cover

పెదంకలాం బస్సు

Download PDF ePub MOBI

ఖాళీ రంగస్థలం మీద ఒకవార వెలగని లాంతరు, తడకల కాఫీ హొటలు గోడకి శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం వాల్ పోష్టరు. పేకేజీ చెక్క మీద ‘బస్ ష్టేండు, పెదంకలాం గ్రామం’ అని గుర్తున్న రాట. చీఁవన్నగారి చిట్టికాఁవుడు: బాగా ముసలి విధవరాలు.

(చీఁవన్నగారి చిట్టి బెంచీ మీంచి లేచి నిలబడి రాటదగ్గరికెళ్ళి కాళ్ళు, మెడ ఎత్తుకుని అరచేతిని ఎండకి అడ్డుపెట్టుకుంటూ దూరాన్న బస్సొస్తున్న జాడ కోసం రోడ్డుకేసి చూస్తుంది. ఆవిడ కూర్చున్న దగ్గిర బెంచీ వార ఒక గోనె బస్తా, ఒక పెద్ద వెదురు బుట్ట, చేతి సంచీ, పెద్ద హోల్డాలు. బెంచీ మీద మరచెంబు.)

చిట్టి: బావుందమ్మ! పెదంకలాం బస్సు రాలేదింకాను…?

(గడీ సేపు ఆలోచించి, కింద ధూళిలో పడుకున్న వెర్రివాణ్ణి లేపుతున్నట్టు హెచ్చరించే గొంతుతో)

చిట్టి: ఒరే నాన్నా? పెదంకలాం బస్సొచ్చి వెళిపోయిందిట్రా నానా…? వొరే వెర్రివాడా ఎవళు మాదాసుల వాళ్ళ పిల్లడివా?

వెర్రి: (నిద్దట్లో ఒత్తిగిలినట్లు ఒకవైపుకి సర్దుకుని ఏం మాట్లాడకుండా చూసి..) పల్లకోండీ?

చిట్టి: నేన్రా చీఁవన్నగారి చిట్టిని! పెదంకలాం బస్సు కోసఁవేనా చూస్తునావు నువ్వు?

వెర్రి: (ఆవిలించుకుని ఒళ్ళు విరుచుకుని మళ్ళీ పడుకుని) నీను ఎర్రోణ్ణనీసి ఎరగవండీ? నాకెందికీ బస్సు …?

చిట్టి: అదికాదు బస్సు వేళాయింది కాదుట్రా? ఒచ్చెళిపోయిందు గావోసురా…?! నువ్వు చూసేకావూ…? (ఆకాశం వైపు కళ్ళు చిట్లించి చూస్తూ) టైమెంతయిందో ఎరుగుదువూ?

వెర్రి: (గాజు బుడ్డీలో నీళ్ళు పుక్కిలించి తుపుక్కున ఆకాశం మీదికి ఉమ్మి, ఆవిడ కంగారుగా పక్కకి తప్పుకుంటే నవ్వుతాడు.) నాకెందుకండి టయాం? (పెద్దగా నవ్వుతూ) నీకెందికీ టయాఁవూ…? ఏవూరు మునసబు నాయురాలివి నువ్వు?

చిట్టి: బావుంది నాయినా! అనువ్వాడి పెళ్ళం వాడకల్లా వొదిన. వెర్రివాడా, నీకూ లోకువైపోయేనా నేనూ? నా కొడుకులు రాజులు. సప్త సముద్రాలవతల దూరానున్నారు. వాళ్ళు రాజులైతే నేను రేవినైపోయేనా? అయ్యొ వెఱ్ఱితండి వొఠ్ఠిదేన్రా ఏ గుడ్డూ లేదూ. పెదంకాలం వెళ్ళి కనకాలింట్లో పడిపోయేనా ప్రాణం సుహానుంటుంది! (దూరంగా బ్రిడ్జవతల తోపుల్లోకి చిట్లించి చూస్తూ) అదుగో మూడు ఝాఁవుల పొద్దు దిగే పోయింది. నిండా నాలుగూ అయ్యుంటుంది. మునపట్లాక్కాదొరే! గెంట గెంటకీ బస్సున్నాది కాదు నాయినా? అయ్యో, వెఱ్ఱివాడివి నీతోటి నాకేఁవిటి? ఒస్తుందొస్తుంది! ఏదీ ఓ కోళా పండు నోట వేసుకుందాం, నోరెండిపోయింది.

(చేతి సంచీలోంచి కమలా పండు పైకి తీసి జాగర్తగా తొనలు ఒలిచి నోట్ళో వేసుకుంటూ)

చిట్టి: ఇవి నాగపూరు పళ్ళు కావు! ఈ దిక్కుమాల్నూళ్ళో ఓ కాయా పండేనా సరిగా దొరకదు. రూపాయి డబ్బులూ పుచ్చీసుకున్నాడు. ఇవా నాగపూరు సంతరాలు…? కనకం మొగుడికి చెపితే కిధరుపూర్నుండి బుట్టడూ పళ్ళూ పంపిస్తాడు ‘అప్పా! ఏదీ నా కళ్ళతోటి నేను చూస్తూ వుండగా అలా…గ ఈ నాలుగు తొన్లు నోట్టో వేసుకోవే!’ అంటాడు. ఎవళ్ళక్కావాలి నాయినా? వొగిసిన్నాళ్ళూ పితక్కా చాకిరీ చేయించుకుని పుచ్చ దొబ్బులూ పెట్టి తోలీసేవాళ్ళేగాని ముసిలి దొంగవెడి కూతురు ఉన్నాదో, చచ్చిందో…? (కళ్ళు పొత్తిపంచ కొంగుకి ఒత్తుకుంటూ) విన్నావా?

వెర్రి: ఒల్లకో మామ్మా! (తలెత్తి, బోధిస్తున్నట్టు) కడుపులో దుక్ఖమెవలకి నేదండి? ఇంట్లో ఏడండీ భ్యేపనమ్మ గారు! ఇకడకొచ్చీసేడుత్తావ?

చిట్టి: వేసి చూస్తే వెర్రివాడే గెలిచేట్ట! (సంచీలోంచి గంగచెంబు బయటికి తీసి, ఎత్తి నోట్ళో పోసుకోబోయి, అంతలోనే నవ్వుతూ) వీడితోటి నాకేఁవిటే? అయ్యొ నా ఓగాయిత్తంకూలా! మరిచెంబు కాదు ఇది గంగచెంబా? ఇదిక్కడెందుకున్నాదీ? నిరుడు ఏటివిళ్ళకి కాశీ వెళ్ళినప్పుడు వనేస్రి తెచ్చింది కాదుటే ఈ గంగచెంబు? అయ్యొ, అదేను! ఉండూ చూతాం…(గంగచెంబు కింద చెక్కిన అక్షరాలు కూడబలుక్కుని చదువుతూ) ‘పే. వేం. సుబ్బన్న, ల. కామేశ్వరీ’ – చిన్నవాడిదీ పెళ్ళాందీనా ఈ గంగచెంబు? ఇంతా చచ్చీ తెప్పిస్తే ఇక్కడే వగ్గీసి పోయేడూ?? (నిట్టూర్చి, మరచెంబులో నీళ్లు ఎత్తిపోసుకుంటూ) బావుందమ్మ! దిక్కుమాలిన బస్సు…

(సంచీలోంచి అమృతాంజనం తీసి నుదుటికి, కణతలకి రాసి నొక్కుకుంటూ) వాడి చేతి మాత్తర మరుట్టిదేను. (సంచీలోంచి ఒక బోర్నవిటా డబ్బా బయటికి తీసి) అన్ని జంతికలు నోట్లో వేసుకుందాఁవు… జంతికల్డబ్బా ఏది చెప్మా? (సంచీ అంతా వెతుకుతూ) కనకానికి జంతికలంటే చిత్తు. (మూత తీసి లోనికి వాసన చూస్తూ) అయ్యొ వల్లకాడు… వేప్పిక్కలా?

(తడకల మీద అంటించిన వేంకటేశ్వర స్వామి వాల్ పోష్టర్ని చూసి నవ్వుతూ) బావుంది నాయినా జంతికంటే వేప్పిక్కలా తెప్పిస్తునావు? మా బావున్నాది! (నిలబడి నిష్టూరంగా దేవుడి పటంతో) మా మాఁవగారి తద్దినఁవేనా తప్పేను గాని ఓ నాడేనా నీకు శనివారాలు తప్పలేదు! పెద్దవాడికి నీ పేరే పెట్టుకున్నాను. వాడు ఒవ్వో వెయ్యి రూపాయిల జీతగాడు! ‘ముసిలివాళ్ళు ఏడవరుటే శకూ? ముసిలికాలానికి ఏడవక పోతే మరి నవ్వుతుందిటే శకూ వయ్యారిభాఁవా ఇన్నాళ్ళకి మా అమ్మా?!’ అని మొగుడూ పెళ్ళం వెక్కురు నవ్వులు నవ్వుకుంటూను పుటుకూ పుటుకూమని కేజీడు ద్రాక్షపళ్ళూ ఒహళ్ళ నోట్లో ఒహళ్ళూ తినిపించుకున్నారు గాని “అయ్యొ అమ్మా! ఇందా ఈ పండు..” అని ఒఖ్ఖ పండేనా నోట్లో వేసేకాడు. (వెటకారంగా) వొహ్హోహొ రోకు! వాడో వెంకట్రవణ మూర్తీ, నువ్వో వెంకట్రవణ మూర్తివీనీ! (ఏడుపు గొంతుతో) నేన్నీకేఁవిటపకారం చేసేనూ? పోనీ చేసేనే కట్టూ…!

(హడావిడిగా మనిషి నడిచొస్తున్న చప్పుడు. ‘అమ్మా? అమ్మా..?’ అని గాభరాగా కేక వేస్తూ కనకాలు ప్రవేశం.)

కనక: అదేఁవిటే అమ్మా ఒక్కర్తివీ ఇక్కడ కూచున్నావూ? ఈ మూటలేవిటి సజ్జలు … ఎక్కడికే?! (అనుమానంగా చుట్టూ చూస్తూ) ఎవళ్ళతోటి జట్టీ?

చిట్టి: అయ్యొ బావుందమ్మ నాకెవళ్ళతోటి జట్టీలు? ఆ వొయ్యారి భాఁవనీ దాని మొగుణ్ణీను తిట్టకపోతే ముద్దించమన్నావా? నా ఊసు మీకెందుకర్రా? ఈ దిక్కుమాల్నూళ్ళో నేనుండలేనమ్మా! పెదంకలాం వెళిపోతానే. (కళ్ళు గట్టిగా చెమర్చుకుని ఏడుపు గొంతుతోటి) ముసిలి దొంగవెడికూతురు ఉన్నాదో చచ్చిందోనని ఓ గాడిదికొడుకేనా ఒచ్చోమాటు చూసి వెళ్ళేట్టే? అట్లకాడ గుచ్చుకున్నాది చెప్టీ అయిపోయిందనీసి నిభం పెట్టుకుని ఆయన్ని అటుంచటే అంపకం పెట్టీసేరు. సింహంలాటి చీఁవన్నగారికే దిక్కులేకపోయింది, నన్నెవళు చూస్తారే? ఒఠ్ఠిదేనా అమ్మా… శుష్క ప్రియాలూ శూన్య హస్తాలూనూ!

కనక: నేనున్నాను కాదుటే? అమ్మా ఉండుండి నీకు ఇదేం వెఱ్ఱే…? పదా ఇంటికీ…!

చిట్టి: (చెయ్యి విదిలించుకుని) అయ్యొ నీ దుష్టుతనం… నేన్రానే ఆ వెధవూళ్ళోకి రానమ్మా నేను. అమ్మో! పొడుచుకు తినెస్తారు! (విసురుగా) ఒదలవే చెయ్య్! మోజూరుదానా! (ఆకాశం కేసి చూస్తూ, ఆశగా) పెదంకలాం వెళిపోతానే! మా కనకాలున్నాది, బంగారు పిచిక. కోడళ్ళెందుకు చూస్తారమ్మా నా వెర్రిగాని? ఆ బాలా పరమేస్రీవే నా ఇంట్లో పుట్టింది ఆ రాజ రాజేస్విరీ అమ్మా కనకాల్దెగ్గిరికి వెళిపోతానే! నాకూ నా రాఁవుడికీ వేరేగాను గదిస్తాను ఒచ్చీమన్నాదే. ‘కంటికి రెప్ప లాగ నేన్నిన్నూ నీ రాఁవుణ్ణీ చూసుకుంటా కానే? వొచ్చీవే అమ్మా!’ అనీసి అయ్యో దానికి నేనంటే రోకమ్మా రాఁవ రాఁవా! (పెద్ద గొంతుతో చిందులు వేస్తూ లేచి, పాట)

పోయీ రారా వేగులవాడా

శ్రీరామచంద్రూ లెచటకు జనిరీ?

దిగులం దిగులం దిగినారయ్యా!

గుంపులు గుంపులు వచ్చిరయా!

క్షణాన వారధి కట్టిరయా!!

కనక: ఉష్షు ఇక్కడేఁవిటే నడివీధిలోను భాగోతం పదవే అమ్మా నీకు పుణ్యఁవుంటుందీ! కనకాన్ని నేనేను కాదుటే? నీకు గదిచ్చేం కాఁవూ? (ముక్కు మీద వేలు వేసుకుని) దేవతార్చన పెట్టి తెచ్చి బష్టేండ్లోన పెడతావా? అయ్యో ఇల్లల్లా నీదేను ముష్టి కొంప… పదవే?!

చిట్టి: సాహూ డాక్టరు దెగ్గిర మంచి ఫస్ట్లాసైన మందిప్పిస్తుంది మా కనకం. చూడూ… “నేను ఆకలికి ఓర్చుకోలేనమ్మా ముసిల్దాన్ని!” అంటే తొమ్మిదో గెంటకల్లా అలా ఆరారా అంత వండి పడిస్తుంది. దానింటికి వెళిపోతానమ్మా నీకే పుణ్యఁవుంటుందమ్మా నన్నడ్డకే! ఇదుగో ఈ జత గాజులూ పుచ్చుకో మారు మాటాడకుండా పోవే దొంగ మాదుర్చోతా!

కనక: అయ్యో నీ ముసిలి పిచ్చి ముదిరిపోయింది నీ గాజుల్నాకెందుకే! నేనూ బడికెళ్ళొచ్చీ వేళకి ఇంత పని చేస్తావుటే? పదవే ఇంటికీ..?!

చిట్టి: పెదంకలాంలో ఫస్టుగాను….?

కనక: అయ్యో ఇది పెదంకలాఁవేను! అదుగో బోర్దూ చదివేకావు? “పెదంకలాం బస్సు స్టేండ్..”

చిట్టి: (అనుమానంగా) కనకం దెగ్గిరికి పోతాను సుమీ…?

కనక: (నమ్మలేకుండా నవ్వుతూ) నేనేనే కనకాన్నీ!! (మొహంలో మొహం పెట్టి దగ్గరగా) ఇదుగో చూసుకో నా మాట అబద్ధఁవైతేను! నేనేనూ కనకాన్ని! ఇదే పెదంకలాం. మనూళ్ళోనే మనఁవున్నాఁవు ఈ పాటిదానికి బస్సెందుకో చెప్పూ? (బుజ్జగిస్తున్నట్టు) పెదంకలాం ఇదేనూ, నేనే కనకాన్ని! అయ్యొ ఈ పాటిదానికి (అనుమానంగా) ఆ మూటేవిటి…?

చిట్టి: కనకం మొగుడికి మినపసున్నంటే ఇష్టం కదుటే…? అప్పా, జున్ను విరవమంటాడే??

కనక: నీకు వెఱ్ఱేఁవిటే అమ్మా? ఆయన పోయి పన్నెండేళ్ళయింది. ఇప్పుడు జున్ను విరుస్తా? పండగెళ్ళిన పాచినాడూ? అయ్యొ ఇందుకా మినుగులూ బెల్లం మొన్నట్నుంచీనూ…?!

(హారన్ కొట్టుకుంటూ బస్సొచ్చి ఆగుతుంది.)

బస్సు చెక్కరు కేక: ఆ ఎవరండీ అజ్జాడా అంకలాం? ఏండీ బేపనమ్మగారు? సామాన్లు మీదనేసీమంతావా?

చిట్టి: ఇదుగో వొరే ఎవళ పిల్లడివి నువ్వు? (కొంగు ముళ్ళోంచి ఇప్పి డబ్బులు చూపించి) ఇదుగో చూడూ పెదంకలాం టికట్టు కొనీసి నన్ను సుబ్భరఁవైన సీట్లో కూఛోబెట్టీ. నువ్వో రూపాయి తీసుకో!

చెక్క: రూపాయి కేటొస్తాది మామ్మా? ఇలాగిచ్చీ! (నవుతాలుగా) ఇదే పెదంకలాం ఇక్కడే దిగిపో!

చిట్టి: (నిరాశగా) అయితే నిజఁవేనుట్రా ఈ పిల్ల చెప్తున్న ముక్క? ఇదేనా పెదంకలాం..? బావుంది నాయిన్లాలా బాబుల్లాలా! ప్రయాణాలబద్ధం, ప్రసాదాలు నిబద్ధం!! (ఇటు తిరిగి) ఐతే నువ్వేనుటే మా కనకానివి? (ఏడుపు గొంతుతోటి) అయ్యో బంగార్లాటి పిల్లవి ఇదేఁవిటే ఇలాగ తయారయేవు…? పచ్చగా పసుపు కొమ్ము చెక్కినట్టుగ పిల్లవీ? అయ్యొ ఎలాటి పిల్లవి ఎలాగైపోయేవో కుట్లబొంతవైపోయినావుటే? అయ్యొ వాతాన పడిపోయినావుటే అమ్మా, కనకాలూ నువ్వుటే?? (అపనమ్మకంగా చుట్టూ చూస్తూ) ఇదేనా పెదంకలాఁవు?

వెర్రి: (అటు ఒత్తిగిల్లి చెయ్యి విసురుతూ) పెదంకలాఁవు ఇదేనమ్మ పల్లకొమ్మంతె విన్నావండీ? ఎక్కడో వొక్కాడ – ఉన్నకాడ ఉండ్లేవండీ? ఎకడికెలిపోవొస్తావు? పల్లకో!

* తెర *

Download PDF ePub MOBI

Posted in 2014, జూన్, నాటిక and tagged , , , , , , .

9 Comments

 1. ఒక చిన్న ఏకాంకికలో, ఉత్తరాంధ్రమాండలికాన్ని, పాత్రల ముఖ్యంగా, ముసలివాళ్ళ మనోతాత్విక చిత్రణనూ సమర్థవంతంగా పోషించారు. కడుపులో దుఃఖమెవరికి లేదు? అంటూ ఒక సామూహిక సత్యాన్ని గుర్తుచేస్తూనే, చీవన్నగారి చిట్టి, ఆమె చుట్టూ ఉన్నవారి దుఃఖానికి అద్దం పడుతూందీ ఏకాంకిక.

 2. ఉత్తరాంధ్ర మాండలికం చాలా ఇష్టం నాకు … రావిశాస్త్రి గారి పుస్తకాలు చిన్నతనంలో బాగా చదివి చదివి ఆ భాష మీద ప్రేమ పెరిగిపోయింది.. ..
  “సోమ్మలు పోనాయండి..” మొత్తం చదూతూ రికార్డ్ చేసుకోవాలని ఓ కోరిక .. =)

  ఈ కధ మళ్ళి నన్ను నా చిన్నతనంలోకి తీసుకెళ్ళింది…
  అలాగే మానాయనమ్మని గుర్తుచేసింది… మా నాయనమ్మ తన ఆఖరి దశలో ఇలాగే ..ఓ భ్రమలో అంటుండేది … పదిశేర్ల పాలిచ్చే గేదెను కొన్నాను …పక్కింటి సీరాములు తోలుకెల్లి కట్టేసుకున్నాడు…ఎల్లి తోలుకురండ్రా …అని… చాలా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది ..మానాన్నకి రెండేళ్ళ వయసులో…

 3. పూర్తిగా ఒక కథ ని మాండలీకం లో రాయకుండా పాత్రల చేత మాట్లాడిస్తెనె
  బావుంటుంది అని .నేననుకుంటాను.ఈ కథ లో వర్ణనలు మామూలు భాష లో ఉన్నాయి పాత్రలు సహజం గా వాటి యాస లో మాట్లాడుతాయి.ములింటామె లో లాగా రచయిత కుడా మాండలీకం లో నే మాట్లాడి తే అర్ధం అవటాని కొంచెం కష్టం అవుతోంది.

  )
  .

 4. అక్కడే ఉండి అక్కడినుంచి ఎక్కడికి కో పోవాలని చివరికి అక్కడి కే చేరుకోవడం
  వెళ్ళవలిసిన చోటే ఉన్నట్లు తెలుసుకోవడం యెక్కడి కో ఎక్కి వెళ్ళాలనుకున్న బస్సు
  వెళ్ళవలిసిన చోటికే చేరడం ఇదే జీవితం..పూర్తిగా కాఫ్కాయిసిక్ లేక త్రిపురాయిసిక్…
  సైన్సు పరం గా చూస్తె బెపనమ్మ కి సేనయిల్ సైకోసిస్ అనచ్చు లేక జీవుడి వేదన అనుకోవచ్చు.రైల్వే స్టేషను
  బస్సు స్టాండు నిరీక్షణ కి అన్వేషణ కి ప్రతీకలు.(మ్యాట్రిక్స్, హ్యారి పోటర్) ..ఎదురు చూడటం మోసపోవడం భ్రమ అని తెలుసుకోవడం ప్రయాణించకుండానె లక్ష్యాన్ని చేరుకోవడం..చాలా బావుంది.కనక ప్రసాద్ గారికి అభినందనలు.ఐ యాం యువర్ ఫ్యాన్ నౌ.!

 5. బావూ…కనకం బావూ.. నిజంగా నువ్వేనేటీ.. పల్లకోకుండా మా వెర్రిదాన్ని ఆనమాలు పట్టేసినావు .. గుంకలామో , చినంకలామో, ఎల్లిపోయేది ఎర్రి మాలోకం.. ఏమి రాసేసినావు మా బావూ.. ఏమి రాసేసినావు.. ఒకపాలి మళ్ళీ ఆ టయానికి తీసికేల్లిపోనావు .. దండాలేహే..దండాలు నీకు..!!

 6. మా కనకప్రసాదు ఉత్తరాంధ్ర బ్రహ్మణుల మాట తీరు, ముఖ్యంగా నిర్భాగ్యులైన విధవరాళ్ల మాట తీరును
  ( గురజాడ గారి కన్యాశుల్కం లోని మాండలీకం లాంటిదాన్ని ) అచ్చు గుద్దినట్లు అనుకరించగలడు
  అని త్రిపుర గారు మురిపెంగా అనేవారు. అందుకో మచ్చు తునక ఇదోటి కాబోలు.

  ” కడుపులో దుక్ఖమెవలకి నేదండి? ఇంట్లో ఏడండీ ”
  ” నాయిన్లాలా బాబుల్లాలా! ప్రయాణాలబద్ధం, ప్రసాదాలు నిబద్ధం!! ”
  అంటూ సందేశమిచ్చిన త్రిపుర గారి కనకా! కోటి దండాలు!!