cover

స్త్రీ లోకపు వెలుగునీడలు చుగ్తాయ్ కథలు

Download PDF ePub MOBI

ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం నిరూపిస్తుంది. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారిని అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా ఉన్నట్టు అనిపించదు. ఆడపిల్లలపై ఆంక్షలు, సాంప్రదాయికమైన కట్టుబాట్లూ వీటన్నింటికీ చుగ్తాయ్ బద్ధవ్యతిరేకి అని ఆమె కథలు చెప్తాయి.

సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో అన్నల తర్వాత ఆడపిల్లగా పుట్టి, అన్నలానే ఆటపాటలలోనూ, చదువులోనూ పోటీ పడుతూ పెరిగింది చుగ్తాయ్. బాల్యంలో లేని ఆంక్షలు ఎదుగుతున్న కొద్దీ ఎదురవటంతో ఆమె ఎదురుతిరిగింది. ఆడపిల్లకు ఉత్తరం రాసే చదువు చాలునంటూ, ఇక చదవటం ఆపి వంటా కుట్లూఅల్లికలూ నేర్చుకోమంటే, కిస్టియన్ మతంలో కలిసిపోయి కాన్వెంట్లో చదువుకుంటాను గానీ ఇంట్లో కూర్చోనంటూ మొండికేసి ధైర్యంగా తన నిర్ణయాన్ని తెలిపింది. ఆడవారి జీవితాల గురించి చిన్నతనం నుండే నిశితమైన పరిశీలన కనిపిస్తుంది ఆమెలో. ఎదుటివారిని కూర్చోబెట్టి మాటలాడి వారి రహస్యాలు చాకచక్యంగా తెలుసుకోగల నేర్పరి. తన తోటి స్త్రీ జీవితాలనూ ఆమె అంత చాకచక్యంగానే తెలుసుకొని తన కథల్లో ఇమిడ్చింది. కొన్ని కథల ఇతివృత్తాలు ఇలా సాగుతాయి:

లిహాఫ్:— భర్తతో వివాహబంధం సరిగాలేని స్త్రీ, అతని ప్రేమను, అనురాగాన్నీ పొందలేని స్త్రీ లైంగికంగా దిగజారిపోయిన కథ ఇది. దీన్ని తన చిన్ననాటి జ్ఞాపకంగా చెప్పుకొచ్చింది చుగ్తాయ్. ఇలాంటి కథలను రాసి, సమాజంలోనికి తీసుకురావడానికి ఎంతటి గుండె ధైర్యం, సాహసం కావాలి. ఈ కథతో ఏంతటి దుమారం లేచినా చలించలేదు ఆమె. దాన్నంతట్నీ ధైర్యంగా ఎదుర్కొన్నది.

మేలిముసుగు:— ఈ కథ చెపుతున్న గోరీబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై ఏళ్ళ కన్య. కోటి ఆశలతో కొత్తగా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన గోరీబీ, భర్తకు ఎదురైన ఓ చిన్న ఆత్మనూన్యతా భావం, అర్థం చేసుకోకలేనితనం వల్ల ఓ నిండుజీవితం శిక్ష అనుభవిస్తుంది.

శిల:— భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్ వదిన కథ ఇది. బంధాలకు విలువ ఇచ్చింది కానీ, కరిగిపోతున్న అందాల గురించి పట్టించుకోలేదామె.

ఒక ముద్ద:— నర్సు సరళాబెన్‌కు పెళ్ళి చేసుకోవాలని మనసులో ఎంత ఉన్నా సరైన వయసులో ఆ ముచ్చట జరగలేదు. అందరికీ తలలో నాలుకలా ఉన్న ఆమె ఓ ఇంటిది ఐతే బాగుంటుంది అనుకున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు. బస్సులో ఒక వ్యక్తి సరళాబెన్‌కు రోజూ లేచి సీటు ఇవ్వటం చూస్తాడు ఆమె పొరుగింటతను. అంతా సరళాబెన్‌కు ఆ వ్యక్తికీ ముడిపెడదామని ప్రయత్నిస్తారు. ఆమెని అలంకరించి పంపిస్తారు. కానీ విధి ఆమెను వెక్కిరిస్తుంది.

బిచ్చు అత్తయ్య:— అన్నగారి మీద ప్రేమను తిట్లతోనే చూపిస్తుంది బిచ్చు అత్తయ్య. మాట కరుకేగానీ మనసు వెన్న. అన్నగారంటే పంచప్రాణాలు.

అమృతలత:— దేవుడిచ్చిన అందం ఆమెకు శాపమే అయింది. వయసులో తనకంటే పెద్దవాడైన భర్తను అమితంగా ప్రేమించింది. తరుగుతున్న వయసు అతనిలో అసూయను నాటింది.

ఇలా సాగుతాయి చుగ్తాయ్ కథలు. తన చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలను చుగ్తాయ్ జీవితాంతం గుర్తుంచుకున్నది. “ఇది పురుషుల కోసం పురుషులు తయారు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని చిత్తవృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది.” ఈ మాటల్లోని సారం ఆమె ప్రపంచాన్ని చూసే విధాన్ని చాలా ప్రభావితం చేసిందని అనిపిస్తుంది. ఆమె కథలన్నీ ఈ సారాన్నే పదునుగా వ్యక్తం చేస్తాయి. ఒకరకంగా ఇస్మత్ మన చలానికి ఆడవెర్షను అనిపిస్తుంది.

– శ్రీశాంతి దుగ్గిరాల

ఇస్మత్ చుగ్తాయ్ కథలు

అనువాదం: పి. సత్యవతిbookcover

ధర: రూ. 100/-

తొలి ముద్రణ: జూన్ 2012

ప్రతులకు:

హైదరాబాద్ బుక్ ట్రస్ట్,

ప్లాట్ నెం. 85, బాలాజీ నగర్,

గుడి మల్కాపూర్, హైదరాబాద్

ఫోన్: 23521849

పుస్తకం కినిగెలో కూడా లభ్యం

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పుస్తక సమీక్ష and tagged , , , , , , , .

3 Comments

 1. ఆధునిక ఉర్దూ కధా సాహిత్య దిశానిర్దేశకుడు మున్షీ ప్రేంచంద్ తర్వాత ప్రముఖ స్థానం అలంకరించిన
  ఇస్మత్‌ చుగ్తాయ్‌ ఉర్దు కవి, కధ, నవల, నాటకకర్త, సినిమా రచయిత. జిద్దీ (1948), ఆర్జూ (1950), గరం హవా (1973) హిందీ సినిమాలకు కథలు, జునూన్ (1978) సినిమాకు స్క్రిప్టు అందించారు. ఇస్మత్‌ ఆపా (Elder Sister) గురించి ప్రముఖులు రాసిన కొన్ని పరిచయ వాక్యాలు

  http://magazine.saarangabooks.com/2013/08/28/

  “1915లో జన్మించిన ఇస్మత్‌ చుగ్తాయ్‌ ప్రముఖ ఉర్దూ రచయిత్రి. జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీత. ఇప్పటికీ సమాజం ఆమోదించని, చర్చిండానికి యిష్టపడని ఎన్నో విషయాలను నలభై, యాభై సంవత్సరాల క్రితమే తన రచనల ద్వారా ప్రకటించి, చర్చనీయాంశం చేసి సంచలనం సృష్టించిన రచయిత్రి. మధ్య తరగతి ముస్లిం జీవితాలలోని సామాజిక, నైతిక, ఆర్ధిక, చీకటి కోణాలను వెలికి తీస్తూ ఆమె శర పరంపరగా కథలు రాసింది. లైంగిక విషయాలను కూడా ఎక్కడా అసభ్యతకు తావు ఇవ్వకుండా చర్చకు పెట్టింది. ఇస్మత్‌ మీద పెట్టిన కేసులు ఎన్నో… ఒక్కటీ నిలవలేదు “ – వంశీకృష్ణ

  http://hyderabadbooktrust.blogspot.in/2012/07/blog-post_06.html

  “ ఆధునిక ఉర్దూ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలిచే విలక్షణ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌. స్వతంత్ర ఆలోచనా ధోరణితో ఛాందసాన్ని దునుమాడుతూ, సాహసం, ధిక్కారం అనే రెండు అస్త్రాలతో సాహిత్యంలోనూ, సమాజంలోనూ కూడా విప్లవాలు తెచ్చిన శక్తి, అభివ్యక్తి ఆమెది. ప్రేమ్‌చంద్‌ ప్రారంభించిన అభ్యుదయ రచయితల సంఘంలో కొంతకాలం పనిచేసింది. స్త్రీల గొంతులు ఇంకా పెగిలిరాని కాలంలో, ఒక కవితో, కథో రాయాలన్న ప్రయత్నాన్ని సైతం ‘తిరుగుబోతుతనం’గా పరిగణిస్తున్న రోజుల్లో ఇస్మత్‌ చుగ్తాయ్‌ సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేసి నిర్భీతిగా నిలబడింది. స్త్రీల జీవితాల్లోని విషాదాన్ని చురుక్కుమనిపించేలా పాఠకుల ముందుంచే అసాధారణ ప్రజ్ఞ ఇస్మత్‌ సొంతం. స్త్రీల జీవితాలలో వివాహ వ్యవస్థా, సంప్రదాయాలూ, పిత్రుస్వామ్యమూ కలిసికట్టుగా సృష్టించిన విధ్వంసం కథలనిండా పరుచుకుని వుంది. శక్తిమంతమైన, బహుముఖమైన ఇస్మత్‌ రచనలు భారత, పాకిస్థాన్లలో అశేషమైన ఆదరణ పొందాయి..” – పి. సత్యవతి

  ” ఒకరకంగా ఇస్మత్ మన చలానికి ఆడవెర్షను అనిపిస్తుంది.” పి. సత్యవతి గారు అనువదించిన ఇస్మత్ చుగ్తాయ్ కథలు గురించి చక్కటి చిరు పరిచయం రాసిన శ్రీశాంతి గారికి అభినందనలు.

 2. లిహాఫ్ కధ తరువాత ఆమె ఎన్నో లీగల్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆమె తన సాహిత్యప్రక్రియ వలన సమాజంలో ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కలం పగ్గాలు గట్టిగా పట్టుకొన్నానని చెప్పారు. ఆమె ఆటో బయోగ్రఫీ ని ఆమే రాసిన ‘వక్రరేఖ ‘ నవలలో చదవొచ్చు.
  చుగ్తాయ్ ని ఎక్కువగా ప్రేమించే నాలాంటి వారికి ఈ రివ్యూ అసంపూర్తిగా అనిపిస్తుంది.

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.