cover

రెక్కల పెళ్లాం

Download PDF ePub MOBI

అనగనగా అతడు ఈ పెళ్లికి అంగీకరించాడు. ఇంత వయసొచ్చీ పెళ్లి కాకుండా ఉన్న మగవాళ్లు అటు వైపు ఊళ్లల్లో ఎవరూ లేరు! ఇక, ఆడవాళ్ల గురించి చెప్పనే అక్కర్లేదు; పొరుగూళ్లలో ఉన్న అతడి చిన్నప్పటి స్నేహితురాళ్లు – ఈ పాటికి వాళ్ల కూతుళ్ల పెళ్లిళ్ల గురించి మథనపడుతూ ఉండివుంటారు!

కొంత వయసు ఖర్చయినా ఎట్టకేలకు తను కలగన్న భార్య దొరికింది. ఈ పరగణాలో అలాంటి ఇంకో అమ్మాయి ఉండే అవకాశమే లేదు!

తొలిపడకరోజు – మల్లెపూలు పెడుతున్న అల్లరిని కూడా గుర్తించకుండా – భార్య వీపును ఆత్రంగా తడిమాడు.

కొనదేలిన గూడుఎముకల స్పర్శ తప్ప, కావాల్సిన ఆనవాలు దొరకలేదు. ‘ఎక్కడో మోసం జరిగింది!’

తెల్లారి – పెళ్లి కోసం ఇన్నాళ్లుగా పట్టుబట్టిన అమ్మను నిలదీశాడు.

“నువ్వు మరీ చోద్యంరా; రెక్కల కోడల్ని ఎక్కడ్నించి తేను!”

“నేను పదే పదే చెప్తిని గదే!” ఏడుపొచ్చినంత పనైంది అతనికి.

“ఇన్నేండ్లొచ్చినా నీకు మంకుపట్టు పోలేదు; ఎట్ల బతుకుతావో నా పిచ్చి కన్ని”

అమ్మ తన బాధను పట్టించుకున్నట్టే లేదు. పట్టించుకోకపోవటం అటుండనీ, అసలు తనది బాధ అనైనా గుర్తించట్లేదే!

* * *

నిన్నటి బెరుకుపోయి, పాలగ్లాసుతో నేరుగా తన పక్కన వచ్చి కూర్చున్న భార్యను, గ్లాసైనా అందుకోకుండా మళ్లీ అదే ప్రశ్న అడిగాడు. నిన్న అడిగినపుడు పరాచికం అనుకుంది.

“దేవీ! నీకు నిజంగా రెక్కల్లేవా?”

“నా పేరు దేవి కాదు,” విసురుగా చెప్పి మూతి ముడుచుకుంది.

“అది సరేగానీ చెప్పు, లేవా?”

నవ్వుతూనే, కానీ అది నవ్వు కాదని తెలియజేస్తున్నట్టుగానే, నిలదీసింది. “పెద్ద! నీకేమైనా తురాయుందా!”

ఇదసలు అతను ఊహించలేదు. “తురాయా? నాకెందుకుంటుంది? అయినా ఉంటే కనపడేదిగా!” చికాకు పడ్డాడు.

“మరి నాకు రెక్కలుంటే నీకూ కనపడేవిగా?” ఇంకా కోపంలోకి మారని గొంతుతోనే బదులిచ్చింది.

“నిన్ను సరిగ్గా చూడందే! బుట్టవేషంలో ఉంటివిగా, వెనక మడిచి కట్టారేమో అనుకున్నా!”

“మడిచి కట్టడం… ఇది మరీ బాగుంది!” నవ్వటానికి సిద్ధమవుతున్న కండరాలను వెనక్కి లాగింది.

“నేను స్పష్టంగానే చెప్పిపంపానే… రెక్కలుంటేనే చేసుకుంటానని…”

“మీ వాళ్లు చెపితే ఎవరో పిచ్చిమేళంలే అనుకున్నాం. అత్తే పెళ్లయితే సర్దుకుపోతుందంది” మాటల్లో కాఠిన్యమున్నా పలికినతీరు మృదువుగానే ఉంది.

“ఇంకేం! నాలాంటి వెర్రోడయితే కొంగున కట్టేసుకోవచ్చనుకున్నావ్!”

“ఇదిగో, నిన్ను మోసం చేసే ఉద్దేశం మాకు లేదు; మీ వాళ్ల దగ్గిర మేమేమీ దాయలేదు; మళ్లీ చెప్తున్నా, నాకు రెక్కల్లేవు, నీ ఇష్టం!” అన్నట్టుగా తేల్చేసిందామె.

కాసేపు మౌనం వహించాడు. తెచ్చిన పాలు తాగాడు. (“మలిరాత్రికి కూడా పాలు తెస్తారా?” “రేపు కూడా తేవాల్సిందే”).

సంభాషణను ఎటువైపు దొర్లిస్తే తన మానం నిలుస్తుందో తెలియక –

“ఐనా తురాయున్న మగవాడ్ని కోరుకున్న ఆడవాళ్లను నేను ఇటుపక్కల ఎవర్నీ చూడలేదు” అన్నాడు.

ఆమె వెంటనే “ఆశ పడితే మాత్రం దొరుకుతారా?” అంది, తను ఎందుకు సర్దుకుపోయిందో చెప్తున్నట్లుగా.

పెళ్లికి పట్టుధోవతి కట్టుకుని జారిపోకుండా నడుముకు తువ్వాలు బిగించుకుంటుండగా వచ్చిన బావమరిది వరస కుర్రాడు… తనకు సాయపడినట్టే పడి తల మీద ఎందుకో చేయి వేశాడు. ‘ఏయ్ జుట్టు చెరపకు’ అని వారించాడు కూడా. ఇప్పుడర్థమైంది! అతడు తురాయి కుదురుకోసం వెతికి ఉంటాడు!

అతడికి పిచ్చెక్కినట్టయింది. తనకు తురాయి లేనప్పుడు భార్య రెక్కల కోసం పట్టుబట్టడంలో ఇక అర్థం లేదు!

* * *

కొత్త కాపురం చక్కగా చేసుకోవాల్సిన పెళ్లికొడుకు ముభావంగా ఉండటం రెండు కుటుంబాలనూ బాధించింది.

లోపల ఏవైనా పీడ కూర్చుందేమోనని ఒక ముసలి సాధువు దగ్గరకు తీసుకెళ్లారతడ్ని. బోధలే కాకుండా మంచి వైద్యం చేస్తాడని సాధువుకు పేరు. ఆ వైద్యం వల్లే ఆ బోధలకు విలువ పెరిగి ఉంటుంది.

సాధువు అతణ్ని ఒంటరిగా నీలితెరలు కట్టిన తడకల గదిలోకి తీసుకువెళ్లాడు. కళ్లతోనూ, అరచేతితోనూ పరీక్షించాడు.

బయటికి వచ్చి ‘రవివారం మందు బాగా పారుతుంది; ఆనాటికి రావాల్సి ఉంటుంది’ అన్నాడు.

మూడ్రోజుల తర్వాత వాళ్లు మళ్లీ సాధువు దగ్గరికి వెళ్లారు. అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కషాయపు ముంతను కొత్త పెళ్లికుమారుడి చేతికిచ్చి, ‘ఆ చెట్టు కిందకు వెళ్ళి తాగ’మన్నాడు.

కళ్లు మూసుకుని గటగటా ఆ ముంతెడు చేదు కషాయం తాగుతూ సగమైనా పూర్తి కాకుండానే భళ్లున వాంతి చేసుకున్నాడు పెళ్లికొడుకు. నోట్లోంచి తెల్లటి సన్నటి అంగుళం పొడవు ప్రాణులేవో కిందపడ్డాయి.

వైద్యసాధువు వాటిని నిశితంగా పరిశీలించి, తాను ఊహించిందే నిజమైందన్న నిర్ధారణకు వచ్చినట్లుగా తలాడిస్తూ, ‘అందరిలాగే అబ్బాయికి స్వల్ప గుణదోషం ఉంది; ఐతే అదింకా పరీక్షకు నిలబడ్డది కాదు; నలుగురిలో పడితే గానీ కరుగుతుందో, పెరుగుతుందో చెప్పలేం’ అన్నాడు.

అదే తురాయి ఉండింటే! ఆ రోజే నూతనవరుడు గట్టిగా నిశ్చయించుకున్నాడు.

* * *

ఒక అర్ధరాత్రి, భార్య గాఢనిద్రలో ఉండగా, ఆమె పాదాల్ని సుతారంగా స్పృశించి, సడి చేయకుండా పెద్దదర్వాజా తలుపులు తెరుచుకుని, కట్టుబట్టల్తో ఇంట్లోంచి బయటపడ్డాడు.

పిల్లబాటల్లో నడుస్తూ, మట్టిబాటల్లో కలుస్తూ, చిన్న చిన్న పల్లెల్ని దాటుకుంటూ, ఎక్కడైనా చెట్టుకున్న పండో కాయో తెంపుకుని కడుపు నింపుకుంటూ, ఏ ఊరి బావి దగ్గరో నీళ్లను చేదుకుని దప్పిక తీర్చుకుంటూ, రాత్రిపూట ఏ అరుగు మీదో తల వాలుస్తూ, రోజులూ వారాలూ గడిచాక – ఒక నగరంలో అడుగుపెట్టాడు.

అతడు అలా అంగడి వీధిలో నడుస్తున్నాడు. అప్పటికి రెండ్రోజులైంది. నగర ప్రవేశం జరిగి. ‘ఏమయా… ఓ నిన్నే… ఇటుఇటూ… ఓ చేయి వేయ్,’ అని పిలిచాడు బండిలోంచి సంచిని వీపున ఎత్తుకోవడానికి శక్తి చాలని ఒక రైతు (‘ముక్కల సంచి ఐపోయింది, అదే వడ్లయితేనా…’). అతడు వెళ్లి సాయంపట్టాడు. ఇద్దరూ కలిసి దుకాణం అరుగు మీదకు చేర్చారు. మొత్తం ఆరు సంచులు! బదులుగా, ఎత్తరుగు మూల మీంచి దోసెడు పుట్నాలు అతడి చేతుల్లో పోశాడు షాహుకారు. ఆకలి తెచ్చిన కృతజ్ఞతకు రూపంగా చిరునవ్వుతూ పైకి చూశాడు. తలపై ఏవో కనపడి ఆశ్చర్యపోయాడు. ‘కొమ్ముల్లా ఉన్నాయి!’

ఆ రైతు తన బేరాన్ని తెముల్చుకునేదాకా ఒకపక్క వేచివుండి, ఆయన వచ్చాకా ఆ పక్కనే నడుస్తూ, నెమ్మదిగా అడిగాడు: “ఆ షావుకారు నెత్తి మీద ఏమో ఉన్నాయి; ఏంటే అవి?”

నాణాల్ని బనీను వెనకాలి ‘దొంగజేబు’లో వేసుకుంటూ చెప్పాడు రైతు. “ఇక్కడ షానామందికి ఉంటాయిలే సామి; ఈయనకేం జూసినవ్? నాలుగు బజార్ల దగ్గర్నయితే ఒకాయనకు మూరెడు పొడవుంటాయి.”

“అంటే… ఆయనంత పెద్దషావుకారా?”

“అట్లేం లేదు. మొన్న మొన్న మా కొమురునిగ్గూడ మొలిచినై.”

* * *

అతడు ఆ తొలి ఊతం ఆధారంగా చాలారోజులు బళ్లలోంచి సంచులు దింపే కూలీగా పని చేశాడు. ఎప్పుడైనా ఏ ఈకో గాల్లో కొట్టుకుంటూ అతడి ముఖానికి మృదువుగా తాకేది. భార్య గుర్తొచ్చేది. ఒంటినొప్పులన్నీ మాయమయ్యేవి. వెంటనే, ఆమె ముందర నిలబడలేనితనమేదో చుట్టుముట్టేది. ‘పెద్ద! నీకేమైనా తురాయుందా!’ పొద్దుట్నుంచీ మోసిన సంచులకన్నా ఈ ప్రశ్నే బరువుగా తోచేది. సంచులు దింపే పని తర్వాత, అతడు కొద్ది రోజులు ఒక పూటకూళ్ల ఇంట్లో పని చేశాడు. మళ్లీ కొంత కాలం అదే అంగడి దగ్గర – కందెన రాసి కచ్చురాలకు చక్రాలు బిగించటంలో సాయపడ్డాడు. కొన్ని రోజులు గానుగలో నూనె జిడ్డు కార్చుకున్నాడు. మరికొన్ని రోజులు రాత్రి వేళ వేడుకల్లో లాంతర్లు మోశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మల్లెపూలదండలల్లాడు. సున్నితమైన పని! కానీ అందులో ఉన్న నాటకీయత నచ్చక వదిలేశాడు.

తనకు రాయటం వచ్చని తెలిసిన తర్వాత కొంత కాలం లేఖకుడిగా కుదురుకున్నాడు. అప్పుపత్రాలు రాయవలసి వచ్చినపుడు అంత ఉత్సాహం ఉండేది కాదు; కానీ ఎవరైనా దూరాన ఉన్న తమ ఇల్లాళ్లకు, క్షేమం తెలుపుతూ నాలుగు ముక్కలు రాసిపెట్టమన్నప్పుడు మాత్రం వాళ్లతో వేలిముద్ర వేయించే ముందు కొసరుగా తనవైన రెండు వాక్యాలు కలిపేవాడు. వాళ్లకు చదివి వినిపిస్తే ‘ఏమిటో బాబూ ఇవన్నీ’ అని ముసిముసిగా నవ్వుతూ తల గీరుకునేవారు. ఆ అక్షరాలు ఎలాగో తన భార్యను చేరతాయని నమ్మాలనిపించేది. మరీ ఆనందం ఎక్కువైనపుడు తురాయి కోసం నడితలను తడుముకునేవాడు. ఒక రోజేదో చిన్న కురుపు పుట్టింది. గోక్కుంటే హాయిగా ఉంది. ఒకవేళ అది తురాయిమొగ్గేమో! గట్టిగా గోకితే చిదిమిపోతుందేమో! అనుకున్నాడు.

* * *

కాలం గడుస్తోంది. ఒక్కోసారి అతణ్ణి తీవ్రమైన ఒంటరితనం పీడించేది. దానికి విరుగుడుగా బాల్య జ్ఞాపకాలు నెమరువేసుకునేవాడు. ‘నల్లగున్నవాళ్లు చనిపోయి స్వర్గానికి వెళ్లాకా అక్కడ తెల్లగవుతారంట… మా అమ్మమ్మ చెప్పింది’ అని చిన్ననాటి నల్లటి నేస్తం చెప్పిన మాటలూ, ప్రతిగా తను తెల్లగా ఉన్నందుకు దిగులుపడటమూ గుర్తుతెచ్చుకుని నవ్వుకునేవాడు.

తనకు జరిగిన అనుభవాల్ని, తన ఆలోచనల్నీ భార్య తన ఎదురుగా కూర్చున్నట్టు చెపుతుండేవాడు. తన ఊహ మేరకు భార్యను నిర్దేశించుకోగలిగే నేర్పు అతడు అప్పటికి సంపాదించాడు.

‘నిన్న ఏమైందో తెలుసా… ఒక ముసలాయన అట్లా వస్తున్నాడు…’

‘ఇదిగో ఇవాళ్టి నుండి నేను కట్టెల వ్యాపారం మొదలుపెడ్తున్నా; కట్టెలు పగలజీరీ పగలజీరీ నా కండలు ఎలాగైనాయో చూశావుగా…’

‘మొహమాటం, పశ్చాత్తాపాలే నాకిక్కడ కవచకుండలాలుగా ఉన్నాయి; అవి ఎప్పటికైనా నా ప్రాణమైతే తీయవు కదా!’

‘కలపతో నాలుగురాళ్లు మిగులుతాయన్నది నిజమే గానీ, ప్రమాదం ఎక్కువ. అందుకే ధాన్యం వ్యాపారంలోకి దిగుతున్నా.’

‘నాకు అప్పుపెట్టాడని చెప్పానే… ఆయనంటాడూ; ప్రపంచం కొత్తగా బాగుపడేదీ లేదు, చెడిపోయేదీ లేదు. బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే. ఈ వాదన నువ్వొప్పుకుంటావా?’

ముచ్చట్లు చెప్పటం అనేది ఒకేసారి జరగదు. విడతలు విడతలుగా సందర్భానుసారం తన్నుకుని వస్తాయి. కొన్నిసార్లు అంతకుముందు చెప్పినవాటికే అంతకుముందు చెప్పని వివరాన్ని పూరించుకుంటూ మళ్లీ చెప్పేవాడు. ఇంత పెద్ద నగరంలో అతనికి తోడుగా ఉన్నవల్లా కొన్ని మాటల మూటలు… వాటిని విప్పుకోవటానికి భార్య ఛాయ!

* * *

కాలమర్మం అంతుపట్టదు. అది నెమ్మదిగా – జ్ఞాపకాల నీడల్ని వెనక్కీ, రక్తమాంసాల నిజాల్ని ముందుకీ తోస్తుంది. ఇక్కడ తమ ఊరి ఆడవాళ్లలా లేరు. బాహుమూలల్లోని నలుపు అతణ్ణి వివశుణ్ణి చేసేది. నచ్చని స్త్రీని కలలో సంభోగించడం ద్వారా శృంగారం పట్ల గల తన పవిత్రభావనను నిలుపుకునేవాడు. వివేకంతో ఆలోచిస్తే స్త్రీ శరీరం అంత అందమైనదేమీ కాదు; ఆ ఆకర్షణను నిలపకపోతే మనుగడ సాగదు కాబట్టి, అది సృష్టిపూరిత కుట్ర తప్ప మరేమీ కాదు, అనేవాడు.

ఒక సాయంత్రం పొగాకు దుకాణం ఇక మూసేయటానికి ముందు, గల్లా పెట్టెలో నాణాలు లెక్కించి, లాంతరు వెలుగు తగ్గించి, తృప్తిగా ఒళ్లు విరుచుకుని, పట్టేసిన మోకాళ్లు విడిచిన హాయిని అనుభవిస్తూ లేచి నిలబడి, పంచెకుచ్చిళ్లను సర్దుకుంటుండగా… అమ్ముకుని వెళ్తున్న ఖాళీ నెయ్యి గిన్నెల గంపతో వచ్చిందామె. వాటమైన జర్దా కోసం.

ఆమెను చూస్తూనే పెదాలు ముందుకుపొడుచుకునేలా దవడల్ని దగ్గరకు లాక్కుని పైపెదవి అడుగును పైపళ్లతో నొక్కిపట్టాడు. బదులుగా – కుడిదవడను నాలికతో ఎత్తి, పొట్లం అందుకుంటూ, “ఛీ! పొగాకు వాసన” అంది అతని చేతిని ఉద్దేశించి.

ఏ తుదిక్షణం దగ్గర దేహాన్ని దగ్గరకు లాక్కోవడానికి కావాల్సినంత మైకం కమ్మేస్తుందో! రొమ్ములు నిండుగా అమరేలా రవిక మీద చేతులు వేశాడు.

సలుపుదీరి, శ్వాసలు నెమ్మదించి, పనిస్థలాన్ని అపవిత్రం చేశానన్న పశ్చాత్తాపంతోపాటూ తడిచీదరకీ ఆమె తన తలలో జొనిపిన చేతివేళ్ల స్పర్శవల్ల సర్దుబాటు అవుతూ, ఉన్నట్టుండి స్ఫురించటంతో అడిగాడతను: “అవునూ… నువ్వెప్పుడైనా తురాయున్న మొగాళ్లను చూశావా?”

ప్రశ్న ఎందుకడుగుతున్నాడో అర్థంకానట్టుగా ముఖం పెట్టి, “ఏం దొరా! అట్లడుగుతున్నవ్?” అంది. దొరను దొరగా కాకుండా పలుకుతూ.

“ఆహా ఊరికే… చూశావా… అట్లా ఉంటుందా ఎవరికైనా?”

క్షణం ఆలోచించి అంది: “ఒకవేళ ఉన్నా ఎవరైనా నిలుపుకుంటారా?”

తను ఎందుకోసం నగరానికి వచ్చాడో చెప్పకుండా అడిగాడు: “ప్చ్, అదికాదూ, కొమ్ములున్నవాళ్లే తప్ప తురాయున్న వాళ్లు కనపడలేదేంటని…”

తను అడగని ప్రశ్నకు జవాబుగా అన్నట్టు చెప్పిందామె. “మంచో చెడో… నెత్తి మీద ఏం లేకుండా మామూలుగా ఉండరాదా మనుషులూ!”

* * *

మొదట్లో అతడికి ఇదంతా ఆశ్చర్యంగా ఉండేది. పనివాళ్లనుద్దేశించి యజమానులు, ‘ఏమయ్యా, నిన్న పనిలోకి రాలేదూ!’ అనేవాళ్లు.

‘అయ్యా, నా భార్జకు బాగోలేదయ్యా’ లాంటి జవాబేదో వచ్చేది.

అదే యజమానులు – నెత్తిన మూటల్తో వెళ్తున్న రైతుల్తో ‘ఏయ్ బాబూ ఇటురా’ అని పిలిచేవాళ్లు.

బేరం కుదుర్చుకుంటూ రైతులు, ‘బాబూ కాస్త చూసుకోనివ్వు బాబూ,’ అనేవాళ్లు.

‘అయ్యా’, ‘బాబూ’ రెండు పదాలూ ఒకటే ఐనా వాటికి భిన్నమైన పలుకుపడులున్నాయని గ్రహించేనాటికి అతనికి నగరజీవితం ఒక మేరకు అర్థమైంది.

జీవితం గురించీ, స్థితిగతుల గురించీ, ఆదర్శాల గురించీ అతడికి రకరకాల ఆలోచనలు కలిగేవి. తొలుదొలుత ఘర్షణ అనివార్యం అనుకున్నాడు. కానీ తనను ఈ మధ్య ఒకరిద్దరైనా ‘షావుకారూ’ అంటున్నారు. మొదటిసారి ఆ మాట విన్నప్పుడు అతని ఛాతీ ఉబ్బింది. తనకు తెలియకుండానే తలపాగా తీసి తురాయి కోసం తడుముకున్నాడు. అప్పట్నించీ ఘర్షణ అనివార్యమూ, అదే సమయంలో అవాంఛనీయమూ అనిపించసాగింది.

అయితే కొంత కాలానికి అతడు ఈ ద్వంద్వం నుండి బయటపడ్డాడు. ఘర్షణ అవాంఛనీయమే, అని తేల్చుకునేసరికి అతడికి నగరజీవితంలో ఇక అర్థం కానిదీ ఏదీ లేనట్టయింది.

* * *

అదెలా జరిగిందో అతనికి గుర్తు లేదు. అలా దూదిపరుపు మీద పడుకుని ఉన్నాడు. ఉన్నట్టుండి, శరీరం లోతుల్లోంచీ, అరికాళ్ల దగ్గర్నించీ ఒక బరువు ఏదో తలలోకి పాకినట్టనిపించింది. తడుముకుంటే ఏవీ తెలియలేదు. కానీ ఆ భారానుభూతిని మోయటం ఇష్టంగానే ఉండింది.

ఒకరోజు – అతను అలా దంతపు దువ్వెనను చేబూని అద్దంలోకి వంగి… తన వయసును అంచనా వేసుకుంటూ… దువ్వుతుండగా ఏదో అడ్డంపడినట్టయింది. అప్పుడప్పుడే మొలుస్తున్న రెండు లేతకొమ్ములు! నొప్పి తెలియకుండా తలను ఎలా చీల్చాయో! అయితే అపశకునం. అదే రోజు అతడి కుడిదవడ పన్ను ఊడిపోయింది. కొన్నాళ్లకు రెండుకొమ్ములూ అందంగా వంపు తిరిగాయి. కొనలు మృదువుగా తెల్లగా ఉన్నాయి. ఆదివారం ఆదివారం వాటికి మంచినూనె రాస్తాడు. అప్పుడు మరింత నల్లగా నిగనిగలాడతాయి. వాటికి మువ్వలు చేయించాలని కూడా అనుకుంటాడు.

ఒక రోజు దుకాణానికని బయల్దేరాడు. అలవాటైనా వీధే అయినా, కిర్రుచెప్పులతో నడుస్తూంటే తగుల్తున్న చూపులు కొత్తగా ఉన్నాయి. ‘నువ్వున్నావు ఎందుకూ?’ అని ఎవరో వెనక భర్తను దెప్పిపొడుస్తున్నట్టుగా అనిపించింది. ‘సంసారం చేసినంత కష్టమా సంపాదించడం?’ అని భర్త బదులిస్తున్నట్టుగా అనిపించింది.

‘భర్త… భార్య… నా భార్య అవును నా భార్య ఎలా ఉందో! నిజంగా వాళ్లు అలా అన్నారా? నేను ఊహించుకున్నానా? నా భార్యను చూడక ఏడేండ్లు దాటుండదూ! ఎవరికోసం అన్నేళ్లు కలగన్నానో ఆమె హఠాజ్ఞాపకంగా మారిపోవడమేమిటి?’

అతడు భార్య నుండి చాలా దూరమే ప్రయాణించాడు. కానీ ఈ ప్రయాణమంతా దేనికీ? ఆశ్చర్యం! కలలు ఎక్కడ ఇగిరిపోయాయో కూడా తెలియనంతగా అతడు జీవితంలో కూరుకుపోయాడు. ‘నలుగురిలో నిలబడగలిగినవాణ్ణి భార్య ముందు తలెత్తుకోలేనా? అసలు ఏ నలుగురిని మెప్పించటానికి తానీ నగరానికి వచ్చినట్టు?’ తన తొలి యవ్వన కాలం నాటి ఏదో మూలకం అతని ఒంట్లోకి తిరిగి ప్రవేశించినట్లయింది. కాలు నిలవ లేదు.

కొమ్ములు పూర్తిగా కప్పేట్టుగా మంచి అంగరఖా కుట్టించాడు. ఒక్కసారిగా తీసి భార్యను ఆశ్చర్యపరుద్దామని. ఎప్పుడో మర్చిపోయిన తన ఊరి వైపు గుర్రపుబగ్గీ కట్టించాడు. విడిదికి కావాల్సిన ఏర్పాట్లతో మరో మూడు బగ్గీలు దాన్ని అనుసరించాయి.

* * *

అతణ్ని ఊరివాళ్లు కొందరు గుర్తుపట్టారు, కొందరు పోల్చుకోలేకపోయారు, కొందరు కౌగలించుకున్నారు, మరికొందరు కన్నీరు కార్చారు. వాళ్లమ్మ రంధితో మంచం పట్టి ఎప్పుడో చనిపోయింది. ఒక ఆడ ఒక మగనీ కలపలేని ఆ ఇల్లు పాడుబడిన ఇల్లుగా మిగిలిపోయింది. ఇంట్లో ఒకట్రెండుసార్లు దొంగలు కూడా పడ్డారని తెలిసింది, కానీ వాళ్లకేమీ దొరికినట్టు లేదు. ఎప్పుడైనా – ఆ ఇంట్లోంచి కొన్ని ఈకలు గాలికి కొట్టుకొస్తున్నాయనుకోవడం తప్ప, ఆ ఇంటితో ఎవరికీ నిమిత్తం లేకపోయింది.

“మరి నా భార్య?”

ఆమె కొన్నాళ్లు ఆ ఇంట్లో నివసించిందిగానీ, ఎటో ఊరు విడిచి వెళ్లిపోయింది.

ఈ ప్రపంచం మొత్తం మీద తనను ఎవరి దగ్గర ప్రవేశపెట్టుకుంటే తాను సాధించిన దానికి తగిన మదింపు చేయబడుతుందో… ఆ ఒకేఒక్క మనిషే ఆమె!

బగ్గీల్ని వెనక్కి పంపేశాడు. పిచ్చివాడిలా నడిచాడు; ఊరూవాడా గాలించాడు; కొండాకోనా తిరిగాడు; బట్టలు మాసిపోయాయి, జుట్టురేగిపోయింది. ఒకరిద్దరు పశులకాపర్లు ఒకరెక్కల మనిషిని చూశామని జాడలు చెప్పారు. వాటి ప్రకారం ఒక సన్న నీటిజాలున్న కొండ ప్రాంతంలో ఆమెను ఎట్టకేలకు దొరకించుకున్నాడు.

ఎన్ని రోజుల బంధమని! శరీరంలో కదిలిన ఏదో అవయవం వల్ల ఆమె అతణ్ని సులువుగానే గుర్తించింది. గుండెల్లోని ఊపిరి తన బరువును తగ్గించుకున్నాక, అతడు అడిగాడు. “ఎలా ఉండగలుగుతున్నావిక్కడ?”

అతడి అరచేతుల్లోని ఆత్మీయతను అనుభవిస్తూ చెప్పింది: “నాకు వ్యవహారాలున్నాయి గానీ, లక్ష్యాలు లేవు.”

ఆమె కళ్లల్లోని వెలుగుకు కన్నార్పలేకుండా, “నీకు రెక్కలున్నాయంటగా!” ఆరాధనగా పలికాడు.

ఆమె చిన్నగా నవ్వి, అడిగింది: “ఉంటేనేంలేగానీ… నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్లిపోయావు?”

“నా కొమ్ముల్ని చూస్తే నీకు సంతోషంగా లేదా?”

“వీటిని ఏం చేసుకోను?” కొమ్ముల్ని పట్టుకుని అతడి తలను అటూయిటూ ఆడించింది. “కానీ నేనిన్నేళ్లు ఆరాటపడింది తురాయి కోసమే…”

“అయ్యుండదు; లేదంటే అదే మొలిచేది!”

* * *

అతడు అదే ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేదు. వీటినేనా భార్యకు చూపిద్దామని గర్వపడుతూ వచ్చాడు! ఆమెను సమీపించడానికి సిగ్గేసింది. కానీ కొమ్ములు తొలగించుకునే ఆయుధాలు తన దగ్గర లేవే! ఏమిటీమె గొప్పతనం? చెప్పాపెట్టకుండా తిరిగివెళ్లిపోతే! అసలు దేని కోసం ఇన్నాళ్లూ బతికినట్టూ? తన భార్యకు భర్తగా ఉండటంలో తప్ప, ఇంకెందులోనూ ఉత్సాహం లేదనిపించింది. కానీ ఇన్నేళ్ల జీవితం మొత్తం ఒక నిరూపణ దగ్గర నిలిచిపోవాల్సి రావటం బాధించింది. అతడికి ఏడుపొచ్చింది.

rekkalapelllamతెల్లారిగట్ట ఎప్పుడో ఒక నిశ్చయానికొచ్చాక కళ్లు మూతలుపడ్డాయి. గాఢమైన నిద్ర! తను మర్చిపోయిన నిద్ర, ఇన్నేళ్ల అలసటా తీరి, శరీరం తేలికైంది.

ఉత్సాహంగా లేచాడు. శరీరం లోపల కూడా శుభ్రమయ్యేలా సెలయేటి నీటిలో స్నానం చేశాడు. అటుగా వచ్చిన కుందేటిని అందుకోవటానికి ప్రయత్నించాడు. నడుస్తూ దట్టమైన చెట్ల మధ్యకు ప్రవేశించాడు. గాఢంగా ఊపిరి పీల్చుకుని, ఒంట్లో శక్తిని నింపుకొని, రెండు చెట్లకు మధ్య తన కొమ్ముల్ని తట్టు పెట్టి, బలంగా, గట్టిగా, ఎక్కడాలేని తెగువతో ఒక్కసారిగా వాటిని విరిచేసుకున్నాడు. ‘ఆఆఆఆఆ… అయ్యో అయ్యో… నొప్పి… నొప్పి… దేవీ దేవీ… చచ్చిపోతు…’.

రక్తం ధారగా కారుతోంది; నీరసం ఆవహిస్తోంది; నొప్పి భరించలేక ఉరికిన కాళ్లు కూలబడుతున్నాయి. రక్తం చారికలు, అరుపుల ఆనవాళ్లతో అతణ్ని వెతుక్కుంటూ ఆమె పరిగెత్తుకు వచ్చింది. గట్టిగా గుండెలకు హత్తుకుంది.

కొమ్ముల కుదుళ్లకు కట్టుగట్టే ప్రయత్నాన్ని అతడు వారించాడు. తన మరణం తెలుస్తోంది. తుదిప్రాణాన్ని గాల్లోకి వదుల్తూండగా, చివరిచూపున చూశాడు… ఉన్నట్టుండి ఆమె రెక్కలు విప్పుకున్నాయి… ఇన్ని రోజులూ ఆ శరీరంలో అవి ఎలా ఇమిడి ఉన్నాయో… జీవితపు చిట్టచివరి పాఠాన్ని అర్థం చేసుకునే లోపే అతడి చూపు జారిపోయింది. మెడ వాలిపోయింది.

పొద్దుగూకుతుండగా –

పశువుల కాపర్ల సాయంతో అతణ్ని పూడ్చటానికి గోతిలో పెట్టబోతున్నప్పుడు, గమనించిందామె. అతడి తలలో బెత్తెడు పొడవుతో ఒక ఎర్రటి తురాయి!

ఆమె రెక్కల గురించి ఎవరూ పట్టించుకోలేదు గానీ, శవానికి తురాయి మొలవడం గురించి మాత్రం ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో చాలాకాలం పాటు చెప్పుకున్నారు.

*

Download PDF ePub MOBI

Posted in 2014, కథ, జూన్ and tagged , , , , , , .

9 Comments

  1. Beautiful story!

    “ప్రపంచం కొత్తగా బాగుపడేదీ లేదు, చెడిపోయేదీ లేదు. బాగుపడినా దాని నియమాల మేరకే, చెడిపోయినా దాని నియమాల మేరకే.” — ఈ వాక్యం బాగా నచ్చింది.

  2. మా నరేష్ గారు చదవమని చెప్పకపోయుంటే నిజంగా మిస్ అయ్యేదాన్ని ..ఈ కధ….అవును ఈ ఆడా మగ వెతుక్కోవతంతోనే బ్రతుకులు తెల్లారిపోతుంటాయి , చిఅందుబాటులో ఉన్న వాళ్ళతో సంతృప్తి లేకా , అందని వారికోసం , వాటికోసం తపిస్తూ పుణ్య కాలం పూర్తి చేసేసుకుంటున్నారన్న విషయాన్ని , భలే రాసారు రాజిరెడ్డి గారూ …:)

  3. “నిన్ను సరిగ్గా చూడందే! బుట్టవేషంలో ఉంటివిగా, వెనక మడిచి కట్టారేమో అనుకున్నా!”
    సార్ ” బుట్ట” అంటే (తొక్క విప్పని )
    మొక్కజొన్న పొత్తని అర్థమా?

  4. దీని తస్సాదీయా… ఈ పెళ్లిలో ఉన్న లోపమేమిటో గానీ, ఆలూమగలనే ఆడ- మగల్లో ఒకరినుంచి మరొకరికి కావాల్సినవి ఎప్పటికీ దొరకవు; ఉన్నా కలిసున్నంత వరకీ కనిపించవు. పక్కింటామెలో, పొరుగింటివాడిలో వెదక్కుండానే అన్నీ విప్పారి కనిపించే ఈ చోద్యాన్ని ఇంత subtleగా, ఇంత అద్బుతంగా చెప్పిన కథలు నా ఎరుకలో తక్కువ. Thank u Raji..