేవడంతోనే నా మనస్సు స్కూలుకి వెళ్ళిపోయింది. చాలా త్వరగా బయలుదేరాను కాని క్యారియర్ రెడీ అయేటప్పటికి మామూలు టైమే అయింది. బండి పార్క్ చేసి నేరుగా కొండప్ప దగ్గరకి వెళ్ళాను.

“అతనొచ్చాడా కొండప్పా?” అడిగాను ఆత్రంగా.

“ఇంకా రాలేదు బాబూ!” అన్నాడు కొండప్ప. అతని కళ్ళల్లో నీరసం, ఒక్కరోజులోనే ఎంతో ముసలి వాడయిపోయినట్లుగా ముఖంలో మడతలు ఉబ్బి కనబడుతున్నాయి. నేను హతాశుడినయ్యాను. ‘అయ్యో! ఇదేమిటితను? ఇదేమంత పెద్ద సమస్య అని ఇంత బాధ పడుతున్నాడు?’ అనిపించింది.

‘పేదవారికి ఇది పెద్ద సమస్య – చాలా పెద్ద సమస్య’ అని వెంటనే నాకు తట్టింది. నిన్న నేనతనికి ధైర్యం చెప్పకుండా రాత్రంతా ఎంత టెన్షన్ పెట్టానో అర్థం అయింది.

అతనికి సహాయం చేయగలిగి ఉండీ అతన్ని అబద్దాలు చెప్పమని ప్రోత్సహించడం తల్చుకుంటే నా మీద నాకు జాలి, బాధ కలిగాయి. నాకు రాత్రంతా నిద్ర పట్టకుండా బాధ పడటానికి కూడా అదే కారణం. నేనేం చేయాలో నాకు తెలిసింది.

“కొండప్పా! ఏమిటిది? ఎందుకింత బాధ పడుతున్నావు? అతనికి నచ్చి అతను తీసుకున్నాడా సరే. లేకపోతే అతని బూట్ల ఖరీదు నేనిస్తాను. ఈ బూట్లు నేను కొనుక్కుంటాను. నా నంబరు కూడా ఎనిమిదే” అన్నాను.

ఒక్క ఊపున లేచి నిలబడ్డ కొండప్ప నా రెండు చేతులని తన చేతుల్లోకి తీసుకొని కళ్ళకద్దుకున్నాడు. అతని కళ్ళల్లోని బాధ తీసేసినట్లుగా పోయి అలసట మిగిలింది. నేను తీసుకున్న నిర్ణయానికేమో నా మనసు కూడా సంతోషంతో ఊగిపోయింది.

‘కొండప్పా టీ తీసుకొస్తావా?” అన్నాను.

“అలాగే బాబూ” అంటూ కొండప్ప హుషారుగా రోడ్డు మీదకు పోయి టీ తెచ్చి పెట్టాడు. అక్కడే నిలబడి టీ తాగేసి “నువ్వూ తెచ్చుకుని తాగు. అలసట పోతుంది. రెండు బిస్కెట్లు కూడా తిను” అంటూ డబ్బులిచ్చి స్కూల్లోకి నడిచాను.

టైమ్ పదకొండు అవుతోంది. ఈ రోజు పిల్లలకి సైన్స్ పరీక్ష. శ్యామలా మేడమ్ పరీక్ష హాలుకీ, స్టాఫ్ రూముకీ అప్పటికే రెండు సార్లు తిరిగి రెండు టీలు తాగింది. ఆమెకి పరీక్షల టెన్షన్. ఆమె క్వచ్చిన్ పేపర్ గురించి ఏదేదో చెప్తోంది కాని ఆ మాటలు నా చెవుల్లోకి వెళ్ళడం లేదు. నా కళ్ళు కిటికీలోంచి కొండప్పనే చూస్తున్నాయి. కొండప్ప కూడా ఎప్పుడూ లేనిది అసహనంగా అటూ ఇటూ కదులుతున్నాడు.

దాదాపు పనె్నండు అవుతుండగా రోడ్డు మీద అతను మలుపు తిరిగి కొండప్ప దగ్గరకి వచ్చాడు. నేను గబుక్కున లేచి కిటికీకి దగ్గరగా వెళ్ళి నిలబడి చూడసాగాను.

“బూట్లు రిపేరు చేశావా తాతా?” అన్నాడతను.

కొండప్ప ఏమీ మాట్లాడలేదు. కుట్టిన బూటుని అతని చేతికిచ్చాడు. అతను సంతృప్తిగా తలాడిస్తూ రెండో బూటుని చేతిలోకి తీసుకున్నాడు.

“ఏమిటిది తాతా?” అన్నాడు గదిమినట్లుగా.

‘అయ్యో! కనిపెట్టేశాడు – కనిపెట్టేశాడు’ నా రక్తం వేగంగా నా శరీరంలో పరిగెత్తుతున్న ధ్వని నాకు స్పష్టంగా తెలుస్తోంది.

కొండప్ప నోరు తెరిచి ఏదో చెప్పబోయేంతలో —

“కుట్టిన బూటుకి పాలిష్ చేశావు. దీనికి కూడా పాలిష్ చేయక్కర్లా?” అన్నాడతను.

తెరిచిన నోరు అలాగే మూత పడిపోయింది కొండప్పకి.

నా పెదవులపై చిరునవ్వు తెరలు తెరలుగా.

బూట్ కి పాలిష్ చేస్తూ కొండప్ప తల తిప్పి నా వైపు చూశాడు. తన పని తనని ఎప్పటికీ ఓటమి పాలు చేయదన్న గొప్ప భావం అతని ముఖంలో కదలాడటం నేను గమనించాను.

*

Download PDF ePub MOBI

Posted in Uncategorized and tagged , , , , .

23 Comments

  1. మీ కినిదె పత్రిక లో కధ చెప్పుల తాత చాల బాగుంది. ఓర్పు సహాననానికి మారు పేరు ఈ క్ధ మీకు మా ధన్యవాదాలు. మీ పత్రిక కు కధ పంపాలంటే ఏం చేయాలి తెలుపగలరు
    మీ దూపాటి శేషు కుమారాచార్యులు
    రేడియో .టివి రచయత

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.