cover

పదనిష్పాదన కళ (9)

Download PDF ePub MOBI

దీని ముందుభాగం

గ్రంథ విషయ పట్టిక

ఏడో అధ్యాయం

సంస్కృత ఉపసర్గల సహాయంతో కొత్త క్రియాధాతువుల నిష్పాదన పద్ధతి 

సంస్కృతం నుంచి కొత్త క్రియాధాతువుల్ని కల్పించాలంటే ఉపసర్గల (prefixes) గుఱించి తెలియాలి. ఈ పుస్తకం చివఱ కొన్ని సంస్కృత ధాతువులు ఇవ్వబడ్డాయి. సంస్కృత ధాతువుల గుఱించి పూర్తిపాఠం కావా ల్సినవారు శ్రీమాన్ భట్టోజి దీక్షితులవారు రచించిన సిద్ధాంతకౌముది అనే గ్రంథాన్ని వెతికి పట్టుకోవలసి నది.

ఆ ధాతువుల ముందు ఉపసర్గల (prefixes) ని చేర్చడం ఎలాగో తెలిస్తే క్రియాధాతువుల కల్పనలో మనం సగం దూరాన్ని అధిగమించినట్లే. ఈ పని చెయ్యడానికి మీరొక గొప్ప వైయాకరణ శిరోమణి కావాల్సిన పని లేదు. ఇది చాలా సులభం. మన తెలుగువాళ్ళందఱికీ సుపరిచితం కూడా. తెలుగులోని పెక్కు క్రియాధాతువుల ముందు ఇప్పటికే వాడుతున్న ఉపసర్గల్ని వాటి అర్థాల్ని పరిశీలించండి. అవి ప్రాథమికంగా 21. అయితే కాలక్రమేణ తరువాత్తరువాత ఇంకొన్ని పదాలు కూడా ఉపసర్గల్లా (క్రియాధాతువులకి ముందొచ్చి) ప్రవర్తించసాగాయి.

శ్లో|| ధాత్వర్థం బాధతే కశ్చిత్ కశ్చిత్ తమనువర్తతే |

తమేవ విశినష్ట్యన్యః ఉపసర్గగతిస్త్రిధా ||

ఉపసర్గ అర్థరీత్యా మూడురకాలుగా ప్రవర్తిస్తుందని ఈ పైశ్లోకంలో చెప్పారు. అది కొన్నిచోట్ల ధాతువు యొక్క అసలర్థాన్ని బాధించి ఇంకో అర్థాన్ని ఇస్తుంది. కొన్నిచోట్ల అసలర్థాన్నే కొద్దో గొప్పో అనుసరిస్తుంది. మఱికొన్నిచోట్ల ఆ అర్థాన్ని మరింత ప్రకాశింపజేస్తుంది.

1. అప = తప్పుడుగా, చెడుగా, మినహాయింపుగా, వేఱే దారిలో

2. ఉప = అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గఱగా, తోడుగా

3. అభి = ఎదురుగా

4. అవ = తక్కువగా

5. అతి = దాటి, మించి, మీఱి

6. అను = వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా

7. ఆఙ్ = మొదటి నుంచి చివఱి దాకా

8. ని = లోపల

9. నిర్/నిస్ = బయటికి, లేకుండా

10. అధి = మీద, పక్కన

11. సు = మంచిగా, చక్కగా, నేరుగా

12. దుర్/దుస్ = చెడ్డగా

13. ప్ర = గొప్పగా, ఎక్కువగా

14. ప్రతి = ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి, ఒక్కొక్కటి

15. వి = వేఱుగా, లేకుండా, మఱో విధంగా, మఱో దిశలో, విశేషంగా , ప్రత్యేకంగా

16. సం = కలిసి, మొత్తంగా, ఉత్తమంగా

17. పరా = అవతల

18. పరి = చుట్టూ

19. పి/ అపి = రహస్యంగా, కప్పి ఉంచి

20. ఉత్/ ఉద్ = పైకి 21. అ/ అన్ – (వ్యతిరేకార్థకం)

ఇప్పటికే ఈ ఉపసర్గలు చేఱి ఉన్న పాతపదాలతో అర్థవిరోధం రాకుండా కొత్త పదాలు కల్పించాలి. రెండు మూడు ఉపసర్గల్ని ఒకేసారి ఒకే ధాతువుకి చేర్చడం కూడా వ్యాకరణ సమ్మతమే. వేదకాలంలో వీటిని వాక్యంలో ఎక్కడ పడితే అక్కడ చేర్చేవారు, నేటి ఇంగ్లీషులో లాగా ! (అహం ఆ…గచ్ఛామి – నేను వస్తున్నాను అనడానికి “ఆ… అహం గమిష్యామి అనేవారు). కావ్యయుగంలో ఇవి క్రియాధాతువుల ముందే స్థిరపడ్డాయి.

కాలక్రమంలో ఈ కింది పదాల్ని కూడా ఉపసర్గలలా వాడడం మొదలుపెట్టారు.

1. కు – కొంచెం, చిన్న, తక్కువ, నీచం, హీనం, చెడ్డగా

2. సకృత్ = అరుదుగా (అసలు అర్థం – ఒక్కసారి once, one time అని. వ్యతిరేకార్థకాలు అసకృత్, బహువార-)

3. ఆరాత్ = దగ్గఱగా

4. పశ్చాత్ = తరువాత, వెనుక

5. సహ = కలిసి, తోడుగా

6. పునస్/ పునర్ – మళ్ళీ

7. సాక్షాత్ = ఎట్టెదుట

8. సదా = ఎల్లప్పుడూ

9. శశ్వత్ = శాశ్వతంగా

10. పురః/ పురస్/ పురో = ముందు

11. తిరః/ తిరస్/ తిరో =వెనుక

12. ప్రాక్ = అంతకుముందు/ ఇంతకుముందు, తూర్పుదిక్కు

13. అర్వాక్ – ఇంతకు తరువాత 14. సమ్యక్ = సరిగా

15. ఉపరి = పైన

16. అధః/ అధస్తాత్/అధస్/ అధో/ న్యక్ = కింద

17. ద్రాక్ = త్వరగా

18. శనైర్/ శనైస్ = నెమ్మదిగా (slow)

19. ఉచ్చైర్/ ఉచ్చైస్ = బిగ్గరగా (loudly)

20. బహు/ నానా = ఎక్కువగా, ఎక్కువ

21. మనాక్/ కించిత్/ ఈషత్ = తక్కువగా, కొంచెం

22. సద్యస్/ సద్యో = వెనువెంటనే, అదే రోజున (instantly, spot, immediately శీఘ్రం)

23. తథ్యం = నిజంగా

24. మృషా = అబద్ధంగా

25. ధ్రువం/ నూనం/ అవశ్యం = తప్పకుండా (sure)

26. ప్రాయః/ ప్రాయస్/ ప్రాయో = తఱచుగా (oft, often)

27. బహిర్/ బహిస్ = బయట

28. అంతర్/ అంతస్ = లోపల

29. యుగపత్/ ఏకదా = రెండూ ఒకేసారిగా (simultaneous) 30. మిథః – ఇద్దఱు కలిసి 31. రహః/ రహస్/ రహో = రహస్యంగా, చాటుగా 32. ప్రసభమ్/ బలాత్ – బలవంతంగా

వీటిని కూడా మనం ఇంకా ఎక్కువ క్రియాధాతువుల ముందు అవసరాన్ని బట్టి చేర్చి సద్వినియోగం చేసుకోవాలి. ఇలా చూసినప్పుడు ఎన్ని క్రియాధాతువులున్నాయో అన్ని యాభైల సంఖ్యలో కొత్త ధాతువుల్ని మనం సిద్ధం చేయగలమన్నమాట. అలాగే అన్ని కొత్తనామవాచకాల్ని కూడా కల్పించగలం.

ఉపసర్గ ప్రయోగాలకి పూర్వోదాహరణలు (పూర్వీకులు ఎలా, ఏ అర్థంలో వాడారు ?)

1. అప = తప్పుడుగా, చెడుగా, మినహాయింపుగా, వేఱే దారిలో

అప + కారం = అపకారం = చెడు చేయడం

అప + ఊహ = అపోహ = తప్పుగా ఊహించు

అప + అర్థం = అపార్థం = తప్పుగా అనుకొను

అప + ప్రథ = అపప్రథ = చెడ్డపేరు

అప + వాదం = అపవాదం = (ఒకఱి గుఱించి) తప్పుగా చెప్పడం

అపవాదం + అపవాదం = మినహాయించి చెప్పడం

2. ఉప = అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గఱగా

ఉప + కారం = ఉపకారం = అనుకూలంగా చేయడం

ఉప + చారం = ఉపచారం = అనుకూలంగా చరించడం (ప్రవర్తించడం)

ఉప + నయనం = ఉపనయనం = (గురువుగారి) దగ్గఱికి తీసుకెళ్ళడం

ఉప + ఆసనం = ఉపాసన = (దేవుడి) దగ్గఱ కూర్చోవడం

3. అభి = ఎదురుగా, తనకిష్టమైనట్లు

అభి + శ్రవణం = అభిశ్రవణం = మంత్రపఠనం చేయించుకొని వినడం

అభి + మానం = అభిమానం = ఎదురుగా ఉన్నట్లు తలచుకోవడం (మననం – తలచుకోవడం)

అభి + సరణం = అభిసరణం = ప్రియునికి ఎదురుగా వెళ్ళడం

4. అవ = తక్కువగా, క్రిందుగా, లోతుగా

అవ + మానం = అవమానం = తక్కువగా తలపోయడం

అవ + లోకనం = అవలోకనం = వంగి చూడడం

అవ + ధరించు = అవధరించు = లోతుగా దృష్టిపెట్టు

అవ + గమించు = అవగమించు = అర్థం చేసుకొను (అవగతం = అర్థమైన విషయం)

5. అతి = దాటి, మించి, మీఱి

అతి + క్రమణం = అతిక్రమణం = దాటి అడుగుపెట్టడం

అతి + ఇతం = అతీతం = దాటి వెళ్ళినది

అతి + వేలం = అతివేలం = వేలను దాటి మీదికొచ్చిన కెఱటం (వేల – చెలియలికట్ట)

6. అను = వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా

అను + కరించు = అనుకరించు = (ఒకఱు చేసిన) తరువాత చేయు

అను + సరించు = అనుసరించు = వెంటవెళ్ళు (అనుయాయి = వెంట వెళ్ళేవాడు ; అనుచరుడు = వెంట వెళ్ళేవాడు)

అను + సంధించు = అనుసంధించు = ఒకదాని కొసని ఇంకొకదానికి తగిలించు

అను + వదించు = అనువదించు = ఒకఱు చెప్పినదాన్నే తరువాత మళ్ళీ చెప్పు

(పూర్వకాలంలో రచనల్ని వ్రాసేవారు కాదు, చెప్పేవారు)

7. ఆఙ్ = (మొదటి) నుంచి, (చివఱి) దాకా, మొత్తం, సంపూర్ణంగా

ఆ + పాద మస్తకం = ఆపాదమస్తకం = కాళ్ళ నుంచి తల దాకా

ఆ + నయనం = ఆనయనం = ఒకచోటి నుంచి తీసుకురావడం

ఆ + లోకనం = ఆలోకన = మొదటినుంచి చివఱిదాకా చూడడం

ఆ + వాహనం = ఆవాహన = మొత్తం లోపలికి ప్రవహింపజేయడం (ప్రవేశపెట్టడం)

8. ని = లోపల (అంతర్ అని కూడా వాడతారు)

ని + ద్రా = నిద్ర = తన లోపలికి తానే పరుగెత్తడం

ని + వేశనం = నివేశనం = లోపలికి ప్రవేశించడం (ఇల్లు)

ని + ధానం = నిధానం (లేక నిధి) = లోపల (దాచి) పెట్టినటువంటిది

ని + నాదం + నినాదం = (తన) లోపలి ధ్వని

ని + మజ్జనం = నిమజ్జనం = (నీటి) లోపల ముంచడం

ని + గ్రహం = నిగ్రహం = లోపల (తనను తాను) పట్టుకొని ఉండడం

9. నిర్/నిస్ = లేకుండా , బయటికి (బహిర్ అని కూడా వాడతారు)

నిర్ + లజ్జ = నిర్లజ్జ = సిగ్గులేకుండా

నిర్ + జనం = నిర్జనం = జనం లేనిది

నిర్ + వచించు = నిర్వచించు = పైకి చెప్పు

నిస్ + సంకోచం = నిస్సంకోచం = సంకోచం లేనిది (ఇలాగే నిస్తంద్రం, నిష్ఫలం, నిర్భయం, నిర్మలం, నిర్దయం, నిష్కారణం మొ.)

నిశ్ + శబ్దం = నిశ్శబ్దం = శబ్దం లేనిది

నిర్ + గతం = నిర్గతం = బయటికి పోయినది

నిష్ + కాసనం = నిష్కాసనం = బయటికి వెళ్ళగొట్టడం

నిష్ + క్రమించు = నిష్క్రమించు = బయటికి అడుగుపెట్టు

10. అధి = మీద, పక్కన (ఉపరి అని కూడా వాడతారు)

అధి + స్థానం = అధిష్ఠానం = ఒకఱి మీద నిలిచినది అధి + కారం = అధికారం = ఒకఱి మీద చెలాయించేది

అధి + ఆయం = అధ్యాయం = ఒక విషయం మీదికి పోయి తెలుసుకునేది అధి + పతి = అధిపతి = ఇతరుల మీద నాయకుడు

11. సు = మంచిగా, చక్కగా, నేరుగా, తేలికగా (దీన్ని నామవాచకాలకీ, విశేషణాలకీ తప్ప క్రియాధాతువులకి ముందు వాడరు. దీనికి ప్రత్యామ్నాయంగా సత్ అని వాడడం కూడా ఉన్నది)

సు + ప్రతిష్ఠితం = సుప్రతిష్ఠితం = బాగా నిలుపబడినది

సు + కరం = సుకరం = తేలికగా చేయదగినది

సు + లభం = సులభం = తేలికగా లభించేది

సు + గమం = సుగమం = తేలికగా వెళ్ళదగిన ప్రదేశం

సు + బోధం = సుబోధం = తేలికగా అర్థమయ్యేది

సు + నామన్ + ఈ = సునామ్ని = మంచి శ్రావ్యమైన పేరు గల స్త్రీ

సు + ముఖం = సుముఖం = మంచిముఖం (అంగీకార సూచకమైన నవ్వుముఖం)

12. దుర్/ దుశ్/ దుష్ /దుస్ = చెడ్డ, కష్టం, అసంభవం (దీన్ని కూడా నామవాచకాలకీ, విశేషణాలకీ తప్ప క్రియాధాతువులకి ముందు వాడరు. దీని బదులు కొన్ని సందర్భాలలో కు అనే ఉపసర్గని వాడడం కూడా ఉంది. ఉదాహరణకి కువ్యాఖ్యానం, కుశంక మొ.)

దుర్ + ముహూర్తం = దుర్ముహూర్తం = చెడ్డ సమయం

దుశ్ + శీలం = దుశ్శీలం = చెడ్డ ప్రవర్తన

దుష్ + కార్యం = దుష్కార్యం = చెడ్డపని

దుష్ + ఫలితం = దుష్ఫలితం = చెడ్డఫలితం

దుస్ + సాహసం = దుస్సాహసం = అసంభవమైన సాహసం

దుర్ + గమం = దుర్గమం = వెళ్ళడానికి కష్టమైన ప్రదేశం

దుస్ + తరం = దుస్తరం = దాటడానికి కష్టమైనది

దుస్ + సాధం = దుస్సాధం = సాధించడానికి అసంభవమైనది

13. ప్ర = గొప్పగా, ఎక్కువగా, ప్రత్యేకంగా, ప్రధానంగా

ప్ర + మాణం = ప్రమాణం = ప్రత్యేకమైన కొలత

ప్ర + వర్ధనం = ప్రవర్ధనం = ఎక్కువ ఎదగడం

ప్ర + స్ఫుటం = ప్రస్ఫుటం = ఎక్కువ స్ఫుటం (ఎక్కువ స్పష్టం)

ప్ర + మాదం = ప్రమాదం = ఎక్కువ మత్తు

ప్ర + యానం = ప్రయాణం = ఎక్కువదూరం వెళ్ళడం/ ఒక ప్రత్యేక ప్రదేశానికి వెళ్ళడం

ప్ర + పంచం = ప్రపంచం = ప్రధానంగా అయిదు కలిగినది (పంచభూతాలు)

అలాగే, గాఢం – ప్రగాఢం ; స్ఫుటం – ప్రస్ఫుటం

14. ప్రతి = ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి (మఱల) , ఒక్కొక్కటి

ప్రతి + ద్వంద్వి = ప్రతిద్వంద్వి = విరోధియైన జతగాడు

ప్రతి + లేఖనం = ప్రతిలేఖనం = ప్రత్యామ్నాయంగా వ్రాసుకొన్నది

ప్రతి + భా = ప్రతిభ = ఎదురుగా కనిపించే వెలుగు

ప్రతి + అభివాదం = ప్రత్యభివాదం = ఒకఱు తనకి అభివాదం చేయగా వారికి తాను తిరిగి చేసిన అభివాదం

ప్రతి + వాదం = ప్రతివాదం = ఒకఱి వాదాన్ని పూర్వపక్షం చేసే ఎదురువాదం

ప్రతి + రాత్రి = ఇ.ప్రతిరాత్రి = ఒక్కొక్క రాత్రి

15. వి = లేకుండా, విడిగా, వేఱుగా, మఱో విధంగా, మఱో దిశలో, విశేషంగా , ప్రత్యేకంగా (దీనికి వ్యతిరేకార్థకంగా స అని వాడడం ఉన్నది ఉదాహరణకి, వికలం X సకలం)

వి + మలం = విమలం = మలం (మలినం) లేనిది

వి + కలం = వికలం = కళలు (అంగాలు) పూర్తిగా లేనిది

వి + రక్తి = విరక్తి = రక్తి లేకపోవడం

వి + ధవ = విధవ = ధవుడు (భర్త) లేనిది వితంతువు

వి + శృంఖలం = విశృంఖలం = సంకెళ్ళు లేనిది, సంకెళ్ళను త్రెంచుకున్నది

వి + ప్రియం = విప్రియం = ప్రియం కానిది

వి + చక్షణుడు = విచక్షణుడు = (సమాజంలో తక్కినవారి కంటే విషయాల్ని) వేఱుగా/ మఱోవిధంగా చూసేవాడు = పండితుడు (చక్ష్ – చూడడం)

వి + మతం = విమతం = వేఱైన మతం

వి + పక్షం = విపక్షం =వేఱైన పక్షం

వి + లక్షణం = విలక్షణం = వేఱైన లక్షణాలు గలది

వి + రచితం = విరచితం = విశేషంగా రచించబడినది

వి + వాదం = వివాదం = విశేషంగా చేసే వాదం

వి + శారదుడు = విశారదుడు = విశేషమైన శారద (సరస్వతి) గలవాడు (పండితుడు)

16. సం = కలిసి, ఒకటిగా, మొత్తంగా, ఉత్తమంగా, ఎక్కువగా

సమ్ + లాపం = సంలాపం (సల్లాపం) = ఇద్దఱు కలిసి ప్రీతిపూర్వకంగా చేసే సంభాషణ

సమ్ + భోగం = సంభోగం = కలిసి సుఖపడడం (రతి)

సమ్ + కరణం = సంకరం = (వేఱువేఱు వస్తువుల్ని) ఒకటిగా కలిపేయడం

సం + జ్ఞానం సంజ్ఞ = (రెండింటిని) ఒకచోట చేర్చి పోల్చి చూసుకొని తెలుసుకోవడం (గుర్తుపట్టడం)

సమ్ + ఉద్రం = సముద్రం = జలజంతువులన్నీ ఒకచోట చేఱిన ప్రదేశం (ఉద్రం = జలజంతువు)

సమ్ + ఆపనం = సమాపనం (సమాప్తి) = మొత్తానికి చేఱుకోవడం (ముగింపు)

సమ్ + మతి = సమ్మతి = (ఇద్దఱు లేదా అంతకంటే ఎక్కువమంది) కలిసి అనుకోవడం (ఒప్పందం)

సమ్ + స్కరణం = సంస్కరణ = ఉత్తమంగా దిద్దడం

సమ్ + పర్కం = సంపర్కం = మిక్కిలి తాకిడి

17. పరా = అవతల, అతీతంగా

పరా + క్రమం = పరాక్రమం = అవతలి దరికి దాటడం

పరా + జయం = పరాజయం = జయానికి అవతలగా పడడం

పరా + ఇతుడు = పరేతుడు = (జీవితం నుంచి) అవతలికి వెళ్ళినవాడు (మృతుడు)

పరా + భవం = పరాభవం = అవతల ఉండాల్సిరావడం

పరా + మర్శ = పరామర్శ = అవతల (ఒక సంఘటన జఱిగిన తరువాత) స్పృశించడం

18. పరి = చుట్టూ, అంతటా, పైన, మొత్తం

పరి + స్థితి = పరిస్థితి = చుట్టూ ఉన్న స్థితి

పరి + వారం = పరివారం = చుట్టూ ఆవరించినవాళ్ళు

పరి + మాణం = పరిమాణం = చుట్టూ కొలవడం

పరి + పాలనం = పరిపాలన = చుట్టూ చూసుకోవడం

పరి + భ్రమణం = పరిభ్రమణం = చుట్టూ తిరగడం

పరి + అటించు = పర్యటించు = అంతటా తిరుగు

పరి + ఈక్షించు = పరీక్షించు = మొత్తం చూచు

19. పి/ అపి = రహస్యంగా, కప్పిపెట్టి (ఎందుకో గానీ, ఇవి చాలా అరుదుగా వాడారు)

పి + ధానం = పిధానం = కప్పి ఉంచడం (అపిధానం)

20. ఉత్/ ఉద్ = పైకి, బిగ్గఱగా, ఆకస్మికంగా

ఉద్ + గమనం = ఉద్గమనం = పైకి వెళ్ళడం

ఉద్ + హరణం = ఉద్ధరణ = పైకిలాగడం

ఉత్ + పరివర్తనం = ఉత్పరివర్తన = శరీరంలో ఆకస్మికంగా కలిగిన మార్పు (mutation)

ఉత్ + చరించు = ఉచ్చరించు = పైకి బిగ్గఱగా అను

ఉత్ + తేజం = ఉత్తేజం = పైకి ఎగసిన మంట

21. అ/ అన్ – వ్యతిరేకార్థకం (అచ్చులతో మొదలయ్యే పదాల ముందు అన్ వస్తుంది. హల్లులతో మొదలయ్యే పదాల ముందు అ వస్తుంది)

ధర్మం కానిది = అ +ధర్మం = అధర్మం

కాలం కానిది = అ + కాలం = అకాలం

పరిశుభ్రం కానిది = అ + పరిశుభ్రం = అపరిశుభ్రం

సందర్భం కానిది = అ + సందర్భం = అసందర్భం

జ్ఞానం కానిది = అ + జ్ఞానం = అజ్ఞానం

ఆదరం కానిది = అన్ + ఆదరం = అనాదరం

ఆసక్తి కానిది = అన్ + ఆసక్తి = అనాసక్తి

ఆలోచితం కానిది = అన్ + ఆలోచితం = అనాలోచితం

ఊహ్యం (ఊహించడానికి వీలుపడేది) కానిది = అన్ + ఊహ్యం = అనూహ్యం

కొన్నిసార్లు ‘లేనిది/ లేనివాడు’ అని వ్యక్తం చేయడానిక్కూడా (బహువ్రీహి సమాసార్థంలో) ఈ ఉపసర్గల్నే వాడతారు. ఉదా :- అన్ + అగ్ని = అనగ్ని = రోజూ అగ్నికార్యం (హోమం) చేయనివాడు.

పూర్వీకుల మార్గంలో ఉపసర్గల సహాయంతో ఏ విధంగా నూతన పదనిష్పాదన చేసి వాడుకోవచ్చు?

అనేక ఆంగ్లవ్యక్తీకరణలకి దీటైన పదాల్ని నిష్పాదించడంలో ఉపసర్గలు చాలా ముఖ్యభూమిక వహించగలవని నేటి ఆంధ్ర రచయితలు గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే ఆంగ్లంలో ఉన్న అనేక ఉపసర్గలకి మన ఉపసర్గలు సమాధానం చెప్పగలవు. ఉదాహరణకి ఈ క్రింద గమనించండి :

అప = mis- dis

misdirect = అపదేశించు (అచ్చతెలుగులో తప్పబంపు అనొచ్చు)

misfit = అపయోగ్యుడు

misinform = అపతెల్పు

mislead = అపమార్గించు (ప్రస్తుతానికి తప్పుదోవ పట్టించు అని వాడుతున్నారు. కానీ ఇది కొంచెం బారుగా ఉంది)

mismanage = అపనిర్వహించు.

అప కే ప్రత్యామ్నాయంగా సందర్భాన్ని బట్టి దుర్/ కు అని కూడా వాడొచ్చు. ఎందుకంటే ప్రతి సందర్భానికీ అప సరిపోతుందని చెప్పలేం. ఉదా:

misappropriation = దుర్వినియోగం

misinterpret = కువ్యాఖ్యానించు

ఉప = sub- Vice-

sub-total = ఉపమొత్తం

subscript = ఉపపాఠ్యం

subculture = ఉపసంస్కృతి

subdivision = ఉపవిభాగం

అవ = sub- de- dis-

deflation = అవ + ఉల్బణం = అవోల్బణం

sub అనే ఉపసర్గని కొన్నిసార్లు ఊన అని గానీ నీచ అని గానీ అనువదించవచ్చు. ఉదా :-

subhuman = నీచమానవుడు

subzero temperatures = అవశూన్య ఉష్ణోగ్రతలు (సున్న కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతలు)

subsonic speed = అవశబ్ద వేగం (శబ్దం కంటే తక్కువ వేగం )

దీనికి వ్యతిరేకం : శబ్దాధిక వేగం (లేక) అధిశబ్దవేగం = supersonic speed

అతి = over- super-

అను = post-

ని = sub- in-

subcutaneous = నైచర్మణం (ని + చర్మన్ = చర్మం లోపలిది) పక్షాంతరంలో చర్మాంతరికం అని కూడా అనొచ్చు.

Submersible = నిమజ్జనీయం/ నిమజ్జకం

నిర్/నిస్ = ex- -less

అధి = super- సు = eu-

దుర్/దుస్ = mis- ప్ర = pre- pro-

ప్రతి = re- counter-

వి = de- dis- se-

సమ్ = con- com- co-

పరి = circum- peri-

అ/అన్ = un- non- de- dis-

తెలుగులో సంస్కృత ఉపసర్గల ప్రయోగ సరణి :

సంస్కృత ఉపసర్గల్ని తఱచుగా సంస్కృత తత్సమాలకే ముందుచేర్చి ప్రయోగించడం తెలుగుభాషలో ఆనవాయితీ. ఇందుకు సకృత్తుగా అపవాదాలు (rare exceptions) కూడా లేకపోలేదు. ఉదాహరణకి, ఈ క్రింది పదనిర్మాణాల్లో తొలి అవయవం సంస్కృత ఉపసర్గా, మలి అవయవం అచ్చతెలుగుపదమూ కావడాన్ని గమనించండి.

దుర్ + అలవాటు = దురలవాటు = దురభ్యాసం

ని: + సిగ్గుగా = నిస్సిగ్గుగా (నిర్లజ్జగా)

ని: (ర్) + మొహమాటంగా = నిర్మొహమాటంగా (మొహమాటం లేకుండా)

అతి + తిండి = అతితిండి

ప్రతి + వాడు = ప్రతివాడూ మొ.

ని: + పూచీ మనిషి = నిష్పూచీ మనిషి (బాధ్యతారహితుడు)

ని: + పేచీ ఆస్తి = నిష్పేచీ ఆస్తి (చట్టపరమైన పేచీలూ, గొడవలూ లేని నిర్వివాద ఆస్తి)

సమ్ + కూడు = సమకూడు

సమ్ + కూర్చు = సమకూర్చు

సకృత్తే అయినా విశేషాన్ని సామాన్యీకరించే (generalizing the particular) న్యాయం చొప్పున ఈ అరుదయిన పదాల శైలిని ఇతర తెలుగు పదాలకి సైతం విస్తరించాలి. ఈ క్రిందివి నేను ఆ ప్రకారంగా నిష్పాదించినవి. ఉదా:- ఉపగుంపు (sub-group)

అపవాడకం (దుర్వినియోగం = abuse),

అపతెల్పు (తప్పుడు సమాచారమిచ్చు = misinform),

అనుకాచు/అనుకాపు (వెంట ఉండి కాయడం = escort),

అ-తెలుగంటి (un-telugu-ish) మొదలైనవి.

అభ్యాసకార్యములు

I. ఉన్న క్రియాధాతువులకి ఉపసర్గల్ని జోడించి ఈ క్రింది అర్థాలలో కొత్త క్రియాధాతువుల్నీ, నామవాచకాల్నీ, భావార్థకాల్నీ కల్పించండి :

1. దగ్గఱికి పిలిచి చెప్పు, సలహా ఇచ్చు (వచించు వాడండి) 2. విశేషంగా శిక్షణ ఇచ్చు 3. పొఱపాటున దండించు 4. పైపైన పుయ్యడం (లేపనం అని వాడండి) 5. పైరేట్ చేయడం (ముద్రించు వాడండి) 6. quarantine చేయడం (వాసించు వాడండి) 7. కాపీ చేయు (లిఖించు వాడండి) 8. రహస్యంగా తిరుగు (చరించు వాడండి) 9. ఆకస్మికంగా చనిపోవడం (మరణం వాడండి) 10. చుట్టూ త్రవ్వడం (ఖననం వాడండి) 11. Lateral thinking చేయు (యోచించు వాడండి) 12. అందఱూ కలిసి డిమాండ్ చేయు (ఆశించు వాడండి) 13. Acknowledge చేయు (తెల్పు వాడండి) 14. Liaison చేయు (సంధించు వాడండి) 15. నేఱానికి మించి ఎక్కువ శిక్షవేయు (దండించు వాడండి) 16. ఏమీ తెలియకుండా ముందే అనుకోవడం (bias – మతం అని వాడండి) 17. Low ambition (కాంక్ష వాడండి) 18. ఇద్దఱు ముగ్గుఱు ఒకే వ్యక్తిని ప్రేమించు 19. లోలోపల ద్వేషించు 20. to perceive – తనకి ఇష్టమైనట్లు చూచు (దర్శించు వాడండి) 21. రహస్యంగా అమ్మడం (విక్రయించు వాడండి) 22. రహస్యంగా కొనడం (క్రయించు వాడండి) 23. తనవాళ్ళని తన ఎదురుగానే కొట్టడం (తాడనం అని వాడండి) 24. అందఱూ కలిసి ఇచ్చిన ఆజ్ఞ 25. అంచనాలకి మించి సాధించడం 26. అంచనాలకి మించి పోగుపడడం/ పోగుచేయడం (సంచయనం లేదా సంగ్రహణం అని వాడండి) 27. ప్రత్యేకమైన సంస్థ 28. ప్రధానమైన భాగం 29. సహాయక వాచకం (supplementary text) 30. తోడుగా పంపు (ప్రేషించు వాడండి) 31. వేళ కాని వేళలో తినడం (ఖాదనం గానీ, భోజనం గానీ వాడండి) 32. to improvise అప్పటికప్పుడు కల్పించు (రచించు వాడండి) 33. తిడితే తిరిగి తిట్టడం (దూషణ అని వాడండి) 34. ఒక సబ్జెక్టుని గానీ పుస్తకాన్ని గానీ ఎక్కువగా చదవడం (పఠన అని వాడండి) 35. కలిసి చదువుకోవడం 36. అనుసరించి కల్పించు 37. ఒకఱు తనని ప్రేమించినాకనే తాను వారిని ప్రేమించడం 38. ఒక భవనాన్ని కడుతూండగానే ఇంకో భవనం కూడా కట్టడం (నిర్మాణం అని వాడండి) 39. అడవిగా మార్చు 40. అడవులు లేకుండా చేయు. 41. ముందుగానే జీతమిచ్చు (వేతనం వాడండి) 42. జీతం తగ్గించు.

(తరువాయి భాగం వచ్చే వారం)

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, పదనిష్పాదన కళ and tagged , , , , , , , , , , , , , , .

డియర్ రీడర్:— రచనతో సంబంధంలేని వ్యాఖ్యలు వద్దు. సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు. నింద వేరు విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు. పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, అంతకుమించి ఒరిగేది లేదు. ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. వీలైనంతవరకూ మారుపేర్లు వద్దు. మీ వ్యాఖ్యలు పరిశీలన తర్వాతనే ప్రచురింపబడతాయి. వ్యాఖ్యల్ని ఎడిట్ చేసే అధికారం పత్రికకి ఉంది.